కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ వివాహానికి బైబిలు సహాయం చేయగలదు

మీ వివాహానికి బైబిలు సహాయం చేయగలదు

మీ వివాహానికి బైబిలు సహాయం చేయగలదు

వివాహం​—⁠ఈ మాట కొందరిలో ఆహ్లాదకరమైన భావాలను కలుగజేస్తుంది. మరి కొందరికి అది హృదయవేదన కలిగిస్తుంది. “మానసికంగా మేము విడిపోయి జీవిస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురౌతూ, ఒంటరితనం అనుభవిస్తున్నట్లు నాకనిపిస్తోంది” అని ఓ భార్య వాపోయింది.

పరస్పరం ప్రేమించుకుందాం, విలువైనవారిగా పరిగణించుకుందాం అని ఒకప్పుడు ప్రమాణంచేసుకున్న ఆ ఇద్దరు వేరుపడడానికి కారణమేమిటి? ఒక కారణమేమంటే, వివాహ బాధ్యతలను గురించిన జ్ఞానం వారికి లేకపోవడమే. “మనం ఏ విధమైన తర్ఫీదు లేకుండానే వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నాము” అని ఒక వైద్య విలేఖరి అన్నాడు.

అమెరికాలో, న్యూజెర్సీలోని రట్‌గెర్స్‌ విశ్వవిద్యాలయ పరిశోధనా విభాగపు, జాతీయ వివాహ పథకం నిర్వహించిన అధ్యయనం వివాహానికి సంబంధించిన అలాంటి జ్ఞానం నేడు చాలా కొద్దిమందికి మాత్రమే ఉందనే విషయాన్ని బలపరచింది. “ఈ అధ్యయనంలో విచారింపబడిన వారిలో చాలామంది వైవాహిక జీవితంలో సంతోషంలేని లేదా విడాకులు తీసుకున్న తలిదండ్రుల పెంపకంలో పెరిగినవారే. వారికి చెడ్డ వివాహమంటే ఏమిటో బాగా తెలుసుగాని మంచి వివాహమెలా ఉంటుందో వారికంతగా తెలియదు. కొందరు ‘మా తలిదండ్రుల వైవాహిక జీవితానికి వ్యతిరేకంగా ఉన్నదే’ మంచి వివాహమని మాత్రమే వర్ణించగలిగారు” అని ఆ పథక సంచాలకులు వ్రాశారు.

క్రైస్తవులు వైవాహిక సమస్యలకు అతీతులా? కానేకాదు. వాస్తవానికి, మొదటి శతాబ్దంలో తమ వివాహాన్నుండి “విడుదల కోరవద్దు” అని కొంతమంది క్రైస్తవులకు సూటిగా ఉపదేశించాల్సి వచ్చింది. (1 కొరింథీయులు 7:​27) ఇద్దరు అపరిపూర్ణ మానవుల మధ్య జరిగిన ఏ వివాహంలోనైనా సమస్యలు తప్పవు, అయితే మనకు సహాయం ఉంది. బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా భార్యాభర్తలు తమ బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు.

నిజమే, బైబిలు కేవలం వివాహ సూచికకాదు. అయితే అది వివాహ ఏర్పాటునే ఆరంభించిన దేవునిచే ప్రేరేపించబడింది కాబట్టి, దానిలోని సూత్రాలు సహాయకరంగా ఉంటాయని మనం ఆశించవచ్చు. యెషయా ప్రవక్త ద్వారా, యెహోవా దేవుడు ఇలా చెప్పాడు: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను! ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.”​—⁠యెషయా 48:17, 18.

మీకు మీ భాగస్వామికి ఒకప్పుడున్న ప్రేమ తగ్గిపోవడం ఆరంభమైందా? ప్రేమలేని వివాహంలో చిక్కుకున్నట్లు మీరు భావిస్తున్నారా? 26 సంవత్సరాలుగా భార్యగావున్న ఒకావిడ ఇలా అంది: “ఇలాంటి బంధంలో పడే బాధ వర్ణనాతీతం. అదెప్పుడూ ఉంటుంది, దానిలో మార్పుండదు.” అసంతృప్తికరమైన వివాహంలో ఇక ఏమీచేయలేమని నిరుత్సాహంగా ఊరుకునే బదులు ఏదైనా చేయడానికి ఎందుకు తీర్మానించుకోకూడదు? తమ వివాహంలో భార్యాభర్తలకు బైబిలు సూత్రాలు ఒక ప్రత్యేక రంగంలో అంటే నిబద్ధత విషయంలో ఎలా సహాయం చేయగలవో తర్వాతి ఆర్టికల్‌ చూపిస్తుంది.