కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇచ్చే స్ఫూర్తిని పెంపొందించుకోండి

ఇచ్చే స్ఫూర్తిని పెంపొందించుకోండి

ఇచ్చే స్ఫూర్తిని పెంపొందించుకోండి

ఇచ్చే స్ఫూర్తి పుట్టుకతో వచ్చేది కాదు. ఒక పసిబిడ్డ స్వాభావికంగానే, తనను చూసుకునేవారి సంక్షేమం గురించి కూడా పట్టించుకోకుండా తన స్వంత కోరికలు, అవసరాలు తీరాలని కోరుకుంటాడు. అయితే కొంతకాలం తర్వాత, ఈ లోకంలో అవసరాలున్నది తనకొక్కడికే కాదని వాడు తెలుసుకుంటాడు. అతడు ఇతరుల అవసరాలను పరిగణలోకి తీసుకోవాలి, అంతేగాక కేవలం తీసుకోవడమే కాదు ఇవ్వడం, ఇతరులతో పంచుకోవడం కూడా వాడు నేర్చుకోవాలి. ఇచ్చే స్ఫూర్తిని పెంపొందించుకోవాలి.

ఇచ్చే వారందరికీ, ఉదారంగా ఇచ్చేవారికి కూడా ఇచ్చే స్ఫూర్తి ఉండదు. కొందరు తమ స్వలాభాల కోసం చారిటబుల్‌ సంస్థలకు దానం చేస్తుండవచ్చు. మరి కొందరు మనుష్యుల పొగడ్తల కోసం విరాళాలు ఇస్తుండవచ్చు. అయితే యథార్థ క్రైస్తవుల ఇచ్చే స్ఫూర్తి భిన్నమైనది. మరైతే దేవుని వాక్యంలో ప్రోత్సహించబడిన ఇవ్వడం యొక్క విశేష లక్షణాలేమిటి? మొదటి శతాబ్దపు క్రైస్తవుల ఇచ్చే స్ఫూర్తిని క్లుప్తంగా పరిశీలిస్తే ఆ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది.

క్రైస్తవులుగా ఇవ్వడానికి సంబంధించిన ఉదాహరణలు

క్రైస్తవులుగా ఇవ్వడం అంటే సాధారణంగా బైబిలులో వర్ణించబడినట్లు, నిజంగా అవసరంలోవున్న వారితో ‘మనకున్న దాన్ని పంచుకోవడం.’ (హెబ్రీయులు 13:​16, ఈజీ-టు-రీడ్‌-వర్షన్‌; రోమీయులు 15:​26) అది బలవంతాన చేసేది కాదు. “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (2 కొరింథీయులు 9:⁠7) అంతేకాక ఇతరుల అవధానం ఆకట్టుకొనే ఉద్దేశంతో కూడా ఇవ్వకూడదు. అననీయ సప్పీరాలు అలా నటించి ఘోరమైన పర్యవసానాలను అనుభవించారు.​—⁠అపొస్తలుల కార్యములు 5:1-10.

సా.శ. 33లో పెంతెకొస్తు పండుగ కోసం అనేకమంది యూదులు, అన్యజనులు దూరప్రాంతాల నుండి యెరూషలేముకు వచ్చినప్పుడు ఇవ్వడం ఎంతో అవసరమయ్యింది. అక్కడే యేసు అనుచరులు ‘పరిశుద్ధాత్మతో నిండినవారై అన్యభాషలతో మాటలాడారు.’ వారి చుట్టూ ఒక పెద్ద జనసమూహము గుమికూడి యేసుక్రీస్తు గురించి పేతురు ఇచ్చిన ప్రేరణాత్మక ప్రసంగం విన్నారు. ఆ తర్వాత ఆలయ ద్వారమువద్ద పేతురు యోహానులు ఒక కుంటివాడిని బాగు చేయడాన్ని ప్రజలు చూశారు, యేసు గురించి, పశ్చాత్తాపపడవలసిన అవసరం గురించి పేతురు మరోసారి మాట్లాడగా వారు విన్నారు. వేలాదిమంది పశ్చాత్తాపపడి, క్రీస్తు అనుచరులుగా బాప్తిస్మం పొందారు.​—⁠అపొస్తలుల కార్యములు, 2, 3 అధ్యాయాలు.

క్రొత్తగా క్రైస్తవులైనవారు యెరూషలేములోనే ఉండి యేసు అపొస్తలుల నుండి మరింత ఉపదేశం పొందాలని కోరుకున్నారు. అయితే అంతమంది సందర్శకుల అవసరాలను అపొస్తలులు ఎలా తీర్చగలరు? బైబిలు వృత్తాంతం మనకిలా చెబుతోంది: “భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను.” (అపొస్తలుల కార్యములు 4:​33-35) నిజమే, క్రొత్తగా రూపొందిన యెరూషలేము సంఘానికి ఇచ్చే స్ఫూర్తి ఉండింది!

ఆ తర్వాత ఇతర సంఘాలు కూడా అదే ఇచ్చే స్ఫూర్తిని ప్రదర్శించాయి. ఉదాహరణకు, మాసిదోనియలోని క్రైస్తవులు స్వయంగా పేదవారైనప్పటికీ, యూదయలోని అవసరంలోవున్న సహోదరుల కోసం తమ సామర్థ్యానికి మించి విరాళాలు ఇచ్చారు. (రోమీయులు 15:26; 2 కొరింథీయులు 8:​1-7) ఫిలిప్పీలోని సంఘం పౌలు పరిచర్యకు మద్దతునివ్వడంలో విశిష్టమైన మాదిరినుంచింది. (ఫిలిప్పీయులు 4:​15, 16) అవసరంలోవున్న విధవరాండ్రకు యెరూషలేము సంఘం ప్రతిరోజు ఆహారం పంచి పెట్టేది, అర్హులైన విధవరాండ్రు నిర్లక్ష్యం చేయబడకుండా ఉండేలా చూసుకునేందుకు అపొస్తలులు ఏడుగురు యోగ్యులైన పురుషులను నియమించారు.​—⁠అపొస్తలుల కార్యములు 6:1-6.

కష్టకాలాలు రానున్నాయని తెలిసినప్పటికీ, తొలి క్రైస్తవ సంఘాలు ఇవ్వడం విషయంలో తక్షణమే ప్రతిస్పందించేవారు. ఉదాహరణకు, అగబు ప్రవక్త రానున్న ఒక గొప్ప కరవు గురించి ప్రవచించినప్పుడు సిరియా అంతియొకయలోవున్న సంఘంలోని “శిష్యులలో ప్రతివాడును తన తన శక్తికొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను.” (అపొస్తలుల కార్యములు 11:​28, 29) ఇతరుల అవసరాలను ముందే ఊహించి సహాయపడడంలో వారు ఎంత చక్కని స్ఫూర్తి చూపించారో కదా!

ఇంత ఉదారంగా, ఇంత ప్రేమపూర్వకంగా ఉండేందుకు తొలి క్రైస్తవులను ప్రేరేపించినదేమిటి? నిజానికి ఒక వ్యక్తి ఇచ్చే స్ఫూర్తిని ఎలా పెంపొందించుకుంటాడు? దావీదు రాజు ఉదాహరణను క్లుప్తంగా పరిశీలించడం ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.

సత్యారాధనకు దావీదు ఇచ్చిన ఔదార్యపూరితమైన మద్దతు

దాదాపు 500 సంవత్సరాల వరకు, నిబంధన మందసానికి, అంటే యెహోవా ప్రత్యక్షతను సూచించే పవిత్రమైన పెట్టెకు శాశ్వతమైన నివాసస్థలమేదీ లేదు. అది ఒక గుడారంలో ఉంచబడేది, ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు, ఆ తర్వాత వారు వాగ్దాన దేశంలోకి ప్రవేశించినప్పుడు ఆ గుడారమును వారు తమతోపాటు మోసుకెళ్ళారు. నిబంధన మందసాన్ని గుడారము నుండి తీసి, యెహోవా కోసం తగిన గృహం నిర్మించి ఆ మందసాన్ని దానిలో ఉంచాలని దావీదు రాజు ఎంతగానో కోరుకున్నాడు. నాతాను ప్రవక్తతో మాట్లాడుతూ దావీదు ఇలా అన్నాడు: “నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను; యెహోవా నిబంధన మందసము తెరలచాటున నున్నది.”​—⁠1 దినవృత్తాంతములు 17:⁠1.

అయితే దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు. కాబట్టి నిబంధన మందసాన్ని ఉంచడానికి దావీదు కుమారుడైన సొలొమోను తన శాంతియుతమైన పాలనలో ఆలయాన్ని నిర్మించాలని యెహోవా ఆజ్ఞాపించాడు. (1 దినవృత్తాంతములు 22:7-10) అయితే ఇది దావీదుకున్న ఇచ్చే స్ఫూర్తిని ఏమాత్రం తగ్గించలేదు. ఒక గొప్ప బృందాన్ని వ్యవస్థీకరించి ఆయన ఆలయ నిర్మాణానికి ఉపయోగించబడే వస్తువులను సమకూర్చడం ప్రారంభించాడు. ఆయన ఆ తర్వాత సొలొమోనుకు ఇలా చెప్పాడు: “యెహోవా మందిరముకొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తారమైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రానులను రాళ్లను కూర్చియుంచితిని.” (1 దినవృత్తాంతములు 22:​14) దావీదు తాను సమకూర్చినదానితో సంతృప్తిపడక తన స్వంత ఆస్తినుండి ప్రస్తుతం 60,00,00,00,000 రూపాయిల కంటే ఎక్కువ విలువ చేసే బంగారాన్ని, వెండిని విరాళంగా ఇచ్చాడు. అంతేకాక అధిపతులు కూడా ఉదారంగా విరాళాలు ఇచ్చారు. (1 దినవృత్తాంతములు 29:​3-9) ఖచ్చితంగా, దావీదు ఉదారంగా ఇచ్చే స్ఫూర్తిని కనబరిచాడు!

ఇంత ఉదారంగా ఇవ్వడానికి దావీదును ప్రేరేపించినదేమిటి? తాను సంపాదించినదంతా, సాధించినదంతా యెహోవా ఆశీర్వాద ఫలమేనని ఆయన గ్రహించాడు. ఆయన ప్రార్థనలో ఇలా ఒప్పుకున్నాడు: “మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామముయొక్క ఘనతకొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన యీ వస్తుసముదాయమును నీవలన కలిగినదే, అంతయు నీదియై యున్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధనచేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును; నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చి యున్నాను; ఇప్పుడు ఇక్కడనుండు నీ జనులును నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను.” (1 దినవృత్తాంతములు 29:​16, 17) దావీదు యెహోవాతో తనకున్న సంబంధాన్ని అమూల్యమైనదిగా ఎంచాడు. దేవునికి “హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను” సేవ చేయవలసిన అవసరాన్ని ఆయన గ్రహించాడు, అలా చేయడంలో ఆయన సంతోషాన్ని పొందాడు. (1 దినవృత్తాంతములు 28:⁠9) ఈ లక్షణాలే, తొలి క్రైస్తవులు ఇచ్చే స్ఫూర్తిని ప్రదర్శించడానికి వారిని కదిలించాయి.

యెహోవా​—⁠సర్వోన్నత దాత

ఇవ్వడంలో యెహోవాయే అత్యుత్తమమైన మాదిరికర్త. ఆయన ఎంత ప్రేమగల, శ్రద్ధగల దేవుడంటే, “ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” (మత్తయి 5:​45) మానవులందరికి ఆయన “జీవమును ఊపిరిని సమస్తమును” ఇస్తాడు. (అపొస్తలుల కార్యములు 17:​25) శిష్యుడైన యాకోబు చెప్పినట్లుగా “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును.”​—⁠యాకోబు 1:17.

యెహోవా “తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించి” మనకు అత్యంత గొప్ప బహుమతిని ఇచ్చాడు. (యోహాను 3:​16) ఇలాంటి బహుమతికి తాము అర్హులమని ఎవ్వరూ చెప్పలేరు ఎందుకంటే “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” (రోమీయులు 3:23, 24; 1 యోహాను 4:​9, 10) “చెప్ప శక్యము కాని ఆయన వరమును” అంటే “దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను” మనం పొందడానికి క్రీస్తు విమోచన క్రయధనమే ఆధారము, మార్గము. (2 కొరింథీయులు 9:​14, 15) దేవుడిచ్చిన వరానికి కృతజ్ఞత చూపిస్తూ పౌలు, “దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చే” పనిని తన జీవితంలో ప్రధానమైన పనిగా చేసుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 20:​24) “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెను” అనేది దేవుని సంకల్పమని ఆయన గ్రహించాడు.​—⁠1 తిమోతి 2:⁠4.

నేడు గొప్ప ప్రకటనా, బోధనా పని ద్వారా అది సాధించబడుతోంది, ఆ పని ప్రస్తుతం భూవ్యాప్తంగా 234 దేశాలకు విస్తరించింది. యేసు, “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అన్నప్పుడు ఆ విస్తరణ గురించే ప్రవచించాడు. (మత్తయి 24:​14) అవును “సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను.” (మార్కు 13:​10) గత సంవత్సరం 60 లక్షల కంటే ఎక్కువమంది సువార్త ప్రచారకులు ఈ పని కోసం 1,20,23,81,302 గంటలు వెచ్చించి, 53,00,000 కంటే ఎక్కువ బైబిలు అధ్యయనాలు నిర్వహించారు. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, కాబట్టి ఈ ఉపదేశం ఎంతో ఆవశ్యం.​—⁠రోమీయులు 10:13-15; 1 కొరింథీయులు 1:21.

బైబిలు సత్యం కోసం ఆకలితోవున్న ప్రజలకు సహాయం చేయడానికి ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో ప్రచురణలు అంటే బైబిళ్ళు, పుస్తకాలు, బ్రోషుర్‌లు ముద్రించబడుతున్నాయి. అంతేకాక కావలికోట, తేజరిల్లు! పత్రికల ప్రతులు 100 కోట్లకంటే ఎక్కువ ఉత్పత్తి చేయబడుతున్నాయి. ప్రజలు సువార్తకు ప్రతిస్పందిస్తుండగా, యెహోవాసాక్షులకు సంబంధించిన రాజ్యమందిరాలు, సమావేశ హాళ్ళు ఇంకా ఎక్కువ నిర్మించబడుతున్నాయి, అవి బైబిలు ఉపదేశానికి కేంద్రాలుగా పనిచేస్తాయి. ప్రతీ సంవత్సరం ప్రాంతీయ సమావేశాలు, ప్రత్యేక సమావేశ దినాలు, జిల్లా సమావేశాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. మిషనరీలకు, ప్రయాణ పైవిచారణకర్తలకు, పెద్దలకు, పరిచర్య సేవకులకు శిక్షణనివ్వడం కూడా కొనసాగుతూ ఉండే ప్రక్రియ. “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ద్వారా ఈ ఏర్పాట్లన్నింటిని చేసినందుకు మనం యెహోవాపట్ల కృతజ్ఞతతో ఉన్నాము. (మత్తయి 24:​45-47) ఆయనకు మన కృతజ్ఞత తెలియజేయడానికి మనం ఎంత సంతోషిస్తామో కదా!

యెహోవాకు కృతజ్ఞత చూపించడం

ఆలయ నిర్మాణం, తొలి క్రైస్తవ సంఘాల అవసరాలను తీర్చడం వంటివాటిలాగే ఈ ఏర్పాట్లన్నింటికి ఆర్థిక మద్దతు పూర్తిగా స్వచ్ఛంద విరాళాల నుండే వస్తుంది. అయితే సమస్తానికి యజమాని అయిన యెహోవాను ఎవ్వరూ ధనవంతుడిని చేయలేరని గుర్తుంచుకోవాలి. (1 దినవృత్తాంతములు 29:14; హగ్గయి 2:⁠8) కాబట్టి మనమిచ్చే విరాళాలు యెహోవాపట్ల మనకున్న ప్రేమకు, సత్యారాధనను ముందుకు నడిపించాలని మనకున్న కోరికకు నిదర్శనం. ఈ ఔదార్యము “దేవునికి కృతజ్ఞతాస్తుతులు” చెల్లిస్తుందని పౌలు చెబుతున్నాడు. (2 కొరింథీయులు 9:​8-13) ఇలా ఇవ్వడాన్ని యెహోవా ప్రోత్సహిస్తున్నాడు ఎందుకంటే అది మనకు ఆయనపట్ల సరైన స్ఫూర్తి, మంచి హృదయం ఉన్నాయని సూచిస్తుంది. ఉదారంగా ఉండేవారు, యెహోవాపై ఆధారపడేవారు ఆయనచే ఆశీర్వదించబడతారు, వారు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతారు. (ద్వితీయోపదేశకాండము 11:13-15; సామెతలు 3:9, 10; 11:​25) మనకు సంతోషం లభిస్తుందని చెబుతూ యేసు ఇలా అన్నాడు: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.”​—⁠అపొస్తలుల కార్యములు 20:35.

ఇచ్చే స్ఫూర్తిగల క్రైస్తవులు, కష్టకాలాలు వచ్చేవరకూ వేచివుండరు. దానికి బదులు వారు “అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు” చేయడానికి అవకాశాల కోసం వెదకుతారు. (గలతీయులు 6:​10) దైవిక ఔదార్యమును ప్రోత్సహిస్తూ పౌలు ఇలా వ్రాశాడు: “ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి.” (హెబ్రీయులు 13:​16) మనం మన ఆస్తులను అంటే సమయాన్ని, శక్తిని, సంపదను ఇతరులకు సహాయం చేయడానికి, పరిశుద్ధ ఆరాధనను విస్తరింపజేయడానికి ఉపయోగించినప్పుడు అది యెహోవా దేవుణ్ణి ఎంతో సంతోషపరుస్తుంది. నిజంగానే, ఆయన ఇచ్చే స్ఫూర్తిని ప్రేమిస్తాడు.

[28, 29వ పేజీలోని బాక్సు/చిత్రం]

కొందరు ఇవ్వడానికి ఎన్నుకునే పద్ధతులు

ప్రపంచవ్యాప్త పనికి విరాళాలు

“ప్రపంచవ్యాప్త పని కోసం చందాలు​—⁠మత్తయి 24:14” అని వ్రాయబడివున్న చందా పెట్టెలలో వేయడానికి అనేకులు కొంత డబ్బును ప్రత్యేకంగా తీసిపెడతారు లేదా ఇంత ఇవ్వాలని నిర్ణయించుకుంటారు.

సంఘాలు ప్రతినెలా ఈ మొత్తాలను, తమ తమ దేశాల్లో సేవను పర్యవేక్షిస్తున్న యెహోవాసాక్షుల కార్యాలయాలకు పంపిస్తాయి. స్వచ్ఛంద విరాళంగా ఇచ్చే డబ్బును నేరుగా ఈ కార్యాలయాలకు పంపించవచ్చు. బ్రాంచి కార్యాలయాల చిరునామాలు ఈ పత్రిక రెండవ పేజీలో ఉన్నాయి. చెక్కులు ”Watch Tower” పేర వ్రాయాలి. ఆభరణాలను ఇతర విలువైన వాటిని కూడా విరాళంగా ఇవ్వవచ్చు. అయితే వాటితోపాటు, వాటిని పూర్తిగా విరాళంగానే ఇస్తున్నామని తెలియజేసే క్లుప్తమైన లేఖను కూడా జతచేయాలి.

షరతుపూర్వక విరాళమిచ్చే ఏర్పాటు

కొన్ని దేశాల్లో ఒక ప్రత్యేక ఏర్పాటు క్రింద డబ్బును విరాళంగా ఇవ్వవచ్చు, ఆ ఏర్పాటు క్రింద దాత తన విరాళాన్ని తిరిగి ఇవ్వమని అడిగితే దాన్ని ఆయనకు తిరిగి ఇచ్చేస్తారు. ఈ విషయంలో మరింత సమాచారం కోసం దయచేసి స్థానిక బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

ధర్మదాన ప్రణాళిక

మీరు నివసిస్తున్న దేశాన్ని బట్టి, ప్రపంచవ్యాప్త రాజ్యసేవ ప్రయోజనార్థం విరాళాలివ్వడంలో డబ్బును పూర్తిగా కానుకగా ఇవ్వడం, షరతుపూర్వక విరాళంగా ఇవ్వడం మాత్రమే కాక ఇతర పద్ధతుల్లో కూడా ఇవ్వవచ్చు. ఆ పద్ధతులు:

భీమా: జీవిత భీమా పాలసీకి లేదా రిటైర్‌మెంట్‌/పెన్షన్‌ పథకానికి లబ్దిదారుగా Watch Tower Society పేరును సూచించవచ్చు.

బ్యాంకు ఖాతాలు: స్థానిక బ్యాంకు నియమాల ప్రకారం బ్యాంకు ఖాతాలకు, డిపాజిట్ల సర్టిఫికెట్లకు లేదా వ్యక్తిగత రిటైర్మెంట్‌ ఖాతాలకు లబ్దిదారుగా Watch Tower Societyని పెట్టవచ్చు లేదా మరణానంతరం Watch Tower Societyకి చెల్లించే ఏర్పాటును చేయవచ్చు.

షేర్లు, బాండ్లు: షేర్లను, బాండ్లను Watch Tower Societyకి పూర్తిగా కానుకగా ఇవ్వవచ్చు.

స్థలాలు:అమ్మదగిన స్థలాలను పూర్తిగా కానుకగా ఇవ్వవచ్చు లేదా అవి నివాస స్థలాలైతే ఆమె/అతడు జీవించినంత కాలం ఆ స్థలంలోనే నివసించే ఏర్పాటుతో విరాళంగా ఇవ్వవచ్చు. ఇలాంటి వాటికి సంబంధించిన దస్తావేజులను వ్రాసేముందు మీ దేశంలోని బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

వార్షికభత్య విరాళం: వార్షికభత్య విరాళమనే ఏర్పాటులో ఒక వ్యక్తి డబ్బును లేదా డబ్బుహామీలను Watch Tower Societyకి బదిలీ చేస్తాడు. ఆ తర్వాత ఆ దాత లేదా ఆ దాత నియమించిన వ్యక్తి జీవితాంతం ప్రతి సంవత్సరం నిర్దిష్టమైన వార్షికభత్యం పొందుతాడు. దాత ఏ సంవత్సరంలోనైతే వార్షికభత్య విరాళ ఏర్పాటు చేస్తాడో ఆ సంవత్సరం ఆయనకు ఆదాయపన్ను మినహాయింపు లభిస్తుంది.

వీలునామాలు, ట్రస్ట్‌లు: ఆస్తిని లేదా డబ్బును చట్టబద్ధంగా Watch Tower Society పేర వీలునామా వ్రాయవచ్చు, లేక ఒక ట్రస్ట్‌ అగ్రిమెంట్‌ లబ్దిదారుగా Watch Tower Society పేరు వ్రాయవచ్చు. ఒక మతపరమైన సంస్థకు ప్రయోజనం చేకూర్చే ట్రస్ట్‌వల్ల పన్ను చెల్లింపు ప్రయోజనాలు కొన్ని పొందవచ్చు.

“ధర్మదాన ప్రణాళిక” అనే పదబంధం సూచిస్తున్నట్లుగా, ఇలా విరాళాలు ఇవ్వడానికి దాత ముందుగా ప్రణాళిక వేసుకోవలసి ఉంటుంది. ప్రణాళిక వేసుకొని ఇవ్వడానికి సంబంధించిన పద్ధతుల్లో ఏదొక దానిని ఉపయోగించి యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పనికి మద్దతునివ్వాలని కోరుకునేవారి సహాయార్థం ప్రపంచవ్యాప్త రాజ్య సేవ ప్రయోజనార్థం ధర్మదాన ప్రణాళిక అనే బ్రోషుర్‌ ఆంగ్లంలోను, స్పానిష్‌లోను రూపొందించబడింది. కానుకలకు, వీలునామాలకు, ట్రస్ట్‌లకు సంబంధించి అనేకులు అడిగిన ప్రశ్నలకు జవాబుగా ఆ బ్రోషుర్‌ వ్రాయబడింది. దానిలో స్థలాల ప్రణాళిక, ఆర్థిక ప్రణాళిక, పన్ను ప్రణాళికలకు సంబంధించి ఉపయోగకరమైన అదనపు సమాచారం కూడా ఉంది. వ్యక్తులు ఇప్పుడు లేదా మరణానంతరం వీలునామా ద్వారా విరాళాలు ఇవ్వగల అనేక పద్ధతుల గురించి అది తెలియజేస్తుంది. ఆ బ్రోషుర్‌ను చదివి, తమ స్వంత న్యాయ సలహాదారులను లేదా పన్ను సలహాదారులను, చారిటబుల్‌ ప్లానింగ్‌ ఆఫీసును (ధర్మదాన ప్రణాళికా సంబంధిత వ్యవహారాలను చూసుకొనే కార్యాలయాన్ని) సంప్రదించిన తర్వాత చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులకు మద్దతునివ్వగలిగారు, అదే సమయంలో అలా చేయడం ద్వారా పన్ను చెల్లింపు మినహాయింపును అధికం చేసుకున్నారు.

మరింత సమాచారం కోసం మీరు క్రింద ఇవ్వబడిన చిరునామాకు లేదా మీ దేశంలోని సేవను పర్యవేక్షించే యెహోవాసాక్షుల కార్యాలయానికి ఉత్తరం వ్రాయవచ్చు లేదా ఫోన్‌ చేయవచ్చు.

Jehovah’s Witnesses of India

Post Box 6440, Yelahanka,

Bangalore 560 064,

Karnataka.

Telephone: (080) 8468072

[26వ పేజీలోని చిత్రం]

ఉదారంగా ఉండేందుకు తొలి క్రైస్తవులను ప్రేరేపించినదేమిటి?