కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కష్టకాలాల్లో యెహోవామీద సంపూర్ణ నమ్మకం ఉంచండి

కష్టకాలాల్లో యెహోవామీద సంపూర్ణ నమ్మకం ఉంచండి

కష్టకాలాల్లో యెహోవామీద సంపూర్ణ నమ్మకం ఉంచండి

“దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.”​కీర్తన 46:⁠1.

మనకు దేవునిమీద నమ్మకం ఉందని చెప్పడం సులభమే గానీ దాన్ని చర్యల్లో చూపించడం అంత సులభం కాదు. ఉదాహరణకు, “దేవునిమీద మాకు నమ్మకం ఉంది” అనే మాటలు ఎంతోకాలంగా అమెరికా కరెన్సీ నోట్ల మీద, నాణేల మీద కనిపిస్తున్నాయి. * ఈ మాటలు అమెరికా జాతీయ ముఖవాక్యమని ప్రకటిస్తూ అమెరికా కాంగ్రెస్‌ 1956లో ఒక చట్టాన్ని అమలులోకి తెచ్చింది. హాస్యాస్పదంగా, ఆ దేశంలోని వారే కాదు ప్రపంచమంతటా చాలామంది దేవునిమీద కంటే డబ్బు మీద, వస్తుసంపద మీద ఎక్కువ నమ్మకం ఉంచుతారు.​—⁠లూకా 12:​16-21.

2 నిజ క్రైస్తవులముగా మనం, మనకు యెహోవామీద నమ్మకం ఉందని చెప్పడంకంటే ఎక్కువే చేయాలి. ‘క్రియలు లేని విశ్వాసము మృతము’ అయినట్లే, దేవునిమీద నమ్మకం ఉందని మనం మన చర్యల ద్వారా నిరూపించకపోతే అలా చెప్పుకోవడం కూడా అంతే అర్థవిహీనంగా ఉంటుంది. (యాకోబు 2:​26) ముందటి ఆర్టికల్‌లో, మనం యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు, ఆయన వాక్యం నుండి నడిపింపును కోరినప్పుడు, నిర్దేశం కోసం ఆయన సంస్థవైపు చూసినప్పుడు ఆయనమీద మనకున్న నమ్మకం ప్రదర్శితమవుతుందని మనం తెలుసుకున్నాము. కష్ట సమయాల్లో ఆ మూడు చర్యలు ఎలా తీసుకోవచ్చో మనమిప్పుడు పరిశీలిద్దాము.

ఉద్యోగం పోయినప్పుడు లేదా తగిన ఆదాయం లేనప్పుడు

3 ఈ ‘అపాయకరమైన కాలాల్లో’ క్రైస్తవులముగా మనం ఇతర ప్రజలు ఎదుర్కొనేలాంటి ఆర్థిక ఒత్తిళ్ళనే ఎదుర్కొంటాము. (2 తిమోతి 3:⁠1) కాబట్టి, హఠాత్తుగా మన ఉద్యోగం పోవచ్చు. లేదా కేవలం పరిమిత ఆదాయం కోసం ఎన్నో గంటలు పనిచేయవలసి రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో, ‘స్వకీయులను సంరక్షించడం’ మనకు కష్టం కావచ్చు. (1 తిమోతి 5:⁠8) అలాంటి సమయాల్లో సర్వోన్నత దేవుడు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడా? తప్పకుండా! కానీ ఈ విధానంలోని శ్రమలన్నింటి నుండి యెహోవా మనల్ని కాపాడడు. అయితే మనం ఆయనమీద నమ్మకం ఉంచితే, “దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు” అని చెప్పబడిన కీర్తన 46:1లోని మాటలు మన విషయంలో నిజమని నిరూపించబడతాయి. మరి మనం ఆర్థిక ఇబ్బందులున్న సమయంలో యెహోవామీద పూర్తి నమ్మకం కలిగివున్నామని ఎలా చూపించవచ్చు?

4 యెహోవామీద మనకున్న నమ్మకాన్ని చూపించడానికి ఒక మార్గం, ఆయనకు ప్రార్థించడమే. కానీ మనం దేనికోసం ప్రార్థించవచ్చు? ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు, మనకు మునుపెన్నటికన్నా ఎక్కువగా ఆచరణాత్మక జ్ఞానం అవసరం కావచ్చు. కాబట్టి దాని కోసం తప్పక ప్రార్థించండి! యెహోవా వాక్యం మనకిలా హామీ ఇస్తోంది: “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.” (యాకోబు 1:⁠5) అవును జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికీ సరైన ఎంపికలు చేసుకోవడానికీ తగిన జ్ఞానాన్ని ఇవ్వమని అంటే పరిజ్ఞానాన్ని, అవగాహనను, వివేచనను సరిగా ఉపయోగించుకునే సామర్థ్యాన్ని ఇవ్వమని యెహోవాను అడగండి. అలాంటి ప్రార్థనలు వింటానని మన ప్రేమగల పరలోక తండ్రి మనకు హామీ ఇస్తున్నాడు. తమ పూర్ణ హృదయంతో తనమీద నమ్మకం ఉంచేవారి మార్గాలను సరాళం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సుముఖంగా ఉంటాడు.​—⁠కీర్తన 65:2; సామెతలు 3:5, 6.

5 నిర్దేశం కోసం దేవుని వాక్యంవైపు చూడడం మనకు యెహోవామీద నమ్మకం ఉందని చూపించడానికి మరో మార్గం. బైబిలులో ఉన్న ఆయన జ్ఞానయుక్తమైన జ్ఞాపికలు “ఎన్నడును తప్పిపోవు” అని నిరూపించబడ్డాయి. (కీర్తన 93:⁠5) ఆ ప్రేరేపిత పుస్తకం వ్రాయడం 1,900 సంవత్సరాల కంటే ఎక్కువకాలం క్రితమే పూర్తయినా దానిలో ఆర్థిక ఒత్తిళ్ళను శ్రేష్ఠమైన విధంగా ఎదుర్కోవడానికి మనకు సహాయం చేయగల విశ్వసనీయమైన ఉపదేశం, తేజోవంతమైన అంతర్దృష్టి ఉన్నాయి. బైబిలు జ్ఞానం యొక్క కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

6 జ్ఞానవంతుడైన సొలొమోను రాజు ఎంతోకాలం క్రితం ఇలా అన్నాడు: “కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు; అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనసమృద్ధిచేత నిద్రపట్టదు.” (ప్రసంగి 5:​12) మన వస్తుసంపదలను బాగు చేయించుకోవడానికి, శుభ్రపరచుకోవడానికి, మంచిస్థితిలో ఉంచుకోవడానికి, వాటిని కాపాడుకోవడానికి సమయం, డబ్బు అవసరం. కాబట్టి, ఉద్యోగం పోయినప్పుడు ఆ అవకాశాన్ని మనం మన జీవనశైలిని పునఃపరిశీలించుకోవడానికి ఉపయోగించుకుని మనకు అవసరమైనవాటినీ మనం కోరుకునేవాటినీ విడివిడిగా వర్గీకరించుకోవడానికి ప్రయత్నించవచ్చు. చింతను తగ్గించుకునేందుకు కొన్ని మార్పులు చేసుకోవడం జ్ఞానయుక్తంకావచ్చు. ఉదాహరణకు, చిన్న ఇంట్లోకి మారడం ద్వారా లేదా అనవసరమైన వస్తుసామాగ్రిని వదిలించుకోవడం ద్వారా మన జీవితాన్ని సరళం చేసుకోవడం సాధ్యమా?​—⁠మత్తయి 6:22.

7 యేసు కొండమీది ప్రసంగంలో ఇలా ఉపదేశించాడు: “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి.” * (మత్తయి 6:​25) అపరిపూర్ణ మానవులు కనీసావసరాలు తీర్చుకోవడం గురించి సహజంగానే చింత కలిగివుంటారని యేసుకు తెలుసు. అయినా మనం అలాంటి విషయాల గురించి ఎలా “చింతింప”కుండా ఉండవచ్చు? “రాజ్యమును . . . మొదట వెదకుడి” అని యేసు చెప్పాడు. మనకు ఎటువంటి సమస్యలు ఎదురైనా మనం మన జీవితాల్లో యెహోవా ఆరాధనకు ప్రథమస్థానం ఇవ్వడంలో కొనసాగాలి. మనమలా చేస్తే మన పరలోక తండ్రి మన అనుదినావసరాలు తీరేలా మనకు ‘అనుగ్రహిస్తాడు.’ మనకు అవసరమైన వాటిని ఆయన ఏదోవిధంగా మనకిస్తాడు.​—⁠మత్తయి 6:​33.

8 యేసు ఇంకా ఇలా ఆదేశించాడు: “రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును.” (మత్తయి 6:​34) రేపు ఏమి తెస్తుందో అని అనవసరంగా చింతించడం జ్ఞానయుక్తం కాదు. ఒక విద్వాంసుడు ఇలా పేర్కొన్నాడు: “భవిష్యత్తును గురించిన మన భయాలు, వాస్తవ దూరంగా ఉంటాయి.” మనకు ఏవి ప్రధానమైనవనేది స్పష్టంగా మనస్సులో ఉంచుకోమని బైబిలు ఇస్తున్న ఉపదేశాన్ని వినయంగా లక్ష్యపెట్టి ఏ రోజు గురించి ఆ రోజు ఆలోచించుకోవడం అనవసరమైన చింతను నివారించడానికి మనకు సహాయం చేయగలదు.​—⁠1 పేతురు 5:6, 7.

9 ఆర్థిక ఇబ్బందిని అనుభవిస్తున్నప్పుడు సహాయం కోసం, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందజేస్తున్న ప్రచురణలు పరిశీలించడం ద్వారా కూడా యెహోవామీద మనకు నమ్మకం ఉందని చూపించవచ్చు. (మత్తయి 24:​45) ఆర్థిక సవాళ్ళతో వ్యవహరించడానికి సహాయకరమైన సూచనలు, సలహాలు ఉన్న ఆర్టికల్స్‌ను తేజరిల్లు! పత్రిక అప్పుడప్పుడు ప్రచురించింది. ఆగస్టు 8, 1991 (ఆంగ్లం), సంచికలోని “ఉద్యోగం పోయినప్పుడు​—⁠పరిష్కారమేమిటి?” అనే ఆర్టికల్‌, ఉద్యోగంలేని సమయం వచ్చినప్పుడు ఆర్థికంగా, భావోద్వేగపరంగా స్థిరంగా ఉండడానికి అనేకులకు సహాయం చేసిన ఎనిమిది ఆచరణాత్మక నిర్దేశకసూత్రాలను తెలియజేసింది. * అయితే అలాంటి నిర్దేశకసూత్రాలను డబ్బు యొక్క నిజమైన ప్రాముఖ్యతను గురించిన సరైన దృక్కోణంతో సమతుల్యపరచాలి. ఈ విషయం, అదే సంచికలో వచ్చిన “డబ్బుకంటే మరింత విలువైనది” అనే ఆర్టికల్‌లో చర్చించబడింది.​—⁠ప్రసంగి 7:12.

అనారోగ్య సమస్యలు బాధపెట్టినప్పుడు

10 తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు యెహోవామీద నమ్మకం ఉంచడం వాస్తవికమైనదేనా? తప్పకుండా! తన ప్రజల మధ్యనున్న రోగులపట్ల యెహోవాకు సానుభూతి ఉంది. అంతకంటే ఎక్కువగా, ఆయన సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఉదాహరణకు దావీదు రాజునే తీసుకోండి. నీతిమంతుడైన ఒక రోగితో దేవుడు ఎలా వ్యవహరిస్తాడో ఆయన వ్రాసినప్పుడు ఆయన తానే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉండి ఉండవచ్చు. ఆయనిలా అన్నాడు: “రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును; రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు.” (కీర్తన 41:1, 3, 7, 8) దేవునిమీద దావీదుకున్న నమ్మకం దృఢంగా ఉంది, చివరికి రాజు తన అనారోగ్యం నుండి కోలుకున్నాడు. అయితే, మనం ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు మనం దేవునిమీద నమ్మకాన్ని ఎలా చూపించవచ్చు?

11 అనారోగ్యానికి గురైనప్పుడు యెహోవామీద మనకున్న నమ్మకాన్ని చూపించడానికి ఒక మార్గం, సహించడానికి సహాయం చేయమని ప్రార్థనలో ఆయనను వేడుకోవడం. మన పరిస్థితులు వాస్తవికంగా అనుమతించినంత ఆరోగ్యాన్ని కాపాడుకునేలా “లెస్సయైన జ్ఞానమును” ఉపయోగించుకోవడానికి సహాయం చేయమని మనం ఆయనను అడగవచ్చు. (సామెతలు 3:​21) అనారోగ్యాన్ని సహించడానికి కావలసిన ఓర్పును, సహనాన్ని చూపించేందుకు సహాయం చేయమని కూడా మనం ఆయనను అడగవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా, ఏమి జరిగినప్పటికీ మనం సమతుల్యతను కోల్పోకుండా ఆయనపట్ల విశ్వాసంగా ఉండడానికి కావలసిన శక్తినిచ్చి మనల్ని బలపరచమని యెహోవాను అడగాలనుకుంటాము. (ఫిలిప్పీయులు 4:​13) మన ప్రస్తుత జీవితాన్ని కాపాడుకోవడం కంటే దేవునిపట్ల మన యథార్థతను కాపాడుకోవడం మరింత ప్రాముఖ్యం. మనం యథార్థంగా ఉంటే, గొప్ప ప్రతిఫలాలనిచ్చేవాడు మనకు నిరంతరం పరిపూర్ణ జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాడు.​—⁠హెబ్రీయులు 11:⁠6.

12 యెహోవామీద మనకున్న నమ్మకం, మనం ఆచరణాత్మక నడిపింపు కోసం ఆయన వాక్యమైన బైబిలు వైపు చూసేలా కూడా మనల్ని కదిలిస్తుంది. లేఖనాల్లోవున్న సూత్రాలు వైద్యచికిత్సకు సంబంధించి జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకు సహాయం చేయగలవు. ఉదాహరణకు, బైబిలు “అభిచారము”ను ఖండిస్తుందని తెలుసుకుని మనం అభిచారంతో ముడిపడివున్న ఏ రోగనిర్ధారణనైనా, చికిత్సా విధానాన్నైనా విసర్జిస్తాము. (గలతీయులు 5:19-21; ద్వితీయోపదేశకాండము 18:​10-12) బైబిలు యొక్క విశ్వసనీయమైన జ్ఞానానికి మరో ఉదాహరణ: “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.” (సామెతలు 14:​15) కాబట్టి వైద్యచికిత్స చేయించుకోవాలనుకుంటున్నప్పుడు, ‘ప్రతి మాట నమ్మే’ బదులు విశ్వసనీయమైన సమాచారం కోసం ప్రయత్నించడం జ్ఞానయుక్తం. అలాంటి “స్వస్థబుద్ధి” మనకున్న అవకాశాలను జాగ్రత్తగా తూచిచూసుకుని సరైన నిర్ణయం తీసుకోవడానికి మనకు సహాయం చేయగలదు.​—⁠తీతు 2:​13.

13 నమ్మకమైన దాసుని ప్రచురణలను వెదకడం ద్వారా కూడా మనం యెహోవామీద మనకున్న నమ్మకాన్ని చూపించవచ్చు. కావలికోట, తేజరిల్లు! పత్రికలు వివిధ రకాలైన నిర్దిష్ట అనారోగ్య సమస్యలపై వ్యాధులపై ఎంతో సమాచారాన్ని అందజేసే ఆర్టికల్స్‌ను అప్పుడప్పుడు ప్రచురించాయి. * కొన్నిసార్లు ఈ పత్రికలు వివిధ అనారోగ్యాలను, వ్యాధులను, అశక్తతలను విజయవంతంగా సహించిన వ్యక్తుల ఆర్టికల్స్‌ను ప్రచురించాయి. అంతేగాక, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎలా జీవించాలనే విషయంలో లేఖనాధారిత సూచనలను అలాగే ఆచరణాత్మక ఉపదేశాన్ని కొన్ని ఆర్టికల్స్‌ అందజేశాయి.

14 ఉదాహరణకు, “రోగులకు ఓదార్పు” అనే శీర్షికల పరంపర తేజరిల్లు! (ఆంగ్లం) జనవరి 22, 2001 సంచిక యొక్క ముఖశీర్షిక. ఆ ఆర్టికల్స్‌ సహాయకరమైన బైబిలు సూత్రాలను, బలహీనులను చేసే అనారోగ్యంతో అనేక సంవత్సరాలపాటు జీవించిన అనుభవంగల వారితో జరిపిన ఇంటర్వ్యూల నుండి సేకరించబడిన ప్రత్యక్ష సమాచారాన్ని అందజేశాయి. “మీ అనారోగ్యంతో విజయవంతంగా జీవించడం​—⁠ఎలా?” అనే ఆర్టికల్‌ ఈ సలహాను ఇచ్చింది: మీ అనారోగ్యం గురించి మీరు సహేతుకంగా తెలుసుకోగలిగినంత తెలుసుకోండి. (సామెతలు 24:⁠5) ఇతరులకు సహాయం చేయడమనే లక్ష్యాలతో సహా ఆచరణాత్మకమైన లక్ష్యాలను పెట్టుకోండి, కానీ ఇతరులు చేరుకోగల అవే లక్ష్యాలను మీరు చేరుకోలేకపోవచ్చని గుర్తించండి. (అపొస్తలుల కార్యములు 20:35; గలతీయులు 6:⁠4) ఇతరుల నుండి దూరంగా ఒంటరిగా ఉండకండి. (సామెతలు 18:⁠1) మిమ్మల్ని దర్శించడం ఇతరులకు ఆహ్లాదకరమైన అనుభవం అయ్యేలా చేయండి. (సామెతలు 17:​22) అన్నిటికంటే ముఖ్యంగా యెహోవాతో, సంఘంతో సన్నిహిత సంబంధాన్ని కాపాడుకోండి. (నహూము 1:7; రోమీయులు 1:​11, 12) యెహోవా తన సంస్థ ద్వారా అందజేస్తున్న నమ్మదగిన నడిపింపుకు మనం కృతజ్ఞులము కాదా?

శారీరక బలహీనత పీడిస్తునప్పుడు

15 “నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని” అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (రోమీయులు 7:​18) అపరిపూర్ణ శరీరం యొక్క కోరికలకు, బలహీనతలకు వ్యతిరేకంగా పోరాడడం ఎంత కష్టమో పౌలుకు అనుభవపూర్వకంగా తెలుసు. అయితే పౌలుకు తాను విజయం సాధించగలనన్న నమ్మకం కూడా ఉంది. (1 కొరింథీయులు 9:​26, 27) ఎలా? యెహోవామీద సంపూర్ణ నమ్మకం ఉంచడం ద్వారా. అందుకే పౌలు ఇలా చెప్పగలిగాడు: “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.” (రోమీయులు 7:​24, 25) మన విషయమేమిటి? మనం కూడా మన శారీరక బలహీనతలను అధిగమించడానికి పోరాడాలి. అలాంటి బలహీనతలతో వ్యవహరించడానికి మనం పోరాడుతుండగా, మనం ఎన్నటికీ విజయం సాధించలేమని భావిస్తూ నమ్మకాన్ని కోల్పోవడం సులభమే. కానీ మనం మన స్వంతశక్తిపై కాక పౌలు వలే నిజంగా యెహోవామీద ఆధారపడితే ఆయన మనకు సహాయం చేస్తాడు.

16 ఏదైనా శారీరక బలహీనత పీడిస్తునప్పుడు, మనం యెహోవాకు ప్రార్థనలో మొర్రపెట్టుకోవడం ద్వారా మనకు ఆయనమీద నమ్మకం ఉందని చూపించవచ్చు. మనం యెహోవా పరిశుద్ధాత్మ కోసం అడగవచ్చు, యాచించవచ్చు. (లూకా 11:​9-13) దేవుని ఆత్మఫలంలో భాగమైన ఆశానిగ్రహం కోసం మనం ప్రత్యేకంగా అడగవచ్చు. (గలతీయులు 5:​22) మనం మళ్ళీ బలహీనతకు లొంగిపోతే అప్పుడేమి చెయ్యాలి? అయినా మనమెంతమాత్రం పట్టు విడువకూడదు. క్షమాపణ కోసం, సహాయం కోసం అడుగుతూ మన దయగల దేవునికి వినయంగా ప్రార్థించడంలో మనమెన్నడూ విసుగక ఉందాము. అపరాధ భావాల భారంతో “విరిగి నలిగిన” హృదయాన్ని యెహోవా ఎన్నడూ నిరాకరించడు. (కీర్తన 51:​17) మనం యథార్థమైన, పశ్చాత్తప్త హృదయంతో యెహోవాను వేడుకుంటే శోధనలను ఎదిరించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు.​—⁠ఫిలిప్పీయులు 4:6, 7.

17 సహాయం కోసం యెహోవా వాక్యాన్ని వెదకడం ద్వారా కూడా మనకు ఆయనమీద నమ్మకం ఉందని చూపించవచ్చు. బైబిలు కాంకార్డెన్సును లేదా ప్రతి సంవత్సరం చివరి సంచికలో వచ్చే కావలికోటల విషయసూచికను ఉపయోగిస్తూ మనం ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనవచ్చు: ‘నేను పోరాడుతున్న బలహీనత గురించి యెహోవా ఎలా భావిస్తాడు?’ ఆ విషయాన్ని గురించి యెహోవా ఎలా భావిస్తాడనేది ఆలోచించడం ఆయనకు సంతోషం కలిగించాలనే మన కోరికను బలపర్చగలదు. ఆ విధంగా మనం ఆయన భావించేలా భావించడం, ఆయన ద్వేషించేదాన్ని ద్వేషించడం ప్రారంభించవచ్చు. (కీర్తన 97:​10) కొందరు తాము పోరాడుతున్న నిర్దిష్ట బలహీనతలకు అన్వయించే బైబిలు లేఖనాలను గుర్తుంచుకోవడం సహాయకరంగా ఉంటుందని తెలుసుకున్నారు. మనం త్వరగా కోప్పడే స్వభావాన్ని మార్చుకోవడానికి పోరాడుతున్నామా? అలాగైతే మనం సామెతలు 14:⁠17 మరియు ఎఫెసీయులు 4:⁠31 వంటి లేఖనాలను కంఠస్థం చేసుకోవచ్చు. మనం మన నాలుకను అదుపులో ఉంచుకోవడం కష్టంగా ఉన్నట్లు కనుగొంటున్నామా? అయితే మనం సామెతలు 12:⁠18 మరియు ఎఫెసీయులు 4:⁠29 వంటి లేఖనాలు కంఠస్థం చేసుకోవచ్చు. మనకు ఆరోగ్యదాయకంకాని వినోదం కావాలనే కోరిక ఉందా? మనం ఎఫెసీయులు 5:3 మరియు కొలొస్సయులు 3:5 వంటి లేఖనాలను గుర్తుంచుకోవడానికి ప్రయత్నించవచ్చు.

18 సంఘంలోని ఆత్మ నియమిత పెద్దల సహాయాన్ని పొందడం, మనం యెహోవామీద ఆధారపడుతున్నామని చూపించడానికి మరో మార్గం. (అపొస్తలుల కార్యములు 20:​28) ఎంతైనా ఈ ‘మనుష్యులలో ఈవులు’ తన గొఱ్ఱెలను కాపాడడానికి, శ్రద్ధతీసుకోవడానికి యెహోవా క్రీస్తు ద్వారా చేసిన ఒక ఏర్పాటు. (ఎఫెసీయులు 4:​7, 8, 11-14) నిజమే, ఒక బలహీనతతో వ్యవహరించడంలో సహాయం కోసం అడగడం అంత సులభం కాకపోవచ్చు. పెద్దలు మనల్ని చిన్నచూపు చూస్తారేమోననే భయంతో మనం సిగ్గుపడుతుండవచ్చు. కానీ ఆధ్యాత్మిక పరిణతిగల ఈ పురుషులు, సహాయాన్ని అర్థించడానికి మనం చూపించిన ధైర్యాన్ని బట్టి మనల్ని తప్పక గౌరవిస్తారు. అంతేగాక, మందతో వ్యవహరించేటప్పుడు పెద్దలు యెహోవా లక్షణాలను ప్రతిబింబించడానికి కృషి చేస్తారు. వారు దేవుని వాక్యంలోనుండి ఓదార్పుకరమైన, ఆచరణాత్మకమైన ఉపదేశాన్నీ నిర్దేశాన్నీ ఇస్తారు, మనకున్న బలహీనతను జయించాలనే మన నిశ్చయతను బలపరచుకోవడానికి కావలసింది సరిగ్గా అదే కావచ్చు.​—⁠యాకోబు 5:​14-16.

19 తనకు సమయం కొంచెమే ఉందని సాతానుకు తెలుసని ఎన్నడూ మరచిపోకండి. (ప్రకటన 12:​12) మనల్ని నిరుత్సాహపరచడానికి, మనం ఓడిపోయామని భావించేలా చేయడానికి అతడు ఈ లోక జీవితపు వ్యర్థతను ఉపయోగించుకోవాలనుకుంటాడు. రోమీయులు 8:35-39 వచనాల్లో వ్యక్తపరచబడిన మాటలందు మనం పూర్తి నమ్మకం కలిగివుందాము: “క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? . . . అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢీగా నమ్ముచున్నాను.” యెహోవామీద నమ్మకానికి సంబంధించిన ఎంతగొప్ప వ్యాఖ్యానమో కదా! అయితే అలాంటి నమ్మకం ఒక భావనకంటే ఎక్కువే. బదులుగా, అది మన అనుదిన జీవితంలో మనం ఆలోచనాపూర్వకంగా తీసుకునే నిర్ణయాలు ఇమిడివున్న నమ్మకం. కాబట్టి కష్టకాలాల్లో యెహోవామీద పూర్తిగా నమ్మకం ఉంచాలని దృఢనిశ్చయం చేసుకుందాము.

[అధస్సూచీలు]

^ పేరా 3 1861, నవంబరు 20న అమెరికా టంకసాలకు వ్రాయబడిన ఒక ఉత్తరంలో కోశాగార కార్యదర్శి సాలమన్‌ పి. చేస్‌ ఇలా వ్రాశారు: “దేవుని బలం లేకుండా ఏ దేశమూ దృఢంగా ఉండలేదు, ఆయన కాపుదల లేనిదే సురక్షితంగా ఉండలేదు. మన ప్రజలకు దేవునిమీదున్న నమ్మకం మన జాతీయ నాణేలపై ప్రకటించబడాలి.” ఫలితంగా, 1864లో “దేవునిమీద మాకు నమ్మకం ఉంది” అనే ముఖవాక్యం చలామణిలోకివచ్చే అమెరికా నాణెం మీద మొదటిసారిగా కనిపించింది.

^ పేరా 10 ఇక్కడ వర్ణించబడిన చింత “జీవితంలో నుండి ఆనందాన్నంతటినీ తొలగించే వ్యాకులతతో కూడిన భయం” అని వర్ణించబడుతోంది. “చింతింపకుడి” లేదా “బెంగపెట్టుకోకండి” అనిచెప్పే అనువాదాలు మనం చింతించడం లేదా బెంగపెట్టుకోవడం ప్రారంభించకూడదని సూచిస్తున్నాయి. ఒక రెఫరెన్సు గ్రంథం ఇలా చెబుతోంది: “గ్రీకు క్రియాపదం ఆజ్ఞార్థక రూపంలో ఉండి, అప్పటికే జరుగుతున్న ఒక కార్యాన్ని ఆపమనే ఆజ్ఞను సూచిస్తోంది.”

^ పేరా 12 ఆ ఎనిమిది విషయాలు ఇలా ఉన్నాయి: (1) కంగారుపడకండి; (2) అనుకూల దృక్పథాన్ని కాపాడుకోండి; (3) క్రొత్త రకాలైన పనులు చేయడానికి సుముఖంగా ఉండండి; (4) మీకున్నదాంట్లో జీవించండి​—⁠ఇతరులతో పోటీపడకండి; (5) అప్పు చేయడం గురించి జాగ్రత్తగా ఉండండి; (6) కుటుంబంలో ఐక్యతను కాపాడుకోండి; (7) మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి; (8) ఒక బడ్జెట్‌ తయారు చేసుకోండి.

^ పేరా 17 ఈ బైబిలు ఆధారిత ప్రచురణలు ఏ ఒక్క వైద్యచికిత్సను సిఫారసు చేయవు లేదా వ్యాప్తిచేయవు, ఎందుకంటే అది వ్యక్తిగత నిర్ణయానికి సంబంధించిన విషయమని అవి గుర్తిస్తాయి. బదులుగా, నిర్దిష్ట రోగాలను లేక అనారోగ్యాలను గురించి చర్చించే ఆర్టికల్స్‌ ప్రస్తుతం తెలిసిన వాస్తవాలను పాఠకులకు అందజేయడానికి ఉద్దేశించబడ్డాయి.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

• ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు, మనకు యెహోవామీద నమ్మకం ఉందని మనం ఏ యే విధాలుగా చూపించవచ్చు?

• మనం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు దేవునిమీద నమ్మకాన్ని మనం ఎలా చూపించవచ్చు?

• ఏదైనా శారీరక బలహీనత పీడిస్తునప్పుడు, మనం నిజంగా యెహోవామీద ఆధారపడుతున్నామని మనమెలా చూపించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) మనకు దేవునిమీద నమ్మకం ఉందని కేవలం చెప్పుకోవడం మాత్రమే సరిపోదని ఏ ఉదాహరణ చూపిస్తోంది? (బి) మనకు యెహోవామీద నమ్మకం ఉందని కేవలం చెప్పుకోవడం కంటే ఎక్కువే ఎందుకు చేయాలి?

3. ఈ ‘అపాయకరమైన కాలాల్లో’ యెహోవా సేవకులు ఎటువంటి ఆర్థిక ఒత్తిళ్ళను ఎదుర్కొంటారు, దేవుడు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడని మనకెలా తెలుసు?

4. ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు, మనం దేనికోసం ప్రార్థించవచ్చు, అలాంటి ప్రార్థనలకు యెహోవా ఎలా ప్రతిస్పందిస్తాడు?

5, 6. (ఎ) ఆర్థిక ఒత్తిళ్ళను ఎదుర్కోవడానికి సహాయం కోసం మనం దేవుని వాక్యం వైపు ఎందుకు చూడవచ్చు? (బి) ఉద్యోగం పోయినప్పుడు మనం చింతను తగ్గించుకోవడానికి మనం ఏమి చేయవచ్చు?

7, 8. (ఎ) అపరిపూర్ణ మానవులకు వస్తుసంబంధ విషయాల గురించి అధికంగా చింతించే దృక్పథం ఉంటుందనేది తనకు తెలుసని యేసు ఎలా చూపించాడు? (అధస్సూచి కూడా చూడండి.) (బి) అనవసరమైన చింతను నివారించడానికి సంబంధించి యేసు జ్ఞానయుక్తమైన ఏ ఉపదేశాన్నిచ్చాడు?

9. ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కొంటున్నప్పుడు, ‘నమ్మకమైనవాడును బుద్దిమంతుడునైన దాసుని’ ప్రచురణల్లో మనమే సహాయాన్ని కనుగొనవచ్చు?

10. గంభీరమైన అనారోగ్యానికి గురైనప్పుడు యెహోవామీద నమ్మకం ఉంచడం వాస్తవికమైనదేనని దావీదు రాజు ఉదాహరణ ఎలా చూపిస్తోంది?

11. అనారోగ్యానికి గురైనప్పుడు, మనం మన పరలోక తండ్రిని ఏమి అడగవచ్చు?

12. వైద్యచికిత్స సంబంధంగా జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏ లేఖనాధారిత సూత్రాలు మనకు సహాయం చేయగలవు?

13, 14. (ఎ) కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో అనారోగ్య విషయాలపై సమాచారాన్ని అందించే ఎటువంటి ఆర్టికల్స్‌ ప్రచురించబడ్డాయి? (17వ పేజీలోని బాక్సు చూడండి.) (బి) దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో వ్యవహరించడానికి తేజరిల్లు! (ఆంగ్లం) జనవరి 22, 2001 సంచికలో ఏ సలహా ఇవ్వబడింది?

15. అపొస్తలుడైన పౌలు అపరిపూర్ణ శరీర బలహీనతలకు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంలో ఎలా విజయం సాధించగలిగాడు, మనం ఏ నిశ్చయత కలిగి ఉండవచ్చు?

16. ఏదైనా శారీరక బలహీనత పీడిస్తుంటే మనం దేని కోసం ప్రార్థించాలి, మనం మళ్ళీ బలహీనతకు లొంగిపోతే మనమేమి చేయాలి?

17. (ఎ) మనం పోరాడుతున్న ఒకానొక బలహీనత గురించి యెహోవా ఎలా భావిస్తాడనేదాని గురించి ఆలోచించడం ఎందుకు సహాయకరంగా ఉంటుంది? (బి) మనం త్వరగా కోప్పడే స్వభావాన్ని మార్చుకోవడానికి, మన నాలుకను అదుపులో ఉంచుకోవడానికి, ఆరోగ్యదాయకంకాని వినోదం కావాలనే కోరికతో పోరాడుతుంటే ఏ లేఖనాలను మనం కంఠస్థం చేసుకోవచ్చు?

18. మనకున్న బలహీనతను జయించడానికి సహాయం చేయమని పెద్దలను అడగకుండా సిగ్గు మనల్ని ఆటంకపరిచేందుకు మనమెందుకు అనుమతించకూడదు?

19. (ఎ) సాతాను ఈ విధాన జీవిత వ్యర్థతను ఉపయోగించుకోవడానికి ఎలా ప్రయత్నిస్తాడు? (బి) నమ్మకంలో ఏమి ఇమిడివుంది, మన దృఢనిశ్చయం ఏమై ఉండాలి?

[17వ పేజీలోని బాక్సు]

ఈ ఆర్టికల్స్‌ మీకు గుర్తున్నాయా?

మనం అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు అనారోగ్య అస్వస్థతలను, బలహీనతలను విజయవంతంగా ఎదుర్కొన్న ఇతరుల గురించి చదవడం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో ప్రచురించబడిన కొన్ని ఆర్టికల్స్‌ క్రింద ఇవ్వబడ్డాయి.

“నా బలహీనతలను సహించడం” ప్రతికూల ఆలోచనావిధానంతో, కృంగుదలతో వ్యవహరించడంపై దృష్టినిలిపింది.​—⁠కావలికోట, (ఆంగ్లం) మే 1, 1990.

“లోహపు ఊపిరితిత్తులు కూడా ఆమె ప్రకటించకుండా ఆపలేకపోయాయి.”​—⁠తేజరిల్లు!, (ఆంగ్లం) జనవరి 22, 1993.

“ఒక బులెట్‌ నా జీవితాన్ని మార్చివేసింది” పక్షవాతంతో వ్యవహరించడంపై దృష్టినిలిపింది.​—⁠తేజరిల్లు!, (ఆంగ్లం) అక్టోబరు 22, 1995.

“రేపేమి సంభవించునో మీకు తెలియదు” బైపోలార్‌ డిజార్డర్‌ను తాళుకోవడం గురించి చర్చించింది.​—⁠కావలికోట, డిసెంబరు 1, 2000.

“నిశ్శబ్దాన్ని ఛేదించుకుని లాయిడా పయనం” మెదడు పక్షవాతంతో వ్యవహరించడంపై దృష్టినిలిపింది.​—⁠తేజరిల్లు!, (ఆంగ్లం) మే 8, 2000.

“ఎన్డోమేట్రియోసిస్‌తో నా పోరాటం.”​—⁠తేజరిల్లు!, (ఆంగ్లం) జూలై 22, 2000.

“స్కెలెరడెర్మాతో నా పోరాటం.”​—⁠తేజరిల్లు!, (ఆంగ్లం) ఆగస్టు 8, 2001.

“ప్రసూతి తర్వాతి కృంగుదలతో నా పోరాటంలో విజయం సాధించాను.”​—⁠తేజరిల్లు!, (ఆంగ్లం) జూలై 22, 2002.

[15వ పేజీలోని చిత్రం]

ఉద్యోగం పోయినప్పుడు మన జీవన శైలిని పునఃపరిశీలించుకోవడం జ్ఞానయుక్తం

[16వ పేజీలోని చిత్రం]

యెహోవాపై నమ్మకం, సహించడానికి ఒకరికి ఎలా సహాయం చేస్తుందో లాయిడా కథ చూపిస్తుంది (17వ పేజీలోని బాక్సు చూడండి)

[18వ పేజీలోని చిత్రం]

మన బలహీనతలను జయించడానికి సహాయం కోసం అడిగేందుకు మనం సిగ్గుపడనవసరం లేదు