కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాను మీ ఆశ్రయంగా చేసుకోండి

యెహోవాను మీ ఆశ్రయంగా చేసుకోండి

యెహోవాను మీ ఆశ్రయంగా చేసుకోండి

“నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యమునుండి నా ఆశ్రయము నీవే.”​కీర్తన 71:⁠5.

ఆవ్యక్తి మూడు మీటర్లకంటే ఎత్తున్నాడు. యుద్ధరంగంలోవున్న ఇశ్రాయేలు సైనికులందరూ అతడిని ఎదుర్కోవడానికి భయపడుతున్నారంటే అందులో ఆశ్చర్యం లేదు! భారీకాయుడు ఫిలిష్తీయుడు అయిన గొల్యాతు, తనతో యుద్ధం చేయడానికి శూరుడు ఉంటే పంపమని ఎన్నో వారాలపాటు ఉదయం, సాయంకాలం సవాలు చేస్తూ ఇశ్రాయేలీయుల్ని తిరస్కరిస్తూవచ్చాడు. చివరికి, ఆ సవాలు ఎదుర్కొనబడింది, అయితే దాన్ని ఒక సైనికుడు కాదు గానీ ఒక బాలుడు ఎదుర్కొన్నాడు. గొఱ్ఱెలకాపరి, బాలుడు అయిన దావీదు ఆ యోధుని ఎదుట మరింత కురచగా కనిపించాడు. అంతెందుకు అతడు గొల్యాతు కవచం, ఆయుధాల కంటే తక్కువ బరువు తూగి ఉంటాడు! అయినా, ఆ బాలుడు ఆ భారీకాయుడ్ని ఎదుర్కొని ధైర్యానికి మారుపేరుగా వన్నెకెక్కాడు.​—⁠1 సమూయేలు 17:1-51.

2 దావీదుకు అంత ధైర్యమెలా వచ్చింది? దావీదు ఆ తర్వాతి సంవత్సరాల్లో వ్రాసినట్లు తెలుస్తున్న కొన్ని మాటల్ని పరిశీలించండి: “యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యమునుండి నా ఆశ్రయము నీవే.” (కీర్తన 71:⁠5) అవును బాలుడిగా దావీదు యెహోవా మీద సంపూర్ణ నమ్మకాన్ని పెంచుకున్నాడు. ఆయన ఇలా చెబుతూ గొల్యాతును ఎదుర్కొన్నాడు: “నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను.” (1 సమూయేలు 17:​45) గొల్యాతు తన గొప్ప బలంపై, తన ఆయుధాలపై నమ్మకం పెట్టుకుంటే దావీదు యెహోవా మీద నమ్మకం ఉంచాడు. విశ్వ సర్వోన్నతాధిపతి తనపక్షాన ఉండగా, ఎంత భారీగావున్నా ఎన్ని ఆయుధాలను ధరించివున్నా అల్ప మానవునికి దావీదు ఎందుకు భయపడాలి?

3 మీరు దావీదు గురించి చదువుతున్నప్పుడు, నాకు కూడా యెహోవా మీద మరింత బలమైన నమ్మకం ఉంటే బావుండునని అనుకుంటున్నారా? మనలో చాలామందిమి అలాగే అనుకుంటుండవచ్చు. కాబట్టి యెహోవాను మన ఆశ్రయంగా చేసుకోవడానికి మనం తీసుకోగల రెండు చర్యలను పరిశీలిద్దాం. మొదటగా, అలాంటి నమ్మకానికి సాధారణ ఆటంకాన్ని అధిగమించి, ఆ స్థితిని అలాగే కాపాడుకోవాలి. రెండవదిగా, యెహోవా మీద నమ్మకం ఉంచడంలో ఖచ్చితంగా ఏమి ఇమిడివుందో మనం తెలుసుకోవాలి.

యెహోవాపై నమ్మకానికి సాధారణ ఆటంకాన్ని అధిగమించడం

4 దేవుని మీద నమ్మకం ఉంచకుండా ప్రజలను ఏది ఆటంకపరుస్తుంది? తరచుగా, కొంతమంది చెడు విషయాలు ఎందుకు జరుగుతున్నాయోనని సందిగ్ధపడతారు. బాధలకు మూలం దేవుడేనని అనేకులకు బోధించబడింది. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు, దేవుడు బాధితులను తన దగ్గర పరలోకంలో ఉంచుకోవడానికి “తీసుకున్నాడు” అని మతనాయకులు బోధిస్తారు. అంతేగాక, దేవుడు ఎప్పుడో ఈ లోకంలో జరుగబోయే ప్రతి సంఘటనను అంటే ప్రతి దుర్ఘటనను, ప్రతి దుష్టకార్యాన్ని ముందుగానే నిర్ణయించాడని చాలామంది మతనాయకులు బోధిస్తారు. అలాంటి కఠిన హృదయుడైన దేవుని మీద నమ్మకం ఉంచడం కష్టం. అవిశ్వాసుల మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసే సాతాను అలాంటి ‘దయ్యముల బోధలన్నింటిని’ పురికొల్పడానికి ఉత్సుకతతో ఉన్నాడు.​—⁠1 తిమోతి 4:1; 2 కొరింథీయులు 4:⁠4.

5 ప్రజలు యెహోవా మీద నమ్మకాన్ని కోల్పోవాలని సాతాను కోరుకుంటున్నాడు. మానవుల బాధలకు అసలైన మూలం ఎవరో మనం తెలుసుకోవడం దేవుని యొక్క ఆ శత్రువుకు ఇష్టం లేదు. బాధలకు లేఖనాధార కారణాలను మనం ఒకవేళ తెలుసుకున్నా వాటిని మనం మరిచిపోవాలని సాతాను కోరుకుంటాడు. కాబట్టి, లోకంలో బాధలు ఎందుకు ఉన్నాయనేదానికి మూడు ప్రాథమిక కారణాలను మనం అప్పుడప్పుడూ సమీక్షించడం మంచిది. అలా చేయడం ద్వారా, జీవితంలో మనమెదుర్కొంటున్న కష్టాలకు యెహోవా బాధ్యుడు కాదని మనం మన హృదయాలను సమ్మతి పరచుకోవచ్చు.​—⁠ఫిలిప్పీయులు 1:​9, 10.

6 మానవుల బాధలకు ఒక కారణమేమిటంటే, యెహోవా నమ్మకమైన ప్రజల యథార్థతను వమ్ము చేయాలని సాతాను కోరుకుంటున్నాడు. అతడు యోబు యథార్థతను వమ్ము చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు సాతాను విఫలమయ్యాడు గానీ అంతటితో అతడు విడిచిపెట్టలేదు. ఈ లోక పరిపాలకుడిగా అతడు యెహోవా నమ్మకమైన సేవకులను “మ్రింగ”డానికి ప్రయత్నిస్తున్నాడు. (1 పేతురు 5:⁠8) మనలో ప్రతి ఒక్కరం ప్రమాదంలో ఉన్నాం! మనం యెహోవా సేవ చేయడం మానుకునేలా చేయాలని సాతాను ఆశిస్తున్నాడు. కాబట్టి అతడు తరచూ హింసను రేకెత్తిస్తాడు. అలాంటి హింస ఎంతో బాధాకరమైనదే అయినా దాన్ని మనం సహించడానికి మంచి కారణమే ఉంది. అలా చేయడం ద్వారా మనం సాతాను అబద్ధికుడని నిరూపించడానికి సహాయపడతాము, తద్వారా యెహోవాకు సంతోషం కలిగిస్తాము. (యోబు 2:4; సామెతలు 27:​11) హింసను సహించడానికి యెహోవా మనల్ని బలపరుస్తుండగా, ఆయన మీద మనకున్న నమ్మకం అధికమవుతుంది.​—⁠కీర్తన 9:​9, 10.

7 బాధలకు మరో కారణం, “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అనే సూత్రంలో కనిపిస్తుంది. (గలతీయులు 6:⁠7) కొన్నిసార్లు ప్రజలు తప్పుడు ఎంపికలు చేసుకోవడం ద్వారా విత్తుతారు, తత్ఫలితంగా ఆ మేరకు బాధలను పంటగా కోస్తారు. అజాగ్రత్తగా డ్రైవింగ్‌ చేయడంవల్ల వారు ప్రమాదానికి గురౌతారు. చాలామంది సిగరెట్లు త్రాగి హృద్రోగాలు లేదా ఊపిరితిత్తుల క్యాన్సరు బారిన పడుతున్నారు. లైంగిక దుర్నీతికి పాల్పడేవారు కుటుంబ బాంధవ్యాలు దెబ్బతినడం, ఆత్మ గౌరవాన్ని కోల్పోవడం, సుఖ వ్యాధులు, అవాంఛిత గర్భధారణ వంటి బాధలకు గురవుతున్నారు. ప్రజలు అలాంటి బాధలకు దేవుణ్ణి నిందిస్తారు గానీ వాస్తవానికి వారు తమ సొంత తప్పుడు నిర్ణయాలకే బలయ్యారు.​—⁠సామెతలు 19:⁠3.

8 బాధలకుగల మూడవ కారణం ప్రసంగి 9:11లో ఇలా పేర్కొనబడింది: “నేను ఆలోచింపగా సూర్యునిక్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలువరు; బలముగలవారు యుద్ధమునందు విజయ మొందరు; జ్ఞానముగలవారికి అన్నము దొరకదు; బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు; తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు; ఇవియన్నియు అదృష్టవశముచేతనే కాలవశము చేతనే అందరికి కలుగుచున్నవి.” కొన్నిసార్లు, ప్రజలు తప్పు సమయంలో తప్పు స్థలంలో ఉంటారు. మన వ్యక్తిగత బలాలు, బలహీనతలు ఎలా ఉన్నా మనలో ఎవరికైనా ఏ సమయంలోనైనా అనుకోకుండా బాధ, మరణం సంభవించవచ్చు. ఉదాహరణకు, యేసు కాలంలో యెరూషలేములోని ఒక గోపురము కూలి 18 మంది మరణించారు. వాళ్ళ గత పాపాలను బట్టి దేవుడు వాళ్ళనేమీ శిక్షించడం లేదని యేసు వివరించాడు. (లూకా 13:⁠4) అలాంటి బాధలకు యెహోవాను నిందించకూడదు.

9 బాధలకుగల కొన్ని కారణాలను అర్థం చేసుకోవడం ప్రాముఖ్యమే. అయితే, చాలామంది అర్థం చేసుకోవడం కష్టమని భావించే అంశమొకటుంది. అదేమిటంటే, యెహోవా దేవుడు బాధలనెందుకు అనుమతిస్తున్నాడు?

యెహోవా బాధనెందుకు అనుమతిస్తున్నాడు?

10 అపొస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికలోని కొంతభాగం ఈ ముఖ్యమైన అంశంపై వెలుగు ప్రసరింపజేస్తుంది. పౌలు ఇలా వ్రాశాడు: “దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నదని యెరుగుదుము.”​—⁠రోమీయులు 8:​19-22.

11 ఈ వచనాల్లోని అంశం అర్థం చేసుకోవడానికి, మనం కొన్ని కీలకమైన ప్రశ్నలకు మొదట సమాధానం కనుక్కోవాలి. ఉదాహరణకు, సృష్టిని వ్యర్థతకు లోపరచినది ఎవరు? కొందరు సాతాను అంటే మరికొందరు ఆదాము అంటారు. కానీ వారిద్దరూ అలా చేసి ఉండరు. ఎందుకు? ఎందుకంటే సృష్టిని వ్యర్థతకు లోపరచిన వ్యక్తి “నిరీక్షణ” ఆధారంగా అలా చేశాడు. అవును, నమ్మకమైనవారు చివరకు ‘నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడతారు’ అనే నిరీక్షణను ఆయనిస్తున్నాడు. ఆదాము గానీ సాతాను గానీ అలాంటి నిరీక్షణను ఇవ్వలేరు. కేవలం యెహోవా మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి సృష్టిని వ్యర్థతకు లోపరచినది ఆయనే అని స్పష్టమవుతోంది.

12 అయితే ఈ భాగంలో ప్రస్తావించబడిన “సృష్టి యావత్తు” అంటే ఏమిటి? జంతువులు చెట్లుచేమలతో సహా ప్రకృతిసిద్ధ ప్రపంచమంతటిని “సృష్టి యావత్తు” సూచిస్తుందని కొందరంటారు. కానీ మృగాలు, చెట్లు “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము” పొందాలని నిరీక్షిస్తాయా? లేదు. (2 పేతురు 2:​12) కాబట్టి “సృష్టి యావత్తు” కేవలం మానవజాతినే సూచించగలదు. ఏదెనులో జరిగిన తిరుగుబాటు మూలంగా పాపమరణాలకు గురైనదీ, నిరీక్షణ ఎంతగానో అవసరమైన స్థితిలో ఉన్నదీ ఈ సృష్టే.​—⁠రోమీయులు 5:​12.

13 ఆ తిరుగుబాటు వల్ల మానవజాతికి సరిగ్గా ఏమి సంభవించింది? దాని ఫలితాలను పౌలు వ్యర్థత అని ఒక్క మాటలో వివరిస్తున్నాడు. * ఒక రెఫరెన్సు గ్రంథం ప్రకారం, ఈ పదం “ఒక వస్తువు ఏ పని కోసం రూపించబడిందో ఆ పని చేయలేని వ్యర్థతను” వర్ణిస్తుంది. మానవులు పరదైసు భూమి గురించి శ్రద్ధ తీసుకుంటూ పరిపూర్ణ ఐక్య కుటుంబంగా కలిసి పనిచేస్తూ నిరంతరం జీవించడానికి రూపించబడ్డారు. కానీ వారు అల్పకాలిక, బాధాకరమైన, తరచూ వేదనభరితమైన జీవితాన్ని గడుపుతున్నారు. యోబు చెప్పినట్లుగా, “స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును.” (యోబు 14:⁠1) నిజంగా వ్యర్థతే!

14 ఇప్పుడు మనం కీలకమైన ప్రశ్నకు వస్తున్నాము: “సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు” మానవజాతిని ఈ బాధాకరమైన, వేదనభరితమైన స్థితికి ఎందుకు లోపరిచాడు? (ఆదికాండము 18:​25) అలా చేయడం ఆయనకు న్యాయమేనా? మన మొదటి తల్లిదండ్రులు ఏమి చేశారో గుర్తుతెచ్చుకోండి. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో వారు, యెహోవా సర్వోన్నతాధిపత్యాన్ని గురించి పెద్ద సవాలు లేవదీసిన సాతాను పక్షం వహించారు. యెహోవా సహాయం లేకుండా తిరుగుబాటుదారుడైన ఆత్మ ప్రాణి నడిపింపు క్రింద తమను తాము పరిపాలించుకోవడమే మానవులకు మంచిదనే వాదనకు వారు తమ చర్యల ద్వారా మద్దతునిచ్చారు. యెహోవా ఆ తిరుగుబాటుదారులకు శిక్ష విధిస్తూ వారు కోరుకున్నదాన్నే వారికిచ్చాడు. సాతాను ప్రభావం క్రింద మానవులు తమను తాము పరిపాలించుకోవడానికి ఆయన అనుమతించాడు. ఆ పరిస్థితుల్లో, ఒక నిరీక్షణనిస్తూ మానవజాతిని వ్యర్థతకు లోపరచడం కంటే మరింకే నిర్ణయం సబబుగా ఉంటుంది?

15 అయితే అది సృష్టి “స్వేచ్ఛగా” తీసుకున్న నిర్ణయం కాదు. మనం ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా పాపానికి, నాశనానికి బానిసలుగా జన్మించాము. కానీ యెహోవా తన దయనుబట్టి ఆదాము, హవ్వలు జీవించి, సంతానాన్ని కనడానికి అనుమతించాడు. వారి వారసులమైన మనం పాపమరణాల వ్యర్థతకు లోపరచబడినా ఆదాము, హవ్వలు చేయలేకపోయిన దాన్ని చేసే అవకాశం మనకుంది. మనం యెహోవా చెప్పేది విని, ఆయన సర్వోన్నతాధిపత్యం నీతియుక్తమైనదనీ పరిపూర్ణమైనదనీ అయితే యెహోవా లేకుండా మానవులు చేసే పరిపాలన బాధలకు, వేదనకు, వ్యర్థతలకు నడిపిస్తుందనీ తెలుసుకోవచ్చు. (యిర్మీయా 10:23; ప్రకటన 4:​11) సాతాను ప్రభావం పరిస్థితులను మరింత దుర్భరం చేస్తుంది. మానవ చరిత్ర ఈ సత్యాలు నిజమని నిరూపిస్తోంది.​—⁠ప్రసంగి 8:⁠9.

16 మానవజాతిని వ్యర్థతకు లోపరచడానికి యెహోవాకు విలువైన కారణాలే ఉన్నాయని స్పష్టమవుతోంది. అంటే, నేడు మనలో ప్రతి ఒక్కరికి కలుగుతున్న బాధలకు, వ్యర్థతకు యెహోవా కారణమని అర్థమా? ఒక నేరస్థునికి న్యాయమైన శిక్ష విధించిన ఒక న్యాయమూర్తి గురించి ఆలోచించండి. ఖైదీ తాను శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఎంతో బాధకు గురవుతుండవచ్చు, కానీ అతడు తన బాధకు కారణం న్యాయమూర్తి అని న్యాయంగా నిందించగలడా? ఎంతమాత్రం నిందించలేడు! అంతేగాక, యెహోవా ఎన్నడూ దుష్టత్వానికి మూలం కాదు. యాకోబు 1:⁠13 ఇలా చెబుతోంది: “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు.” అంతేగాక “నిరీక్షణ” ఆధారంగా యెహోవా ఈ శిక్ష విధించాడని కూడా మనం గుర్తుంచుకుందాం. ఆదాము, హవ్వల నమ్మకస్థులైన పిల్లలు వ్యర్థత యొక్క అంతాన్ని చూసి, “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము”ను ఆనందించడానికి ఆయన ప్రేమపూర్వక ఏర్పాట్లు చేశాడు. సృష్టి అంతా మళ్ళీ బాధాకరమైన వ్యర్థతలోకి జారిపోతుందేమోనని నమ్మకమైన మానవజాతి ఇక ఎన్నడూ చింతించవలసిన అవసరం ఉండదు. యెహోవా విషయాలను న్యాయంగా చక్కబెట్టడం ఆయన సర్వాధిపత్యాన్ని శాశ్వతంగా స్థాపిస్తుంది.​—⁠యెషయా 25:⁠8.

17 మానవుల బాధలకు కారణాలైన వీటిని మనం పరిశీలిస్తుండగా, దుష్టత్వాన్ని బట్టి యెహోవాను నిందించడానికి లేక ఆయన మీద మనకున్న నమ్మకాన్ని కోల్పోవడానికి ఆధారమేమైనా కనిపిస్తోందా? లేదు దానికి భిన్నంగా, అలాంటి అధ్యయనం మోషే వ్రాసిన ఈ మాటలను ప్రతిధ్వనింపజేయడానికి మనకు కారణాన్నిస్తుంది: “ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నియు న్యాయములు. ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు; ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.” (ద్వితీయోపదేశకాండము 32:⁠4) ఈ విషయాల గురించి ధ్యానించడం ద్వారా, వాటిని గురించిన మన అవగాహనను ఎప్పటికప్పుడూ పునర్నూతనం చేసుకుందాము. ఆ విధంగా, మనకు శ్రమలు ఎదురైనప్పుడు, మన మనస్సుల్లో అనుమానాలు నాటేందుకు సాతాను చేసే ప్రయత్నాలను నిరోధిస్తాము. అయితే ప్రారంభంలో పేర్కొనబడిన రెండవ చర్య మాటేమిటి? యెహోవా మీద నమ్మకం ఉంచడంలో ఏమి ఇమిడివుంది?

యెహోవా మీద నమ్మకం ఉంచడమంటే ఏమిటి?

18 దేవుని వాక్యం మనకిలా ఉద్బోధిస్తోంది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” (సామెతలు 3:​5, 6) అవి ఆహ్లాదకరమైన, ఎంతో ధైర్యాన్నిచ్చే మాటలు. ఖచ్చితంగా విశ్వమంతటిలోనూ మన ప్రియమైన పరలోక తండ్రికంటే ఎక్కువ నమ్మదగినవారు ఎవరూ లేరు. అయితే, సామెతలలోని ఆ మాటలను చదవడం చాలా సులభమే గానీ వాటిని ఆచరణలో పెట్టడం అంత సులభం కాదు.

19 యెహోవా మీద నమ్మకం ఉంచడమంటే ఏమిటనేదాని గురించి చాలామందికి తప్పుడు తలంపులున్నాయి. అలాంటి నమ్మకాన్ని కొందరు కేవలం ఒక భావన, హృదయంలో సహజంగా కలుగవలసిన ఒకలాంటి అత్యానందభరితమైన భావావేశం అనుకుంటారు. మరికొందరు దేవుని మీద నమ్మకం ఉంచడమంటే ఆయన మనల్ని ప్రతి కష్టం నుండి కాపాడాలనీ మన ప్రతి సమస్యను పరిష్కరించాలనీ అనుదినం ఎదురయ్యే ప్రతి సవాలును మనం కోరుకున్నట్లు వెంటనే మార్చేయాలనీ మనం ఆశించవచ్చునని భావిస్తున్నట్లున్నారు. కానీ అలాంటి తలంపులు నిరాధారమైనవి. నమ్మకం అన్నది ఒక భావన కంటే ఎక్కువే, అది అవాస్తవికమైనది కాదు. పెద్దవారి విషయంలో, నమ్మకం అంటే దానిలో ఉద్దేశపూర్వకంగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఇమిడి ఉంటుంది.

20సామెతలు 3:5 ఏమి చెబుతుందో మళ్ళీ ఒకసారి గమనించండి. అది యెహోవా మీద నమ్మకం ఉంచడానికీ మన సొంత అవగాహనపై ఆధారపడడానికీ ఉన్న తేడాను చూపిస్తూ మనం ఒకేసారి రెండూ చేయలేమని సూచిస్తోంది. అంటే మనం మన అవగాహనా శక్తులను ఉపయోగించడానికి వీల్లేదని దాని భావమా? కాదు, ఎందుకంటే మనకు ఆ శక్తులను ఇచ్చిన యెహోవా మనం వాటిని తన సేవ చేయడంలో ఉపయోగించాలని ఆశిస్తున్నాడు. (రోమీయులు 12:⁠1) కానీ మనం దేని మీద ఆధారపడతాము? మన ఆలోచనా విధానం యెహోవా ఆలోచనా విధానానికి అనుగుణంగా లేకపోతే, ఆయన జ్ఞానం మన జ్ఞానం కన్నా చెప్పలేనంత ఉన్నతమైనది కాబట్టి దాన్ని అంగీకరిస్తామా? (యెషయా 55:​8, 9) యెహోవా మీద నమ్మకం ఉంచడమంటే ఆయన ఆలోచనా విధానం మన ఆలోచనా విధానాన్ని నిర్దేశించడానికి అనుమతించడమని దాని భావం.

21 సోదాహరణంగా చెప్పాలంటే, కారు ముందు సీట్లో తల్లిదండ్రులు కూర్చుని ఉండగా, వెనుక సీట్లో కూర్చున్న పిల్లవాడి గురించి ఆలోచించండి. అతడి తండ్రి డ్రైవింగ్‌ చేస్తున్నాడు. ప్రయాణంలో సమస్యలు తలెత్తినప్పుడు అంటే ఏది సరైన మార్గమనే ప్రశ్న తలెత్తితే లేదా వాతావరణానికి సంబంధించిన లేక రోడ్డు పరిస్థితికి సంబంధించిన సమస్య తలెత్తితే విధేయుడైన, నమ్మకంగల పిల్లవాడు ఎలా ప్రతిస్పందిస్తాడు? వెనుక సీట్లో నుండి అరుస్తూ కారు ఎలా నడపాలో తన తండ్రికి నిర్దేశాలిస్తాడా? అతడు తన తల్లిదండ్రుల నిర్ణయాలను ప్రశ్నిస్తాడా, సీటుబెల్టు పెట్టుకుని కూర్చోమని చెప్పినప్పుడు అతడు వారిని ఎదిరిస్తాడా? అలా చేయడు, తన తల్లిదండ్రులు అపరిపూర్ణులే అయినా వారు అలాంటి విషయాలను చక్కబెడతారని అతడు సహజంగానే విశ్వసిస్తాడు. యెహోవా మన పరిపూర్ణుడైన తండ్రి. ప్రాముఖ్యంగా మనం సవాలుదాయకమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ఆయనయందు ప్రగాఢమైన నమ్మకం కలిగి ఉండవద్దా?​—⁠యెషయా 30:​21.

22 అయితే, మనం కష్ట పరిస్థితులు ఎదురైనప్పుడే కాదు గానీ ‘మన ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలని’ సామెతలు 3:6 సూచిస్తోంది. కాబట్టి జీవితంలో అనుదినం మనం తీసుకునే నిర్ణయాలు యెహోవా మీద మనకున్న నమ్మకాన్ని ప్రతిబింబించాలి. సమస్యలు తలెత్తినప్పుడు, మనం నిరాశచెందకూడదు, భయపడిపోకూడదు, లేదా విషయాలను చక్కబెట్టడంలో శ్రేష్ఠమైన మార్గానికి సంబంధించి యెహోవా నడిపింపును ఎదిరించకూడదు. మనం శ్రమలను యెహోవా సర్వోన్నతాధిపత్యానికి మద్దతునిచ్చేందుకు, సాతాను అబద్ధికుడని నిరూపించడానికి సహాయం చేసేందుకు, యెహోవాకు సంతోషం కలిగించే విధేయత తదితర లక్షణాలను అలవరచుకునేందుకు అవకాశాలుగా దృష్టించాలి.​—⁠హెబ్రీయులు 5:7, 8.

23 ఎలాంటి అడ్డంకులు మనల్ని భయపెట్టినా యెహోవా మీద మనకున్న నమ్మకాన్ని మనం చూపించవచ్చు. మనం మన ప్రార్థనల్లో, నడిపింపు కోసం యెహోవా వాక్యంవైపు ఆయన సంస్థవైపు చూడడంలో మనం దాన్ని చూపిస్తాము. అయితే, ప్రత్యేకంగా నేటి లోకంలో తలెత్తే సమస్యలు ఎదురైనప్పుడు యెహోవా మీద నమ్మకం ఉందని మనం ఎలా చూపించవచ్చు? మన తర్వాతి ఆర్టికల్‌ ఆ విషయాన్ని పరిశీలిస్తుంది.

[అధస్సూచి]

^ పేరా 17 ‘వ్యర్థత’ కోసం పౌలు ఉపయోగించిన గ్రీకుపదము, “సమస్తమును వ్యర్థము” అనే పదబంధంలో మాదిరిగానే ప్రసంగి పుస్తకంలో సొలొమోను పదే పదే ఉపయోగించిన పదాన్ని అనువదించడానికి గ్రీక్‌ సెప్టాజింట్‌ అదే పదం ఉపయోగించబడింది.​—⁠ప్రసంగి 1:2, 14; 2:11, 17; 3:19; 12:⁠8.

మీరెలా సమాధానమిస్తారు?

• దావీదు తాను యెహోవాను తన ఆశ్రయంగా చేసుకున్నానని ఎలా చూపించాడు?

• నేడు మానవులు అనుభవిస్తున్న బాధలకు మూడు కారణాలు ఏమిటి, అప్పుడప్పుడు వాటిని పరిశీలించుకోవడం ఎందుకు మంచిది?

• యెహోవా మానవజాతికి ఏ శిక్ష విధించాడు, అది ఎందుకు న్యాయమైనది?

• యెహోవా మీద నమ్మకం ఉంచడంలో ఏమి ఇమిడివుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1. గొఱ్ఱెలకాపరి, బాలుడు అయిన దావీదు ఏ సవాలు ఎదుర్కొన్నాడు?

2, 3. (ఎ) దావీదు గొల్యాతును అంత ధైర్యంగా ఎలా ఎదుర్కోగలిగాడు? (బి) యెహోవాను మన ఆశ్రయంగా చేసుకోవడానికి తీసుకోగల ఏ రెండు చర్యలను మనం చర్చిస్తాం?

4, 5. దేవుని మీద నమ్మకం ఉంచడం చాలామంది ప్రజలకు ఎందుకు కష్టమవుతోంది?

6. మానవ బాధలకుగల ఒక కారణాన్ని 1 పేతురు 5:8 ఎలా చూపిస్తోంది?

7. బాధలకుగల ఏ కారణాన్ని గుర్తించడానికి గలతీయులు 6:7 మనకు సహాయం చేస్తుంది?

8. ప్రసంగి 9:⁠11 ప్రకారం, ప్రజలు ఎందుకు బాధలు అనుభవిస్తారు?

9. బాధల గురించి చాలామంది ఏ విషయం అర్థం చేసుకోరు?

10, 11. (ఎ) రోమీయులు 8:19-22 ప్రకారం, “సృష్టి యావత్తు”కు ఏమి జరిగింది? (బి) సృష్టిని వ్యర్థతకు లోపరచినది ఎవరో మనమెలా నిర్ణయించవచ్చు?

12. “సృష్టి యావత్తు” అంటే ఏమిటనేదాని గురించి ఎలాంటి గందరగోళం ఏర్పడింది, ఈ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పవచ్చు?

13. ఏదెనులో జరిగిన తిరుగుబాటు మానవజాతికి ఏమి కలుగజేసింది?

14, 15. (ఎ) యెహోవా మానవజాతికి విధించిన శిక్ష న్యాయమైనదనడానికి ఏ సాక్ష్యాధారాన్ని మనం చూస్తాము? (బి) సృష్టి “స్వేచ్ఛగా” వ్యర్థతకు లోపరచబడలేదని పౌలు ఎందుకు చెప్పాడు?

16. (ఎ) నేడు మనం లోకంలో చూస్తున్న బాధలకు యెహోవా బాధ్యుడు కాడని మనమెందుకు నిశ్చయత కలిగివుండవచ్చు? (బి) నమ్మకమైన ప్రజలకు యెహోవా ప్రేమపూర్వకంగా ఏ నిరీక్షణను ఇచ్చాడు?

17. నేడు లోకంలోవున్న బాధలకు కారణాలను పరిశీలించడం ద్వారా మనమెలా ప్రభావితం కావాలి?

18, 19. యెహోవా మీద నమ్మకం ఉంచమని బైబిలు మనలను ఏ మాటలతో ప్రోత్సహిస్తోంది, కానీ ఆ విషయంలో, కొంతమందికి ఎలాంటి తప్పుడు తలంపులున్నాయి?

20, 21. యెహోవా మీద నమ్మకం ఉంచడంలో ఏమి ఇమిడివుంది? సోదాహరణంగా చెప్పండి.

22, 23. (ఎ) మనకు సమస్యలు ఎదురైనప్పుడు మనం యెహోవా మీద ఎందుకు నమ్మకం ఉంచాలి, మనం ఎలా నమ్మకం ఉంచవచ్చు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చర్చించబడుతుంది?

[8వ పేజీలోని చిత్రాలు]

దావీదు యెహోవాను తన ఆశ్రయంగా చేసుకున్నాడు

[10వ పేజీలోని చిత్రం]

యెరూషలేములో ఒక గోపురం కూలిపోయినప్పుడు దానికి యెహోవా బాధ్యుడు కాదని యేసు చూపించాడు