కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనులారా, యెహోవాకు తగినట్టు నడుచుకోండి

యౌవనులారా, యెహోవాకు తగినట్టు నడుచుకోండి

యౌవనులారా, యెహోవాకు తగినట్టు నడుచుకోండి

కొంతమంది క్రైస్తవ యౌవనులు తాత్కాలికంగా తమ కుటుంబాలకు వారి సొంత సంఘాలకు దూరంగా ఉండాల్సివచ్చింది. తమ పరిచర్యను విస్తృతపరచు కోవడానికి కొందరలా చేశారు. ఈ లోక వ్యవహారాల విషయంలో తమ తటస్థ వైఖరి కారణంగా మరి కొందరు తమ గృహాలు వదిలివెళ్లాల్సి వచ్చింది. (యెషయా 2:4; యోహాను 17:​16) కొన్ని దేశాల్లో “కైసరు,” యథార్థత కాపాడుకున్న యౌవనులను చెరసాల్లో వేశాడు లేదా సమాజసేవకు నియమించాడు. *​—⁠మార్కు 12:17; తీతు 3:1, 2.

తమ తటస్థ వైఖరినిబట్టి చెరసాల శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఈ యౌవనులు నేరస్థుల సాంగత్యంలో ఎక్కువకాలం నిర్బంధంలో ఉండవలసి రావచ్చు. ఇతర కారణాలవల్ల ఇంటికి దూరంగా ఉండడం కూడా అదేమాదిరి దుర్నీతికర పర్యావరణంలో పనిచేయడానికి యౌవనులపై ఒత్తిడి తీసుకొచ్చింది. అలాంటి పరిస్థితిలోకి బలవంతంగా నెట్టబడిన ఈ యౌవనులు, ఇతరులు ‘దేవునికి తగినట్టుగా నడుచుకొనడానికి’ కృషిచేస్తుండగా వారికెదురయ్యే ఒత్తిళ్లను, కష్టాలను జయప్రదంగా ఎలా తట్టుకోవచ్చు? (1 థెస్సలొనీకయులు 2:​11) తలెత్తగల అసంతోషకరమైన ఏ పరిస్థితులతోనైనా వ్యవహరించేందుకు వారి తల్లిదండ్రులు వారికెలా సహాయం చేయవచ్చు?​—⁠సామెతలు 22:⁠3.

ప్రత్యేక సవాళ్లు

“జాగ్రత్తగా చూసుకునే తల్లిదండ్రులకూ, అలాగే నన్ను బాగా ఎరిగిన పెద్దల ప్రేమపూర్వక పర్యవేక్షణకూ దూరంగా ఉండడం కష్టంగాను, భయంగాను ఉంది” అని 37 నెలలపాటు ఇంటికి దూరంగా ఉండాల్సివచ్చిన 21 సంవత్సరాల టాకిస్‌ అంటున్నాడు. * అతను ఇంకా ఇలా అంటున్నాడు: “కొన్నిసార్లు నేను చాలా నిస్సహాయంగా ఉన్నట్టు భావించాను.” 20 సంవత్సరాల పెట్రోస్‌ రెండు సంవత్సరాలకంటే ఎక్కువ కాలం ఇంటికి దూరంగా ఉండాల్సివచ్చింది. అతనిలా ఒప్పుకుంటున్నాడు: “జీవితంలో మొదటిసారి వినోదానికి, సహవాసానికి సంబంధించి సొంతగా నిర్ణయాలు చేసుకోవాల్సివచ్చింది, అలా నేను తీసుకున్న నిర్ణయాలు అన్ని సమయాల్లో జ్ఞానవంతంగా లేవు.” ఆ పిదప అతనిలా వ్యాఖ్యానిస్తున్నాడు: “దొరికిన మరింత స్వాతంత్ర్యంవల్ల పెరిగిన బాధ్యతతో నేను కొన్నిసార్లు ఇబ్బంది పడ్డాను.” అలాంటి పరిస్థితుల్లోవున్న క్రైస్తవ యౌవనులను తరచూ కలుసుకునే క్రైస్తవ పెద్ద టాసోస్‌ ఇలా అన్నాడు: “అవిశ్వాసులైన తోటివారి అశ్లీల సంభాషణ, తిరుగుబాటుతనం, హింసాయుత ప్రవర్తన అజాగ్రత్తపరులైన, నిస్సహాయులైన యౌవనులపై ప్రభావం చూపవచ్చు.”

బైబిలు సూత్రాలపట్ల గౌరవంలేని ప్రజలమధ్య జీవిస్తూ, పనిచేస్తున్నప్పుడు క్రైస్తవ యౌవనులు, తమ తోటివారి దుర్నీతికరమైన, లేఖన విరుద్ధమైన విధానాలు అనుకరించే శోధనలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. (కీర్తన 1:1; 26:4; 119:⁠9) వ్యక్తిగత అధ్యయనం, కూటాలకు హాజరవడం, క్షేత్రసేవ వంటివి క్రమంగా చేయడం కష్టంకావచ్చు. (ఫిలిప్పీయులు 3:​16) ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకొని, ఆ దిశగా పనిచేయడం కూడా సులభం కాకపోవచ్చు.

తమ ప్రవర్తన, సంభాషణతో యెహోవాను సంతోషపరచాలని నమ్మకమైన క్రైస్తవ యౌవనులు నిశ్చయంగా కోరుకుంటారు. “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును” అని తమ పరలోకపు తండ్రి ఇచ్చిన వాత్సల్యపూరిత ఆహ్వానాన్ని లక్ష్యపెట్టడానికి వారు విశ్వసనీయంగా ప్రయత్నిస్తారు. (సామెతలు 27:​11) ఇతరులు యెహోవాను, ఆయన ప్రజలను ఎలా దృష్టిస్తారనే దానిపై తమ నడవడి, ప్రవర్తన ప్రభావం చూపుతాయని వారు గుర్తిస్తారు.​—⁠1 పేతురు 2:12.

మెచ్చుకోదగిన రీతిలో, అధికశాతం మంది యౌవనులు తమ మొదటి శతాబ్దపు సహోదరులవలె ఉండడానికి శాయశక్తులా పనిచేస్తున్నారు. వారిని గురించి పౌలు ఇలా ప్రార్థించాడు: “ప్రతి సత్కార్యములో సఫలులగుచు . . . అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతోకూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచు[డి].” (కొలొస్సయులు 1:​9-11) కొత్త పరిస్థితులు, విరోధ స్వభావం, విగ్రహారాధనతో కూడుకున్న పర్యావరణం మధ్యనూ జయప్రదంగా దేవునికి తగినట్టు నడుచుకున్న దేవుని భయంగల అనేకమంది యౌవనుల ఉదాహరణలను బైబిలు పేర్కొంటోంది.​—⁠ఫిలిప్పీయులు 2:14-15.

“యెహోవా యోసేపునకు తోడైయుండెను”

యాకోబు రాహేలుల ప్రియకుమారుడగు యోసేపు చిన్నతనంలోనే, దేవుని భయంగల తన తండ్రి సురక్షిత గృహానికి దూరంగావుండే పరిస్థితి ఏర్పడింది. అతను ఐగుప్తులో బానిసగా అమ్మబడ్డాడు. పరిశ్రమించే వ్యక్తిగా, నమ్మకస్థునిగా నైతిక యౌవనస్థునిగా యోసేపు శ్లాఘనీయమైన మాదిరివుంచాడు. యెహోవా ఆరాధకుడుకాని పోతీఫరు దగ్గర దాసునిగా పనిచేస్తున్నా, చివరకు యజమాని తన ఇంటి వ్యవహారాలన్నీ యోసేపుకు అప్పగించే విధంగా అతను మనస్సాక్షిపూర్వకంగా, కష్టపడి పనిచేశాడు. (ఆదికాండము 39:​2-6) యోసేపు యెహోవాపట్ల తన యథార్థత నిలుపుకున్నాడు, అందువల్ల అతను చెరసాలలో వేయబడినప్పటికీ “దీనివల్ల ప్రయోజనమేమిటి?” అనే ముగింపుకు అతడు రాలేదు. చెరసాలలో సహితం అతను చక్కని లక్షణాలు ప్రదర్శించాడు, కొద్దిరోజుల్లోనే అతను చెరసాల నిర్వహణా పనులనేకం చేయించేవాడయ్యాడు. (ఆదికాండము 39:17-22) దేవుడాయనను ఆశీర్వదించాడు, అలాగే ఆదికాండము 39:23లో చెప్పబడినట్లుగా, “యెహోవా అతనికి తోడైయుండెను.”

దేవుని భయంగల తన కుటుంబానికి దూరంగా ఉన్నందున, తన చుట్టూవున్న అన్యుల ప్రవర్తన అలవరచుకొని, ఐగుప్తీయుల దుర్నీతిగల జీవనశైలి ప్రకారం జీవించడం యోసేపుకు ఎంత సులభంగా ఉండేదో గదా! దానికి భిన్నంగా, అతను దైవ సూత్రాలకు కట్టుబడి బలమైన శోధనల మధ్యనూ తన స్వచ్ఛమైన స్థానం కాపాడుకున్నాడు. తనతో సంబంధం పెట్టుకొమ్మని పోతీఫరు భార్య పదేపదే బలవంతం చేసినా, అతను “నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును” అని స్థిరంగా సమాధానమిచ్చాడు.​—⁠ఆదికాండము 39:7-9.

నేడు, యౌవన సాక్షులు అయుక్త సహవాసాలు, దుర్నీతకర వినోదం, అశ్లీలత్వం, దిగజారిన సంగీతానికి విరుద్ధంగా ఇవ్వబడే బైబిలు ఆధారిత హెచ్చరికల్ని లక్ష్యపెట్టాలి. “యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును” అని వారు గ్రహిస్తారు.​—⁠సామెతలు 15:⁠3.

‘పాపభోగాన్ని’ మోషే విసర్జించాడు

విగ్రహారాధక, సుఖభోగాల ఐగుప్తు రాజసౌధ పర్యావరణంలో మోషే పెరిగాడు. బైబిలు అతని గురించి ఇలా చెబుతోంది: “మోషే . . . విశ్వాసమునుబట్టి . . . అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు.”​—⁠హెబ్రీయులు 11:24, 25.

లోక స్నేహంవల్ల కొన్ని ప్రయోజనాలు కలుగవచ్చు, అయితే అవి తాత్కాలికమే. ఎక్కువలో ఎక్కువ అవి ఈ లోకానికి ఇక మిగిలిన పరిమిత కాలం నిలిచివుండవచ్చు. (1 యోహాను 2:​15-17) అందువల్ల మోషే మాదిరిని అనుకరించడం ప్రయోజనకరం కాదా? “అతడు అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై” ఉండెనని బైబిలు చెబుతోంది. (హెబ్రీయులు 11:​27) దేవుని భయంగల తన పితరులిచ్చిన ఆధ్యాత్మిక వారసత్వంపై ఆయన తన మనస్సు నిలిపాడు. యెహోవా సంకల్పమే తన జీవిత సంకల్పంగా చేసుకొని దేవుని చిత్తం చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు.​—⁠నిర్గమకాండము 2:11; అపొస్తలుల కార్యములు 7:23, 25.

భక్తిహీన, విరోధ పర్యావరణంలో తామున్నామని దేవుని భయంగల యౌవనులు తెలుసుకున్నప్పుడు, వారు వ్యక్తిగత అధ్యయనం చేసి “అదృశ్యుడైనవానిని” మరియెక్కువగా తెలుసుకోవడం ద్వారా యెహోవాతో తమ వ్యక్తిగత సంబంధం బలపరచుకోవచ్చు. క్రమంగా కూటాలకు హాజరవడం, క్షేత్రసేవకు వెళ్లడంతోపాటు క్రైస్తవ కార్యకలాపాల ఓ పూర్తి కార్యక్రమం ఈ యౌవనులు ఆధ్యాత్మిక విషయాలపై మనస్సు లగ్నం చేసేందుకు వారికి సహాయంచేస్తుంది. (కీర్తన 63:6; 77:​12) వారు మోషేకున్నంత బలమైన విశ్వాసనిరీక్షణలను పెంపొందించుకోవడానికి కృషిచెయ్యాలి. యెహోవాకు స్నేహితులుగా ఉండడానికి సంతోషిస్తూ వారు తమ ఆలోచనలు, క్రియలు ఆయనపై కేంద్రీకరించడానికి కృషిచెయ్యాలి.

దేవుని స్తుతించేందుకు ఆమె తన నాలుకను ఉపయోగించింది

దేవుని ప్రవక్త ఎలీషా కాలంలో సిరియనులు నిర్బంధించిన ఇశ్రాయేలీయుల బాలిక ఇంటికి దూరంగావున్న సమయంలో మంచి మాదిరి చూపించిన యౌవనురాలు. సిరియా సైన్యాధిపతియైన, కుష్ఠ వ్యాధిగల నయమాను భార్య సేవికగా ఆమె పనిచేసింది. ఈ అమ్మాయి తన యజమానురాలికి ఇలా చెప్పింది: “షోమ్రోనులోనున్న ప్రవక్తదగ్గర నా యేలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను; అతడు నా యేలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయును.” ఆమె సాక్ష్యమిచ్చిన కారణంగా నయమాను ఇశ్రాయేలు దేశంలోవున్న ఎలీషా దగ్గరకువెళ్లి కుష్ఠరోగ విముక్తుడయ్యాడు. అంతేకాకుండా, నయమాను యెహోవా ఆరాధకుడయ్యాడు.​—⁠2 రాజులు 5:1-3, 13-19.

తాము తల్లిదండ్రులకు దూరంగా ఉన్నప్పటికీ యౌవనులు దేవుణ్ణి ఘనపరిచే విధంగా తమ నాలుకను ఉపయోగించాలని ఈ బాలిక ఉదాహరణ నొక్కిచెబుతోంది. ఆ బాలికకు ఒకవేళ ‘మూఢంగా’ మాట్లాడే లేదా ‘బూతులు’ మాట్లాడే అలవాటే ఉండివుంటే అవకాశమొచ్చినప్పుడు తను మాట్లాడినంత ప్రభావముగా తన నాలుకను ఇబ్బందిలేకుండా ఉపయోగించి ఉండేదా? (ఎఫెసీయులు 5:4; సామెతలు 15:2) తన తటస్థ వైఖరి కారణంగా చెరసాల్లో వేయబడ్డ యువకుడైన నీకొస్‌ ఇలా గుర్తుతెచ్చుకుంటున్నాడు: “తల్లిదండ్రుల, సంఘ అధికారానికి దూరంగా వ్యవసాయ చెరసాల్లో కొంతమంది ఇతర యౌవన సహోదరులతోపాటు ఉన్నప్పుడు, మా సంభషణా నాణ్యత క్షీణించడం నేను గమనించాను. అది నిశ్చయంగా యెహోవాకు స్తుతిని తీసుకురాలేదు.” సంతోషకరమైన విషయమేమంటే, ఈ విషయంలో పౌలు ఇచ్చిన ఈ ఉపదేశం లక్ష్యపెట్టడానికి నీకొస్‌కు ఇతరులకు సహాయం చేయబడింది: “మీలో జారత్వమేగాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.”​—⁠ఎఫెసీయులు 5:⁠3.

యెహోవా వారికి నిజమైయుండెను

ప్రాచీన బబులోనులో దానియేలు హెబ్రీ సహవాసులైన ఆ ముగ్గురి అనుభవం, కొంచెంలో నమ్మకంగా ఉండడం ఎక్కువలో నమ్మకంగా ఉండేందుకు నడిపిస్తుందని యేసు చెప్పిన సూత్రపు సత్యసంధతను రుజువుచేస్తోంది. (లూకా 16:​10) మోషే ధర్మశాస్త్రం నిషేధించిన ఆహార పదార్థాలు తినే సమస్యను వారెదుర్కొన్నప్పుడు, తాము పరాయి దేశంలో బంధీలుగా ఉన్నాం కాబట్టి తమకిక వేరే దారిలేదని వారు తర్కించియుండవచ్చు. చిన్న విషయంగా అనిపించినా దానిని కూడా గంభీరంగా తీసుకున్నందుకు వారెంతగా ఆశీర్వదించబడ్డారో గదా! రాజులుతినే రుచికరమైన ఆహారం తింటున్న ఇతర ఖైదీలందరికంటే వారు ఆరోగ్యవంతులుగా, జ్ఞానవంతులుగా నిరూపించబడ్డారు. ఈ కొద్దివిషయాల్లో నమ్మకంగా ఉండడం నిస్సందేహంగా వారిని బలపరచింది, అందువల్ల ఆరాధిత ప్రతిమకు సాగిలపడి నమస్కరించే పెద్ద పరీక్షను వారు ఎదుర్కొన్నప్పుడు రాజీపడడానికి వారు నిరాకరించారు.​—⁠దానియేలు 1:3-21; 3:1-30.

ఈ ముగ్గురు యౌవనులకు యెహోవా నిజమైయుండెను. ఇంటికి, దేవుని ఆరాధనా కేంద్రానికి దూరంగా ఉన్నప్పటికీ, లోకసంబంధ కళంకం తమకంటకుండా చూసుకోవడానికి వారు తీర్మానించుకున్నారు. (2 పేతురు 3:​14) యెహోవాతో తమ సంబంధం వారికి ఎంత అమూల్యంగా ఉందంటే దానికోసం తమ జీవితాలను పణంగా పెట్టడానికి సహితం వారిష్టపడ్డారు.

యెహోవా మిమ్మల్ని ఎడబాయడు

తాము ప్రేమించేవారికి, నమ్మేవారికి యౌవనులు దూరంగా ఉన్నప్పుడు, వారికి అభద్రత, అనిశ్చయతా భావాలు, భయం ఉండడం అర్థంచేసుకోదగినదే. అయితే, “యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు” అనే సంపూర్ణ నమ్మకంతో తమకు కలిగే పరీక్షలను, కష్టాలను ఎదిరించవచ్చు. (కీర్తన 94:​14) అలాంటి యౌవనులు “నీతినిమిత్తము శ్రమపడినను,” “నీతిమార్గమునందు” సదా నడిచేందుకు యెహోవా వారికి సహాయం చేస్తాడు.​—⁠1 పేతురు 3:14; సామెతలు 8:20.

యోసేపును, మోషేను, దాసీగావున్న ఇశ్రాయేలీయుల బాలికను, నమ్మకమైన ఆ ముగ్గురు హెబ్రీ యువకులను యెహోవా ఏకరీతిన బలపరిచి వారికి సమృద్ధిగా ప్రతిఫలమిచ్చాడు. నేడు, “విశ్వాస సంబంధమైన మంచి పోరాటము” పోరాడుతున్న వారిని బలపరిచేందుకు ఆయన తన పరిశుద్ధాత్మను, తన వాక్యాన్ని, తన సంస్థను ఉపయోగిస్తూ, వారికి ప్రతిఫలంగా “నిత్యజీవమును” వారియెదుట ఉంచాడు. (1 తిమోతి 6:​11, 12) అవును, యెహోవాకు తగినట్టు నడుచుకోవడం సాధ్యమే, అది చేయదగిన జ్ఞానయుక్తమైన పని.​—⁠సామెతలు 23:15, 19.

[అధస్సూచీలు]

^ పేరా 2 కావలికోట 1996, మే 1 పేజీలు 18-20 చూడండి.

^ పేరా 5 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[25వ పేజీలోని బాక్సు]

తల్లిదండ్రులారా​—⁠మీ పిల్లలను సిద్ధపరచండి!

“యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు.” (కీర్తన 127:⁠4) బాణం యాదృచ్ఛికంగా దాని లక్ష్యాన్ని చేరదు. ప్రావీణ్యంతో దానిని గురిపెట్టాలి. అదే ప్రకారం, తల్లిదండ్రుల సరైన మార్గదర్శకం లేనిదే, ఇంటికి దూరంగా జీవించేటప్పుడు ఎదురయ్యే వాస్తవిక పరిస్థితులను ఎదుర్కోవడానికి పిల్లలు సిద్ధంగా ఉండరు.​—⁠సామెతలు 22:⁠6.

యౌవనులు మానసిక ప్రేరణ ప్రకారం ప్రవర్తించే లేదా “యౌవనేచ్ఛల[కు]” లొంగిపోయే ప్రమాదంలో ఉంటారు. (2 తిమోతి 2:​22) బైబిలు ఇలా హెచ్చరిస్తోంది: “బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును; అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.” (సామెతలు 29:​15) పిల్లకాయ ప్రవర్తనకు హద్దులు లేకపోతే, వాడు ఇంటికి దూరంగా జీవించేటప్పుడు ఎదురయ్యే కష్టాలు, ఒత్తిళ్లు తట్టుకోవడానికి సిద్ధపడని వానిగా తయారవుతాడు.

క్రైస్తవ తల్లిదండ్రులు స్పష్టంగా, బాధ్యతాయుతంగా తమ పిల్లలకు ఈ విధానంలో కలిగే కష్టాలను, ఒత్తిళ్లను, జీవిత వాస్తవాలను వివరించాలి. సంశయాత్మంగా లేదా ప్రతికూలంగా ఉండకుండా, ఒక యౌవనస్థుడు ఇంటికి దూరంగా జీవించాల్సివస్తే, అతడు ఎదుర్కోగల ఇబ్బందికర పరిస్థితులను వివరించాలి. దైవానుగ్రహ జ్ఞానంతో కలిపియిచ్చే ఈ శిక్షణ, ‘జ్ఞానములేనివారికి బుద్ధి కలిగించును యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించును.’​—⁠సామెతలు 1:⁠4.

తమ పిల్లల హృదయాల్లో దైవిక విలువలను, నైతిక సూత్రాలను నాటే తల్లిదండ్రులు జీవిత సవాళ్లను వారు జయప్రదంగా ఎదుర్కొనేలా చేసిన వారవుతారు. క్రమమైన కుటుంబ బైబిలు అధ్యయనం, అరమరికల్లేని సంభాషణ, పిల్లల సంక్షేమంమీద నిజమైన శ్రద్ధ, విజయమో వైఫల్యమో కలిగేలా చేయగలదు. పిల్లలు ఆ తర్వాతి జీవితంలో తమ సొంత కాళ్లపై నిలబడేందుకు వారిని సిద్ధం చేస్తూ తల్లిదండ్రులు వారికి సమతూకంగా దైవిక శిక్షణ ఇవ్వాలి. అయితే దానిని నిశ్చిత రీతిలో, సమంజసంగా ఇవ్వాలి. లోక సంబంధులు కాకుండానే లోకంలో జీవించడం సాధ్యమేనని వ్యక్తిగత మాదిరి ద్వారా తల్లిదండ్రులు వారి పిల్లలకు నేర్పించవచ్చు.​—⁠యోహాను 17:15, 16.

[23వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ యౌవనులు కొందరు తమ గృహాలు వదిలివెళ్లవలసి వచ్చింది

[24వ పేజీలోని చిత్రాలు]

శోధనను నిరోధిస్తూ యౌవనులు యోసేపును అనుకరించి నైతికంగా పరిశుభ్రంగా ఉండవచ్చు

[26వ పేజీలోని చిత్రాలు]

యెహోవాకు ఘనత తేవడానికి తన నాలుక ఉపయోగించిన దాసీగావున్న ఇశ్రాయేలీయుల బాలికను అనుకరించండి