కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆధ్యాత్మిక సంభాషణ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది

ఆధ్యాత్మిక సంభాషణ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది

ఆధ్యాత్మిక సంభాషణ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది

“వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి.”​—⁠ఎఫెసీయులు 4:29.

“మానవులకున్న మాట్లాడే శక్తి ఒక మర్మం; అది దేవుడిచ్చిన వరం, ఓ అద్భుతం” అని నిఘంటుకారుడైన లూట్‌విక్‌ కోలెర్‌ వ్రాశాడు. దేవుడిచ్చిన ఈ అమూల్య బహుమతిని బహుశా మనం తేలికగా తీసుకుంటుండవచ్చు. (యాకోబు 1:​17) అయితే ప్రియమైన వారొకరు అర్థమయ్యేలా మాట్లాడగల సామర్థ్యం కోల్పోయేలా పక్షవాతానికి గురైతే అదెంత పెద్దనష్టమో ఆలోచించండి. “మా మధ్య జరిగిన సంభాషణలు మా ఇద్దరినీ ఎంతో సన్నిహితం చేశాయి. ఇప్పుడా లోటు నాకు బాగా తెలుస్తోంది” అని ఇటీవలే పక్షవాతానికి గురైన తన భర్తను గురించి జోన్‌ వివరిస్తోంది.

2 సంభాషణలు స్నేహబంధాల్ని బలపరచగలవు, అపార్థాలను మాన్పగలవు, నిరాశచెందిన వారిని బలపరచగలవు, విశ్వాసాన్ని పటిష్ఠం చేయగలవు, జీవితాలను సుసంపన్నం చేయగలవు, అయితే ఇవెన్నడూ యాదృచ్ఛికంగా జరుగవు. జ్ఞానియైన సొలొమోను రాజు ఇలా అన్నాడు: “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.” (సామెతలు 12:​18) యెహోవా సేవకులుగా మనం మన సంభాషణలు గాయపరిచేవిగా, హాని చేసేవిగా కాదుగాని మాన్పేవిగా, క్షేమాభివృద్ధికరమైనవిగా ఉండాలని కోరుకుంటాము. అలాగే ఇటు మన బహిరంగ పరిచర్యలో, అటు మన వ్యక్తిగత సంభాషణల్లో యెహోవాకు స్తుతితెచ్చే విధంగా మన నాలుకను ఉపయోగించాలని కూడా మనం కోరుకుంటాము. కీర్తనకర్త ఇలా ఆలపించాడు: “దినమెల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము, నీ నామమునుబట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.”​—⁠కీర్తన 44:⁠8.

3 “యే నరుడును నాలుకను సాధుచేయ నేరడు” అని శిష్యుడైన యాకోబు హెచ్చరించాడు. ఆయన మనకిలా గుర్తుచేస్తున్నాడు: “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును.” (యాకోబు 3:​2, 8) మనలో ఎవరమూ పరిపూర్ణులం కాదు. కాబట్టి మనకెన్ని శ్రేష్ఠమైన ఉద్దేశాలున్నా, మన మాటలు అన్ని సమయాల్లో ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించవు లేదా మన సృష్టికర్తకు స్తుతి తీసుకురావు. కాబట్టి, మనం జాగ్రత్తగా మాట్లాడ్డం తప్పక నేర్చుకోవాలి. అంతేకాకుండా యేసు ఇలా చెప్పాడు: “మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.” (మత్తయి 12:​36, 37) అవును, మన మాటలకు సత్య దేవుడు మనలను జవాబుదారులనుగా ఎంచుతాడు.

4 గాయపరిచే సంభాషణ మానుకోవడానికి, ఆధ్యాత్మిక సంభాషణల్లో పాల్గొనే అలవాటు పెంచుకోవడం ఒక శ్రేష్ఠమైన మార్గం. మనం దానినెలా చేయవచ్చో, మనమెలాంటి అంశాలు మాట్లాడవచ్చో, క్షేమాభివృద్ధికరమైన సంభాషణ నుండి మనమెలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఈ ఆర్టికల్‌ పరిశీలిస్తుంది.

హృదయంలో ఏమివుందో చూసుకోండి

5 క్షేమాభివృద్ధికరమైన సంభాషణల్లో పాల్గొనే అలవాటును పెంపొందించుకోవడానికి, మొదట మనం మన మాటలు మన హృదయంలో ఉన్నవాటినే ప్రతిబింబిస్తాయని గుర్తించాలి. “హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును” అని యేసు చెప్పాడు. (మత్తయి 12:​34) మామూలుగా మనకు ముఖ్యమనుకున్నవే మనం మాట్లాడ్డానికి ఇష్టపడతాము. కాబట్టి, మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నా సంభాషణలు నా హృదయ స్థితిని గురించి ఏమి వెల్లడిచేస్తాయి? నేను నా కుటుంబంతో లేదా తోటి విశ్వాసులతో ఉన్నప్పుడు నా సంభాషణ ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి ఉంటుందా లేక క్రీడలు, బట్టలు, సినిమాలు, తిండి, ఈ మధ్య నేను కొన్నవి లేదా కొన్ని అల్ప ప్రాధాన్యత విషయాల చుట్టూ తిరుగుతుంటుందా?’ బహుశా అనుకోకుండా, అల్ప విషయాల చుట్టూ మన జీవితాలు, తలంపులు పరిభ్రమిస్తుండవచ్చు. మనం వేటికి ప్రాధాన్యతనిస్తామనేది సవరించుకోవడం మన సంభాషణలను అలాగే మన జీవితాలను మెరుగుపరుస్తుంది.​—⁠ఫిలిప్పీయులు 1:⁠9.

6 మన మాటల నాణ్యతను వృద్ధిచేసుకోవడానికి మరో మార్గం అర్థవంతంగా ధ్యానించడం. ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించడానికి మనం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తే, సహజంగానే ఆధ్యాత్మిక విషయాల గురించి మనం సంభాషిస్తాము. ఈ సంబంధాన్ని దావీదు రాజు చూశాడు. ఆయనిలా ఆలపించాడు: “యెహోవా . . . నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక.” (కీర్తన 19:​14) కీర్తనకర్త ఆసాపు ఇలా అన్నాడు: “నీ [దేవుని] కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును.” (కీర్తన 77:​12) దేవుని వాక్యంలోని సత్యాలను ధ్యానించడంలో మునిగివుండే హృదయం, మనస్సు సహజంగానే స్తుతిపాత్రమైన సంభాషణ పొంగిపొర్లేలా చేస్తాయి. యెహోవా తనకు బోధించిన విషయాలను గురించి యిర్మీయా మాట్లాడకుండా ఉండలేకపోయాడు. (యిర్మీయా 20:⁠9) మనం క్రమంగా ఆధ్యాత్మిక విషయాలను ధ్యానిస్తూవుంటే మనం కూడా ఆయనలాగే ఉండగలుగుతాము.​—⁠1 తిమోతి 4:15.

7 మంచి ఆధ్యాత్మిక క్రమం క్షేమాభివృద్ధికరమైన సంభాషణలకు కావలసిన అంశాలను సమృద్ధిగా అందిస్తుంది. (ఫిలిప్పీయులు 3:​16) సమావేశాలు, సంఘకూటాలు, ప్రస్తుత ప్రచురణలు, దిన వచనం, ముద్రిత వ్యాఖ్యానాలు ఇవన్నీ మనం పంచుకోగల ఆధ్యాత్మిక రత్నాలను మనకిస్తాయి. (మత్తయి 13:​52) మన క్రైస్తవ పరిచర్యలో కలిగే అనుభవాలు ఆధ్యాత్మికంగా ఎంత పురికొల్పేవిగా ఉంటాయో గదా!

8 ఇశ్రాయేలునందు తాను గమనించిన విస్తారమైన చెట్ల, జంతువుల, పక్షుల, చేపల రకాలనుబట్టి సొలొమోను రాజు పరవశుడయ్యాడు. (1 రాజులు 4:​33) దేవుని సృష్టి కార్యాలను గురించి సంభాషించడంలో ఆయన ఆనందించాడు. మనం కూడా అలాగే చేయవచ్చు. విభిన్న అంశాలమీద మాట్లాడడానికి యెహోవా సేవకులు ఆనందిస్తారు, అయితే ఆధ్యాత్మిక విషయాలు ఇష్టపడే ప్రజల సంభాషణలు అన్ని సమయాల్లో ఆధ్యాత్మిక అంశాలతో అలరించబడతాయి.​—⁠1 కొరింథీయులు 2:13.

“వాటిమీద ధ్యానముంచుకొనుడి”

9 అంశాలు ఏవైనప్పటికీ, మన సంభాషణలు అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్పిన హితవుకు కట్టుబడివుంటే అవి ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగజేస్తాయి. ఆయనిలా వ్రాశాడు: “యే యోగ్యతయైనను [“సుగుణమైనను,” NW] మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటిమీద ధ్యానముంచుకొనుడి.” (ఫిలిప్పీయులు 4:⁠8) పౌలు ప్రస్తావించిన అంశాలు ఎంత అవశ్యమైనవంటే ఆయన “వాటిమీద ధ్యానముంచుకొనుడి” అని చెబుతున్నాడు. మన మనస్సులను హృదయాలను వాటితో నింపుకోవాలి. పౌలు పేర్కొన్న ఈ ఎనిమిదింటిలో ఒక్కొక్క అంశానికి అవధానమివ్వడం మన సంభాషణలకు సంబంధించి మనకెలా సహాయం చేయగలదో మనం చూద్దాం.

10సత్యములో అబద్ధంకాని సరైన సమాచారంకంటే ఇంకా ఎక్కువేవుంది. దేవుని వాక్య సత్యంవంటి యథార్థమైన, నమ్మదగిన సంగతిని అది సూచిస్తుంది. కాబట్టి, మనల్ని ముగ్ధులను చేసిన బైబిలు సత్యాలను, మనల్ని ఉత్తేజపరచిన ప్రసంగాలను లేదా మనకు సహాయంచేసిన లేఖన ఉపదేశాలను గురించి మనం ఇతరులతో మాట్లాడినప్పుడు మనం సత్యవంతమైన విషయాలను పరిగణిస్తున్నట్లే. మరోవైపున, కేవలం పైకి మాత్రం సత్యంలా కనిపించే “జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన” దానిని మనం విసర్జిస్తాం. (1 తిమోతి 6:​20) అలాగే మనం కొండెములు చెప్పడాన్ని విసర్జిస్తాం లేదా నిర్ధారింపలేని బూటకపు అనుభవాలు చెప్పకుండా ఉంటాము.

11మాన్యమైనవి అంటే అల్పమైనవి కాదుగాని గౌరవప్రదమైనవని, ప్రాముఖ్యమైనవని భావం. వాటిలో మన క్రైస్తవ పరిచర్య, మనం జీవిస్తున్న అపాయకరమైన కాలాలు, మనం చక్కని ప్రవర్తన కాపాడుకోవడం వంటివాటిని గురించిన ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మనమలాంటి మాన్య విషయాలను చర్చించేటప్పుడు, ఆధ్యాత్మికంగా మెలకువగావుండాలనే, మన యథార్థతను కాపాడుకోవాలనే, సువార్తను ఎడతెగక ప్రకటించాలనే మన తీర్మానాన్ని మనం మరింత బలోపేతం చేసుకుంటాం. నిజంచెప్పాలంటే, మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని గుర్తుచేసే ప్రస్తుత సంఘటనలు, మన పరిచర్యలో మనకెదురయ్యే ఆసక్తికరమైన అనుభవాలు మనకు ఉత్తేజకరమైన సంభాషణలకు వైవిధ్య అంశాలను అందిస్తాయి.​—⁠అపొస్తలుల కార్యములు 14:27; 2 తిమోతి 3:1-5.

12న్యాయం అనే మాటకు దేవుని దృష్టిలో సరైనది అంటే ఆయన నియమాలకు కట్టుబడి ఉండడం అని భావం. పవిత్రం అనే మాట ప్రవర్తనలో, తలంపులో స్వచ్ఛత అనే భావమిస్తోంది. కొండెములకు, అసభ్య ఛలోక్తులకు లేదా లైంగిక ద్వందార్థ మాటలకు మన సంభాషణల్లో చోటులేదు. (ఎఫెసీయులు 5:3; కొలొస్సయులు 3:⁠8) ఉద్యోగ స్థలంలో లేదా పాఠశాలలో సంభాషణలు ఇలాంటి విషయాలవైపుకు మళ్ళినప్పుడు క్రైస్తవులు జ్ఞానవంతంగా అక్కడి నుండి తప్పుకుంటారు.

13 ఏవి రమ్యమైనవో వాటిమీద ధ్యానముంచుడని పౌలు సిఫారసు చేసినప్పుడు, ద్వేషం, కఠినత్వం లేదా జగడాలకు దారితీసే వాటిని కాదుగాని ప్రీతికరమైన, ఆమోదకరమైన లేదా ప్రేమను పురికొల్పే విషయాలను ఆయన సూచిస్తున్నాడు. ఖ్యాతిగల విషయాలు గౌరవనీయమైన లేదా మంచి నివేదికగల సమాచారాన్ని సూచిస్తాయి. అలాంటి మంచి నివేదికల్లో కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో క్రమంగా ప్రచురింపబడే విశ్వసనీయులైన సహోదర, సహోదరీల జీవిత కథలు ఉంటాయి. విశ్వాసాన్ని బలపరిచే ఈ ఆర్టికల్స్‌ను మీరు చదివిన తర్వాత, మీ అనుభూతులను ఇతరులతో ఎందుకు పంచుకోకూడదు? ఇతరుల ఆధ్యాత్మిక విజయాలను గురించి వినడం ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో గదా! అలాంటి సంభాషణలు సంఘంలో ప్రేమను, ఐక్యతను వృద్ధిచేస్తాయి.

14 పౌలు ‘సుగుణం’ గురించి మాట్లాడాడు. ఈ సుగుణం మంచితనాన్ని లేదా నైతిక శ్రేష్ఠతను సూచిస్తుంది. మన సంభాషణలు నీతిగలవాటి నుండి, పవిత్రమైనవాటి నుండి, సుగుణము నుండి వైదొలగకుండా లేఖన సూత్రాలతో నడిపింపబడేలా మనం జాగ్రత్త వహించాలి. మెప్పుకు “ప్రశంస” అని భావం. సంఘంలో మనమొక మంచి ప్రసంగాన్ని విన్నప్పుడు లేదా విశ్వసనీయమైన మాదిరిని గమనించినప్పుడు, ఆ సంబంధిత వ్యక్తితో, ఇతరులతో దాని గురించి మాట్లాడండి. అపొస్తలుడైన పౌలు తన తోటి ఆరాధకుల చక్కని లక్షణాలను తరచు మెచ్చుకున్నాడు. (రోమీయులు 16:12; ఫిలిప్పీయులు 2:19-22; ఫిలేమోను 4-7) నిశ్చయంగా, మన సృష్టికర్త చేతిపనులు నిజంగా స్తుతిపాత్రమైనవి. క్షేమాభివృద్ధికరమైన సంభాషణలకు మనకు వాటిలో అంశాలు కోకొల్లలుగా లభిస్తాయి.​—⁠సామెతలు 6:6-8; 20:12; 26:⁠2.

క్షేమాభివృద్ధికరమైన సంభాషణల్లో పాల్గొనండి

15ద్వితీయోపదేశకాండము 6:6, 7 ఇలా చెబుతోంది: “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.” తమ పిల్లలతో అర్థవంతమైన, ఆధ్యాత్మిక సంభాషణలు చేయాలని తలిదండ్రులను ఈ ఆజ్ఞ నిస్సందేహంగా కోరుతుంది.

16 యేసు భూసంబంధ నియామకానికి సంబంధించిన విషయాల గురించి చర్చించేటప్పుడు ఆయన, తన పరలోకపు తండ్రితో సుదీర్ఘంగా సంభాషించి ఉంటాడని మనం ఊహించవచ్చు. “నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు” అని యేసు తన శిష్యులకు చెప్పాడు. (యోహాను 12:49; ద్వితీయోపదేశకాండము 18:​18) మూలపురుషుడగు అబ్రాహాము యెహోవా తమను, తమ పితరులను ఆశీర్వదించడాన్ని గురించి తన కుమారుడైన ఇస్సాకుతో చెబుతూ అనేక గంటలు గడిపివుంటాడు. దేవుని చిత్తానికి వినయంగా లోబడడానికి అలాంటి సంభాషణలు యేసుకు, ఇస్సాకుకు నిశ్చయంగా సహాయం చేసివుంటాయి.​—⁠ఆదికాండము 22:7-9; మత్తయి 26:39.

17 మన పిల్లలకు కూడా క్షేమాభివృద్ధికరమైన సంభాషణలు అవసరం. తమకు తీరికలేని పనులున్నా పిల్లలతో మాట్లాడేందుకు తలిదండ్రులు సమయం కేటాయించాలి. వీలైతే, రోజులో కనీసం ఒకసారి కుటుంబమంతా కలిసి భోజనంచేసే ఏర్పాటు ఎందుకు చేసుకోకూడదు? అలా భోజనం చేస్తున్నప్పుడు, ఆ తర్వాత కుటుంబ ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం అమూల్యమని రుజువుకాగల క్షేమాభివృద్ధికరమైన చర్చలకు అవకాశాలు లభిస్తాయి.

18 ఇరవై సంవత్సరాల వయస్సు దాటిన పయినీరు ఆలెకాండ్రో 14వ ఏట తనకు కలిగిన సందేహాలు గుర్తుచేసుకుంటున్నాడు. ఆయనిలా వివరిస్తున్నాడు: “తోటి విద్యార్థుల, టీచర్ల ప్రభావంవల్ల దేవుని ఉనికి, బైబిలు వాస్తవికత గురించి నాకు సందేహాలు ఉండేవి. అనేక గంటలపాటు ఓపికగా నా తలిదండ్రులు నాతో తర్కించారు. ఆ క్లిష్ట సమయంలో వారి సంభాషణలు నా సందేహాలను తీర్చడమే కాకుండా జీవితంలో నేను సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సహాయం చేశాయి.” మరి ఇప్పటి విషయమేమిటి? ఆలెకాండ్రో ఇలా అంటున్నాడు: “నేనింకా మా ఇంట్లోనే ఉంటున్నాను. అయితే తీరికలేని పనులవల్ల మా నాన్నగారితో ఏకాంతంగా కలిసి మాట్లాడడం కష్టమౌతోంది. అందుకని వారంలో ఒకసారి ఆయన ఉద్యోగ స్థలంలో మేమిద్దరం కలిసి భోజనం చేస్తాము. ఈ సంభాషణలను నేను నిజంగా అమూల్యమైనవిగా పరిగణిస్తాను.”

19 తోటి విశ్వాసులతో ఆనందంగా మనం జరిపే ప్రతిఫలదాయక సంభాషణా అవకాశాలు కూడా మనకు అమూల్యం కాదా? కూటాలదగ్గర, మనం క్షేత్ర పరిచర్యలో ఉన్నప్పుడు, సాంఘిక కార్యక్రమాల్లో, ప్రయాణాలప్పుడు మనకు ఈ అవకాశాలు లభిస్తాయి. రోములోవున్న క్రైస్తవులతో కలిసి మాట్లాడే అవకాశం కోసం పౌలు ఎదురుచూశాడు. ఆయన వారికిలా వ్రాశాడు: “మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణ పొందవలెనని . . . మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను.” (రోమీయులు 1:​11, 12) “తోటి విశ్వాసులతో జరిపే ఆధ్యాత్మిక సంభాషణలు ఓ ప్రాముఖ్యమైన అవసరతను తీరుస్తాయి. అవి హృదయాన్ని ఉప్పొంగజేసి, దైనందిన భారాలను తేలికపరుస్తాయి. వృద్ధులు తమ జీవితం ఎలా గడిపారు, నమ్మకంగా ఉండేందుకు వారికేది సహాయపడిందో చెప్పండని వారిని తరచు అడుగుతాను. గడచిన సంవత్సరాల్లో నేను చాలామందితో మాట్లాడాను, వారిలో ప్రతి ఒక్కరు నా జీవితాన్ని సుసంపన్నం చేసేలా ఎంతోకొంత అవగాహననిచ్చారు లేదా జ్ఞానోదయం కలిగించారు” అని ఓ క్రైస్తవ పెద్దయైన యోహానెస్‌ అన్నారు.

20 సంభాషణకు మీరొక ఆధ్యాత్మిక అంశం లేవదీసినప్పుడు అవతలి వ్యక్తికి పట్టనట్లు అనిపిస్తే అప్పుడేమిటి? మీ ప్రయత్నం మానకండి. బహుశా, మంచి అవకాశం మీకు మరోసారి రావచ్చు. “సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది” అని సొలొమోను వ్రాశాడు. (సామెతలు 25:​11) బిడియపడే వారిని అర్థంచేసుకోండి. “నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్లవంటిది వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును.” * (సామెతలు 20:⁠5) అన్నింటికంటే మిన్నగా, మీ హృదయాన్ని స్పర్శించిన విషయాలను గురించి మాట్లాడకుండా చేయడానికి ఇతరుల దృక్పథాలను మీరు ఎన్నటికీ అనుమతించకండి.

ఆధ్యాత్మిక సంభాషణలు ప్రతిఫలదాయకం

21 “వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి” అని పౌలు ఉపదేశించాడు. (ఎఫెసీయులు 4:29; రోమీయులు 10:​10) సంభాషణలను సరైన దిశకు మళ్లించడానికి కొంత ప్రయత్నం అవసరం, అయితే దానికి లభించే ప్రతిఫలాలు అనేకం. ఆధ్యాత్మిక సంభాషణలు మన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవడానికి, మన సహోదరత్వాన్ని వృద్ధిచేసుకోవడానికి మనకు దోహదపడతాయి.

22 కాబట్టి మనం మాట్లాడే శక్తిని ఇతరులను బలపరచేందుకు, దేవుని స్తుతించేందుకు ఉపయోగిద్దాం. అలాంటి సంభాషణలు మన సంతృప్తికి, ఇతరుల ప్రోత్సాహానికి మూలాధారంగా ఉంటాయి. అన్నింటికంటే మిన్నగా, అవి యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తాయి, ఎందుకంటే ఆయన మన సంభాషణలు విని మనం మన నాలుకను సరిగా ఉపయోగించినప్పుడు ఆయన ఆనందిస్తాడు. (కీర్తన 139:4; సామెతలు 27:​11) మన సంభాషణలు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు, యెహోవా మనలను మరచిపోడని మనం నమ్మకం కలిగియుండవచ్చు. మన కాలంలో యెహోవాను సేవించేవారిని సూచిస్తూ, బైబిలు ఇలా చెబుతోంది: “అప్పుడు, యెహోవాయందు భయభక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.” (మలాకీ 3:16; 4:⁠5) అందువల్ల మన సంభాషణలు ఆధ్యాత్మికంగా క్షేమాభివృద్ధి కలిగించేవిగా ఉండడం ఎంత అవశ్యమో గదా!

[అధస్సూచీలు]

^ పేరా 25 ఇశ్రాయేలునందు కొన్ని బావులు చాలా లోతుగా ఉండేవి. గిబియోనులో పురావస్తు శాస్త్రవేత్తలు 25 మీటర్ల లోతుగల జలాశయం కనుగొన్నారు. ప్రజలు నీరు చేదుకోవడానికి క్రిందివరకు దిగి ఎక్కిరావడానికి దానికి మెట్లున్నాయి.

మీరెలా జవాబిస్తారు?

• మన సంభాషణలు మన గురించి ఏమి వెల్లడిచేస్తాయి?

• మనమెలాంటి క్షేమాభివృద్ధికరమైన విషయాలు మాట్లాడవచ్చు?

• కుటుంబ వలయంలో, క్రైస్తవ సంఘంలో సంభాషణలు ఏ ప్రముఖ పాత్ర పోషిస్తాయి?

• క్షేమాభివృద్ధికరమైన సంభాషణలు ఎలాంటి ప్రయోజనాలు తీసుకొస్తాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) మానవులకున్న మాట్లాడే శక్తి ఎంత విలువైనది? (బి) యెహోవా సేవకులు తమ నాలుకను ఎలా ఉపయోగించాలని కోరుకుంటారు?

3, 4. (ఎ) మన సంభాషణకు సంబంధించి మనందరం ఏ సమస్య ఎదుర్కొంటాము? (బి) మన సంభాషణ ఎందుకొక ప్రాముఖ్యమైన అంశం?

5. క్షేమాభివృద్ధికరమైన సంభాషణలను ప్రోత్సహించడంలో హృదయమెలా కీలకపాత్ర పోషిస్తుంది?

6. మన సంభాషణల్లో ధ్యానం ఏ పాత్ర పోషిస్తుంది?

7, 8. క్షేమాభివృద్ధికరమైన సంభాషణలకు ఏ అంశాలు సరైనవిగా ఉంటాయి?

9. ఫిలిప్పీయులకు పౌలు ఏ హితవు చెప్పాడు?

10. మన సంభాషణల్లో సత్యవిషయాలను ఎలా చేర్చవచ్చును?

11. మన సంభాషణల్లో మాన్యమైన ఎలాంటి విషయాలు చేర్చవచ్చు?

12. ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో వాటిమీద ధ్యానముంచుకొనుడని పౌలు ఇచ్చిన ఉపదేశం దృష్ట్యా, వేటికి దూరంగా ఉండాలి?

13. రమ్యమైన, ఖ్యాతిగల విషయాల చుట్టూ పరిభ్రమించే సంభాషణల ఉదాహరణలు చెప్పండి.

14. (ఎ) సుగుణాన్ని కనబరచాలంటే మనమేమి చేయాలి? (బి) మన సంభాషణల్లో మెప్పుగల విషయాలను ఎలా చేర్చవచ్చు?

15. ఏ లేఖన ఆజ్ఞ తలిదండ్రులపై తమ పిల్లలతో అర్థవంతమైన, ఆధ్యాత్మిక సంభాషణలుచేసే బాధ్యతనుంచుతోంది?

16, 17. యెహోవా అబ్రాహాముల మాదిరినుండి క్రైస్తవ తలిదండ్రులు ఏమి నేర్చుకోగలరు?

18. పిల్లలకు తలిదండ్రులకు మధ్య మంచి సంభాషణా ప్రయోజనాలను చూపించే ఒక అనుభవం వివరించండి.

19. మనందరికి ఆధ్యాత్మిక సంభాషణలు ఎందుకు అవసరం?

20. బిడియపడే వ్యక్తి తారసపడితే మనమేమి చేయవచ్చు?

21, 22. ఆధ్యాత్మిక సంభాషణల్లో పాల్గొన్నప్పుడు మనకెలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?

[12వ పేజీలోని చిత్రాలు]

క్షేమాభివృద్ధికరమైన సంభాషణలు. . .

“ఏవి సత్యమైనవో”

“ఏవి మాన్యమైనవో”

ఏవి ‘మెప్పు’ గలవో

“ఏవి ఖ్యాతిగలవో” వాటిచుట్టూ పరిభ్రమిస్తాయి

[చిత్రసౌజన్యం]

Video cover, Stalin: U.S. Army photo; Creator book cover, Eagle Nebula: J. Hester and P. Scowen (AZ State Univ.), NASA

[13వ పేజీలోని చిత్రం]

ఆధ్యాత్మిక సంభాషణలకు భోజన సమయాలు చక్కని అవకాశాలిస్తాయి