కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం ఎల్లప్పుడు యెహోవా నామము స్మరిస్తూ నడుచుకుంటాం!

మనం ఎల్లప్పుడు యెహోవా నామము స్మరిస్తూ నడుచుకుంటాం!

మనం ఎల్లప్పుడు యెహోవా నామము స్మరిస్తూ నడుచుకుంటాం!

“మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.”​—మీకా 4:⁠5.

మీకాను ప్రవక్తగా ఉపయోగించుకొని యెహోవా తన ప్రజలకొక విషయం చెప్పాలనుకుంటున్నాడు. తప్పిదస్థులపై చర్య తీసుకోవడం ఆయన సంకల్పం. ఇశ్రాయేలు మతభ్రష్టత్వం కారణంగా ఆయన దానిని శిక్షించబోతున్నాడు. అయితే, సంతోషకరమైన విషయమేమంటే, తన నామం స్మరిస్తూ నడిచేవారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. మీకా ప్రవచనంలోని 3 నుండి 5 అధ్యాయాల్లో ఈ సందేశాలు స్పష్టంగా ఉన్నాయి.

2 దేవుని ప్రవక్త ఇలా ప్రకటిస్తున్నాడు: “యాకోబు సంతతియొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి; న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే గదా?” అవును, అదే వారి ధర్మమైయుండాలి, కానీ నిజానికి వారేం చేస్తున్నారు? మీకా ఇలా అంటున్నాడు: “మేలు నసహ్యించుకొని కీడుచేయ నిష్టపడుదురు, నా జనుల చర్మము ఊడదీసి వారి యెముకలమీది మాంసము చీల్చుచుందురు; నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి యెముకలను విరిచి, ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయునట్టు బానలో వేయు మాంసముగా వారిని తుత్తునియలుగా పగులగొట్టియున్నారు.”​—⁠మీకా 3:1-3.

3 నాయకులు పేదలను, బలహీనులను ఎంతగా అణచివేస్తున్నారో గదా! ఇక్కడ వ్రాయబడిన అలంకారార్థ భాష, మీకా చెప్పేది వినే వారికి సులభంగా అర్థమౌతుంది. వధించిన గొఱ్ఱెను ఉడికించడానికి ముందు దాని చర్మం తీసి మాంసం కీళ్ళు వేరు చేస్తారు. కొన్నిసార్లు మూలగ బయటికి లాగేందుకు ఎముకలు విరుస్తారు. మీకా ప్రస్తావించినలాంటి పెద్ద కుండలో వేసి ఎముకల్ని, మాంసాన్ని ఉడికిస్తారు. (యెహెజ్కేలు 24:​3-5, 10) మీకా కాలంలోని ప్రజలు తమ దుష్ట నాయకుల చేతుల్లో అనుభవిస్తున్న దౌర్జన్యపూరిత బాధలకు అది ఎంత సరైన ఉపమానం!

మనం న్యాయంగా ఉండాలని యెహోవా అపేక్షిస్తున్నాడు

4 ప్రేమగల కాపరియైన యెహోవాకు, ఇశ్రాయేలు నాయకులకు మధ్య గమనించదగ్గ వ్యత్యాసం ఉంది. వారు న్యాయం జరిగించరు కాబట్టి మందను కాపాడమని ఇవ్వబడిన ఆజ్ఞను పాటించడంలో విఫలమవుతారు. బదులుగా, వారు అలంకారార్థ గొఱ్ఱెల్ని స్వార్థంతో దోచుకుంటూ, వారికి అన్యాయంచేస్తూ, మీకా 3:10లో పేర్కొనబడినట్లు ‘నరహత్యకు’ పాల్పడుతున్నారు. ఈ పరిస్థితి నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

5 తన ప్రజల నాయకులు న్యాయం జరిగించాలని దేవుడు కోరుతున్నాడు. యెహోవా సేవకుల మధ్య నేడు మనకిది నిజంగా కనిపిస్తుంది. అంతేగాక, ఇది యెషయా 32:1కి పొందికగావుంది, అక్కడ మనమిలా చదువుతాము: “ఆలకించుడి! రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును; అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.” అయితే మీకా కాలంలో మనకేం కనిపిస్తుంది? ‘మేలు నసహ్యించుకొని కీడు చేయడానికి ఇష్టపడేవారు’ న్యాయాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు.

ఎవరి ప్రార్థనలు అంగీకరింపబడతాయి?

6 మీకా సమకాలీనులు యెహోవా అనుగ్రహం ఆశించగలరా? ఏమాత్రం ఆశించలేరు. మీకా 3:4 ఇలా చెబుతోంది: “వారు దుర్మార్గత ననుసరించి నడుచుకొనియున్నారు గనుక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండ తన్ను మరుగుచేసికొనును.” ఇది చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని నొక్కి చెబుతోంది.

7 మనం అలవాటుగా పాపంచేస్తూ ఉంటే యెహోవా మన ప్రార్థనలు అంగీకరించడు. దేవునికి నమ్మకంగా సేవచేస్తున్నట్టు నటిస్తూ, తప్పు దాచిపెట్టి ద్వంద్వ జీవితం గడుపుతుంటే నిశ్చయంగా మన ప్రార్థనలు అంగీకరింపబడవు. కీర్తన 26:4 ప్రకారం దావీదు ఇలా ఆలపించాడు: “పనికిమాలినవారితో నేను సాంగత్యము చేయను; వేషధారులతో పొందుచేయను.” బుద్ధిపూర్వకంగా తన వాక్యాన్ని ఉల్లంఘించేవారి ప్రార్థనలను యెహోవా ఇంకెంత తక్కువ అంగీకరిస్తాడో గదా!

దేవుని ఆత్మచే బలపర్చబడడం

8 ఇశ్రాయేలు నాయకులు ఎంత నీచకార్యాలు చేస్తున్నారో గదా! అబద్ధ ప్రవక్తలు, దేవుని ప్రజలు ఆధ్యాత్మికంగా దారితప్పి తిరిగేలా చేస్తున్నారు. దురాశాపరులైన నాయకులు “సమాధానమని” ప్రకటిస్తారు గానీ ‘తమ నోట ఆహారము పెట్టని వానిమీద యుద్ధం ప్రకటిస్తారు.’ అందుకే యెహోవా ఇలా అంటున్నాడు: “మీకు దర్శనము కలుగకుండ రాత్రికమ్మును, సోదె చెప్పకుండ మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండ అస్తమించును, పగలు చీకటిపడును. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునొందుదురు, సోదెగాండ్రు తెల్లబోవుదురు. . . . నోరు మూసికొందురు.”​—⁠మీకా 3:5-7.

9 ‘నోరు మూసుకోవడం’ ఎందుకు? మీకా సమకాలీన దుష్టులు సిగ్గుతో అలా నోరుమూసుకుంటారు. కీడుతలపెట్టు ఈ మనుషులు సిగ్గుపడాల్సిందే. వాళ్ళకు సంబంధించినంత వరకు ‘దేవుడు ప్రత్యుత్తరమియ్యడు.’ (మీకా 3:7) అహంకారం నిండిన దుష్టులెవ్వరి ప్రార్థనలూ యెహోవా వినడు.

10 మీకా ‘నోరు మూసుకోవలసిన’ అవసరం లేదు. ఆయన సిగ్గు పడలేదు. యెహోవా ఆయన ప్రార్థనలు అంగీకరిస్తాడు. మీకా 3:⁠8 గమనించండి, అక్కడ నమ్మకస్థుడగు ఆ ప్రవక్త ఇలా చెబుతున్నాడు: “నేనైతే . . . యెహోవా ఆత్మావేశముచేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనై యున్నాను.” నమ్మకమైన తన సుదీర్ఘ పరిచర్య అంతటిలో సదా “యెహోవా ఆత్మావేశముచేత బలముతో” నింపబడినందుకు మీకా ఎంత కృతజ్ఞుడై ఉన్నాడో గదా! ‘యాకోబు సంతతివారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకు’ ఇది ఆయనకు కావలసిన బలాన్ని ఇచ్చింది.

11 దేవుని ప్రతికూల తీర్పు సందేశం ప్రకటించడానికి మీకాకు మానవ బలంకంటే మరెక్కువ బలం అవసరం. యెహోవా ఆత్మ లేదా చురుకైన శక్తి ఆవశ్యకం. మరి మన విషయమేమిటి? యెహోవా మనకు తన పరిశుద్ధాత్మనిచ్చి బలపరిస్తేనే మనం ప్రకటనా పనిని నెరవేర్చగలము. మనం పాపంలో బుద్ధిపూర్వకంగా కొనసాగుతూ ఉంటే, ప్రకటించడానికి మనంచేసే ప్రయత్నాలు ఘోరంగా విఫలమవుతాయి. అలాంటప్పుడు ఈ పని చేయడానికి కావలసిన బలం కోసం మనం చేసే ప్రార్థనలను దేవుడు అంగీకరించడు. “యెహోవా ఆత్మావేశము” మనపై లేకుండా మన పరలోక తండ్రి తీర్పు సందేశాలను మనం ప్రకటించలేము. అంగీకరింపబడిన ప్రార్థనల ద్వారా, పరిశుద్ధాత్మ సహాయంతో, మీకా వలెనే మనం దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించగలుగుతున్నాము.

12 బహుశా మీకు అపొస్తలుల కార్యములు 4:​23-31లోని వృత్తాంతం గుర్తురావచ్చు. యేసు మొదటి శతాబ్దపు శిష్యుల్లో మీరూ ఒకరని ఊహించుకోండి. ఛాందసవాద హింసకులు క్రీస్తు అనుచరుల నోరు మూయించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ యథార్థవంతులు తమ సర్వోన్నత ప్రభువును వేడుకుంటూ ఇలా ప్రార్థించారు: “ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి . . . నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.” దాని ఫలితం? వారు ప్రార్థన చేయగా వారు కూడియున్న చోటు కంపించింది, అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. కాబట్టి మనం మన పరిచర్యను కొనసాగిస్తుండగా ప్రార్థనాపూర్వకంగా యెహోవా వైపుచూస్తూ, పరిశుద్ధాత్మ ద్వారా ఆయనిచ్చే సహాయంపై ఆధారపడుదము గాక.

13 ఇప్పుడు మరలా మీకా కాలం గురించి ఆలోచించండి. మీకా 3:​9-12 ప్రకారం, రక్తాపరాధ పాలకులు లంచాలు తీసుకొని న్యాయం తీరుస్తున్నారు, యాజకులు కూలికి బోధిస్తున్నారు, అబద్ధ ప్రవక్తలు ద్రవ్యం కోసం సోదె చెబుతున్నారు. కాబట్టి, యూదా రాజధాని యెరూషలేము “రాళ్లకుప్ప” అవుతుందని దేవుడు ప్రకటించడంలో ఆశ్చర్యం లేదు! ఇశ్రాయేలులో కూడా అబద్ధ ఆరాధన, నైతిక భ్రష్టత్వం పెచ్చరిల్లినందున, దేవుడు షోమ్రోనును “రాళ్లకుప్ప” చేస్తాడని దైవావేశంతో మీకా హెచ్చరించాడు. (మీకా 1:⁠6) వాస్తవానికి, ప్రవచించబడిన విధంగా అష్షూరు సైన్యాలు సా.శ.పూ. 740లో షోమ్రోనును నాశనం చేసినప్పుడు చూసేందుకు ఆయన బ్రతికేవుంటాడు. (2 రాజులు 17:​5, 6; 25:​1-21) యెరూషలేము షోమ్రోనులపై ఈ తీవ్ర సందేశాలను కేవలం యెహోవా బలంతోనే ప్రకటించడం సాధ్యమని స్పష్టమవుతోంది.

14 యెహోవా ప్రతికూల తీర్పును యూదా ఏమాత్రం తప్పించుకోలేదు. మీకా 3:⁠12లో వ్రాయబడిన ప్రవచన నెరవేర్పుగా సీయోను ‘చేను వలె దున్నబడుతుంది.’ మన 21వ శతాబ్దంనుండి చూస్తే, సా.శ.పూ. 607లో బబులోనీయులు యూదా యెరూషలేములను నాశనం చేసినప్పుడు అలా జరిగిందని మనకు తెలుసు. మీకా ప్రవచించిన అనేక సంవత్సరాల తర్వాత అది సంభవించింది, కానీ ఆ నాశనం వస్తోందని ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ప్రవచించబడిన ‘దేవుని దినమున’ ప్రస్తుత దుష్ట విధానం అంతమవుతుందని మనం కూడా అంతే దృఢ నమ్మకంతో ఉండాలి.​—⁠2 పేతురు 3:​11, 12.

యెహోవా విషయాలను చక్కబెడతాడు

15 మనమొకసారి వెనక్కి చూస్తే, మీకా ఆ తర్వాత పులకరింపజేసే నిరీక్షణా సందేశం ప్రకటించడం చూస్తాము. మీకా 4:​1-4లో మనమెంత హృద్యమైన మాటలు చదువుతామో గదా! మీకా పలికిన మాటల్లో కొంత భాగమిలావుంది: “అంత్యదినములలో యెహోవా మందిరపర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. . . . ఆయన మధ్యవర్తియై అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగకొట్టుదురు. జనముమీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును, యుద్ధముచేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును; సైన్యములకధిపతియగు యెహోవా మాట యిచ్చియున్నాడు.”

16 ఇక్కడ ప్రస్తావించబడిన ‘అనేక జనములు’ ‘బలముగల అన్యజనులు’ ఎవరు? వారు ఈ లోకపు దేశాలు, ప్రభుత్వాలు కాదు. బదులుగా, ఆ ప్రవచనం యెహోవా సత్యారాధనా పర్వతంమీద పవిత్రసేవ చేయడానికి ఐక్యమైన, సమస్త జనాంగాలనుండి వచ్చిన ఆయావ్యక్తులకు అనువర్తిస్తుంది.

17 మీకా ప్రవచనానికి అనుగుణంగా, త్వరలోనే భూవ్యాప్తంగా యెహోవా స్వచ్ఛారాధన విస్తరిస్తుంది. నేడు “నిత్యజీవం పట్ల సరైన మనోవైఖరి” గల ప్రజలు యెహోవా మార్గాల్లో ఉపదేశింపబడుతున్నారు. (అపొస్తలుల కార్యములు 13:​48, NW) రాజ్యం పక్షం వహించే విశ్వాసులకు, ఆధ్యాత్మికంగా యెహోవా సంగతులను చక్కబెడుతూ ‘న్యాయము తీరుస్తున్నాడు.’ “గొప్పసమూహము”లో భాగంగా వారు “మహాశ్రమ” తప్పించుకుంటారు. (ప్రకటన 7:​9, 14) తమ ఖడ్గములను నాగటినక్కులుగా సాగగొట్టుకొన్నవారై వారు నేడు సహితం తమ తోటి యెహోవాసాక్షులతో, ఇతరులతో సమాధానంగా జీవిస్తున్నారు. వారి మధ్యన ఉండడం ఎంత ఆనందకరమో గదా!

యెహోవా నామమును స్మరిస్తూ నడిచేందుకు తీర్మానించుకోవడం

18 మన కాలంలో, భయం కారు మేఘంలా భూమిని ఆవరిస్తుండగా, అనేకులు యెహోవా మార్గాల గురించి నేర్చుకోవడం మనల్ని పులకరింపజేస్తుంది. త్వరలో రాబోతున్న ఆ సమయం కోసం అంటే దేవుని ప్రేమించే వారందరూ యుద్ధంచేయ నేర్చుకోవడం మానుకోవడమే కాకుండా, తమ స్వంత ద్రాక్షచెట్టు క్రిందా, అంజూరపు చెట్టు క్రిందా కూర్చునే సమయం కోసం మనమెంతగానో ఎదురుచూస్తున్నాం. అంజూరపు చెట్లు సాధారణంగా ద్రాక్షతోటల్లో నాటబడతాయి. (లూకా 13:⁠6) ఒకరు తమ స్వంత అంజూరపు చెట్టు క్రింద, ద్రాక్షచెట్టు క్రింద కూర్చోవడం సమాధానకరమైన, సుభిక్షమైన, సురక్షితమైన పరిస్థితులను సూచిస్తుంది. ఇప్పుడు సహితం, యెహోవాతో మనకున్న సంబంధం మనకు మనశ్శాంతిని, ఆధ్యాత్మిక భద్రతను ఇస్తుంది. రాజ్య పరిపాలన క్రింద అలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు, మనం నిర్భయంగా సంపూర్ణంగా సురక్షితంగా ఉంటాం.

19 దైవానుగ్రహం, ఆశీర్వాదం పొందడానికి మనం యెహోవా నామము స్మరిస్తూ నడుచుకోవాలి. మీకా 4:5లో ఇది గట్టిగా వ్యక్తపర్చబడింది, అక్కడ ప్రవక్త ఇలా తెలియజేస్తున్నాడు: “సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.” యెహోవా నామం స్మరిస్తూ నడుచుకోవడమంటే దానర్థం కేవలం ఆయన మా దేవుడని చెప్పుకోవడం కాదు. క్రైస్తవ కూటాల్లో, రాజ్య ప్రకటనాపనిలో పాల్గొనడం వంటివి ఆవశ్యకమైనవైనా వాటికంటే ఇంకా ఎక్కువే అది కోరుతుంది. మనం యెహోవా నామం స్మరిస్తూ నడుస్తున్నామంటే, మనమాయనకు సమర్పించుకుని, పూర్ణాత్మ ప్రేమతో ఆయనను నమ్మకంగా సేవించేందుకు కృషిచేస్తున్న వారిగా ఉంటాం. (మత్తయి 22:37) మరియు ఆయన ఆరాధకులుగా, మనం మన దేవుడైన యెహోవా నామము నిత్యం స్మరిస్తూ నడుచుకోవడానికి తీర్మానించుకున్నాం.

20 ఇప్పుడు దయచేసి మీకా 4:​6-13లోని ప్రవచనార్థక మాటలు పరిశీలించండి. ‘సీయోను కుమారి బబులోను పురము వరకు’ చెరగా కొనిపోబడాలి. సా.శ.పూ. ఏడవ శతాబ్దంలో యెరూషలేము నివాసులకు సరిగ్గా అదే జరిగింది. ఏదేమైనా, ఒక శేషము యూదాకు తిరిగి వస్తుందని మీకా ప్రవచనం సూచిస్తోంది, కాగా సీయోను పునరుద్ధరణ సమయంలో దాని శత్రువులు నలుగగొట్టబడేలా యెహోవా చూస్తాడు.

21 మీకా 5వ అధ్యాయంలో ఇతర నాటకీయ పరిణామాలు ప్రవచింపబడ్డాయి. ఉదాహరణకు, మీకా 5:2-4లో ఏమి చెప్పబడిందో గమనించండి. దేవుని నియమిత పరిపాలకుడు అంటే “పురాతన కాలము” నుండి ఉన్నవాడు బేత్లెహేము నుండి వస్తాడని మీకా ప్రవచిస్తున్నాడు. ఆయన “యెహోవా బలము పొంది” కాపరిగా పరిపాలిస్తాడు. అంతేగాక, ఈ పరిపాలకుడు కేవలం ఇశ్రాయేలులోనే కాదు, “భూమ్యంతములవరకు” ప్రసిద్ధుడౌతాడు. ఆయనను గుర్తించడం సాధారణ ప్రపంచానికి గలిబిలిగా ఉండవచ్చేమోగానీ మనకది మర్మమేమీ కాదు.

22 బేత్లెహేములో ఇంతవరకు జన్మించిన వారిలోకెల్లా అత్యంత ప్రముఖుడైన వ్యక్తి ఎవరు? ‘భూమ్యంతములవరకు ప్రబలమయ్యేది’ ఎవరు? మరెవరోకాదు మెస్సీయ అయిన యేసుక్రీస్తే! మెస్సీయ ఎక్కడ జన్మిస్తాడని హేరోదు రాజు ప్రధానయాజకులను, శాస్త్రులను అడిగినప్పుడు వారు “యూదయ బేత్లెహేములో” అని సమాధానమిచ్చారు. వారు మీకా 5:2లోని మాటలు సహితం ఎత్తిచూపారు. (మత్తయి 2:​3-5) కొంతమంది సామాన్య ప్రజలకు కూడా ఈ విషయం తెలుసు, ఎందుకంటే యోహాను 7:​42, “క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా?” అని వారన్నట్లు ఉదహరించింది.

ప్రజలకు నిజమైన సేదదీర్పు

23మీకా 5:​5-15 అల్పకాలిక విజయం మాత్రమే సాధించే అష్షూరు దాడిని తెలియజేస్తూ, దేవుడు అవిధేయ జనాంగాలపై ప్రతీకారం తీర్చుకుంటాడని సూచిస్తోంది. మీకా 5:7 పశ్చాత్తప్త యూదా శేషం తమ స్వదేశానికి పునరుద్ధరింపబడుతుందని వాగ్దానం చేస్తోంది, అయితే ఈ మాటలు మనకాలానికి కూడా అన్వయిస్తాయి. మీకా ఇలా ప్రకటిస్తున్నాడు: “యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచువలెను, . . . గడ్డిమీదపడు వర్షమువలెను ఆ యా జనములమధ్యను నుందురు.” ఆధ్యాత్మిక యాకోబు లేదా ఇశ్రాయేలు శేషం ప్రజలకు దేవుడిచ్చిన ఆశీర్వాదంగా ఉంటారని ప్రవచించేందుకు ఈ సూచనార్థక మాటలు మనోహరంగా ఉపయోగింపబడ్డాయి. భూనిరీక్షణగల యేసు “వేరేగొఱ్ఱెలు” ఇతరులకు ఆధ్యాత్మిక నూతనోత్తేజం కలిగించేందుకు సహాయం చేయడంలో నేటి “దేవుని ఇశ్రాయేలు” శేషంతో భుజాలుకలిపి సేవ చేయడంలో ఆనందిస్తున్నారు. (యోహాను 10:16; గలతీయులు 6:16; జెఫన్యా 3:⁠9) ఈ సందర్భంగా, పునరాలోచించవలసిన విశేషమైన అంశమొకటుంది. రాజ్య ప్రచారకులుగా, మనందరం ఇతరులకు నిజమైన సేదదీర్పునిచ్చే మన ఆధిక్యతను అమూల్యమైనదిగా పరిగణించాలి.

24 మీకా ప్రవచనంలోని 3-5 అధ్యాయాల్లో మీరేం నేర్చుకున్నారు? బహుశా ఈ అంశాలు నేర్చుకుని ఉండవచ్చు: (1) తన ప్రజల్లోని నాయకులు న్యాయం తీర్చాలని దేవుడు అపేక్షిస్తాడు. (2) మనం బుద్ధిపూర్వకంగా అలవాటుగా పాపంచేస్తూ ఉంటే యెహోవా మన ప్రార్థనలు అంగీకరించడు. (3) దేవుడు తన పరిశుద్ధాత్మనిచ్చి మనల్ని బలపరిస్తేనే తప్ప మనకివ్వబడిన ప్రకటనా నియామకం నెరవేరదు. (4) దైవానుగ్రహం అనుభవించాలంటే, మనం తప్పక యెహోవా నామము స్మరిస్తూ నడవాలి. (5) రాజ్య ప్రచారకులుగా మనం, ప్రజలకు నిజమైన నూతనోత్తేజం కలిగించే మన ఆధిక్యతను అమూల్యంగా ఎంచాలి. మిమ్మల్ని మరితర అంశాలు కూడా ముగ్ధుల్ని చేసివుండవచ్చు. బైబిల్లోని ఈ ప్రవచన పుస్తకాన్నుండి మనం ఇంకా ఏమి నేర్చుకోగలం? విశ్వాసాన్ని బలపర్చే మీకా ప్రవచన చివరి రెండు అధ్యాయాలనుండి ఆచరణాత్మక పాఠాలు నేర్చుకోవడానికి తర్వాతి ఆర్టికల్‌ మనకు సహాయం చేస్తుంది.

మీరెలా సమాధానమిస్తారు?

• తన ప్రజల నాయకుల నుండి యెహోవా ఏమి ఆశిస్తాడు?

• యెహోవాకు మనంచేసే సేవ సంబంధంగా ప్రార్థన, పరిశుద్ధాత్మ ఎందుకు ప్రాముఖ్యం?

• ప్రజలెలా ‘యెహోవా నామము స్మరిస్తూ నడుచుకుంటారు’?

[అధ్యయన ప్రశ్నలు]

1. మీకా 3 నుండి 5 అధ్యాయాల్లో, ఏ సందేశాలున్నాయి?

2, 3. (ఎ) ఇశ్రాయేలు నాయకులు ఏ లక్షణం ప్రదర్శించాలి, అయితే వారు నిజానికి ఏమి చేస్తున్నారు? (బి) మీకా 3:​2, 3లోని అలంకారార్థ భాషయొక్క భావాన్ని మీరెలా వివరిస్తారు?

4. యెహోవాకు, ఇశ్రాయేలు నాయకులకు ఎలాంటి వ్యత్యాసముంది?

5. తన ప్రజల నాయకుల నుండి యెహోవా ఏమి కోరుతున్నాడు?

6, 7. మీకా 3:4లో ఏ ప్రాముఖ్యమైన అంశం నొక్కిచెప్పబడింది?

8. మీకా కాలంనాటి అబద్ధ ప్రవక్తలు దేనివిషయమై హెచ్చరింపబడ్డారు?

9, 10. ‘నోరు మూసుకోవడం’ అంటే అర్థమేమిటి, అలాచేయాల్సిన అవసరం మీకాకు ఎందుకు లేదు?

11. దేవుని సందేశాలు ప్రకటించడానికి మానవులు ఎలా బలపర్చబడ్డారు?

12. యేసు తొలి శిష్యులు ఎందుకు ఎడతెగక ‘బహు ధైర్యంగా దేవుని వాక్యం బోధించగల్గారు’?

13. యెరూషలేము షోమ్రోనులకు ఏమి సంభవిస్తుంది, ఎందుకు?

14. మీకా 3:⁠12లో వ్రాయబడిన ప్రవచనం ఎలా నెరవేరింది, అది మనపై ఎలాంటి ప్రభావం చూపాలి?

15. మీకా 4:​1-4లో వ్రాయబడిన ప్రవచనాన్ని మీరెలా వివరిస్తారు?

16, 17. మీకా 4:​1-4 నేడెలా నెరవేరుతోంది?

18. ‘స్వంత అంజూరపు చెట్టు క్రింద, ద్రాక్షచెట్టు క్రింద కూర్చోవడం’ దేనికి సూచనగా ఉంది?

19. యెహోవా నామము స్మరిస్తూ నడుచుకోవడమంటే దానర్థమేమిటి?

20. మీకా 4:​6-13లో ఏమి ప్రవచింపబడింది?

21, 22. మీకా 5:2 ఎలా నెరవేరింది?

23. మీకా 5:7 నెరవేర్పుగా ఇప్పుడేమి జరుగుతోంది?

24. మీకా 3 నుండి 5 అధ్యాయాల్లోని ఏ అంశాలు మిమ్మల్ని ముగ్ధుల్నిచేశాయి?

[15వ పేజీలోని చిత్రం]

ఉడికించే కుండను గూర్చిన మీకా దృష్టాంతాన్ని మీరు వివరించగలరా?

[16వ పేజీలోని చిత్రం]

మీకా వలెనే, మనమూ ధైర్యంగా మన పరిచర్య కొనసాగిస్తాం