కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పేదలు మరింత పేదలౌతున్నారు

పేదలు మరింత పేదలౌతున్నారు

పేదలు మరింత పేదలౌతున్నారు

“పేదవారు, నికృష్టులు అధికంగావున్న ఏ సమాజం పరిఢవిల్లదు, సంతోషంగా ఉండలేదు.”

వెనుకటికి 18వ శతాబ్దంలో ఆర్థికవేత్త ఆడమ్‌ స్మిత్‌ ఆ మాటలు పలికారు. ఆయన మాటల సత్యసంధత నేడు మరింత స్పష్టమని అనేకులు ఒప్పింపబడ్డారు. ధనికులకు పేదవారికి మధ్య తేడా మరింత స్పష్టమయ్యింది. ఫిలిప్పీన్స్‌లో ఒకింట మూడొంతుల ప్రజలు రోజుకు 1 (అమెరికా) డాలరు కంటే తక్కువలో జీవిస్తున్నారు, ధనిక దేశాల్లో దీనిని నిమిషాల్లో సంపాదించవచ్చు. “ప్రపంచ ప్రజానీకంలో 5 శాతం పేదలకంటే 5 శాతం అధిక ధనవంతుల రాబడి 114 రెట్లకంటే ఎక్కువగా ఉందని” ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి నివేదిక 2002 చెబుతోంది.

కొందరు ఒక మోస్తరు సుఖాలతో జీవిస్తుంటే, లక్షలాదిమంది ఎక్కడ వీలైతే అక్కడ గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. మరికొందరికి ఆ భాగ్యంకూడా లేదు; బహుశా అట్టముక్కో లేదా ప్లాస్టిక్‌షీటో వేసుకొని నేలమీద పడుకుంటూ వీధుల్లో బ్రతికేస్తున్నారు. చాలామంది ఏదోకరీతిలో అంటే చెత్త ఏరుకుంటూనో, బరువులు మోస్తూనో లేదా ఖాళీసీసాలు, ప్లాస్టిక్‌ ఏరుతూనో బ్రతుకు వెళ్ళదీస్తున్నారు.

ధనికులకు పేదవారికి మధ్య అసమానతలు కనిపిస్తున్నది కేవలం వర్ధమాన దేశాల్లో మాత్రమే కాదు గానీ ద వరల్డ్‌ బ్యాంక్‌ పేర్కొంటున్నట్లుగా, “‘పేదవారి బస్తీలు’ అన్ని దేశాల్లోనూ సాధారణమైపోయాయి.” బంగ్లాదేశ్‌ మొదలుకొని అమెరికా వరకు, కొందరెంత ధనికులుగావున్నా, తింటానికి కూడు ఉంటానికి గూడు కొరకు పోరాడుతున్నవారున్నారు. అమెరికాలో ధనికులకు పేదవారికి మధ్య అగాధం తదేకంగా పెరుగుతున్నదని సూచించే అమెరికా జనాభాలెక్కల విభాగపు 2001వ సంవత్సరపు నివేదికను ద న్యూయార్క్‌ టైమ్స్‌ ఉల్లేఖించింది. అదిలా చెప్పింది: “గత సంవత్సరపు సంపాదనంతటిలో సగం ఐదు శాతమున్న అధిక సంపన్నులకే చేరింది . . . అత్యంత పేదవారికి 3.5 శాతమే చేరింది.” చాలా దేశాల్లో పరిస్థితి ఈ మాదిరిగానే లేదా ఇంతకన్నా ఘోరంగా ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 57 శాతంమంది రోజుకు 2 డాలర్ల కంటే తక్కువలో జీవిస్తున్నారని ప్రపంచ బ్యాంక్‌ నివేదికొకటి చూపింది.

పరిస్థితిని మరింత దుర్భరం చేస్తూ, 2002లో అనుమానించదగిన పరిస్థితుల్లో సంపన్నులైన కార్యనిర్వహణాధికారులను గురించిన నివేదికలు అనేకులను కలవరపరిచాయి. పూర్తిగా చట్టవిరుద్ధమైన పనేమీ జరగకపోయినా, ఫార్ట్యూన్‌ అనే పత్రిక చెప్పినట్లుగా, ఈ కంపెనీ అధికారులు “విస్తారంగా, అసాధారణంగా, అనైతికంగా సంపన్నులవుతున్నారు” అని అనేకులు భావించారు. ప్రపంచంలో జరుగుతున్న దానినిబట్టి, అనేకులు పేదరికంలో మ్రగ్గుతుంటే మరికొందరికి అకస్మాత్తుగా కోట్ల డాలర్ల సంపత్తి వచ్చిపడటం ఎంతవరకు సమర్థనీయమని కొందరడుగుతున్నారు.

పేదరికం ఎల్లకాలం ఉంటుందా?

పేదల ఈ దైన్యస్థితి గురించి ఎవరూ ఏమీ చేయడం లేదని ఇలాచెప్పడం లేదు. సదుద్దేశంగల ప్రభుత్వాధికారుల, సహాయ సంస్థల ద్వారా ఈ స్థితిని మార్చడానికి నిశ్చయంగా ప్రతిపాదనలు చేయబడుతున్నాయి. అయినప్పటికీ, వాస్తవిక స్థితి నిరుత్సాహకరంగానే ఉంది. పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఎన్నో ఉదాత్త ప్రయత్నాలు జరుగుతున్నా, “అనేక దేశాలు 10, 20 కొన్నైతే 30 సంవత్సరాల ముందరి పరిస్థితికంటే ఎక్కువగా పేదరికంలో ఉన్నాయి” అని మానవాభివృద్ధి నివేదిక 2002 చెబుతోంది.

అంటే పేదవారికిక ఏ నిరీక్షణా లేనట్లేనా? ప్రస్తుతం సహాయపడగల కొంత ఆచరణాత్మక జ్ఞానాన్ని, అలాగే మీరు తలంచని పరిష్కారాలను పరిశీలించేందుకు తర్వాతి ఆర్టికల్‌ చదవండని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.