కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరీక్షల్లో సహనం చూపించడం యెహోవాకు స్తుతి తెస్తుంది

పరీక్షల్లో సహనం చూపించడం యెహోవాకు స్తుతి తెస్తుంది

పరీక్షల్లో సహనం చూపించడం యెహోవాకు స్తుతి తెస్తుంది

“మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును.”​—1 పేతురు 2:20.

క్రైస్తవులు యెహోవాకు సమర్పించుకొని ఆయన చిత్తం చేయడానికి ఇష్టపడుతున్నారు. వారి సమర్పణకు తగ్గట్టు జీవించడానికి, వారు వారి మాదిరికర్తయగు యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడవడానికి, సత్యానికి సాక్ష్యమివ్వడానికి శాయశక్తులా పనిచేస్తారు. (మత్తయి 16:24; యోహాను 18:37; 1 పేతురు 2:​21) అయితే, యేసు, మరితర నమ్మకస్థులు తమ విశ్వాసం కొరకు ప్రాణాలర్పించి హతసాక్షులుగా మరణించారు. అంటే క్రైస్తవులందరు తమ విశ్వాసం కొరకు మరణించడానికి ఎదురుచూడగలరని దాని భావమా?

2 క్రైస్తవులముగా మనం మన విశ్వాసం కొరకు మరణించాల్సిన అవసరముందని కాదుగాని, మరణం వరకు నమ్మకంగా ఉండాలని కోరబడ్డాము. (2 తిమోతి 4:7; ప్రకటన 2:​10) అంటే విశ్వాసం నిమిత్తం మనం బాధ అనుభవించడానికి, అవసరమైతే మరణించడానికి సిద్ధపడ్డా ఇవి మనకు జరగాలని మనం ఉబలాటపడం. బాధ అనుభవించడానికి ఆనందించం, నొప్పి లేదా అవమానాన్నిబట్టి సంతోషించం. అయితే పరీక్షలు, హింస అనివార్యమైనవే అయినా అవి మనకు కలిగినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తామో మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి.

పరీక్షలనెదుర్కొంటున్నప్పుడు నమ్మకంగా ఉండడం

3 గతంలో దేవుని సేవకులు ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు వారెలా స్పందించారో తెలిపే అనేక వృత్తాంతాల్ని మనం బైబిల్లో చూస్తాం. అలాంటి సవాళ్లనే ఒకవేళ క్రైస్తవులు నేడు ఎదుర్కోవాల్సివస్తే ఆ సేవకులు ప్రతిస్పందించిన వివిధ రీతులు వారికి నిర్దేశమిస్తాయి. “హింసతో వారెలా వ్యవహరించారు” అనే బాక్సులోని వృత్తాంతాలను పరిశీలించి, వాటినుండి మీరేమి నేర్చుకోగలరో చూడండి.

4 పరిస్థితులనుబట్టి యేసు, నమ్మకస్థులైన దేవుని ఇతర సేవకులు హింసకు వివిధ రీతుల్లో ప్రతిస్పందించినా, వారు అనవసరంగా తమ ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోలేదనేది స్పష్టం. తాము ప్రమాదంలో ఉన్నామని గ్రహించినప్పుడు, వారు ధైర్యంగావున్నా జాగ్రత్తగా మెలిగారు. (మత్తయి 10:​16, 23) ప్రకటనా పనిని పురోగమింపజేయడం యెహోవాయెడల తమ యథార్థతను కాపాడుకోవడం వారి ఉద్దేశం. వివిధ పరిస్థితుల్లో వారు ప్రతిస్పందించిన తీరు నేడు పరీక్షలను, హింసను ఎదుర్కొంటున్న క్రైస్తవులకు ఉదాహరణగా ఉంటుంది.

5 ఆధునిక కాలాల్లో, యుద్ధాలు, నిషేధాలు లేదా ప్రత్యక్ష హింసల కారణంగా యెహోవా ప్రజలు తరచు తీవ్రమైన కష్టాలను, లేమిని అనుభవిస్తున్నారు. ఉదాహరణకు, 1960వ దశాబ్దంలో మలావీలోని యెహోవాసాక్షులు భయంకరంగా హింసించబడ్డారు. వారి రాజ్యమందిరాలు, ఇళ్లు, ఆహార సరఫరా, వ్యాపారం ఇలా వారికున్నవన్నీ నాశనం చేయబడ్డాయి. వారు కొట్టబడ్డారు, దోపిడికి గురయ్యారు. మరి సహోదరులు ఎలా ప్రతిస్పందించారు? వేలాదిమంది తమ గ్రామాలు వదిలి పారిపోవలసి వచ్చింది. అనేకులు అడవుల్లో తలదాచుకోగా, మరితరులు వెళ్లి పొరుగున మొజాంబిక్‌లో తాత్కాలిక పరవాసులుగావున్నారు. నమ్మకంగా నిలిచిన అనేకులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నా, ఇతరులు ప్రమాద స్థలంనుండి పారిపోవడానికి నిశ్చయించుకున్నారు, అలాంటి పరిస్థితుల్లో అలాచేయడమే సహేతుకమని స్పష్టమవుతోంది. అలాచేయడంలో, ఆ సహోదరులు యేసు, పౌలు ఉంచిన మాదిరిని అనుసరించారు.

6 మలావీలోని సహోదరులు పారిపోవాల్సివచ్చినా లేదా అజ్ఞాతంలోవున్నా, వారు దైవపరిపాలనా నిర్దేశం కోరి, దానిని అనుసరిస్తూ శాయశక్తులా తమ క్రైస్తవ కార్యకలాపాలు రహస్యంగా కొనసాగించారు. దాని ఫలితం? 1967లో నిషేధానికి ముందు రాజ్య ప్రచారకులు అత్యధిక సంఖ్యలో 18,519కి చేరుకున్నారు. నిషేధం ఇంకా అమలులోనే ఉండి అనేకమంది మొజాంబిక్‌కు పారిపోయినా 1972 నాటికి సరిక్రొత్త శిఖరాగ్ర సంఖ్యగా 23,398 మంది ప్రచారకులు రిపోర్టుచేశారు. పరిచర్యలో వారు ప్రతినెల సగటున 16 కంటే ఎక్కువ గంటలు పనిచేశారు. నిస్సందేహంగా వారి క్రియలు యెహోవాకు స్తుతిని తీసుకురాగా, ఆ అత్యంత కష్టభరిత కాలంలో యెహోవా నమ్మకమైన ఆ సహోదరులకు తోడుగా ఉన్నాడు. *

7 మరోవైపున, వ్యతిరేకత సమస్యలు కలిగిస్తున్న దేశాల్లో, కొందరు సహోదరులు తాము వెళ్లగలిగినా అలా వెళ్లకుండా ఉండడానికే తీర్మానించుకోవచ్చు. అలా వెళ్లడం కొన్ని సమస్యలను పరిష్కరించవచ్చు, అయితే అది ఇతర సవాళ్లు సృష్టించవచ్చు. ఉదాహరణకు, వారు ఆధ్యాత్మికంగా ఒంటరివారు కాకుండా ఉండేందుకు క్రైస్తవ సహోదరత్వ సంబంధం కాపాడుకోవడానికి వారికి వీలవుతుందా? బహుశా సుసంపన్న దేశంలో లేదా మరిన్ని వస్తుదాయక వసతులు కల్పించే దేశంలో స్థిరపడడానికి వారు సంఘర్షిస్తుండగా తమ ఆధ్యాత్మిక దినచర్యను అదేవిధంగా కొనసాగించుకోగలరా?​—⁠1 తిమోతి 6:⁠9.

8 మరితరులు తమ సహోదరుల ఆధ్యాత్మిక సంక్షేమాన్ని గురించి చింతిస్తూ వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు. వారు తమ స్వప్రాంతంలో ప్రకటనా పనిని కొనసాగించేందుకు, తోటి ఆరాధకులకు ప్రోత్సాహానికి ఆధారంగా ఉండేందుకు అక్కడేవుండి పరిస్థితిని ఎదుర్కోవడానికి నిర్ణయించుకున్నారు. (ఫిలిప్పీయులు 1:​14) అలా నిర్ణయించుకొన్న కొందరు వారి దేశంలో న్యాయపరమైన విజయాలు సాధించేందుకు దోహదపడ్డారు. *

9 ఆ ప్రాంతంలోనే ఉండాలా లేక వేరొకచోటికి వెళ్లాలా అన్నది నిశ్చయంగా వ్యక్తిగత నిర్ణయమే. మనం ప్రార్థనాపూర్వకంగా యెహోవా నిర్దేశంకొరకు వెదకిన తర్వాతే అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే మనమే నిర్ణయం తీసుకున్నా, మనం అపొస్తలుడైన పౌలు పలికిన ఈ మాటలు మదిలో ఉంచుకోవాలి: “ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను.” (రోమీయులు 14:​11) మనం ముందు గమనించినట్లుగా, యెహోవా తన సేవకుల్లో ప్రతి ఒక్కరూ పరిస్థితులెలావున్నా అన్ని సందర్భాల్లోనూ నమ్మకంగా నిలిచివుండాలని కోరుతున్నాడు. ఆయన సేవకుల్లో నేడు కొందరు పరీక్షలను, హింసను ఎదుర్కొంటున్నారు; మరితరులు బహుశా భవిష్యత్తులో ఎదుర్కోవచ్చు. ఏదోకరీతిలో ప్రతి ఒక్కరు పరీక్షింపబడతారు, మినహాయింపబడతామని ఎవ్వరూ ఆశించకూడదు. (యోహాను 15:​19, 20) యెహోవా సమర్పిత సేవకులముగా మనం, యెహోవా నామాన్ని పరిశుద్ధపరచడంలో, ఆయన సర్వాధిపత్యం సత్యమని నిరూపించడంలో ఇమిడివున్న విశ్వవివాదాంశం నుండి వైదొలగలేము.​—⁠యెహెజ్కేలు 38:23; మత్తయి 6:9, 10.

“కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు”

10 యేసు, అపొస్తలులు ఒత్తిడి క్రింద ఉన్నప్పుడు ప్రతిస్పందించిన వైఖరి నుండి మనం నేర్చుకోగల మరో ప్రాముఖ్యమైన సూత్రం ఏమిటంటే, మనల్ని హింసించే వారిపై మనం ఎన్నడూ పగతీర్చుకోకూడదన్నదే. యేసు గాని ఆయన అనుచరులు గాని తమను హింసించేవారితో పోరాడేందుకు ఒక విధమైన ప్రతిఘటన ఉద్యమాన్ని లేవదీశారనో హింసకు పాల్పడ్డారనో సూచించేదేదీ బైబిల్లో మనకెక్కడా కనబడదు. దానికి బదులుగా, అపొస్తలుడైన పౌలు “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు” అని క్రైస్తవులకు ఉపదేశించాడు. “ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి—పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.” అంతేగాక “కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.”​—⁠రోమీయులు 12:17-21; కీర్తన 37:1-4; సామెతలు 20:22.

11 తొలి క్రైస్తవులు ఆ ఉపదేశాన్ని హృదయపూర్వకంగా స్వీకరించారు. చరిత్రకారుడైన సీసల్‌ జె. కాడూ ది ఎర్లీ చర్చ్‌ అండ్‌ ద వరల్డ్‌ అనే తన పుస్తకంలో సా.శ. 30-70 మధ్యకాలంలో ప్రభుత్వంయెడల క్రైస్తవులకున్న దృక్పథాన్ని వర్ణిస్తున్నాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “ఈ కాలంలో క్రైస్తవులు హింసను బలంగా ప్రతిఘటించేందుకు ప్రయత్నించారనడానికి సూటిగా మనకు ఏ రుజువు లేదు. వారు తమ పాలకులను తీవ్రంగా ఖండించడమో లేక కనబడకుండా పారిపోయి వారిని తికమక పెట్టడమో చేశారు. అయితే హింసకు సాధారణ క్రైస్తవ ప్రతిస్పందన మోతాదుకు మించలేదు, క్రీస్తుకు విధేయులుగా ఉండడానికి విరుద్ధంగా ఉన్నాయని భావించిన ఆజ్ఞలను స్థిరంగా తిరస్కరించేవారు.”

12 అలాంటి మెతక స్వభావంలా కనిపించేది నిజంగా జ్ఞానయుక్తమేనా? ఆ విధంగా ఉండడం వారిని తుడిచేయాలని కంకణం కట్టుకున్న వారికి సులభంగా దొరికేటట్టు చేయదా? ఆత్మరక్షణ చేసుకోవడం వివేకవంతం కాదా? మానవుల దృష్టితోచూస్తే, అది సరైనదిగానే కనిపించవచ్చు. అయితే యెహోవా సేవకులముగా మనం అన్నివిషయాల్లో యెహోవా నిర్దేశాన్ని అనుసరించడం అత్యుత్తమ విధానమనే నమ్మకం మనకుంది. “మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును” అని పేతురు పలికిన మాటలను మనం మనస్సులో ఉంచుకుంటాము. (1 పేతురు 2:​20) పరిస్థితి యెహోవాకు బాగా తెలుసనీ, అనిశ్చితంగా పరిస్థితి అలాగే కొనసాగడానికి ఆయన అనుమతించడనే నమ్మకం మనకుంది. ఆ నమ్మకం మనకుందని మనమెలా నిశ్చయత కలిగివుండగలము? బబులోను చెరలోవున్న తన ప్రజలకు యెహోవా ఇలా ప్రకటించాడు: ‘మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడని యెంచుతాను.’ (జెకర్యా 2:⁠8) ఎవరైనా ఎంతకాలం తన కనుగుడ్డును ముట్టుకోవడాన్ని అనుమతిస్తారు? సరైన సమయంలో యెహోవా విడుదలను అనుగ్రహిస్తాడు. ఆ విషయంలో ఏవిధమైన సందేహం లేదు.​—⁠2 థెస్సలొనీకయులు 1:5-8.

13 ఈ విషయంలో, మనం మాదిరిగా యేసువైపు చూడగలం. గెత్సేమనే తోటలో ఆయన తన శత్రువులు తనను బంధించడానికి అనుమతించినప్పుడు, అది ఆయన తనను తాను రక్షించుకోలేక కాదు. నిజానికి ఆయన తన శిష్యులకు ఇలా చెప్పాడు: “ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువమంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొనిన యెడల—ఈలాగు జరుగవలెనను లేఖనము ఏలాగు నెరవేరును?” (మత్తయి 26:​53, 54) తత్ఫలితంగా తను బాధ అనుభవించాల్సివచ్చినా, యెహోవా చిత్తం నెరవేర్చడమే యేసుకు అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఉంది. “నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు” అని దావీదు వ్రాసిన ప్రవచనార్థక కీర్తనలోని మాటల్లో ఆయనకు పూర్తినమ్మకముంది. (కీర్తన 16:​10) చాలా సంవత్సరాల తర్వాత అపొస్తలుడైన పౌలు యేసును గురించి ఇలా అన్నాడు: “ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు.”​—⁠హెబ్రీయులు 12:​1-2.

యెహోవా నామము పరిశుద్ధపరచడంలోవున్న ఆనందం

14 అత్యంత కఠిన పరీక్షలో యేసును ఏ ఆనందం బలపరచింది? దేవుని ప్రియకుమారుడైన యేసు, యెహోవా సేవకులందరిలోకి నిశ్చయంగా సాతానుకు ప్రధాన లక్ష్యంగా ఉన్నాడు. కాబట్టి పరీక్షలో యేసు తన యథార్థతను కాపాడుకోవడం యెహోవాను నిందించే సాతానుకు తిరుగులేని జవాబిస్తుంది. (సామెతలు 27:​11) యేసు తాను పునరుత్థానం చేయబడినప్పుడు ఎంతటి ఆనందాన్ని, సంతృప్తిని పొందివుంటాడో మీరూహించగలరా? యెహోవా సర్వాధిపత్యం సత్యమని నిరూపించడంలోనూ ఆయన నామమును పరిశుద్ధ పరచడంలోనూ పరిపూర్ణ మానవునిగా తనకు అప్పగింపబడిన కార్యాన్ని తాను నెరవేర్చానని తెలుసుకుని ఆయన ఎంత సంతోషించి ఉంటాడో గదా! “దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున” కూర్చొనియుండడం యేసుకు నిస్సంశయంగా అద్భుతమైన సన్మానం అలాగే అత్యంత ఆనందానికి మూలకారణం.​—⁠కీర్తన 110:1, 2; 1 తిమోతి 6:15, 16.

15 అదే విధంగా, యేసు మాదిరిని అనుసరిస్తూ పరీక్షలను, హింసను సహించడం ద్వారా యెహోవా నామమును పరిశుద్ధ పరచడంలో భాగం కలిగివుండడం క్రైస్తవులకు ఆనందదాయకం. ఈ విషయంలో రెండవ ప్రపంచ యుద్ధ ముగింపు కాలంలో హీనాతిహీన సాక్సెన్‌హవుసన్‌ నిర్బంధ శిబిరంలో బాధ అనుభవించి ఘోర మరణ యాత్రలో బ్రతికి బయటపడ్డ సాక్షుల అనుభవం ఓ మచ్చుతునక. ఆ యాత్రలో తీవ్ర వాతావరణ పరిస్థితులు, వ్యాధి లేదా ఆకలి లేదా ఎస్‌ఎస్‌ గార్డులు దారివెంబడి క్రూరంగా హతమార్చిన కారణాలనుబట్టి వేలాదిమంది ఖైదీలు అసువులుబాసారు. అందులో 230 మంది సాక్షులు సన్నిహితంగావుంటూ ప్రాణాలకు తెగించి ఒకరినొకరు ఆదుకొంటూ బ్రదికి బయటపడ్డారు.

16 అలాంటి పైశాచిక హింసను భరించడానికి ఆ సాక్షులకు ఏది బలాన్నిచ్చింది? వారు సురక్షితంగా చేరుకున్న వెంటనే వారు “మెక్లెన్‌బర్గ్‌లోని షావెరిన్‌ దగ్గరున్న అడవిలో ఆరు దేశాలకు చెందిన 230 మంది యెహోవాసాక్షుల తీర్మానం” అనే దస్తావేజులో తమ ఆనందాన్ని, యెహోవాయెడల తమ కృతజ్ఞతను వ్యక్తంచేశారు. దానిలో వారిలా అన్నారు: “మాకు ఓ సుదీర్ఘ పరీక్షా సమయం ముగిసింది, అందులో కాపాడబడ్డవారు ఏ హానీ కలుగకుండా మండుతున్న కొలిమినుండి బయటకు లాగబడ్డట్టుగా కాపాడబడ్డారు. (దానియేలు 3:⁠27 చూడండి.) పరిస్థితికి భిన్నంగా, వారందరు యెహోవా నుండి సంపూర్ణ బలాన్ని, శక్తినిపొంది దైవపరిపాలనా ఆసక్తులను పురోగమింపజేసేందుకు రాజుయిచ్చే క్రొత్త ఆజ్ఞలకోసం అత్యాకాంక్షతో ఎదురుచూస్తున్నారు.” *

17 నమ్మకస్థులైన ఆ 230 మంది మాదిరిలానే, మనం ఇంతవరకు ‘రక్తము కారునంతగా ఎదిరించకపోయినా’ మన విశ్వాసం కూడా పరీక్షింపబడవచ్చు. (హెబ్రీయులు 12:⁠4) అయితే పరీక్ష అనేక విధాలుగా ఉండగలదు. అది తోటి విద్యార్థుల ఎగతాళి కావచ్చు లేదా లైంగిక దుర్నీతి, మరితర తప్పిదం చేయమని సన్నిహితులుతెచ్చే వత్తిడి కావచ్చు. వాటికితోడు రక్తం విసర్జించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉండడం, ప్రభువునందే వివాహం చేసుకోవడం లేదా విభాగిత కుటుంబంలో పిల్లలను విశ్వాసంలో పెంచడంవంటి విషయాల్లో కూడా కొన్నిసార్లు తీవ్ర ఒత్తిళ్లు, పరీక్షలు ఎదురుకావచ్చు.​—⁠అపొస్తలుల కార్యములు 15:29; 1 కొరింథీయులు 7:39; ఎఫెసీయులు 6:4; 1 పేతురు 3:1, 2.

18 అయితే మనకు ఎలాంటి పరీక్షవచ్చినా, మనం యెహోవాకు ఆయన రాజ్యానికి ప్రథమ స్థానం ఇచ్చినందున మనం బాధపడుతున్నామని మనకు తెలుసు, మరియు అలా చేయడం మన నిజమైన ఆధిక్యతని, ఆనందమని మనం పరిగణిస్తాం. “క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు” అని అభయపూర్వకంగా పలికిన పేతురు మాటలనుండి మనం ధైర్యాన్ని పొందుతాము. (1 పేతురు 4:​14) యెహోవా మహిమార్థమై, ఆయనకు స్తుతికలిగేలా ఆయన ఆత్మ బలమందు, అత్యంత కఠినమైన పరీక్షలను భరించే శక్తిమనకుంది.​—⁠2 కొరింథీయులు 4:7; ఎఫెసీయులు 3:16; ఫిలిప్పీయులు 4:13.

[అధస్సూచీలు]

^ పేరా 9 మలావీలో సాక్షులు దాదాపు మూడు దశాబ్దాలకంటే ఎక్కువకాలంపాటు భరించాల్సివచ్చిన భయంకరమైన, హత్యాపూర్వక హింసా పరంపరలో 1960వ దశాబ్దంలో జరిగిన సంఘటనలు కేవలం మొదటి విడత మాత్రమే. మొత్తం వృత్తాంతం కొరకు, 1999, యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం (ఆంగ్లం) 171-212 చూడండి.

^ పేరా 11 కావలికోట ఏప్రిల్‌ 1, 2003 11-14 పేజీల్లోని “‘అరారాతు దేశములోని’ సర్వోన్నత న్యాయస్థానం సత్యారాధనను సమర్థించింది” అనే ఆర్టికల్‌ చూడండి.

^ పేరా 21 ఈ తీర్మానపు పూర్తిపాఠం కొరకు, 1974, యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం (ఆంగ్లం) 208-9 పేజీలు చూడండి. ఆ యాత్రలో బ్రతికిబయటపడ్డ ప్రత్యక్షసాక్షి కథనం కావలికోట 1998 జనవరి 1, 25-9 పేజీల్లో ఇవ్వబడింది.

మీరు వివరించగలరా?

• బాధను, హింసను క్రైస్తవులు ఎలా దృష్టిస్తారు?

• పరీక్షింపబడినప్పుడు యేసు, ఇతర విశ్వాసులు ప్రతిస్పందించిన తీరునుండి మనమేమి నేర్చుకోగలము?

• మనం హింసించబడినప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం ఎందుకు జ్ఞానయుక్తం కాదు?

• యేసుకు కలిగిన పరీక్షల్లో ఆయనను ఏ ఆనందం కాపాడింది, దీనినుండి మనమేమి నేర్చుకోగలము?

[అధ్యయన ప్రశ్నలు]

1. నిజ క్రైస్తవులు తమ సమర్పణకు తగినట్టు జీవించాలని కోరుకుంటారు కాబట్టి, ఏ ప్రశ్న పరిశీలించడం అవసరం?

2. పరీక్షలను, బాధను అనుభవించడాన్ని క్రైస్తవులు ఎలా దృష్టిస్తారు?

3. బైబిలులో ప్రస్తావించబడిన, హింసతో వ్యవహరించే ఏ ఉదాహరణలను మీరు వివరించగలరు? (తర్వాతి పేజీలోవున్న “హింసతో వారెలా వ్యవహరించారు” అనే బాక్సు చూడండి.)

4. పరీక్షింపబడినప్పుడు యేసు, నమ్మకస్థులైన ఇతర సేవకులు ప్రతిస్పందించిన తీరును గురించి ఏమి చెప్పవచ్చు?

5. మలావీలో 1960వ దశాబ్దంలో ఎలాంటి హింస చెలరేగింది, అక్కడి సాక్షులు ఎలా ప్రతిస్పందించారు?

6. భయంకరమైన హింస ఉన్నప్పటికీ మలావీలోని సాక్షులు ఏమిచేశారు?

7, 8. వ్యతిరేకత సమస్యలు కలిగిస్తున్నా, ఏ కారణాలవల్ల కొందరు వదిలివెళ్లకూడదని నిర్ణయించుకున్నారు?

9. హింసనుబట్టి ఆ ప్రాంతంలోనే ఉండాలా లేక వేరొకచోటికి వెళ్లాలా అనేది నిర్ణయించుకొనేటప్పుడు ఒక వ్యక్తి ఏ అంశాలు ఆలోచించాలి?

10. ఒత్తిళ్లు, హింసలతో వ్యవహరించడంలో యేసు, అపొస్తలులు మనకు ఏ ప్రాముఖ్యమైన మాదిరి ఉంచారు?

11. ప్రభుత్వంయెడల తొలి క్రైస్తవుల దృక్పథాన్ని గురించి ఒక చరిత్రకారుడు ఏమని చెప్పాడు?

12. ప్రతీకారం తీర్చుకునే బదులు బాధను సహించడం ఎందుకు మంచిది?

13. యేసు ఎదిరించకుండా శత్రువులు తనను బంధించేలా ఎందుకు అనుమతించాడు?

14. తన పరీక్షలన్నింటిలో యేసును ఏ ఆనందం బలపరచింది?

15, 16. సాక్సెన్‌హవుసన్‌లో సాక్షులు ఎలాంటి పైశాచిక హింసను భరించారు, అలా భరించడానికి వారిని ఏది బలపరచింది?

17. దేవుని ప్రజలిప్పుడు ఏ విధమైన పరీక్షలను ఎదుర్కొంటున్నారు?

18. అత్యంత అసాధారణ పరీక్షను సహితం మనం భరించగలమనేందుకు మనకు ఏ అభయంవుంది?

[15వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

హింసతో వారెలా వ్యవహరించారు

• రెండు సంవత్సరాలు అంతకంటే చిన్న వయస్సుగల మగ శిశువులందరిని చంపేందుకు హేరోదు సైనికులు బేత్లెహేముకు చేరకముందే, దేవదూత నిర్దేశంతో యోసేపు మరియలు శిశువుగావున్న యేసును తీసుకుని ఐగుప్తుకు పారిపోయారు.​—⁠మత్తయి 2:13-16.

• యేసు పరిచర్యా కాలంలో అనేకమార్లు, ఆయన శక్తిమంతమైన సాక్ష్యం కారణంగా శత్రువులు ఆయనను చంపజూశారు. ప్రతి సందర్భంలో యేసు తప్పించుకు పారిపోయాడు.​—⁠మత్తయి 21:45, 46; లూకా 4:28-30; యోహాను 8:57-59.

• యేసును బంధించడానికి సైనికులు, బంట్రౌతులు గెత్సేమనే తోటకు వచ్చినప్పుడు, ఆయన బాహాటంగా తానెవరో గుర్తింపజేసుకుంటూ రెండుసార్లు వారికిలా చెప్పాడు: “ఆయనను నేనే.” ఏ విధంగానూ ఎదిరించకుండా ఆయన తన అనుచరులను సహితం ఆపుజేసి, ఆ గుంపు తనను తీసుకెళ్లేందుకు అనుమతించాడు.​—⁠యోహాను 18:3-12.

• యెరూషలేములో పేతురు, ఇతరులు బంధింపబడి, కొరడాలతో కొట్టబడి యేసు నామమున బోధింపకూడదని ఆజ్ఞాపించబడ్డారు. అయినప్పటికీ విడుదలైన వెంటనే వారు, “వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.”​—⁠అపొస్తలుల కార్యములు 5:40-42.

• ఆ తర్వాత అపొస్తలుడైన పౌలుగా మారిన సౌలు తనను హతమార్చేందుకు దమస్కులోని యూదులు కుట్రపన్నారని తెలుసుకున్నప్పుడు, సహోదరులు ఆయనను ఒక గంపలో ఉంచి, రాత్రివేళ ఆ నగర ప్రాకారపు సందుగుండా గోడవెంబడి ఆయనను క్రిందికి దించగా ఆయన తప్పించుకున్నాడు.​—⁠అపొస్తలుల కార్యములు 9:22-25.

• చాలా సంవత్సరాల తర్వాత, పౌలు విషయంలో “మరణమునకైనను బంధకములకైనను తగిన దేమియు” గవర్నరు ఫేస్తుకు, రాజైన అగ్రిప్పకు కనబడకపోయినా, ఆయన కైసరుకు విన్నవించుకోవడానికి కోరుకున్నాడు.​—⁠అపొస్తలుల కార్యములు 25:10-12, 24-27; 26:30-32.

[16, 17వ పేజీలోని చిత్రం]

తీవ్ర హింస పారిపోయేలా ఒత్తిడితెచ్చినా మలావీలోని వేలాదిమంది సాక్షులు ఆనందంగా రాజ్యసేవను కొనసాగించారు

[17వ పేజీలోని చిత్రం]

నాజీ మరణ యాత్రలో, నిర్బంధ శిబిరాల్లో యెహోవా నామమును పరిశుద్ధపరిచే ఆనందం ఈ సాక్షులను సంరక్షించింది

[చిత్రసౌజన్యం]

మరణ యాత్ర: KZ-Gedenkstätte Dachau, courtesy of the USHMM Photo Archives

[18వ పేజీలోని చిత్రాలు]

పరీక్షలు, ఒత్తిళ్లు ఎన్నో విధాలుగా కలుగవచ్చు