కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిర్ణయాలు తీసుకోవడం ఒక అనివార్యమైన సవాలు

నిర్ణయాలు తీసుకోవడం ఒక అనివార్యమైన సవాలు

నిర్ణయాలు తీసుకోవడం ఒక అనివార్యమైన సవాలు

“నిర్ణయాలు తీసుకోవడంకంటే క్లిష్టమైనది మరొకటి లేదు, కాబట్టి నిర్ణయాలు తీసుకోవడం ఎలాగో తెలిసివుండడమనేది అత్యంత విలువైన నిధి” అని 19వ శతాబ్దపు ఫ్రాన్స్‌ చక్రవర్తి నెపోలియన్‌ బొనెపార్ట్‌ ఒకసారి అన్నాడు. సాధారణంగా ప్రజలు తమ జీవితాలు తమ అదుపులోనే ఉండడాన్ని విలువైనదిగా ఎంచుతారు. కాబట్టి, నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించిన ఆ రెండు అంశాలూ నిజమేనని మీరు అంగీకరిస్తుండవచ్చు. అదే సమయంలో, కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడమనేది చాలా కష్టమని వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.

నిర్ణయాలు తీసుకోవడమనేది సులభమైనా, కష్టమైనా, అది అనివార్యమైనది. మనం ప్రతిరోజు నిర్ణయాలు తీసుకోవాలి. ఉదయం నిద్ర లేచిన తర్వాత, ఎలాంటి దుస్తులు ధరించాలి, భోజనానికి ఏమి తినాలి, ఆ రోజు ఎదురయ్యే అనేక ఇతర విషయాలతో ఎలా వ్యవహరించాలి అనే విషయాలకు సంబంధించి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాల్లో అధికశాతం సాధారణమైనవి. మనం ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత వాటి గురించి మళ్ళీ ఆలోచించము. ఆ నిర్ణయాలు జ్ఞానయుక్తమైనవా కావా అని ఆలోచిస్తూ మనం నిద్ర పాడుచేసుకోము.

మరోవైపున కొన్ని నిర్ణయాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ప్రపంచంలోని యౌవనస్థులు అనేకులు తాము ఎలాంటి లక్ష్యాలను పెట్టుకోవాలనే విషయంలో నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి విద్యాభ్యాసం అవసరం, ఎంతవరకు చదువుకోవడం అవసరం అనే విషయాలను వారు నిర్ణయించుకోవలసి రావచ్చు. చివరకు వారిలో అధికశాతం వివాహం చేసుకోవాలా లేదా అవివాహితులుగా ఉండిపోవాలా అనే విషయంలో నిర్ణయం తీసుకుంటారు. వివాహం చేసుకోవాలనుకునేవారు ఈ విషయాలను నిర్ణయించుకోవాలి: ‘నాకు వివాహం చేసుకొనేంత వయస్సు, పరిణతి ఉన్నాయా? నాకు ఎలాంటి భాగస్వామి కావాలి, లేదా మరింత ప్రాముఖ్యంగా, నాకు ఎలాంటి భాగస్వామి అవసరం?’ వివాహ భాగస్వామి విషయంలో మనం తీసుకునే నిర్ణయం మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది.

ఎక్కువ ప్రాముఖ్యతగల విషయాలకు సంబంధించి జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడం ఆవశ్యకం ఎందుకంటే మనం జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడంపైనే మన సంతోషం ఆధారపడివుంటుంది. కొంతమంది ప్రజలు తాము ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో సమర్థులమని భావించి, ఇతరులు సహాయం అందించినప్పుడు దానిని నిరాకరించవచ్చు. అది జ్ఞానయుక్తమేనా? మనం పరిశీలిద్దాం.

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

నెపోలియన్‌: From the book The Pictorial History of the World