కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన ఒకే క్రైస్తవ విశ్వాసం ఒక వాస్తవం

నిజమైన ఒకే క్రైస్తవ విశ్వాసం ఒక వాస్తవం

నిజమైన ఒకే క్రైస్తవ విశ్వాసం ఒక వాస్తవం

యేసుక్రీస్తు ఒకే చర్చిని లేక సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘం ఒక ఆధ్యాత్మిక సంఘం, ఒక ఆధ్యాత్మిక కుటుంబం. అంటే, దేవుని పరిశుద్ధాత్మచే ఎంపిక చేయబడిన ప్రజలను​—⁠దేవుడు తన ‘పిల్లలుగా’ గుర్తించిన వారందరిని ఒకదగ్గరికి సమకూర్చడమని మా భావం.​—⁠రోమీయులు 8:16, 17; గలతీయులు 3:26.

ప్రజలను సత్యం వద్దకు, జీవం వద్దకు నడిపించడానికి దేవుడు కేవలం ఒకే మార్గాన్ని ఉపయోగించాడని యేసు బోధించాడు. ఆ ప్రాముఖ్యమైన సత్యాన్ని సోదాహరణంగా చెప్పడానికి, యేసు నిత్యజీవానికి నడిపించే మార్గాన్ని ఒక దారితో పోల్చాడు. ఆయనిలా అన్నాడు: “ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు; జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.”​—⁠మత్తయి 7:13, 14; యోహాను 14:6; అపొస్తలుల కార్యములు 4:​11, 12.

ఒక సమైక్య సంఘం

మొదటి శతాబ్దపు సంఘం, “ఈ రోజుల్లో మనం క్యాథలిక్‌ చర్చి గురించి మాట్లాడినప్పుడు మన ఉద్దేశం ఏమిటో అలాంటి ఒక ప్రపంచవ్యాప్త, విశ్వవ్యాప్త, సంస్థీకృత సమాజం” అని మనం భావించకూడదని ద న్యూ డిక్షనరీ ఆఫ్‌ థియాలజీ చెబుతోంది. అలా ఎందుకు భావించకూడదు? “దానికి చాలా సరళమైన కారణం ఉంది. అదేమిటంటే అప్పట్లో అలాంటి సంస్థీకృత, విశ్వవ్యాప్త సమాజం ఉనికిలో లేదు” అని అది చెబుతోంది.

తొలి క్రైస్తవ సంఘానికి, నేడు మనం చూస్తున్న సంస్థాపిత నియమనిష్ఠల చర్చి విధానాలకు పోలిక లేదన్న వాస్తవాన్ని న్యాయంగా ఎవరూ కాదనలేరు. కానీ అది సంస్థీకరించబడింది. వివిధ సంఘాలు వాటికవే స్వతంత్రంగా పని చేయలేదు. అవన్నీ యెరూషలేములోని పరిపాలక సభ అధికారాన్ని గుర్తించాయి. అపొస్తలులతో, యెరూషలేము సంఘంలోని పెద్దలతో కూడిన ఆ సభ, క్రీస్తు యొక్క ‘ఒకే శరీరముగా’ సంఘ ఐక్యతను కాపాడడానికి దోహదపడింది.​—⁠ఎఫెసీయులు 4:4, 11-16; అపొస్తలుల కార్యములు 15:22-31; 16:4, 5.

నిజమైన ఆ ఒకే సంఘానికి ఏమైంది? అది బలమైన క్యాథలిక్‌ చర్చిగా మారిందా? నేడు మనం చూస్తున్న ఎన్నో శాఖల విభాగిత ప్రొటస్టెంటు చర్చీలుగా పరిణమించిందా? లేక ఇంకేమైనా జరిగిందా?

‘గోధుమలు,’ “గురుగులు”

సమాధానాలు తెలుసుకోవడానికి, ఏమి జరుగుతుందని యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడో మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. యేసు తన సంఘం కనుమరుగవుతుందని ముందుగానే ఊహించాడనీ, అలాంటి విచారకరమైన పరిస్థితి శతాబ్దాలపాటు కొనసాగడానికి ఆయన అనుమతిస్తాడనీ తెలుసుకోవడం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు.

తన సంఘాన్ని “పరలోకరాజ్యము”తో జతచేస్తూ ఆయనిలా అన్నాడు: “పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది. మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి​—⁠అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులెక్కడనుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువుచేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు​—⁠మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి. అందుకతడు​—⁠వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు. కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగనియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను.”​—⁠మత్తయి 13:​24-30.

“విత్తువాడు” తానేనని యేసు వివరించాడు. “మంచి విత్తనములు” ఆయన నిజ శిష్యులకు చిత్రీకరణగా ఉన్నాయి. ఆయన “శత్రువు” అపవాదియైన సాతాను. “గురుగులు” తొలి క్రైస్తవ సంఘంలోకి చొరబడిన నకిలీ క్రైస్తవులు. “యుగసమాప్తి”లో వచ్చే “కోతకాలము” వరకు “గోధుమలను” “గురుగులను” కలిసి ఎదగనిస్తానని ఆయన అన్నాడు. (మత్తయి 13:​37-43) దీనంతటి భావమేమిటి?

క్రైస్తవ సంఘం కలుషితం కావడం

అపొస్తలులు మరణించిన వెంటనే సంఘంలోని మతభ్రష్ట బోధకులు దానిపై పెత్తనం చేయడం మొదలెట్టారు. వారు “శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు” పలికారు. (అపొస్తలుల కార్యములు 20:​29, 30) తత్ఫలితంగా, చాలామంది క్రైస్తవులు ‘విశ్వాస భ్రష్టులయ్యారు.’ వారు ‘కల్పనాకథలవైపుకు తిరిగారు.’​—⁠1 తిమోతి 4:1-3; 2 తిమోతి 4:3, 4.

సా.శ. నాలుగవ శతాబ్దం నాటికి “క్యాథలిక్‌ క్రైస్తవత్వం రోమా సామ్రాజ్యపు . . . అధికారిక మతం అయ్యింది” అని ద న్యూ డిక్షనరీ ఆఫ్‌ థియాలజీ చెబుతోంది. అప్పుడు “చర్చీ, పౌర సమాజం సమైక్యమయ్యాయి” అంటే తొలి క్రైస్తవుల నమ్మకాలకు బద్ధవిరుద్ధంగా చర్చి, దేశం కలిసిపోయిన పరిస్థితి ఏర్పడింది. (యోహాను 17:16; యాకోబు 4:⁠4) కొంతకాలానికి, “పాతనిబంధన మరియు నవప్లేటోవాద విధానాల కుతూహలంతోకూడిన పూర్తిగా అనారోగ్యదాయకమైన కలయిక ప్రభావం క్రింద” చర్చి నిర్మాణ నైజాలు, అలాగే దాని ప్రాథమిక నమ్మకాలనేకం పూర్తిగా మారాయని అదే గ్రంథం చెబుతోంది. యేసుక్రీస్తు ముందుగా తెలియజేసినట్లుగానే, నకిలీ క్రైస్తవులు పెరుగుతుండగా ఆయన నిజమైన శిష్యులు కనుమరుగయ్యారు.

పెరుగుతున్న కాలంలో గోధుమల్లానే కనిపించే విషపూరిత బియర్డెడ్‌ డార్నెల్‌ వంటి గురుగులకు, నిజమైన గోధుమలకు మధ్య తేడా చెప్పడం ఎంత కష్టమో యేసు శ్రోతలకు తెలుసు. కాబట్టి, కొంతకాలం పాటు నిజ క్రైస్తవులకు నకిలీ క్రైస్తవులకు మధ్య తేడా కనుగొనడం కష్టమవుతుందని యేసు సోదాహరణంగా చెబుతున్నాడు. అంటే క్రైస్తవ సంఘం ఉనికిలోనే లేకుండా పోయిందని దీని భావం కాదు ఎందుకంటే యేసు “యుగసమాప్తి వరకు సదాకాలము” తన ఆధ్యాత్మిక సహోదరులకు నడిపింపునివ్వడం కొనసాగిస్తానని వాగ్దానం చేశాడు. (మత్తయి 28:​20) గోధుమలు పెరుగుతూనే ఉంటాయని యేసు చెప్పాడు. అలావున్నప్పటికీ, ఆయాకాలాల్లో నిజక్రైస్తవులు​—⁠వ్యక్తులుగానైనా, గుంపులుగానైనా​—⁠క్రీస్తు బోధలను అంటిపెట్టుకుని ఉండడానికి తాము చేయగలిగింది చేశారు. కానీ వాళ్ళు స్పష్టంగా గుర్తించదగిన దృశ్య సంఘంగా లేదా సంస్థగా ఏర్పడలేదు. అయితే వారు చరిత్రంతటిలో యేసుక్రీస్తు నామానికి తలవంపులూ అవమానమే తీసుకువచ్చిన దృశ్య భ్రష్ట మతవిధానంలా ఎంతమాత్రం లేరు.​—⁠2 పేతురు 2:1, 2.

‘పాపపురుషుడు బయలుపడతాడు’

ఈ నకిలీ మత విధానాన్ని సూచించే మరో విషయాన్ని అపొస్తలుడైన పౌలు ముందే తెలియజేశాడు. ఆయనిలా వ్రాశాడు: “మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము [యెహోవా దినము] రాదు . . . గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి.” (2 థెస్సలొనీకయులు 2:2-4). ఈ “పాపపురుషుడు” మరెవరో కాదు “క్రైస్తవ” సంఘంపై తనంతట తానుగా పరిపాలనా స్థానంలోకి పైకెగబాకిన మతనాయక వర్గమే. *

అపొస్తలుడైన పౌలు కాలంలో మతభ్రష్టత్వం ప్రారంభమైంది. అపొస్తలులు మరణించి, వారి నిరోధక ప్రభావం లేకుండా పోవడంతో అది విజృంభించింది. “అబద్ధ విషయమైన సమస్తబలముతోను, నానావిధములైన సూచకక్రియలతోను, మహత్కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను” అది గుర్తించబడుతుందని పౌలు చెప్పాడు. (2 థెస్సలొనీకయులు 2:​6-12) చరిత్రంతటిలోని ఎంతోమంది మతనాయకుల కార్యకలాపాలను అదెంత ఖచ్చితంగా వర్ణిస్తుందో కదా!

నిజమైన ఒకే చర్చి రోమన్‌ క్యాథలిక్‌ మతమేననే తమ వాదనకు మద్దతుగా తమ బిషప్పులు “క్రైస్తవత్వ ఆరంభం నుండివున్న తొలి అపొస్తలుల నుండి తమ అపొస్తలత్వాన్ని వారసత్వంగా పొందారు” అని క్యాథలిక్‌ మతనాయకులు చెప్పుకుంటారు. వాస్తవానికి, అపొస్తలత్వ వారసత్వమనే ఈ వాదనకు చారిత్రక లేదా లేఖన ఆధారం ఏదీలేదు. యేసు అపొస్తలుల మరణం తర్వాత ఏర్పడిన చర్చి విధానం దేవుని పరిశుద్ధాత్మచే నిర్దేశించబడింది అనడానికి కూడా ఎటువంటి విశ్వసనీయమైన ఆధారమూ లేదు.​—⁠రోమీయులు 8:9; గలతీయులు 5:​19-21.

సంస్కరణోద్యమం అని పిలువబడిన కాలం తర్వాత ఉనికిలోకి వచ్చిన ఇతర చర్చీల మాటేమిటి? అవి తొలి క్రైస్తవ సంఘ మాదిరిని అనుసరించాయా? అవి తొలి క్రైస్తవ సంఘ స్వచ్ఛతను పునఃస్థాపించాయా? సంస్కరణోద్యమం తర్వాత చాలామంది సామాన్యులకు బైబిలు తమ సొంతభాషలో అందుబాటులోకి వచ్చిందన్నది నిజమే. అయినప్పటికీ ఆ చర్చీలు దోషపూరిత సిద్ధాంతాలను బోధించడంలోనే కొనసాగాయని చరిత్ర చూపిస్తోంది. *​—⁠మత్తయి 15:​7-9.

అయితే ఇది గమనించండి. యేసుక్రీస్తు తన నిజమైన సంఘం తాను యుగసమాప్తి అని పిలిచిన కాలంలో పునఃస్థాపించబడుతుందని ఖచ్చితంగా ప్రవచించాడు. (మత్తయి 13:​30, 39) మనమిప్పుడు ఆ కాలంలోనే జీవిస్తున్నామని బైబిలు ప్రవచనాల నెరవేర్పు చూపిస్తోంది. (మత్తయి 24:​3-35) అది నిజం గనుక, మనలో ప్రతి ఒక్కరం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘ఆ నిజమైన ఒకే చర్చి ఎక్కడుంది?’ అది మరింత స్పష్టంగా గుర్తించదగినదిగా తయారుకావాలి.

ఆ చర్చిని లేక సంఘాన్ని ఇప్పటికే కనుగొన్నానని బహుశా మీరు భావిస్తుండవచ్చు. ఆ విషయాన్ని మీరు నిర్ధారించుకోవడం ముఖ్యం. ఎందుకు? ఎందుకంటే మొదటి శతాబ్దంలోలాగే, నిజమైన చర్చి కేవలం ఒక్కటే ఉంటుంది. మీ చర్చి మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘం ఉంచిన మాదిరిని సన్నిహితంగా అనుసరిస్తూ యేసుక్రీస్తు బోధలకు యథార్థంగా అంటిపెట్టుకుని ఉందో లేదో నిశ్చయపరచుకోవడానికి మీరు సమయం వెచ్చించారా? దాన్ని ఇప్పుడే ఎందుకు పరిశీలించకూడదు? అలా చేయడానికి, యెహోవాసాక్షులు మీకు సంతోషంగా సహాయం చేస్తారు.​—⁠అపొస్తలుల కార్యములు 17:​11.

[అధస్సూచీలు]

^ పేరా 17 ‘పాపపురుషుని’ గుర్తింపు గురించి మరింత సమాచారం కావలికోట, సెప్టెంబరు 1, 1990, 12-16 పేజీల్లో ఉంది.

^ పేరా 20 యెహోవాసాక్షులు ప్రచురించిన దేవుని కోసం మానవజాతి అన్వేషణ (ఆంగ్లం) అనే పుస్తకంలో 306-28 పేజీల్లోవున్న “సంస్కరణోద్యమం​—⁠అన్వేషణ ఒక క్రొత్త మలుపు తిరిగింది” అనే అధ్యాయాన్ని చూడండి.

[5వ పేజీలోని చిత్రాలు]

గోధుమలు గురుగుల గురించి యేసు చెప్పిన ఉపమానం నిజమైన సంఘం గురించి మనకేమి బోధిస్తోంది?

[7వ పేజీలోని చిత్రాలు]

ప్రకటించడంలోనూ అధ్యయనం చేయడంలోనూ మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఉంచిన మాదిరిని మీ చర్చి ప్రతిబింబిస్తోందా?