కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ వివాహాన్ని ఎలా బలపరచుకోవచ్చు

మీ వివాహాన్ని ఎలా బలపరచుకోవచ్చు

మీ వివాహాన్ని ఎలా బలపరచుకోవచ్చు

జీర్ణావస్థకు చేరిన ఓ ఇంటిని ఊహించుకోండి. సున్నం రాలిపోతూవుంది, పైకప్పు పాడైపోయింది, ఆవరణంతా చెత్తాచెదారంతో నిండిపోయింది. అంటే ఆ ఇల్లు సంవత్సరాలుగా గాలివానలకు గురౌతూ నిర్లక్ష్యం చేయబడినట్లు స్పష్టమౌతోంది. అంతమాత్రాన దానిని కూలగొట్టాలా? అవసరంలేదు. పునాది గట్టిగావుండి, నిర్మాణం స్థిరంగావుంటే, బహుశా ఆ ఇంటిని తిరిగి బాగుచేయవచ్చు.

ఆ ఇంటి పరిస్థితి మీ వివాహాన్ని గుర్తుచేస్తోందా? ఒకవిధంగా చెప్పాలంటే, సంవత్సరాలుగా తీవ్రమైన గాలివానల్లాంటివి మీ వివాహబంధంపై తీవ్ర ప్రభావం చూపివుండవచ్చు. మీలో ఒకరు లేదా ఇద్దరూ కొంతమేరకు మీ వివాహాన్ని నిర్లక్ష్యం చేసివుండవచ్చు. సాండీలాగే మీరూ భావించవచ్చు. 15 సంవత్సరాల వైవాహిక జీవితం గడిపిన తర్వాత, ఆమె ఇలా అంది: “ఇద్దరం కలిసి పెళ్లిచేసుకోవడం తప్ప మేము కలిసి అంగీకరించగల విషయం ఒక్కటికూడా లేదు. అయితే అది మాత్రమే సరిపోదు.”

మీ వివాహం ఈ స్థితికి చేరుకున్నా, త్వరపడి మీ వివాహబంధాన్ని తెంచుకోవాలనే నిర్ణయానికి రాకండి. మీ వివాహ పునరుద్ధరణ సాధ్యపడగలదు. అది మీకు మీ భాగస్వామికి మధ్యగల నిబద్ధతపై ఎక్కువగా ఆధారపడివుంటుంది. పరీక్షా సమయాల్లో నిబద్ధత వివాహ సుస్థిరతకు సహాయపడగలదు. కానీ నిబద్ధత అంటే ఏమిటి? దాన్ని బలపరచుకోవడానికి బైబిలు మీకు ఎలా సహాయం చేయగలదు?

నిబద్ధతలో బాధ్యతవుంది

నిబద్ధత, బాధ్యత కలిగివుండడాన్ని లేదా భావోద్వేగపరంగా ప్రేరేపించబడడాన్ని సూచిస్తుంది. కొన్నిసార్లు ఈ మాట వ్యాపార ఒప్పందంలాంటి మానసిక కట్టుబాటుకు అన్వయిస్తుంది. ఉదాహరణకు, ఒక ఇల్లు కట్టే ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత దానిలో ఒప్పుకున్న పనులన్నీ చేయడం తన బాధ్యతని నిర్మాణకుడు భావించవచ్చు. పని అప్పగించిన వ్యక్తి అతనికి వ్యక్తిగతంగా తెలిసి ఉండకపోవచ్చు. అయినప్పటికి, మాటకు కట్టుబడి ఉండాలనే బాధ్యత తనకుందని అతను భావిస్తాడు.

వివాహం భావావేశాలకు తావులేని వ్యాపార ఒప్పందంలాంటిది కాకపోయినా, దానిలోని నిబద్ధతలో బాధ్యతవుంది. మీరు మీ భాగస్వామి, ఏంజరిగినా కలిసివుంటామని దేవుని ఎదుట ఇతరుల ఎదుట గంభీరంగా ప్రమాణం చేసివుంటారు. యేసు ఇలా అన్నాడు: ‘[స్త్రీపురుషులను] సృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించాడు. ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పాడు.’ యేసు ఇంకా ఇలా అన్నాడు: “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు.” (మత్తయి 19:​4-6) కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు మీరు పరస్పరం ఏర్పరచుకున్న నిబద్ధతను గౌరవించడాన్ని మీరు మీ భాగస్వామి ధృడంగా తీర్మానించుకోవాలి. * ఒక భార్య ఇలా అంటోంది: “విడాకులు తప్ప వేరే గత్యంతరం లేదనే ఆలోచన మానిన మా తర్వాతే పరిస్థితి మెరుగుపడడం ఆరంభమైంది.”

అయితే వివాహ నిబద్ధతలో బాధ్యతకంటే మరెంతో ఉంది. దానిలో ఇంకా ఏమివుంది?

జట్టుగా కలిసి పనిచేయడం వివాహ నిబద్ధతను బలపరుస్తుంది

వివాహపు నిబద్ధత అంటే వివాహిత దంపతులు ఎన్నటికీ పరస్పరం విభేదించుకోరని అర్థంకాదు. ఏదైనా తగవు వచ్చినప్పుడు ప్రమాణ బాధ్యతవుందని మాత్రమే కాదుగాని వారిమధ్యగల భావావేశ బంధాన్నిబట్టి దానిని పరిష్కరించుకోవాలనే మనఃపూర్వక కోరిక వారికి ఉండాలి. భార్యాభర్తలను గురించి యేసు ఇలా అన్నాడు: “వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు.”

మీ భాగస్వామితో “ఏకశరీరముగా” ఉండడమంటే అర్థమేమిటి? ‘పురుషులు తమ సొంత శరీరములవలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు’ అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (ఎఫెసీయులు 5:​28, 29) కాబట్టి, “ఏకశరీరముగా” ఉండడమంటే ఒక రకంగా మీ సొంత సంక్షేమం గురించి మీరెలా చింత కలిగివుంటారో అలాగే మీ భాగస్వామి సంక్షేమం గురించి కూడా భావించాలని దాని భావం. వివాహితులు వారి ఆలోచనా విధానం మార్చుకోవాలి; విడివిడిగా తమ సొంత పరిధినుండే ఆలోచించే బదులు వారు దంపతులుగా విషయాలను కలిసి ఆలోచించాలి. సలహాదారు ఒకావిడ ఇలా వ్రాసింది: “దంపతులు ఎవరికివారే అనే ఆలోచన మానుకుని, వివాహితులుగా ఏక హృదయంతో ఆలోచించడం, భావించడం ఆరంభించాలి.”

మీరు మీ వివాహిత భాగస్వామి “ఏక హృదయంతో ఆలోచించడం, భావించడం” చేస్తున్నారా? కలిసి అనేక సంవత్సరాలు కాపురం చేసినా ఆ భావంలో ఇంకనూ “ఏకశరీరముగా” ఉండకుండా ఉండే అవకాశముంది. అవును, అలా జరుగగలదు, అయితే గివింగ్‌ టైమ్‌ ఎ ఛాన్స్‌ అనే పుస్తకం ఇలా చెబుతోంది: “వివాహమంటే జీవితం పంచుకోవడమని అర్థం, ఆ ఇద్దరు ఎంత ఎక్కువగా భాగం పంచుకుంటే అంత ఎక్కువగా వారి వైవాహిక జీవితం వికసిస్తుంది.”

సంతోషంలేని దంపతులు కొందరు తమ పిల్లలకోసం లేదా ఆర్థిక భద్రతకోసం కలిసి కాపురం చేస్తుంటారు. మరితరులు విడాకుల విషయంలో బలమైన నైతిక అభ్యంతరాలున్నందునో లేదా తాము విడిపోతే ఇతరులు ఏమనుకుంటారోననే భయంతోనో సహిస్తుంటారు. ఈ వివాహాలు నిలిచివుండడం మెచ్చుకోదగిన విషయమైనా, ఏదో ఉందంటే ఉన్నదన్నట్టు కాక ప్రేమపూర్వక సంబంధం కలిగివుండాలన్నదే మీ లక్ష్యంగా ఉండాలని గుర్తుంచుకోండి.

నిస్వార్థ క్రియలు వివాహ నిబద్ధతను ప్రోత్సహిస్తాయి

“అంత్యదినములలో” ప్రజలు ‘స్వార్థప్రియులుగా’ ఉంటారని బైబిలు ముందుగానే చెప్పింది. (2 తిమోతి 3:​1, 2) ఆ ప్రవచనం చెప్పినట్లుగానే, నేడు స్వీయపూజకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతున్నట్టుగా ఉంది. అనేక వివాహాల్లో తిరిగి ప్రత్యుపకారం లభిస్తుందనే ఆశలేకుండా ఒకరే ఉపకరిస్తూ పోవడం బలహీనతకు సూచనగా దృష్టింపబడుతోంది. అయితే ఆరోగ్యకరమైన వివాహంలో, దంపతులిద్దరు స్వయం-త్యాగ స్ఫూర్తిని ప్రదర్శిస్తారు. మీరు ఆ స్ఫూర్తిని ఎలా ప్రదర్శించగలరు?

‘ఈ సంబంధం వలన నాకు ప్రయోజనమేమిటి?’ అనే ప్రశ్ననే పట్టుకు వ్రేలాడడం విడిచిపెట్టి, ‘నా వివాహాన్ని బలపరచుకోవడానికి వ్యక్తిగతంగా నేనేమి చేస్తున్నాను’ అని ప్రశ్నించుకోండి. క్రైస్తవుల్లో, “ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను” అని బైబిలు చెబుతోంది. (ఫిలిప్పీయులు 2:⁠4) ఈ బైబిలు సూత్రాన్ని ధ్యానిస్తూ, గతవారంలో మీరు చేసిన పనులు విశ్లేషించుకోండి. కేవలం మీ భాగస్వామి ప్రయోజనార్థం ఓ దయగల పని మీరెంత తరచుగా చేశారు? మీ భాగస్వామి మీతో మాట్లాడాలనుకున్నప్పుడు, మీకు ప్రత్యేకంగా వినాలన్న కోరిక లేకపోయినా మీరు విన్నారా? వ్యక్తిగతంగా మీ కంటే మీ జతకే ఎక్కువ ఇష్టమైన పనులు మీరెన్ని చేశారు?

అలాంటి ప్రశ్నలు తరచిచూసుకునేటప్పుడు, మీ సత్క్రియలు దృష్టికిరావని లేదా నిష్ఫలమవుతాయని ఆందోళన పడకండి. “అధికశాతం సంబంధాల్లో ప్రయోజనార్థ ప్రవర్తనకు తగిన ప్రత్యుపకారం ఉంటుంది, కాబట్టి మీరు మరింత ప్రయోజనకరంగా ప్రవర్తిస్తూ మీ జత ప్రయోజనకరంగా ప్రవర్తించేలా మీ శాయశక్తులా ప్రోత్సహించండి” అని ఒక రెఫరెన్సు గ్రంథం చెబుతోంది. స్వయం-త్యాగ క్రియలు మీ వివాహాన్ని బలపరుస్తాయి, ఎందుకంటే మీరు మీ వివాహాన్ని విలువైనదిగా ఎంచుతున్నారనీ దాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నారనీ అవి చూపిస్తాయి.

శాశ్వతకాల దృష్టి అవశ్యం

యెహోవా దేవుడు యథార్థతను విలువైనదిగా పరిగణిస్తాడు. నిజానికి బైబిలు ఇలా చెబుతోంది: “యథార్థవంతులయెడల నీవు [యెహోవా] యథార్థవంతుడవుగా నుందువు.” (2 సమూయేలు 22:​26) దేవునియెడల యథార్థంగా ఉండడానికి ఆయన నెలకొల్పిన వివాహ ఏర్పాటుయెడల యథార్థంగా నిలిచివుండడం అవసరం.​—⁠ఆదికాండము 2:24.

మీరు మీ భాగస్వామి పరస్పరం యథార్థంగావుంటే మీ కాపురం శాశ్వతమనే భావానందం మీకుంటుంది. రాబోయే నెలలు, సంవత్సరాలు, దశాబ్దాల గురించి మీరు ఆలోచించినప్పుడు, మీరు కలిసివున్న చిత్రమే మీ మదిలో మెదులుతుంది. పరస్పర వివాహితులు కాదనే తలంపే ఉండదు, కాగా ఈ దృక్పథం మీ బాంధవ్యానికి భద్రతనిస్తుంది. ఒక భార్య ఇలా అంటోంది: “[నా భర్తమీద] నాకు విపరీతంగా కోపమొచ్చినా, జరుగుతున్న దానినిబట్టి నాకు తీవ్ర నిరుత్సాహం కలిగినా, మా వివాహ బంధం ముగిసిపోతుందని నేను కలతచెందడం లేదు. మళ్ళీ మేము మునుపటిలా ఎలా కలిసివుండగలమా అనే దాని గురించే నేను చింతిస్తున్నాను. ప్రస్తుతం ఎలాగో తెలియకపోయినా, పరిస్థితులు సర్దుకుంటాయని నాకు నిశ్చయంగా తెలుసు.”

భాగస్వామితో చేసిన నిబద్ధత విషయంలో దీర్ఘకాల దృక్కోణం ఉండడం అవశ్యం, కాని విషాదకరంగా అనేక వివాహాల్లో ఇది లోపిస్తూవుంది. తీవ్ర వాగ్వివాదంలో జతలో ఒకరు కోపంతో, “నీతో నేను కాపురం చేయలేను!” లేదా “నన్ను నిజంగా ఇష్టపడే మరెవరినో చూసుకుంటాను!” అని అరవచ్చు. నిజానికి అలాంటి అనేకమైన మాటలు అసలు ఉద్దేశంతో అన్నవికాదు. అయినప్పటికీ, నాలుక “మరణకరమైన విషముతో నిండి” ఉండగలదని బైబిలు చెబుతోంది. (యాకోబు 3:⁠8) బెదిరింపులు, చివరి హెచ్చరికలు, ‘మన వివాహాన్ని నేను శాశ్వతమైనదిగా దృష్టించడం లేదు. నేనెప్పుడైనా విడిచిపెట్టగలను’ వంటి సందేశాలు పంపిస్తాయి. అలాంటి భావమిచ్చే మాటలు వివాహానికి విచ్ఛేదకరంగా పరిణమించగలవు.

మీకు దీర్ఘకాల దృక్కోణం ఉన్నప్పుడు, అన్నిరకాల ఒడుదొడుకుల్లోను మీరు మీ భాగస్వామితోనే ఉండాలని ఆశిస్తారు. ఇది అదనపు ప్రయోజనమిస్తుంది. మీరు మీ భాగస్వామి పరస్పర బలహీనతలను, తప్పులను అర్థంచేసుకుంటూ, పరస్పరం భరించడాన్ని, ధారాళంగా క్షమించుకోవడాన్ని సులభం చేస్తుంది. (కొలొస్సయులు 3:​13) “మంచి వివాహంలో ఇద్దరు విఫలం కాగల అవకాశముంది, అయినా వివాహాన్ని కాపాడుకోవడం కూడా సాధ్యమే” అని ఒక చేతిపుస్తకం చెబుతోంది.

మీ పెళ్లి రోజున, మీరు వివాహ వ్యవస్థతో కాదుగాని ఒక సజీవమైన వ్యక్తితో అంటే మీ భాగస్వామితో ఒక నిబద్ధత చేసుకున్నారు. ఇప్పుడొక వివాహిత వ్యక్తిగా మీ తలంపులపై మీ చర్యలపై ఈ వాస్తవం బలమైన ప్రభావం చూపాలి. మీ భాగస్వామితో కాపురం చేయడానికి వివాహపు పవిత్రతను మీరు బలంగా నమ్మడమే కాదు, వివాహమాడిన వ్యక్తిపై మీకున్న ప్రేమనుబట్టి కూడా మీరు కలిసుండాలనే విషయాన్ని మీరంగీకరించరా?

[అధస్సూచి]

^ పేరా 7 విపరీత పరిస్థితుల్లో వివాహిత జంట వేరుగా ఉండడానికి విలువైన కారణం ఉండవచ్చు. (1 కొరింథీయులు 7:​10, 11; యెహోవాసాక్షులు ప్రచురించిన, కుటుంబ సంతోషానికిగల రహస్యము 160-1 పేజీలు చూడండి.) అలాగే, వ్యభిచారం (లైంగిక దుర్నీతి) ఆధారంగానే విడాకులను బైబిలు అనుమతిస్తోంది.​—⁠మత్తయి 19:⁠9.

[5వ పేజీలోని బాక్సు/చిత్రం]

మీరిప్పుడు ఏమి చేయవచ్చు

మీ వైవాహిక బంధాన్ని బలపరచుకోవాలన్న మీ నిశ్చయత ఎంత బలంగా ఉంది? బహుశా మెరుగుపరచుకోవడానికి అవకాశమున్నట్లు మీరు చూస్తారు. మీ నిబద్ధతను బలపరచుకోవడానికి ఈ క్రింద ఇవ్వబడిన వాటిని ప్రయత్నించండి:

● స్వయం పరీక్ష చేసుకోండి. మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘నేను నిండు హృదయంతో పెళ్ళి చేసుకున్నానా, లేక నేనింకా ఒంటరి వ్యక్తినన్నట్టే ఆలోచిస్తూ ప్రవర్తిస్తున్నానా?’ ఈ విషయంలో మీ గురించి మీ భాగస్వామి ఎలా భావిస్తున్నారో తెలుసుకోండి.

● మీ భాగస్వామితో కలిసి ఈ ఆర్టికల్‌ చదవండి. ఆ పిమ్మట ప్రశాంత వాతావరణంలో మీ వివాహ నిబద్ధతను బలపరచుకోగల మార్గాలను గురించి చర్చించుకోండి.

● మీ భాగస్వామితో కలిసి మీ నిబద్ధతను బలపరచగల కార్యక్రమాలు చేపట్టండి. ఉదాహరణకు, మీ పెళ్ళిఫొటోలు, మరచిపోలేని మరి ఇతర సంఘటనల ఫొటోలు చూడండి. కోర్టుషిప్‌ సమయంలో లేదా మీ వివాహపు తొలి సంవత్సరాల్లో ఆనందంగా కలిసిచేసిన పనులు చేయండి. కావలికోట, తేజరిల్లు! పత్రికల నుండి వివాహానికి సంబంధించిన బైబిలు ఆధారిత ఆర్టికల్స్‌ కలిసి చదవండి.

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

వివాహ నిబద్ధతలో ఇవి ఉన్నాయి . . .

బాధ్యత “నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొన కుండుటయే మేలు.”​—⁠ప్రసంగి 5:4, 5.

ఒక జట్టుగా కలిసి పనిచేయడం “ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును.”​—⁠ప్రసంగి 4:9, 10.

స్వయం-త్యాగం “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.”​—⁠అపొస్తలుల కార్యములు 20:35.

దీర్ఘకాల దృక్కోణం “ప్రేమ . . . అన్నిటిని ఓర్చును.”​—⁠1 కొరింథీయులు 13:4, 7.

[7వ పేజీలోని చిత్రం]

మీ భాగస్వామి మీతో మాట్లాడాలనుకున్నప్పుడు మీరు వింటారా?