కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యదేవుడైన యెహోవా

సత్యదేవుడైన యెహోవా

సత్యదేవుడైన యెహోవా

“యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే.”​—⁠కీర్తన 31:⁠5.

ఒకప్పుడు అసత్యమే లేదు. అదృశ్య పరలోక నివాసులైన పరిపూర్ణ ఆత్మ ప్రాణులు తమ ‘సత్యదేవుడైన’ సృష్టికర్తకు సేవచేస్తూ ఉన్నారు. (కీర్తన 31:⁠5) అబద్ధంలేదు, మోసంలేదు. తన ఆధ్యాత్మిక కుమారులకు యెహోవా సత్యమే అందిస్తూవచ్చాడు. వారిని ప్రేమించి వారి సంక్షేమమందు మిక్కిలి ఆసక్తి కలిగి ఉన్నందువల్ల ఆయనలా చేశాడు. భూమ్మీద పరిస్థితికూడా అదేమాదిరిగా ఉంది. మొదటి స్త్రీపురుషులను యెహోవా సృష్టించి, తన నియమిత మాధ్యమం ద్వారా అన్ని సందర్భాల్లో స్పష్టంగా, సూటిగా సత్యవంతంగా వారితో సంభాషిస్తూ వచ్చాడు. అదెంత అద్భుతంగా ఉండి ఉంటుందో గదా!

2 అయితే చివరకు దేవుని ఆత్మ కుమారుల్లో ఒకడు మొండిగా యెహోవాను వ్యతిరేకిస్తూ తనకుతానుగా దేవునికి పోటీగా నిలబడడానికి ఉపక్రమించాడు. అపవాదియగు సాతానుగా మారిన ఈ ఆత్మ ప్రాణి ఇతరులు తనను ఆరాధించాలని కోరుకున్నాడు. తన లక్ష్యసాధనకు, అతడు ఇతరులను తన ఆధీనంలోకి తెచ్చుకొనే మాధ్యమంగా అసత్యం పుట్టించాడు. అలాచేయడంలో అతడు ‘అబద్ధికునిగా అబద్ధమునకు జనకునిగా’ తయారయ్యాడు.​—⁠యోహాను 8:44.

3 మొదటి స్త్రీయగు హవ్వతో సాతాను ఒక సర్పం ద్వారా మాట్లాడుతూ ఆమె దేవుని ఆజ్ఞను త్రోసిపుచ్చి నిషిద్ధ ఫలాలు తింటే చనిపోదని చెప్పాడు. అది అబద్ధం. పైగా అలా తిన్నందువల్ల ఆమె మంచిచెడ్డలు తెలిసినదై దేవునివలే తయారౌతుందనీ అతడు చెప్పాడు. అది కూడా అబద్ధమే. హవ్వ క్రితమెన్నడూ అబద్ధం వినకపోయినా, సర్పంనుండి తాను విన్నది తన భర్తయైన ఆదాముకు దేవుడు చెప్పిన దానికి అనుగుణంగా లేదని ఆమె తప్పక గుర్తించి ఉంటుంది. అయినాసరే, యెహోవాను కాకుండా సాతానునే నమ్మడానికి ఆమె నిశ్చయించుకుంది. బహుగా మోసగించబడినదై, ఆమె ఆ ఫలాలు తీసుకొని తిన్నది. ఆ తర్వాత ఆదాము కూడా ఆ ఫలం తిన్నాడు. (ఆదికాండము 3:​1-6) హవ్వవలే ఆదాము క్రితమెన్నడూ అబద్ధం వినకపోయినా, అతడు మోసగింపబడలేదు. (1 తిమోతి 2:​14) తన క్రియలద్వారా, తాను తన సృష్టికర్తను తిరస్కరిస్తున్నానని అతడు చూపించాడు. మానవజాతికి దాని పరిణామాలు దారుణంగా మారాయి. ఆదాము అవిధేయతవల్ల పాపమరణాలతోసహా భ్రష్టత్వం, అంతులేని దుఃఖం అతని సంతానమంతటికి విస్తరించింది.​—⁠రోమీయులు 5:12.

4 అసత్యంకూడా వ్యాపించింది. ఏదెను వనంలో చెప్పబడిన ఆ అబద్ధాలు స్వయంగా యెహోవా సత్యశీలతమీద దాడులని మనం గుర్తించాలి. మొదటి మానవ దంపతులకు మేలైనదేదో దక్కకుండా దేవుడు మోసంచేస్తున్నాడని సాతాను ఆరోపించాడు. అది నిజంకాదు. ఆదాముహవ్వలు తమ అవిధేయతనుండి ప్రయోజనం పొందలేదు. యెహోవా చెప్పినట్లుగానే వారు మరణించారు. అయినా, యెహోవామీద కొండెముల దాడిని సాతాను అలాగే కొనసాగించాడు, అదెంతమేరకంటే, సాతాను “సర్వలోకమును మోస పుచ్చుచు”న్నాడని శతాబ్దాల తర్వాత కూడా అపొస్తలుడైన యోహాను దైవావేశంతో వ్రాశాడు. (ప్రకటన 12:⁠9) అపవాదియగు సాతానుచే మోసగించబడకుండా తప్పించుకోవాలంటే, మనం తప్పకుండా యెహోవా సత్యశీలతయందు, ఆయన వాక్యమందు పూర్తి నమ్మకం కలిగియుండాలి. యెహోవా యందలి మీ నమ్మకాన్ని మీరెలా వృద్ధిచేసుకుని బలపర్చుకోగలరు అలాగే ఆయన విరోధి ప్రోత్సహిస్తున్న మోసం, అబద్ధాలకు వ్యతిరేకంగా మిమ్మల్ని మీరెలా బలపర్చుకోగలరు?

యెహోవాకు సత్యం తెలుసు

5 యెహోవాయే “సమస్తమును సృష్టించిన” వాడని బైబిలు స్థిరంగా చెబుతోంది. (ఎఫెసీయులు 3:⁠8) ఆయనే “ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవా[డు].” (అపొస్తలుల కార్యములు 4:​24) యెహోవా సృష్టికర్త కాబట్టి, ప్రతిదాని గురించిన సత్యం ఆయనకు తెలుసు. ఉదాహరణకు: తన ఇంటి నమూనా తానే స్వయంగా గీసి, ఆ ఇంటికి వాసాలు బిగించి వాటికి మేకులుకొట్టి దానిని నిర్మించిన మనిషి విషయమే ఆలోచించండి. దానిని గమనించిన ఏ ఇతర మనిషికంటే ఆయనకే ఆ ఇంటికి సంబంధించిన సమస్తం తెలిసివుంటాయి. స్వయంగా నమూనాగీసి తయారుచేసిన వస్తువుల గురించి ప్రజలకు తెలిసివుంటుంది. అదే ప్రకారం, తాను సృష్టించిన ప్రతిదానిని గూర్చి సృష్టికర్తకు సమస్తం తెలుసు.

6 యెహోవా పరిజ్ఞాన విస్తారతను గురించి యెషయా ప్రవక్త కడురమ్యంగా మాట్లాడాడు. మనమిలా చదువుతాము: “తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచిన వాడెవడు? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు? న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పినవాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసినవాడెవడు? ఆయనకు బుద్ధిమార్గము బోధించినవాడెవడు?” (యెషయా 40:​12-14) నిజముగా “యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు” మరియు “పరిపూర్ణజ్ఞానము గలవా[డు].” (1 సమూయేలు 2:3; యోబు 36:4; 37:​16) ఆయనతో పోలిస్తే మనకు తెలిసిందెంత అల్పమో గదా! మానవజాతి సమకూర్చుకున్న ఉత్తేజకరమైన పరిజ్ఞానం, భౌతిక సృష్టిని గూర్చిన మన అవగాహన ఎంత విస్తారంగావున్నా అవి “ఆయన [దేవుని] కార్యములలో స్వల్పములు.” అది, “గర్జనలుచేయు ఆయన మహాబలము”నకు పోలిస్తే “మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దముపాటిదే.”​—⁠యోబు 26:14.

7 యెహోవా మనల్ని సృష్టించాడు కాబట్టి, మనగురించి ఆయనకు సమస్తం తెలుసనడం సమంజసమే. దావీదు రాజు దీనిని గుర్తించాడు. ఆయనిలా వ్రాశాడు: “యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది.” (కీర్తన 139:​1-4) మానవులకు స్వేచ్ఛాచిత్తం ఉందని దావీదు గ్రహించాడు, తనకు విధేయతను లేదా అవిధేయతను చూపించే సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. (ద్వితీయోపదేశకాండము 30:19, 20; యెహోషువ 24:​15) అయినప్పటికీ, మన గురించి మనకంటే యెహోవాకు మరెంతో ఎక్కువ తెలుసు. ఆయన మన ప్రయోజనాన్నే కోరుతున్నాడు, పైగా ఆయన మన మార్గాలను నిర్దేశించగల మంచి స్థానంలో ఉన్నాడు. (యిర్మీయా 10:​23) నిజానికి, ఆయన తప్ప మనకు సత్యం నేర్పించి మనలను పరిజ్ఞానులనుచేసి సంతోషపరచగల మరి శ్రేష్ఠమైన బోధకుడు, నిపుణుడు, సలహాదారుడు మరెవ్వరూలేరు.

యెహోవా సత్యవంతుడు

8 సత్యం తెలుసుకోవడం ఒక విషయమైతే, అన్ని సమయాల్లో ఇతరులకు సత్యం చెప్పడం, సత్యశీలతతో ఉండడం పూర్తిగా మరో విషయం. ఉదాహరణకు, అపవాది “సత్యమందు నిలిచి” ఉండాలని నిశ్చయించుకోలేదు. (యోహాను 8:​44) దానికి భిన్నంగా, యెహోవా ‘విస్తారమైన సత్యముగలవాడు.’ (నిర్గమకాండము 34:⁠6) లేఖనాలు యెహోవా సత్యశీలతకు పొందికగా సాక్ష్యమిస్తున్నాయి. ‘దేవుడు అబద్ధమాడజాలడని,’ దేవుడు ‘అబద్ధమాడనేరడని’ అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (హెబ్రీయులు 6:17; తీతు 1:⁠1) సత్యశీలత దేవుని వ్యక్తిత్వంలో ఒక ప్రాముఖ్యమైన భాగం. యెహోవా సత్యవంతుడు కాబట్టి మనమాయన మీద ఆధారపడి ఆయనపై నమ్మకం ఉంచవచ్చు; ఆయనెన్నడూ తన భక్తులను మోసగించడు.

9 యెహోవా నామమే ఆయన సత్యశీలతకు సాక్ష్యమిస్తోంది. ఆ దైవిక నామానికి “తానే కర్త అవుతాడు” అని అర్థం. ఇదాయన వాగ్దానంచేసిన సమస్తాన్ని ప్రగతిపథంలో నెరవేర్చే కర్తగా యెహోవాను గుర్తిస్తుంది. వేరెవ్వరూ ఆ స్థానంలో లేరు. యెహోవా సర్వోన్నతుడు కాబట్టి, ఆయన సంకల్పాల నెరవేర్పును ఏదీ అడ్డగించలేదు. యెహోవా కేవలం సత్యవంతుడే కాదు తాను సెలవిచ్చిన సమస్తం నిజమయ్యేటట్లు చేయగల సామర్థ్యం, జ్ఞానం ఆయనకు మాత్రమే ఉన్నాయి.

10 యెహోవా సత్యశీలతను రుజువుచేసిన అపూర్వ సంఘటనలు కళ్ళారాచూసిన అనేకుల్లో యెహోషువ ఒకరు. యెహోవా ముందుగానే చెప్పి, ఐగుప్తు జనాంగం మీదికి పది తెగుళ్ళు తెచ్చినప్పుడు యెహోషువ ఆ దేశమందే ఉన్నాడు. యెహోషువ అనేక ఇతర సంఘటనలతోపాటు, ఐగుప్తునుండి ఇశ్రాయేలీయులను విడిపిస్తాననీ వారిని ఎదిరించిన శక్తిమంతమైన కనాను సైన్యాలను ఓడించి ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలోకి నడిపిస్తాననీ యెహోవా చేసిన వాగ్దానాల నెరవేర్పును చూశాడు. యెహోషువ తన జీవిత చరమాంకంలో ఇశ్రాయేలు జనాంగ పెద్దలకిలా చెప్పాడు: “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.” (యెహోషువ 23:​14) యెహోషువ చూసిన అద్భుతాలను మీరు చూడకపోయినా, మీ జీవితకాలంలో దేవుని వాగ్దానాల సత్యశీలతను మీరనుభవించారా?

యెహోవా సత్యం వెల్లడిచేస్తాడు

11 అపారమైన జ్ఞానంవున్నా తన పిల్లలతో అరుదుగా మాట్లాడే ఒక తల్లి లేదా తండ్రిని ఊహించుకోండి. యెహోవా అలా ఉండనందుకు మీరు కృతజ్ఞత కలిగిలేరా? మానవజాతితో యెహోవా ప్రేమపూర్వకంగా సంభాషిస్తాడు, అదీ ఉదారంగా. లేఖనాలు ఆయనను ‘మహోపదేశకుడని’ పిలుస్తున్నాయి. (యెషయా 30:20, NW) ఆయన తన ప్రేమపూర్వక దయను బట్టి తానుచెప్పేది వినడానికి మొగ్గుచూపని వారికి సహితం ఆయన తెలియజెప్పుచున్నాడు. ఉదాహరణకు, చెవియొగ్గరని తనకు తెలిసిన వారికి ప్రకటించేందుకు యెహోవా యెహెజ్కేలును నియమించాడు. యెహోవా ఇలాచెప్పాడు: “నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము.” ఆ పిమ్మట ఆయనిలా హెచ్చరించాడు: “అయితే ఇశ్రాయేలీయులందరు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై, నేను చెప్పిన మాటల నాలకింపనొల్లక యున్నారు గనుక నీ మాటలు విననొల్లరు.” అదొక కష్టభరితమైన నియామకం, అయితే యెహెజ్కేలు నమ్మకంగా ఆ పని నెరవేర్చాడు, అలా చేయడంలో ఆయన యెహోవా కనికరాన్ని ప్రతిబింబించాడు. ఒకవేళ మీరు సవాలుదాయకమైన ప్రకటనా నియామకంలో ఉండి దేవునిపై ఆధారపడితే, ఆయన తన ప్రవక్తయగు యెహెజ్కేలును బలపరచినట్లే మిమ్మును కూడా బలపరుస్తాడని నమ్మకంతో ఉండవచ్చు.​—⁠యెహెజ్కేలు 3:4, 7-9.

12 “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని” యెహోవా ఇచ్ఛయిస్తున్నాడు. (1 తిమోతి 2:⁠4) ఆయన ప్రవక్తల ద్వారా, దేవదూతల ద్వారా, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కూడా మాట్లాడాడు. (హెబ్రీయులు 1:1, 2; 2:⁠2) పిలాతుకు యేసు ఇలా చెప్పాడు: “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట విను[ను].” స్వయంగా దేవుని కుమారునినుండే రక్షణ కొరకు యెహోవాచేసిన ఏర్పాటు గురించి సత్యం తెలుసుకునే అమూల్యమైన అవకాశం పిలాతుకు లభించింది. అయితే, పిలాతు సత్యం పక్షంగాలేడు, యేసునుండి నేర్చుకోవడం అతనికిష్టంలేదు. బదులుగా పిలాతు హేళనగా, “సత్యమనగా ఏమిటి?” అని బదులు పలికాడు. (యోహాను 18:​37, 38) అతని విషయంలో అదెంత విచారకరమో గదా! అయినప్పటికీ, యేసు ప్రకటించిన సత్యం అనేకులు విన్నారు. ఆయన తన శిష్యులకిలా చెప్పాడు: “మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.”​—⁠మత్తయి 13:⁠16.

13 యెహోవా బైబిల్లో సత్యం భద్రపరిచాడు, ప్రతిచోటగల ప్రజలకు దానిని అందుబాటులోకి తెచ్చాడు. బైబిలు సత్యవంతంగా విషయాలను వెల్లడిచేస్తోంది. అది దేవుని గుణలక్షణాలను, సంకల్పాలను, ఆజ్ఞలను అలాగే మానవజాతి వ్యవహారాల నిజమైన స్థితిగతులను విశదపరుస్తోంది. యెహోవాకు చేసిన ప్రార్థనలో యేసు ఇలా అన్నాడు: “నీ వాక్యమే సత్యము.” (యోహాను 17:​17) దీని కారణంగా బైబిలు ఒక ఉత్కృష్ట గ్రంథం. అది మాత్రమే, సమస్తం ఎరిగిన దేవుని ప్రేరణతో వ్రాయబడింది. (2 తిమోతి 3:​16) మానవజాతికి అదొక అమూల్యమైన బహుమానం, దేవుని సేవకులు దానిని ఎంతో విలువైనదిగా ఎంచుతారు. మనం దానిని ప్రతిదినం చదవడం జ్ఞానదాయకం.

సత్యాన్ని గట్టిగా చేపట్టండి

14 యెహోవా తన వాక్యంలో మనకు చెప్పేవాటిని మనం గంభీరంగా తీసుకోవాలి. తానెవరని ఆయన చెబుతున్నాడో అదే ఆయన, తానేమి చేస్తానని ఆయన చెబుతాడో ఖచ్చితంగా ఆయనది చేస్తాడు. దేవునియందు నమ్మకముంచేందుకు మనకు ప్రతివిధమైన కారణముంది. “దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన” చేస్తానని యెహోవా చెబుతున్నప్పుడు మనమావిషయం నమ్మవచ్చు. (2 థెస్సలొనీకయులు 1:⁠6) నీతిని వెంబడించే ప్రజలను ప్రేమిస్తాననీ విశ్వాసముంచే వారికి నిత్యజీవమిస్తాననీ వేదన, ఏడ్పు, చివరకు మరణం కూడా లేకుండా చేస్తాననీ యెహోవా చెప్పినప్పుడు మనం ఆయన మాటలను నిశ్చయంగా నమ్మవచ్చు. “ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని” అపొస్తలుడైన యోహానుకు ఈ ఆదేశం ఇవ్వడం ద్వారా, యెహోవా ఈ చివరి వాగ్దాన నమ్మకత్వాన్ని నొక్కిపలుకుతున్నాడు.​—⁠ప్రకటన 21:4, 5; సామెతలు 15:9; యోహాను 3:36.

15 సాతాను యెహోవాకు పూర్తి వ్యతిరేకం. జ్ఞానం కలిగించడానికి బదులు అతడు మోసంచేస్తాడు. స్వచ్ఛారాధననుండి ప్రజలను తప్పుదారి పట్టించాలనే తన లక్ష్యసాధనకు, సాతాను అనేక అబద్ధాలను ప్రచారం చేస్తున్నాడు. ఉదాహరణకు, దేవుడు మన మనోభావాలకు దూరంగా ఉంటాడని, భూమ్మీది బాధలను పట్టించుకోడని మనం నమ్మేలా చెయ్యాలని సాతాను ఉద్దేశిస్తున్నాడు. అయితే, యెహోవాకు తన ప్రాణులయెడల మిక్కిలి శ్రద్ధవుందని, చెడును బాధనుచూసి ఆయన నొచ్చుకుంటాడని బైబిలు చూపిస్తోంది. (అపొస్తలుల కార్యములు 17:​24-30) అలాగే ప్రజలు ఆధ్యాత్మిక సంగతులను వెంబడించడం సమయం వృథా అనికూడా నమ్మాలని సాతాను కోరుకుంటున్నాడు. దానికి భిన్నంగా, “మీరు చేసిన కార్యమును . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు” అని లేఖనాలు మనకు హామీ ఇస్తున్నాయి. అంతేకాక, ఆయన “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడని” కూడా అవి స్పష్టంగా చెబుతున్నాయి.​—⁠హెబ్రీయులు 6:10; 11:6.

16 సాతాను గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.” (2 కొరింథీయులు 4:⁠4) అపవాదియగు సాతాను హవ్వను మోసగించినట్లే కొందరిని బహుగా మోసగించాడు. మరితరులు మోసగింపబడక ఉద్దేశపూర్వకంగా అవిధేయతా మార్గాన్ని ఎంచుకున్న ఆదాము విధానాన్ని అనుసరిస్తారు. (యూదా 5, 11) అందుకని, క్రైస్తవులు అప్రమత్తంగా ఉండి, సత్యాన్ని గట్టిగా చేపట్టడం ఆవశ్యకం.

యెహోవా “నిష్కపటమైన విశ్వాసము”ను కోరుతున్నాడు

17 యెహోవా తన మార్గాలన్నింటిలో సత్యవంతుడైనందున, తనను ఆరాధించేవారందరు కూడా సత్యవంతులుగా ఉండాలని ఆయన అపేక్షిస్తున్నాడు. కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముమీద నివసింపదగినవాడెవడు? యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే.” (కీర్తన 15:​1, 2) ఆ పదాలు పాడిన యూదులకు యెహోవా పరిశుద్ధ పర్వత ప్రస్తావన నిస్సందేహంగా సీయోను పర్వతాన్ని మదిలోకి తెచ్చివుంటుంది. ఆ పర్వతంమీదే దావీదు రాజు గుడారం నెలకొల్పి నిబంధన మందసాన్ని అక్కడికి తెచ్చాడు. (2 సమూయేలు 6:​12, 17) ఆ పర్వతం, ఆ గుడారం యెహోవా సూచనార్థకంగా నివసించిన స్థలాన్ని జ్ఞాపకం చేస్తాయి. దేవుని అనుగ్రహాన్ని వేడుకొనేందుకు ప్రజలక్కడ ఆయనను సమీపించగలిగేవారు.

18 యెహోవా స్నేహంకోరే ఏ వ్యక్తయినా కేవలం పెదవులతో కాదుగాని “హృదయపూర్వకముగా” సత్యం మాట్లాడాలి. దేవుని నిజ స్నేహితులు హృదయమందు నిజాయితీ గలవారై “నిష్కపటమైన విశ్వాసము”నకు రుజువివ్వాలి. ఎందుకంటే సత్యప్రమాణ క్రియలు హృదయంనుండి వస్తాయి. (1 తిమోతి 1:5; మత్తయి 12:​34, 35) “కపటము [చూపువారు] . . . యెహోవాకు అసహ్యులు” కాబట్టి దేవుని స్నేహితుడు వక్ర స్వభావిగా లేదా మోసకారిగా ఉండడు. (కీర్తన 5:⁠6) ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు తమ దేవుణ్ణి అనుకరిస్తూ సత్యవంతంగా ఉండేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ అంశాన్ని తర్వాతి ఆర్టికల్‌ పరిశీలిస్తుంది.

మీరెలా సమాధానమిస్తారు?

• ప్రతిదానిని గురించిన సత్యం యెహోవాకు ఎందుకు తెలుసు?

• యెహోవా సత్యవంతుడని ఏది చూపిస్తోంది?

• యెహోవా సత్యమెలా వెల్లడిచేశాడు?

• సత్యానికి సంబంధించి, మననుండి ఏమి కోరబడుతోంది?

[అధ్యయన ప్రశ్నలు]

1. అసత్యమే లేని కాలంలో పరలోకమందు, భూమ్మీద ఎలాంటి పరిస్థితులున్నాయి?

2. అసత్యం ఎవరు పుట్టించారు, ఎందుకు?

3. సాతాను అబద్ధాలకు ఆదాముహవ్వలు ఎలా ప్రతిస్పందించారు, దాని ఫలితాలేమిటి?

4. (ఎ) ఏదెనులో ఎలాంటి అబద్ధాలు చెప్పబడ్డాయి? (బి) సాతానుచే మోసగించబడకుండా ఉండాలంటే మనమేమి చెయ్యాలి?

5, 6. (ఎ) యెహోవాకు ఎలాంటి జ్ఞానముంది? (బి) యెహోవా పరిజ్ఞానానికి మానవ పరిజ్ఞానానికి ఎలాంటి పోలికవుంది?

7. యెహోవా పరిజ్ఞానం గురించి దావీదు ఏమి గుర్తించాడు, కాబట్టి మనమేమి అంగీకరించాలి?

8. యెహోవా సత్యవంతుడని మనకెలా తెలుసు?

9. యెహోవా నామం సత్యంతో ఎలా ముడిపడి ఉంది?

10. (ఎ) యెహోవా సత్యశీలతను యెహోషువ ఎలా చూశాడు? (బి) యెహోవా చేసిన ఏ వాగ్దానాలు నెరవేరడం మీరు చూశారు?

11. మానవజాతికి సత్యం తెలియజేయాలని యెహోవా కోరుతున్నాడని ఏది చూపిస్తోంది?

12, 13. ఏయే విధాలుగా దేవుడు మానవులకు సత్యాన్ని తెలియజెప్పాడు?

14. యెహోవా తాను చేస్తానని చెప్పిన కొన్ని సంగతులేమిటి, మనమాయనను ఎందుకు నమ్మాలి?

15. సాతాను ప్రచారం చేసే కొన్ని అబద్ధాలేమిటి?

16. క్రైస్తవులు ఎందుకు అప్రమత్తంగా ఉండి, సత్యాన్ని గట్టిగా చేపట్టాలి?

17. యెహోవా అనుగ్రహం పొందేందుకు మనం ఏమి చెయ్యాలి?

18. (ఎ) దేవునితో స్నేహానికి ఏమి అవసరం? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చర్చించబడుతుంది?

[10వ పేజీలోని చిత్రాలు]

సత్యదేవునికి తాను సృష్టించిన ప్రతిదానిని గురించి తెలుసు

[12, 13వ పేజీలోని చిత్రాలు]

యెహోవా వాగ్దానాలు నిజమౌతాయి