కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వృద్ధులైన తోటి విశ్వాసులను మీరు విలువైనవారిగా ఎంచుతారా?

వృద్ధులైన తోటి విశ్వాసులను మీరు విలువైనవారిగా ఎంచుతారా?

వృద్ధులైన తోటి విశ్వాసులను మీరు విలువైనవారిగా ఎంచుతారా?

ప్రాచీన ఇశ్రాయేలు ప్రజలు దేవునితో నిబంధన సంబంధంలో ఉన్నప్పుడు వారికిలా ఆజ్ఞాపించబడింది: “తల నెరసినవానియెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను.” (లేవీయకాండము 19:​32) కాబట్టి వృద్ధులపట్ల గౌరవం చూపించడం ఒక పవిత్ర బాధ్యత, అది దేవునికి విధేయులై ఉండడంతో సన్నిహిత సంబంధం కలిగివుంది. నేడు క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం క్రింద లేకపోయినప్పటికీ తన సేవచేసే వృద్ధులను యెహోవా అమూల్యమైనవారిగా ఎంచుతాడని అది మనకు జ్ఞాపకం చేస్తుంది. (సామెతలు 16:31; హెబ్రీయులు 7:​18, 19) మనం యెహోవా దృక్కోణాన్ని ప్రతిబింబిస్తున్నామా? వృద్ధులైన మన క్రైస్తవ సహోదర సహోదరీలను మనం విలువైనవారిగా ఎంచుతామా?

తన వృద్ధ స్నేహితుడ్ని ఆయన విలువైనవాడిగా ఎంచాడు

వృద్ధులపట్ల గౌరవం చూపించడాన్ని ఉన్నతపరిచే ఒక బైబిలు వృత్తాంతం రెండవ రాజుల గ్రంథంలో ఉంది. ఏలీయా ప్రవక్త తర్వాత ఆయన స్థానాన్ని యౌవనస్థుడైన ఎలీషా ప్రవక్త ఎలా చేపట్టాడనే విషయ వివరణ దానిలో ఉంది. ఏలీయా పదిగోత్రాల ఇశ్రాయేలు రాజ్యంలో ప్రవక్తగావున్న చివరి రోజున ఏమి జరిగిందో పరిశీలించండి.

ఆ రోజున యెహోవా గిల్గాలు నుండి బేతేలుకు, బేతేలు నుండి యెరికోకు, యెరికో నుండి యొర్దాను నదికి ప్రయాణించమని వృద్ధుడైన ఆ ప్రవక్తకు నిర్దేశించాడు. (2 రాజులు 2:1, 2, 4, 6) దాదాపు 50 కిలోమీటర్ల ఆ ప్రయాణంలో ఏలీయా, తనవెంట రావడం మానుకోమని ఎలీషాకు మూడుసార్లు చెప్పాడు. అయితే, శతాబ్దాల క్రితం యౌవనస్థురాలైన రూతు నయోమిని విడిచివెళ్ళడానికి నిరాకరించినట్లే, ఎలీషా కూడా వృద్ధుడైన ప్రవక్తను విడిచి వెళ్ళడానికి నిరాకరించాడు. (రూతు 1:​16, 17) ఎలీషా మూడుసార్లు ఇలా అన్నాడు: “యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువ[ను].” (2 రాజులు 2:​2, 4, 6) ఆ సమయానికి, ఎలీషా అప్పటికే ఏలీయాకు దాదాపు ఆరు సంవత్సరాలుగా సహాయం చేశాడు. అయినా ఆయన సాధ్యమైనంత కాలం ఏలీయాకు సేవ చేయాలని కోరుకున్నాడు. వాస్తవానికి, ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: “వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో . . . ఏలీయా . . . ఆరోహణమాయెను.” (11వ వచనం) ఇశ్రాయేలులో ఏలీయా పరిచర్య చివరి నిమిషం వరకు ఏలీయా, ఎలీషా సంభాషించుకుంటూనే ఉన్నారు. వృద్ధుడు, మరింత అనుభవజ్ఞుడు అయిన ప్రవక్త నుండి యౌవనస్థుడైన ప్రవక్త వీలైనంత ఎక్కువ ఉపదేశాన్నీ ప్రోత్సాహాన్నీ పొందాలని ఆశించాడని దీని ద్వారా స్పష్టమవుతోంది. ఆయన వృద్ధుడైన తన స్నేహితుడ్ని విలువైన వ్యక్తిగా దృష్టించాడని తెలుస్తోంది.

‘తండ్రులుగా, తల్లులుగా’

ఎలీషా ఆ వృద్ధ ప్రవక్తను స్నేహితునిగానే కాదు ఒక ఆధ్యాత్మిక తండ్రిగా కూడా ఎందుకు భావించాడో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. (2 రాజులు 2:​12) ఇశ్రాయేలులో ఏలీయా నియామకం ముగియడానికి కాస్త ముందు, ఆయన ఎలీషాతో “నేను నీయొద్దనుండి తీయబడకమునుపు నీకొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగుమని” అన్నాడు. (9వ వచనం) అంటే ఏలీయా తన వారసుని ఆధ్యాత్మిక సంక్షేమం పట్ల, దేవుని పని కొనసాగడం పట్ల చివరి వరకూ శ్రద్ధచూపాడు.

నేడు మన వృద్ధ క్రైస్తవ సహోదర సహోదరీలు తమ జ్ఞానవివేకాలను యౌవనస్థులతో ఉదారంగా పంచుకోవడం ద్వారా చూపించే అదేవిధమైన పితృ, మాతృ వాత్సల్యాన్ని గమనించడం హృదయాన్ని ఉత్తేజపరుస్తుంది. ఉదాహరణకు, యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాల్లో ఎంతోకాలంగా సేవచేస్తున్న స్వచ్ఛంద సేవకులు, బేతేలు కుటుంబంలోని క్రొత్త సభ్యులు తమ సేవను నిర్వర్తించడానికి అవసరమైన నైపుణ్యాలను సంపాదించుకునేందుకు ఇష్టపూర్వకంగా సహాయం చేస్తారు. అదేవిధంగా, అనేక సంవత్సరాలుగా సంఘాలను సందర్శిస్తున్న ప్రయాణ పైవిచారణకర్తలు వారి భార్యలు, తమ అనుభవ సంపదను ప్రయాణ సేవకులుగా సేవచేయడానికి తర్ఫీదు పొందుతున్న వారితో సంతోషంగా పంచుకుంటారు. అంతేగాక, భూవ్యాప్తంగా యెహోవాసాక్షుల సంఘాల్లో దశాబ్దాలుగా నమ్మకంగా యెహోవా చేస్తున్న వృద్ధ సహోదర సహోదరీలున్నారు, వారు తమ ఆచరణాత్మక జ్ఞానాన్నీ అనుభవాన్నీ సంఘంలోని క్రొత్త సభ్యులతో ఆనందంగా పంచుకుంటారు.​—⁠సామెతలు 2:7; ఫిలిప్పీయులు 3:17; తీతు 2:​3-5.

ప్రియమైన ఈ వృద్ధ క్రైస్తవులు చూపించిన హృదయపూర్వకమైన శ్రద్ధ, అలాంటి వృద్ధులపట్ల గౌరవం చూపించడం నిజంగా ఆనందకరమైన విషయం అయ్యేలా చేస్తుంది. కాబట్టి, వృద్ధులైన తోటి విశ్వాసులను ఎంతో విలువైనవారిగా ఎంచడంలో మనం ఎలీషా మాదిరిని అనుసరించాలని కోరుకుంటాము. అపొస్తలుడైన పౌలు మనకు గుర్తుచేస్తున్నట్లుగా మనం ‘వృద్ధుని తండ్రిగా, వృద్ధ స్త్రీలను తల్లులుగా’ చూడడంలో కొనసాగుదాము. (1 తిమోతి 5:​1, 2) అలా చేయడం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘం సరైనవిధంగా పనిచేయడానికి, పురోగతి సాధించడానికి ఎంతగానో దోహదపడతాము.

[30వ పేజీలోని చిత్రం]

ఎలీషా సాధ్యమైనంత కాలం ఏలీయాకు సేవ చేయాలని కోరుకున్నాడు

[31వ పేజీలోని చిత్రం]

యౌవనస్థులు వృద్ధ క్రైస్తవుల నుండి ఎంతో ప్రయోజనం పొందుతారు