ప్రశ్నలు అనేకం సంతృప్తికరమైన జవాబులు కొన్నే
ప్రశ్నలు అనేకం సంతృప్తికరమైన జవాబులు కొన్నే
నవంబరు 1, 1755 ఆల్ సెయింట్స్ డే పండుగ రోజు ఉదయం, నగరవాసుల్లో చాలామంది చర్చిలోవున్నారు. అదేసమయంలో లిస్బన్ నగరంలో తీవ్ర భూకంపం సంభవించింది. వేలకొలది భవంతులు కూలిపోయాయి, వేలసంఖ్యలో ప్రజలు మరణించారు.
ఆ విషాదం జరిగిన కొద్దికాలానికి, ఫ్రెంచి రచయిత వొల్తేర్ తన పోయెమ ష్యూర్ లె డాసస్ట్ర డె లీస్‌బొన్ (లిస్బాన్ విపత్తుపై కావ్యం) ప్రచురించాడు. అందులో ప్రజల పాపాలకు దేవుడు విధించిన శిక్షే ఆ దుర్ఘటన అనే వాదనను ఆయన తోసిపుచ్చాడు. అలాంటి వినాశకరమైన ఘటనలు మానవుని అవగాహనకు లేక వివరణకు అందనివని చెబుతూ వొల్తేర్ ఇలా వ్రాశాడు:
దేవుని గురించి ప్రశ్నించినవారిలో వొల్తేర్ మొదటివాడేమీ కాదు. మానవ చరిత్రంతటా విషాద ఘటనలు, విపత్తులు ప్రజల మనస్సుల్లో ప్రశ్నలు లేవదీశాయి. వేల సంవత్సరాల క్రితం, తన పిల్లలందరినీ కోల్పోయి భయంకరమైన వ్యాధికి గురైన పితరుడగు యోబు ఇలా అడిగాడు: “దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల? దుఃఖాక్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల?” (యోబు 3:20) మంచివాడు, ప్రేమగలవాడు అయిన దేవుడు ఇంత బాధ, అన్యాయం జరుగుతుంటే ఉదాసీనంగా ఎలా ఉండగలుగుతున్నాడని నేడు చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
కరవు, అనారోగ్యం, మరణం వంటి వాటిని నిజంగా ఎదుర్కొన్న అనేకమంది, మానవాళిపై శ్రద్ధ చూపించే సృష్టికర్త ఉన్నాడనే తలంపును పూర్తిగా తోసివేస్తారు. నాస్తికుడైన ఒక తత్త్వవేత్త ఇలా వ్యాఖ్యానించాడు: “ఓ పసివాడు బాధ అనుభవిస్తున్నాడంటే దానికి దేవుడే నిందార్హుడు . . . ఆయన ఉనికిలో లేకుంటే తప్ప.” రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన సర్వనాశనం వంటి విషాదకర సంఘటనలు ఇలాంటి అభిప్రాయాలకే దారితీస్తాయి. ఒక యూదా రచయిత వ్రాసిన న్యూస్‌లెటర్‌లోని ఈ వ్యాఖ్యానాన్ని గమనించండి: “మానవ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే దేవుడే లేడనడానికి సరళమైన వివరణ, ఆష్‌విట్స్ అనడంలో సందేహం లేదు.” ప్రముఖ క్యాథలిక్ దేశమైన ఫ్రాన్స్‌లో 1977లో జరిపిన ఒక సర్వేక్షణ ప్రకారం, ఆ దేశంలో 40 శాతం మంది, 1994లో రువాండాలో జరిగిన జాతి ప్రక్షాళన వంటి వాటినిబట్టి దేవుని ఉనికిని సందేహిస్తున్నారు.
విశ్వాసానికి ఆటంకమా?
విషాద ఘటనలు జరగకుండా దేవుడెందుకు జోక్యం చేసుకోడు? ఈ ప్రశ్న చాలామంది “విశ్వాసానికి
గంభీరమైన ఆటంకం” అని ఒక క్యాథలిక్ వృత్తాంత రచయిత అంటున్నాడు. ఆయనిలా అడుగుతున్నాడు: “కోట్లాదిమంది అమాయకులు మరణిస్తుండగా, లోకంలో సామూహిక జన సంహారం జరుగుతుంటే ఆపేందుకు ఏమీ చేయకుండా నిస్సహాయునిగా చూస్తూ ఊరుకొనే దేవుణ్ణి నమ్మడం నిజంగా సాధ్యమా?”క్యాథలిక్ వార్తాపత్రిక ల క్రవలోని ఒక సంపాదకీయం కూడా అలాగే వ్యాఖ్యానించింది: “చరిత్రలోని విషాద ఘటనలు, సాంకేతిక పరిణామాలు, ప్రకృతి వైపరీత్యాలు, వ్యవస్థీకృత నేరాలు, ప్రియమైనవారి మరణం వంటివేవైనా సంభవించిన ప్రతిసారి భీతిచెందిన కళ్ళు ఆకాశం వైపు చూస్తాయి. దేవుడెక్కడున్నాడు? అని అవి వెదకుతాయి. ఆయన ఏమాత్రం స్పందనలేనివాడు, శ్రద్ధ లేనివాడు కదూ?”
ఈ వివాదాంశాన్ని పోప్ జాన్ పాల్ II, 1984లో వ్రాసిన అపొస్తలిక్ లెటర్ సాల్వీఫీకీ డోలోరీస్‌లో ప్రస్తావించాడు. ఆయనిలా వ్రాశాడు: “దేవుని ఉనికిని, ఆయన జ్ఞానమును, శక్తిని, గొప్పతనాన్ని తెలుసుకునేందుకు కళ్ళకు కట్టినట్లు ఈ లోకం ఉన్నప్పటికీ, దుష్టత్వం మరియు బాధలు, కొన్నిసార్లు తీవ్ర రీతిలో ప్రత్యేకించి దినదినం అన్యాయంగా బాధలు అనుభవించేలా చేస్తున్న అనేక సంఘటనలు, సరైన శిక్షపడని అనేక అపరాధాలు వాటిని కనుమరుగు చేస్తున్నాయనిపిస్తోంది.”
ఎంతో ప్రేమగలవాడు, సర్వశక్తిగలవాడు ఉనికిలో ఉన్నాడని బైబిలు తెలియజేస్తున్న దేవునికి, నేడు జరుగుతున్న మానవుల బాధలకు పొంతన ఉందా? ఆయన విడివిడిగా గానీ లేక మూకుమ్మడిగా గానీ విషాదాలను ఆపడానికి జోక్యం చేసుకుంటాడా? నేడు మన కోసం ఆయనేమైనా చేస్తాడా? వొల్తేర్ అన్నట్లు, ఈ ప్రశ్నలకు జవాబులిచ్చేందుకు, “మానవజాతితో మాట్లాడే దేవుడు” ఉన్నాడా? జవాబు కోసం దయచేసి దీని తర్వాతి ఆర్టికల్ చదవండి.
ప్రకృతి మూగది, మనం దాన్ని ప్రశ్నించడం వ్యర్థం;
మానవజాతితో మాట్లాడే దేవుడే మనకు కావాలి.
[3వ పేజీలోని చిత్రం]
లిస్బాన్‌లో 1755లో జరిగిన విధ్వంసం, అలాంటి సంఘటనలు మానవ అవగాహనకు అందనివని వొల్తేర్ ప్రకటించేలా చేసింది
[చిత్రసౌజన్యం]
వొల్తేర్: From the book Great Men and Famous Women; లిస్బన్: J.P. Le Bas, Praça da Patriarcal depois do terramoto de 1755. Foto: Museu da Cidade/Lisboa
[4వ పేజీలోని చిత్రం]
రువాండాలో జరిగినటువంటి జాతి ప్రక్షాళనలవల్ల చాలామంది దేవుని ఉనికిని సందేహిస్తున్నారు
[చిత్రసౌజన్యం]
AFP PHOTO