కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ఎల్లప్పుడూ మన గురించి శ్రద్ధ తీసుకుంటాడు

యెహోవా ఎల్లప్పుడూ మన గురించి శ్రద్ధ తీసుకుంటాడు

జీవిత కథ

యెహోవా ఎల్లప్పుడూ మన గురించి శ్రద్ధ తీసుకుంటాడు

ఎనెలెస్‌ ఇమ్‌జాంగ్‌ చెప్పినది

అది 1972. మలావీ యూత్‌ లీగ్‌ సభ్యులైన పదిమంది యువకులు దౌర్జన్యంగా మా ఇంట్లోకి ప్రవేశించి నన్ను పట్టుకుని దగ్గరలోవున్న చెరుకు తోటలోకి లాక్కుపోయారు. అక్కడ వాళ్ళు నన్ను కొట్టి, నేను చనిపోయాననుకుని వదిలేసి వెళ్ళిపోయారు.

మలావీలో అనేకమంది యెహోవాసాక్షులు అటువంటి క్రూరమైన హింసనే ఎదుర్కొన్నారు. వారెందుకు హింసించబడ్డారు? సహించడానికి వారికేమి సహాయం చేసింది? దయచేసి నన్ను మా కుటుంబ గాథ చెప్పనివ్వండి.

నే ను మతాసక్తిగల ఒక కుటుంబంలో 1921, డిసెంబరు 31న జన్మించాను. మా నాన్నగారు సెంట్రల్‌ ఆఫ్రికన్‌ ప్రెస్బిటేరియన్‌ చర్చిలో పాస్టరు. నేను మలావీ రాజధానియైన లిలాంగ్వేకు సమీపంలోవున్న ఎంగోమ్‌ అనే చిన్న పట్టణంలో పెరిగాను. నాకు 15 ఏళ్ళున్నప్పుడు నేను ఎమాస్‌ ఇమ్‌జాంగ్‌కు భార్యనయ్యాను.

ఒకరోజు, మా నాన్నగారి స్నేహితుడొకాయన మా దగ్గరికి వచ్చాడు, ఆయన కూడా పాస్టరే. మా ఇంటికి దగ్గర్లో యెహోవాసాక్షులు నివసిస్తున్నారని గమనించి వారితో పొత్తు పెట్టుకోవద్దని ఆయన మమ్మల్ని హెచ్చరించాడు. సాక్షులు దయ్యం పట్టినవారని, మేము జాగ్రత్తగా ఉండకపోతే మాకు కూడా దయ్యాలు పడతాయని ఆయన చెప్పాడు. ఆ హెచ్చరికతో మేమెంతగా కంగారు పడిపోయామంటే మేము మరో గ్రామానికి మకాం మార్చేశాం, అక్కడ ఎమాస్‌ దుకాణదారుడిగా ఉద్యోగం సంపాదించుకున్నాడు. అయితే మా క్రొత్త ఇల్లు కూడా యెహోవాసాక్షులకు దగ్గరలోనే ఉన్నట్లు మేము త్వరలోనే తెలుసుకున్నాం!

కొద్దికాలంలోనే, బైబిలుపట్ల ఎమాస్‌కున్న ప్రగాఢమైన ప్రేమ సాక్షుల్లో ఒకరితో మాట్లాడేలా ఆయనను పురికొల్పింది. ఎమాస్‌ తనకున్న అనేక ప్రశ్నలకు ఒప్పించే సమాధానాలను పొందిన తర్వాత సాక్షులు తనతో బైబిలు అధ్యయనం నిర్వహించడానికి ఒప్పుకున్నారు. మొదట్లో ఆయన పనిచేసే దుకాణం దగ్గర బైబిలు అధ్యయనం జరిగేది కానీ తర్వాత వారం వారం అధ్యయనం మా ఇంట్లోనే జరిగేది. యెహోవాసాక్షులు ఇంటికి వచ్చిన ప్రతిసారి నేను బయటకు వెళ్ళిపోయేదాన్ని ఎందుకంటే వాళ్ళంటే నాకు భయమేసేది. అయినా, ఎమాస్‌ బైబిలు అధ్యయనం కొనసాగించారు. ఆయన అధ్యయనం ప్రారంభించిన ఆరునెలల తర్వాత 1951 ఏప్రిల్‌లో బాప్తిస్మం తీసుకున్నారు. కానీ ఆ విషయం నాకు చెప్పలేదు ఎందుకంటే ఆ వార్త తెలిస్తే నేను ఆయనతో తెగతెంపులు చేసుకుంటానని ఆయన భయపడ్డాడు.

కష్టభరితమైన వారాలు

అయితే నా భర్త ఒక యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకున్నారని ఒకరోజు నా స్నేహితురాలు ఎలెన్‌ కాడ్జలెరో నాతో చెప్పింది. నాకు పిచ్చి కోపం వచ్చింది! ఆ రోజు నుండి నేను ఆయనతో మాట్లాడ్డం, ఆయన కోసం వంటచేయడం మానేశాను. ఆయన కోసం నీళ్ళు పట్టుకురావడం, స్నానానికి నీళ్ళు కాగబెట్టడం కూడా మానేశాను​—⁠మా సంస్కృతి ప్రకారం అవి భార్య నిర్వర్తించవలసిన విధులు.

ఇదంతా మూడు వారాలపాటు సహించిన తర్వాత ఎమాస్‌ ప్రేమగా నన్ను తన దగ్గర కూర్చోమని అడిగి, తాను సాక్షిని కావాలని ఎందుకు నిర్ణయించుకున్నాడో నాకు చెప్పాడు. ఆయన 1 కొరింథీయులు 9:⁠16 వంటి వివిధ లేఖనాలను చదివి వివరించాడు. నేను ఎంతగానో కదిలిపోయి నేను కూడా సువార్త ప్రకటించడంలో భాగం వహించవలసిన అవసరం ఉందని భావించాను. కాబట్టి నేను యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి నిర్ణయించుకున్నాను. అదే సాయంకాలం నేను నా భర్త కోసం మంచి భోజనం సిద్ధంచేశాను, ప్రేమగల నా భర్తకు అదెంతో సంతోషాన్ని కలిగించింది.

నా కుటుంబంతో, స్నేహితులతో సత్యాన్ని పంచుకోవడం

మేము యెహోవాసాక్షులతో సహవసిస్తున్నామని మా తల్లిదండ్రులకు తెలిసినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎంతో వ్యతిరేకించారు. మేము ఇక తమ దగ్గరికి రావలసిన అవసరం లేదంటూ మా కుటుంబీకులు మాకు ఉత్తరం వ్రాశారు. వాళ్ళ ప్రతిస్పందన మమ్మల్ని బాధపెట్టింది, కానీ మాకు ఎంతోమంది ఆధ్యాత్మిక అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు, తండ్రులు, తల్లులు లభిస్తారన్న యేసు వాగ్దానంపై మేము విశ్వాసముంచాం.​—⁠మత్తయి 19:​29.

నేను బైబిలు అధ్యయనంలో త్వరగా ప్రగతిసాధించి, నా భర్త బాప్తిస్మం తీసుకున్న మూడున్నర నెలలకే 1951 ఆగస్టులో బాప్తిస్మం తీసుకున్నాను. నేను నా స్నేహితురాలైన ఎలెన్‌కు సత్యం తెలియజేయాలని ఎంతో కోరుకున్నాను. సంతోషకరంగా, ఆమె బైబిలు అధ్యయనానికి అంగీకరించింది. ఎలెన్‌ 1952 మేలో బాప్తిస్మం తీసుకుని నా ఆధ్యాత్మిక సహోదరి అయ్యింది, అది మా స్నేహబంధాన్ని మరింత పటిష్ఠం చేసింది. నేడు, మేము ఇంకా ఎంతో సన్నిహిత స్నేహితులం.

ఎమాస్‌ 1954లో సంఘాలను దర్శించడానికి ప్రాంతీయ పైవిచారణకర్తగా నియమించబడ్డారు. అప్పటికి మాకు ఆరుగురు పిల్లలున్నారు. ఆ రోజుల్లో, కుటుంబం ఉన్న ప్రయాణ పైవిచారణకర్త ఒక వారం సంఘాన్ని దర్శిస్తూ గడిపేవాడు తర్వాతి వారం ఇంటికెళ్ళి తన భార్యాపిల్లలతో గడిపేవాడు. ఎమాస్‌ ప్రయాణ పని మీద వెళ్ళినప్పుడల్లా నేను తప్పకుండా కుటుంబ బైబిలు అధ్యయనం నిర్వహించేలా చూసేవారు. అధ్యయనం మా పిల్లలకు సంతోషం కలిగించేదిగా ఉండేలా చూసేందుకు మేము ప్రయత్నించేవాళ్ళం. అంతేగాక యెహోవాపట్ల, ఆయన వాక్యంలోని సత్యంపట్ల మాకున్న ప్రేమ గురించి మేము హృదయపూర్వకమైన దృఢనమ్మకంతో మాట్లాడేవాళ్ళం, ప్రకటనాపనిలో కుటుంబమంతా కలిసి పాల్గొనేవాళ్ళం. ఈ ఆధ్యాత్మిక శిక్షణా కార్యక్రమం మా పిల్లల విశ్వాసాన్ని బలపరిచి, మేము ఎదుర్కోనైయున్న హింసకు వారిని సిద్ధం చేసేందుకు సహాయపడింది.

మత హింస ప్రారంభం

1964లో మలావీ స్వతంత్ర రాజ్యమైంది. పాలక పార్టీలోని అధికారులు రాజకీయాల్లో మా తటస్థ వైఖరి గురించి తెలుసుకున్నప్పుడు, మేము పార్టీ సభ్యత్వ కార్డులు కొనేలా మమ్మల్ని బలవంతం చేయడానికి ప్రయత్నించారు. * ఎమాస్‌, నేను వాటిని కొనడానికి నిరాకరించడంతో యూత్‌ లీగ్‌ సభ్యులు మా మొక్కజొన్న పంటను నాశనం చేశారు​—⁠రానున్న సంవత్సరంలో మా ఆహారానికి అదే మూలాధారం. యూత్‌ లీగ్‌ సభ్యులు మా మొక్కజొన్న పంటను నరికేస్తూ ఇలా పాటలు పాడారు: “కామూజూ [అధ్యక్షుడైన బాండా] కార్డు కొనడానికి నిరాకరించేవారందరి పచ్చని మొక్కజొన్న చేలను కీటకాలు తినేస్తాయి, ఈ ప్రజలు వాటి కోసం ఏడుస్తారు.” ఇలా ఆహారనష్టం జరిగినా మేము బాధపడలేదు. మేము యెహోవా కాపుదలను చవిచూశాము. ఆయన ప్రేమపూర్వకంగా మమ్మల్ని బలపరిచాడు.​—⁠ఫిలిప్పీయులు 4:​12, 13.

1964, ఆగస్టులో ఒకరోజు అర్ధరాత్రి నేను పిల్లలతోపాటు ఒంటరిగా ఇంట్లో ఉన్నాను. మేము నిద్రపోతున్నాం కానీ దూరంగా పాటలు పాడుతున్న శబ్దానికి నాకు మెలకువ వచ్చింది. అది గూలెవామ్‌కూలూ అంటే కొండజాతి నర్తకుల రహస్య సమాజం, వాళ్ళంటే అందరికీ భయం, వాళ్ళు ప్రజలపై దాడిచేసి మరణించిన పూర్వీకుల ప్రేతాత్మలుగా నటించేవాళ్ళు. యూత్‌ లీగ్‌ వాళ్ళు మాపై దాడి చేయమని గూలెవామ్‌కూలూను పంపారు. వెంటనే నేను పిల్లల్ని లేపి, ఆ దాడి చేసేవాళ్ళు మా ఇంటిని చేరుకునే లోపే మేము పొదల్లోకి పారిపోయాము.

మేము దాక్కునివున్న స్థలం నుండి పెద్ద మంట కనిపించింది. గడ్డితో వేయబడిన పైకప్పున్న మా ఇంటికి గూలెవామ్‌కూలూ నిప్పంటించారు. మా వస్తువులన్నిటితో అది కాలి బూడిదైపోయింది. దాడిచేసినవాళ్ళు మా ఇల్లు కాలిపోయి బూడిదకాగా అక్కడనుండి నడిచివెళ్ళిపోతూ “ఆ సాక్షి వెచ్చగా ఒళ్లు కాచుకోవడానికి మంచి మంట పెట్టాము” అని మాట్లాడుకోవడం మేము విన్నాం. మేము సురక్షితంగా తప్పించుకోగలిగినందుకు యెహోవాకు మేమెంత కృతజ్ఞులమో! నిజానికి వాళ్ళు మా ఆస్థి అంతా నాశనం చేశారు గానీ, మనుషుల మీద కాదు గానీ యెహోవా మీద నమ్మకం ఉంచాలనే మా దృఢ నిశ్చయాన్ని నాశనం చేయలేదు.​—⁠కీర్తన 118:⁠8.

గూలెవామ్‌కూలూ మా ప్రాంతంలోని మరో ఐదు యెహోవాసాక్షుల కుటుంబాలకు అదే ఘోరమైన పని చేశారని మాకు తెలిసింది. ఇరుగుపొరుగు సంఘాల సహోదరులు మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చినందుకు మేమెంత సంతోషంగా, కృతజ్ఞతగా ఉన్నామో! వాళ్ళు మా ఇళ్ళు నిర్మించి, చాలా వారాలపాటు మాకు ఆహారం అందించారు.

హింస తీవ్రం కావడం

1967 సెప్టెంబరులో యెహోవాసాక్షులందరిని బలవంతంగా ఒక దగ్గర చేర్చాలన్న ప్రచారం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. కనికరంలేని ఉగ్రులైన యౌవనస్థులు కొడవళ్ళు పట్టుకుని వచ్చిన యూత్‌ లీగ్‌కు, మలావీ యంగ్‌ పయినీర్స్‌కు చెందిన సభ్యులు మమ్మల్ని పట్టుకోవడానికి, ఇంటింటా సాక్షుల కోసం వెతికారు. వాళ్ళు సాక్షులను కనుగొన్నప్పుడు వారికి రాజకీయ పార్టీ కార్డులు అమ్మజూశారు.

మా ఇంటికి వచ్చి మాకు పార్టీ కార్డు ఉందోలేదో చెప్పమని వాళ్ళు అడిగారు. “లేదు, నేను కొనలేదు. నేను దాన్ని ఇప్పుడే కాదు తర్వాత భవిష్యత్తులో కూడా కొనను” అని వాళ్ళకు చెప్పాను. దానితో వాళ్ళు నా భర్తను, నన్ను పట్టుకుని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్ళారు, మాతోపాటు ఏమీ తీసుకెళ్ళడానికి వారు అవకాశం ఇవ్వలేదు. మా చిన్నపిల్లలు బడి నుండి ఇంటికి వచ్చేసరికి మేము ఇంట్లో లేకపోవడంతో వాళ్ళు చాలా కంగారుపడ్డారు. సంతోషకరంగా, మా పెద్దబ్బాయి డాన్యల్‌ కొంతసేపటికి ఇంటికి వచ్చి ఏమి జరిగిందో ప్రక్కింటి ఆయన నుండి తెలుసుకున్నాడు. వెంటనే వాడు తన తమ్ముళ్ళను, చెల్లెళ్ళను తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు. పోలీసులు మమ్మల్ని లిలాంగ్వేకు తీసుకెళ్ళడానికి ట్రక్కుల్లోకి ఎక్కిస్తుండగా వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. దానితో మా పిల్లలు మాతోపాటు వచ్చారు.

లిలాంగ్వేలో పోలీసు ప్రధాన కార్యాలయంలో బూటకపు విచారణ జరిపారు. “మీరు యెహోవాసాక్షులుగానే కొనసాగుతారా?” అని ఆఫీసర్లు మమ్మల్ని అడిగారు. “అవును” అని సమాధానమిస్తే మాకు ఏడు సంవత్సరాల జైలు శిక్షపడుతుందని తెలిసినా మేము అవుననే సమాధానమిచ్చాం. సంస్థను “నడిపిస్తున్న” వారికి 14 సంవత్సరాల శిక్ష.

ఒక రాత్రి నిద్రాహారాలు లేకుండా గడిపిన తర్వాత పోలీసులు మమ్మల్ని మవూల్‌ జైలుకు తీసుకెళ్లారు. అక్కడి జైలు గదులు ఎంత క్రిక్కిరిసిపోయి ఉన్నాయంటే మాకు నేల మీద పడుకోవడానికి కూడా స్థలం దొరకలేదు! క్రిక్కిరిసివున్న జైలుగది మరుగుదొడ్డిలో కేవలం ఒక బకెట్టు మాత్రమే అందుబాటులో ఉంది. ఆహార సరఫరా అంతంత మాత్రమే, అదీ సరిగా ఉడికింది కాదు. రెండు వారాల తర్వాత, మేము శాంతియుతంగా ఉండే ప్రజలమని జైలు అధికారులు గుర్తించి మేము జైలుగది బయటవున్న వ్యాయామ ప్రాంగణాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించారు. అంతమందిమి కలిసి ఉండేవాళ్ళం కాబట్టి మాకు ప్రతిరోజు ఒకరినొకరం ప్రోత్సహించుకోవడానికి, ఇతర ఖైదీలకు చక్కని సాక్ష్యం ఇవ్వడానికి అవకాశాలు లభించేవి. మేము ఆశ్చర్యపడేలా, మూడు నెల్లపాటు శిక్ష అనుభవించిన తర్వాత, మలావీ ప్రభుత్వంపై అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడి కారణంగా మేము విడుదల చేయబడ్డాము.

పోలీసు ఆఫీసర్లు మమ్మల్ని మా ఇళ్ళకు తిరిగి వెళ్ళమని చెప్పారు, అయితే అదే సమయంలో, మలావీలో యెహోవాసాక్షులు నిషేధించబడ్డారని కూడా వాళ్ళు మాకు చెప్పారు. ఈ నిషేధం 1967 అక్టోబరు 20 నుండి 1993 ఆగస్టు 12 వరకు అంటే దాదాపు 26 సంవత్సరాలు కొనసాగింది. అవి చాలా కష్టభరితమైన సంవత్సరాలు, అయినా యెహోవా సహాయంతో మేము మా తటస్థతను కాపాడుకోగలిగాం.

జంతువుల్లా వేటాడబడ్డాం

1972 అక్టోబరులో, ఒక ప్రభుత్వ ఉత్తర్వు మరో దౌర్జన్యపూరిత కాలాన్ని తెచ్చింది. యెహోవాసాక్షులందరినీ వారి ఉద్యోగాల్లోనుండి తొలగించాలని, గ్రామాల్లో నివసిస్తున్న సాక్షులందరినీ వాళ్ళ ఇళ్ళల్లోనుండి వెళ్ళగొట్టాలని ఆ ఉత్తర్వు తెలియజేసింది. అప్పుడు సాక్షులను జంతువులను వేటాడినట్లు వేటాడారు.

ఆ సమయంలో ఒక యౌవన క్రైస్తవ సహోదరుడు ఎమాస్‌ కోసం ఒక అత్యవసర సందేశంతో మా ఇంటికి వచ్చాడు, అదేమిటంటే ‘యూత్‌ లీగ్‌వాళ్లు మీ తల నరికి దాన్ని ఒక గుంజకు కట్టి దానిని స్థానిక ముఖ్యుల దగ్గరికి తీసుకెళ్ళాలని పన్నాగం పన్నుతున్నారు.’ ఎమాస్‌ వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు, అయితే వెళ్ళే ముందు వీలైనంత త్వరగా మేము ఆయనను అనుసరించేలా ఏర్పాట్లు చేసి వెళ్ళారు. త్వరత్వరగా నేను పిల్లల్ని పంపేశాను. ఆ తర్వాత నేను కూడా వెళ్లబోతుండగా, యూత్‌ లీగ్‌కు చెందిన పదిమంది సభ్యులు ఎమాస్‌ను వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి ఎమాస్‌ లేడని గ్రహించారు. ఆగ్రహంతో వాళ్ళు నన్ను దగ్గర్లోవున్న చెరకు తోటలోకి లాక్కెళ్ళి కాళ్లతో తన్ని, చెరకుగడలతో కొట్టారు. ఆ తర్వాత నేను చనిపోయాననుకుని వెళ్ళిపోయారు. నాకు స్పృహ వచ్చాక మెల్లగా ఇల్లు చేరుకున్నాను.

ఆ రాత్రి చీకట్లో ఎమాస్‌ ప్రాణాలకు తెగించి నాకోసం ఇంటికి తిరిగివచ్చాడు. నాకు బాగా దెబ్బలు తగిలివుండడం చూసి ఎమాస్‌, కారుగల ఆయన స్నేహితుడొకాయన కలిసి నన్ను మెల్లగా వాహనంలోకి ఎక్కించారు. తర్వాత మేము లిలాంగ్వేలోవున్న ఒక సహోదరుని ఇంటికి వెళ్ళాం, అక్కడే నేను ఆ దాడి నుండి కోలుకున్నాను, ఎమాస్‌ దేశంలో నుండి తప్పించుకుని పోవడానికి ఆలోచన మొదలుపెట్టాడు.

వెళ్ళడానికి ఏ స్థలమూ లేని శరణార్థులు

మా కుమార్తె డానస్‌కు, ఆమె భర్తకు ఐదు టన్నుల ట్రక్కు ఉంది. వాళ్ళు, ఒకప్పుడు మలావీ యంగ్‌ పయినీర్‌గా ఉండి ఇప్పుడు మా పరిస్థితిపట్ల సానుభూతి చూపిస్తున్న ఒక వ్యక్తిని డ్రైవరుగా పెట్టుకున్నారు. ఆయన మాకు, ఇతర సాక్షులకు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. ఆయన అనేక సాయంకాలాల్లో ముందుగా ఏర్పాటు చేయబడిన రహస్య స్థలాలగుండా సాక్షులను తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఆయన మలావీ యంగ్‌ పయినీర్‌ యూనిఫారం ధరించి, వివిధ పోలీసు రోడ్‌బ్లాక్‌ల గుండా ట్రక్కును తీసుకెళ్ళాడు. సరిహద్దు దాటి జాంబియాలోకి ప్రవేశించడానికి ఆయన తన ప్రాణాలకు తెగించి వందలాదిమంది సాక్షులకు సహాయం చేశాడు.

కొన్ని నెలల తర్వాత జాంబియా అధికారులు మమ్మల్ని తిరిగి మలావీకి పంపించారు; అయినా మేము మా స్వగ్రామానికి వెళ్ళలేకపోయాం. మేము వదిలేసి వెళ్ళిన వస్తువులన్నీ దొంగిలించబడ్డాయి. మా ఇంటి పైకప్పు కోసం ఉపయోగించబడిన లోహపు రేకులు సహితం ఎత్తుకెళ్ళిపోయారు. వెళ్ళడానికి సురక్షితమైన స్థలమేదీ లేక మేము మొజాంబిక్‌కు పారిపోయి, మ్లాంగెనీ శరణార్థి శిబిరంలో రెండున్నర సంవత్సరాలు ఉన్నాం. అయితే 1975 జూన్‌లో, మొజాంబిక్‌లోని క్రొత్త ప్రభుత్వం శరణార్థి శిబిరాన్ని మూసేసి, మమ్మల్ని మలావీకి తిరిగి వెళ్ళమని బలవంతం చేసింది, అక్కడ యెహోవా ప్రజలకు పరిస్థితులేమీ మారలేదు. మేము మళ్ళీ రెండవసారి జాంబియాకు పారిపోక తప్పలేదు. అక్కడ మేము చీగూమూకీర్‌ శరణార్థి శిబిరానికి చేరుకున్నాం.

రెండు నెలల తర్వాత, వరుసగా బస్సులు మిలటరీ ట్రక్కులు మెయిన్‌ రోడ్డు దగ్గర వచ్చి ఆగాయి, సాయుధులైన వందలాదిమంది జాంబియా సైనికులు శిబిరాన్ని చుట్టుముట్టారు. మా కోసం చక్కని ఇళ్ళు నిర్మించబడ్డాయని, మేము అక్కడికి చేరుకోవడానికి మాకు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నారని వాళ్ళు మాకు చెప్పారు. ఇది నిజం కాదని మాకు తెలుసు. సైనికులు ప్రజలను బలవంతంగా బస్సుల్లోకి, ట్రక్కుల్లోకి ఎక్కించడం మొదలెట్టారు, దానితో కలవరం చెలరేగింది. సైనికులు తమ ఆటోమేటిక్‌ ఆయుధాలతో గాలిలోకి కాల్పులు జరపడం మొదలుపెట్టారు, భయంతో వేలాదిమంది మన సహోదర సహోదరీలు ఇటు అటు చెదరిపోయారు.

ఆ గందరగోళంలో, త్రొక్కిసలాటలో ప్రమాదవశాత్తు ఎమాస్‌ క్రిందపడగా ఒక సహోదరుడు ఆయన లేవడానికి సహాయం చేశాడు. ఇది మహాశ్రమల ఆరంభమని మేము అనుకున్నాం. శరణార్థులందరూ తిరిగి మలావీ వైపు పరుగెత్తారు. మేము ఇంకా జాంబియాలో ఉండి ఒక నది దగ్గరికి చేరుకున్నాం, అందరూ సురక్షితంగా దాటివెళ్ళడానికి వీలుగా సహోదరులు అనేక మానవ గొలుసులుగా ఏర్పడ్డారు. అయితే నదికి మరో వైపున జాంబియా సైనికులు మమ్మల్ని చుట్టుముట్టి బలవంతంగా మళ్ళీ మలావీకి పంపేశారు.

మళ్ళీ మలావీకి తిరిగివచ్చిన మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. తమ గ్రామాల్లోకి వస్తున్న “క్రొత్త ముఖాల” గురించి అంటే యెహోవాసాక్షుల గురించి కనిపెట్టుకోవాలని రాజకీయ ర్యాలీల్లో, వార్తాపత్రికల్లో ప్రజలను హెచ్చరించారని మాకు తెలిసింది. కాబట్టి మేము రాజధానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం, అక్కడైతే గ్రామాల్లోలా మేము ప్రత్యేకంగా కనిపించం. మేము ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకోగలిగాం, ఎమాస్‌ ప్రయాణ పైవిచారణకర్తగా సంఘాలను రహస్యంగా దర్శించడం ప్రారంభించారు.

సంఘకూటాలకు హాజరుకావడం

నమ్మకంగా ఉండడానికి మాకేమి సహాయం చేసింది? సంఘకూటాలు! మొజాంబిక్‌, జాంబియాలలోని శరణార్థి శిబిరాల్లో, మేము గడ్డి పైకప్పున్న సాధారణ రాజ్య మందిరాల్లో నిర్వహించబడిన కూటాలకు స్వేచ్ఛగా హాజరయ్యాం. మలావీలో కూటాల కోసం సమావేశం కావడం ప్రమాదకరం, కష్టం, అయినా శ్రమకు తగిన ఫలితం ఉండేది. దొరికిపోకుండా ఉండడానికి మేము సాధారణంగా రాత్రి పొద్దుపొయ్యాక మారుమూల ప్రాంతాల్లో కూటాలు జరుపుకునే వాళ్ళం. మా సమావేశాలమీద దృష్టిపడకుండా ఉండడానికి మేము ప్రసంగీకుని పట్ల మా మెప్పును చూపించడానికి చప్పట్లు కొట్టేవాళ్ళం కాదు గానీ రెండు చేతులు ఒకదానితో ఒకటి రుద్దేవాళ్ళం.

బాప్తిస్మాలు చాలా రాత్రయ్యాక ఇవ్వబడేవి. మా అబ్బాయి అబీయూద్‌ అలాంటి సందర్భంలోనే బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం ప్రసంగం తర్వాత, తనను, బాప్తిస్మం తీసుకునే ఇతర సభ్యులను చీకట్లో ఒక చిత్తడి స్థలానికి తీసుకెళ్లారు, అక్కడ అంతగా లోతులేని ఒక గుంత త్రవ్వబడి ఉంది. అక్కడే వాళ్ళు బాప్తిస్మం పొందారు.

మా చిన్న ఇల్లు సురక్షితమైన ఆశ్రయం

ప్రభుత్వ నిషేధం విధించబడిన తర్వాతి సంవత్సరాల్లో లిలాంగ్వేలోని మా ఇల్లు సురక్షితమైన స్థావరంగా ఉపయోగించుకోబడింది. జాంబియా బ్రాంచి కార్యాలయం నుండి ఉత్తరాలు, సాహిత్యం రహస్యంగా మా ఇంటికి చేరవేయబడేవి. సైకిలు మీద కొరియర్లుగా పనిచేసే సహోదరులు మా ఇంటికి వచ్చి జాంబియా నుండి వచ్చిన ఉత్తరాలను, సాహిత్యాన్ని తీసుకుని మలావీలో అన్ని భాగాలకు చేరవేసేవారు. పంచిపెట్టబడే కావలికోట పత్రికలు చాలా పలచగా ఉండేవి ఎందుకంటే అవి బైబిలు పేపరు మీద ముద్రించబడేవి. అందువల్ల, పత్రికలు మామూలు కాగితంతో చేయబడినవైతే ఎన్ని తీసుకెళ్ళడం సాధ్యమవుతుందో అంతకు రెండింతలు పత్రికలను తీసుకువెళ్ళడం కొరియర్లకు సాధ్యమయ్యేది. కొరియర్లు కావలికోట చిన్నపత్రికలను కూడా పంచిపెట్టేవారు, వాటిలో కేవలం అధ్యయన ఆర్టికల్స్‌ మాత్రమే ఉండేవి. చిన్నపత్రికను చొక్కా జేబులో దాచుకోవడం సులభం ఎందుకంటే అది ఒకే కాగితంలో ఉండేది.

ఆ కొరియర్లు తమ స్వేచ్ఛను ఫణంగా పెట్టి ప్రాణాలకు తెగించి పొదలగుండా కొన్నిసార్లు రాత్రి చీకట్లో, నిషేధించబడిన సాహిత్యాలున్న అట్టపెట్టెలను సైకిళ్ళమీద పెట్టుకుని తీసుకెళ్లేవారు. పోలీసుల తనిఖీలు, ఇతర ప్రమాదాలు ఎదురైనా వాళ్ళు తమ సహోదరులకు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడానికి అన్ని రకాలైన వాతావరణాల్లో వందలాది కిలోమీటర్లు ప్రయాణించారు. ఆ ప్రియమైన కొరియర్లు ఎంత ధైర్యశాలులో కదా!

యెహోవా విధవరాండ్ర గురించి శ్రద్ధ తీసుకుంటాడు

1992 డిసెంబరులో, ఒక ప్రాంతీయ సందర్శనంలో ప్రసంగం ఇస్తుండగా ఎమాస్‌కు స్ట్రోక్‌ వచ్చింది. ఆ తర్వాత ఆయనిక మాట్లాడలేకపోయారు. కొంతకాలం తర్వాత రెండవసారి స్ట్రోక్‌ రావడంతో ఆయన శరీరం ఒకవైపు పక్షవాతానికి గురయ్యింది. అనారోగ్యాన్ని సహించడం ఆయనకు కష్టంగా ఉన్నా, మా సంఘం నుండి మాకు లభించిన ప్రేమపూర్వక మద్దతు నా భయాన్ని పోగొట్టింది. నా భర్త 76 ఏళ్ళ వయస్సులో 1994 నవంబరులో చనిపోయే వరకు నేను ఆయన గురించి ఇంట్లోనే శ్రద్ధ తీసుకోగలిగాను. మేము 57 ఏళ్ళపాటు వైవాహిక జీవితాన్ని గడిపాము, ఎమాస్‌ చనిపోక ముందు నిషేధం ఎత్తివేయబడడాన్ని చూశారు. నమ్మకస్థుడైన నా సహచరుని లోటుకు నేను ఇప్పటికీ దుఃఖిస్తున్నాను.

నేను విధవరాలినైన తర్వాత, మా అల్లుడు తన భార్యా ఐదుగురు పిల్లల గురించే కాదు నా గురించి కూడా శ్రద్ధ తీసుకునే బాధ్యతను తన భూజాలపై వేసుకున్నాడు. విచారకరంగా, స్వల్ప అనారోగ్యంతో ఆయన 2000 ఆగస్టులో మరణించాడు. నా కూతురు మా కోసం ఆహారం, వసతి ఎలా సంపాదించగలదు? యెహోవా మన గురించి శ్రద్ధ తీసుకుంటాడనీ, నిజంగా ఆయన “తండ్రి లేనివారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు” అనీ నేను మరోసారి తెలుసుకున్నాను. (కీర్తన 68:⁠5) భూమిపైనున్న తన సేవకుల ద్వారా యెహోవా మాకొక క్రొత్త అందమైన ఇంటిని ఇచ్చాడు. అదెలా సాధ్యమైంది? సంఘంలోని సహోదర సహోదరీలు మా కష్టాలు చూసి కేవలం ఐదు వారాల్లో మా కోసం ఒక ఇల్లు నిర్మించారు! తాపీ పనివాళ్ళైన ఇతర సంఘాలకు చెందిన సహోదరులు సహాయం చేయడానికి వచ్చారు. ఈ సాక్షులందరూ చూపించిన ప్రేమ, కనికరం మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసేశాయి, ఎందుకంటే వాళ్ళు మాకోసం నిర్మించిన ఇల్లు వాళ్ళల్లో చాలామంది నివసిస్తున్న ఇళ్ళ కన్నా బాగుంది. సంఘం చూపించిన ఈ ప్రేమ మా ఇరుగుపొరుగున మంచి సాక్ష్యం ఇచ్చింది. రాత్రి నిద్రకు ఉపక్రమిస్తూ నేను పరదైసులో ఉన్నట్లు భావిస్తాను! అవును, అందమైన మా క్రొత్త ఇల్లు సున్నం, ఇసుక, నీరు కలిసిన మిశ్రమంతో ఇటుకలతో నిర్మించినదే అయినా చాలామంది అన్నట్లుగా, అది ప్రేమతో కట్టిన ఇల్లు.​—⁠గలతీయులు 6:​10.

యెహోవా ఎడతెగని శ్రద్ధ

నేను కొన్నిసార్లు ఎంతో కృంగిపోయినా, యెహోవా నాపై దయచూపాడు. మా తొమ్మిదిమంది పిల్లల్లో ఏడుగురు ఇంకా సజీవంగా ఉన్నారు, ఇప్పుడు మా కుటుంబంలో మొత్తం 123మంది ఉన్నారు. వారిలో అత్యధికశాతం నమ్మకంగా యెహోవా సేవ చేస్తున్నందుకు నేనెంత కృతజ్ఞురాలినో!

నేడు, 82 ఏళ్ళ వయస్సులో, దేవుని ఆత్మ మలావీలో సాధించినదాన్ని చూస్తే నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. కేవలం గత నాలుగు సంవత్సరాల్లోనే రాజ్యమందిరాలు ఒకటి నుండి 600 కంటే ఎక్కువగా అభివృద్ధి చెందడం నేను చూశాను. ఇప్పుడు లిలాంగ్వేలో మాకు ఒక క్రొత్త బ్రాంచి కార్యాలయం కూడా ఉంది, బలపరిచే ఆధ్యాత్మిక ఆహారాన్ని మేము నిరాటంకంగా అందుకుంటున్నాం. నేను యెషయా 54:17లో కనిపించే దేవుని వాగ్దాన నెరవేర్పును అనుభవించానని నిజంగా భావిస్తున్నాను, అక్కడిలా హామీ ఇవ్వబడింది: “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు.” యాభై ఏళ్ళకు పైగా యెహోవా సేవచేసిన తర్వాత, ఎలాంటి శ్రమలు వచ్చినా యెహోవా ఎల్లప్పుడూ మన గురించి శ్రద్ధ తీసుకుంటాడని నాకు దృఢ నమ్మకం ఉంది.

[అధస్సూచి]

^ పేరా 17 మలావీలోని యెహోవాసాక్షుల చరిత్ర గురించి మరింత సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం 1999, (ఆంగ్లం) 149-223 పేజీలు చూడండి.

[24వ పేజీలోని చిత్రం]

నా భర్త ఎమాస్‌ 1951 ఏప్రిల్‌లో బాప్తిస్మం తీసుకున్నాడు

[26వ పేజీలోని చిత్రం]

ధైర్యవంతులైన కొరియర్ల గుంపు

[28వ పేజీలోని చిత్రం]

ప్రేమతో కట్టిన ఇల్లు