కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“జ్ఞానుల ఉపదేశము”—జీవపు ఊట

“జ్ఞానుల ఉపదేశము”—జీవపు ఊట

“జ్ఞానుల ఉపదేశము”​జీవపు ఊట

“ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు” అని అపొస్తలుడైన పౌలు ఎలుగెత్తి పలికాడు. (రోమీయులు 11:​33) విశ్వసనీయ పితరుడైన యోబు ఇలా అన్నాడు: “ఆయన [యెహోవా దేవుడు] మహా వివేకి.” (యోబు 9:⁠4) అవును, భూమ్యాకాశముల సృష్టికర్త జ్ఞానంలో సాటిలేనివాడు. అలాంటి సృష్టికర్త ఉపదేశం గురించి లేక లిఖిత వాక్యం గురించి ఏమని చెప్పవచ్చు?

కీర్తనకర్త ఇలా పాడాడు: “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును; యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును.” (కీర్తన 19:​7, 8) ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను ఆ మాటల్లోని సత్యాన్ని ఎంతగా గ్రహించివుంటాడో కదా! ఆయనిలా చెప్పాడు: “జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును.” (సామెతలు 13:​14) సామెతలు 13వ అధ్యాయంలోని మొదటి 13 వచనాల్లో, దేవుని వాక్యంలో లభించే ఉపదేశము మన జీవన స్థితిని మెరుగుపరచుకోవడానికి, దాన్ని ప్రమాదంలో పడేసుకోకుండా ఉంచుకునేందుకు ఎలా సహాయపడగలదో సొలొమోను చూపించాడు.

నేర్చుకోవాలనే అభిలాషతో ఉండండి

“తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు” అని సామెతలు 13:⁠1 చెబుతోంది. తండ్రి ఇచ్చే క్రమశిక్షణ మృదువుగానూ ఉండవచ్చు, కఠినంగానూ ఉండవచ్చు. అది మొదట శిక్షణ రూపంలో రావచ్చు, అది తిరస్కరిస్తే చివరికి శిక్షగా మారవచ్చు. తన తండ్రి ఇచ్చే క్రమశిక్షణను అంగీకరించే కుమారుడే జ్ఞానముగలవాడవుతాడు.

“ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షిం[చును]” అని, “తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును” అని బైబిలు చెబుతోంది. (హెబ్రీయులు 12:​5, 6) మన పరలోకపు తండ్రి మనకు క్రమశిక్షణనిచ్చే ఒక మార్గమేమిటంటే ఆయన లిఖిత వాక్యమైన బైబిలు. మనం భక్తితో బైబిలు చదివి, అందులో నేర్చుకున్నదాన్ని అన్వయించుకున్నప్పుడు, ఆయన వాక్యం మనకు నిజంగా క్రమశిక్షణనిస్తుంది. అది మన మంచి కోసమే, ఎందుకంటే యెహోవా చెప్పేదంతా మన ప్రయోజనార్థమే.​—⁠యెషయా 48:​17.

క్రమశిక్షణ అనేది మన ఆధ్యాత్మిక సంక్షేమంపై శ్రద్ధగల తోటి విశ్వాసి నుండి దిద్దుబాటుగా కూడా రావచ్చు. దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండే సహాయకరమైన ఏ సలహానైనా, ఆ వ్యక్తి నుండి వస్తున్నట్లుగా కాక, సత్యానికి అతిగొప్ప మూలాధారం నుండి వస్తున్నట్లే దృష్టించాలి. ఆ దిద్దుబాటు యెహోవా నుండి వస్తున్నట్లు స్వీకరిస్తే మనం జ్ఞానముగలవారమౌతాం. మనమలా స్వీకరించి, అది మన ఆలోచనను మలిచేందుకు, లేఖనాలపై మన అవగాహనను మెరుగుపరిచేందుకు, మన మార్గాలను సరిదిద్దేందుకు అనుమతిస్తే మనం క్రమశిక్షణ నుండి ప్రయోజనం పొందుతున్నట్లే. క్రైస్తవ కూటాల్లో, బైబిలు ఆధారిత ప్రచురణల నుండి మనం పొందే ఉపదేశం కూడా అటువంటిదే. లిఖితపూర్వకంగా లేక మౌఖికంగా మనం నేర్చుకున్న దానికి విధేయతతో ప్రతిస్పందించడం, అత్యంత శ్రేష్ఠమైన స్వయం శిక్షణ.

మరోవైపు, అపహాసకుడు క్రమశిక్షణకు ప్రతిస్పందించడు. “ఎందుకంటే అతను తనకు మంచేదో తెలుసని భావిస్తాడు, అతనికి నేర్చుకోవాలనే అభిలాష ఉండదు” అని ఒక గ్రంథం చెబుతోంది. అతను గద్దింపుకు, అంటే కఠినమైన క్రమశిక్షణకు కూడా స్పందించడు. కానీ అతను తండ్రి ఇచ్చే క్రమశిక్షణ తప్పని ఎన్నటికైనా నిరూపించగలడా? యెహోవా ఎన్నడూ తప్పు కాలేదు, కాడు కూడా. అపహాసకుడు క్రమశిక్షణను తిరస్కరించడం ద్వారా తనకు తానే అపహాస్యానికి గురవుతాడు. మంచిగా ఎంపిక చేసుకున్న కొన్ని మాటల్లోనే, నేర్చుకోవాలనే అభిలాషతో ఉండడం విలువైనదని సొలొమోను ఎంత చక్కగా చూపించాడో కదా!

మీ నాలుకను కాపాడుకోండి!

మన మాటలకు దేవుని వాక్యాన్ని మార్గదర్శకంగా ఉంచుకోవలసిన ప్రాముఖ్యతను చూపించడానికి, ఇశ్రాయేలు రాజు నోటిని పళ్ళు కాసే ఒక చెట్టుతో పోలుస్తున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “నోటి ఫలముచేత మనుష్యుడు మేలు ననుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారముచేత నశించుదురు.” (సామెతలు 13:⁠2) మాట్లాడే మాటలే నోటి ఫలము. ఒక వ్యక్తి తన మాటల ద్వారా ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. “అతని మాటలు తన పొరుగువారిని ఆహ్లాదపరిచే ఉద్దేశంగలవి, వారితో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకోవడానికి నిర్దేశించబడినవి అయితే, అతను మేలుననుభవిస్తూ సంతోషకరమైన శాంతియుతమైన జీవనాన్ని గడుపుతాడు” అని ఒక విద్వాంసుడు అంటున్నాడు. విశ్వాసఘాతకుని పరిస్థితి దానికి భిన్నంగా ఉంటుంది. అతడు బలాత్కారం చేసి ఇతరులకు హాని చేయాలనుకుంటాడు. బలాత్కారానికి వ్యూహం పన్నుతాడు, బలాత్కారాన్నే పొందుతాడు. మరణపు ఉరులు అతని వాకిట పొంచివుంటాయి.

సొలొమోను ఇంకా ఇలా అంటున్నాడు: “తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు నాశనము తెచ్చుకొనును.” (సామెతలు 13:⁠3) పతనమైన ప్రతిష్ఠ, మనసు గాయపడిన భావాలు, దెబ్బతిన్న సంబంధాలు, చివరకు శారీరక హాని వంటివి అనాలోచితమైన మూర్ఖపు మాటలవల్ల కలిగే పరిణామాలు. అధికంగా మాట్లాడే మాటలు కూడా దేవుని అసమ్మతికి గురిచేయవచ్చు, ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరినీ తమ మాటలకు లెక్క అడుగుతాడు. (మత్తయి 12:​36, 37) నిజంగానే మన నోటిని నిగ్రహించుకోవడం, మనల్ని నాశనం నుండి కాపాడుతుంది. అయితే మన నోటిని కాపాడుకోవడాన్ని మనమెలా నేర్చుకోవచ్చు?

దీనికి ఒక సులభమైన మార్గమేమిటంటే ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం. “విస్తారమైన మాటలలో దోషముండక మానదు” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 10:​19) మరొక మార్గం ఏమిటంటే మాట్లాడడానికి ముందు ఆలోచించాలి. ప్రేరేపిత రచయిత ఇలా ప్రకటిస్తున్నాడు: “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు.” (సామెతలు 12:​18) మాట్లాడడానికి ముందు ఆలోచించకపోతే అటు మాట్లాడిన వ్యక్తీ, ఇటు శ్రోతలూ గాయపడవచ్చు. అందుకే బైబిలు మనకు ఆచరణాత్మక సలహానిస్తోంది: “నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును.” (ఇటాలిక్కులు మావి.)​—⁠సామెతలు 15:​28.

శ్రద్ధగలవారిగా ఉండండి

“సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు. శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును” అని సొలొమోను చెబుతున్నాడు. (సామెతలు 13:⁠4) “[ఈ సామెత] సారాంశమేమిటంటే కేవలం ఆశపడడం మాత్రమే కాదు, శ్రమించాలి. సోమరులు తమ కోరికలకు బాధితులవుతారు . . . అవి వారిని హరించివేస్తాయి, దానివల్ల వారికి ఏమీ ఫలితముండదు” అని ఒక గ్రంథం తెలియజేస్తోంది. అయితే శ్రద్ధతో లేక కష్టపడి పనిచేసేవారి ప్రాణము సంతృప్తి పొందుతుంది లేక వారి ఆశ తీరుతుంది అంటే నెరవేరుతుంది.

బాధ్యతను తప్పించుకోవాలని యెహోవాకు సమర్పించుకోకుండా ఉండేవారి గురించి ఏమని చెప్పవచ్చు? వారు దేవుని నూతనలోకంలో జీవించాలని ఆశిస్తుండవచ్చు, కానీ వారు దాని గురించి ఏమైనా చేయడానికి ఇష్టపడుతున్నారా? వారు “మహాశ్రమలనుండి” బయటపడాలంటే యేసు విమోచన క్రయధనంపై విశ్వాసముంచి, యెహోవాకు సమర్పించుకొని, తమ సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించవలసిన ఆవశ్యకత ఉంది.​—⁠ప్రకటన 7:​14, 15.

సంఘంలో బాధ్యతలను చేపట్టాలని కోరుకోవడంలో కూడా ఏముందో ఆలోచించండి. ఇలాంటి దొడ్డపనిని అపేక్షించడం ఖచ్చితంగా ప్రశంసనీయమే, లేఖనాలు దాన్ని ప్రోత్సహిస్తున్నాయి కూడా. (1 తిమోతి 3:⁠1) అయితే ఒక వ్యక్తి కేవలం అపేక్షిస్తే సరిపోదు. ఒక స్థానానికి యోగ్యులు కావాలంటే కొన్ని లక్షణాలను, సామర్థ్యాలను పెంపొందించుకోవలసిన అవసరముంటుంది. దానికి శ్రద్ధతో స్వయంగా కృషి చేయవలసివుంటుంది.

నీతి​—⁠రక్షకము

ఒక నీతిమంతుడు దేవుని లక్షణాలను పెంపొందించుకుంటాడు, సత్యమే మాట్లాడతాడు. అబద్ధమాడడం దేవుని నియమానికి విరుద్ధమని ఆయన గ్రహిస్తాడు. (సామెతలు 6:​16-19; కొలొస్సయులు 3:⁠9) ఈ విషయంలో, సొలొమోను ఇలా వ్యాఖ్యానించాడు: “నీతిమంతునికి కల్ల మాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును [“తనను తాను అవమానపరచుకుంటాడు,” NW]. (సామెతలు 13:⁠5) నీతిమంతుడు కేవలం అబద్ధాలు చెప్పకపోవడం మాత్రమే కాదు, నిజానికి అబద్ధాలను అసహ్యించుకుంటాడు. అవి ఎంత అమాయకంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ, అవి మానవుల మధ్య మంచి సంబంధాలను నాశనం చేస్తాయని ఆయనకు తెలుసు. అంతేకాదు అబద్ధాలు చెప్పే వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని కోల్పోతాడు. భక్తిహీనుడు లేక దుర్మార్గుడు అబద్ధం చెప్పడం ద్వారా లేక మరో విధంగా అవమానకరంగా ప్రవర్తిస్తూ తనకు తలవంపులు తెచ్చుకుంటాడు.

దేవుని దృష్టిలో ఏది మంచిదో దాన్ని చేయడం ప్రయోజనకరమైనదని చూపించడానికి, జ్ఞానియైన రాజు ఇలా అంటున్నాడు: “యథార్థవర్తనునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును.” (సామెతలు 13:⁠6) నీతి ఒక వ్యక్తిని దుర్గంలాగ రక్షిస్తుంది, దుర్మార్గం అతడ్ని నాశనం చేస్తుంది.

నటించకండి

మానవ నైజం గురించిన అవగాహనను చూపిస్తూ, ఇశ్రాయేలు రాజు ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనముగలవారు కలరు.” (సామెతలు 13:⁠7) ఒక వ్యక్తి పైకి కనబడుతున్నట్లుగా ఉండకపోవచ్చు. కొందరు పేదవాళ్ళు ధనికులమని చెప్పుకుంటుండవచ్చు​—⁠బహుశా డంబం కోసం కావచ్చు, విజయవంతులమనే అభిప్రాయాన్ని కలిగించేందుకు లేక కేవలం ప్రతిష్ఠ కోసమే కావచ్చు. ధనవంతుడు కేవలం తన ధనాన్ని దాచుకునేందుకు పేదవాడినని చెప్పుకుంటుండవచ్చు.

అలా లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పుకోవడం రెండూ మంచివి కావు. మనకు భౌతిక వనరులు కొద్దిగా ఉన్నట్లయితే, బాగా ఉన్నవారిలా కనబడేందుకు చేసే విచ్చలవిడి ఖర్చులు, మనకు మన కుటుంబాలకు జీవితావసరాలు తీర్చుకోవడంలో ఆటంకం కలిగిస్తాయి. ధనవంతుడు పేదవాడినన్నట్లు నటిస్తే, అది అతడ్ని పీనాసిగా చేస్తూ అతనికి సరైన ఆత్మ గౌరవము లేకుండా, ఔదార్యంగా ఉండడం వల్ల వచ్చే సంతోషము దక్కకుండా చేయవచ్చు. (అపొస్తలుల కార్యములు 20:​35) నిజాయితీగా జీవిస్తే మంచి జీవితాన్ని గడపవచ్చు.

కోరికలను సామాన్యంగా ఉంచుకోండి

“ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును, దరిద్రుడు బెదరింపు మాటలు వినడు” అని సొలొమోను అంటున్నాడు. (సామెతలు 13:⁠8) జ్ఞానవంతమైన ఈ మాటల్లో ఏ పాఠాన్ని తెలియజేస్తున్నాడు?

ధనవంతులుగా ఉండడంలో ప్రయోజనాలున్నాయి, కానీ ధనవంతులుగా ఉండడమే సంపూర్ణ ఆశీర్వాదం కాదు. మనం జీవిస్తున్న ఈ కష్టకాలాల్లో ధనవంతులు తరచూ తాము, తమ కుటుంబ సభ్యులు డబ్బుకోసం అపహరించుకుపోబడే ప్రమాదానికి గురవుతున్నారు. కొన్నిసార్లు ఒక ధనవంతుడు తన ప్రాణం లేక తన కుటుంబ సభ్యుడి ప్రాణం కాపాడుకునేందుకు ప్రాయశ్చిత్తంగా డబ్బులివ్వగలడు. కానీ తరచుగా అలా అపహరించుకుపోబడినవారు చంపబడతారు. ధనవంతులకు అలాంటి ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.

పేదవాడికి అలాంటి భయం ఉండదు. అతనికి ధనవంతుడు అనుభవించేటువంటి అనేక సౌకర్యాలు, భౌతిక సంపదలు ఉండకపోవచ్చు, అతడ్ని అపహరించుకుపోయే అవకాశాలు చాలా తక్కువ. ఇది మన కోరికలను సామాన్యంగా ఉంచుకొని, ధనసంపదల కోసం మన సమయాన్ని, శక్తిని వెచ్చించకుండా ఉండడం వల్ల కలిగే ఒక ప్రయోజనం.​—⁠2 తిమోతి 2:⁠4.

“వెలుగు”లో తేజరిల్లండి

యెహోవా మార్గంలో పనులు చేయడం మనకు అత్యంత ప్రయోజనకరమైనదని చూపించడానికి సొలొమోను ఇంకా ఇలా అంటున్నాడు: “నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును.”​—⁠సామెతలు 13:⁠9.

దీపము, జీవితంలో మన మార్గాన్ని వెలుగుమయం చేసుకోవడాన్ని సూచిస్తోంది. ‘దేవుని వాక్యము నీతిమంతుని పాదములకు దీపమును ఆయన త్రోవకు వెలుగునై యున్నది.’ (కీర్తన 119:​105) దేవుని వాక్యంలో సృష్టికర్త గురించిన అపారమైన జ్ఞానపరిజ్ఞానాలున్నాయి. దేవుని చిత్తం, సంకల్పం గురించి మన అవగాహనను మనమెంత మెరుగుపరచుకుంటే, మనల్ని నిర్దేశించే ఆధ్యాత్మిక వెలుగు అంత ప్రకాశవంతమవుతుంది. తేజరిల్లడానికి లేక ఆనందానికి అదెంత గొప్ప ఆధారమో కదా! అలాంటప్పుడు మనం ఈ లోకపు జ్ఞానం వైపుకు లేక “జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన” దాని వైపుకు మన మనసునెందుకు మళ్ళించాలి?​—⁠1 తిమోతి 6:​20; 1 కొరింథీయులు 1:​20; కొలొస్సయులు 2:⁠8.

దుష్టుని విషయానికొస్తే, అతని దీపము ఎంత ప్రకాశవంతంగా వెలుగుతున్నట్లనిపించినా, అతడు ఎంత వర్ధిల్లుతున్నట్లనిపించినా అతని దీపము ఆరిపోతుంది. అతను అంధకారంలో చిక్కుకుపోతాడు, అక్కడ అతని అడుగులు తడబడడం ఖాయం. అంతేకాదు అతనికి ‘ముందు గతి ఉండదు.’​—⁠సామెతలు 24:​20.

అయితే ఒక నిర్దిష్ట పరిస్థితిలో ఎలాంటి చర్య తీసుకోవాలో తెలియనప్పుడు మనమేమి చేయాలి? అసలు చర్య తీసుకునే అధికారం మనకుందో లేదో తెలియనప్పుడు ఎలా? సామెతలు 13:​10 ఇలా హెచ్చరిస్తోంది: “గర్వమువలన జగడమే పుట్టును.” తెలియకపోయినా లేక మనకు అధికారం లేకపోయినా చర్యతీసుకోవడం గర్వముతో కూడిన పనవుతుంది, అది ఘర్షణకు కారణమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పరిజ్ఞానము, వివేచన ఉన్నవారిని సంప్రదించడం మంచిది కాదా? “ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును” అని జ్ఞానియైన రాజు అంటున్నాడు.

తప్పుడు కోరికల విషయంలో జాగ్రత్త

డబ్బు ప్రయోజనకరమైన ఒక ఉద్దేశాన్ని నెరవేర్చగలదు. కఠిన పరిస్థితుల్లో లేక పేదరికంలో జీవించడం కంటే తగినంత ధనం ఉండడం మంచిది. (ప్రసంగి 7:​11, 12) అయితే అన్యాయంగా సంపాదించుకున్న సొమ్ముతో మనం పొందవచ్చుననుకునే ప్రయోజనాలన్నీ మోసకరం కావచ్చు. సొలొమోను ఇలా హెచ్చరిస్తున్నాడు: “మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసికొనును.”​—⁠సామెతలు 13:​11.

ఉదాహరణకు జూదంలోని ప్రలోభం గురించి ఆలోచించండి. ఒక జూదగాడు, పెద్ద మొత్తం గెలుచుకోవాలనే ఆశతో, తను కష్టపడి సంపాదించిన డబ్బును వెచ్చిస్తుండవచ్చు. కానీ అలా చేయడంలో అతను తన కుటుంబ సంక్షేమాన్ని బలిచేస్తుండవచ్చు! ఒకవేళ జూదగాడు గెలిస్తే ఏమి జరుగుతుంది? ఆ డబ్బు తేలిగ్గానే వచ్చింది కాబట్టి, అతను దానికి ఎక్కువ విలువ ఇవ్వకపోవచ్చు. అంతేగాక తనకు కొత్తగా లభించిన బహుమతిని ఉపయోగించుకునే నైపుణ్యం కూడా అతనికి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు అతనికి ఆ సంపదలు లభించినంత వేగంగానే మాయమైపోవా? మరోవైపున క్రమంగా, కొద్ది కొద్దిగా, కష్టపడి పని చేయడం ద్వారా కూడబెట్టుకున్న ధనము​—⁠స్థిరంగా వృద్ధిచెందుతుంది, దాన్ని లాభకరంగా ఉపయోగించుకోవచ్చు.

“కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము” అని సొలొమోను పేర్కొంటున్నాడు. (సామెతలు 13:​12) నెరవేరని కోరికలు హృదయాన్ని కృంగదీసే నిరాశలకు గురిచేస్తాయి. ఇది దైనందిన జీవితంలో సంభవిస్తుంది. కానీ దేవుని వాక్యంపై దృఢంగా ఆధారపడిన నిరీక్షణల విషయంలో అలా జరుగదు. అవి నెరవేరతాయని మనం సంపూర్ణ నమ్మకంతో ఉండవచ్చు. ఆలస్యమవుతోంది అని అనిపించేవి కూడా నిరాశకు గురిచేసే అవకాశం అంతగా ఉండదు.

ఉదాహరణకు, దేవుని నూతనలోకం త్వరలో రానున్నదని మనకు తెలుసు. (2 పేతురు 3:​13) అత్యంత కాంక్షతోకూడిన ఊహలతో మనం దేవుని వాగ్దానాల నెరవేర్పు కోసం ఆనందంగా ఎదురుచూస్తున్నాం. మనం ఎదురు చూసే సమయాన్ని, తోటి విశ్వాసులను ప్రోత్సహించడానికి, యెహోవాతో మరింత సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి “ప్రభువు కార్యాభివృద్ధి[లో]” నిమగ్నులై ఉండేందుకు ఉపయోగించుకుంటే ఏమి జరుగుతుంది? “హృదయము నొచ్చు”కోవడానికి బదులు ఆనందంతో నిండుకుంటుంది. (1 కొరింథీయులు 15:​58; హెబ్రీయులు 10:​24, 25; యాకోబు 4:⁠8) చాలాకాలం నుండి ఎదురుచూస్తున్న కోరిక నెరవేరినప్పుడు, అది నిజంగా చైతన్యం కలిగించే, పునరుత్తేజాన్నిచ్చే జీవవృక్షము వంటిదే.

దేవుని ఉపదేశం​—⁠జీవపు ఊట

దేవునికి విధేయంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ, సామెతలు 13:⁠13 ఇలా చెబుతోంది: “ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులుగలవాడు లాభముపొందును.” దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించనట్లయితే, మనం నష్టపోవాల్సివస్తుంది. ఎటువంటి నష్టం?

“జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును.” (సామెతలు 13:​14) సర్వజ్ఞానియైన యెహోవా దేవుని ఉపదేశం లేకుండా జీవించడం, శ్రేష్ఠమైన దీర్ఘకాల జీవితాన్ని గడిపేందుకు సహాయపడగల మార్గదర్శకం లేకుండా చేస్తుంది. అదెంత గొప్ప నష్టమో కదా! అలాంటప్పుడు మనకు జ్ఞానవంతమైన మార్గమేమిటంటే, దేవుని వాక్యంపై పూర్తి అవధానం నిలిపి, అది మన ఆలోచనలను, మాటలను, చర్యలను ప్రభావితం చేసేందుకు అనుమతించడమే.​—⁠2 కొరింథీయులు 10:⁠5; కొలొస్సయులు 1:​10.

[23వ పేజీలోని చిత్రాలు]

లేఖనాధార ఉపదేశానికి ప్రతిస్పందించడం అత్యంత శ్రేష్ఠమైన స్వయం శిక్షణ

[24, 25వ పేజీలోని చిత్రాలు]

“నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును”

[24, 25వ పేజీలోని చిత్రాలు]

“ప్రభువు కార్యాభివృద్ధి[లో]” నిమగ్నమై ఉండడం మనల్ని ఆనందంతో నింపుతుంది