పేదరికం దానికి శాశ్వత పరిష్కారం కనుగొనడం
పేదరికం దానికి శాశ్వత పరిష్కారం కనుగొనడం
పేదరికం గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూల నివేదికలున్నా, స్థిరంగా ఏదైనా చేయడం సాధ్యమనే ఆశాభావంతో ఉన్నవారున్నారు. ఉదాహరణకు, మనీలా బుల్లెటన్లో వచ్చిన ఒక ప్రముఖ వార్త ప్రకారం, “ఆసియా 25 సంవత్సరాల్లో పేదరికాన్ని నిర్మూలించగలదు” అని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నివేదించింది. పేదరికపు అగాధాల నుండి ప్రజలను పైకి లాగేందుకు ఆర్థిక ప్రగతిని ఒక మార్గంగా ఆ బ్యాంక్ సిఫారసు చేసింది.
సమస్య పరిష్కారానికి ఇతర సంస్థలు ప్రభుత్వాలు, సూచనల పథకాల పెద్దచిట్టాను జారీచేశాయి. వాటిలో కొన్ని: సామాజిక భీమా కార్యక్రమాలు, విద్యాప్రగతి, వర్ధమాన దేశాలు పారిశ్రామిక దేశాలకు రుణపడ్డ బాకీలను రద్దుచేయడం, అధికశాతం పేద ప్రజలున్న దేశాలు తమ ఉత్పత్తులను మరింత సులభంగా అమ్ముకోవడానికి వీలుగా దిగుమతి అడ్డంకుల్ని తొలగించడం, పేదవారికి ప్రభుత్వ గృహనిర్మాణ పథకం.
2000 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, 2015కల్లా సాధించవలసిన లక్ష్యాలనుంచింది. వీటిలో మితిమీరిన పేదరికాన్ని, ఆకలిని వాటితోపాటు ఆయా దేశాల్లోని ఘోర ఆర్థిక అసమానతను నిర్మూలించడం ఉన్నాయి. ఆ లక్ష్యాలెంత ఆదర్శవంతమైనవైనా, ఈ అనైక్యలోకంలో అవి సాధింపబడగలవా అని అనేకులు సందేహిస్తున్నారు.
పేదరికంతో వ్యవహరించడానికి ఆచరణాత్మక చర్యలు
ప్రపంచవ్యాప్తంగా నిజమైన ప్రగతికి ఆశ క్షీణించినందున, సహాయం కోసం ఒకవ్యక్తి ఎటు తిరగాలి? ముందు ప్రస్తావించినట్లుగా, ప్రస్తుతం ప్రజలకు సహాయపడగల ఆచరణాత్మక జ్ఞానానికి మూలాధారం ఒకటుంది. అదేమిటి? అది దేవుని వాక్యమైన బైబిలు.
ఇతర సమాచార గ్రంథాలన్నింటి నుండి బైబిలును విభిన్నంగా చేసేది ఏమిటి? అది సర్వోన్నత మూలంనుండి అంటే మన సృష్టికర్తనుండి కలిగినది. ఆయన దాని పుటల్లో అన్నివర్గాల ప్రజలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని కాలాలకు అన్వయించే జ్ఞాన రత్నాలను, ఆచరణాత్మక సూత్రాలను పొందుపరచాడు. ఒకవేళ ఈ సూత్రాలను అనుసరిస్తే, అవి పేదవారు ప్రస్తుతం మరింత సంతృప్తికరమైన జీవితం అనుభవించేందుకు సహాయపడగలవు. మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం.
డబ్బు విషయంలో సరైన దృష్టితో ఉండండి. బైబిలిలా చెబుతోంది: “జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందినవారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము.” (ప్రసంగి 7:12) దీనిలో దాగివున్న భావం ఏమిటి? డబ్బే సమస్తంకాదు. నిజమే, అది కొంతమేరకు భద్రత కల్పిస్తుంది. అది మనకు కావలసిన కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి పనికొస్తుంది, అయితే దానికి పరిమితులున్నాయి. డబ్బుకొనలేని మరింత విలువైనవి ఉన్నాయి. ఈ వాస్తవాన్ని గ్రహించడం, వస్తుసంబంధ విషయాలను సరైన స్థానంలో ఉంచి తద్వారా, తమ జీవితంలో డబ్బు సంపాదనకే ప్రథమ స్థానమిచ్చేవారికి కలిగే మనస్తాపనల్ని తప్పించుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. డబ్బు జీవాన్ని కొనలేదు, అయితే జ్ఞానయుక్తంగా ప్రవర్తించడం ప్రస్తుతం జీవితాన్ని కాపాడడమే కాకుండా అనంత జీవానికి ద్వారాన్ని కూడా తెరువగలదు.
మీకున్నంతలోనే జీవించండి. మన కోరికలు మన అవసరాలవంటివే కానక్కర్లేదు. మన అవసరతలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిజానికి అవసరంకాని కోరికే అయినా అది మనకు అవసరమనే భ్రమలో మనం సులభంగా పడవచ్చు. జ్ఞానియైనవాడు తన రాబడిని అత్యవసరమైనవాటి కోసం అంటే ఆహారం, బట్టలు, ఇల్లువంటి వాటికి కేటాయిస్తాడు. ఆ తర్వాత, అదనంగా దేనికైనా ఖర్చుచెయ్యక ముందు, తన దగ్గర మిగిలింది సరిపోతుందో లేదో అని అతను లెక్కచూసుకుంటాడు. యేసు చెప్పిన ఒక ఉపమానంలో, ఒక వ్యక్తి “కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క” చూసుకోవడాన్ని ఆయన సిఫారసు చేశాడు.—లూకా 14:28.
ఫిలిప్పీన్స్లో, ముగ్గురు పిల్లలకు తల్లిగావున్న యూఫ్రోసినాను కొన్ని సంవత్సరాల క్రితం భర్త విడిచివెళ్ళడంతో, జీవనానికి సరిపడ సంపాదించి ఉన్నదాంట్లోనే సర్దుకోవడం ఆమెకొక సవాలుగా మారింది. అలా ఉంటూ, వచ్చినదాంట్లోనే ఏవి ప్రధానమో గుర్తించేందుకు ఆమె పిల్లలకు శిక్షణనిచ్చింది. ఉదాహరణకు, పిల్లలు ఇష్టపడిందేదో వారు చూస్తారు. వద్దు అని చెప్పడానికి బదులు, “మీ కిష్టమైతే మీరది కొనుక్కోవచ్చు, అయితే ముందు మనమొకటి నిర్ణయించుకోవాలి. ఏదో ఒకటి మాత్రమే కొనడానికి మన దగ్గర డబ్బుంది. మీరిష్టపడ్డది కొనగలం లేదా ఈ వారం మన భోజనానికి సరిపడా మాంసమో, కూరగాయలో కొనగలం. ఇప్పుడు మీకేది కావాలి? మీరే నిర్ణయించండి” అని వారితో తర్కిస్తుంది. సాధారణంగా, పిల్లలు విషయం వెంటనే గ్రహించి మరేదో కాదుగాని తమకు ఆహారమే కావాలని అంగీకరిస్తారు.
తృప్తి కలిగియుండండి. “అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము” అని బైబిల్లోని మరో సూత్రం చెబుతోంది. (1 తిమోతి 6:7) డబ్బు దానంతటదే సంతోషం తీసుకురాదు. చాలామంది ధనికులు అసంతోషంతో ఉంటుండగా, పేదలనేకమంది చాలా సంతోషంగా ఉన్నారు. జీవితంలో కేవలం అవసరమైన, నిరాడంబర వస్తువులతోనే తృప్తి కలిగియుండడం ఈ పేదవారు నేర్చుకున్నారు. “కన్ను తేటగా” ఉంచుకోవడం అంటే మరి విశేషమైన వాటిపై దృష్టి నిల్పడం గురించి యేసు మాట్లాడాడు. (మత్తయి 6:22) ఇది ఒక వ్యక్తి తృప్తి కలిగియుండడానికి సహాయం చేస్తుంది. అనేకమంది పేదవారు దేవునితో మంచి సంబంధం పెంచుకొని సంతోషభరితమైన కుటుంబ జీవితం గడుపుతున్నారు, వీటిని డబ్బు కొనలేదు.
పేదవారు తమ పరిస్థితిని తాళుకోవడానికి సహాయపడగల ఆచరణాత్మక బైబిలు సూచనల్లో మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. ఇంకా అనేకం ఉన్నాయి. ఉదాహరణకు, ఆదాయ వనరులను దుబారాచేసే పొగత్రాగడం, జూదంవంటి వ్యసనాలను విసర్జించండి; జీవితంలో మరింత ప్రాముఖ్యమైన, ప్రత్యేకంగా ఆధ్యాత్మిక లక్ష్యాలను గుర్తించండి; ఉద్యోగావకాశాలు తక్కువగావున్న ప్రాంతాల్లో ఇతరులకు అవసరమైన, మీకు వచ్చిన పని లేదా సేవలు అందించడానికి ప్రయత్నించండి. (సామెతలు 22:29; 23:21; ఫిలిప్పీయులు 1:9-11) అలాంటి “జ్ఞానమును వివేచనను” అనువర్తించుకోవాలని బైబిలు సిఫారసు చేస్తోంది ఎందుకంటే “అవి [మీకు] జీవముగా” ఉంటాయి.—సామెతలు 3:21, 22.
పేదరికంతో పోరాడుతున్న వారికి బైబిలు సూచనలు కొంతమేరకు సహాయకరమైన ఉపశమనాన్నిచ్చినా, భవిష్యత్తును గురించిన ప్రశ్నలింకా అలాగేవుంటాయి. పేదవారు శాశ్వతంగా పేదరికపు సంకెళ్ళలోనే మ్రగ్గిపోవాలా? అధిక సంపన్నులకు నిరుపేదలకు మధ్యగల అసమానత ఎన్నడైనా తొలగింపబడుతుందా? అనేకమందికి తెలియని ఒక పరిష్కారాన్ని మనం పరిశీలిద్దాం.
బైబిలు నిరీక్షణకు హేతువిస్తోంది
బైబిలు మంచి గ్రంథమని అనేకులు అంగీకరిస్తారు. కానీ, త్వరలోనే సంభవింపబోయే పెద్ద మార్పుల గురించిన నిర్దిష్ట సమాచారాన్ని అది అందిస్తోందని వారికి తరచుగా తెలియదు.
పేదరికంతోసహా, మానవజాతి సమస్యలను పరిష్కరించడానికి చర్య తీసుకోవాలని దేవుడు ఉద్దేశించాడు. మానవ ప్రభుత్వాలు అలా చేయడానికి శక్తిలేనట్లుగా లేదా అయిష్టంగా ఉన్నట్లు నిరూపించబడినందున, వాటిని మార్చివేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. ఎలా? దానియేలు 2:44లో బైబిలిలా నొక్కిచెబుతోంది: “పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”
ఈ “రాజ్యముల”ను లేదా ప్రభుత్వాలను తొలగించిన పిమ్మట దేవుని నియమిత రాజు చర్య తీసుకుంటాడు. ఆ పరిపాలకుడు మానవుడు కాదు గానీ దేవుని వంటి శక్తిగల పరలోక ప్రాణి. ఆయన ప్రస్తుత అసమానతల్ని తొలగించేందుకు అవసరమైన తీవ్ర మార్పులు చేయగల సమర్థుడు. దీనిని చేయడానికి దేవుడు తన సొంత కుమారుణ్ణే ఎంచుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 17:31) ఈ పరిపాలకుడు ఏంచేస్తాడో వర్ణిస్తూ కీర్తన 72:12-14 వచనాలు ఇలా చెబుతున్నాయి: “దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.” అదెంత అద్భుతమైన ఉత్తరాపేక్షో గదా! కడకు ఎంతటి ఉపశమనమో గదా! పేదల, బీదల పక్షాన దేవుని నియమిత రాజు చర్య తీసుకుంటాడు.
ఆ కాలంలో పేదరికానికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరింపబడతాయి. 72వ కీర్తన
16వ వచనమిలా చెబుతోంది: “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.” కరవు, డబ్బు లేకపోవడం లేదా లోపభరిత పాలనవల్ల కలిగే ఆహారకొరతలు గతించిపోతాయి.ఇతర సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. ఉదాహరణకు, భూనివాసుల్లో అధికశాతం ప్రజలకు నేడు సొంత ఇల్లులేదు. అయితే దేవుడిలా వాగ్దానం చేస్తున్నాడు: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు; ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు; వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును; నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు.” (యెషయా 65:21, 22) ప్రతివారికి సొంత ఇల్లుంటుంది, పనిలో ఆనందముంటుంది. కాబట్టి దేవుడు పేదరికానికి సంపూర్ణమైన, శాశ్వత పరిష్కారాన్ని వాగ్దానం చేస్తున్నాడు. ధనికులకు పేదవారికి మధ్య అగాధం ఉండదు, ప్రజలిక బ్రతుకుబండిని భారంగా లాగరు.
ఈ బైబిలు వాగ్దానాలు మొదటిసారి విన్నప్పుడు, ఇది వాస్తవికం కాదని అనిపిస్తుండవచ్చు. అయితే, బైబిలు నిశిత పరిశీలన దేవుడు గతంలో చేసిన వాగ్దానాలన్నీ నిజమైనట్టు చూపిస్తుంది. (యెషయా 55:11) అది జరుగుతుందా లేదా అన్నది కాదు గానీ అది జరిగినప్పుడు దాని నుండి ప్రయోజనం పొందడానికి మీరేం చెయ్యాలి? అన్నదే ప్రశ్న.
మీరక్కడ ఉంటారా?
ప్రభుత్వం దేవునిది కాబట్టి, మనం తప్పకుండా ఆ పరిపాలన క్రింద పౌరులుగా దేవుడంగీకరించే ప్రజలమై ఉండాలి. ఎలా అర్హులమౌతామనే విషయంలో ఆయన మనల్ని చీకటిలో విడిచిపెట్టలేదు. బైబిల్లో నిర్దేశకాలు వివరింపబడ్డాయి.
నియమిత రాజగు, దేవుని కుమారుడు నీతిమంతుడు. (యెషయా 11:3-5) అందువల్ల ఈ ప్రభుత్వ పరిపాలనక్రింద జీవించడానికి అంగీకరింపబడేవారు కూడా నీతిమంతులుగా ఉండాలి. సామెతలు 2:21, 22 ఇలా చెబుతోంది: “యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.”
ఈ నియమాలెలా పాటించాలో తెలుసుకొనే మార్గమేదైనా ఉందా? అవును ఉంది. బైబిలు అధ్యయనంచేసి దాని నిర్దేశాలను అన్వయించుకుంటే, ఈ అద్భుతమైన భవిష్యత్తున్న వారిలో మీరూ ఉండగలరు. (యోహాను 17:3) ఆ అధ్యయనం కొరకు మీకు సహాయం చేయడానికి యెహోవాసాక్షులు సంతోషిస్తారు. పేదరికాన్ని, అన్యాయాన్ని ఎన్నడూ అనుభవించని సమాజంలో మీరూ ఉండగల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా మిమ్మల్ని మేమాహ్వానిస్తున్నాం.
[5వ పేజీలోని చిత్రం]
యూఫ్రోసినా: “ఖచ్చితమైన బడ్జెట్టు నా కుటుంబానికి అవసరమైనవే కలిగియుండేందుకు సహాయం చేస్తోంది”
[6వ పేజీలోని చిత్రాలు]
దేవునితో మంచి సంబంధాన్ని, సంతోషభరిత కుటుంబ జీవితాన్ని డబ్బు కొనలేదు