కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఔచిత్యంతో మెలిగే కళను నేర్చుకోవడం

ఔచిత్యంతో మెలిగే కళను నేర్చుకోవడం

ఔచిత్యంతో మెలిగే కళను నేర్చుకోవడం

పెగ్గీ తన పెద్దబ్బాయి చిన్నబ్బాయితో చాలా కఠినంగా మాట్లాడడం గమనించింది. “తమ్ముడితో మాట్లాడే పద్ధతి అదేనా?” అని ఆమె అడిగింది. “వాడెలా బాధపడుతున్నాడో చూడు!” ఆమె ఎందుకలా అన్నది? ఆమె తన కొడుక్కి ఔచిత్యంతో మెలిగే కళను, ఇతరుల భావాలను గమనించే కళను నేర్పించాలని ప్రయత్నిస్తోంది.

అపొస్తలుడైన పౌలు తనకంటే చిన్నవాడైన తిమోతిని “అందరి యెడల సాధువుగా [లేదా “ఔచిత్యంతో,”]” మెలగాలని ప్రోత్సహించాడు. అలా మెలగడం ద్వారా తిమోతి ఇతరుల భావాలను అణగద్రొక్కకుండా ఉంటాడు. (2 తిమోతి 2:​26) ఔచిత్యమంటే ఏమిటి? దాని విషయంలో మీరెలా మెరుగుపడవచ్చు? ఇతరులు ఆ కళను వృద్ధి చేసుకునేందుకు మీరెలా సహాయపడవచ్చు?

ఔచిత్యమంటే ఏమిటి?

ఔచిత్యమంటే ఒక పరిస్థితి యొక్క సున్నితత్వాన్ని గ్రహించి ఎంతో దయగా లేదా అత్యంత సముచితమైన రీతిలో మాట్లాడగల లేదా ప్రవర్తించగల సామర్థ్యం. ఔచిత్యంతో మెలిగే వ్యక్తి ఇతరుల భావాలను గ్రహించగలుగుతాడు, తన మాటలు గానీ చర్యలు గానీ వారినెలా ప్రభావితం చేస్తాయో వివేచించగలుగుతాడు. కానీ అలా మెలగడమనేది కేవలం ఒక సామర్థ్యమే కాదు; అలా మెలగడంలో ఇతరులను నొప్పించకూడదనే యథార్థమైన కోరిక ఉంది.

బైబిలులోని ఎలీషా సేవకుడు గేహజీ వృత్తాంతంలో ఔచిత్యం లోపించిన ఒక వ్యక్తి ఉదాహరణ మనకు కనబడుతుంది. ఒక షూనేమీయురాలు, కొద్దిసేపటి కిందటే తన కుమారుడు తన ఒడిలోనే మరణించడంతో సాంత్వన కోసం ఎలీషా వద్దకు వస్తుంది. అంతా సుఖముగా ఉన్నారా అని అడిగినప్పుడు, “సుఖముగా ఉన్నా[ము]” అని ఆమె సమాధానమిస్తుంది. కానీ ఆమె ప్రవక్తను సమీపిస్తున్నప్పుడు “గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు” వస్తాడు. అప్పుడు ఎలీషా “ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, . . . ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ” ఇస్తాడు.​—⁠2 రాజులు 4:​17-20, 25-27.

గేహజీ అంత దుడుకుగా, అనుచితంగా ఎలా ప్రవర్తించగలిగాడు? అతడు ఆ స్త్రీని ప్రశ్నించినప్పుడు ఆమె తన భావాలను వ్యక్తం చేయలేదన్న మాట నిజమే. కానీ చాలామంది తమ భావాలను ఎవరికి పడితే వారికి వ్యక్తం చేయరు. అయినా ఆమె భావోద్వేగాలు ఏదో ఒక విధంగా వ్యక్తమై ఉండాలి. అది ఎలీషా గుర్తించాడు, కానీ గేహజీ గుర్తించలేదు లేదా పట్టించుకోలేదు. అనుచిత ప్రవర్తనకు ఒక సాధారణమైన కారణాన్ని ఇది చక్కగా తెలియజేస్తోంది. ఒక వ్యక్తి తన పని ప్రాముఖ్యత గురించి అధికంగా చింతించినప్పుడు, అతను తాను వ్యవహరిస్తున్న వారి అవసరాలను గుర్తించడంలో లేక వాటి గురించి శ్రద్ధ తీసుకోవడంలో సులభంగా విఫలుడు కావచ్చు. ఒక సామెత చెప్పినట్లు అతడు, సమయానికి చేరుకోవాలనే తొందరపాటులో ప్రయాణీకులను ఎక్కించుకోకుండానే గమ్యం చేరుకున్న బస్సు డ్రైవరులా ఉంటాడు.

గేహజీలా అనుచితంగా ప్రవర్తించకుండా ఉండాలంటే, మనం ప్రజల పట్ల ప్రేమగా ఉండేందుకు కృషి చేయాలి, ఎందుకంటే వారు నిజంగా ఎలా భావిస్తున్నారో మనకు తెలియదు. ఒక వ్యక్తి భావాలను వ్యక్తం చేసే సంకేతాలను గుర్తించి ప్రేమపూర్వకమైన మాటతో లేక చర్యతో ప్రతిస్పందించేందుకు మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంలో మీరు మీ సామర్థ్యాలను ఎలా మెరుగుపరచుకోవచ్చు?

ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం

ప్రజల భావాలను గ్రహించడంలో, వారితో ప్రేమపూర్వకంగా ఎంత చక్కగా ప్రవర్తించాలో వివేచించడంలో యేసు అగ్రగణ్యుడు. ఒకసారి ఆయన పరిసయ్యుడైన సీమోను ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు, “ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన” ఒక స్త్రీ ఆయనను సమీపిస్తుంది. ఈమె కూడా తన భావాలను మాటల్లో వ్యక్తం చేయలేదు గానీ చర్యల ద్వారా చూపించింది. ఆమె “యొక బుడ్డిలో అత్తరు తీసికొనివచ్చి వెనుకతట్టు ఆయన [యేసు] పాదములయొద్ద నిలువబడి, యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెండ్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దు పెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను.” ఆ చర్యల భావమేమిటో యేసు గుర్తిస్తాడు. సీమోను పైకి ఏమీ అననప్పటికీ, అతడు మనసులో “ఈయన ప్రవక్తయైన యెడల తన్ను ముట్టుకొనిన యీ స్త్రీ ఎవతెయో ఎటువంటిదో యెరిగియుండును; ఇది పాపాత్మురాలు” అని అనుకుంటున్నాడని యేసు గ్రహించగలిగాడు.​—⁠లూకా 7:​37-39.

యేసు ఒకవేళ ఆ స్త్రీని దూరంగా తోసివేసినా, “మూర్ఖుడా! ఆమె పశ్చాత్తాపపడుతోందని నీకు కనబడ్డం లేదా?” అని సీమోనుతో అన్నా జరిగివుండగల హానిని మీరు ఊహించగలరా? బదులుగా యేసు ఔచిత్యంతో, ఒక వ్యక్తి పెద్ద మొత్తంలో అప్పున్న రుణస్థుడ్ని, అతి తక్కువ మొత్తంలో అప్పున్న రుణస్థుడ్ని క్షమించిన ఉపమానాన్ని సీమోనుకు చెప్పి, “వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పు” అని అడుగుతాడు. ఆ విధంగా యేసు సీమోనును ఖండిస్తున్నట్లుగా కనిపించే బదులు, సరైన జవాబు ఇచ్చినందుకు ఆయనను ప్రశంసించగలిగాడు. అటుపిమ్మట ఆయన ఆ స్త్రీ నిజమైన భావాలకు సంకేతాలను, పశ్చాత్తాపపు వ్యక్తీకరణలను గుర్తించేందుకు సీమోనుకు ప్రేమపూర్వకంగా సహాయం చేస్తాడు. యేసు ఆ స్త్రీవైపు తిరిగి తను ఆమె భావాలను అర్థం చేసుకున్నానని ప్రేమపూర్వకంగా సూచిస్తాడు. ఆమె పాపాలు క్షమించబడ్డాయని ఆమెతో చెప్పిన తర్వాత ఇలా అంటాడు: “నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లు[ము].” ఔచిత్యంతో కూడిన ఆ మాటలు, మంచినే చేయాలని నిర్ణయించుకునేందుకు ఆమెను ఎంతగా బలపరిచి ఉండవచ్చో కదా! (లూకా 7:​40-50) ఔచిత్యంతో మెలగడంలో యేసు సఫలుడయ్యాడు, ఎందుకంటే ఆయన ప్రజలెలా భావిస్తున్నారో గమనించి తదనుగుణంగా సానుభూతితో ప్రతిస్పందించాడు.

యేసు సీమోనుకు సహాయపడ్డట్టే మనం కూడా భావోద్వేగాల భాషను నేర్చుకొని, ఇతరులు దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడవచ్చు. అనుభవజ్ఞులైన పరిచారకులు కొన్నిసార్లు ఈ కళను ఇటీవలనే క్రైస్తవ పరిచర్య ప్రారంభించినవారికి నేర్పించవచ్చు. వారితో కలిసి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక సందర్శనం జరిగిన తర్వాత, వారు కలుసుకున్నవారి భావాలను సూచించే సంకేతాలను సమీక్షించవచ్చు. ఆ వ్యక్తి బిడియస్తుడా, సందేహిస్తున్నాడా, చిరాకుపడుతున్నాడా, బిజీగా ఉన్నాడా? ఆ వ్యక్తికి సహాయం చేయడానికి ప్రేమపూర్వకమైన మార్గమేది? ఔచిత్యం లేకుండా ఒకరినొకరు నొప్పించుకున్నటువంటి సహోదర సహోదరీలకు కూడా పెద్దలు తోడ్పడవచ్చు. ఇతరుల భావాలను అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికీ సహాయపడండి. ఆయన అవమానించబడినట్లు, నిర్లక్ష్యం చేయబడినట్లు, అపార్థం చేసుకోబడినట్లు భావిస్తున్నాడా? ప్రేమ ఆయన మంచిగా భావించేలా ఎలా చేయగలదు?

ఔచిత్యంతో మెలిగేందుకు సానుభూతే పురికొల్పుతుంది కాబట్టి, తల్లిదండ్రులు తమ పిల్లలు సానుభూతిని వృద్ధి చేసుకునేందుకు సహాయపడాలి. ఆరంభంలో ప్రస్తావించిన పెగ్గీ కుమారుడు, తన తమ్ముని ముఖం చిన్నబోవడం, పెదవులు అదరడం, కళ్ళల్లో నీళ్ళు తిరగడం గమనించాడు, తన తమ్ముడు అనుభవిస్తున్న బాధను అతడు గుర్తించాడు. వాళ్ళమ్మ ఆశించినట్లే, వాడు పశ్చాత్తాపపడి, మారాలని నిశ్చయించుకున్నాడు. పెగ్గీ కుమారులిద్దరూ చిన్నతనంలో నేర్చుకున్న ఆ కళను సద్వినియోగం చేసుకున్నారు, సంవత్సరాల తర్వాత వారు ఫలవంతమైన శిష్యులను చేసేవారిగా, క్రైస్తవ సంఘంలో కాపరులుగా అయ్యారు.

మీరు అర్థం చేసుకున్నారని తెలియజేయండి

ప్రత్యేకించి మీకు ఎవరి మీదనైనా ఫిర్యాదు ఉన్నప్పుడు ఔచిత్యం చాలా ముఖ్యం. మీరతని గౌరవాన్ని చాలా సులభంగా భంగపరిచే అవకాశం ఉంది. మొదట నిర్దిష్టంగా ప్రశంసించడం ఎల్లప్పుడూ మంచిది. ఆయనను విమర్శించే బదులు సమస్య మీద శ్రద్ధ నిలపండి. ఆయన చర్య మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరించి, మీరు ఖచ్చితంగా దేనిలో మార్పు చూడాలనుకుంటున్నారో చెప్పండి. ఆ తర్వాత వినడానికి సిద్ధపడండి. బహుశా మీరే ఆయనను అపార్థం చేసుకున్నారేమో.

ప్రజలు తమ ఉద్దేశంతో మీరు అంగీకరించనప్పటికీ కనీసం తమ ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. యేసు మార్త చింతను తాను అర్థం చేసుకున్నానని చూపిస్తూ ఔచిత్యంతో మాట్లాడాడు. ఆయన “మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు” అని అన్నాడు. (లూకా 10:​41) అదే విధంగా ఒక వ్యక్తి ఏదైనా సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆయన చెప్పేది పూర్తిగా వినకముందే పరిష్కారం చూపించే బదులు, మీరు విషయం అర్థం చేసుకున్నారని చూపించేందుకు ఆ సమస్యను లేక ఫిర్యాదును మీ సొంతమాటల్లో మళ్ళీ చెప్పడమే సమంజసమైన పద్ధతి. ఇది మీరు అర్థం చేసుకున్నారని చూపించే ప్రేమపూర్వకమైన పద్ధతి.

ఏమి అనకూడదో గుర్తించండి

ఎస్తేరు రాణి, యూదులను నాశనముచేయాలని హామాను పన్నిన కుట్ర పారకుండా రద్దుచేయమని తన భర్తను అడగాలనుకున్నప్పుడు, ఆమె తన భర్త మంచి మనఃస్థితిలో ఉండే విధంగా ఔచిత్యంతో ఏర్పాట్లు చేసింది. ఆ తర్వాతే ఆమె ఆ సున్నితమైన విషయాన్ని ప్రస్తావనకు తెచ్చింది. అయితే ఆమె ఏమి అనలేదో గమనించడం ద్వారా మనం కొంత నేర్చుకోవచ్చు. ఆమె ఔచిత్యంతో, ఆ కుట్రలో తన భర్త పాత్ర కూడా ఉందనే విషయాన్ని ప్రస్తావనకు తీసుకురాలేదు.​—⁠ఎస్తేరు 5:​1-8; 7:​1, 2; 8:⁠5.

అదేమాదిరి ఒక క్రైస్తవ సహోదరి అవిశ్వాసి భర్తను సందర్శిస్తున్నప్పుడు, ఆయనకు వెంటనే బైబిలు చూపించే బదులు ఆయనకు ఆసక్తికరమైన విషయాల గురించి నేర్పుగా విచారిస్తూ ఎందుకు ప్రారంభించకూడదు? సరైన దుస్తులు ధరించకుండా ఒక అపరిచితుడు రాజ్యమందిరానికి వచ్చినా లేక చాలా కాలం తర్వాత ఎవరైనా తిరిగివచ్చినా అతని దుస్తుల గురించి గానీ గైర్హాజరు గురించి గానీ వ్యాఖ్యానించే బదులు అతడ్ని ఆప్యాయంగా ఆహ్వానించండి. ఆసక్తి కనబరుస్తున్న ఒక కొత్త వ్యక్తికి తప్పుడు అభిప్రాయముందని మీరు గమనించినప్పుడు, ఆయనను అప్పటికప్పుడు సరిదిద్దకుండా ఉంటే మంచిది. (యోహాను 16:​12) ఏమి అనకూడదో దాన్ని ప్రేమపూర్వకంగా గుర్తించడం కూడా ఔచిత్యంలో భాగమే.

స్వస్థపరిచే మాటలు

ఔచిత్యంతో మాట్లాడడాన్ని నేర్చుకోవడం, మీ ఉద్దేశాలను ఎవరైనా అపార్థం చేసుకొని చాలా కోపంతో బాధతో ఉన్నప్పటికీ, మీరు ఇతరులతో సంతోషకరమైన సంబంధాలను అనుభవించేందుకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో “కఠినముగా కలహించి”నప్పుడు ఆయన ఔచిత్యంతో ఇచ్చిన సమాధానంలో జరిగిన విషయం గురించిన స్పష్టమైన వివరణ ఉంది, వారు సాధించిన దానికి మనఃపూర్వక అభినందన ఉంది. వారెందుకు కోపంతో ఉన్నారో ఆయన గుర్తించాడు కాబట్టి అది ఔచిత్యంతో మెలగడమే, మర్యాదకరమైన ఆయన ప్రవర్తన వారి కోపాన్ని తగ్గించింది.​—⁠న్యాయాధిపతులు 8:​1-3; సామెతలు 16:​24.

మీ మాటలు ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయో పరిశీలించుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి. ఔచిత్యంతో మెలిగేందుకు కృషి చేయడం, సామెతలు 15:23లో, “సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట యెంత మనోహరము!” అని వర్ణించబడిన ఆ ఆనందాన్ని అనుభవించేందుకు మీకు సహాయం చేస్తుంది.

[31వ పేజీలోని చిత్రం]

తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇతరులపట్ల పరానుభూతి చూపించడాన్ని నేర్పించవచ్చు

[31వ పేజీలోని చిత్రం]

అనుభవజ్ఞులైన క్రైస్తవ పరిచారకులు కొత్తవారికి ఔచిత్యంతో మెలగడాన్ని నేర్పించవచ్చు