కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

యెహోవా తన ప్రాచీన సేవకులైన ఇశ్రాయేలీయుల మధ్య బహుభార్యత్వాన్ని అనుమతించాడు కానీ ఇప్పుడు దానిని అనుమతించడం లేదు. అంటే ఆయన ప్రమాణం కాలాన్నిబట్టి మారే వీలుందా?

బహుభార్యత్వం విషయంలో యెహోవా తన దృక్కోణం మార్చుకోలేదు. (కీర్తన 19:7; మలాకీ 3:⁠6) ఆరంభంనుండే అది ఆయన ఏర్పాటులో భాగంకాదు, ఇప్పుడూ కాదు. యెహోవా ఆదాముకు భార్యగా హవ్వను సృష్టించినప్పుడు, ఒక భర్తకు ఒక భార్య ఉండడమే దైవిక ప్రమాణమని చెప్పాడు. “కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.”​—⁠ఆదికాండము 2:24.

యేసుక్రీస్తు భూమిపై జీవించిన కాలంలో విడాకులు, పునర్వివాహం గురించి అడిగిన వారికి జవాబిస్తూ ఆయన ఈ ప్రమాణాన్ని పునరుద్ఘాటించాడు. ఆయనిలా అన్నాడు: “సృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు —ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు.” యేసు ఇంకా ఇలా అన్నాడు: “వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నా[డు].” (మత్తయి 19:​4-6, 9) దీన్నిబట్టి, అదనంగా ఒకరు లేదా ఇద్దరు భార్యలు ఉంటే అదీ వ్యభిచారమేనని స్పష్టమౌతోంది.

అలాంటప్పుడు ప్రాచీనకాలంలో బహుభార్యత్వం ఎందుకు అనుమతించబడింది? యెహోవా దీనిని ఆరంభించలేదని మనస్సులో ఉంచుకోండి. ఒకరికంటే ఎక్కువమంది భార్యలున్నట్లు బైబిలులో పేర్కొనబడిన మొదటివ్యక్తి కయీను సంతతివాడైన లెమెకు. (ఆదికాండము 4:​19-24) నోవహు కాలంలో యెహోవా జలప్రళయం తెచ్చినప్పుడు, నోవహుకు ఆయన ముగ్గురు కుమారులకు ఒక్కొక్క భార్యేవుంది. జలప్రళయంలో బహుభార్యలున్న వారందరు నాశనమయ్యారు.

శతాబ్దాల తర్వాత యెహోవా ఇశ్రాయేలీయులను తన ప్రజలుగా ఎంచుకున్నప్పుడు, కేవలం ఒకే భార్య కలిగియుండడం నిజానికి జనసామాన్యమై ఉన్నా వారిలో అప్పటికే బహుభార్యలు గలవారున్నారు. ఒకరికంటే ఎక్కువ భార్యలున్న కుటుంబాలు విడిపోవాలని దేవుడు కోరలేదు. బదులుగా, ఆయన ఆ వాడుకను కఠినంగా నియంత్రించాడు.​—⁠నిర్గమకాండము 21:10, 11; ద్వితీయోపదేశకాండము 21:15-17.

అయినా, ఈ బహుభార్యత్వం కేవలం తాత్కాలికంగానే సహించబడిందని వివాహం విషయంలో యెహోవా ఆది ప్రమాణాన్ని గురించి యేసు చెప్పినదానినుండే గాక దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణక్రింద అపొస్తలుడైన పౌలు వ్రాసిన దానినుండి కూడా చూడవచ్చు. ఆయనిలా చెప్పాడు: “ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను.” (1 కొరింథీయులు 7:⁠2) క్రైస్తవ సంఘంలో అధ్యక్షునిగా లేదా పరిచర్య సేవకునిగా నియమించబడే ఏ పురుషుడైనా తప్పక “ఏకపత్నీ పురుషు[డై]” ఉండాలని వ్రాయడానికి కూడా పౌలు దైవప్రేరేపణను పొందాడు.​—⁠1 తిమోతి 3:2, 12; తీతు 1:⁠6.

ఆ విధంగా, బహుభార్యత్వాన్ని యెహోవా సహించి ఊరుకోవడం దాదాపు 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవ సంఘ ఆవిర్భావంతో ముగింపుకొచ్చింది. ఆ సమయంలో, దేవుడు స్త్రీపురుషులను సృష్టించినప్పుడు మొదట్లో వివాహ ప్రమాణం ఎలా ఉండేదో అదే స్థితికి అది తిరిగి చేరుకుంది, అదేమిటంటే ఒక పురుషుడు, ఒకే భార్య. ప్రపంచవ్యాప్తంగా దేవుని ప్రజల మధ్య నేడు అదే ప్రమాణం.​—⁠మార్కు 10:11, 12; 1 కొరింథీయులు 6:9, 10.