కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నీతి నిమిత్తం హింసించబడ్డారు

నీతి నిమిత్తం హింసించబడ్డారు

నీతి నిమిత్తం హింసించబడ్డారు

“నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు.”​మత్తయి 5:10.

“సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని.” (యోహాను 18:​37) యేసు ఈ మాటలు పలికినప్పుడు, యూదయలో రోమా గవర్నరుగావున్న పొంతి పిలాతు ఎదుట ఉన్నాడు. యేసు అక్కడున్నది స్వయంగా తాను వెళ్ళినందుకో పిలాతు ఆహ్వానించినందుకో కాదు. బదులుగా, మరణశిక్షకు అర్హుడైన దోషి అని యూదా మతనాయకులు చేసిన అబద్ధ ఆరోపణల కారణంగా ఆయన అక్కడున్నాడు.​—⁠యోహాను 18:29-31.

2 పిలాతుకు తనను విడిచిపెట్టే లేదా మరణానికి అప్పగించే అధికారముందని యేసుకు బాగా తెలుసు. (యోహాను 19:​10) కానీ అది ఆయన పిలాతుతో రాజ్యాన్ని గురించి ధైర్యంగా మాట్లాడకుండా ఆయనను ఆపలేదు. యేసు ప్రాణం ప్రమాదంలోవున్నా, ఆ ప్రాంతంలోని అత్యున్నత ప్రభుత్వాధికారికి సాక్ష్యమిచ్చే అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. అలా సాక్ష్యమిచ్చినప్పటికి యేసు మరణశిక్ష విధింపబడినవాడై హింసాకొయ్యపై హతసాక్షిగా బాధాకరమైన మరణం అనుభవించాడు.​—⁠మత్తయి 27:24-26; మార్కు 15:15; లూకా 23:24, 25; యోహాను 19:13-16.

సాక్షా, హతసాక్షా?

3 నేడు అనేకులు, హతసాక్షంటే ఆ వ్యక్తి కొంతమేరకు ఛాందసుడు లేదా తీవ్రవాది అనుకుంటారు. తమ నమ్మకాల కొరకు ప్రత్యేకించి మతనమ్మకాన్నిబట్టి మరణించేందుకైనా ఇష్టపడేవారిని ఉగ్రవాదులుగా లేదా కనీసం సమాజానికి ప్రమాదకరమైన వారిగా అనుమానించడం జరుగుతోంది. అయితే, హతసాక్షి అనే మాటకు బహుశా ఒక కోర్టు విచారణలో, సత్యమని తాను నమ్మిన విషయానికి సాక్ష్యం పలికే వ్యక్తి, “సాక్షి” అని అసలు అర్థం. ఆ తర్వాతి కాలాల్లో మాత్రమే ఈ మాటకు “సాక్ష్యమిచ్చేందుకు తన ప్రాణం అర్పించువాడు” లేదా తన ప్రాణం ఇవ్వడం ద్వారా సాక్ష్యమిచ్చేవాడు అనే భావం వాడుకలోకి వచ్చింది.

4 ఆ మాటకివ్వబడిన ముందరి భావంలోనే యేసు ప్రాథమికంగా హతసాక్షయ్యాడు. పిలాతుతో చెప్పినట్లుగా ఆయన “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు” వచ్చాడు. ఆయనిచ్చిన సాక్ష్యానికి ప్రజలు విభిన్నరీతుల్లో ప్రతిస్పందించారు. సామాన్య ప్రజానీకంలో కొందరు తాము విన్నవాటినిబట్టి, కన్నవాటినిబట్టి బహుగా పురికొల్పబడి యేసునందు విశ్వాసముంచారు. (యోహాను 2:23; 8:​30) సాధారణ జనసమూహం, ప్రత్యేకించి మత నాయకులు కూడా తీవ్రంగా, అయితే ప్రతికూలంగా ప్రతిస్పందించారు. యేసు తన అవిశ్వాస బంధువులతో ఇలా అన్నాడు: “లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని, దాని క్రియలు చెడ్డవని నేను దానినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది.” (యోహాను 7:⁠7) యేసు సత్యానికి సాక్ష్యమివ్వడం ఆ జాతి నాయకుల కోపానికి కారణంకాగా అది ఆయన మరణానికి దారితీసింది. నిజంగా, ఆయన “నమ్మకమైన సత్యసాక్షి (మార్టిస్‌).”​—⁠ప్రకటన 3:14.

‘మీరు ద్వేషింపబడతారు’

5 యేసు తానుగా తీవ్ర హింస అనుభవించడమే కాదు, తన అనుచరులు కూడా తనలాగే హింసించబడతారని ఆయన వారిని ముందే హెచ్చరించాడు. యేసు తన పరిచర్య ఆరంభంలోనే, కొండమీది ప్రసంగంలో తన శ్రోతలకు ఇలా చెప్పాడు: “నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును.”​—⁠మత్తయి 5:10-12.

6 ఆ తర్వాత, యేసు తన 12 మంది అపొస్తలులను పంపిస్తూ వారికిలా చెప్పాడు: “మనుష్యులనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు.” అయితే శిష్యులను హింసించేది కేవలం మతాధికారులు మాత్రమే కాదు. యేసు ఇంకా ఇలా అన్నాడు: “సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షింపబడును.” (మత్తయి 10:17, 18, 21, 22) మొదటి శతాబ్దపు క్రైస్తవుల చరిత్ర ఈ మాటల సత్యసంధతను రుజువు చేస్తోంది.

నమ్మకంగా సహించినవారి నివేదిక

7 యేసు మరణించిన కొద్దికాలానికే, సత్యానికి సాక్ష్యమిచ్చిన కారణంగా మరణించిన వారిలో స్తెఫను మొదటి క్రైస్తవుడయ్యాడు. ఆయన “కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచకక్రియలను చేయుచుండెను.” అతని మతసంబంధ శత్రువులు “మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను ఎదిరింపలేకపోయిరి.” (అపొస్తలుల కార్యములు 6:​8, 10) పట్టరాని ఈర్ష్యతో వారు స్తెఫనును యూదుల ఉన్నత న్యాయస్థానమగు మహాసభ ఎదుటకు లాక్కుపోయారు. అక్కడాయన అబద్ధ ఆరోపకులను ఎదుర్కొని బలమైన సాక్ష్యమిచ్చాడు. అయితే చివరకు, స్తెఫను శత్రువులు నమ్మకమైన ఈ సాక్షిని హతమార్చారు.​—⁠అపొస్తలుల కార్యములు 7:59, 60.

8 స్తెఫను హత్య అనంతరం, “యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, అపొస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి.” (అపొస్తలుల కార్యములు 8:⁠1) మరి హింస క్రైస్తవ సాక్ష్యాన్ని ఆపుజేసిందా? దానికి భిన్నంగా, “చెదరిపోయినవారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి” అని ఆ వృత్తాంతం చెబుతోంది. (అపొస్తలుల కార్యములు 8:⁠4) అంతకుముందు, “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా” అని చెప్పినప్పుడు అపొస్తలుడైన పేతురు ఎలా భావించాడో వారూ అలాగే భావించివుంటారు. (అపొస్తలుల కార్యములు 5:​29) హింస కలిగినా, ఆ నమ్మకస్థులైన, ధైర్యవంతులైన శిష్యులు సత్యానికి సాక్ష్యమివ్వడానికే కట్టుబడ్డారు. ఇలా చేయడం మరిన్ని కష్టాలు ఎదుర్కొనేందుకు దారితీస్తుందని కూడా వారికి తెలుసు.​—⁠అపొస్తలుల కార్యములు 11:19-21.

9 నిజానికి కష్టాలకు సంబంధించినంత వరకు వాటి తీవ్రత ఎప్పుడూ తక్కువకాలేదు. మొదట మనం, స్తెఫనును రాళ్లతో కొట్టిచంపడాన్ని సమ్మతించిన వ్యక్తియైన సౌలు “ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి యీ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల, వారిని బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజములవారికి పత్రికలిమ్మని అడిగెను” అని తెలుసుకున్నాము. (అపొస్తలుల కార్యములు 9:​1, 2) ఆ పిమ్మట, దాదాపు సా.శ. 44వ సంవత్సరంలో “రాజైన హేరోదు సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను.”​—⁠అపొస్తలుల కార్యములు 12:1, 2.

10 అపొస్తలుల కార్యముల పుస్తకంలోని మిగతా భాగం, గతంలో హింసకునిగావుండి తర్వాత అపొస్తలుడిగా మారి సా.శ. 65లో బహుశా రోమా చక్రవర్తి నీరో ఆజ్ఞమేరకు హతసాక్షిగా మరణించిన పౌలువంటి నమ్మకస్థులు సహించిన పరీక్షలను, చెరసాల శిక్షలను, హింసను గురించిన శాశ్వత నివేదికను అందజేస్తోంది. (2 కొరింథీయులు 11:23-27; 2 తిమోతి 4:​6-8) చివరగా, మొదటి శతాబ్దం చివరలో వ్రాయబడిన ప్రకటన గ్రంథంలో వృద్ధుడైన అపొస్తలుడగు యోహాను “దేవుని వాక్యము నిమిత్తమును యేసునుగూర్చిన సాక్ష్యము నిమిత్తమును” శిక్షలు అమలుచేయడానికి ఉపయోగించబడిన పత్మాసు ద్వీపంలో బంధీగా ఉండడాన్ని గురించి మనం చదువుతాం. ‘నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు’ పెర్గములో ‘చంపబడిన’ సంగతి కూడా ప్రకటనలో సూచించబడింది.​—⁠ప్రకటన 1:9; 2:13.

11 ఇవన్నీ “నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు” అని యేసు తన శిష్యులకు చెప్పిన మాటలు నిజమని నిరూపించాయి. (యోహాను 15:​20) నమ్మకమైన తొలి క్రైస్తవులు “మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు” అని ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చేందుకు తుది పరీక్షను, అంటే చిత్రహింసల ద్వారా, క్రూర జంతువుల ఎదుట పడవేయబడడం ద్వారా లేదా మరోవిధంగా మరణాన్ని ఎదుర్కోవడానికైనా సిద్ధపడ్డారు.​—⁠అపొస్తలుల కార్యములు 1:⁠8.

12 యేసు అనుచరులయెడల అలా క్రూరంగా ప్రవర్తించడం కేవలం గతంలోనే జరిగిందని ఎవరైనా అనుకుంటే వారు ఘోరంగా పొరబడినట్లే. మనం చూసినట్లుగా తనవైన కష్టాలు అనుభవించిన పౌలు ఇలా వ్రాశాడు: “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు.” (2 తిమోతి 3:​12) హింసను గురించి పేతురు ఇలా చెప్పాడు: “క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.” (1 పేతురు 2:​21) అప్పటినుండి ఇప్పటి ఈ విధానపు “అంత్యదినముల” వరకు, యెహోవా ప్రజలు ద్వేషానికి, వ్యతిరేకతకు గురౌతూనేవున్నారు. (2 తిమోతి 3:⁠1) భూమియందంతటా యెహోవాసాక్షులు నిరంకుశ పరిపాలనలోనూ, ప్రజాతంత్ర దేశాల్లోనూ ఏదోక సమయంలో ఇటు ఆయావ్యక్తులుగా అటు సమూహంగా హింసననుభవించారు.

ఎందుకు ద్వేషించబడి హింసించబడ్డారు?

13 నేడు మనలో అనేకులు ప్రశాంతంగా ప్రకటించడానికి, సమకూడడానికి సాపేక్ష స్వేచ్ఛను అనుభవిస్తున్నా, “ఈ లోకపు నటన గతించుచున్నది” అని బైబిలు గుర్తుచేస్తున్న సంగతిని మనం లక్ష్యపెట్టాలి. (1 కొరింథీయులు 7:​31) పరిస్థితి ఎంత వేగంగా మారిపోగలదంటే, మనమొకవేళ మానసికంగా, భావోద్రేకంగా, ఆధ్యాత్మికంగా సిద్ధపడి ఉండకపోతే మనం సులభంగా తొట్రిల్లగలము. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవడానికి మనమేమి చేయవచ్చు? శాంతిని ప్రేమించే, శాసన బద్ధులైన క్రైస్తవులు ఎందుకు ద్వేషించబడి హింసించబడుతున్నారో స్పష్టంగా మనస్సులో ఉంచుకోవడం బలమైన కాపుదలగా ఉంటుంది.

14 అపొస్తలుడైన పేతురు తాను దాదాపు సా.శ. 62-64లో వ్రాసిన మొదటి పత్రికలో ఈ విషయాన్ని గురించి వ్యాఖ్యానించాడు. ఆ కాలంలో రోమా సామ్రాజ్యమందంతట క్రైస్తవులు పరీక్షలను హింసను అనుభవిస్తున్నారు. ఆయనిలా అన్నాడు: “ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.” తన మనస్సులో ఏముందో వివరించడానికి పేతురు ఇంకా ఇలా అన్నాడు: “మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.” వారేదో తప్పుచేసినందుకు కాదుగాని వారు క్రైస్తవులైనందుకే బాధపడుతున్నారని పేతురు సూచించాడు. తమ చుట్టూవున్న ప్రజల మాదిరిగానే ‘దుర్వ్యాపారంలో’ మునిగితేలుతుంటే ప్రజలు వారిని స్వాగతించి వారిని వాటేసుకునేవారే. కాని వారు క్రీస్తు అనుచరులుగా తమ పాత్ర నిర్వర్తించడానికి ప్రయత్నిస్తున్నందుకే బాధ అనుభవించారు. నేడు నిజ క్రైస్తవులకు పరిస్థితేమీ మారలేదు.​—⁠1 పేతురు 4:4, 12, 15, 16.

15 ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో యెహోవాసాక్షులు తమ సమావేశాలు, నిర్మాణ ప్రణాళికలప్పుడు తమ ఐక్యతకు, సహకారానికి, నిజాయితీకి, శ్రమించే స్వభావానికి, మాదిరికరమైన నైతిక ప్రవర్తనకు, కుటుంబ జీవితానికి, మర్యాదకరంగా అగుపడేరీతికి, వ్యవహార విధానానికి బాహాటంగా మెచ్చుకోబడుతున్నారు. * మరోవైపున, ఇది వ్రాసే సమయానికి దాదాపు 28 దేశాల్లో వారి పని నిషేధంలో లేదా నిర్భందంలో ఉంది, సాక్షులు అనేకులు తమ విశ్వాసాన్నిబట్టి భౌతిక దురాగతాలను, నష్టాన్ని అనుభవిస్తున్నారు. స్పష్టంగా ఎందుకీ విరుద్ధత? మరి దేవుడు దీనినెందుకు అనుమతిస్తున్నాడు?

16 మొట్టమొదట మనం “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును” అని చెప్పిన సామెతలు 27:11లోని మాటల్ని మనస్సులో ఉంచుకోవాలి. ఎందుకంటే, బహుకాలంగా ఈ విశ్వ సర్వాధిపత్యం వివాదాంశంగావుంది. శతాబ్దాలుగా యెహోవాయెడల తమ యథార్థతను నిరూపించుకున్న వారందరి గొప్ప సాక్ష్యమున్నప్పటికీ, నీతిమంతుడైన యోబు కాలంలోవలెనే సాతాను యెహోవాను నిందించడం ఆపలేదు. (యోబు 1:9-11; 2:​4, 5) దేవుని రాజ్యం సుస్థిరంగా స్థాపించబడి, దాని విశ్వసనీయ ప్రజలు, ప్రతినిధులు భూవ్యాప్తంగావున్న ఈ కాలంలో నిస్సందేహంగా సాతాను తన మాట నెగ్గించుకునే చివరి ప్రయత్నంలో మరింత కోపోద్రేకంగల వాడయ్యాడు. తమకెంత ప్రమాదం వాటిల్లినా, కష్టమొచ్చినా వీరు దేవునియెడల నమ్మకంగా ఉంటారా? ఇది, ప్రతి యెహోవా సేవకుడు వ్యక్తిగతంగా జవాబివ్వాల్సిన ప్రశ్న.​—⁠ప్రకటన 12:12, 17.

17 యేసు ‘యుగసమాప్తిలో’ జరగబోయే సంఘటనలను గురించి తన శిష్యులకు చెబుతూ తన సేవకులపై హింస రావడానికి యెహోవా ఎందుకు అనుమతిస్తాడనేదానికి మరో కారణాన్ని సూచించాడు. ఆయన వారికిలా చెప్పాడు: ‘నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకు అధిపతులయొద్దకు తీసికొనిపోవుదురు. ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును.’ (మత్తయి 24:3, 9; లూకా 21:​12, 13) హేరోదు పొంతి పిలాతుల ఎదుట యేసు స్వయంగా సాక్ష్యమిచ్చాడు. అపొస్తలుడైన పౌలు కూడా ‘రాజులయొద్దకు అధిపతులయొద్దకు తీసుకుపోబడ్డాడు.’ పౌలు ప్రభువైన యేసుక్రీస్తుచే నడిపింపబడినవాడై “కైసరు ఎదుటనే చెప్పుకొందును” అని చెప్పినప్పుడు ఆ కాలంలో అత్యంత శక్తిమంతుడైన పరిపాలకునికే సాక్ష్యమిచ్చేందుకు ప్రయత్నించాడు. (అపొస్తలుల కార్యములు 23:11; 25:​8-12) అదేవిధంగా నేడు, సవాలుదాయకమైన పరిస్థితులు తరచు ఇటు అధికారులకు అటు ప్రజలకు చక్కని సాక్ష్యమిచ్చేలా చేశాయి. *

18 చివరగా, పరీక్షలను, శ్రమలను తాళుకోవడం వ్యక్తిగతంగా మనకు ప్రయోజనాన్నివ్వగలదు. ఏ విధంగా? శిష్యుడైన యాకోబు తోటి క్రైస్తవులకు ఇలా గుర్తుచేశాడు: “నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.” అవును, హింస మన విశ్వాసాన్ని శుద్ధిచేసి మన సహనాన్ని బలపరచగలదు. అందువల్ల, మనం దానికి భయపడం, లేదా దానిని తప్పించుకోవడానికో కడతేర్చడానికో మనం ప్రయత్నించం. బదులుగా, మనం యాకోబు ఇచ్చిన ఈ సలహాను పాటిస్తాం: “మీరు సంపూర్ణులును, అనూనాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునైయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.”​—⁠యాకోబు 1:​2-4.

19 దేవుని నమ్మకమైన సేవకులు ఎందుకు హింసించబడుతున్నారో, యెహోవా దానినెందుకు అనుమతిస్తాడో అర్థంచేసుకోవడానికి దేవుని వాక్యం మనకు సహాయంచేసినా, అది హింస భరించడం సులభమయ్యేలా చేయనవసరం లేదు. దానిని తట్టుకునేందుకు మనల్ని ఏది బలపరుస్తుంది? మనకు హింస ఎదురైనప్పుడు మనమేమి చేయవచ్చు? తర్వాతి ఆర్టికల్‌లో ప్రాముఖ్యమైన ఈ విషయాలను మనం పరిశీలిద్దాం.

[అధస్సూచీలు]

^ పేరా 21 కావలికోట డిసెంబరు 15, 1995 27-9 పేజీలు; ఏప్రిల్‌ 15, 1994 16-17 పేజీలు; తేజరిల్లు! (ఆంగ్లం) డిసెంబరు 22, 1993 పేజీలు 6-13 చూడండి.

^ పేరా 23 తేజరిల్లు! (ఆంగ్లం) జనవరి 8, 2003, 3-11 పేజీలు చూడండి.

మీరు వివరించగలరా?

• ప్రాథమికంగా యేసు ఏ భావంలో హతసాక్షి?

• హింస మొదటి శతాబ్దపు క్రైస్తవులపై ఎలాంటి ప్రభావం చూపింది?

• పేతురు వివరించినట్లుగా, నిజ క్రైస్తవులు ఎందుకు హింసించబడ్డారు?

• ఏ కారణాలచేత యెహోవా తన సేవకులపై హింస రావడానికి అనుమతిస్తాడు?

[అధ్యయన ప్రశ్నలు]

1. యేసు పొంతి పిలాతు ఎదుట ఎందుకున్నాడు, యేసు ఏమిచెప్పాడు?

2. యేసు ఏమిచేశాడు, దాని ఫలితమేమిటి?

3. బైబిలు కాలాల్లో “హతసాక్షి” అనే మాటకు ఏ అర్థంవుంది, అయితే నేడు దాని భావమేమిటి?

4. ప్రాథమికంగా యేసు ఏ భావంలో హతసాక్షి?

5. యేసు తన పరిచర్య ఆరంభంలోనే, హింసను గురించి ఏమిచెప్పాడు?

6. యేసు 12 మంది అపొస్తలులను పంపినప్పుడు ఏ హెచ్చరిక చేశాడు?

7. స్తెఫను హతసాక్షి కావడానికి ఏది దారితీసింది?

8. స్తెఫను మరణం తర్వాత తమకు కలిగిన హింసకు యెరూషలేములోని శిష్యులు ఎలా ప్రతిస్పందించారు?

9. యేసు అనుచరులపై ఎలాంటి హింస కొనసాగింది?

10. అపొస్తలుల కార్యములలో, ప్రకటన గ్రంథంలో హింసను గురించిన ఏ నివేదికను మనం చూస్తాం?

11. హింసకు సంబంధించి తొలి క్రైస్తవుల మార్గం యేసు మాటలు నిజమని ఎలా నిరూపించింది?

12. క్రైస్తవులను హింసించడం ఎందుకు కేవలం చరిత్రలో జరిగిన సంఘటన కాదు?

13. హింసకు సంబంధించినంత వరకు ఆధునికదిన యెహోవా సేవకులు దేనిని మనస్సులో ఉంచుకోవాలి?

14. క్రైస్తవులు ఎందుకు హింసించబడ్డారో పేతురు ఏ కారణం సూచించాడు?

15. యెహోవాసాక్షులను చూసే విషయంలో నేడు ఏ విరుద్ధత కనబడుతోంది?

16. తన ప్రజలు హింస అనుభవించేలా దేవుడు అనుమతించడానికి గల ప్రధాన కారణమేమిటి?

17. “ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును” అని పలికినప్పుడు యేసు మాటల భావమేమిటి?

18, 19. (ఎ) పరీక్షలను తాళుకోవడం మనకెలా ప్రయోజనమిస్తుంది? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు పరిశీలించబడతాయి?

[10, 11వ పేజీలోని చిత్రం]

మొదటి శతాబ్దపు క్రైస్తవులు బాధ అనుభవించింది తప్పులుచేసినందుకు కాదుగాని క్రైస్తవులుగా ఉన్నందుకే

పౌలు

యాకోబు

యోహాను

అంతిప

స్తెఫను