పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో, వివాహ సమయంలో బహుమతులు ఇవ్వడం వాడుక. అలాంటి బహుమతులను ఇస్తున్నప్పుడు, స్వీకరిస్తున్నప్పుడు మనం ఏ లేఖనసూత్రాల గురించి ఆలోచించాలి?
సరైన సందర్భంలో సరైన ఉద్దేశంతో బహుమతులు ఇవ్వడాన్ని బైబిలు ఆమోదిస్తోంది. ఇచ్చే విషయంలో, తమకు అన్నీ ఉదారంగా ఇచ్చేవాడైన యెహోవాను అనుకరించమని బైబిలు నిజక్రైస్తవులను ప్రోత్సహిస్తోంది. (యాకోబు 1:17) “ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి” అని అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులకు ఉద్బోధించాడు. కాబట్టి, క్రైస్తవులు ఉదారంగా ఉండాలని ప్రోత్సహించబడుతున్నారు.—హెబ్రీయులు 13:16; లూకా 6:38.
కొన్ని దేశాల్లో సాధారణమైన వాడుక ఏమిటంటే, పెళ్ళి చేసుకోబోతున్న ఒక జంట ఒక దుకాణానికి వెళ్ళి అందులోవున్న సామాగ్రి అంతా చూసి, వాటిలో నుండి తాము బహుమతులుగా పొందాలనుకుంటున్న వస్తువుల పట్టికను తయారుచేస్తారు. అలా తయారుచేసిన పట్టికలోనుండి ఏదో ఒక వస్తువు కొనడానికి ఆ జంట యొక్క బంధువులు, స్నేహితులు ఆ ఫలాని దుకాణానికి వెళ్ళాలని సూచించే ఆహ్వానాన్ని అందుకుంటారు. ఆచరణాత్మకంగా చూస్తే ఈ పట్టిక, ఏ బహుమతి కొనాలా అని గంటలతరబడి సమయాన్ని వెచ్చించడాన్ని తగ్గిస్తుంది, అంతేగాక బహుమతి అందుకున్నవారు కూడా తమకు అవసరంలేని బహుమతులను మళ్ళీ దుకాణంలో తిరిగి ఇవ్వడం వంటి అసౌకర్యాలను తప్పించుకోగలుగుతారు.
ఇలాంటి పట్టిక ఒకటి తయారుచేయ్యాలా వద్దా అనేది పెళ్ళి చేసుకోబోతున్న జంట వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి. అయితే బైబిలు సూత్రాలను ఉల్లంఘించగల ఏ ఆచారాలనైనా నివారించడానికి జాగ్రత్త వహించాలని క్రైస్తవులు కోరుకుంటారు. ఉదాహరణకు, పెళ్ళిచేసుకోబోతున్న జంట చాలా ఖరీదైన వస్తువుల పట్టికను తయారుచేశారనుకోండి, అప్పుడెలా? అలాంటప్పుడు, డబ్బు అంతగా లేనివారు అంత విలువైన బహుమతిని ఇవ్వలేకపోవచ్చు, లేదా తక్కువ విలువగల బహుమతి ఇవ్వడం ద్వారా వచ్చే అవమానాన్ని తప్పించుకోవడానికి పెళ్ళికి వెళ్లకపోతే సరిపోతుందని అనుకోవచ్చు. ఒక క్రైస్తవ స్త్రీ ఇలా వ్రాసింది: “బహుమతులు ఇవ్వడం తలకు మించిన భారం అయిపోతోంది. నేను ఉదారంగా ఉండడానికి ప్రయత్నించాను కానీ ఇవ్వడంలో నేను ఇంతకు ముందు పొందిన ఆనందం ఇప్పుడు పొందలేకపోతున్నాను.” వివాహం నిరుత్సాహానికి మూలం కావడం ఎంత విచారకరమైన విషయం!
బహుమతి ఇస్తున్నవారు తాము ఇచ్చే బహుమతి అంగీకరించబడాలంటే అది ఫలాని దుకాణంలో కొన్నదై ఉండాలనో ఫలాని ధర చెల్లించి కొన్నదై ఉండాలనో భావించేలా చేయకూడదు. దేవుని దృష్టిలో అత్యంత అమూల్యమైనది ఇస్తున్న వ్యక్తి హృదయ దృక్పథమే గానీ బహుమతి యొక్క మూల్యం కాదని యేసుక్రీస్తు సూచించాడు. (లూకా 21:1-4) అదేవిధంగా అవసరంలో ఉన్నవారికి దానం చేయడం గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.”—2 కొరింథీయులు 9:7.
బైబిలు అనుసారంగా చెప్పాలంటే, బహుమతితోపాటు అది ఇస్తున్నది ఎవరో తెలిపే చిన్న నోటు పెట్టడంలో తప్పేమీ లేదు. అయితే, కొన్ని ప్రాంతాల్లో బహుమతి ఇస్తున్నదెవరో అక్కడ హాజరై ఉన్నవారందరికీ చెప్పడం ఆచారం. ఈ ఆచారం సమస్యలకు దారితీయగలదు. బహుమతి ఇస్తున్నవారు అనవసరంగా అందరి అవధానం తమవైపుకు తిరగడాన్ని ఇష్టపడకపోవచ్చు. అలాంటి వ్యక్తులు మత్తయి 6:3లో, “నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను” అని యేసు చెప్పిన సూత్రం ప్రకారం ప్రవర్తిస్తున్నారు. మరితరులు బహుమతి ఇవ్వడమనేది ఇస్తున్న వ్యక్తికీ తీసుకుంటున్న వ్యక్తికీ మధ్యనే ఉండవలసిన వ్యక్తిగత విషయమని భావించవచ్చు. అంతేగాక, ఇస్తున్న వ్యక్తి ఎవరన్నది వెల్లడయితే అది బహుమతులను పోల్చి చూడడానికి దారితీసి, ‘వివాదమును రేపవచ్చు.’ (గలతీయులు 5:26) ఇస్తున్నవారి పేర్లను బహిరంగంగా ప్రకటించి ఎవరినైనా అసౌకర్యానికి గురిచెయ్యాలని, అవమానించబడినట్లు భావించేలా చేయాలని క్రైస్తవులు ఎంతమాత్రం కోరుకోరు.—1 పేతురు 3:8.
అవును, దేవుని వాక్యంలో ఉన్న సూత్రాలకు అనుగుణంగా ప్రవర్తిస్తే బహుమతులు ఇవ్వడమనేది సంతోషానికి మూలంగా ఉంటుంది.—అపొస్తలుల కార్యములు 20:35.