సరిగ్గా ఆలోచించండి జ్ఞానయుక్తంగా ప్రవర్తించండి
సరిగ్గా ఆలోచించండి జ్ఞానయుక్తంగా ప్రవర్తించండి
ఈ దృశ్యాన్ని ఊహించుకోండి: యెరూషలేములో ఉన్న మతసంబంధమైన శత్రువులు తనకు గొప్ప వేదన కలిగించి తనను చంపుతారని యేసుక్రీస్తు వివరిస్తున్నాడు. ఆయన సన్నిహిత స్నేహితుడైన అపొస్తలుడైన పేతురు దాన్ని నమ్మలేకపోతాడు. ఆయన యేసును ప్రక్కకు తీసుకువెళ్ళి ఆయనను గద్దిస్తాడు. పేతురుకు నిజాయితీ, నిజమైన శ్రద్ధా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ పేతురు ఆలోచనా విధానాన్ని యేసు ఎలా పరిగణించాడు? “సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నా[వు]” అని యేసు అన్నాడు.—మత్తయి 16:21-23.
పేతురుకు అదెంత దిగ్భ్రమ కలిగించి ఉండవచ్చో కదా! సహాయకారిగా ఉండే బదులు ఈ సందర్భంలో ఆయన తన ప్రియమైన ప్రభువుకు ‘అభ్యంతర కారణంగా’ ఉన్నాడు. అదెలా జరిగింది? పేతురు మానవ ఆలోచనా విధానంలోని సాధారణ లోపానికి బలైవుండవచ్చు, అది తాను నమ్మాలనుకున్నదే నమ్మడం.
అతి నమ్మకం కలిగివుండకండి
సరిగ్గా ఆలోచించడమనే మన సామర్థ్యానికి ముప్పు అతినమ్మకం కలిగివుండే స్వభావం. ప్రాచీన కొరింథులోని తోటి క్రైస్తవులను అపొస్తలుడైన పౌలు ఇలా హెచ్చరించాడు: “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.” (1 కొరింథీయులు 10:12) పౌలు ఎందుకలా చెప్పాడు? ఎందుకంటే మానవ ఆలోచనలు తప్పుదారి పట్టడం, చివరికి క్రైస్తవుల మనస్సులు సహితం ‘క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రతనుండియు తొలగిపోవడం’ ఎంత సులభమో ఆయనకు తెలుసని స్పష్టమవుతోంది.—2 కొరింథీయులు 11:3.
పౌలు పూర్వీకుల్లో మొత్తం ఒక తరానికే అలా జరిగింది. ఆ సమయంలో, యెహోవా వారికిలా చెప్పాడు: “నా తలంపులు మీ తలంపులవంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలవంటివి కావు.” (యెషయా 55:8) వారు “తమ యెన్నికలో తాము బుద్ధిమంతులని” తలంచారు, దానితో నాశనకరమైన ఫలితాలు వచ్చాయి. (యెషయా 5:21) కాబట్టి, మనం మన ఆలోచనను సరిగ్గా ఉంచుకుని తద్వారా అలాంటి నాశనాన్ని ఎలా తప్పించుకోవచ్చో పరిశీలించుకోవడం నిజంగా జ్ఞానయుక్తమైన పని.
శారీరక ఆలోచనా విధానం గురించి జాగ్రత్త
కొరింథులోని కొందరు శారీరకమైన ఆలోచనా విధానానికి బాగా ప్రభావితులయ్యారు. (1 కొరింథీయులు 3:1-3) వాళ్ళు దేవుని వాక్యానికంటే మానవ తత్వాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. ఆ కాలం నాటి గ్రీకు ఆలోచనాపరులు చాలా తెలివైనవారనడంలో సందేహం లేదు. కానీ దేవుని దృష్టిలో వారు వెఱ్ఱివారే. పౌలు ఇలా అన్నాడు: “ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది. జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?” (1 కొరింథీయులు 1:19, 20) అలాంటి మేధావులు దేవుని ఆత్మద్వారా కాక “లౌకికాత్మ” ద్వారా నిర్దేశించబడ్డారు. (1 కొరింథీయులు 2:12) వారి తత్వాలు, తలంపులు యెహోవా ఆలోచనలతో ఎంతమాత్రం పొందిక కలిగిలేవు.
అలాంటి శారీరక ఆలోచనా విధానానికి ప్రధాన సూత్రధారి సాతానే, అతడు హవ్వను మోసగించడానికి సర్పాన్ని ఉపయోగించాడు. (ఆదికాండము 3:1-6; 2 కొరింథీయులు 11:3) అతడు ఇప్పటికీ మనకు ప్రమాదకారిగానే ఉన్నాడా? అవును ఉన్నాడు! దేవుని వాక్యం ప్రకారం, సాతాను ప్రజల “మనో నేత్రములకు” ఎంతమేరకు ‘గ్రుడ్డితనము కలుగజేశాడంటే’ అతడిప్పుడు “సర్వలోకమును మోస పుచ్చు [తున్నాడు].” (2 కొరింథీయులు 4:4; ప్రకటన 12:9) అతడి తంత్రముల గురించి అప్రమత్తంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా!—2 కొరింథీయులు 2:11.
“మనుష్యుల మాయోపాయముల” విషయమై జాగ్రత్త
అపొస్తలుడైన పౌలు “మనుష్యుల మాయోపాయముల” గురించి కూడా హెచ్చరించాడు. (ఎఫెసీయులు 4:14) సత్యాన్ని అందజేస్తున్నట్లు నటిస్తూ వాస్తవానికి దాన్ని వక్రీకరిస్తున్న “మోసగాండ్రగు పని వా[రిని]” ఆయన ఎదుర్కొన్నాడు. (2 కొరింథీయులు 11:12-15) తమ ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి అలాంటి వారు తమ ఆలోచనా విధానాన్ని మాత్రమే సమర్థించే సాక్ష్యాధారాన్ని, భావావేశాల్ని రెచ్చగొట్టే భాషను, తప్పుదారి పట్టించే అర్థ సత్యాలను, మోసకరమైన అన్యాపదేశాలను, చివరికి పచ్చి అబద్ధాలను ప్రయోగిస్తారు.
మత ప్రచారకులు ఇతరులను గాయపరచడానికి తరచూ “మతతెగ” అనే పదాన్ని ఉపయోగిస్తారు. యూరప్‌లోని మతవిషయ సమాలోచక సమితి యొక్క పార్లమెంటరీ అసెంబ్లీకి చేసిన ఒక సిఫారసులో, క్రొత్త మత గుంపులను విచారణ చేసే అధికారులకు “ఈ పదాన్ని ఉపయోగించడం మానుకోమని ఉపదేశిస్తే మంచిది” అని ఒక సూచన చేయబడింది. ఎందుకు? “మతతెగ” అనే పదానికి చాలా ప్రతికూల భావం ఉందని భావించడం జరిగింది. అదే విధంగా, గ్రీకు మేధావులు అపొస్తలుడైన పౌలు “వదరుబోతు” లేదా అక్షరార్థంగా “విత్తనాలు ఏరుకునేవాడు” అని తప్పుగా ఆరోపించారు. ఆయన కేవలం ఊరికే వదరేవాడని అంటే జ్ఞానపు తునకలను ఏర్చికూర్చి వాటినే పదే పదే ఉపయోగించేవాడని సూచించడానికి వారా పదాన్ని వాడారు. వాస్తవానికి పౌలు “యేసునుగూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించెను.”—అపొస్తలుల కార్యములు 17:18.
మత ప్రచారకుల పద్ధతులు పనిచేస్తాయా? అవును పనిచేస్తాయి. ఇతర దేశాల గురించి లేదా మతాల గురించి ప్రజల ఆలోచనలను తప్పుదారి పట్టించడం ద్వారా జాతి మత విద్వేషాలను రేకెత్తించడంలో వారు ప్రముఖ పాత్ర వహించారు. అంతగా ప్రజామద్దతు లేని అల్పసంఖ్యాకులను సమాజంలో అప్రాముఖ్యమైన స్థానంలోకి నెట్టివేయడానికి చాలామంది వాటిని ఉపయోగించారు. అడాల్ఫ్ హిట్లర్ యూదులను ఇతర అల్పసంఖ్యాకులను “న్యూనజాతివారు,” “దుష్టులు” దేశానికి “ముప్పు” అని చిత్రిస్తూ అలాంటి పద్ధతులను సమర్థంగా ఉపయోగించాడు. ఇలాంటి మోసం మీ ఆలోచనా విధానాన్ని కలుషితం చేయడానికి ఎన్నడూ అనుమతించకండి.—అపొస్తలుల కార్యములు 28:19-22.
మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి
మనల్ని మనం మోసం చేసుకోవడం సులభమే. వాస్తవానికి, ఎంతో ప్రియమైనవిగా ఎంచే అభిప్రాయాలను వదులుకోవడం లేదా చివరికి వాటిని ప్రశ్నించడం ఎంతో కష్టమే. ఎందుకు? ఎందుకంటే మనం మన తలంపులతో మానసిక అనుబంధం ఏర్పరచుకుంటాము. అప్పుడు మనం తప్పుడు తర్కంతో, నిజానికి పొరపాటైన, తప్పుదారి పట్టించే నమ్మకాలను సమర్థించుకోవడానికి కారణాలను సృష్టించుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటాము.
మొదటి శతాబ్దపు క్రైస్తవులకు కొంతమందికి అలాగే జరిగింది. వాళ్ళకు దేవుని వాక్యం తెలుసు, కానీ అది తమ ఆలోచనను నిర్దేశించడానికి వారు అనుమతించలేదు. వారు ‘తమను తాము మోసపుచ్చుకున్నారు.’ (యాకోబు 1:22, 26) ఇలాంటి స్వీయ మోసానికి మనం బలయ్యామనడానికి ఒక సూచన ఏమిటంటే, ఎవరైనా మన నమ్మకాలను సవాలు చేస్తే మనకు కోపం రావడమే. కోపం తెచ్చుకునే బదులు, మన అభిప్రాయమే సరైనదని మనం ఖచ్చితంగా భావిస్తున్నప్పటికీ మనసు విశాలపరచుకుని ఇతరులు చెప్పాలనుకుంటున్నది జాగ్రత్తగా వినడం జ్ఞానయుక్తమైనది.—సామెతలు 18:17.
“దేవుని గూర్చిన విజ్ఞానము” కోసం అన్వేషించండి
మన ఆలోచనను సరిగ్గా ఉంచుకోవడానికి మనమేమి చేయవచ్చు? మనకు ఎంతో సహాయం అందుబాటులో ఉంది, అయితే మనం దానికోసం పని చేయడానికి సుముఖంగా ఉండాలి. జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా అన్నాడు: సామెతలు 2:1-5) అవును, దేవుని వాక్య సత్యాలతో మన మనస్సును, హృదయాన్ని నింపుకోవడానికి మనం వ్యక్తిగతంగా కృషి చేస్తే, మనం నిజమైన జ్ఞానాన్ని, అంతర్దృష్టిని, వివేచనను పొందుతాము. అలా చేస్తే, మనం వెండికంటే లేదా వస్తుపరమైన ఏ ఇతర సంపదకంటే ఎంతో విలువైనవాటి కోసం అన్వేషించిన వారమౌతాం.—సామెతలు 3:13-15.
“నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును.” (సరిగ్గా ఆలోచించడానికి జ్ఞానవివేచనలు ఎంతో ఆవశ్యకం. “జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయును. అది దుష్టుల మార్గమునుండియు మూర్ఖముగా మాటలాడువారి చేతిలోనుండియు నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు.”—సామెతలు 2:10-13.
ప్రత్యేకంగా, ఒత్తిడి లేదా ప్రమాదభరిత సమయాల్లో దేవుని తలంపులు మన ఆలోచనను నిర్దేశించడానికి అనుమతించడం ప్రాముఖ్యం. కోపం, భయం వంటి బలమైన భావావేశాలు సరిగ్గా ఆలోచించడం కష్టమయ్యేలా చేయగలవు. సొలొమోను ఇలా అంటున్నాడు: “అన్యాయము చేయుటవలన జ్ఞానులు తమ బుద్ధిని కోలుపోవుదురు.” (ప్రసంగి 7:7) ‘యెహోవామీద కోపించడం’ కూడా జరుగవచ్చు. (సామెతలు 19:3) ఎలా? మన సమస్యలకు దేవుడ్ని నిందించడం ద్వారా, ఆయన కట్టడలకు సూత్రాలకు పొందికలేని పనులు చేయడానికి వాటిని సాకుగా చూపించడం ద్వారా మనమలా చేస్తాము. మనం ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటామని అనుకునే బదులు, లేఖనాలను ఉపయోగిస్తూ మనకు సహాయం చేయడానికి ప్రయత్నించే జ్ఞానులైన ఉపదేశకులు చెప్పేదాన్ని వినయంగా విందాము. అంతేగాక అవసరమైతే, మనం ఎంతో బలంగా హత్తుకుని ఉండే తలంపులు సరైనవి కావని స్పష్టమయితే వాటిని వదిలివేయడానికి కూడా సిద్ధంగా ఉందాము.—సామెతలు 1:1-5; 15:22.
ఎడతెగక “దేవుని అడుగవలెను”
మనం కలవరపరిచే, ప్రమాదకరమైన కాలాల్లో జీవిస్తున్నాము. మనం సరైన నిర్ణయాలు తీసుకుంటూ జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలంటే యెహోవా నడిపింపు కోసం క్రమంగా ప్రార్థించడం ఆవశ్యకం. పౌలు ఇలా వ్రాస్తున్నాడు: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలిప్పీయులు 4:6, 7) కలవరపరిచే సమస్యలను లేదా శ్రమలను ఎదుర్కోవడానికి కావలసిన జ్ఞానం మనకు కొరవడితే, మనం “దేవుని అడుగవలెను, . . . ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.”—యాకోబు 1:5-8.
తోటి క్రైస్తవులు జ్ఞానాన్ని ఉపయోగించవలసిన అవసరం ఉందని గుర్తించిన అపొస్తలుడైన పేతురు ‘వారి నిర్మలమైన మనస్సులను రేపడానికి’ ప్రయత్నించాడు. ‘పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు’ అయిన యేసుక్రీస్తు ‘అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను వారు జ్ఞాపకముచేసుకోవాలని’ ఆయన కోరుకున్నాడు. (2 పేతురు 3:1, 2) మనమిలా చేస్తూ మన మనస్సును యెహోవా వాక్యానికి అనుగుణంగా ఉంచుకుంటే, మనం సరిగ్గా ఆలోచిస్తాము, జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తాము.
[21వ పేజీలోని చిత్రం]
తొలి క్రైస్తవులు తత్వసంబంధమైన తర్కాలు కాదు గానీ దైవిక జ్ఞానం తమ ఆలోచనను రూపించడానికి అనుమతించారు
[చిత్రసౌజన్యం]
తత్వవేత్తలు ఎడమ నుండి కుడికి: ఎపిక్యురస్: Photograph taken by courtesy of the British Museum; సిసెరో: Reproduced from The Lives of the Twelve Caesars; ప్లేటో: Roma, Musei Capitolini
[23వ పేజీలోని చిత్రం]
ప్రార్థన, దేవుని వాక్య అధ్యయనం ఆవశ్యకం