కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“సమాజమధ్యమున” యెహోవాను స్తుతించండి

“సమాజమధ్యమున” యెహోవాను స్తుతించండి

“సమాజమధ్యమున” యెహోవాను స్తుతించండి

క్రైస్తవ కూటాలు యెహోవా తన ప్రజలను ఆధ్యాత్మికంగా బలంగా ఉంచడానికి చేసిన ఒక ఏర్పాటు. క్రమంగా కూటాలకు హాజరుకావడం ద్వారా మనం యెహోవా చేసిన ఏర్పాట్ల పట్ల మనకున్న మెప్పును చూపిస్తాము. అంతేగాక, ‘ప్రేమచూపుటకు సత్కార్యములు చేయుటకు’ మనం మన సహోదరులను ‘పురికొల్పడానికి’ అవకాశం లభిస్తుంది, ఇది ఒకరి పట్ల ఒకరం ప్రేమ చూపించుకోవడానికి ఒక ప్రాముఖ్యమైన మార్గం. (హెబ్రీయులు 10:​24, 25; యోహాను 13:​35) అయితే కూటాల్లో మనం మన సహోదరులను ఎలా పురికొల్పవచ్చు?

బహిరంగంగా ప్రకటించండి

దావీదు రాజు తన గురించి ఇలా వ్రాశాడు: “నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజమధ్యమున నిన్ను స్తుతించెదను. మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడెదను.” “మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను, బహు జనులలో నిన్ను నుతించెదను.” “నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతిసువార్తను నేను ప్రకటించియున్నా[ను].”​—⁠కీర్తన 22:22, 25; 35:18; 40:⁠9.

అపొస్తలుడైన పౌలు కాలంలో క్రైస్తవులు ఆరాధన కోసం సమకూడినప్పుడు, వారు కూడా అదేవిధంగా యెహోవాపట్ల తమకున్న విశ్వాసాన్ని గురించి, ఆయన మహిమను గురించి ప్రకటించారు. ఆ విధంగా వారు ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు, ప్రేమించడానికి సత్క్రియలు చేయడానికి ఒకరినొకరు పురికొల్పుకున్నారు. దావీదు, పౌలుల అనంతరం అనేక శతాబ్దాలు గడిచాక మన కాలంలో, మనం నిజంగా ‘యెహోవా దినము సమీపించడం చూస్తున్నాము.’ (హెబ్రీయులు 10:​24, 25) సాతాను విధానం నాశనం వైపు నడుస్తూవుంది, అందువల్ల సమస్యలు అంతకంతకూ అధికమవుతూనే ఉంటాయి. మునుపెన్నటికంటే ఇప్పుడు మనకు “ఓరిమి అవసరమై యున్నది.” (హెబ్రీయులు 10:​36) సహించడానికి మనల్ని మన సహోదరులు గాక మరింకెవరు ప్రోత్సహించగలరు?

గత కాలాల్లోలాగే నేడు, విశ్వాసులు తమ విశ్వాసాన్ని “సమాజమధ్యమున” వ్యక్తం చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. అలా అందరికీ అందుబాటులో ఉన్న ఒక అవకాశం సంఘ కూటాల్లో ప్రేక్షకులకు వేయబడిన ప్రశ్నలకు జవాబుగా వ్యాఖ్యానాలు చేయడమే. ఇది సాధించగల మంచిని ఎన్నడూ తక్కువ అంచనా వేయకండి. ఉదాహరణకు, సమస్యలను ఎలా అధిగమించాలో లేదా నివారించాలో వివరించే వ్యాఖ్యానాలు, బైబిలు సూత్రాలను అనుసరించాలనే మన సహోదరుల కృతనిశ్చయాన్ని బలపరుస్తాయి. సూచించబడి ఎత్తివ్రాయబడని బైబిలు వచనాలను వివరించే వ్యాఖ్యానాలు లేదా వ్యక్తిగత పరిశోధన నుండి సేకరించిన తలంపులను చేర్చి చెప్పే వ్యాఖ్యానాలు శ్రేష్ఠమైన అధ్యయన అలవాట్లను వృద్ధి చేసుకోవడానికి ఇతరులను ప్రోత్సహించవచ్చు.

కూటాల్లో మనం వ్యాఖ్యానించడం మనకు, ఇతరులకు ప్రయోజనం చేకూరుస్తుందనే విషయాన్ని గ్రహించడం, బిడియాన్ని లేదా మౌనంగా ఉండడాన్ని విడనాడడానికి యెహోవాసాక్షులందరినీ పురికొల్పాలి. ముఖ్యంగా పెద్దలు, పరిచర్య సేవకులు కూటాల్లో వ్యాఖ్యానించడం ప్రాముఖ్యం, ఎందుకంటే కూటాల్లో పాల్గొనడంలోనూ కూటాలకు హాజరుకావడంలోనూ వారే నాయకత్వం వహించాలని ఆశించబడుతోంది. అయితే, ఒక వ్యక్తి తన క్రైస్తవ కార్యకలాపాల్లోని ఈ అంశం తనకు ఒక సవాలుగా ఉందని భావిస్తే అతడు దాన్ని ఎలా మెరుగుపరచుకోవచ్చు?

మెరుగుపరచుకోవడానికి సలహాలు

యెహోవా ఆరాధనలో అదొక భాగమని గుర్తుంచుకోండి. జర్మనీలో నివసించే ఒక క్రైస్తవ సహోదరి తన వ్యాఖ్యానాలను ఎలా దృష్టిస్తుందో ఇలా వివరిస్తోంది: “దేవుని ప్రజలు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేయకుండా ఆపడానికి సాతాను చేస్తున్న ప్రయత్నాలకు అవి నా సొంత వ్యక్తిగత జవాబులు.” అదే సంఘంలోని ఈ మధ్యనే బాప్తిస్మం తీసుకున్న ఒక సహోదరుడు ఇలా చెబుతున్నాడు: “వ్యాఖ్యానించడానికి సంబంధించి నేనెంతగానో ప్రార్థన చేస్తాను.”

బాగా సిద్ధపడండి. మీరు సమాచారాన్ని ముందుగా అధ్యయనం చేయకపోతే వ్యాఖ్యానించడం మీకు కష్టమనిపిస్తుంది, మీ వ్యాఖ్యానాలు అంత ప్రభావవంతంగా ఉండవు. సంఘ కూటాల్లో వ్యాఖ్యానించడానికి సంబంధించిన సూచనలు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి అనే ప్రచురణలోని 70వ పేజీలో ఇవ్వబడ్డాయి. *

ప్రతి కూటంలోనూ కనీసం ఒక్క వ్యాఖ్యానం చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. అంటే మీరు అనేక జవాబులు సిద్ధపడవలసి ఉంటుంది, ఎందుకంటే మీరు మీ చెయ్యి ఎంత ఎక్కువసార్లు లేపితే కార్యక్రమం నిర్వహిస్తున్న సహోదరుడు మిమ్మల్ని అడిగే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధపడ్డారో ఆయనకు ముందుగా చెప్పడం కూడా మంచిదే. మీరు ఈ మధ్యనే వ్యాఖ్యానించడం ప్రారంభించిన వారైతే ప్రాముఖ్యంగా ఇది సహాయకరంగా ఉంటుంది. “మహా సమాజములో” చెయ్యెత్తడానికి మీరు బహుశా వెనుకాడుతుండవచ్చు, ఇది మీ పేరా అనీ, కూటం నిర్వహిస్తున్న వ్యక్తి మీ చెయ్యి కోసం చూస్తుంటాడనీ గుర్తుంచుకోవడం వ్యాఖ్యానించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.

సాధ్యమైనంత త్వరగా వ్యాఖ్యానించండి. కష్టమైన పనిని వాయిదా వేసినంత మాత్రాన అది సులభమైపోదు. కూటంలో సాధ్యమైనంత త్వరగా వ్యాఖ్యానించడం సహాయకరంగా ఉంటుంది. మొదటి వ్యాఖ్యానాన్ని చేయడమనే అడ్డంకును మీరు ఒకసారి అధిగమించిన తర్వాత ఇక రెండవసారి మూడవసారి వ్యాఖ్యానం చేయడం ఎంత సులభంగా ఉంటుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు.

కూర్చోవడానికి సరైన స్థలం ఎంపిక చేసుకోండి. రాజ్యమందిరం ముందు భాగంలో కూర్చుంటే వ్యాఖ్యానించడం సులభంగా ఉంటుందని కొందరు భావిస్తారు. ఎందుకంటే అక్కడ అవధానాన్ని ప్రక్కకు మళ్ళించేవి తక్కువగా ఉంటాయి, కార్యక్రమం నిర్వహిస్తున్న వ్యక్తి మీరు చెయ్యెత్తినప్పుడు మిమ్మల్ని తప్పకుండా చూసే అవకాశం ఉంటుంది. మీరిలా చేయడానికి ప్రయత్నిస్తే అందరూ వినగలిగేలా బిగ్గరగా మాట్లాడాలని గుర్తుంచుకోండి, ప్రాముఖ్యంగా సంఘం అందరి దగ్గరకు మైకు తీసుకెళ్లే ఏర్పాటు లేకపోతే ఇది మరీ ముఖ్యం.

జాగ్రత్తగా వినండి. ఇది మీరు, ఇతరులు చెప్పిన దాన్నే తిరిగి చెప్పకుండా ఉండేందుకు సహాయం చేస్తుంది. అంతేగాక, ఇతరులు చేసిన వ్యాఖ్యానాలు మీకు ఒక లేఖనాన్నో, అప్పుడే వ్యక్తం చేయబడిన ఒక తలంపును విపులీకరించగల అంశాన్నో మీకు గుర్తు చేయవచ్చు. అప్పుడప్పుడు, ఒక క్లుప్తమైన అనుభవం చర్చించబడుతున్న అంశాన్ని సోదాహరణంగా తెలియజేయవచ్చు. అలాంటి వ్యాఖ్యానాలు ఎంతో సహాయకరంగా ఉంటాయి.

మీ సొంత మాటల్లో జవాబివ్వడం నేర్చుకోండి. అధ్యయన సమాచారం నుండి ఒక వ్యాఖ్యానాన్ని చదవడం మీరు సరైన జవాబును కనుగొన్నారని సూచించవచ్చు, అది వ్యాఖ్యానించడం ప్రారంభించడానికి మంచి మార్గమే. కానీ మీ సొంత మాటల్లో జవాబివ్వడానికి అభివృద్ధి సాధించడం, మీరు విషయాన్ని అర్థం చేసుకున్నారని చూపిస్తుంది. మన ప్రచురణల్లోవున్న పదాలను ఉన్నవి ఉన్నట్లు చెప్పవలసిన అవసరం లేదు. యెహోవాసాక్షులు తమ ప్రచురణలు చెబుతున్న దాన్ని ఊరికే పదే పదే వల్లించరు.

విషయానికి సంబంధించిన వ్యాఖ్యానాలే చేయండి. విషయంతో సంబంధం లేని వ్యాఖ్యానాలు లేదా పరిశీలించబడుతున్న ముఖ్య తలంపుల నుండి ప్రక్కకు తీసుకువెళ్ళే వ్యాఖ్యానాలు సముచితమైనవికావు. అంటే మీ వ్యాఖ్యానాలు చర్చించబడుతున్న విషయానికి సంబంధించినవై ఉండాలని అర్థం. అప్పుడే, వివరణలోవున్న ముఖ్యాంశానికి సంబంధించి ఆధ్యాత్మికంగా ప్రోత్సాహకరమైన చర్చకు అవి దోహదపడతాయి.

ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. వ్యాఖ్యానించడానికి ఒక ముఖ్య కారణం ఇతరులను ప్రోత్సహించడం కాబట్టి, వారిని నిరుత్సాహపరిచే మాటలు పలుకకుండా ప్రయత్నించాలి. అంతేగాక ఇతరులు చెప్పడానికి ఇక ఏమీ మిగలని విధంగా మీరే మొత్తం పేరాలోని విషయాలన్నీ చెప్పేయకండి. సుదీర్ఘమైన లేదా సంక్లిష్టమైన జవాబులు అర్థాన్ని మరుగుచేస్తాయి. కేవలం కొన్ని పదాలతో కూడిన చిన్న జవాబులు ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి, అవి క్రొత్తవారు తమ క్లుప్త జవాబులను చెప్పడానికి వారిని ప్రోత్సహిస్తాయి.

కూటాలను నిర్వహించేవారి పాత్ర

ప్రోత్సాహకరంగా ఉండడానికి సంబంధించినంత వరకు, కూటం నిర్వహిస్తున్న వ్యక్తి మీద ఎంతో పెద్ద బాధ్యత ఉంటుంది. ఆయన ఇవ్వబడే ప్రతి వ్యాఖ్యానాన్ని జాగ్రత్తగా వినడం ద్వారా, ఎవరైనా వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు దేనిలోనో మునిగిపోవడానికి బదులు వ్యాఖ్యానిస్తున్న వ్యక్తివైపు గౌరవపూర్వకంగా చూడడం ద్వారా నిజమైన శ్రద్ధను చూపిస్తాడు. ఆయన జాగ్రత్తగా వినకుండా, చెప్పబడిన దాన్ని అనవసరంగా మళ్ళీ వల్లించడమో లేక అప్పుడే జవాబు చెప్పబడిన ప్రశ్నను మళ్ళీ అడగడమో చేస్తే అదెంత అనుచితంగా ఉంటుందో కదా!

కార్యక్రమం నిర్వహిస్తున్న వ్యక్తి, ఒక వ్యాఖ్యానం చేయబడిన వెంటనే ఆ వ్యాఖ్యానంలో ఏదో కొరవడిందని సూచించడానికన్నట్లు కొంచెం వేరే పదాలను ఉపయోగించి అదే సమాధానాన్ని పదే పదే వల్లిస్తూ ఉంటే కూడా అది నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. మరోవైపున, వ్యాఖ్యానాలు ఒక విశేషమైన అంశపు చర్చను ముందుకు తీసుకువెళ్ళడానికి దోహదపడితే ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో కదా! ‘మనం దీన్ని మన సంఘంలో ఎలా అన్వయించుకోవచ్చు?’ లేదా, ‘అప్పుడే చెప్పబడిన దాన్ని పేరాలోని ఏ లేఖనం సమర్థిస్తుంది?’ వంటి ప్రశ్నలు అనుకూల వ్యాఖ్యానాలను ప్రోత్సహిస్తాయి, అవి ఎంతగానో దోహదపడతాయి.

క్రొత్తవారు లేదా బిడియస్థులు వ్యాఖ్యానించినప్పుడు వారిని ప్రాముఖ్యంగా ప్రశంసించాలి. అధ్యయనం అయిపోయిన తర్వాత వారిని వ్యక్తిగతంగా కలిసి ప్రశంసించవచ్చు, అలాగైతే వారికి అనవసరమైన కలవరం తప్పుతుంది, అంతేగాక సముచితమైనప్పుడు సూచనలు ఇవ్వడానికి అధ్యయన నిర్వహకునికి అవకాశం లభిస్తుంది.

సాధారణ సంభాషణలో, చర్చలో తానే ఎక్కువగా మాట్లాడే వ్యక్తి ఆ సంభాషణను నిరుత్సాహపరుస్తాడు. ఆయన చెప్పేది వినేవారు తాము తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం అనవసరమని భావిస్తారు. చెప్పబడుతున్న దాన్ని వారు ఒకవేళ విన్నా అదీ మనస్ఫూర్తిగా వినరు. నిర్వహిస్తున్న వ్యక్తి తానే తరచూ వ్యాఖ్యానిస్తూ ఎక్కువగా మాట్లాడుతుంటే అదే జరుగుతుంది. అయితే, కూటం నిర్వహిస్తున్న వ్యక్తి అప్పుడప్పుడూ అదనపు ప్రశ్నలు వేయడం ద్వారా ప్రేక్షకుల మనస్సులోని విషయాలను రాబడుతూ ఆ విషయంపై వారి ఆలోచనను రేకెత్తించవచ్చు. అలాంటి ప్రశ్నలను తరచుగా ఉపయోగించకూడదు.

నిర్వహిస్తున్న వ్యక్తి చెయ్యెత్తిన మొదటి వ్యక్తినే అడగాలనేమీ లేదు. తమ ఆలోచనలను ఒక దారికి తెచ్చుకోవడానికి కాస్త సమయం అవసరమయ్యే వారిని అది నిరుత్సాహపరచగలదు. కాస్సేపాగడం ద్వారా, ఇంతకు ముందే వ్యాఖ్యానించని ఎవరికైనా ఆయన ఒక అవకాశం ఇస్తాడు. పిల్లల అవగాహనకు మించిన అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు వారిని సమాధానాలు చెప్పమని అడగకుండా ఉండడం ద్వారా ఆయన వివేచనను చూపిస్తాడు.

ఎవరైనా తప్పు సమాధానం ఇస్తే అప్పుడెలా? నిర్వాహకుడు తప్పు సమాధానం ఇచ్చిన వ్యక్తిని అవమానించకూడదు. తప్పువే అయినా ఆ వ్యాఖ్యానాల్లో సాధారణంగా సత్యం కొద్ది పాళ్ళలోనైనా ఉంటుంది. నిర్వహిస్తున్న వ్యక్తి ఆ తప్పు సమాధానంలో నుండే సరైనది కాగల దేన్నైనా యుక్తిగా ఎంపిక చేసుకొని ప్రశ్నను మరో విధంగా అడగడం ద్వారా, లేదా అదనపు ప్రశ్న వేయడం ద్వారా ఎలాంటి అవమానకరమైన పరిస్థితి తలెత్తకుండా పరిస్థితిని చక్కబెట్టవచ్చు.

వ్యాఖ్యానించడాన్ని ప్రోత్సహించేందుకు, కూటం నిర్వహిస్తున్న వ్యక్తి ‘ఎవరైనా ఇంకా ఏదైనా వ్యాఖ్యానం చేయాలనుకుంటున్నారా?’ వంటి సాధారణ ప్రశ్నలు అడగకుండా ఉంటే మంచిది. ‘ఇంకా ఎవరు వ్యాఖ్యానించలేదు? ఇదే మీకు చివరి అవకాశం!’ అనే ప్రశ్న సదుద్దేశంతో అడిగేదే కావచ్చు కానీ అది ఒక వ్యక్తి ముందుకు వచ్చి సమాధానం చెప్పడాన్ని ఎంతమాత్రం ప్రోత్సహించదు. సహోదరులు అధ్యయనంలో ముందుగా వ్యాఖ్యానించలేకపోయమనే అపరాధభావంతో బాధపడేలా చేయకూడదు. బదులుగా, తమకు తెలిసినదాన్ని ఇతరులతో పంచుకోవడం ప్రేమ చూపడంలో భాగం కాబట్టి అలా పంచుకోమని వారిని ప్రోత్సహించాలి. అంతేగాక, నిర్వహిస్తున్న వ్యక్తి, వ్యాఖ్యానించమని ఒకరిని అడిగి, “అతని తర్వాత ఫలాని సహోదరుడు లేదా ఫలాని సహోదరి వ్యాఖ్యానాలు మనం విందాం” అని చెప్పకపోవడం మంచిది. నిర్వాహకుడు ముందు వ్యాఖ్యానాన్ని విని, అదనపు వ్యాఖ్యానం అవసరమో లేదో నిర్ధారించుకోవాలి.

వ్యాఖ్యానించడం ఒక ఆధిక్యత

క్రైస్తవ కూటాలకు హాజరుకావడం ఒక ఆధ్యాత్మిక అవసరత; ఆ కూటాల్లో వ్యాఖ్యానించడం ఒక ఆధిక్యత. “సమాజమధ్యమున” యెహోవాను స్తుతించడమనే ఈ విశేషమైన విధానంలో మనం ఎంతగా పాల్గొంటే, మనం దావీదు ఉదాహరణను అంతగా అనుసరిస్తాము, పౌలు ఉపదేశాన్ని అంత గంభీరంగా తీసుకుంటాము. మనం కూటాల్లో వ్యాఖ్యానించడం మన సహోదరులను మనం ప్రేమిస్తున్నామని, యెహోవా యొక్క పెద్ద సంఘంలో మనమొక భాగమని నిరూపిస్తుంది. “ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది” ఇంకెక్కడ ఉండాలని మీరు కోరుకుంటారు?​—⁠హెబ్రీయులు 10:​24, 25.

[అధస్సూచి]

^ పేరా 10 యెహోవాసాక్షులు ప్రచురించినది.

[20వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవ కూటాల్లో వినడం, వ్యాఖ్యానించడం రెండూ ప్రాముఖ్యమైనవే

[21వ పేజీలోని చిత్రం]

నిర్వాహకుడు చేయబడిన ప్రతి వ్యాఖ్యానమందు నిజమైన శ్రద్ధ చూపిస్తాడు