కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్టిన్‌ లూథర్‌ —ఆ మహాపురుషుడు ఆయన వారసత్వం

మార్టిన్‌ లూథర్‌ —ఆ మహాపురుషుడు ఆయన వారసత్వం

మార్టిన్‌ లూథర్‌ఆ మహాపురుషుడు ఆయన వారసత్వం

“చరిత్రలో ఎవరి గురించీ వ్రాయబడనన్ని పుస్తకాలు, ఆయన [మార్టిన్‌ లూథర్‌] యజమాని యేసుక్రీస్తు మినహా, ఆయన గురించి వ్రాయబడ్డాయని అంటారు” అని టైమ్‌ పత్రిక వ్యాఖ్యానించింది. లూథర్‌ మాటలు, చర్యలు ఒక సంస్కరణకు అంటే “మానవ చరిత్రలోనే అత్యంత విశేషమైన ఉద్యమం” అని వర్ణించబడిన ఒక మతోద్యమం ఆవిర్భవించేందుకు దోహదపడ్డాయి. ఆ విధంగా ఆయన ఐరోపాలోని మత రూపురేఖల్ని మార్చి, ఆ ఖండంలో మధ్యయుగ కాలాల ముగింపుకు తోడ్పడ్డాడు. ప్రామాణిక లిఖిత జర్మన్‌ భాషకు కూడా లూథర్‌ ఆధారాన్నిచ్చాడు. ఆయన అనువదించిన బైబిలు జర్మన్‌ భాషలో అత్యంత ప్రఖ్యాతి పొందిందనడంలో సందేహం లేదు.

మార్టిన్‌ లూథర్‌ ఎలాంటి వ్యక్తి? ఆయన ఐరోపా వ్యవహారాలను అంతగా ఎలా ప్రభావితం చేయగలిగాడు?

లూథర్‌ విద్వాంసుడు కావడం

మార్టిన్‌ లూథర్‌ 1483, నవంబరులో జర్మనీలోని ఐస్లేబన్‌లో జన్మించాడు. ఆయన తండ్రి రాగి గనుల్లో పనిచేసే కార్మికుడే అయినప్పటికీ, ఆయన మార్టిన్‌కు మంచి విద్యాభ్యాసానికి సరిపోయేంత సంపాదించగలిగాడు. మార్టిన్‌ 1501లో ఎర్ఫర్ట్‌ విశ్వవిద్యాలయ విద్యార్థి అయ్యాడు. దానికి సంబంధించిన గ్రంథాలయంలో ఆయన మొట్టమొదటిసారి బైబిలు చదివాడు. “ఆ గ్రంథం నాకెంతో ఆహ్లాదాన్నిచ్చింది, అలాంటి గ్రంథాన్ని సొంతం చేసుకునే భాగ్యం ఏదో ఒక రోజు నాకు కలగాలని ఆశించాను” అని ఆయనన్నాడు.

లూథర్‌ తన 22వ యేట ఎర్ఫర్ట్‌లోని ఆగస్టీనియన్‌ మఠంలో చేరాడు. ఆ తర్వాత ఆయన విట్టెన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో చేరి మతధర్మ శాస్త్రంలో డాక్టరేట్‌ సంపాదించాడు. లూథర్‌ తాను దేవుని అనుగ్రహం పొందడానికి అనర్హుడినని భావించాడు, కొన్నిసార్లైతే అపరాధ భావంతో నైరాశ్యంలో కుమిలిపోయేవాడు. కానీ దేవుడు పాపులను ఎలా దృష్టిస్తాడనే విషయంపై చక్కని అవగాహన ఏర్పరచుకునేందుకు ఆయనకు బైబిలు అధ్యయనం, ప్రార్థన, ధ్యానం దోహదపడ్డాయి. దేవుని అనుగ్రహం సంపాదించుకునేది కాదని, బదులుగా అది విశ్వసించేవారికి కృపతో అనుగ్రహించబడుతుందని లూథర్‌ గ్రహించాడు.​—⁠రోమీయులు 1:​16; 3:​23, 24, 28.

తనకు కలిగిన కొత్త అవగాహన సరైనదనే నిర్ధారణకు లూథర్‌ ఎలా వచ్చాడు? తొలి చర్చి చరిత్ర మరియు కొత్త నిబంధన లేఖనాల పరిశోధన అనే సంస్థకు చెందిన ప్రొఫెసర్‌ కుర్ట్‌ ఆలంద్‌ ఇలా వ్రాశాడు: “కొత్తగా లభ్యమైన ఈ పరిజ్ఞానం, ఇతర బైబిలు వ్యాఖ్యానాలతో సరిపోలుతుందో లేదో నిశ్చయించుకునేందుకు ఆయన మొత్తం బైబిలును ధ్యానించాడు, ప్రతి భాగం దానిని ధృవీకరిస్తోందని తెలుసుకున్నాడు.” దేవుని చేత నీతిమంతుడిగా తీర్పుతీర్చబడడం లేక రక్షించబడడం అనేది విశ్వాసం వల్లనే గానీ క్రియల వల్ల లేక పశ్చాత్తాపం వల్ల కాదనే సిద్ధాంతం, లూథర్‌ బోధనల్లో మూలస్తంభంలా నిలిచిపోయింది.

పాపపరిహార పత్రాల పట్ల ఆగ్రహం

దేవుడు పాపులను ఎలా దృష్టిస్తాడనే విషయంలో లూథర్‌కు కలిగిన అవగాహన, రోమన్‌ క్యాథలిక్‌ చర్చితో ఆయనకు విరోధాన్ని తెచ్చిపెట్టింది. మరణం తర్వాత పాపులు కొంతకాలం వరకు శిక్షించబడతారని అప్పట్లో బాగా నమ్మేవారు. అయితే డబ్బు తీసుకుని పోపు అధికారంతో ఇవ్వబడే పాపపరిహార పత్రాల ద్వారా ఆ సమయాన్ని తగ్గించుకోవచ్చని చెప్పుకునేవారు. మయాన్స్‌ నగర మతాచార్యుడైన ఆల్బర్ట్‌కు ప్రతినిధిగా పనిచేసిన యోహాన్‌ తెత్సల్‌ వంటి వ్యాపారులు, ఈ పాపపరిహార పత్రాలను సాధారణ ప్రజలకు అమ్మడాన్ని లాభకరమైన వ్యాపారంగా చేశారు. చాలామంది ఈ పాపపరిహార పత్రాలను తాము భవిష్యత్తులో చేసే పాపాలకు భీమా అన్నట్లు దృష్టించారు.

లూథర్‌కు ఈ పాపపరిహార పత్రాలను అమ్మే దురాచారం ఆగ్రహం తెప్పించింది. మానవులు దేవునితో బేరసారాలు చేయలేరని ఆయనకు తెలుసు. 1517లోని శరదృతువులో ఆయన, చర్చి ఆర్థికపరంగా, సిద్ధాంతపరంగా, మతపరంగా దురాగతం చేస్తోందని ఆరోపిస్తూ ప్రముఖమైన 95 సిద్ధాంతాలను వ్రాశాడు. ఆయన తిరుగుబాటు చేయాలన్న ఉద్దేశంతో కాదు గానీ సంస్కరణ ఉద్దేశంతోనే, తను వ్రాసిన సిద్ధాంతాల కాపీలను మయాన్స్‌ నగర మతాచార్యుడైన ఆల్బర్ట్‌తోపాటు పలు విద్వాంసులకు పంపించాడు. చాలామంది చరిత్రకారులు 1517ను లేదా దాని సమీప కాలాన్ని సంస్కరణోద్యమం ఆవిర్భవించిన కాలంగా సూచిస్తారు.

చర్చి దురాగతాలను బట్టి విచారాన్ని వ్యక్తం చేసింది లూథర్‌ ఒక్కడే కాదు. వంద సంవత్సరాల ముందు, చెక్‌ మత సంస్కర్త యాన్‌ హస్‌ కూడా, పాపపరిహార పత్రాల విక్రయాన్ని ఖండించాడు. హస్‌ కంటే ముందు ఇంగ్లాండుకు చెందిన జాన్‌ విక్లిఫ్‌ కూడా, చర్చి నిర్వహిస్తున్న కొన్ని ఆచారాలు లేఖనాధారమైనవి కావని సూచించాడు. లూథర్‌ సమకాలీనులైన రాటర్‌డమ్‌కు చెందిన ఇరాస్‌మస్‌, ఇంగ్లాండుకు చెందిన టిండేల్‌లు సంస్కరణను ప్రేరేపించారు. కానీ యోహానస్‌ గూటెన్‌బర్గ్‌ జర్మనీలో కనిపెట్టిన కదిలే టైపు ముద్రణ యంత్రం వల్ల లూథర్‌ గొంతు ఇతర సంస్కరణకర్తల కంటే బిగ్గరగా ఎక్కువదూరం వరకు వినిపించింది.

గూటెన్‌బర్గ్‌ ముద్రణ యంత్రం మైన్ట్స్‌లో 1455లో పనిచేయడం ప్రారంభించింది. ఆ శతాబ్దాంతానికల్లా, జర్మనీలోని 60 నగరాల్లో, ఐరోపా ఖండంలోని ఇతర 12 ప్రాంతాల్లో ముద్రణా యంత్రాలు ఉండేవి. చరిత్రలో మొదటిసారిగా, ప్రజలకు ఆసక్తికరమైన విషయాలు వెంటనే చేరవేయగలిగే స్థితి ఏర్పడింది. బహుశా లూథర్‌ అనుమతి తీసుకోకుండానే, ఆయన వ్రాసిన 95 సిద్ధాంతాలు ముద్రించి పంపిణీచేయబడ్డాయి. చర్చి సంస్కరణ వివాదం, స్థానిక వివాద స్థాయిని దాటిపోయింది. అది ప్రఖ్యాతిగాంచిన వివాదంగా మారింది. దానితో మార్టిన్‌ లూథర్‌ ఉన్నట్టుండి జర్మనీలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా మారాడు.

“సూర్యచంద్రుల” ప్రతిస్పందన

శతాబ్దాలపాటు ఐరోపా రెండు శక్తివంతమైన వ్యవస్థల చేతుల్లో ఉండిపోయింది: పరిశుద్ధ రోమా సామ్రాజ్యం, రోమన్‌ క్యాథలిక్‌ చర్చి. “చక్రవర్తి, పోపుల సమైఖ్యత సూర్యచంద్రుల వంటిది” అని లూథరన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడైన హాన్స్‌ లీల్య వ్యాఖ్యానించాడు. అయితే ఎవరు సూర్యుడు, ఎవరు చంద్రుడు అనే విషయంలో చాలా సందిగ్ధత ఉండేది. 16వ శతాబ్దం తొలికాలానికల్లా, రెండు వ్యవస్థలూ తమ ఉన్నతాధికార స్థాయిని కోల్పోయాయి. ఒక కొత్త వాతావరణం ఆవహించింది.

పోపు లియో X, 95 సిద్ధాంతాలకు ప్రతిస్పందిస్తూ, వాటిని ఉపసంహరించుకొమ్మనీ లేదంటే చర్చి నుండి వెలివేస్తామనీ లూథర్‌ను బెదిరించాడు. లూథర్‌ నిర్భయంగా ఆ బెదిరింపు ఉన్న చర్చి అధికార పత్రాన్ని బహిరంగంగా తగులబెట్టి, పోపు అంగీకారము లేకున్నా చర్చిని సంస్కరించమంటూ ప్రిన్సిపాలిటీలను (యువరాజు పాలనలోని రాష్ట్రాలు) ప్రోత్సహించే మరిన్ని రచనలను ప్రచురించాడు. 1521లో పోపు లియో X లూథర్‌ను వెలివేశాడు. విచారణ జరపకుండానే తనపై దోషారోపణ చేయబడిందని లూథర్‌ దాన్ని ఆక్షేపించాడు, చార్లెస్‌ V చక్రవర్తి ఆ సంస్కరణకర్తను వార్మస్‌లో జరిగిన రాజ్యాధినేతల సభకు లేక సమావేశానికి రమ్మని ఆజ్ఞాపించాడు. 1521 ఏప్రిల్‌లో లూథర్‌ విట్టెన్‌బర్గ్‌ నుండి వార్మస్‌కు చేసిన 15 రోజుల ప్రయాణం దిగ్విజయ యాత్రలా కొనసాగింది. ఆయనకు ప్రజల మద్దతుంది, అన్ని ప్రాంతాల ప్రజలు ఆయనను చూడాలనుకున్నారు.

లూథర్‌ వార్మస్‌లో చక్రవర్తి, రాజులు, పోపు రాయబారి సమక్షంలో నిలబడ్డాడు. యాన్‌ హస్‌పై 1415లో కాన్‌స్టన్స్‌లో ఇలాగే విచారణ జరిపి ఆయనను కొయ్యపై తగులబెట్టారు. చర్చి మరియు చక్రవర్తి కళ్ళు ఇప్పుడు ఈయనపై ఉన్నాయి, తను వ్రాసినవి తప్పని తన విరోధులు బైబిలు నుండి నిరూపిస్తేనే తప్ప వాటిని ఉపసంహరించుకోనని లూథర్‌ నిక్కచ్చిగా చెప్పాడు. అయితే లేఖనాలపై ఆయనకున్న అవగాహనతో ఎవరూ సాటిరాలేకపోయారు. వార్మస్‌ ప్రభుత్వ ప్రకటన అని పిలువబడే ఒక పత్రం ఆ విచారణ ఫలితాన్ని తెలియజేసింది. అది లూథర్‌ను బహిష్కరిస్తున్నట్లు ఆయన రచనలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పోపుచేత వెలివేయబడి, చక్రవర్తిచేత బహిష్కరించబడడంతో లూథర్‌కు ప్రాణాపాయం ఏర్పడింది.

ఆ నేపథ్యంలో సంఘటనలు ఊహించనిరీతిలో నాటకీయంగా తారుమారయ్యాయి. లూథర్‌ విట్టెన్‌బర్గ్‌కు తిరుగు ప్రయాణం చేస్తుండగా, సాక్సోనీకి చెందిన దయాత్ముడైన ఫ్రెడ్రిక్‌ ఆయన బలవంతంగా ఎత్తుకుపోబడినట్లు నమ్మించడానికి చేసిన ఏర్పాటులో పావుగా మారాడు. అది లూథర్‌ను ఆయన శత్రువులకు అందనంత దూరం తీసుకువెళ్ళింది. లూథర్‌ నగరానికి దూరంగా ఉన్న వార్ట్‌బర్గ్‌ కోటలోకి రహస్యంగా కొనిపోబడ్డాడు. అక్కడ ఆయన గెడ్డం పెంచుకొని కొత్త వ్యక్తిగా అంటే యంకర్‌ యోర్గ్‌ అని పిలువబడే ఒక గొప్ప వ్యక్తిగా పేరుగాంచాడు.

సెప్టెంబరు బైబిలుకు గొప్ప గిరాకీ

తర్వాతి పది నెలల వరకు లూథర్‌, చక్రవర్తినుండి పోపునుండి తప్పించుకుంటూ వార్ట్‌బర్గ్‌ కోటలోనే నివసించాడు. వెల్టర్బె వార్ట్‌బర్గ్‌ అనే పుస్తకం, “ఆయన వార్ట్‌బర్గ్‌లో గడిపిన సమయం ఆయన జీవితంలోని మిగతా అన్ని సమయాలకంటే ఎక్కువ ఫలవంతమైన, క్రియాశీలకమైన సమయం” అని వివరిస్తోంది. ఆయన సాధించినవాటిలో అత్యంత గొప్పది, గ్రీకు లేఖనాల ఇరాస్మస్‌ మూలపాఠాన్ని జర్మనులోకి అనువదించడం, దాన్ని అక్కడే పూర్తి చేశాడు. అది అనువాదకుడిగా లూథర్‌ పేరు పెట్టకుండానే 1522 సెప్టెంబరులో ప్రచురించబడింది, ఆ గ్రంథం సెప్టెంబరు బైబిలుగా పేరుగాంచింది. దాని వెల ఒకటిన్నర గిల్డర్లు, అంటే ఇంట్లో పనిచేసే ఒక పనిమనిషికి సంవత్సరానికిచ్చే వేతనంతో సమానం. అయినప్పటికీ సెప్టెంబరు బైబిలుకు గిరాకీ బాగా పెరిగింది. 12 నెలల్లోనే 6,000 కాపీలు, 2 ఎడిషన్లలో ముద్రించబడ్డాయి. ఆ తర్వాతి 12 సంవత్సరాల్లో కనీసం మరో 69 ఎడిషన్లు చోటుచేసుకున్నాయి.

1525లో మార్టిన్‌ లూథర్‌, గతంలో సన్యాసిని అయిన కాథరీనా వోన్‌ బోరాను పెళ్ళి చేసుకున్నాడు. కాథరీనా ఇంటి వ్యవహారాలను నిర్వహించడంలోను, తన భర్త ఔదార్యం వల్ల ఏర్పడే పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడంలోను సమర్థురాలు. లూథర్‌ కుటుంబంలో కేవలం భార్య, ఆరుగురు పిల్లలే కాకుండా, స్నేహితులు, విద్వాంసులు, శరణార్థులు కూడా ఉండేవారు. లూథర్‌ తన జీవితంలోని చరమావస్థలో విద్వాంసులకు సలహాదారుడిగా గొప్ప ప్రతిష్ఠను అనుభవించాడు, ఆయనింటికి అతిథులుగా వచ్చే విద్వాంసులు కలము కాగితాలను చేతబట్టుకొని ఆయన వ్యాఖ్యానాలను వ్రాసుకునేందుకు సిద్ధంగా ఉండేవారు. అలా వ్రాసుకున్నవన్నీ సమీకరించి లూథర్స్‌ టిష్రేడన్‌ (లూథర్‌ యొక్క బల్లమీది ప్రసంగం) అని పేరు పెట్టారు. అది కొంతకాలం వరకు జర్మనీ భాషలో బైబిలు తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకంగా ప్రాచుర్యం పొందింది.

ప్రతిభగల అనువాదకుడు, ప్రజ్ఞావంతుడైన రచయిత

1534 నాటికి లూథర్‌ హీబ్రూ లేఖనాల అనువాదాన్ని పూర్తిచేశాడు. ఆయనలో శైలి, ఛందోగతి, పదావళిలను సమతుల్యం చేసే సామర్థ్యం ఉంది. దాని ఫలితంగానే సామాన్యులు కూడా అర్థంచేసుకోగలిగే బైబిలు తయారైంది. తన అనువాద విధానం గురించి వ్యాఖ్యానిస్తూ లూథర్‌ ఇలా వ్రాశాడు: “మనం ఇంట్లో అమ్మతో, వీధిలోని పిల్లలతో, సంతలోని సామాన్యుడితో మాట్లాడాలి, వారెలా మాట్లాడుతున్నారో జాగ్రత్తగా వినాలి, ఆ తర్వాత తదనుగుణంగా అనువదించాలి.” లూథర్‌ బైబిలు, జర్మనీ అంతటా అంగీకరించబడిన ప్రామాణిక భాషగా రూపొందడానికి దోహదపడింది.

అనువాదకుడిగా లూథర్‌ ప్రతిభ, రచయితగా ఆయనలో ఉన్న కౌశల్యంతో మిళితమయ్యేది. ఆయన తాను పని చేసిన కాలమంతటిలో ప్రతి రెండువారాలకు ఒక వ్యాసం వ్రాసేవాడని అంటారు. వాటిలో కొన్ని వాటి రచయితలాగే వివాదాస్పదంగా ఉండేవి. ఆయన తొలి రచనల్లోని శైలి ఎంతో పదునుగా ఉండేది, వయసుపైబడిన తర్వాత కూడా ఆయన కలంలోని పదును తగ్గలేదు. ఆయన తర్వాత వ్రాసిన వ్యాసాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. లెక్సీకొన్‌ ఫూర్‌ థేయోలోగీ ఉంట్‌ కిర్కె ప్రకారం, లూథర్‌ రచనలు “ఆయన మితిమీరిన కోపాన్ని,” “నమ్రత, ప్రేమల కొరతను,” మాత్రమేగాక “తను చేస్తున్నది అత్యావశ్యమైనది అనే బలమైన భావాలను” కూడా వ్యక్తం చేస్తాయి.

కర్షకుల పోరాటం మొదలైనప్పుడు ప్రిన్సిపాలిటీలు రక్తపు మడుగుల్లో మునిగాయి, ఆ ఉద్యమంపై లూథర్‌ అభిప్రాయం అడిగారు. రైతులకు తమ భూస్వాములపై ఫిర్యాదు చేసేందుకు తగిన కారణముందా? లూథర్‌ అధిక సంఖ్యలో ఉన్నవారిని సంతోషపరిచే జవాబునిచ్చి ప్రజల మద్దతును కాపాడుకోవడానికి ప్రయత్నించలేదు. దేవుని సేవకులు అధికారంలో ఉన్నవారికి విధేయులుగా ఉండాలని ఆయన విశ్వసించాడు. (రోమీయులు 13:⁠1) సూటిగా న్యాయం చెబుతూ, ఆ విప్లవాన్ని వెంటనే బలవంతంగా ఆపుచేయించాలని లూథర్‌ చెప్పాడు. “ఎవరికి సాధ్యమైతే వాళ్ళు పొడవండి, కొట్టండి, చంపండి” అని ఆయనన్నాడు. ఆ జవాబు లూథర్‌కి “ప్రజల్లో అప్పటివరకూ ఉన్న విశేషమైన ప్రఖ్యాతి” కోల్పోయేలా చేసిందని హాన్స్‌ లిల్యా పేర్కొన్నాడు. అంతేకాదు, క్రైస్తవత్వంలోకి మారడానికి నిరాకరించిన యూదుల గురించి లూథర్‌ ఆ తర్వాత వ్రాసిన వ్యాసాలు, ప్రత్యేకించి యూదులు, వారి అబద్ధాలు (ఆంగ్లం) వంటివి, వాటి రచయిత యూదుల విరోధి అని చాలామంది చేత అనిపించాయి.

లూథర్‌ వారసత్వం

లూథర్‌, కాల్విన్‌, స్వింగ్లి వంటి వారిచేత పురికొల్పబడిన సంస్కరణ, మతాన్ని ఒక కొత్త కోణంలోంచి చూడడానికి దారి తీసింది, అది ప్రొటస్టెంటిజమ్‌ అని పిలువబడుతోంది. లూథర్‌ ప్రొటస్టెంటిజమ్‌కు వారసత్వంగా వదిలేసిన గొప్ప ఆస్తి ఏమిటంటే, విశ్వాసం ద్వారా తీర్పుతీర్చబడడం అనే తన ప్రధాన బోధ. జర్మనీలోని ప్రభుత్వాలన్నీ ప్రొటస్టెంటు మతానికి లేదా క్యాథలిక్‌ విశ్వాసానికి మద్దతుగా నిలబడ్డాయి. ప్రొటస్టెంటిజమ్‌ వ్యాప్తి చెంది స్కాండినావియా, స్విట్జర్లాండ్‌, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌లలో ప్రజల మద్దతును సంపాదించుకుంది. నేడు దాన్ని అంటిపెట్టుకొని ఉన్నవారు కోట్లలో ఉన్నారు.

చాలామంది, లూథర్‌ విశ్వాసాలన్నింటిని విశ్వసించకపోయినా ఆయనను ఎంతో గౌరవిస్తారు. ఐస్లేబన్‌, ఎర్ఫర్ట్‌, విట్టెన్‌బర్గ్‌, వార్ట్‌బర్గ్‌లు తన సరిహద్దుల్లో ఉన్న పూర్వపు జర్మన్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ 1983లో లూథర్‌ 500వ జయంతి చేసుకుంది. ఈ సోషలిస్ట్‌ రాష్ట్రం ఆయనను జర్మనీ చరిత్రలోను సంస్కృతిలోను ఒక విశిష్ఠమైన వ్యక్తిగా గుర్తించింది. అంతేకాదు 1980లలోని క్యాథలిక్‌ మత పండితుడు ఒకాయన లూథర్‌ ప్రభావాన్ని ఇలా పేర్కొన్నాడు: “లూథర్‌ తర్వాత వచ్చిన వారెవ్వరూ ఆయనకు సాటికాలేకపోయారు.” ప్రొఫెసర్‌ ఆలండో ఇలా వ్రాశాడు: “మార్టిన్‌ లూథర్‌పై, ఆయన సంస్కరణపై ప్రతి సంవత్సరం కనీసం 500 కొత్త ప్రచురణలు వస్తున్నాయి, అదికూడా ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రముఖ భాషల్లో వస్తున్నాయి.”

మార్టిన్‌ లూథర్‌లో నిశితమైన మేధ, అసాధారణమైన జ్ఞాపకశక్తి, పదాలలో ప్రావీణ్యత, అత్యున్నత కార్యశీలత ఉన్నాయి. ఆయనలో ఓర్పులేమి, అలక్ష్యం కూడా ఉండేవి, వేషధారణగా ఆయన దృష్టించినదాని పట్ల ఉద్రేకంతో ప్రతిస్పందించేవాడు. ఆయన 1546, ఫిబ్రవరిలో ఐస్లేబన్‌లో మరణశయ్యపై ఉన్నప్పుడు, తను ఇతరులకు బోధించిన విశ్వాసాల విషయంలో ఆయన స్థిరంగా ఉన్నాడా అని ఆయన మిత్రులు అడిగారు. అందుకాయన “ఉన్నాను” అని సమాధానమిచ్చాడు. లూథర్‌ మరణించాడు కానీ ఇప్పటికీ చాలామంది ఆ విశ్వాసాలను అంటిపెట్టుకొనివున్నారు.

[27వ పేజీలోని చిత్రం]

పాపపరిహార పత్రాల విక్రయాన్ని లూథర్‌ వ్యతిరేకించాడు

[చిత్రసౌజన్యం]

Mit freundlicher Genehmigung: Wartburg-Stiftung

[28వ పేజీలోని చిత్రం]

లూథర్‌ తను వ్రాసినవి తప్పని తన విరోధులు బైబిలు నుండి నిరూపిస్తేనే తప్ప వాటిని ఉపసంహరించుకోనని చెప్పాడు

[చిత్రసౌజన్యం]

From the book The Story of Liberty, 1878

[29వ పేజీలోని చిత్రం]

వార్ట్‌బర్గ్‌ కోటలోని లూథర్‌ గది, ఆయన బైబిలు అనువాదం చేసింది ఇక్కడే

[చిత్రసౌజన్యం]

రెండు చిత్రాలు: Mit freundlicher Genehmigung: Wartburg-Stiftung

[26వ పేజీలోని చిత్రసౌజన్యం]

From the book Martin Luther The Reformer, 3rd Edition, published by Toronto Willard Tract Depository, Toronto, Ontario

[30వ పేజీలోని చిత్రసౌజన్యం]

From the book The History of Protestantism (Vol. I)