కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దీనులను యెహోవా సత్యంవైపు ఆకర్షిస్తాడు

దీనులను యెహోవా సత్యంవైపు ఆకర్షిస్తాడు

జీవిత కథ

దీనులను యెహోవా సత్యంవైపు ఆకర్షిస్తాడు

అసానో కోసీనో చెప్పినది

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన కొద్ది సంవత్సరాలకే అంటే 1949లో, పొడుగ్గా, స్నేహభావంగల ఒక విదేశీయుడు కోబ్‌ నగరంలో నేను పనిచేస్తున్న కుటుంబాన్ని సందర్శించాడు. ఆయన జపాన్‌కు వచ్చిన యెహోవాసాక్షుల మిషనరీల్లో మొదటి వ్యక్తి. ఆయన సందర్శనం, నేను బైబిలు సత్యానికి ఆకర్షితురాలినయ్యేందుకు మార్గం సుగమం చేసింది. అయితే మొదట మీకు నా గతాన్ని చెప్పనివ్వండి.

నేను 1926లో ఉత్తర ఓకయామా జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో జన్మించాను. ఎనిమిదిమంది పిల్లల్లో నేను ఐదవదాన్ని. మా నాన్న స్థానిక షింటో దేవాలయంలోని దేవతకు ప్రియ భక్తుడు. కాబట్టి సంవత్సరం పొడుగునా ఉత్సవాలు, మతసంబంధ పండుగల సమయంలో కుటుంబమంతా కలుసుకోవడం వంటివాటిని పిల్లలమైన మేము ఎంతో ఆనందించేవాళ్ళం.

నేను పెద్దదాన్నవుతుండగా జీవితం గురించి చాలా ప్రశ్నలు నాకుండేవి, మరణం గురించి నేను చాలా కలతచెందేదాన్ని. ఇంట్లో ఎవరైనా చనిపోతే సాంప్రదాయం ప్రకారం ఆ కుటుంబంలోని పిల్లలు మరణశయ్య దగ్గరేవుండాలి. మా నాన్నమ్మ చనిపోయినప్పుడు, ఏడాది నిండని మా తమ్ముడు చనిపోయినప్పుడు నేను చాలా దుఃఖించాను. మా తలిదండ్రుల మరణం తలచుకోవడానికే నాకు చాలా భయంగా ఉండేది. ‘జీవితం అంటే ఇంతేనా? జీవితం ఇంకా అర్థవంతంగా ఉండగలదా?’ అనే విషయాలు తెలుసుకోవాలని నాకు ఆతురతగా ఉండేది.

ప్రాథమిక పాఠశాలలో నేను ఆరవ తరగతి చదువుకుంటున్నప్పుడు అంటే 1937లో, చైనా జపానుల మధ్య యుద్ధం ఆరంభమైంది. పురుషులను సైన్యంలో చేర్చుకొని చైనాలో యుద్ధరంగానికి పంపారు. పాఠశాలోని పిల్లలు చక్రవర్తికి “బాంజాయ్‌!” (జిందాబాద్‌) అని అరుస్తూ తమ తండ్రులను, సహోదరులను సాగనంపారు. దైవపాలిత దేశమైన జపాన్‌, దాని సజీవ దేవుడైన చక్రవర్తి విజయం సాధిస్తారని ప్రజలు గట్టిగా నమ్మారు.

త్వరలోనే ఆయా కుటుంబాలు, యుద్ధరంగాన్నుండి మరణ వార్తలు అందుకోవడం ఆరంభించాయి. మృతుల కుటుంబాలను ఓదార్చడం గగనమైపోయింది. వారిలో ద్వేషం కట్టలుతెంచుకుంది, శత్రువులు ఎక్కువగా క్షతగాత్రులైనప్పుడు వారు ఆనందించారు. అదే సమయంలో ‘మన ప్రియమైనవారు చనిపోయినప్పుడు మనమెంత బాధపడతామో శత్రు పక్షంవైపు ప్రజల ప్రియమైనవారు చనిపోయినప్పుడు వారు కూడా అంతే బాధపడతారు’ అని నేనాలోచించాను. నేను నా ప్రాథమిక పాఠశాల చదువు ముగించుకొనే సమయానికల్లా, యుద్ధం చైనాలోని చాలా ప్రాంతాలకు విస్తరించింది.

అనుకోకుండా ఒక విదేశీయురాలిని కలవడం

రైతులుగా మాది పేద కుటుంబం, అయినప్పటికీ డబ్బు అవసరం రానంతవరకు నేను చదువుకోవడానికి నాన్నగారు అనుమతించారు. ఆ విధంగా 1941లో 100 కిలోమీటర్ల దూరంలోవున్న ఓకయామా నగరంలో నేను బాలికల పాఠశాలలో చేరాను. బాలికలు సమర్థవంతమైన భార్యలుగా, తల్లులుగా తయారయ్యేలా వారికి విద్య నేర్పించడం ఆ పాఠశాల ఉద్దేశం, అందుకే విద్యార్థులను నగరంలో సంపన్నుల కుటుంబాల్లో హౌస్‌కీపింగ్‌ అప్రెంటీస్‌లుగా నియమించేది. విద్యార్థులు ఉదయంపూట ఆ ఇళ్లలో పనిచేయడం నేర్చుకుని, మధ్యాహ్నంపూట వారు పాఠశాలకు వెళ్లేవారు.

క్రొత్త పిల్లల్ని ఆహ్వానించే ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత, కిమొనో దుస్తులు ధరించుకొని మా టీచరు నన్ను ఓ పెద్ద ఇంటికి తీసుకెళ్లింది. కారణమేమోగాని ఆ ఇంటావిడ నన్ను అంగీకరించలేదు. “అయితే మనం శ్రీమతి కోడా వాళ్ళ ఇంటికి వెళదామా?” అని ఆ టీచర్‌ నన్ను అడిగింది. ఆమె నన్ను ఓ పాశ్చాత్త్య నమూనాలోవున్న ఇంటికి తీసుకెళ్లి డోర్‌బెల్‌ నొక్కింది. కొద్దిసేపటికి, తెల్లగామెరిసే జుట్టుతో పొడవుగావున్న ఓ స్త్రీ బయటకు వచ్చింది. నేను చాలా ఆశ్చర్యపోయాను! ఆమె జపానీయురాలు కాదు, నా జీవితంలో నేనెన్నడూ ఓ పాశ్చాత్త వ్యక్తిని చూడలేదు. టీచరు నన్ను శ్రీమతి మోడ్‌ కోడాకు పరిచయంచేసి వెంటనే వెళ్లిపోయింది. నా బ్యాగులు ఈడ్చుకుంటూ నేను భయం భయంగా ఆ ఇంటిలోకి ప్రవేశించాను. శ్రీమతి మోడ్‌ కోడా అమెరికా దేశస్థురాలని, ఆమె అమెరికాలో చదువుకున్న ఓ జపానీయుణ్ణి వివాహం చేసుకుందని ఆ తర్వాత నాకు తెలిసింది. కామర్స్‌ పాఠశాలల్లో ఆమె ఇంగ్లీషు బోధించేది.

ఆ మరుసటి ఉదయంనుండే తీరికదొరకని జీవితం ఆరంభమైంది. శ్రీమతి కోడా భర్త మూర్ఛరోగంతో బాధపడుతుండేవాడు, ఆయనను చూసుకోవడానికి నేను సహాయపడాలి. నాకు బొత్తిగా ఇంగ్లీషు రానందున, నేను కొంత కలతచెందాను. అయితే శ్రీమతి కోడా నాతో జపనీస్‌ మాట్లాడేసరికి నాకు హాయిగా అనిపించింది. వారిద్దరు పరస్పరం ఇంగ్లీషులో మాట్లాడుకోవడం నాకు ప్రతిరోజు వినబడేది, ఆ విధంగా ఆ భాష వినడం నాకు అలవాటయ్యింది. ఆ ఇంటిలోని ఆహ్లాదకర వాతావరణం నాకు బాగా నచ్చింది.

రోగిష్టి భర్తపట్ల మోడ్‌కున్న అంకితభావం నన్ను ముగ్ధురాల్నిచేసింది. ఆయన అత్యంత ప్రీతిపాత్రంగా బైబిలు చదివేవాడు. ఆ దంపతులు సెకండ్‌ హ్యాండ్‌ పుస్తకాలు అమ్మే దుకాణంనుండి యుగాలను గురించిన దైవిక ప్రణాళిక అనే జపనీస్‌ భాషా పుస్తక సంపుటిని సంపాదించారని, కావలికోట ఆంగ్ల సంచికకు అనేక సంవత్సరాల పాటు చందాదారులుగా ఉన్నారని నాకు ఆ తర్వాత తెలిసింది.

ఒకరోజు నాకు బైబిలు బహుమతిగా లభించింది. నాకు చాలా సంతోషమేసింది, ఎందుకంటే నా జీవితంలో నాకు సొంత బైబిలు ఉండడం అదే మొదటిసారి. పాఠశాలకు వెళ్తూవస్తూ నేను దానిని చదివేదాన్ని గాని నాకు చాలా కొద్దిగా మాత్రమే అర్థమయ్యేది. నేను జపనీస్‌ షింటోమతస్థురాలిగా పెరగడం వలన, నాకు యేసుక్రీస్తు కేవలం అంతంతమాత్రంగానే తెలుసు. చివరకు అది జీవన్మరణాలను గురించిన నాప్రశ్నలన్నింటికి జవాబులిచ్చే బైబిలు సత్యాన్ని నేను హత్తుకునేందుకు నడిపే ఘట్టానికి ఆరంభమని నేను అప్పుడు గ్రహించలేదు.

మూడు విషాద సంఘటనలు

రెండు సంవత్సరాల అప్రెంటీస్‌షిప్‌ ముగిసిపోవడంతో, ఆ కుటుంబానికి నేను వీడ్కోలు చెప్పక తప్పలేదు. నేను పాఠశాల విద్య ముగించుకున్న తర్వాత, బాలికల స్వచ్ఛంద సైనికపనుల సేవికగాచేరి, నావికుల దుస్తుల తయారీలో భాగంవహించాను. అమెరికా B-29 బాంబర్ల వైమానిక దాడులు ఆరంభమయ్యాయి, 1945 ఆగస్టు 6న హిరోషిమామీద ఆటమ్‌ బాంబు వేయబడింది. కొన్ని రోజుల తర్వాత, మా అమ్మకు సీరియస్‌గా ఉందని నాకు టెలిగ్రామ్‌ వచ్చింది. నేను మొదటి రైల్లోనే ఇంటికి బయలుదేరాను. నేను రైలు దిగివస్తుండగా, మా బంధువొకాయన కలిసి, అమ్మ చనిపోయిందని నాకు చెప్పాడు. ఆమె ఆగస్టు 11న చనిపోయింది. నేను ఎన్నో సంవత్సరాలుగా భయపడ్డది కళ్లెదుట సాక్షాత్కరించింది! ఆమె నాతో ఇక ఎన్నటికీ మాట్లాడదు, చిరునవ్వుతో నావైపు చూడదు.

ఆగస్టు 15న, జపాను పరాజయం వాస్తవరూపం దాల్చింది. దానితో నేను మూడు విషాదకర సంఘటనల్ని ఎదుర్కోక తప్పలేదు, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా, మొట్టమొదట ఆటమ్‌ బాంబు విస్ఫోటనం, అమ్మ చనిపోవడం, జపాను చారిత్రక పరాజయం పదిరోజుల్లోనే సంభవించాయి. అయితే ప్రజలిక యుద్ధంలో మరణించరని తెలియడం ఓదార్పుకరంగా ఉండింది. దుఖఃభారంతో నేను ఉద్యోగంమానేసి గ్రామంలోవున్న ఇంటికి తిరిగొచ్చాను.

సత్యంవైపు ఆకర్షింపబడడం

ఒకరోజు, అనుకోకుండా ఓకయామాలోని మోడ్‌ కోడానుండి నాకు ఉత్తరం అందింది. ఆమె ఒక ఇంగ్లీషు పాఠశాల తెరుస్తున్నందున నేనామెకు ఇంటిపనులు చేసిపెట్టడంలో సహాయం చేయగలనేమో అని ఆమె అడిగింది. నాకు ఏమి చేయాలో తోచలేదు, కాని ఆమె ఆహ్వానాన్ని నేను అంగీకరించాను. కొన్ని సంవత్సరాల తర్వాత, నేను కోడాతోపాటు కోబ్‌కు తరలివెళ్లాను.

1949లో వేసవికాలం తొలిభాగంలో ఒక పొడవాటి, స్నేహశీలియైన పెద్దమనిషి కోడా కుటుంబాన్ని సందర్శించాడు. ఆయన పేరు డానెల్డ్‌ హాస్‌లెట్‌, ఆయన కోబ్‌లో మిషనరీలకు ఇల్లు వెదకుదామని టోక్యోనుండి కోబ్‌కు వచ్చాడు. జపానుకు వచ్చిన యెహోవాసాక్షుల మిషనరీల్లో ఆయన మొదటి మిషనరీ. ఒక ఇల్లు దొరకడంతో, 1949 నవంబరులో కోబ్‌కు చాలామంది మిషనరీలు వచ్చారు. ఒకరోజు వారిలో ఐదుగురు కోడా దంపతులను సందర్శించడానికి వచ్చారు. వారిలో ఇద్దరు, లాయిడ్‌ బ్యారీ, పెర్సీ ఇజ్‌లోబ్‌ ఆ ఇంట్లోని వారినుద్దేశించి చెరో పది నిమిషాలపాటు ఇంగ్లీషులో మాట్లాడారు. మిషనరీలు మోడ్‌ను ఒక క్రైస్తవ సహోదరిగా చూశారు, వారి సహవాసంతో ఆమె మంచి ప్రోత్సాహం పొందినట్లుగా కనిపించింది. అప్పుడు నేను ఇంగ్లీషు నేర్చుకోవడానికి పురికొల్పబడ్డాను.

ఆసక్తిగల మిషనరీల సహాయంతో, నేను క్రమేపీ ప్రాథమిక బైబిలు సత్యాలను అర్థంచేసుకున్నాను. నాకు చిన్నప్పటినుండి ఉన్న ప్రశ్నలకు జవాబులు లభించాయి. అవును, పరదైసు భూమిపై నిత్యం జీవించే నిరీక్షణను, “సమాధులలో నున్నవారందరు” పునరుత్థానమౌతారనే వాగ్దానాన్ని బైబిలు అందజేస్తోంది. (యోహాను 5:28, 29; ప్రకటన 21:​1, 4) తన కుమారుడైన యేసుక్రీస్తు విమోచన బలిద్వారా అట్టి నిరీక్షణను సాధ్యంచేసినందుకు నేను యెహోవాకు కృతజ్ఞురాలిని.

సంతోషభరితమైన దైవపరిపాలనా కార్యాలు

జపానులో మొదటి దైవపరిపాలనా సమావేశం, కోబ్‌లోని మిషనరీ గృహంలో 1949 డిసెంబరు 30 నుండి 1950 జనవరి 1 వరకు జరిగింది. నేను మోడ్‌తోపాటు వెళ్లాను. ఆ పెద్ద గృహం అంతకుముందు ఒక నాజీకి చెందినది, అక్కడినుండి సముద్రంలో దూరంగావున్న ప్రాంతం, అవాజి ద్వీపం చూడముచ్చటగా కనిపిస్తాయి. బైబిల్లో నాకున్న పరిమిత జ్ఞానంతో, అక్కడ చెప్పబడింది నాకు కొద్దిగానే అర్థమయ్యింది. అయినప్పటికీ, జపాను దేశస్థులతో మిషనరీలు అరమరికల్లేకుండా కలివిడిగా ఉండడం నన్ను ముగ్ధురాల్నిచేసింది. ఈ సమావేశపు బహిరంగ ప్రసంగానికి మొత్తం 101 మంది హాజరయ్యారు.

ఆ తర్వాత, నేను ప్రాంతీయ పరిచర్యలో భాగం వహించాలని తీర్మానించుకున్నాను. స్వభావసిద్ధంగా నాకు చాలా బిడియం కాబట్టి ఇంటింటికి వెళ్లడానికి నాకు చాలా ధైర్యం అవసరమయ్యింది. ఒకరోజు ఉదయం, నన్ను పరిచర్యకు తీసుకెళ్లడానికి సహోదరుడు లాయిడ్‌ బ్యారీ మా ఇంటికి వచ్చారు. ఆయన సహోదరి కోడా వాళ్ళ ఇంటి ప్రక్కింటినుండే పని ప్రారంభించాడు. ఆయన మాట్లాడుతున్నంతసేపూ నేను దాదాపుగా ఆయన వెనకాలే దాక్కుని ఆయన మాటలు విన్నాను. రెండవసారి వెళ్లినప్పుడు, నేను ఇద్దరు మిషనరీ సహోదరీలతో పనిచేశాను. ఓ వృద్ధ జపాను స్త్రీ మమ్మల్ని లోపలికి ఆహ్వానించి, చక్కగావిని ఆ పిమ్మట మాకు ఒక్కొక్క గ్లాసు పాలు ఇచ్చింది. ఆమె గృహ బైబిలు అధ్యయనానికి అంగీకరించి చివరకు క్రైస్తవురాలిగా బాప్తిస్మం తీసుకుంది. ఆమె పురోగతిని చూడడం నాకు చాలా ప్రోత్సాహాన్నిచ్చింది.

బ్రూక్లిన్‌ ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన సహోదరుడు నేథన్‌ హెచ్‌. నార్‌ 1951 ఏప్రిల్‌లో జపానును మొదటిసారిగా సందర్శించాడు. టోక్యోలోని కాండానందలి క్యొరెట్సు ఆడిటోరియంలో ఆయనిచ్చిన బహిరంగ ప్రసంగానికి దాదాపు 700 మంది వచ్చారు. ఈ ప్రత్యేక సమావేశంలో, కావలికోట జపనీస్‌లో ఆవిష్కరించబడినందుకు హాజరైన వారందరూ ఎంతో సంతోషించారు. ఆ మరుసటి నెలలో, సహోదరుడు నార్‌ కోబ్‌ను సందర్శించారు, అక్కడ జరిగిన ప్రత్యేక సమావేశంలో నేను యెహోవాకు చేసుకున్న నా సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకున్నాను.

ఒక సంవత్సరం తర్వాత, పూర్తికాల పరిచర్యలో అంటే పయినీరు సేవలో ప్రవేశించేందుకు నేను ప్రోత్సహింపబడ్డాను. ఆ కాలంలో జపానులో కొద్దిమంది పయినీర్లు మాత్రమే ఉన్నారు, ఆర్థికంగా నాకు ఆధారమేమిటని నేను ఆలోచించాను. వివాహం గురించి కూడా నేను ఆలోచించాను. కాని యెహోవాను సేవించడమే జీవిత ప్రథమ కర్తవ్యమని గ్రహించి, 1952లో పయినీరుగా చేరాను. సంతోషకరమేమంటే, పయినీరుగా చేస్తూనే నేను సహోదరి కోడా దగ్గర పార్ట్‌టైమ్‌ పనిచేశాను.

దాదాపు అదే సమయానికి, యుద్ధంలో చనిపోయాడనుకున్న మా అన్నయ్య, తైవాన్‌ నుండి తన కుటుంబంతో సహా ఇంటికి తిరిగొచ్చాడు. నా కుటుంబం క్రైస్తవత్వంపట్ల ఎన్నడూ ఆసక్తి చూపలేదు, అయితే పయినీరు స్ఫూర్తితో నేను వారికి పత్రికలు, చిన్నపుస్తకాలు పంపించడం ఆరంభించాను. ఆ తర్వాత, అన్నయ్య తన ఉద్యోగం కారణంగా తన కుటుంబంతో కోబ్‌కు వచ్చాడు. “మీరు పత్రికలు చదివారా?” అని నేను వదినను అడిగాను. నాకు ఆశ్చర్యం కలిగించేలా దానికామె, “ఆ పత్రికలు ఆసక్తికరంగా ఉన్నాయి” అని జవాబిచ్చింది. ఆమె మిషనరీల్లో ఒకరితో బైబిలు అధ్యయనం ఆరంభించింది, వారితోపాటు ఉంటున్న మా చెల్లికూడా ఆమెతోపాటు అధ్యయనం చేయడం ఆరంభించింది. చివరకు వారిద్దరూ బాప్తిస్మం తీసుకుని క్రైస్తవులయ్యారు.

అంతర్జాతీయ సహోదరత్వాన్ని చూసి ప్రభావితమవడం

అంతలోనే, వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 22వ తరగతికి హాజరవమని ఆహ్వానం అందుకోవడం నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సహోదరుడు ట్సుటొము ఫుకాసా, నేను ఆ పాఠశాలకు జపానునుండి ఆహ్వానింపబడిన వారిలో మొదటివాళ్లం. ఆ స్కూల్‌ ప్రారంభం కావడానికి ముందు 1953లో, మేము న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో జరిగిన ‘నూతన లోక సమాజం’ అనే సమావేశానికి హాజరుకాగలిగాం. యెహోవా ప్రజల అంతర్జాతీయ సహోదరత్వాన్నిబట్టి నేనెంతో ముగ్ధురాలినయ్యాను.

సమావేశపు ఐదవరోజున, జపనీస్‌ ప్రతినిధులు, వారిలో ఎక్కువమంది మిషనరీలు కిమినోస్‌ దుస్తులు ధరించాలని అనుకున్నారు. నేను ముందే పంపిన కిమినో తగిన సమయానికి అందకపోయేసరికి, నేను సహోదరి నార్‌ దగ్గరనుండి ఒకటి అడిగితీసుకున్నాను. కార్యక్రమం జరుగుతుండగా వర్షం మొదలయ్యింది, దానితో నేను వేసుకున్న కిమినో ఎక్కడ తడిసిపోతుందోనని నేను కంగారుపడ్డాను. అప్పుడే, నా వెనుకనుండి నెమ్మదిగా ఎవరో నామీద రెయిన్‌కోటు కప్పారు. “ఆయనెవరో మీకు తెలుసా?” అని నా ప్రక్కనే నిలబడ్డ సహోదరి నన్నడిగింది. ఆ తర్వాత నాకు తెలిసింది, ఆయన పరిపాలక సభ సభ్యుడైన, సహోదరుడు ఫ్రెడ్‌రిక్‌ డబ్ల్యు. ఫ్రాంజ్‌ అని. యెహోవా సంస్థచూపే ఆప్యాయతను నేను నిజంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.

22వ గిలియడ్‌ తరగతి నిజంగానే అంతర్జాతీయమైనది, అందులో 37 దేశాలనుండి వచ్చిన 120 మంది విద్యార్థులున్నారు. వేర్వేరు భాషలు మాట్లాడడం వలన విద్యార్థులు ఒకరితో ఒకరు సంభాషించుకోవడం కొన్నిసార్లు కష్టమైనప్పటికీ, మేము సంపూర్ణంగా అంతర్జాతీయ సహోదరత్వపు మాధుర్యం అనుభవించాము. 1954 ఫిబ్రవరిలో మంచు కురుస్తున్న ఓ రోజున, నేను పట్టభద్రులాలినై తిరిగి జపానువెళ్లేందుకే నియమించబడ్డాను. తోటి విద్యార్థి, స్వీడిష్‌ సహోదరి ఇనెర్‌ బ్రాంట్‌ నా సహచరిగా నగోయ నగరానికి వచ్చింది. మేమక్కడ, యుద్ధం కారణంగా కొరియానుండి పంపించివేయబడిన మిషనరీల గుంపుతో కలిశాము. మిషనరీ సేవలో నేను గడిపిన కొద్ది సంవత్సరాలు నాకు అమూల్యమైనవి.

దంపతులుగా ఆనందంగా సేవచేయడం

1957 సెప్టెంబరులో, టోక్యో బెతెల్‌లో సేవచేయడానికి నేను ఆహ్వానించబడ్డాను. కర్రలతో నిర్మించిన రెండంతస్థుల ఇల్లు జపాను బ్రాంచి కార్యాలయంగా ఉండేది. బ్రాంచి పైవిచారణకర్తగా సహోదరుడు బ్యారీతోపాటు కేవలం నలుగురే బ్రాంచిలో ఉండేవారు. కుటుంబంలోని మిగతావారు మిషనరీలు. ట్రాన్స్‌లేషన్‌, ప్రూఫ్‌రీడింగ్‌, అలాగే క్లీనింగ్‌, లాండ్రీ, వంటచేయడం వగైరా పనులు నాకివ్వబడ్డాయి.

జపానులో పని విస్తరిస్తూవుండగా మరియెక్కువమంది సహోదరులు బెతెల్‌కు ఆహ్వానించబడ్డారు. వారిలో ఒకరు నేను సహవసిస్తున్న సంఘంలో పైవిచారణకర్త అయ్యారు. 1966లో నేను ఆ సహోదరుడు జుంజి కోషినో వివాహం చేసుకున్నాము. మేము వివాహం చేసుకున్న తర్వాత, జుంజి ప్రాంతీయ పనికి నియమించబడ్డారు. వివిధ సంఘాలకు మేము ప్రయాణిస్తుండగా అనేకమంది సహోదర సహోదరీలతో పరిచయం కలగడం ఎంతో ఆనందమిచ్చింది. నాకు అనువాదపు పని కొంత అప్పగింపబడిన కారణంగా, ఆ వారంలో మేమున్న ఇంట్లోనే నేను ఆ పనిచేసేదాన్ని. ప్రయాణాలప్పుడు, సూటుకేసులు, ఇతర సంచులతోపాటు మేము బరువైన నిఘంటువుల్ని కూడా మోసుకెళ్లాల్సివచ్చేది.

నాలుగు సంవత్సరాలకుపైగా మేము ప్రాంతీయసేవలో ఆనందించాము, సంస్థ విస్తరిస్తూ ఉండడాన్ని మేము చూశాము. బ్రాంచి నుమాజుకు, ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు ఎబినాకు మారింది. అక్కడే ప్రస్తుత బ్రాంచి వసతులు ఉన్నాయి. జుంజి నేను ఎంతోకాలంగా బెతెల్‌ సేవలో ఆనందంగా ఉన్నాము. దాదాపుగా 600 మంది సభ్యులున్న కుటుంబంతో మేమిప్పుడు కలిసిపనిచేస్తున్నాము. మే 2002లో బెతెల్‌లోని స్నేహితులు నా 50 సంవత్సరాల పూర్తికాల సేవా ఉత్సవం జరిపారు.

అభివృద్ధిచూసేలా ఆశీర్వదించబడ్డాను

నేను 1950లో యెహోవాను సేవించడం ఆరంభించినప్పుడు, జపానులో కేవలం కొద్దిమంది ప్రచారకులే ఉన్నారు. ఇప్పుడు, 2,10,000 మంది రాజ్య ప్రచారకులు ఉన్నారు. నావలెనే, వేలాదిమంది గొర్రెవంటివారు నిజంగా యెహోవావైపు ఆకర్షించబడ్డారు.

వెనుకటికి 1949లో మమ్మల్ని సహోదరి కోడా వాళ్ళ ఇంట్లో సందర్శించడానికి వచ్చిన ఆ నలుగురు మిషనరీ సహోదరులు, ఆ సహోదరి, సహోదరి మోడ్‌ కోడా అందరూ విశ్వాసులుగానే తనువు చాలించారు. ఆ విధంగానే పరిచర్య సేవకునిగా నా అన్నయ్య, 15 సంవత్సరాలపాటు పయినీరు సేవలో ఆనందించిన వదినకూడా విశ్వాసులుగానే చనిపోయారు. నేను నా చిన్నతనంలో చనిపోతారేమోనని భయపడ్డ నా తలిదండ్రులకు ఎలాంటి భవిష్యత్తు ఉత్తరాపేక్షలు ఉన్నాయి? పునరుత్థానాన్ని గురించి బైబిలిచ్చే వాగ్దానం నాకు నిరీక్షణను, ఓదార్పును ఇస్తోంది.​—⁠అపొస్తలుల కార్యములు 24:​14, 15.

నేను గతంలోకి ఒకసారి చూసుకుంటే, 1941లో మోడ్‌ను కలుసుకోవడం నా జీవితంలో ఓ పెద్ద మలుపని నేను భావిస్తాను. నేనా సమయంలో ఆమెను కలుసుకోకపోయి ఉంటే, యుద్ధం తర్వాత మళ్లీ ఆమె దగ్గర పనిచేయడానికివ్వబడిన ఆహ్వానానికి నేను ప్రతిస్పందించకపోయి ఉంటే, ఆ తొలిరోజుల్లో మిషనరీలతో ఏమాత్రం సంబంధంలేని మారుమూల గ్రామంలో మా పొలంలో పనిచేసుకుంటూ ఉండేదాన్ని. మోడ్‌ ద్వారా, ఆ తొలి మిషనరీల ద్వారా నన్ను సత్యానికి ఆకర్షించిన యెహోవాకు నేనేంతో కృతజ్ఞురాలిని!

[25వ పేజీలోని చిత్రం]

మోడ్‌ కోడా మరియు ఆమె భర్తతో. నేను ముందుభాగంలో ఎడమవైపున్నాను

[27వ పేజీలోని చిత్రం]

1953లో యాంకీ స్టేడియంలో జపానునుండి వచ్చిన మిషనరీలతో. నేను ఎడమవైపు చివర్లోవున్నాను

[28వ పేజీలోని చిత్రం]

బెతెల్‌లో నా భర్త జుంజితో