కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రమశిక్షణ ఉద్దేశాన్ని గ్రహించడం

క్రమశిక్షణ ఉద్దేశాన్ని గ్రహించడం

క్రమశిక్షణ ఉద్దేశాన్ని గ్రహించడం

“క్రమశిక్షణ” అన్న పదం వినగానే మీ మనసులో ఏమి మెదులుతుంది? క్రమశిక్షణ అంటే “ప్రవర్తనకు సంబంధించిన నియమాలను లేక సూత్రాలను పాటించేందుకు ప్రజలను అభ్యసింపజేయడం, పాటించకపోతే వారిని శిక్షించడం” అని ఒక నిఘంటువు నిర్వచిస్తోంది. సాధారణంగా నమ్మే నిర్వచనం ఇదొక్కటే కాకపోయినా, క్రమశిక్షణకు నేడు చాలామంది ఇలాంటి ప్రతికూల భావాలే ఆపాదిస్తారు.

కానీ బైబిలు, క్రమశిక్షణను మరోవిధంగా చూపిస్తోంది. “నా కుమారుడా, యెహోవా శిక్షను [“క్రమశిక్షణను,” NW] తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు” అని జ్ఞానియైన సొలొమోను రాజు వ్రాశాడు. (సామెతలు 3:​11) ఈ మాటలు సాధారణ క్రమశిక్షణను సూచించడం లేదు, “యెహోవా క్రమశిక్షణను,” అంటే దేవుని ఉన్నత సూత్రాల ఆధారంగా ఇవ్వబడే క్రమశిక్షణను సూచిస్తున్నాయి. అలాంటి క్రమశిక్షణ మాత్రమే ఆధ్యాత్మికంగా ఫలవంతమైనది, ప్రయోజనకరమైనది, అది అభిలషణీయమైనది కూడా. దానికి భిన్నంగా, యెహోవా ఉన్నత సూత్రాలకు విరుద్ధమైన మానవుల ఆలోచనల ఆధారిత క్రమశిక్షణ తరచూ దుర్వినియోగమైనదిగా, హానికరమైనదిగా ఉంటుంది. అది క్రమశిక్షణ పట్ల చాలామందికి ప్రతికూల భావాలుండడానికిగల కారణాన్ని స్పష్టంగా వివరిస్తోంది.

యెహోవా క్రమశిక్షణను అంగీకరించమని మనకెందుకు ఉద్బోధించబడింది? దైవిక క్రమశిక్షణ అంటే, మానవ ప్రాణుల పట్ల వ్యక్తం చేయబడే దేవుని ప్రేమ అని లేఖనాల్లో వర్ణించబడింది. అందుకే సొలొమోను ఇంకా ఇలా అంటున్నాడు: “తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.”​—⁠సామెతలు 3:​12.

క్రమశిక్షణా లేక శిక్షా​—⁠ఏది?

బైబిలులో వ్యక్తం చేయబడినట్లుగా క్రమశిక్షణకు మార్గదర్శకం, ఆదేశం, శిక్షణ, గద్దింపు, సరిదిద్దడం వంటి భావాలతో పాటు శిక్ష అనే భావం కూడా ఉంది. అయితే ప్రతి సందర్భంలో యెహోవా క్రమశిక్షణ ప్రేమతో పురికొల్పబడుతుంది, దాన్ని పొందేవారికి ప్రయోజనం చేకూర్చడమే దాని లక్ష్యం. యెహోవా సరిదిద్దడానికి ఇచ్చే క్రమశిక్షణ కేవలం శిక్షించే ఉద్దేశంతో ఎన్నడూ ఇవ్వలేదు.

మరోవైపు, దేవుడు ఒకవ్యక్తిని శిక్షించడానికి తీసుకునే చర్యల లక్ష్యం, ఎల్లప్పుడూ ఆ వ్యక్తిని సరిదిద్దడం లేక అతనికి నేర్పించడం కాదు. ఉదాహరణకు ఆదాము, హవ్వలు పాపం చేసిన ఆ రోజు నుండే తమ అవిధేయతా పరిణామాలను అనుభవించడం ప్రారంభించారు. యెహోవా వారిని పరదైసుగావున్న ఏదెను తోటలోనుండి వెళ్ళగొట్టాడు, వారు అపరిపూర్ణత ప్రభావాలకు, అనారోగ్యానికి, వృద్ధాప్యానికి లోనయ్యారు. వందల సంవత్సరాల బాధాకరమైన జీవితం తర్వాత, వారు శాశ్వతంగా నశించిపోయారు. అది నిజంగా దేవుని శిక్ష, అంతేకానీ సరిదిద్దే క్రమశిక్షణ కాదు. బుద్ధిపూర్వకంగా అవిధేయులై పశ్చాత్తాపం చూపని ఆదాము, హవ్వలు సరిదిద్దడానికి వీలులేని వారయ్యారు.

యెహోవా శిక్ష విధించిన ఇతర వృత్తాంతాల్లో నోవహు కాలంలోని జలప్రళయం, సొదొమ గొమొఱ్ఱాల నాశనం, ఎఱ్ఱసముద్రంలో ఐగుప్తు సైన్యం నాశనం ఉన్నాయి. యెహోవా తీసుకున్న ఈ చర్యలు వాటికి గురైన వారికి మార్గదర్శకమో, ఆదేశమో, లేదా శిక్షణో ఇవ్వడానికి ఉద్దేశించినవి కావు. శిక్షించడానికి దేవుడు తీసుకున్నటువంటి ఆ చర్యల గురించి అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధిం[చాడు.]”​—⁠2 పేతురు 2:⁠5, 6.

అలా శిక్షించడానికి తీసుకోబడిన చర్యలు ఏ భావంలో ‘భక్తిహీనులగువారికి దృష్టాంతముగా ఉన్నాయి’? పౌలు థెస్సలొనీయులకు వ్రాసిన ఉత్తరంలో, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా “దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన” చేసే సమయంగా మన కాలాన్ని సూచించాడు. పౌలు ఇంకా ఇలా అన్నాడు: “అట్టివారు . . . నిత్యనాశనమను దండన పొందుదురు.” (2 థెస్సలొనీకయులు 1:​6-9) ఖచ్చితంగా అలాంటి దండనకు లేక శిక్షకు గురయ్యేవారికి నేర్పించడానికో లేక వారిని సంస్కరించడానికో ఆ శిక్ష రూపొందించబడలేదు. అయితే యెహోవా తన క్రమశిక్షణను అంగీకరించమని తన ఆరాధకులను ఆహ్వానిస్తున్నప్పుడు, ఆయన పశ్చాత్తాపం చూపించని పాపులకు విధించే శిక్షను సూచించడంలేదు.

బైబిలు యెహోవాను శిక్షించేవాడిగానే ప్రధానంగా వర్ణించకపోవడం గమనార్హం. బదులుగా ఆయన చాలా తరచుగా ప్రేమగల బోధకుడిగా, ఓపికతో శిక్షణ ఇచ్చేవాడిగా వర్ణించబడ్డాడు. (యోబు 36:​22; కీర్తన 71:​17; యెషయా 54:​13) అవును దేవుడిచ్చే క్రమశిక్షణ, సరిదిద్దే ఉద్దేశంతో ఇవ్వబడినప్పుడు దానితోపాటు ప్రేమ, ఓపికలు ఎల్లప్పుడూ వెన్నంటే ఉన్నాయి. క్రమశిక్షణ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, క్రైస్తవులు క్రమశిక్షణను స్వీకరించడంలోను, అమలుచేయడంలోను సరైన దృక్పథంతో సానుకూలంగా ఉంటారు.

ప్రేమగల తల్లిదండ్రుల క్రమశిక్షణ

కుటుంబంలోను, క్రైస్తవ సంఘంలోను క్రమశిక్షణ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవలసిన అవసరం అందరికీ ఉంది. ఇది ముఖ్యంగా, అధికార స్థానంలో ఉన్న తల్లిదండ్రులకు వర్తిస్తుంది. సామెతలు 13:​24 ఇలా చెబుతోంది: “బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును [“వానికి క్రమశిక్షణ ఇచ్చును,” NW].”

తల్లిదండ్రులు క్రమశిక్షణ ఎలా ఇవ్వాలి? బైబిలిలా వివరిస్తోంది: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:⁠4) ఈ హెచ్చరిక మళ్ళీ ఈ విధంగా పునరుక్తం చేయబడింది: “తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.”​—⁠కొలొస్సయులు 3:​21.

క్రమశిక్షణ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు కఠినంగా ప్రవర్తించరు. 2 తిమోతి 2:​24-26 వచనాల్లోని సూత్రాన్ని, తల్లిదండ్రులు ఇచ్చే క్రమశిక్షణా విధానానికి వర్తింపజేయవచ్చు. అక్కడ పౌలు ఇలా వ్రాశాడు: “ప్రభువుయొక్క దాసుడు . . . జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను . . . ఉండవలెను.” కోపోద్రేకంతో రెచ్చిపోవడం, అరవడం, అవమానించేలా లేక కించపరిచేలా మాట్లాడడం వంటివి ఎంతమాత్రం ప్రేమపూర్వక క్రమశిక్షణకు తగవు, ఒక క్రైస్తవుని జీవితంలో వాటికి తావులేదు.​—⁠ఎఫెసీయులు 4:​31; కొలొస్సయులు 3:⁠8.

తల్లిదండ్రులు సరిదిద్దడం అంటే వెంటనే, నిర్ణయాత్మకమైన శిక్ష విధించడం అని కాదు. చాలామంది పిల్లలను వారు తమ ఆలోచన సరిదిద్దుకోవడానికి ముందు పలుమార్లు మందలించాల్సివుంటుంది. కాబట్టి తల్లిదండ్రులు సమయం గడపాలి, ఓపిక వహించాలి, అలాగే క్రమశిక్షణ ఎలా ఇవ్వాలనే విషయం బాగా ఆలోచించాలి. వారు తమ పిల్లలను ‘ప్రభువు యొక్క క్రమశిక్షణలోను బోధలోను పెంచాలి’ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే సంవత్సరాలపాటుసాగే ఓ శిక్షణా విధానమని దానర్థం.

క్రైస్తవ కాపరులు సాత్వికముతో క్రమశిక్షణ ఇస్తారు

ఇవే సూత్రాలు క్రైస్తవ పెద్దలకు కూడా వర్తిస్తాయి. ప్రేమగల కాపరులుగా వారు అవసరమైనప్పుడు బోధిస్తూ, మార్గదర్శకమిస్తూ, మందలిస్తూ మందను బలపరచడానికి కృషిచేస్తారు. అలా చేసేటప్పుడు వారు క్రమశిక్షణకున్న అసలైన ఉద్దేశాన్ని గుర్తుంచుకుంటారు. (ఎఫెసీయులు 4:​11, 12) ఒకవేళ వారు శిక్ష విధించడంపైనే దృష్టి కేంద్రీకరిస్తే, తప్పు చేసినవారిని దండించడం తప్ప మరేమీ చేయలేరు. దైవిక క్రమశిక్షణలో అంతకంటే ఎక్కువే ఉంది. ప్రేమతో పురికొల్పబడిన పెద్దలు ఒకసారి సలహా ఇచ్చి ఇకచాలని ఊరుకోరు. ఎందుకంటే వారికి యథార్థమైన శ్రద్ధవుంది, వారు ప్రోత్సహించేందుకు, శిక్షణ ఇచ్చేలా పలుమార్లు కలిసిమాట్లాడేందుకు తరచూ సమయపట్టికను సిద్ధం చేసుకుంటారు.

2 తిమోతి 2:​25, 26 వచనాల్లోని హెచ్చరిక ప్రకారం, క్రమశిక్షణను వెంటనే స్వీకరించనివారితో వ్యవహరించేటప్పుడు కూడా, పెద్దలు “సాత్వికముతో” సలహా ఇవ్వాలి. ఆ లేఖనం క్రమశిక్షణ ఉద్దేశాన్ని ఇంకా ఇలా చెబుతోంది: “సత్యవిషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై, దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును.”

కొన్నిసార్లు, పశ్చాత్తాపం చూపించని తప్పిదస్థులను సంఘంలోనుండి బహిష్కరించాల్సిన అవసరం ఏర్పడుతుంది. (1 తిమోతి 1:​18-20) అలాంటి తీవ్రమైన చర్యను సైతం క్రమశిక్షణగా పరిగణించాలి, కేవలం శిక్షగా కాదు. బహిష్కరించబడిన ఆయా వ్యక్తులు గతంలో చేసిన తప్పిదమును పూర్తిగా మానుకుంటే వారిని అప్పుడప్పుడు సందర్శించడానికి పెద్దలు కృషిచేస్తారు. అలాంటి సందర్శనాల్లో, తిరిగి క్రైస్తవ సంఘంలోకి రావడానికి తీసుకోవలసిన చర్యలను వారికి తెలియజేయడం ద్వారా పెద్దలు క్రమశిక్షణ యొక్క నిజమైన ఉద్దేశానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు.

యెహోవా పరిపూర్ణ న్యాయాధిపతి

తల్లిదండ్రులు, క్రైస్తవ కాపరులతోపాటు క్రమశిక్షణనిచ్చేందుకు లేఖనాధార అధికారమున్న ఇతరులు ఈ బాధ్యతను గంభీరంగా తీసుకోవాలి. ఇతరుల విషయంలో సరిదిద్దడానికి వీలుకానంతగా చెడిపోయారనే నిర్ణయానికి వారు రాకూడదు. కాబట్టి వారిచ్చే క్రమశిక్షణ ప్రతీకారంతో లేక వైరభావంతో కూడిన శిక్షగా ఎన్నడూ ఉండకూడదు.

తీవ్రమైన, అంతిమ శిక్ష విధించేది యెహోవాయేనని బైబిలు సూచిస్తున్నమాట నిజమే. వాస్తవానికి, “జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరము” అని లేఖనాలు చెబుతున్నాయి. (హెబ్రీయులు 10:​31) కానీ ఏ మానవుడు కూడా ఈ విషయంలోగానీ మరే విషయంలోగానీ తనను తాను యెహోవాతో పోల్చుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించకూడదు. అలాగే తల్లి/తండ్రి లేక ఒక పెద్ద చేతుల్లో పడడం అంటే అదొక భయానకమైన విషయంగా భావించే కారణం ఎవరికీ ఉండకూడదు.

క్రమశిక్షణ ఇచ్చేటప్పుడు ఖచ్చితమైన సమన్వయం పాటించే సామర్థ్యం యెహోవాకు ఉంది. మానవులకు లేదు. దేవుడు హృదయాన్ని చదవగలడు కాబట్టి ఒక వ్యక్తి సరిదిద్దరానంతగా చెడిపోతే, దాన్ని బట్టి ఆ వ్యక్తి నిర్ణయాత్మకమైన అంతిమ శిక్ష పొందాలన్నది ఆయనే నిర్ణయిస్తాడు. దానికి భిన్నంగా మానవులు అలాంటి తీర్పు తీర్చడానికి సమర్థులు కారు. ఆ కారణాన్ని బట్టి, అధికార స్థానంలో ఉన్నవారు క్రమశిక్షణ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఎల్లప్పుడూ సరిదిద్దే ఉద్దేశంతోనే ఇవ్వాలి.

యెహోవా ఇచ్చే క్రమశిక్షణను అంగీకరించడం

మనందరికీ యెహోవా క్రమశిక్షణ అవసరం. (సామెతలు 8:​33) వాస్తవానికి మనం దేవుని వాక్యాధారమైన క్రమశిక్షణను గాఢంగా కోరుకోవాలి. మనం ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు, లేఖనాల ద్వారా నేరుగా యెహోవా నుండి వచ్చే క్రమశిక్షణను స్వీకరించవచ్చు. (2 తిమోతి 3:​16, 17) అయితే అప్పుడప్పుడు మనం మన తోటి క్రైస్తవుల నుండి కూడా క్రమశిక్షణను పొందుతాం. ఆ క్రమశిక్షణ వెనకున్న అసలు ఉద్దేశాన్ని గ్రహించడం, దాన్ని మనం ఇష్టపూర్వకంగా స్వీకరించడానికి సహాయపడుతుంది.

అపొస్తలుడైన పౌలు, “ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు” అని ఒప్పుకున్నాడు. ఆయనింకా ఇలా అన్నాడు: “అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.” (హెబ్రీయులు 12:​11) యెహోవా క్రమశిక్షణ ఆయనకు మన పట్ల ఉన్న గాఢమైన ప్రేమకు నిదర్శనం. క్రమశిక్షణను మనం అంగీకరించినా లేక ఇచ్చినా దైవిక క్రమశిక్షణ ఉద్దేశాన్ని మనసులో ఉంచుకొని, బైబిలులోని జ్ఞానయుక్తమైన ఈ సలహాను పాటిద్దాం: “ఉపదేశమును [“క్రమశిక్షణను,” NW] విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము”​—⁠సామెతలు 4:​13.

[21వ పేజీలోని చిత్రాలు]

పశ్చాత్తాపం చూపని పాపులు దేవుని న్యాయానుసార శిక్షను అనుభవిస్తారు, ఆయన సరిదిద్దే క్రమశిక్షణను కాదు

[22వ పేజీలోని చిత్రాలు]

ప్రేమతో పురికొల్పబడిన పెద్దలు పరిశోధించి, తప్పుచేసినవారికి సహాయం చేయడానికి సమయాన్ని వెచ్చిస్తారు

[23వ పేజీలోని చిత్రాలు]

తల్లిదండ్రులు ‘యెహోవా క్రమశిక్షణను బోధను’ సహనంతోను, ప్రేమపూర్వకంగాను ఇస్తారు