కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆయన కనికరమును ప్రేమించాడు

ఆయన కనికరమును ప్రేమించాడు

ఆయన కనికరమును ప్రేమించాడు

యెహోవాసాక్షుల పరిపాలక సభ దీర్ఘకాల సభ్యుడైన మిల్టన్‌ జి. హెన్షెల్‌, 2003 మార్చి 22, శనివారం తన భూజీవితం చాలించారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు.

మిల్టన్‌ హెన్షెల్‌ యౌవనుడిగా ఉన్నప్పుడు యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయంలో చేరి 60 సంవత్సరాలకుపైగా నమ్మకంగా సేవచేశాడు. అనతికాలంలోనే తన తెలివితేటలకు, రాజ్య ప్రకటనా పనిలో యథార్థమైన ఆసక్తికి పేరుగాంచాడు. అప్పట్లో యెహోవాసాక్షుల బ్రూక్లిన్‌ ముద్రణాలయ పైవిచారణకర్తగావున్న ఎన్‌. హెచ్‌. నార్‌కు ఆయన 1939లో కార్యదర్శి అయ్యాడు. ప్రపంచవ్యాప్త సాక్షులమధ్య 1942లో సహోదరుడు నార్‌ నాయకత్వం వహించడం ఆరంభించినప్పుడు ఆయన, సహోదరుడు హెన్షెల్‌ను తన సహాయకునిగా పెట్టుకున్నాడు. సహోదరుడు హెన్షెల్‌ 1956లో లూసీల్‌ బెన్నెట్‌ను వివాహం చేసుకున్నాడు. వారిరువురు జీవిత ఆనందాలను, సవాళ్లను కలిసి పంచుకున్నారు.

సహోదరుడు హెన్షెల్‌, 1977లో నార్‌ చనిపోయేవరకు సహోదరుడు నార్‌తో సన్నిహితంగా కలిసిపనిచేశాడు. తరచూ సహోదరుడు నార్‌తో కలిసి సహోదరుడు హెన్షెల్‌ ప్రపంచవ్యాప్తంగావున్న యెహోవాసాక్షులను ప్రత్యేకంగా మిషనరీలను, బ్రాంచి కార్యాలయాలందున్న వారిని సందర్శిస్తూ ప్రోత్సహిస్తూ 150 దేశాలకుపైగా ప్రయాణించాడు. అలాంటి ప్రయాణాలు కొన్నిసార్లు చాలాకష్టంగా, ప్రమాదభరితంగా కూడా ఉండేవి. లైబీరియాలో 1963లో ఒక సమావేశానికి వెళ్లినప్పుడు, దేశభక్తి ఆచరణలో పాలుపంచుకోవడానికి నిరాకరించినందుకు సహోదరుడు హెన్షెల్‌ క్రూరమైన హింస అనుభవించాడు. * అయినా సహోదరుడు హెన్షెల్‌ ఏమాత్రం భయపడకుండా, ఆ దేశాధ్యక్షుని కలిసి అక్కడ యెహోవాసాక్షుల ఆరాధన కోసం మరియెక్కువ స్వేచ్ఛను కోరేందుకు కొద్దినెలల వ్యవధిలోనే తిరిగి లైబీరియాకు వెళ్లాడు.

కష్టభరితమైన సమస్యలు, సవాళ్లతో వ్యవహరించడంలో ఆచరణాత్మక విధానం గలవాడని, మృదు స్వభావని, సమంజసంగా ఉంటాడని సహోదరుడు హెన్షెల్‌కు మంచి పేరుంది. ఆయన తోటిపనివారు ప్రత్యేకంగా ఆయన క్రమాన్ని, నమ్రతను, ఆయన హాస్య ధోరణిని విలువైనవిగా పరిగణిస్తారు. అసాధారణ జ్ఞాపకశక్తి వరంతో ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మిషనరీల పేర్లు గుర్తుపెట్టుకొని వారితో, స్థానిక భాషలో ఒకటిరెండు పదబంధాలను, ఒకే పదానికుండే రెండురకాల అర్థాలను చమత్కారంగా కళ్లనిండా మెరుపుతో మాట్లాడుతూ వారిని ఆనందపరిచేవాడు.

మనం ‘కనికరమును ప్రేమించాలని’ యెహోవా దేవుడు కోరుతున్నట్టు మీకా 6:8 మనకు గుర్తుచేస్తోంది. ఆ విషయంలో మిల్టన్‌ హెన్షెల్‌ మంచి మాదిరిగా పేరు సంపాదించుకున్నాడు. ఆయనకు బాధ్యతా బరువెంతున్నా, సమీపింపదగిన వానిగా, మృదుస్వభావిగా, దయాపరునిగా ఆయన నిలిచాడు. “ఒక పరిస్థితితో ఎలా వ్యవహరించాలో నిర్ణయించుకునేటప్పుడు దయచూపడమే సరైనపని” అని చెప్పడానికి ఆయన ఇష్టపడేవాడు. ఈ సహోదరుని కోల్పోవడం మనకు దుఃఖదాయకమైనా, ఆయన అంతం వరకు నమ్మకంగా సహించాడని, ‘జీవకిరీటమనే’ ప్రతిఫలం ఆయనకు నిశ్చయంగా లభిస్తుందని మనం ఆనందిస్తాం.​—⁠ప్రకటన 2:10.

[అధస్సూచి]

^ పేరా 4 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం 1977, (ఆంగ్లం) 171-7 పేజీలు చూడండి.

[31వ పేజీలోని చిత్రం]

ఎన్‌. హెచ్‌. నార్‌తో ఎమ్‌. జి. హెన్షెల్‌

[31వ పేజీలోని చిత్రం]

తన భార్య లూసీల్‌తో