కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సావోటోమ్‌ ప్రిన్సిపిల్లో సువార్త ఫలిస్తోంది

సావోటోమ్‌ ప్రిన్సిపిల్లో సువార్త ఫలిస్తోంది

సావోటోమ్‌ ప్రిన్సిపిల్లో సువార్త ఫలిస్తోంది

అనేకమంది సావోటోమ్‌ ప్రిన్సిపిల గురించి బహుశా ఎన్నడూ వినివుండరు. సాధారణంగా ఈ ద్వీపాలను గురించి వెకేషన్‌ బ్రోషుర్లలో ప్రకటించరు. ప్రపంచ రేఖాపటంలో ఆఫ్రికా పశ్చిమతీరానికి దూరంగా గినియా సింధుశాఖలో అవి చిన్నచుక్కల్లా కనబడతాయి. సావోటోమ్‌ సరిగ్గా భూమధ్య రేఖమీదున్నట్టుగా ఉంటే, ప్రిన్సిపి దానికి కాస్త ఈశాన్యంవైపు ఉంటుంది. అక్కడి తేమగల వర్షాధార వాతావరణంవల్ల 2,000 మీటర్లకంటే ఎత్తుగావుండే పర్వత కనుమల నిండా గొప్ప వర్షాధార అడవులు ఏర్పడ్డాయి.

ఈ ఉష్ణప్రాంత ద్వీపాలచుట్టూ నీలిరంగు సముద్రం పరచుకోగా, సముద్ర తీరాలన్నీ కొబ్బరివంటి చెట్లతో నిండుగా కనిపిస్తాయి. అక్కడి ప్రజలు స్నేహపూరితులు, ఆప్యాయతా భావాలుగలవారు. ఆదిమ ఆఫ్రికా, ఐరోపా జాతుల సంగమంతో అక్కడ ఆహ్లాదకర మిశ్రిత సంస్కృతి విరాజిల్లింది. అక్కడి 1,70,000 జనాభాలో అధికశాతం మంది ముఖ్యంగా కోకో ఎగుమతి చేస్తుంటారు లేదా వ్యవసాయం చేస్తుంటారు, చేపలుపడుతుంటారు. ఇటీవలి సంవత్సరాల్లో, రోజువారీ భోజనం సంపాదించుకోవడం కూడా ఒక సవాలుగా ఉంది.

అయితే, ఈ ద్వీపాల్లో అంతకంతకు అనేకుల జీవితాలను ఎంతగానో ప్రభావితంచేసిన ఓ సంఘటన 20వ శతాబ్దపు చివరి దశాబ్దంలో జరిగింది. 1993 జూన్‌లో సావోటోమ్‌ ప్రిన్సిపిల ప్రభుత్వంవద్ద యెహోవాసాక్షులు చట్టబద్ధంగా నమోదు చేయబడ్డారు. ఆ విధంగా, ఈ ద్వీపాల్లో యెహోవాసాక్షుల చరిత్రలో తరచూ కష్టాలు తెచ్చిన ఓ సుదీర్ఘ అధ్యాయం ముగిసింది.

కష్టాల మధ్యన విత్తబడిన విత్తనాలు

ఈ ద్వీపాల్లోని లేబర్‌ క్యాంపుల్లో పనిచేసేందుకు ఆఫ్రికాలోని ఇతర పోర్చుగీసు వలసప్రాంతాలనుండి ఖైదీలు పంపబడినప్పుడు, 1950వ దశాబ్దపు తొలిభాగంలో మొదటి సాక్షి ఈ దేశానికి వచ్చినట్లు అనిపిస్తోంది. ఆ సాక్షి ఆఫ్రికాదేశపు పయినీరు లేదా పూర్తికాల పరిచారకుడు. ఆయన మొజాంబిక్‌లో దేవుని రాజ్య సువార్త ప్రకటించినందుకు ఆ దేశాన్నుండి వెళ్లగొట్టబడ్డాడు. ఈ ఒంటరి సాక్షి అవిశ్రాంతంగా జరిపిన ప్రకటనా పని కారణంగా 6 నెలల్లోనే సువార్త ప్రకటించేవారు 13మంది తయారయ్యారు. ఆ తర్వాత, అదే పరిస్థితుల్లో మరితర సాక్షులు అంగోలానుండి అక్కడకువచ్చారు. ఖైదీలుగా ఉన్నకాలంలో వారు స్థానిక నివాసులకు సువార్తచెప్పే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

1966కల్లా సావోటోమ్‌లో శిక్ష అనుభవిస్తున్న సహోదరులందరు ఆఫ్రికాకు తిరిగివచ్చారు. అక్కడ మిగిలిపోయిన రాజ్య ప్రచారకుల చిన్నగుంపు ధైర్యంగా సేవ కొనసాగించింది. బైబిలు అధ్యయనానికి కూడుకున్న కారణంగా వారు హింసించబడ్డారు, కొట్టబడ్డారు, నిర్బంధించబడ్డారు, వారిని సందర్శించడానికి లేదా ప్రోత్సహించడానికి వేరెవ్వరూ లేకపోయారు. 1975లో ఆ దేశానికి పోర్చుగల్‌నుండి స్వాతంత్ర్యం వచ్చింది. దానితో క్రమ క్రమంగా అయితే స్థిరంగా రాజ్యసత్య విత్తనాలు మొలకెత్తనారంభించాయి.

విస్తరణ, నిర్మాణం

1993లో చట్టబద్ధంగా నమోదైన నెలలోనే, అక్కడ శిఖరాగ్ర సంఖ్యలో 100 రాజ్య ప్రచారకులున్నారు. అదే సంవత్సరం, పోర్చుగల్‌నుండి ప్రత్యేక పయినీర్లు అక్కడకు వచ్చారు. పోర్చుగీస్‌ క్రియోల్‌ నేర్చుకునేందుకు చేసిన ప్రయత్నాలతో వారు స్థానికులకు ఆప్తులయ్యారు. రాజ్య మందిరానికి స్థలం వెదకడం ప్రధానాంశమైంది. ఈ అవసరం తెలుసుకున్న మారీయ అనే సహోదరి తన చిన్న ఇల్లున్న స్థలంలో సగం విరాళంగా ఇచ్చింది. ఓ పెద్ద రాజ్యమందిరం కట్టడానికి ఆ స్థలం సరిపోతుంది. మారీయకు బ్రతికున్న బంధువులెవరూ లేనందున, ఆశబోతు బిల్డర్ల కన్ను ఆ స్థలంమీద ఉందని ఆమెకు తెలియదు. ఒకరోజు ఓ ప్రముఖ వ్యాపారస్తుడు మాట్లాడేందుకు ఆమె దగ్గరకు వచ్చాడు.

“నీ గురించి నేను విన్నది నీకు క్షేమం కాదు. నీ స్థలం విరాళంగా ఇచ్చావని విన్నాను. అది నగరం నడిబొడ్డున ఉంది కాబట్టి నీకు చాలా డబ్బు వస్తుందని నీకు తెలియదా?” అని అంటూ అతడామెకు హెచ్చరికగా చెప్పాడు.

దానికి మారీయ, “ఆ స్థలం నీకే ఇస్తే నా కెంత డబ్బిస్తావు?” అని అతన్ని అడిగింది. అతడు జవాబివ్వకపోయేసరికి, మారీయ అతనితో ఇంకా ఇలా అంది: “లోకంలో ఉన్న డబ్బంతా నాకిచ్చినా, అది సరిపోదు, ఎందుకంటే ఆ డబ్బు జీవాన్ని కొనలేదు.”

“నీకు పిల్లలెవరూ లేరు కదా?” అన్నాడు.

అంతటితో ఆ సంభాషణ ముగించాలనే ఉద్దేశంతో మారీయ, “ఆ స్థలం యెహోవాది. అనేక సంవత్సరాలు వాడుకోవడానికి ఆయన ఆ స్థలాన్ని నాకు ఇచ్చాడు, ఇప్పుడు నేను దానిని ఆయనకు తిరిగి ఇచ్చేస్తున్నాను. నేను నిత్యజీవం కోసం ఎదురుచూస్తున్నాను” అని చెప్పి ఆ తర్వాత అతణ్ణి ఆమె ఇలా అడిగింది: “నాకివ్వడానికి నీ దగ్గర నిత్యజీవం లేదుకదా?” ఇక మారు మాట్లాడకుండా అతడు వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు.

తత్ఫలితంగా, పోర్చుగల్‌ నుండి వచ్చిన యోగ్యతగల సహోదరుల సహాయంతో అత్యంత ఆకర్షణీయమైన రెండంతస్తుల భవనం నిర్మించబడింది. దానిలో క్రిందంతా బేస్‌మెంట్‌, పైన విశాలమైన రాజ్యమందిరం, వసతి గదులు ఉన్నాయి. దానిలోనే పెద్దల, పరిచర్య సేవకుల, పయినీర్ల పాఠశాలలు నిర్వహించే తరగతి గదులు కూడా ఉన్నాయి. దానిలో ప్రస్తుతం రెండు సంఘాలు కూటాలు జరుపుకుంటూ, రాజధానిలో స్వచ్ఛారాధనకు దానిని ఓ చక్కని విద్యా కేంద్రంగా చేశారు.

మిసోషిలో ఆసక్తిగల 60మంది ప్రచారకుల సంఘమొకటి ఉంది. అరటితోటలో తాత్కాలికంగా నిర్మించుకున్న రాజ్యమందిరంలో కూటాలు జరుగుతున్న కారణంగా, ఓ సరైన రాజ్యమందిర అవసరం తప్పనిసరైంది. సిటి హాల్‌కు ఈ విషయం తెలియజేయబడడంతో, సానుభూతిగల అధికారులు ముఖ్య వీధిలో ఓ మంచి స్థలం ఎంచుకొనే అవకాశం ఇచ్చారు. త్వరిత నిర్మాణ విధానం ఉపయోగించి, పోర్చుగల్‌ సహోదరుల సహాయంతో రెండు నెలల్లో ఓ చక్కని రాజ్యమందిరం నిర్మించబడింది. స్థానికులు తాము చూసింది నమ్మలేకపోయారు. సహోదర సహోదరీలు పనిచేయడం చూసి ఆ నగరంలోనే ఓ నిర్మాణ పనిలోవున్న ఒక స్వీడిష్‌ ఇంజనీరు ఆశ్చర్యపోయాడు. “ఇది నమ్మశక్యంగా లేదు. ఇక్కడ మిసోషిలో యెహోవాసాక్షులు త్వరిత నిర్మాణ విధానం ఉపయోగించడం ఆశ్చర్యంగావుంది! మన ప్రాజెక్టును కూడా మనం ఆ విధంగానే వ్యవస్థీకరించాలి” అని అతనన్నాడు. ఆ రాజ్యమందిరం 1999 జూన్‌ 12న ప్రతిష్ఠించబడగా, దానికి 232 మంది హాజరయ్యారు. మిసోషి నగర సందర్శకులకు ఆ హాలు ఓ ముఖ్య ఆకర్షణయ్యింది.

ఓ చరిత్రాత్మక సమావేశం

సావోటోమ్‌ ప్రిన్సిపిల్లోని యెహోవాసాక్షులకు 1994 జనవరిలో ఆ ద్వీపాల్లో మొదటిసారి జరిగిన మూడురోజుల “దైవిక బోధ” జిల్లా సమావేశం ఓ చరిత్రాత్మక సంఘటన. ఆ దేశంలోనే అతి శ్రేష్ఠమైన ఎయిర్‌-కండిషన్డ్‌ ఆడిటోరియమ్‌లో అది జరిగింది. దానికి 405 మంది హాజరుకావడం, మొదటిసారిగా బైబిలు నాటకాలు తిలకించి సమావేశ విడుదలలు అందుకోవడం చూసిన 116మంది ప్రచారకులు ఎంతగా ఆనందించివుంటారో మీరు ఊహించగలరా? సమర్పించుకున్న 20మంది ఓ బీచ్‌లో బాప్తిస్మం తీసుకున్నారు.

ప్రతినిధులు ధరించిన విశేషమైన బ్యాడ్జిలు ప్రజల అవధానాన్ని చూరగొన్నాయి. పోర్చుగల్‌, అంగోలాల నుండి వచ్చిన 25 మంది సందర్శకులు సమావేశానికి అంతర్జాతీయ కళతెచ్చారు. ఆ వెంటనే ఆప్యాయతగల క్రైస్తవ ప్రేమ వెల్లివిరియగా, చివరి కార్యక్రమం తర్వాత వారు వీడ్కోలు పలుకుతుండగా అనేకుల కళ్లు చెమర్చాయి.​—⁠యోహాను 13:35.

జాతీయ రేడియో విలేఖరులు వచ్చి సమావేశ పైవిచారణకర్తను ఇంటర్వ్యూ చేశారు. అలాగే వారు కార్యక్రమంలోని అనేక ప్రసంగాల ఆయా భాగాలను ప్రసారం చేశారు. అది నిజంగా ఓ చరిత్రాత్మక సంఘటన, అలాగే అది ఎంతోకాలంపాటు ఒంటరిగావున్న ఈ నమ్మకమైన సాక్షులు భావించడానికి సహాయపడింది.

యెహోవాకు స్తుతి కలిగేలా ఫలించడం

రాజ్య సందేశం ఫలాలు ఫలించినప్పుడు, అది యెహోవాకు స్తుతిని, ఘనతను తెచ్చే చక్కని ప్రవర్తనకు కారణమౌతుంది. (తీతు 2:​9-10) ఓ టీనేజి అమ్మాయి వారంవారం జరిగే బైబిలు అధ్యయనం నుండి తాను నేర్చుకున్న వాటినిబట్టి ఆనందించింది. అయితే ఆమె తండ్రి కూటాలకు హాజరుకాకుండా ఆమెను అడ్డగించాడు. క్రైస్తవ కూటాల ప్రాముఖ్యతను, వాటికి హాజరు కావాలన్న తన కోరికను ఆమె గౌరవపూర్వకంగా వివరించినప్పుడు, అతను సత్వరమే ఆమెను ఇంటినుండి వెళ్లగొట్టాడు. చాలామంది యౌవనుల మాదిరిగానే అంటే వెంటనే తనను పోషించే మనిషితో ఉండడానికి ఆమె కూడా వెళ్లిపోతుందని అతను అనుకున్నాడు. ఆమె క్రైస్తవురాలిగా మాదిరికరమైన, పవిత్రమైన జీవితం గడుపుతోందని ఆ తండ్రి తెలుసుకున్నప్పుడు, అతనామెను తిరిగి ఇంటికి తీసుకెళ్లి యెహోవాను సేవించేందుకు పూర్తి స్వాతంత్ర్యమివ్వడానికి పురికొల్పబడ్డాడు.

మరో ఉదాహరణ ఓ సంగీత బృంద నాయకునికి సంబంధించినది. అతను తన అనైతిక జీవన విధాన భ్రాంతి తొలగి, జీవిత సంకల్పం గురించి అన్వేషిస్తుండగా అతనికి సాక్షులు కలిశారు. అతను బైబిలు నైతిక నియమాల ప్రకారం జీవించడం ఆరంభించినప్పుడు, పట్టణంలో అందరు అతని గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. త్వరలోనే అతను చెడు సావాసాలన్నీ మానుకోవాల్సిన అవసరం చూశాడు. (1 కొరింథీయులు 15:​33) ఆ పిమ్మట అతను యెహోవాకు తాను చేసుకున్న సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకునే ప్రాముఖ్యమైన చర్య గైకొన్నాడు.

కొందరు యౌవనులు సత్యమతం కోసం అన్వేషించడం ఆరంభించారు. వారి అన్వేషణ అనేక సువార్త గుంపుల పాదిరీలతో చర్చలకు దారితీసింది, దాని ఫలితంగా వారికి మరింత గందరగోళం నిస్పృహలు ఏర్పడ్డాయి. పర్యవసానంగా, వారు మత సంబంధమైన ప్రతివిషయాన్ని దౌర్జన్యంగా ఎదిరించే తిరుగుబోతులుగా, అపహాసకులుగా తయారయ్యారు.

ఒక రోజు, యెహోవాసాక్షుల మిషనరీ బైబిలు అధ్యయనానికి వెళుతూ ఈ యౌవనులున్న ప్రాంతానికి వచ్చాడు. మిషనరీ తమ ప్రశ్నలకు కొన్నింటికి జవాబు చెప్పాలంటూ ఆ గుంపు ఆయనను ఓ పెరట్లోకి తీసుకెళ్లి చిన్న స్టూలుమీద కూర్చోమని అడిగారు. ఆ తర్వాత వారు ఆత్మ, నరకాగ్ని, పరలోకంలో జీవితం, లోకాంతానికి సంబంధించిన ప్రశ్నల అడ్డుకట్ట వేశారు. ఆ సాక్షి ఆ గ్యాంగు లీడరిచ్చిన బైబిలు నుండి వారి ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పాడు. ఒక గంట తర్వాత, లా అనే పేరుగల ఆ లీడరు మిషనరీతో ఇలా అన్నాడు: “ప్రశ్నలకు జవాబివ్వడానికి మేము పిలిచినప్పుడు ఇతర మతస్థులకు చేసినట్లే మిమ్మల్ని కూడా అపహసించాలనే మేము ఉద్దేశించాము. ఆ ప్రశ్నలకు ఎవ్వరూ జవాబు చెప్పలేరని మేమనుకున్నాము. కాని మీరు జవాబిచ్చారు, మీరు కేవలం బైబిలు ఉపయోగించి జవాబిచ్చారు! నాకు చెప్పండి, బైబిలు గురించి నేను ఇంకా ఎక్కువ ఎలా నేర్చుకోవచ్చు?” లాకు బైబిలు అధ్యయనం ప్రారంభించబడగా, అతను త్వరలోనే కూటాలకు హాజరుకావడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొద్దికాలానికే, అతను ఆ గుంపు సహచర్యం మానుకొని తన దౌర్జన్యకర జీవితం మార్చుకున్నాడు. ఒక సంవత్సరంలోపే అతను తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకున్నాడు. అతనిప్పుడు ఓ పరిచర్య సేవకునిగా సేవచేస్తున్నాడు.

బాగా పాతుకుపోయిన ఒక స్థానిక ఆచారమేమంటే, జంటలు చట్టబద్ధంగా వివాహం చేసుకోకుండా ఊరకనే కలిసి జీవించడం. చాలామంది ఆ విధంగానే చాలా సంవత్సరాలు జీవించి పిల్లలు కన్నారు. ఆ విషయంలో దేవుని దృక్కోణం అంగీకరించడం వారికి కష్టంగావుంది. ఈ ఆటంకాన్ని అధిగమించడానికి దేవుని వాక్యం ఒక వ్యక్తికి సహాయపడడం చూడ్డం ఎంతో హృదయానందకరం.​—⁠2 కొరింథీయులు 10:4-6; హెబ్రీయులు 4:12.

తన వివాహం చట్టబద్ధం చేసుకోవాలనే విషయం ఆంటొన్యు అర్థంచేసుకొని, మొక్కజొన్న పంట చేతికొచ్చినప్పుడు వివాహ విందుకు సరిపడేంత డబ్బు లభిస్తుందనే ఆలోచనతో అప్పుడు వివాహం చేసుకోవడానికి పథకం వేసుకున్నాడు. సరిగ్గా కోతకు ముందు రాత్రి చేనులో దొంగలుపడి పంటంతా దోచుకుపోయారు. దానితో మరుసటి సంవత్సరం పంట చేతికొచ్చే వరకు వేచివుందామని నిర్ణయించుకున్నాడు, అయితే ఈసారి కూడా దొంగతనం జరిగింది. తన వివాహం కొరకు డబ్బు కూడబెట్టాలనే మరో ప్రయత్నం కూడా విఫలం కావడంతో, ఆంటొన్యు తన అసలు శత్రువెవరో గ్రహించాడు. “సాతాను ఇక నాతో ఆటలాడుకోవడానికి వీల్లేదు. విందు జరిగినా జరక్కపోయినా నెలన్నరలో మేము వివాహం చేసుకుంటామని” అతను చెప్పాడు. అన్నట్లుగానే వివాహానికి సిద్ధంకాగా, వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ వారి స్నేహితులు విందు కోసమని కోళ్లను, బాతులను, ఒక మేకను తెచ్చారు. వివాహం చట్టబద్ధంగా నమోదైన తర్వాత తమ ఆరుగులు పిల్లలతోపాటు ఆంటొన్యు అతని భార్య యెహోవాకు తాము చేసుకున్న సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకున్నారు.

ప్రిన్సిపి ద్వీపానికి వెళ్దాం

ప్రిన్సిపిలో నివసించే 6,000 మందిని సందర్శించడానికి ఇటీవలి సంవత్సరాల్లో అప్పుడప్పుడు సావోటోమ్‌ నుండి ప్రాంతీయ పైవిచారణకర్త, పయినీర్లు వెళ్లారు. ఆ ద్వీపనివాసులు చక్కని ఆతిథ్యమిచ్చి సాక్షులు చెప్పేది వినాలన్న ఉత్సుకత చూపారు. తనకిచ్చిన కరపత్రం చదివిన తర్వాత ఒక వ్యక్తి ఆ మరుసటి రోజు పయినీర్ల కొరకుచూసి మరిన్ని కరపత్రాలు పంచడంలో సహాయం చేస్తానని ముందుకొచ్చాడు. పయినీర్లు ఈ పని తామే చేయాలని చెప్పినా, తనుకూడా వారితోపాటు ఇంటింటికి తిరిగి వారు చెప్పేది శ్రద్ధగా వినేలా సిఫారసుచేస్తూ ఇంటివారికి వారిని పరిచయం చేస్తానని పట్టుబట్టాడు. చివరకు ఆ వ్యక్తి వారిని వదిలి వెళ్లిపోయాడు, అయితే వెళ్లేముందు పయినీర్లు చేస్తున్న ప్రాముఖ్యమైన పనిని అతను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.

1998లో ఇద్దరు పయినీర్లు సావోటోమ్‌ నుండి ప్రిన్సిపికి తరలివెళ్లారు. వారలా వెళ్లిన అనతికాలంలోనే 17 బైబిలు అధ్యయనాలు నిర్వహించడం మొదలుపెట్టారు. సేవ విస్తరిస్తుండగా, ఎంతో కాలం గడవకముందే సంఘ పుస్తక అధ్యయనానికి సగటున 16 మంది హాజరౌతుండగా బహిరంగ ప్రసంగానికి 30కంటే ఎక్కువమంది హాజరయ్యారు. కూటాలకు స్థలం కొరకు సిటీ హాలు అధికారులను కోరినప్పుడు, సంతోషదాయకంగా రాజ్యమందిరం కట్టుకోవడానికి స్థలం మంజూరు చేయబడింది. ఓ చిన్న రాజ్య మందిరం కట్టడానికి సావోటోమ్‌ సహోదరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ హాల్లోకూడా ఇద్దరు ప్రత్యేక పయినీర్లకు నివాస వసతి ఏర్పాటు చేయబడింది.

నిస్సంకోచంగా సువార్త ఈ మారుమూల ప్రాంతాల్లో సహితం మరింత ఫలదాయకంగా ప్రవర్ధమానమౌతోంది. (కొలొస్సయులు 1:​5, 6) 1990 జనవరిలో సావోటోమ్‌ ప్రిన్సిపిల్లో 46 మంది ప్రచారకులున్నారు. 2002 సేవా సంవత్సరంలో ప్రచారకుల శిఖరాగ్ర సంఖ్య 388కి చేరుకుంది! 20కంటే ఎక్కువ శాతంమంది ప్రచారకులు పూర్తికాల సేవలో ఉండగా, దాదాపు 1,400 గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించబడుతున్నాయి. 2001లో జరిగిన జ్ఞాపకార్థానికి ఎప్పుడూ లేనంతగా 1,907 మంది హాజరయ్యారు. అవును, ఈ ఉష్ణ మండల ద్వీపాల్లో యెహోవా వాక్యం వేగంగా ముందుకు సాగుతూ మహిమపరచబడుతోంది.​—⁠2 థెస్సలొనీకయులు 3:⁠1.

[12వ పేజీలోని బాక్సు/చిత్రం]

ప్రాచుర్యం పొందిన రేడియో ప్రసారాలు

ఈ ద్వీపాల్లో యువత అడిగే ప్రశ్నలు​—⁠ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకం ఎంతో కృతజ్ఞతాభావంతో స్వీకరించబడింది. * రెండువారాలకు ఒకసారి, 15 నిమిషాలపాటు అదే పేరుతో జాతీయ రేడియోలో ఓ కార్యక్రమం ప్రసారం చేయబడుతోంది. రేడియో వ్యాఖ్యాత “యౌవనులారా, అది నిజమైన ప్రేమో లేక వ్యామోహమో మీకెలా తెలుస్తుంది?” అని ప్రశ్నించి ఆ తర్వాత పుస్తకంనుండి కొంతభాగం చదువుతుండగా వినడం ఎంత పులకరించే విషయమో గదా! (31అధ్యాయం చూడండి.) అలాంటి మరో కార్యక్రమం కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకంనుండి ఎంపికచేసిన భాగాలను ప్రసారం చేస్తోంది.*

[అధస్సూచి]

^ పేరా 33 యెహోవాసాక్షులు ప్రచురించినవి.

[9వ పేజీలోని చిత్రం]

1994లో సావోటోమ్‌లో మొదటి రాజ్యమందిరం

[10వ పేజీలోని చిత్రం]

1. మిసోషిలో త్వరితగతిన నిర్మించబడిన రాజ్యమందిరం

2. ఈ స్టేడియంలో ఒక చరిత్రాత్మక జిల్లా సమావేశం జరిగింది

3. సమావేశంవద్ద సంతోషభరిత బాప్తిస్మ సభ్యులు

[8వ పేజీలోని చిత్రసౌజన్యం]

భూగోళం: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.