యెహోవా ఎవరికి దేవుడో వారు ధన్యులు
జీవిత కథ
యెహోవా ఎవరికి దేవుడో వారు ధన్యులు
టామ్ డీదర్ చెప్పినది
కమ్యూనిటీ హాల్ అప్పటికే అద్దెకు తీసుకున్నాము. కెనడాలోని సస్కషేవన్‌లో, పొర్కుపైన్ ప్లేయిన్‌లో జరగబోయే సమావేశానికి దాదాపు 300 మంది వస్తారనుకుంటున్నాము. బుధవారం నాడు మంచు కురవడం ఆరంభమైంది, శుక్రవారానికల్లా కన్నూ మిన్నూ కనిపించకుండా మొత్తం మంచుమయమైంది. శీతోష్ణస్థితి -40 సెల్సియస్ డిగ్రీలకు పడిపోయింది. పిల్లలతోపాటు మొత్తం 28 మంది హాజరయ్యారు. కొత్త ప్రయాణ పైవిచారణకర్తగా నాకది మొట్టమొదటి సమావేశం, అప్పుడు పాతికేళ్లున్న నేను చాలా కంగారుగా ఉన్నాను. అప్పుడేమి జరిగిందో చెప్పడానికి ముందుగా, నాకు ఈ మహత్తర సేవ చేసే అవకాశం ఎలా లభించిందో చెప్పనీయండి.
ఎ నమండుగురిలో నేను ఏడవ వాడిని, అందరం అబ్బాయిలమే. పెద్దవాడు బిల్, అతని తర్వాత మెట్రో, జాన్, ఫ్రెడ్, మైక్, అలెక్స్‌లు. నేను 1925లో జన్మించాను, అందరికంటే చిన్నవాడు వాలీ. మేము మనిటోబాలో, ఉక్రేనా అనే పట్టణంలో నివసించేవాళ్ళం, మా అమ్మ ఆన డీదర్, నాన్న మైఖల్ డీదర్‌లకు అక్కడే ఒక చిన్న ఫామ్ ఉండేది. మా నాన్న రైల్వేలో సెక్షన్ మాన్‌గా పనిచేసేవారు. వాళ్ళు నివసించడానికి నగరానికి చాలా దూరంగా రైలు పట్టాలకు పక్కనే బంక్‌హౌస్ అనే చిన్న క్వార్టర్ ఇచ్చేవారు, అలాంటి చిన్న ఇండ్లు మాలాంటి పెద్ద కుటుంబానికి సరిపోవు కాబట్టి మేము ఫామ్‌లోనే ఉండేవాళ్ళం. నాన్న ఎక్కువగా ఇంటికి దూరంగానే ఉండేవారు, ఆ కారణంగా మమ్మల్ని అమ్మే పెంచింది. అమ్మ అప్పుడప్పుడు నాన్న దగ్గరకి వెళ్ళి వారం పదిరోజులుండి వచ్చేది, అయితే ఆమె మాకు వంట
చేయడం, బేకింగ్ చేయడం, మిగతా ఇంటి పనులు చేయడం అన్నీ నేర్పించింది. మేము గ్రీకు క్యాథలిక్ చర్చి సభ్యులం కాబట్టి, మా అమ్మ నుండి మేము పొందే శిక్షణలో ప్రార్థనలను బట్టీ పట్టడం, ఇతర ఆచారాల్లో పాల్గొనడం వంటివి ఉండేవి.బైబిలు సత్యంతో పరిచయం
బైబిలును అర్థం చేసుకోవాలనే తపన నాకు చిన్నతనంలోనే ఆరంభమైంది. మా పొరుగింటాయన యెహోవాసాక్షి, ఆయన మా ఇంటికి క్రమంగా వస్తూ దేవుని రాజ్యానికి, అర్మగిద్దోనుకు, నూతనలోకంలో పొందబోయే ఆశీర్వాదాలకు సంబంధించిన బైబిలు వచనాలు చదువుతుండేవాడు. ఆయన చెబుతున్నవాటి పట్ల మా అమ్మ ఏమాత్రం ఆసక్తి చూపించలేదు, కానీ ఆ సందేశం మైక్ అలెక్స్‌లను ఆకర్షించింది. వాస్తవానికి వారు నేర్చుకున్నదాన్ని బట్టి వారు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తమ మనస్సాక్షి ఒప్పుకోవడం లేదని చెప్పి సైనికోద్యోగాన్ని నిరాకరించారు. తత్ఫలితంగా మైక్‌కు కొంతకాలం జైలు శిక్ష పడింది, అలెక్స్‌ను ఒంటారియోలోని ఒక లేబర్ క్యాంపుకు పంపించారు. క్రమేణా ఫ్రెడ్ వాలీలు కూడా సత్యాన్ని స్వీకరించారు. కానీ మా ముగ్గురు పెద్దన్నయ్యలు మాత్రం స్వీకరించలేదు. కొన్ని సంవత్సరాలపాటు మా అమ్మ సత్యాన్ని వ్యతిరేకించింది కూడా, కానీ మమ్మల్నందర్నీ ఆశ్చర్యపరుస్తూ తను యెహోవా వైపు నిలిచింది. ఆమె తన 83వ యేట బాప్తిస్మం పొందింది. మా అమ్మ చనిపోయేనాటికి ఆమెకు 96 ఏండ్లు. నాన్న కూడా చనిపోయే ముందు సత్యం పట్ల సుముఖంగానే ఉన్నారు.
నేను నా 17వ యేట ఉద్యోగాన్వేషణతోపాటు బైబిలు అధ్యయనం చేయడానికి నాకు సహాయం చేయగలవారి సహవాసాన్ని వెతుక్కుంటూ విన్నీపెగ్‌కు బయల్దేరాను. యెహోవాసాక్షులు ఆ సమయంలో నిషేధంలో ఉన్నారు, అయినా క్రమంగా కూటాలు జరుగుతుండేవి. నేను మొదటిసారి హాజరయిన కూటం ఒక ఇంటిలో జరిగింది. నేను గ్రీకు క్యాథలిక్ విశ్వాసంలో పెరిగాను కాబట్టి, నేను తొలుత విన్నదంతా వింతగా అనిపించింది. అయినప్పటికీ నేను క్త్రెస్తవమతంలోని అర్చక వ్యవస్థ ఎందుకు లేఖనాధారం లేనిదో, క్రైస్తవమత పురోహితులు యుద్ధ ప్రయత్నాలను ఆశీర్వదించినప్పుడు వాటిని దేవుడు ఎందుకు ఆమోదించడో కొద్ది కొద్దిగా అర్థం చేసుకున్నాను. (యెషయా 2:4; మత్తయి 23:8-10; రోమీయులు 12:17, 18) ఎక్కడికో సుదూర ప్రాంతానికి శాశ్వతంగా పోయేదానికంటే, భూపరదైసులో జీవించడం ఎంతో ఆచరణాత్మకమైనది, సహేతుకమైనది అనిపించింది.
ఇదే సత్యమని నమ్మకం కలిగిన నేను యెహోవాకు సమర్పించుకొని విన్నీపెగ్‌లో 1942లో బాప్తిస్మం తీసుకున్నాను. 1943కల్లా కెనడాలో యెహోవాసాక్షులపై నిషేధాన్ని తీసివేశారు, దాంతో ప్రకటనా పని ఊపందుకుంది. బైబిలు సత్యం నా హృదయంలో గాఢంగా ముద్రించుకుపోవడం కూడా ఆరంభించింది. నేను సంఘంలో సేవకుడిగా (సంఘ పైవిచారణకర్తగా) సేవచేసే మహత్తర అవకాశంతోపాటు సంఘ నియమిత క్షేత్రంలో బహిరంగ ప్రసంగాలిచ్చేందుకు, అనియమిత క్షేత్రంలో సేవచేయడానికి ఆధిక్యత లభించింది. అమెరికాలో జరిగిన పెద్ద పెద్ద సమావేశాలకు హాజరవడం నా ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో తోడ్పడింది.
యెహోవాకు చేసే నా సేవను విస్తరింపజేసుకోవడం
1950లో నేను పయినీరు పరిచారకునిగా చేరాను, అదే సంవత్సరం డిసెంబరులో ప్రయాణ పైవిచారణకర్తగా సేవచేయమంటూ ఆహ్వానించబడ్డాను. టొరాంటోకు సమీపాన, అనుభవజ్ఞుడు, విశ్వసనీయుడు అయిన సహోదరుడు చార్లీ హెప్‌వర్త్ నుండి వాడుకగాయిచ్చే శిక్షణ పొందే మహత్తర అవకాశం నాకు లభించింది. నా శిక్షణ కాలంలోని చివరివారం, విన్నీపెగ్‌లో అప్పటికే ప్రయాణ పైవిచారణకర్తగా సేవచేస్తున్న మా అన్నయ్య అలెక్స్‌తో ఆనందంగా గడిపే అవకాశం కూడా నాకు లభించింది.
నేను మొదట్లో చెప్పిన నా మొట్టమొదటి ప్రాంతీయ సమావేశాన్ని ఎన్నటికీ మరచిపోలేను. నేను ఏమి జరుగుతుందోనని సహజంగానే కంగారుపడ్డాను. ఏదేమైనా మా జిల్లా పైవిచారణకర్త సహోదరుడు జాక్ నాథన్ మమ్మల్నందరినీ బిజీగా సంతోషంగా ఉంచారు. అక్కడ హాజరైనవారికే మేము సమావేశ కార్యక్రమ సారాంశాన్ని అందించాము. మేము వంతులు వేసుకుని అనుభవాలు చెప్పడం, ఇంటింటి సేవలో చేసే పరిచయాలను అభ్యాసం చేయడం, పునర్దర్శనాలు ఎలా చేయాలో, గృహ బైబిలు అధ్యయనాలు ఎలా చేయాలో ప్రదర్శించడం వంటివి చేశాము. మేము రాజ్యగీతాలను పాడుకున్నాము. ఆహారమైతే చాలా మిగిలిపోయింది. మేము దాదాపు ప్రతి రెండు గంటలకు కాఫీ, పై అనే తినుబండారాలను సేవించాము. కొందరు బెంచీల మీద, వేదిక పైన పడుకుంటే మరికొందరు నేలపైనే పడుకున్నారు. ఆదివారానికల్లా మంచు తుఫాను కాస్త నిమ్మళించింది,
ఆ కారణంగా బహిరంగ ప్రసంగానికి హాజరైనవారి సంఖ్య 96కు చేరుకుంది. కష్ట పరిస్థితులను ఎదుర్కోవడాన్ని ఆ అనుభవం నాకు నేర్పించింది.ప్రయాణ పైవిచారణకర్తగా నా తర్వాతి నియామకం నన్ను ఉత్తర అల్బర్టాకు, బ్రిటీష్ కొలంబియాకు, అర్ధరాత్రి కూడా సూర్యుడు కనబడే ప్రాంతంలోని యూకోన్ ప్రాంతానికి తీసుకువెళ్ళింది. సాఫీగాలేని అలాస్కా హైవే గుండా బ్రిటీష్ కొలంబియాలోని డౌసన్ క్రీక్ నుండి యూకోన్‌లోని వైట్‌హార్స్ వరకు (1,477 కిలోమీటర్ల దూరం) ప్రయాణిస్తూ సాక్ష్యమివ్వడానికి సహనము, జాగరూకత అవసరమయ్యాయి. జారిపడేలా ఉండే మంచు ప్రదేశాలు, ఏటవాలుగా ఉండే పర్వతాలు, మంచు కురవడం వల్ల సరిగా కనిపించకుండా ఉండడం వంటివన్నీ నిజంగా సవాళ్ళే.
ఉత్తరధృవ ప్రాంత మారుమూల ప్రదేశాల్లోకి సత్యం ఎలా చొచ్చుకొనిపోయిందో చూసి నేను అచ్చెరువొందాను. ఒకసారి నేను, వాల్టర్ లూకోవిట్స్, యూకోన్ సరిహద్దుకు సమీపంలో అలాస్కా హైవేకు పక్కనే, బ్రిటీష్ కొలంబియాలోని లోయర్ పోస్టుకు దగ్గర్లోనే ఉన్న ఒక చిన్న కాబిన్‌ను సందర్శించాము. చిన్న కిటికీ గుండా మినుకు మినుకుమంటున్న కాంతిని బట్టి దాంట్లో ఎవరో నివసిస్తున్నారని మేము గమనించాము. సమయం రాత్రి తొమ్మిది అవుతోంది, మేము తలుపు తట్టాము. లోపలికి రమ్మంటూ ఒక పురుష కంఠం గట్టిగా వినిపించడంతో మేము లోపలికి ప్రవేశించాము. బల్ల పడక మీద పడుకొని ఉన్న ఒక వృద్ధుడు చదువుతున్న పత్రికను చూసి మేము ఆశ్చర్యపోయాము, ఆయన చదువుతున్నది కావలికోట! వాస్తవానికి ఆయన దగ్గరున్నది మేము అప్పుడు అందిస్తున్నదాని కంటే తాజా పత్రిక. అది తనకు ఎయిర్‌మెయిల్‌లో అందిందని ఆయన వివరించాడు. మేము సంఘం నుండి బయల్దేరి అప్పటికి ఎనిమిది రోజులు దాటిపోయింది కాబట్టి మాకు తాజా పత్రికలు ఇంకా అందలేదు. ఆ వ్యక్తి తన పేరు ఫ్రెడ్ బర్గ్ అని పరిచయం చేసుకున్నాడు, ఆయన సంవత్సరాల నుండి చందాదారుడిగా ఉన్నప్పటికీ యెహోవాసాక్షులను కలుసుకోవడం అదే మొదటిసారట. ఫ్రెడ్ మమ్మల్ని ఆ రాత్రికి అక్కడే ఉండమన్నాడు. మేము అనేక లేఖనాధార సత్యాలను ఆయనతో పంచుకోగలిగాము, ఆ ప్రాంతం గుండా క్రమంగా వెళ్లే ఇతర సాక్షులు కూడా ఆయనను సందర్శించే ఏర్పాట్లు చేశాము.
నేను చిన్న చిన్నగా ఉండే మూడు సర్క్యూట్‌లలోనే కొన్ని సంవత్సరాలపాటు సేవ చేశాను. అవి తూర్పున అల్బర్టలోని గ్రాండె ప్రేయ్‌రీ నుండి పడమటి వైపున అలాస్కాలోని కొడియక్ వరకు మొత్తం 3,500 కిలోమీటర్లకు పైనే ఉంటుంది.
మిగతా ప్రాంతాల్లోలాగే మారుమూల ప్రాంతాల్లోనూ యెహోవా ప్రజలందరిపట్ల కృపను చూపిస్తాడనీ నిత్యజీవముపట్ల సరైన దృక్పథం గలవారి మనస్సులను
హృదయాలను ఆయన ఆత్మ పురికొల్పుతుందనీ తెలుసుకుని నేనెంతో సంతోషించాను. అలాంటి వారిలో ఒకరు యూకోన్‌లోని డౌసన్ నగరానికి చెందిన హెన్రీ లెపిన్, ఆ నగరం ఇప్పుడు డౌసన్ అని పిలువబడుతోంది. హెన్రీ ఒక మారుమూల ప్రాంతంలో నివసించేవాడు. నిజానికి ఆయన దాదాపు 60 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుండి బంగారు గనుల ప్రాంతాన్ని వదిలి బయటకు రాలేదు. 84 సంవత్సరాల ఈ వృద్ధుడు అప్పటి వరకూ ఒక్క సంఘకూటానికి హాజరుకాకపోయినప్పటికీ, 1,600 కిలోమీటర్ల దూరములోవున్న అంకరేజిలో ప్రాంతీయ సమావేశానికి హాజరయ్యేందుకు ప్రయాణించి వెళ్ళడానికి యెహోవా ఆత్మ ఆయనను పురికొల్పింది. ఆయన ఆ కార్యక్రమం విని పులకరించిపోయాడు, సహవాసమందు అత్యంత ఆనందాన్ని పొందాడు. డౌసన్ నగరానికి తిరిగి వచ్చిన తర్వాత హెన్రీ తన మరణం వరకు విశ్వసనీయంగా ఉన్నాడు. ఈ వృద్ధుడు అంత దూరం ప్రయాణించేందుకు ఆయనను ఏమి పురికొల్పిందా అని ఆయన పరిచయస్థులు చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ ఉత్సుకత మరి కొందరు వృద్ధులు సత్యాన్ని స్వీకరించేందుకు నడిపించింది. ఆ విధంగా హెన్రీ పరోక్షంగా చక్కని సాక్ష్యమివ్వగలిగాడు.యెహోవా కృపా పాత్రుడనయ్యాను
వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ వారి 26వ తరగతికి హాజరవమంటూ 1955లో ఆహ్వానాన్ని అందుకోవడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. ఆ శిక్షణ నా విశ్వాసాన్ని ఎంతో బలోపేతం చేసింది, యెహోవాకు సన్నిహితం అయ్యేందుకు సహాయపడింది. శిక్షణ పూర్తయ్యాక, కెనడాలోనే ప్రయాణ పైవిచారణకర్తగా కొనసాగేందుకు నియమించబడ్డాను.
దాదాపు ఒక సంవత్సరం వరకు నేను ఒంటారియో ప్రాంతంలో సేవ చేశాను. ఆ తర్వాత నేను అద్భుతమైన ఉత్తర ప్రాంతానికి మళ్ళీ నియమించబడ్డాను. ఇరువైపుల స్వచ్ఛమైన తళతళలాడే సరస్సులు, మంచుతో కప్పబడిన ఎత్తైన పర్వత శ్రేణులు ఉన్న హైవేల సుందర దృశ్యాలను ఇప్పటికీ నా స్మృతిపథంలో చూడగలుగుతున్నాను. వేసవిలో అక్కడి లోయల్లోని పచ్చికమైదానాలు రంగు రంగుల అడవిపూలతో చూడడానికి అద్భుతమైన కార్పెట్‌లా ఉంటాయి. స్వచ్ఛమైన గాలి, నిర్మలమైన నీరు. అక్కడ ఎలుగుబంట్లు, తోడేళ్ళు, ముంగిసలు, ధ్రువప్రాంతపు జింకలు, ఇతర అడవి జంతువులు తమ సొంత నివాసాల్లో తిరిగినట్లు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి.
అయితే అలాస్కాలో, మారే వాతావరణమే కాక చాలా దూరం వరకు ప్రయాణాలు చేయాల్సిరావడం వంటి సవాళ్ళు ఎదురయ్యేవి. నా సర్క్యూట్ తూర్పునుండి పడమటికి 3,200 కిలోమీటర్లకు విస్తరించి ఉంది. అప్పట్లో ప్రయాణ పైవిచారణకర్తలకు కారు ఇచ్చే ఏర్పాటు లేకుండేది. స్థానిక సహోదరులే నన్ను ఒక సంఘం నుండి మరో సంఘానికి తీసుకువెళ్ళేవారు. అయితే కొన్నిసార్లు నేనే ట్రక్కువాళ్ళను లేక టూరిస్టులను లిఫ్టు అడిగి వెళ్ళాల్సివచ్చేది.
అలా ఒకసారి నేను అలాస్కాలోని టోక్ జంక్షన్‌కు, మైల్ 1202కి లేదా స్కాటీ క్రీక్ ప్రాంతానికి మధ్య అలాస్కా హైవే మీద ప్రయాణిస్తున్నాను. ఈ రెండు ప్రాంతాల్లో ఉండే కస్టమ్స్ కార్యాలయాల మధ్య దూరం సుమారు 160 కిలోమీటర్లు ఉంటుంది. టోక్ దగ్గరున్న అమెరికా కస్టమ్స్ కార్యాలయాన్ని దాటాక నాకు ఓయాభై కిలోమీటర్ల వరకు లిఫ్టు దొరికింది. ఆ తర్వాత అటు వైపు ఒక్క కారు కూడా రాలేదు, దానితో నేను నడవడం ప్రారంభించాను, అలా 40 కిలోమీటర్ల వరకు 10 గంటలపాటు నడిచాను. కస్టమ్స్‌వారు తనిఖీ చేసే స్థలాన్ని నేను దాటి వెళ్ళిన కొద్దిసేపటికే, దానికి కాస్త దూరంలో మంచుతుఫాను చెలరేగడం మూలంగా హైవే మీది ఆ భాగంలోని అన్ని వాహనాలు నిలిపివేయబడ్డాయని నాకు ఆ తర్వాత గానీ తెలియలేదు. అర్ధరాత్రి అయ్యేసరికి ఉష్ణోగ్రత సుమారు -23 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది, ఇంకా 80 కిలోమీటర్లు దాటితేనే గాని కాస్త తలదాచుకునే చోటు దొరకదు. విశ్రాంతి తీసుకోగలిగే స్థలం కోసం నేను తీవ్రంగా వెదికాను.
నేనలా కాళ్ళీడ్చుకుంటూ కాస్త ముందుకెళ్లగానే, రోడ్డు పక్కనే వదిలేయబడిన ఒక కారు నా కంటబడింది, దానిమీద కాస్త మంచు పేరుకుపోయింది. నేను దానిలోపలికి దూరి దాని మెత్తటి సీట్లమీద పడుకుంటే, ఆ చల్లని రాత్రి నుండి బతికి బయటపడగలనని తలంచాను. మంచును అటూ ఇటూ తుడిచేసి
ఎలాగోలాగు కారు తలుపు తెరవగలిగాను, తీరా లోపల చూస్తే సీట్లు లేని ఇనుప ఫ్రేములు నన్ను వెక్కిరించాయి. అలాగే రోడ్డుపైన ఇంకాస్త దూరం వెళ్ళగానే, సంతోషకరంగా ఖాళీగావున్న ఒక క్యాబిన్ కనబడింది. కాస్త తంటాలుపడ్డాక లోపలికి వెళ్ళి కాస్త నిప్పు రాజేసుకొని, కొన్ని గంటలు అక్కడే విశ్రాంతి తీసుకోగలిగాను. ఉదయం ఒక లాడ్జి వరకు లిఫ్టు దొరికింది, అక్కడే నాకు కావలసిన ఆహారము, చిట్లిపోయిన నా వేళ్లకు మందు లభించాయి.యెహోవాయే ఉత్తరధృవ ప్రాంతంలో దాన్ని ఎదిగేలా చేశాడు
నేను ఫెయిర్‌బ్యాంక్స్‌కు మొదటిసారి వెళ్ళినప్పుడు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. పరిచర్యలోని చక్కని ఫలితాలు మాకు ఆనందాన్నిచ్చాయి, ఆదివారం బహిరంగ ప్రసంగానికి సుమారు 50 మంది హాజరయ్యారు. వర్నర్, లోరేన్ డేవిస్‌లు నివసిస్తున్న చిన్న మిషనరీ హోమ్‌లో మేము సమకూడాము. ప్రసంగం వినడానికి ప్రజలు వంటగది నుండి, పడకగది నుండి, హాలు నుండి తొంగి తొంగి చూశారు. ప్రసంగం వినడానికి అంతమంది రావడం చూసిన మేము ఫెయిర్‌బ్యాంక్స్‌లో ప్రకటనా పనిని స్థిరం చేసేందుకు ఒక రాజ్య మందిరం అవసరమని గ్రహించాము. కాబట్టి యెహోవా సహాయంతో, గతంలో నృత్యశాలగా ఉన్న ఒక పెద్ద చెక్క భవనాన్ని కొని దాన్ని సముచితమైన ఒక చక్కని స్థలంగా మార్చాము. ఒక బావి తవ్వించి, బాత్‌రూములు కట్టించి, హీటర్ ఏర్పాటు చేయించాము. సంవత్సరంలోపు ఫెయిర్‌బ్యాంక్స్‌లో చక్కని రాజ్యమందిరం తయారయ్యింది. దాని పక్కనే ఒక వంటగది కట్టించిన తర్వాత, ఆ హాలు 1958లో జిల్లా సమావేశానికి ఉపయోగించబడింది, దానికి మొత్తం 330 మంది హాజరయ్యారు.
1960 వేసవి కాలంలో నేను, అమెరికాలోనూ కెనడాలోనూ ఉన్న ప్రయాణ పైవిచారణకర్తలందరి కోసం ఏర్పాటు చేయబడిన ఒక నూతనోత్తేజకరమైన కోర్సుకు హాజరయ్యేందుకు న్యూయార్క్‌లోని యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయానికి కారులో సుదీర్ఘ ప్రయాణం చేశాను. నేను అక్కడున్నప్పుడు, అలాస్కాలో బ్రాంచి కార్యాలయాన్ని తెరిచే అవకాశాల గురించి సహోదరుడు నాథన్ నార్‌తోపాటు బాధ్యతాయుతులైన ఇతర సహోదరులు నన్ను ఇంటర్వ్యూ చేశారు. కొన్ని నెలల తర్వాత, సెప్టెంబరు 1, 1961 నుండి అలాస్కాకు సొంత బ్రాంచి కార్యాలయం ఉండబోతోందని విని మేము ఎంతో సంతోషించాము. సహోదరుడు ఆండ్రూ కె. వాగ్నర్‌కు బ్రాంచి విధి నిర్వహణల బాధ్యత అప్పగించబడింది. ఆయనా ఆయన భార్య వీరా బ్రూక్లిన్‌లో 20 సంవత్సరాలు సేవ చేశారు, వారికి ప్రయాణ పైవిచారణకర్తలుగా కూడా అనుభవముంది. అలాస్కాలో బ్రాంచి కార్యాలయ ఏర్పాటు ఎంతో ప్రశంసించబడింది, ఎందుకంటే అది ప్రయాణ పైవిచారణకర్త ప్రయాణాలను తగ్గించి, ఆయన సంఘాల్లోని, మారుమూల క్షేత్రాల్లోని నిర్దిష్ట అవసరాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించేలా చేసింది.
1962లోని వేసవికాలం ఉత్తర ప్రాంతంలోని అత్యంత సంతోషకరమైన సమయం. అలాస్కా బ్రాంచి ప్రతిష్ఠాపన జరిగింది, అలాస్కాలోని జూనీయులో జిల్లా సమావేశము జరిగింది. జూనీయులోను యూకోన్‌లోని వైట్‌హార్స్‌లోను, కొత్త రాజ్య మందిరాలు నిర్మించబడ్డాయి, కొన్ని మారుమూల ప్రాంతాల్లో కొత్త గ్రూపులు కూడా ఏర్పడ్డాయి.
మళ్ళీ కెనడాకు
కొన్ని సంవత్సరాల నుండి నేను కెనడాలోని మార్గరిటా పెట్రాస్‌ను ఉత్తరాల ద్వారా సంప్రదిస్తున్నాను. రీటా అని పిలువబడే ఆమె, 1947లో పయినీరు సేవ ఆరంభించింది, 1955లో గిలియడ్‌నుండి పట్టభద్రురాలై, కెనడా తూర్పు ప్రాంతంలో పయినీరు సేవ కొనసాగిస్తోంది. నేనామెను వివాహం చేసుకుంటానని అడిగాను, దానికి ఆమె అంగీకరించింది. మేము వైట్‌హార్స్‌లో ఫిబ్రవరి 1963లో వివాహం చేసుకున్నాము. అదే సంవత్సరం శరదృతువులో కెనడా పశ్చిమ ప్రాంతంలో ప్రయాణ పైవిచారణకర్తగా నియామకం వచ్చింది, మేము ఆ తర్వాతి 25 సంవత్సరాలు అక్కడే సేవ చేయడంలో ఆనందించాము.
ఆరోగ్య కారణాల వల్ల 1988లో మేము మానిటోబలోని విన్నిపెగ్‌లో ప్రత్యేక పయినీర్లుగా నియమించబడ్డాం. ఆ నియామకంలో భాగంగా మేము సుమారు అయిదు సంవత్సరాలపాటు ఒక అసెంబ్లీ హాలును కూడా చూసుకున్నాం. మేము ఇప్పటికీ, శిష్యులను చేసే ఆనందకరమైన పనిలో సాధ్యమైనంత వరకు పాల్గొంటున్నాం. సర్క్యూట్ పనిలో ఉన్నప్పుడు మేము ఎన్నో బైబిలు అధ్యయనాలను ఆరంభించి నిర్వహించేందుకు ఇతరులకు ఇచ్చేసే వాళ్ళం. ఇప్పుడు, యెహోవా కృప వల్ల, అధ్యయనాలు ప్రారంభించి ఆ విద్యార్థులు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకునేంత వరకు అభివృద్ధి చెందడాన్ని చూసే ఆనందం కూడా మాకు లభిస్తోంది.
యెహోవాను సేవించడమే జీవితంలో శ్రేష్ఠమైన మార్గమని నాకు గట్టి నమ్మకం కుదిరింది. అది అర్థవంతమైనది, సంతృప్తికరమైనది, అది ప్రతిదినము యెహోవా పట్ల మన ప్రేమను గాఢం చేస్తుంది. నిజమైన సంతోషాన్ని తెచ్చేది ఇదే. మనకు దైవపరిపాలనా నియామకం ఏదున్నా లేదా ఈ భూమిపై మనం ఎక్కడున్నా, “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు” అని అన్న కీర్తనకర్తతో మనం ఏకీభవిస్తాము.—కీర్తన 144:15.
[24, 25వ పేజీలోని చిత్రం]
సర్క్యూట్ పనిలో
[25వ పేజీలోని చిత్రం]
డౌసన్ నగరంలో హెన్రీ లెపీన్‌ను సందర్శించినప్పటిది. ఎడమవైపు ఉన్నది నేను
[26వ పేజీలోని చిత్రం]
ఆంకరేజిలో మొట్టమొదటి రాజ్య మందిరం
[26వ పేజీలోని చిత్రం]
రీటా నేను 1998లో