కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నిజమైన చర్చి’ ఒకటే ఉందా?

‘నిజమైన చర్చి’ ఒకటే ఉందా?

‘నిజమైన చర్చి’ ఒకటే ఉందా?

“ఒకే క్రీస్తు ఉన్నట్లుగా, క్రీస్తుకు ఒకే శరీరం ఉంది, క్రీస్తుకు ఒకే పెండ్లికుమార్తె ఉంది: ‘క్యాథలిక్‌, అపోస్టలిక్‌ చర్చియు ఒకటే.’”​—⁠డొమినస్‌ ఈసస్‌.

నిజమైన చర్చి ఒకటే ఉండగలదన్న తన చర్చి బోధను రోమన్‌ క్యాథలిక్‌ కార్డినల్‌ జోసెఫ్‌ రాట్జింగర్‌ పైవిధంగా పేర్కొన్నాడు. ఆ చర్చే “ఏకైక క్రీస్తు చర్చి, అదే క్యాథలిక్‌ చర్చి” అని ఆయన అన్నాడు.

“సరైన భావంలో అవి చర్చీలు కావు”

డొమినస్‌ ఈసస్‌ అనే పత్రంలో “ఇతర మతాలపట్ల తక్కువచూపు గానీ అగౌరవం గానీ లేదు” అని పోప్‌ జాన్‌ పాల్‌ II నొక్కిచెప్పినప్పటికీ, ప్రొటస్టెంట్‌ చర్చి నాయకులు దానికి తీవ్రంగా స్పందించారు. ఉదాహరణకు ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌లో 2001 జూన్‌లో జరిగిన ప్రెస్బిటేరియన్‌ సాధారణ సభలో ఒక పరిచారకుడు, ఆ పత్రం “వాటికన్‌ II ప్రవేశపెట్టిన విశాల దృక్పథానికి అకారణంగా భయపడ్డ రోమన్‌ క్యాథలిక్‌ చర్చిలోని బలమైన చీలికవర్గం” చేసినపనే అని అన్నాడు.

“వాటికన్‌ IIకు ముందున్న క్యాథలిక్‌ చర్చి యొక్క ఆలోచనా విధానానికి తిరిగి వెళ్ళడమే” ఆ పత్రం ఉద్దేశమైతే, తాను “ఎంతగానో నిరాశచెందుతాను” అని ఐర్లాండ్‌ చర్చి బిషప్‌ రాబిన్‌ ఈమ్స్‌ అన్నాడు. కొన్ని క్యాథలిక్‌ సిద్ధాంతాలను నిరాకరించే చర్చీలు “సరైన భావంలో అవి చర్చీలు కావు” అని వాటికన్‌ చేసిన ఆరోపణపై వ్యాఖ్యానిస్తూ “ఇది నాకు అవమానకరంగా అనిపిస్తుంది” అని ఈమ్స్‌ అన్నాడు.

డొమినస్‌ ఈసస్‌ అనే ఆ పత్రం వ్రాయడానికి పురికొల్పినదేమిటి? మతసంబంధ జ్ఞాన సాపేక్షవాదం అని పిలువబడిన వాదాన్ని బట్టి రోమన్‌ క్యాథలిక్‌ సభ కలత చెందినట్లు కనిపిస్తోంది. ది ఐరీష్‌ టైమ్స్‌ ప్రకారం, “ప్రాథమికంగా ఒక మతం మరో మతమంత మంచిదే . . . అని చెప్పే బహువిధ వేదాంత ఆవిర్భావం కార్డినల్‌ రాట్జింగర్‌ను చాలా కలతపరిచింది.” ఈ దృక్కోణమే ఆయన ఒకే నిజమైన చర్చి గురించి వ్యాఖ్యానాలు చేయడానికి ప్రేరేపించి ఉండవచ్చు అనిపిస్తోంది.

మీరు ఏ చర్చికి చెందుతారనేది ప్రాముఖ్యమా?

కొంతమందికి, కేవలం ఒకే నిజమైన చర్చి ఉండగలదన్న ఏ సూచన కన్నా “మతసంబంధ జ్ఞాన సాపేక్షవాదం” లేదా “బహువిధ వేదాంతం” మరింత సహేతుకమైనదిగా, ఆకర్షణీయమైనదిగా అనిపిస్తోంది. వారికి, మతం పూర్తిగా వ్యక్తిగత ఎంపికగా ఉండాలి. ‘తుదకు, మీరు ఏ చర్చికి చెందారనేది నిజంగా అంత ప్రాముఖ్యం కాదు’ అని వారంటారు.

పర్యవసానంగా మతం అనేకానేక శాఖలుగా విడిపోయినా, అది చాలా విశాల దృక్పథంలా కనిపించవచ్చు. ‘మతంలో అలాంటి భిన్నత్వం, వ్యక్తిగత స్వేచ్ఛకు విలువైన వ్యక్తీకరణే తప్ప మరింకేమీ కాదు’ అని అనేకులు అంటారు. అయితే స్టీవ్‌ బ్రూస్‌ అనే రచయిత అభిప్రాయం ప్రకారం, అలాంటి “మత సహనం” వాస్తవానికి “మత ఉదాసీనతే.”​—⁠ఎ హౌస్‌ డివైడెడ్‌: ప్రొటెస్టాంటిజమ్‌, సిజెమ్‌, సెక్యులరైజేషన్‌.

మరైతే ఏది సరైన దృక్కోణం? నిజమైన చర్చి ఒకటే ఉందా? ఆ నిజమైన చర్చి రోమన్‌ క్యాథలిక్‌ చర్చేనా? దేవునికి అంతే అంగీకారమైన ఇతర చర్చీలు కూడా ఉన్నాయా? మన సృష్టికర్తతో మనకున్న సంబంధంతో ఈ ప్రశ్నలకు సంబంధం ఉంది కాబట్టి, ఈ విషయంలో ఆయన దృక్కోణం ఏమిటో తెలుసుకోవడం ఖచ్చితంగా ప్రాముఖ్యం. మనం ఎలా తెలుసుకోవచ్చు? దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలు పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. (అపొస్తలుల కార్యములు 17:11; 2 తిమోతి 3:​16, 17) ఒకే నిజమైన చర్చి అనే ఈ అంశంపై అదేమి చెబుతుందో మనం పరిశీలిద్దాం.