కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బహుమతి గెలుచుకోవడానికి ఆశానిగ్రహం పాటించండి

బహుమతి గెలుచుకోవడానికి ఆశానిగ్రహం పాటించండి

బహుమతి గెలుచుకోవడానికి ఆశానిగ్రహం పాటించండి

“పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును [“ఆశానిగ్రహం పాటిస్తాడు,” Nw].”​—1 కొరింథీయులు 9:25.

మీరొక యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకొనుంటే, నిత్యజీవమనే బహుమానంగల పందెంలో పాల్గొనడానికి మీరు ఇష్టపడుతున్నారని బహిరంగంగా వెల్లడిచేసిన వారయ్యారు. యెహోవా చిత్తం చేయడానికి మీరు అంగీకరించారు. యెహోవాకు సమర్పించుకోవడానికి ముందు, మన సమర్పణ అర్థవంతంగా ఉండడానికి, దేవునికి అంగీకారయోగ్యంగా ఉండడానికి మనలో చాలామంది గుర్తించదగిన మార్పులు చేసుకోవలసి వచ్చింది. “మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశలవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదులుకొని . . . నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొ[నుడి]” అని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకిచ్చిన ఉపదేశాన్ని మనం అనుసరించాము. (ఎఫెసీయులు 4:​22-24) వేరే మాటల్లో చెప్పాలంటే, దేవునికి సమర్పించుకోవడానికి ముందే, ఆమోదయోగ్యంకాని జీవన విధానాన్ని మనం తృణీకరించాల్సివచ్చింది.

2 యెహోవాసాక్షులు కాగలవారు వదులుకోవాల్సిన ప్రాచీన స్వభావపు లక్షణాలు కొన్ని దేవుని వాక్యంలో సూటిగా ఖండించబడ్డాయి. కొరింథీయులకు వ్రాసిన తన లేఖలో పౌలు వాటిలో కొన్నింటిని ఇలా పేర్కొన్నాడు: “జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.” ఆ తర్వాత ఆయన మొదటి శతాబ్దపు క్రైస్తవులు అవసరమైన మార్పులు చేసుకున్నారని చెబుతూ ఇంకా ఇలా అన్నాడు: “మీలో కొందరు అట్టివారై యుంటిరి.” పౌలు యుంటిరి అన్నాడేగాని యున్నారు అనలేదని గమనించండి.​—⁠1 కొరింథీయులు 6:​9-11.

3 అదనపు మార్పులు కూడా అవసరం కావచ్చునేమో అని సూచిస్తూ ఆయన ఇలా కొనసాగించాడు: “అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు.” (1 కొరింథీయులు 6:​12) అందువల్ల, నేడు యెహోవాసాక్షులుగా ఉండాలని కోరుకొనే చాలామంది, తమకు చేయగల స్వాతంత్ర్యమున్నా ప్రయోజనంలేని లేదా విలువలేని పనులు చేయకూడదనే అవసరాన్ని గుర్తిస్తారు. ఇవి కాలంవృధా చేసేవిగా ఉంటూ మరి ప్రాముఖ్యమైన సంగతులను వెంబడించకుండా వారిని పరధ్యానంలో పడవేయవచ్చు.

4 దేవునికి చేసుకునే సమర్పణ ఇష్టపూర్వకంగా చేసుకొనేదే గానీ ఏదో పెద్ద త్యాగం చేస్తున్నట్లు సణుగుతూ చేసుకొనేది కాదు. క్రీస్తు అనుచరుడైన తర్వాత ఇలాచెప్పిన పౌలుతో సమర్పిత క్రైస్తవులు అంగీకరిస్తారు: “నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.” (ఫిలిప్పీయులు 3:⁠8) పౌలు తాను నిరంతరం దేవుని పక్షాన ఉండడానికి, అల్పవిలువగల వాటిని సంతోషంగా తృణీకరించాడు.

5 తన ఆధ్యాత్మిక పరుగుపందెంలో పౌలు ఆశానిగ్రహం పాటిస్తూ చివరకు ఇలా చెప్పగలిగాడు: “మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును.” (2 తిమోతి 4:​7, 8) ఏదోక రోజు మనం కూడా అలాంటి మాటలే వ్యక్తంచేయగలమా? ఒకవేళ మనం అవిశ్రాంతంగా, సంపూర్ణంగా మన క్రైస్తవ పరుగును తుదముట్టిస్తూ ఆశానిగ్రహం పాటించినట్లయితే మనం ఖచ్చితంగా అలా చెప్పగలం.

మేలుచేయడానికి ఆశానిగ్రహం అవసరం

6 బైబిల్లో “ఆశానిగ్రహం” అని తర్జుమా చేయబడిన హీబ్రూ, గ్రీకు పదాలు అక్షరార్థంగా ఒక వ్యక్తికి తనపై తనకు గల బలాన్ని లేదా నియంత్రణను సూచిస్తాయి. అవి తరచూ చెడు చేయకుండా ఒక వ్యక్తి తననుతాను నిగ్రహించుకోవడమనే తలంపును అందజేస్తాయి. అయితే సత్క్రియలు చేయడంలో మన శరీరాలను ఉపయోగించాలంటే కూడా తగినమోతాదులో ఆశానిగ్రహం చూపాల్సివుంటుందన్నది స్పష్టం. తప్పుచేయడమే అసంపూర్ణ మానవ నైజం, కాబట్టి మనకు ద్వివిధ పోరాటం ఉంది. (ప్రసంగి 7:29; 8:​11) తప్పుచేయకుండా నిగ్రహించుకుంటూనే మంచి చేయడానికి మనల్ని మనం ప్రోద్బలించుకోవాలి. నిజానికి, మంచి చేయడానికి మన శరీరాన్ని నియంత్రించుకోవడం తప్పు చేయకుండా ఉండడానికి ఒక శ్రేష్ఠమైన విధానం.

7 దేవునికి చేసుకున్న సమర్పణకు తగ్గట్టు మనం చివరి వరకు కొనసాగాలంటే నిస్సంశయంగా, ఆశానిగ్రహం ఆవశ్యం. మనం దావీదు వలెనే ఇలా ప్రార్థించాలి: “దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.” (కీర్తన 51:​10) నైతిక తప్పులకు లేదా శరీరకంగా హానికలిగించే వాటికి దూరంగా ఉండడంలోని ప్రయోజనాలను మనం ధ్యానించవచ్చు. వాటిని నివారించకపోతే కలిగే వివిధరకాల హాని గురించి ఆలోచించండి, అవేమిటంటే ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు, పాడైన సంబంధాలు, చివరికి అకాల మరణం. మరోవైపున, యెహోవా నిర్దేశించే జీవ మార్గానికి హత్తుకొని ఉండడంలోవున్న అనేక ప్రయోజనాలను గురించి ఆలోచించండి. అయితే, వాస్తవిక దృష్టిగలవారిగా మనం మన హృదయం మోసకరమైనదని మరచిపోకూడదు. (యిర్మీయా 17:⁠9) యెహోవా నియమాలను సమర్థించడం యొక్క గాంభీర్యతను తగ్గించడానికి మన హృదయంచేసే ప్రయత్నాలను అడ్డగించేందుకు మనం దృఢసంకల్పంతో ఉండాలి.

8 అయిష్ట శరీరం తరచూ ఇష్ట స్వభావపు ఆసక్తిని చల్లార్చడానికి ప్రయత్నిస్తుందని మనలో చాలామందికి అనుభవపూర్వకంగా తెలుసు. ఉదాహరణకు, రాజ్య ప్రకటననే తీసుకోండి. ఈ జీవానుగ్రహ పనిలో భాగం వహించేందుకు మానవులకున్న ఇష్టాన్ని బట్టి యెహోవా ఆనందిస్తాడు. (కీర్తన 110:3; మత్తయి 24:​14) మనలో చాలామందికి, బహిరంగంగా ప్రకటించడాన్ని నేర్చుకోవడం అంత సులభంకాదు. సులభ దారి వెదికేలా మన శరీరాన్ని అనుమతించడానికి బదులు, దానిని నియంత్రిస్తూ ‘నలుగగొట్టి లోపరచుకోవడం’ ఆ కాలంలో అవసరమయ్యింది​—⁠ఇప్పుడు కూడా అవసరం కావచ్చు.​—⁠1 కొరింథీయులు 9:16, 27; 1 థెస్సలొనీకయులు 2:⁠2.

‘అన్నింటిలో’?

9 ‘అన్నింటిలో ఆశానిగ్రహం’ పాటించండనే బైబిలు ఉపదేశం కేవలం మన ఉద్రేకాన్ని నియంత్రించుకోవడం, దుర్నీతి ప్రవర్తనకు దూరంగా ఉండడంకంటే మరెక్కువే ఇమిడివుందని సూచిస్తోంది. ఈ రంగాల్లో మనం ఆశానిగ్రహం సాధించామని మనమనుకోవచ్చు, అదే నిజమైతే మనం కృతజ్ఞతతో ఉండవచ్చు. అయినప్పటికీ, ఆశానిగ్రహం అవసరత అంతగా కనిపించని జీవితపు ఇతర రంగాల మాటేమిటి? ఉదాహరణకు, ఉన్నత జీవ ప్రమాణాలుగల ఓ మోస్తరు సంపన్న దేశంలో మనం జీవిస్తున్నామనుకుందాం. అనవసర ఖర్చులకు వద్దు అని చెప్పేందుకు నేర్చుకోవడం జ్ఞానయుక్తం కాదా? లభ్యమవుతోందని, నచ్చిందని, కొనగలమని, చూసిందల్లా కొనకుండా ఉండడాన్ని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. అయితే అలాంటి ఆదేశం ప్రభావం చూపాలంటే, తల్లిదండ్రులు మాదిరికరంగా ఉండాలి.​—⁠లూకా 10:38-42.

10 లేమిలో జీవించ నేర్చుకోవడం మన ఇచ్ఛాశక్తిని బలపరుస్తుంది. అంతేకాకుండా అది మనకున్న వస్తువులపట్ల కృతజ్ఞతా భావాన్ని పెంచుతుంది, అలా ఎంచుకున్నందుకు కాదుగాని అవసరాన్నిబట్టి కొద్దిపాటి వస్తువులతోనే జీవిస్తున్న వారిపట్ల మనం మరింత సానుభూతిగా మెలిగేటట్లు చేయగలదు. నిజమే, నమ్రతగల జీవనవిధానం “నీ మేలు నువ్వుచూసుకో” లేదా “మీరు శ్రేష్ఠమైనదానికి అర్హులు” వంటి జనసమ్మత దృక్పథాలకు భిన్నంగా ఉంటుంది. క్షణికానందపు కోరికను ప్రపంచ వ్యాపార ప్రకటనా రంగం ప్రోత్సహిస్తోంది, అయితే అది దాని సొంత వ్యాపారలబ్ది కోసమే అలా చేస్తోంది. ఈ పరిస్థితి ఆశానిగ్రహం ప్రదర్శించేందుకు మనం చేసే ప్రయత్నాలను ఆటంకపరచవచ్చు. ఐరోపాలోని ఓ సంపన్న దేశపు పత్రిక ఇటీవల ఇలా పేర్కొంది: “తీవ్ర దారిద్ర్య బాధాకర పరిస్థితుల్లో జీవిస్తున్నవారికే అవాంఛిత ప్రవృత్తులను అదుపులో ఉంచుకోవడానికి అంతరంగ పోరాటం అవసరమైతే, నేటి సుసంపన్న సమాజంలో పాలుతేనెలు ప్రవహించు దేశాల్లో జీవించే వారి విషయంలో ప్రత్యేకంగా అదెంత సత్యమో గదా!”

11 మనం కోరేదానికి మనకు నిజంగా అవసరమైనదానికి మధ్య తేడా తెలుసుకోవడానికి మనకు కష్టమైతే, మనం బాధ్యతారహితంగా ప్రవర్తించకుండా ఖాయపరచే చర్యలు తీసుకోవడం సహాయకరంగా ఉండవచ్చు. ఉదాహరణకు, హద్దులేకుండా ఖర్చుచేయడంవైపు మొగ్గుచూపే కోరికకు భిన్నంగా ప్రవర్తించాలని మనం ఇష్టపడుతుంటే, ఏదీ అప్పుగా కొనకూడదని మనస్సులో నిర్ణయించుకోవచ్చు, లేదా షాపింగ్‌కు వెళ్లేటప్పుడు తగుమాత్రమే డబ్బు తీసుకెళ్లవచ్చు. “సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది” అని పౌలు చెప్పాడని గుర్తుతెచ్చుకోండి. ఆయనిలా తర్కించాడు: “మనమీ లోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.” (1 తిమోతి 6:​6-8) మనం తృప్తిపొందామా? స్వీయానంద అతిపోకడలు ఏ రూపంలోవున్నా, అవేవీ లేకుండా నిరాడంబరంగా జీవించ నేర్చుకోవడానికి ఇచ్ఛాశక్తి, ఆశానిగ్రహం అవసరం. అయితే అది నేర్చుకోదగిన ఓ విలువైన పాఠం.

12 క్రైస్తవ కూటాలకు, సమావేశాలకు హాజరుకావడంలో కూడా ప్రత్యేక తరహాలో ఆశానిగ్రహం ప్రదర్శించడం ఒక భాగమైవుంది. ఉదాహరణకు, కార్యక్రమం జరిగేటప్పుడు మనస్సు గాలికి తిరక్కుండా చూసుకోవాలంటే ఆ లక్షణం కావాలి. (సామెతలు 1:⁠5) ప్రక్కవారి చెవుల్లో గుసగుసలాడుతూ ఇతరులకు అంతరాయం కలిగించడానికి బదులు ప్రసంగీకునికి మన పూర్తి అవధానమివ్వడానికి ఆశానిగ్రహం పాటించాల్సి ఉంటుంది. మనం సమయానికి చేరుకునేలా మన పట్టికను సవరించుకోవడానికి ఆశానిగ్రహం అవసరం కావచ్చు. అంతేకాకుండా, కూటాలకు సిద్ధపడడానికి సమయం కేటాయించి, ఆ పిమ్మట వాటిలో భాగంవహించేందుకు కూడా ఆశానిగ్రహం కావాల్సివుంటుంది.

13 చిన్న విషయాల్లో ఆశానిగ్రహం పాటించడం పెద్ద విషయాల్లోనూ అలా పాటించే మన సామర్థ్యాన్ని బలపరుస్తుంది. (లూకా 16:​10) కాబట్టి, క్రమంగా దేవుని వాక్యాన్ని, బైబిలు సాహిత్యాలను చదవడానికి, వాటిని అధ్యయనం చేయడానికి, మనం నేర్చుకున్నవి ధ్యానించడానికి మనల్ని మనం క్రమశిక్షణలో ఉంచుకోవడం ఎంత చక్కని విషయమో గదా! అలాగే అనుచిత ఉద్యోగాలు, స్నేహాలు, దృక్పథాలు, వ్యక్తిగత అలవాట్ల విషయంలో మనల్ని మనం క్రమశిక్షణలో ఉంచుకోవడం లేదా దేవుని సేవకొరకైన అమూల్య సమయం మనకులేకుండా దోచుకోగల కార్యకలాపాలకు వద్దు అని చెప్పడానికి మనల్ని మనం క్రమశిక్షణలో ఉంచుకోవడం కూడా ఎంత జ్ఞానయుక్తమో గదా! యెహోవా సేవలో నిమగ్నలై ఉండడం, యెహోవా ప్రపంచవ్యాప్త సంఘ ఆధ్యాత్మిక పరదైసునుండి మనల్ని దూరం చేయగల కార్యాలనుండి నిశ్చయంగా కాపాడుతుంది.

ఆశానిగ్రహం పాటిస్తూ ఎదగండి

14 క్రొత్తగా జన్మించిన శిశువుకు ఆశానిగ్రహమేమిటో తెలియదు. పిల్లల ప్రవర్తనా నిపుణుల కరపత్రమొకటి ఇలా వివరిస్తోంది: “ఆశానిగ్రహం యాంత్రికంగా లేదా అకస్మాత్తుగా సంభవించదు. ఆశానిగ్రహం పాటించడం నేర్చుకోవడాన్ని ఆరంభించడానికి శిశువులకు, తప్పటడుగులు వేసేవారికి తల్లిదండ్రుల నిర్దేశం, మద్దతు అవసరం. . . . తల్లిదండ్రులు అలా నేర్పించడాన్ని నిర్దేశిస్తుండగా, పాఠశాల సంవత్సరాలన్నింటిలో ఆశానిగ్రహం వృద్ధవుతుంది.” ఓ స్థాయివరకు ఆశానిగ్రహం పాటించడం నేర్చుకున్న వారు “సాధారణంగా చక్కగా సర్దుకుపోయే వారిగా, అందరూ మెచ్చినవారిగా, సాహసపరులుగా, నమ్మకం గలవారిగా మరియు ఆధారపడదగిన వారిగా పెరిగారని” నాలుగు సంవత్సరాల పిల్లలపై జరిపిన అధ్యయనమొకటి వెల్లడించింది. ఈ పాఠం నేర్చుకోవడం ఆరంభించని వారు “ఎక్కువగా ఒంటరిగా తిరిగే వారిగా, సులభంగా విసుక్కునే వారిగా, మొండి వారిగా ఉన్నారు. వారు ఒత్తిడికి కృంగిపోయారు, సవాళ్లను ఎదుర్కోలేకపోయారు.” కాబట్టి స్పష్టమైన విషయమేమంటే, చక్కగా సర్దుకుపోయే పెద్దవారిగా ఎదగాలంటే పిల్లలు ఆశానిగ్రహం పాటించడం తప్పకుండా నేర్చుకోవాలి.

15 అదేవిధంగా, మనం పరిణతి చెందిన క్రైస్తవులుగా ఎదగాలంటే, మనం తప్పకుండా ఆశానిగ్రహం ప్రదర్శించడం నేర్చుకోవాలి. అది లేకపోవడం మనం ఇంకా ఆధ్యాత్మిక శిశువులుగానే ఉన్నామని సూచిస్తుంది. “బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి” అని బైబిలు మనకు ఉపదేశిస్తోంది. (1 కొరింథీయులు 14:​20) “విశ్వాసవిషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది, సంపూర్ణ పురుషులమగు[ట], అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు[ట]” మన లక్ష్యం. ఎందుకు? ఎందుకనగా, “మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండ[కుండా]” ఉండాలి. (ఎఫెసీయులు 4:​11, 14) అందువల్ల, ఆశానిగ్రహం పాటించడాన్ని నేర్చుకోవడం మన ఆధ్యాత్మికతకు అత్యంత ప్రాముఖ్యం.

ఆశానిగ్రహం పెంపొందించుకోవడం

16 ఆశానిగ్రహం పెంపొందించుకోవడానికి, మనకు దేవుని సహాయం అవసరం, అది అందుబాటులోవుంది. లోపరహిత అద్దంలా దేవుని వాక్యం, మనమెక్కడ వ్యక్తిగత మార్పులు చేసుకోవాలో మనకు చూపిస్తూ, ఎలా మార్పులు చేసుకోవాలో ఉపదేశిస్తుంది. (యాకోబు 1:​22-25) ప్రేమగల సహోదరత్వం కూడా సహాయపడేందుకు సిద్ధంగా ఉంది. వ్యక్తిగత సహాయం అందించడంలో క్రైస్తవ పెద్దలు పరిస్థితిని అర్థంచేసుకుంటారు. ప్రార్థనలో అర్థిస్తే యెహోవా ధారాళంగా తన పరిశుద్ధాత్మను దయచేస్తాడు. (లూకా 11:13; రోమీయులు 8:​26) అందువల్ల, మనం ఆనందంగా ఈ ఏర్పాట్లను సద్వినియోగం చేసుకుందాం. 21వ పేజీలోని సూచనలు సహాయపడవచ్చు.

17 యెహోవాను సంతోషపరచడానికి మనం ప్రయత్నించినప్పుడు, మన ప్రయత్నాలను ఆయన విలువైనవిగా పరిగణిస్తాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరమో గదా! మరింత ఆశానిగ్రహం చూపేందుకు మనం నిర్విరామంగా కృషిచేయడానికిది మనలను పురికొల్పాలి. మనమెన్నిసార్లు తొట్రిల్లినా, మన ప్రయత్నాలు మానకూడదు. “నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును.” (సామెతలు 24:​16) గెలుపొందిన ప్రతిసారీ, మన గురించి మనం సంతోషించేందుకు కారణం మనకుంటుంది. యెహోవా కూడా మనల్ని బట్టి సంతోషిస్తాడని మనం నిశ్చయతతో ఉండవచ్చు. తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవడానికి ముందు, వారంపాటు పొగత్రాగకుండా ఉండడంలో విజయం సాధించిన ప్రతిసారీ, తాను చూపిన ఆశానిగ్రహం మూలంగా పొదుపుచేసిన డబ్బుతో తనకు పనికొచ్చేదేదో ఒకటి తనకోసం కొనుక్కున్నానని ఒక సాక్షి చెబుతున్నాడు.

18 అన్నింటికంటే మిన్నగా, ఆశానిగ్రహంలో మన మనస్సు, భావావేశాలు కూడా ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. దీనిని మనం యేసు చెప్పిన ఈ మాటల్లో చూడవచ్చు: “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” (మత్తయి 5:28; యాకోబు 1:​14, 15) తన మనస్సును, భావాలను అదుపులో పెట్టుకోవడం నేర్చుకున్న వ్యక్తికి తన యావత్‌ శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం తేలికగా ఉంటుంది. కాబట్టి, చెడు చేయడమే కాదు చెడు ఆలోచించకుండా ఉండాలనే మన నిర్ణయాన్ని బలోపేతం చేసుకుందాం. చెడు తలంపులు కలిగితే వెంటనే వాటిని తృణీకరించండి. మన కనుదృష్టిని ప్రార్థనాపూర్వకంగా యేసుపై కేంద్రీకరించడం ద్వారా మనం శోధననుండి దూరంగా పారిపోవచ్చు. (1 తిమోతి 6:11; 2 తిమోతి 2:22; హెబ్రీయులు 4:​15, 16) శ్రేష్ఠమైనది చేయడానికి శాయశక్తులా మనం కృషిచేస్తుండగా, కీర్తన 55:⁠22లోని ఈ సలహా అనుసరించిన వారమౌతాము: “నీ భారము యెహోవామీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.”

మీకు గుర్తున్నాయా?

• మనమే రెండు విధాల్లో ఆశానిగ్రహం పాటించాలి?

• ‘అన్నింటిలో ఆశానిగ్రహం’ పాటించడమంటే దానర్థమేమిటి?

• ఆశానిగ్రహం పెంపొందించుకునేందుకు ఈ అధ్యయనంలో మీరు ఏ ఆచరణాత్మక సలహాలు గుర్తుపెట్టుకున్నారు?

• ఆశానిగ్రహం ఎక్కడ ఆరంభమౌతుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1. ఎఫెసీయులు 4:22-24కు అనుగుణంగా, లక్షలాదిమంది ఎలా యెహోవా పక్షాన నిలిచారు?

2, 3. దేవుని ఆమోదం పొందడానికి రెండువిధాల మార్పులు చేసుకోవాలని 1 కొరింథీయులు 6:​9-12 ఎలా సూచిస్తోంది?

4. సమర్పిత క్రైస్తవులు ఏ విషయంలో పౌలుతో ఏకీభవిస్తారు?

5. ఎలాంటి పరుగుపందెంలో పౌలు విజయవంతంగా పాల్గొన్నాడు, అదేవిధంగా మనమూ ఎలాచేయవచ్చు?

6. ఆశానిగ్రహం అంటే ఏమిటి, ఏ రెండు విధానాల్లో మనం దానిని పాటించాలి?

7. (ఎ) దావీదు వలెనే, మనం దేనికొరకు ప్రార్థించాలి? (బి) వేటిని ధ్యానించడం మనం మరియెక్కువ ఆశానిగ్రహం పాటించేందుకు మనకు సహాయం చేస్తుంది?

8. అనుభవం మనకు ఏ వాస్తవాన్ని బోధిస్తోంది? సోదాహరణగా చెప్పండి.

9, 10. ‘అన్నింటిలో ఆశానిగ్రహం’ పాటించడంలో ఏమి ఇమిడివుంది?

11. లేమిలో బ్రతుక నేర్చుకోవడం ఎందుకు ప్రయోజనకరం, అయితే దీనిని ఏది కష్టతరం చేస్తుంది?

12, 13. (ఎ) క్రైస్తవ కూటాలకు సంబంధించి ఏయేరీతుల్లో ఆశానిగ్రహం అవసరమౌతుంది? (బి) మనం ఆశానిగ్రహం పాటించాల్సిన మరితర రంగాలు ఏవి?

14. (ఎ) ఆశానిగ్రహం పాటించడం పిల్లలెలా నేర్చుకోవాలి? (బి) జీవితపు తొలిదశలోనే పిల్లలు అలాంటి పాఠాలు నేర్చుకుంటే ఎలాంటి ప్రయోజనాలు రావచ్చు?

15. ఆశానిగ్రహం లేకపోవడం దేనిని సూచిస్తుంది, దానికి భిన్నంగా బైబిల్లో ఏ లక్ష్యం ఉంచబడింది?

16. యెహోవా ఎలా సహాయంచేస్తాడు?

17. సామెతలు 24:⁠16 మనకు ఎలాంటి ప్రోత్సాహమిస్తోంది?

18. (ఎ) మన ఆశానిగ్రహపు పోరాటంలో ఏది ఇమిడివుంది? (బి) యెహోవా ఎలాంటి హామీ ఇస్తున్నాడు?

ఆశానిగ్రహాన్ని బలపరచుకొనే విధానం

• అల్ప విషయాల్లో సహితం దానిని అలవరుచుకోండి

• దాని ప్రస్తుత, భవిష్యత్‌ ప్రయోజనాలను గురించి తలపోయండి

• దేవుడు నిషేధించిన వాటి స్థానంలో ఆయన ప్రోత్సహించే విషయాలు ఉంచండి

• తగని ఆలోచనల్ని వెంటనే తృణీకరించండి

• ఆధ్యాత్మికంగా ప్రోత్సాహకరమైన తలంపులతో మీ మనస్సు నింపుకోండి

• పరిణతిగల తోటి క్రైస్తవులు చేయగల సహాయాన్ని అంగీకరించండి

• రాజీపడేలాచేసే పరిస్థితులకు దూరంగా ఉండండి

• శోధన సమయాల్లో సహాయంకోసం దేవునికి ప్రార్థించండి

[19వ పేజీలోని చిత్రాలు]

ఆశానిగ్రహం మనం మేలుచేయడానికి పురికొల్పుతుంది