కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బీదవారికి నిజమైన సహాయం

బీదవారికి నిజమైన సహాయం

బీదవారికి నిజమైన సహాయం

దేవుని కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు బీదవారికి సహాయం చేయడంలో నిజమైన ఆసక్తి చూపించాడు. యేసు పరిచర్య గురించి ఒక ప్రత్యక్ష సాక్షి ఇలా పేర్కొన్నాడు: “గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది.” (మత్తయి 11:⁠5) అయితే నేడున్న లక్షలాదిమంది బీదవారి మాటేమిటి? వారికి ఏదైనా సువార్త అందుబాటులో ఉందా? అవును, వారికొక నిరీక్షణా సందేశం ఉంది!

లోకంలోనివారు బీదవారిని తరచూ అలక్ష్యం చేస్తూ వారిని మరచిపోయినా దేవుని వాక్యమైన బైబిలు ఇలా వాగ్దానం చేస్తోంది: “దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడువారి నిరీక్షణాస్పదము ఎన్నటికిని నశించదు.” (కీర్తన 9:​18) ఈ ఓదార్పుకరమైన మాటలు, మానవ పరిపాలన స్థానంలోకి దేవుని రాజ్యం, అంటే ఒక నిజమైన పరలోక ప్రభుత్వం వచ్చినప్పుడు నెరవేరతాయి. (దానియేలు 2:​44) ఆ పరలోక ప్రభుత్వానికి రాజుగా యేసు “నిరుపేదలయందును బీదలయందును . . . కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.”​—⁠కీర్తన 72:​13, 14.

క్రీస్తు ఈ భూమిని పరిపాలించినప్పుడు జీవన పరిస్థితులు ఎలా ఉంటాయి? క్రీస్తు ప్రపంచ పరిపాలన క్రింద జీవించేవారు తమ శ్రమకు తగిన ఫలాన్ని అనుభవిస్తారు. మీకా 4:3, 4 వచనాల్లో బైబిలు ఇలా చెబుతోంది: “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును; సైన్యములకధిపతియగు యెహోవామాట యిచ్చియున్నాడు.” దేవుని రాజ్యం రోగమరణాల సమస్యల్ని కూడా పరిష్కరిస్తుంది. (యెషయా 25:⁠8) అదెంతటి భిన్నమైన లోకమై ఉంటుందో కదా! ఈ బైబిలు వాగ్దానాలను మనం నమ్మవచ్చు ఎందుకంటే అవి స్వయంగా దేవుడే ప్రేరేపించిన మాటలు.

బైబిలు నిరీక్షణా సందేశాన్ని ఇవ్వడమే గాక బీదవారిగా ఉండడం వల్ల కలిగే ఆత్మన్యూనతా భావాన్ని ఎలా అధిగమించవచ్చు అనేటువంటి అనుదిన సవాళ్ళను ఎదుర్కోవడానికి కూడా సహాయం చేస్తుంది. బీదవాడైన ఒక క్రైస్తవుడు బైబిలు అధ్యయనం చేయడం ద్వారా, తాను దేవుని దృష్టిలో సంపన్నుడైన క్రైస్తవుడిలానే తనుకూడా అమూల్యమైన వాడినని తెలుసుకుంటాడు. దేవుడు ‘బీదలకన్న ధనముగలవారిని ఎక్కువగా చూడడు’ ఎందుకంటే ‘వారందరు ఆయన నిర్మించినవారే’ అని బైబిలు పుస్తకమైన యోబు గ్రంథం చెబుతోంది. (యోబు 34:​19) దేవుడు వారిరువురిని సమానంగానే ప్రేమిస్తాడు.​—⁠అపొస్తలుల కార్యములు 10:​34, 35.