కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నమ్మకమైన క్రైస్తవ స్త్రీలు —దేవుని ప్రశస్త ఆరాధకులు

నమ్మకమైన క్రైస్తవ స్త్రీలు —దేవుని ప్రశస్త ఆరాధకులు

నమ్మకమైన క్రైస్తవ స్త్రీలు—⁠దేవుని ప్రశస్త ఆరాధకులు

“అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము; యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును.”​సామెతలు 31:30.

ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించి లోకం బాహ్యరూపానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తోంది. కానీ యెహోవాకు అంతరంగ స్వభావంమీదే ముఖ్యంగా ఆసక్తివుంది, అది వయస్సు పెరుగుతున్నకొద్ది మరింత చూడముచ్చటగా తయారవుతుంది. (సామెతలు 16:​31) అందుకే బైబిలు స్త్రీలకు ఇలా ఉద్బోధిస్తోంది: “జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.”​—⁠1 పేతురు 3:3, 4.

2 బైబిల్లో ప్రస్తావించబడిన అనేకమంది స్త్రీలు అలాంటి పొగడదగిన స్వభావాన్నే చూపించారు. మొదటి శతాబ్దంలో, వారిలో కొంతమంది యేసుకు ఆయన అపొస్తలులకు పరిచారంచేసే ఆధిక్యత పొందారు. (లూకా 8:​1-3) ఆ తర్వాత, క్రైస్తవ స్త్రీలు ఆసక్తిగల సువార్తికులయ్యారు; మరికొందరు అపొస్తలుడైన పౌలుతోసహా నాయకత్వం వహిస్తున్న క్రైస్తవ పురుషులకు విలువైన మద్దతిచ్చారు; ఇంకా కొందరైతే సంఘ కూటాలు జరుపుకోవడానికి తమ గృహాలను అందుబాటులో ఉంచుతూ అసాధారణరీతిలో ఆతిథ్యమిచ్చారు.

3 యెహోవా తన సంకల్పాల నెరవేర్పులో స్త్రీలను గొప్పగా ఉపయోగించుకుంటాడనే విషయం లేఖనాల్లో ముందే చెప్పబడింది. ఉదాహరణకు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు పరిశుద్ధాత్మపొంది రాజ్యసువార్తను వ్యాపింపజేయడంలో పాలుపంచుకుంటారని యోవేలు 2:28, 29 ముందే ప్రవచించింది. సా.శ. 33 పెంతెకొస్తునుండి ఆ ప్రవచన నెరవేర్పు ఆరంభమైంది. (అపొస్తలుల కార్యములు 2:​1-4, 16-18) ఆత్మాభిషిక్త స్త్రీలు కొంతమంది ప్రవచన వరంవంటి అద్భుతవరాలు పొందారు. (అపొస్తలుల కార్యములు 21:​8, 9) విశ్వసనీయులైన సహోదరీల ఈ పెద్ద ఆధ్యాత్మిక సైన్యం పరిచర్యలో తాము చూపిన ఆసక్తి ద్వారా మొదటి శతాబ్దంలో క్రైస్తవత్వం వేగంగా వ్యాపించడానికి దోహదపడింది. వాస్తవానికి, సువార్త “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడినట్టు” అపొస్తలుడైన పౌలు దాదాపు సా.శ. 60లో వ్రాశాడు.​—⁠కొలొస్సయులు 1:23.

ధైర్యానికి, ఆసక్తికి, ఆతిథ్యానికి మెచ్చుకోబడ్డారు

4 ప్రత్యేకంగా కొంతమంది స్త్రీలు జరిగించిన పరిచర్యను ప్రశంసించిన వారిలో అపొస్తలుడైన పౌలు ఒకరు. నేడు కూడా క్రైస్తవ పైవిచారణకర్తలు ఆసక్తిగల స్త్రీలు జరిగించే పరిచర్యను విలువైనదిగా పరిగణిస్తారు. పౌలు, పేరుతో ప్రస్తావించిన స్త్రీలలో, ‘ప్రభువునందు ప్రయాసపడిన త్రుపైనా, త్రుఫోసా’ అలాగే ‘ప్రభువునందు బహుగా ప్రయాసపడిన ప్రియమైన పెర్సిసు’ అనే వారున్నారు. (రోమీయులు 16:​12) యువొదియ, సుంటుకే “సువార్తపనిలో నాతోకూడ ప్రయాసపడినవారు” అని పౌలు వ్రాశాడు. (ఫిలిప్పీయులు 4:​2, 3) తన భర్త అకులతోపాటు ప్రిస్కిల్ల కూడా పౌలుతోకలిసి సేవచేసింది. పౌలుకొరకు ఆమె, ఆమె భర్త ‘తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించారు.’ ఇది “నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులైయున్నారు” అని వ్రాసేలా పౌలును కదిలించింది.​—⁠రోమీయులు 16:3, 4; అపొస్తలుల కార్యములు 18:⁠1, 2.

5 ప్రిస్కిల్ల చూపిన ఆసక్తికి, ధైర్యానికి తోడ్పడిందేమిటి? దాని రహస్యమేమిటో అపొస్తలుల కార్యములు 18:24-26లో కనబడుతుంది. అక్కడ మనం, వెల్లడిచేయబడిన సత్యాన్ని గురించిన తాజా వివరాలను, మంచి సామర్థ్యంగల ప్రసంగీకుడైన అపొల్లోకు తెలియజేయడంలో ఆమె తన భర్తకు మద్దతిచ్చిందని చదువుతాము. కాబట్టి ప్రిస్కిల్ల దేవుని వాక్యం మరియు అపొస్తలుల బోధయొక్క మంచి విద్యార్థిని అని రుజువవుతోంది. తత్ఫలితంగా, ఆమె అటు దేవునికి ఇటు తన భర్తకు ప్రశస్తమైనదానిగా, అలాగే తొలి సంఘపు ప్రశస్త సభ్యురాలిగా తయారుచేసిన విశిష్ట లక్షణాలను వృద్ధిచేసుకుంది. పట్టుదలతో బైబిలు అధ్యయనంచేస్తూ, అదే సమయంలో ‘నమ్మకమైన గృహనిర్వాహకుని’ ద్వారా యెహోవా అందిస్తున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని పుచ్చుకొంటూ కష్టపడి పనిచేసే అనేకమంది నేటి క్రైస్తవ సహోదరీలు కూడా అంతే ప్రశస్తంగా ఉన్నారు.​—⁠లూకా 12:42.

6 అకుల ప్రిస్కిల్లలు అసాధారణ అతిథేయులు. కొరింథులో గుడారాలు కుట్టే వారి వృత్తిలో వారితోకలిసి పనిచేసినప్పుడు పౌలు వారింట్లోనే బసచేశాడు. (అపొస్తలుల కార్యములు 18:​1-3) ఆ దంపతులు ఎఫెసుకు ఆ తర్వాత రోమాకు వెళ్లినప్పుడు కూడా క్రైస్తవ కూటాలకు తమ గృహాన్ని ఇవ్వడం ద్వారా తమ క్రైస్తవ ఆతిథ్య సత్కార్యాన్ని మరచిపోలేదు. (అపొస్తలుల కార్యములు 18:18, 19; 1 కొరింథీయులు 16:​9, 19) అదే ప్రకారం నుంఫా, మార్కు అనుపేరుగల యోహాను తల్లియైన మరియ కూడా క్రైస్తవ కూటాలకు తమ గృహాలనిచ్చారు.​—⁠అపొస్తలుల కార్యములు 12:12; కొలొస్సయులు 4:15.

నేడు అమూల్య సంపదగా ఉన్నారు

7 మొదటి శతాబ్దంలో వలెనే, నేడు దేవుని సంకల్ప నెరవేర్పులో, ప్రత్యేకంగా సువార్తపనిలో నమ్మకమైన క్రైస్తవ స్త్రీలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సహోదరీలు ఎంత చక్కని చరిత్ర కలిగివున్నారో గదా! 2002లో చనిపోయేవరకు 50 సంవత్సరాలకుపైగా యెహోవాకు నమ్మకంగా సేవచేసిన గ్వెన్‌ ఉదాహరణే పరిశీలించండి. “మా నగరంలో సువార్తికురాలిగా గ్వెన్‌చూపిన ఆసక్తి ప్రసిద్ధికెక్కింది. ఆమె దృష్టిలో ప్రతీ మనిషి యెహోవా ప్రేమ, ఆయన వాగ్దానాలు పొందడానికి అర్హులే. దేవునిపట్ల, ఆయన సంస్థపట్ల, మా కుటుంబంపట్ల ఆమె చూపిన యథార్థతా స్వభావం, దానికితోడు మేము నిరుత్సాహపడినప్పుడు ఆమె ఇచ్చిన ప్రోత్సాహం మేము కలిసి గడిపిన దీవెనకరమైన, సంపూర్ణమైన జీవితంలో నాకు, మా పిల్లలకు గొప్ప ఆసరాగా నిలిచింది. ఆమె తోడు మరువరానిది” అని ఆమె భర్త చెబుతున్నాడు. గ్వెన్‌, ఆమె భర్త 61 సంవత్సరాలపాటు దంపతులుగా జీవించారు.

8 వివాహిత, అవివాహిత క్రైస్తవ స్త్రీలు తమకున్నంతలోనే సర్దుకొని జీవిస్తూ, సందడిగా ఉండే నగరాల నుండి మారుమూల ప్రదేశాల వరకు వివిధ ప్రాంతాల్లో రాజ్య సందేశాన్ని వ్యాప్తిచేస్తూ వేల సంఖ్యలో పయినీర్లుగా, మిషనరీలుగా సేవచేస్తున్నారు. (అపొస్తలుల కార్యములు 1:⁠8) యెహోవాకు సంపూర్ణంగా సేవచేయడానికి అనువుగా అనేకమంది తమకొక ఇల్లు లేదా పిల్లలు కావాలనే కోరికను త్యాగంచేశారు. ప్రపంచవ్యాప్తంగా బెతెల్‌ గృహాల్లో వేలాదిమంది సహోదరీలు సేవచేస్తుండగా, ప్రయాణ పైవిచారణకర్తలుగా సేవచేస్తున్న తమ భర్తలకు విశ్వసనీయంగా మద్దతిస్తున్న వారూవున్నారు. నిస్సందేహంగా ఈ స్వయం త్యాగ స్త్రీలు యెహోవా మందిరాన్ని మహిమతో నింపే ‘అన్యజనులందరి యిష్టవస్తువుల్లో’ ఉన్నారు.​—⁠హగ్గయి 2:⁠7.

9 నిజమే, చాలామంది క్రైస్తవ స్త్రీలు తాము శ్రద్ధచూపాల్సిన కుటుంబ బాధ్యతలున్నాయి; అయినాసరే వారు రాజ్యాసక్తులను ముందుంచుతున్నారు. (మత్తయి 6:​33) ఓ అవివాహిత పయినీరు సహోదరి ఇలా రాసింది: “మా అమ్మ చెదరని విశ్వాసం, చక్కని మాదిరి నేను క్రమ పయినీరు కావడంలో కీలక పాత్ర పోషించాయి. నిజానికి, ఆమె శ్రేష్ఠమైన నా పయినీరు భాగస్వాముల్లో ఒకరు.” ఐదుగురు ఎదిగిన ఆడపిల్లలకు తల్లిగావున్న తన భార్య గురించి ఒక భర్త ఇలా చెబుతున్నాడు: “మా ఇల్లు అన్ని సందర్భాల్లో పరిశుభ్రంగా, చక్కగా సర్దివుంటుంది. మా కుటుంబం ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి నిలుపగలిగే విధంగా బానీ దానిని నిరాడంబరంగా, శుభ్రంగా పెట్టేది. ఆమె మా ఆదాయాన్ని జాగ్రత్తగా చూసి ఖర్చుచేసినందువల్లే, నేను మా కుటుంబానికీ, ఆధ్యాత్మిక విషయాలకూ ఎక్కువ సమయమిచ్చేలా 32 సంవత్సరాలపాటు పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేయడానికి సాధ్యపడింది. అలాగే నా భార్య, కష్టపడి పనిచేయడంలో ఉన్న విలువేమిటో పిల్లలకు నేర్పించింది. ఆమె ప్రశంసనీయురాలు.” ప్రస్తుతం ఆ భార్యాభర్తలిద్దరూ యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవచేస్తున్నారు.

10 ఎదిగిన పిల్లలున్న తన భార్య గురించి ఓ భర్త ఇలా వ్రాస్తున్నాడు: “సూసన్‌కు దేవునిపట్ల, ఆయన ప్రజలపట్ల ఉన్న ప్రగాఢమైన ప్రేమను, అలాగే ఆమె అర్థంచేసుకునే గుణాన్ని, సహానుభూతిని, నిజాయితీని నేను చాలా మెచ్చుకుంటాను. మనమివ్వగల శ్రేష్ఠమైన ప్రతిదానికి యెహోవా అర్హుడని ఆమె అన్ని సందర్భాల్లోనూ భావించేది. ఆ సూత్రాన్నే దేవుని సేవకురాలిగా, తల్లిగా తనకు అన్వయించుకొనేది.” తన భార్య మద్దతుతో ఈ భర్త సంఘపెద్దగా, పయినీరుగా, ప్రత్యామ్నాయ ప్రాంతీయ పైవిచారణకర్తగా, ఆసుపత్రి అనుసంధాన కమిటీ సభ్యునిగా సేవచేయడంతోపాటు విశేషమైన అనేక ఆధ్యాత్మిక పనులు చేయగలుగుతున్నాడు. అలాంటి స్త్రీలు తమ భర్తలకు, తోటి క్రైస్తవులకు, అన్నింటికంటే మిన్నగా యెహోవాకు ఎంత ప్రశస్తమైనవారో గదా!​—⁠సామెతలు 31:28, 30.

భర్తలేని ప్రశస్త స్త్రీలు

11 యెహోవా తరచూ విధవరాండ్ర సంక్షేమంపట్ల తన చింతను వ్యక్తపరిచాడు. (ద్వితీయోపదేశకాండము 27:19; కీర్తన 68:5; యెషయా 10:​1, 2) ఆయన మారలేదు. ఆయనకు ఇప్పటికీ విధవరాండ్రయందు మాత్రమేకాక ఒంటరి తల్లులందు, అవివాహితులుగానే ఉండాలని కోరుకున్న స్త్రీలందు లేదా తగిన క్రైస్తవ భర్త దొరకని కారణంగా ఒంటరిగావున్న స్త్రీలందు మిక్కిలి శ్రద్ధవుంది. (మలాకీ 3:6; యాకోబు 1:​27) క్రైస్తవ జత మద్దతులేకుండానే యెహోవాను సేవిస్తున్న నమ్మకస్థుల్లో మీరుకూడా ఉంటే, మీరు దేవుని దృష్టిలో ప్రశస్తమైన వారిగా ఉన్నారని నిశ్చయత కలిగి ఉండవచ్చు.

12 ఉదాహరణకు, “ప్రభువునందు మాత్రమే” పెండ్లిచేసుకోవాలనే యెహోవా ఉపదేశంపట్ల విశ్వసనీయంగా ఉన్నందున వివాహం చేసుకోని మన క్రైస్తవ సహోదరీల గురించి ఆలోచించండి. (1 కొరింథీయులు 7:39; సామెతలు 3:⁠1) దేవుని వాక్యం వారికిలా హామీ ఇస్తోంది: ‘యథార్థవంతులయెడల యెహోవా యథార్థవంతుడుగా ఉండును.’ (2 సమూయేలు 22:​26) అయినాసరే, వారిలో చాలామందికి ఒంటరిగా ఉండడం ఒక సవాలే. ఒక సహోదరి ఇలా చెబుతోంది: “ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసుకోవాలని నేను తీర్మానించుకున్నాను, కానీ నేను ఒంటరిగావున్న సమయంలోనే నా స్నేహితులు చక్కని క్రైస్తవ పురుషులను పెళ్లిచేసుకోవడం చూసి నేనెన్నోసార్లు కన్నీరుమున్నీరుగా విలపించాను.” మరో సహోదరి, “నేను 25 సంవత్సరాలు యెహోవాకు సేవచేశాను. నేనాయనపట్ల విశ్వసనీయంగా నిలబడాలని తీర్మానించుకున్నాను, అయితే ఒంటరితనపు భావాలు తరచూ నన్ను దుఃఖాక్రాంతం చేస్తాయి” అని అంటూ ఇంకా ఇలా చెబుతోంది: “నాలాంటి సహోదరీలు ప్రోత్సాహం కోసం పరితపిస్తారు.” అలాంటి విశ్వసనీయులకు మనమెలా సహాయం చేయవచ్చు?

13 ఒక విధానాన్ని మనమొక ప్రాచీన ఉదాహరణలో చూడవచ్చు. పెళ్లిచేసుకోగల అవకాశాన్ని యెఫ్తా కుమార్తె పరిత్యజించినప్పుడు, ఆమె త్యాగనిరతిని ప్రజలు గ్రహించారు. ఆమెను ప్రోత్సహించడానికి వారేమి చేశారు? ‘ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు నాలుగు దినములు గిలాదుదేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధిచేయుటకు’ వెళ్లేవారు. (న్యాయాధిపతులు 11:​30-40) అదే ప్రకారం, నమ్మకంగా దేవుని నియమానికి లోబడే ఒంటరి సహోదరీలను మనం హృదయపూర్వకంగా మెచ్చుకోవాలి. * మన ఆసక్తి చూపగల మరో విధానమేమిటి? అలాంటి నమ్మకస్థులైన ప్రియ సహోదరీలు తమ విశ్వాస్యతా సేవలో కొనసాగేలా వారిని బలపరచమని మన ప్రార్థనల్లో యెహోవాకు విన్నవించుకోవాలి. వారిని యెహోవా మరియు క్రైస్తవ సంఘ సభ్యులంతా ఆప్యాయంగా ప్రేమిస్తున్నారనే, బహుగా ప్రశంసిస్తున్నారనే హామీకి వారు అర్హులు.​—⁠కీర్తన 37:28.

ఒంటరి తల్లిదండ్రులు విజయం సాధించగల విధానం

14 ఒంటరి తల్లులుగావున్న క్రైస్తవ స్త్రీలు కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటారు. అయితే, బైబిలు సూత్రాలకు అనుగుణంగా తమ పిల్లలను పెంచే విషయంలో సహాయం కోసం వారు యెహోవావైపు చూడవచ్చు. నిజమే, మీరు ఒంటరి తల్లి/తండ్రి అయితే అన్ని సందర్భాల్లో మీరు ఏకకాలంలో తల్లీ, తండ్రి పాత్ర పోషించలేరు. అయినా, విశ్వాసంతో యెహోవాను అర్థిస్తే మీకున్న అనేక బాధ్యతలను నిర్వహించేలా ఆయన మీకు సహాయం చేస్తాడు. ఉదాహరణకు, సరుకులున్న బరువైన సంచిని బహుళ అంతస్థుల భవనంలో మీ అపార్టుమెంటుకు తీసుకెళ్లాలని అనుకుందాం. లిఫ్టు అందుబాటులోవున్నా మీరింకా మెట్లెక్కుతూ ఆయాసపడతారా? లేదు! అదేవిధంగా, యెహోవాను సహాయం అడిగే వీలున్నప్పుడు మీరొక్కరే బాధాతప్త భావావేశాల బరువులు మోయడానికి ప్రయత్నించకండి. నిజానికి, తనకు ప్రార్థించమని ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. కీర్తన 68:⁠19 ఇలా చెబుతోంది: ‘ప్రభువు స్తుతినొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు.’ అలాగే, ‘ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక’ మీ చింత యావత్తు ఆయనమీద వేయమని 1 పేతురు 5:7 మిమ్మును ఆహ్వానిస్తోంది. అందువల్ల సమస్యలు, చింతలు మిమ్మల్ని కృంగదీసినప్పుడు, “యెడతెగక” మీ భారం మీ పరలోకపు తండ్రిపై మోపండి.​—⁠1 థెస్సలొనీకయులు 5:17; కీర్తన 18:6; 55:22.

15 ఉదాహరణకు, మీరొక తల్లిగావుంటే పాఠశాలలో మీ పిల్లలపై వారి తోటివారు చూపగల ప్రభావం గురించి, వారికెదురయ్యే యథార్థతా పరీక్షల గురించి మీకు తప్పక చింత ఉంటుంది. (1 కొరింథీయులు 15:​33) ఈ చింతలు సముచితమైనవే. అయితే అవి ప్రార్థనాంశాలు కూడా. మీ పిల్లలు పాఠశాలకు వెళ్లేముందు బహుశా దినవచనం కలిసి పరిశీలించిన తర్వాత, అలాంటి అంశాల గురించి వారితో కలిసి ఎందుకు ప్రార్థించకూడదు? హృదయపూర్వకంగా, ప్రత్యేకంగాచేసే ఆ ప్రార్థనలు పిల్లల మనస్సుపై బలంగా ముద్రవేయగలవు. అన్నిటికిపైగా, యెహోవా వాక్యాన్ని మీ పిల్లల హృదయాల్లో నాటేందుకు ఓపికగా కృషిచేసినప్పుడు ఆయన దీవెనలు మీరు పొందగలుగుతారు. (ద్వితీయోపదేశకాండము 6:6, 7; సామెతలు 22:⁠6) “ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి” అని గుర్తుంచుకోండి.​—⁠1 పేతురు 3:12; ఫిలిప్పీయులు 4:6, 7.

16 ఆరుగురు పిల్లల తల్లియైన ఓలివీయ ఉదాహరణ పరిశీలించండి. చివరి అమ్మాయి పుట్టిన వెంటనే అవిశ్వాసియైన ఆమె భర్త కుటుంబం వదిలి వెళ్లిపోయాడు, అయినా పిల్లలను దేవుని మార్గాల్లో పెంచే బాధ్యతను ఆమె ఇష్టపూర్వకంగా తన భుజాలపై వేసుకుంది. అప్పుడు ఓలివీయ కుమారుడు డారెన్‌కు 5 సంవత్సరాలు. ఆయనకిప్పుడు 31 సంవత్సరాలు, ఒక క్రైస్తవ పెద్దగా పయినీరుగా సేవచేస్తున్నాడు. ఆమెకున్న చింతలకు ఆజ్యంపోస్తూ డారెన్‌ చిన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు, అతనింకా ఆ సమస్యతోనే బాధపడుతున్నాడు. తన బాల్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ డారెన్‌ ఇలా రాస్తున్నాడు: “ఆసుపత్రి బెడ్‌పై కూర్చొని అమ్మకోసం ఆత్రంగా ఎదురుచూడడం నాకింకా జ్ఞాపకముంది. నా ప్రక్కనే కూర్చొని ఆమె ప్రతిరోజు నాకు బైబిలు చదివి వినిపించేది. ఆ తర్వాత ‘యెహోవాకు కృతజ్ఞతలు’ అనే రాజ్యగీతం పాడేది. * ఇప్పటికీ అదే నా అభిమాన రాజ్యగీతం.”

17 యెహోవాపై ఓలివీయకున్న నమ్మకం, ప్రేమ ఒంటరి తల్లిగా ఆమె విజయసాధనకు తోడ్పడ్డాయి. (సామెతలు 3:​5, 6) ఆమెకున్న చక్కని దృక్పథం, పిల్లల ఎదుట ఆమెపెట్టిన లక్ష్యాల్లో ప్రతిబింబించింది. “అమ్మ అన్ని సందర్భాల్లో పూర్తికాల పరిచర్యనే లక్ష్యంగా వెంబడించమని ప్రోత్సహించింది. ఫలితంగా నాకున్న ఐదుగురు సహోదరీల్లో నలుగురు, నేను పూర్తికాల పరిచర్యలో ప్రవేశించాము. అయినాసరే, ఈ విషయాల గురించి అమ్మ ఎవ్వరికీ గొప్పలు చెప్పుకోలేదు. ఆమె ఆ చక్కని లక్షణాలను అనుకరించడానికి నేను తీవ్రంగా కృషిచేస్తున్నాను” అని డారెన్‌ చెబుతున్నాడు. నిజమే, ఓలివీయ పిల్లల మాదిరిగా పిల్లలందరూ దేవుని సేవకులుగా ఎదగరు. అయితే, బైబిలు సూత్రాల ప్రకారం జీవించడానికి తల్లి శాయశక్తులా కృషిచేసినప్పుడు, యెహోవా నిర్దేశం, ప్రేమపూర్వక మద్దతు తనకు లభిస్తాయని ఆమె నిశ్చయత కలిగివుండవచ్చు.​—⁠కీర్తన 32:⁠8.

18 దేవుడు అనుగ్రహించే ఆ మద్దతు క్రమమైన ఆధ్యాత్మిక పోషణా కార్యక్రమం, క్రైస్తవ సహోదరత్వం, ఆధ్యాత్మిక పరిణతిగల ‘మనుష్యులలోని ఈవులున్న’ క్రైస్తవ సంఘం ద్వారానే ఎక్కువగా లభ్యమవుతోంది. (ఎఫెసీయులు 4:⁠8) ‘దిక్కులేని పిల్లల విధవరాండ్ర ఇబ్బందిలో’ వారి అవసరతలకు ప్రత్యేక శ్రద్ధనిస్తూ, సంఘస్థులందరిని బలపరచడానికి నమ్మకస్థులైన పెద్దలు కష్టించి పనిచేస్తారు. (యాకోబు 1:​27) కాబట్టి ఎన్నటికీ మీకైమీరు వేరుండకుండా, దేవుని ప్రజలకు చేరువగా ఉండండి.​—⁠సామెతలు 18:1; రోమీయులు 14:⁠7.

విధేయత ఒక ఆకర్షణీయ లక్షణం

19 స్త్రీని పురుషునికి సాటియైన సహాయంగా యెహోవా సృష్టించాడు. (ఆదికాండము 2:​18) కాబట్టి, భార్య తన భర్తకు విధేయత చూపిస్తుందంటే దానిలో తక్కువచూపు అనే భావంలేదు. బదులుగా, స్త్రీ తనకున్న అనేక ఈవులను, నైపుణ్యాలను దేవుని చిత్తానికి అనుగుణంగా ఉపయోగించడానికి అనుమతిస్తూ అది ఆమెను ఘనపరుస్తుంది. ప్రాచీన ఇశ్రాయేలులో ఓ సమర్థురాలైన భార్యచేసే వివిధ కార్యాలను సామెతలు 31వ అధ్యాయం వర్ణిస్తోంది. ఆమె బీదవారికి సహాయం చేసింది, ద్రాక్షతోటలు నాటింది, పొలం కొన్నది. అవును, “ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు.”​—⁠11, 16, 20 వచనాలు.

20 నమ్రత, దేవుని భయంగల స్త్రీ ప్రగాఢ కోరికతో తనను హెచ్చించుకోదు లేదా తన భర్తతో పోటీపడదు. (సామెతలు 16:​18) ఆమె ప్రాథమికంగా ఐహిక లక్ష్యసాధనతో తన సంతృప్తినే వెంబడించదు గానీ తనకున్న దైవానుగ్రహ ఈవులను ముఖ్యంగా ఇతరులకు సేవచేసేందుకు అంటే తన కుటుంబానికి, తోటి క్రైస్తవులకు, పొరుగువారికి, అన్నింటికంటే పైగా యెహోవా సేవకొరకు ఉపయోగిస్తుంది. (గలతీయులు 6:10; తీతు 2:​3-5) ఎస్తేరు రాణిని గురించిన బైబిలు ఉదాహరణను పరిశీలించండి. తనకు భౌతిక సౌందర్యమున్నా ఆమెలో నమ్రతా విధేయతా ఉన్నాయి. (ఎస్తేరు 2:​13, 15) వివాహమైనప్పుడు, రాజు మాజీ భార్య వష్తికి భిన్నంగా, ఆమె తన భర్తయైన అహష్వేరోషు రాజుపట్ల ప్రగాఢ గౌరవం చూపింది. (ఎస్తేరు 1:10-12; 2:​16, 17) రాణి అయిన తర్వాత కూడా, ఎస్తేరు సముచిత విషయాల్లో పెద్దవాడూ సమీపజ్ఞాతియైన మొర్దెకై అభిప్రాయానికి కూడా ఆమె గౌరవపూర్వకంగా లోబడింది. అంతమాత్రాన ఆమె బలహీనురాలని కాదు. యూదులను సర్వనాశనం చేయడానికి పథకం పన్నిన పలుకుబడిగల, కఠినుడైన హామాను మోసాన్ని ఆమె ధైర్యంగా బయటపెట్టింది. యెహోవా తన ప్రజలను కాపాడేందుకు ఎస్తేరును శక్తిమంతంగా ఉపయోగించుకున్నాడు.​—⁠ఎస్తేరు 3:8-4:17; 7:1-10; 9:13.

21 గతంలో, ప్రస్తుతకాలంలో దైవభక్తిగల స్త్రీలు యెహోవాపట్ల, ఆయన ఆరాధనపట్ల తమ అవిభాగిత భక్తిని ప్రదర్శించారన్నది స్పష్టం. అందుకే, దేవుని భయంగల స్త్రీలు యెహోవా దృష్టిలో ప్రశస్తమైనవారు. క్రైస్తవ సహోదరీల్లారా, ‘ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన’ మరెంతో కోరదగిన ‘పాత్రలాగ’ తయారయ్యేందుకు యెహోవా మిమ్మల్ని తన ఆత్మతో క్రమంగా తీర్చిదిద్దేందుకు అనుమతించండి. (2 తిమోతి 2:21; రోమీయులు 12:⁠2) అలాంటి ప్రశస్త ఆరాధకులను గురించి దేవుని వాక్యమిలా చెబుతోంది: “చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును గవునులయొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.” (సామెతలు 31:​31) మీలో ప్రతి ఒక్కరి విషయంలో అది నిజమగును గాక.

[అధస్సూచీలు]

^ పేరా 18 ఆ విధంగా ఎలా మెచ్చుకోవాలో తెలుసుకొనేందుకు, కావలికోట 2002, మార్చి 15 26-8 పేజీలు చూడండి.

^ పేరా 22 యెహోవాసాక్షులు ప్రచురించిన యెహోవాకు స్తుతిగీతాలు పాడండిలో 26వ పాట.

మీరు జ్ఞాపకం తెచ్చుకుంటారా?

• మొదటి శతాబ్దపు క్రైస్తవ స్త్రీలు కొంతమంది యెహోవా దృష్టిలో ప్రశస్తమైన వారని ఎలా నిరూపించుకున్నారు?

• మన కాలంలో అనేకమంది సహోదరీలు ఎలా తమను దేవునికి ప్రశస్తమైనవారిగా చేసుకున్నారు?

• ఒంటరి తల్లులను, భర్తలేని ఇతర సహోదరీలను యెహోవా ఏయే విధాలుగా బలపరుస్తున్నాడు?

• శిరస్సత్వపు ఏర్పాటుకు ఒక స్త్రీ తన హృదయపూర్వక గౌరవాన్ని ఎలా చూపించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. లోకంతో పోలిస్తే అందాన్ని యెహోవా ఎలా దృష్టిస్తాడు?

2, 3. మొదటి శతాబ్దంలో సువార్త వ్యాపింపచేయడానికి స్త్రీలు ఎలా దోహదపడ్డారు, ఇది ఏ విధంగా ప్రవచించబడింది?

4. మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలోని చాలామంది స్త్రీలను మెచ్చుకోవడానికి పౌలుకు ఎందుకు మంచి కారణముంది?

5, 6. నేటి సహోదరీలకు ప్రిస్కిల్ల ఏయే విధాలుగా చక్కని మాదిరినుంచింది?

7, 8. ప్రస్తుతకాల క్రైస్తవ స్త్రీలనేకమందికి మెచ్చుకోదగిన ఎలాంటి చరిత్రవుంది, ఏ విషయంలో వారు నిశ్చయతతో ఉండవచ్చు?

9, 10. క్రైస్తవ భార్యలు, తల్లులు ఉంచిన చక్కని మాదిరిపట్ల కుటుంబ సభ్యులు కొందరు తమ ప్రశంసనెలా వ్యక్తపరిచారు?

11. (ఎ) విశ్వసనీయులైన స్త్రీలపట్ల, ప్రత్యేకంగా విధవరాండ్రపట్ల యెహోవా తన శ్రద్ధనెలా వెల్లడించాడు? (బి) క్రైస్తవ విధవరాండ్రు, భర్తలేని విశ్వాసులైన ఇతర సహోదరీలు దేని విషయంలో నిశ్చయత కలిగి ఉండవచ్చు?

12. (ఎ) క్రైస్తవ సహోదరీలు కొంతమంది యెహోవాపట్ల తమ విశ్వాస్యతను ఎలా ప్రదర్శిస్తున్నారు? (బి) మన సహోదరీలు కొందరు ఎలాంటి భావాలను తాళుకొంటున్నారు?

13. (ఎ) యెఫ్తా కుమార్తెను సందర్శించినవారు చూపిన మాదిరినుండి మనమేమి నేర్చుకుంటాము? (బి) మన సంఘంలోని ఒంటరి సహోదరీలపట్ల అదనంగా మరియేవిధాలుగా మనం ఆసక్తి చూపించవచ్చు?

14, 15. (ఎ) ఒంటరి తల్లులుగావున్న క్రైస్తవులు సహాయంకోసం ఎందుకు యెహోవాకు ప్రార్థించాలి? (బి) ఒంటరి తల్లులు తమ ప్రార్థనలకు అనుగుణంగా ఎలా ప్రవర్తించవచ్చు?

16, 17. (ఎ) తన తల్లిచూపిన ప్రేమ గురించి ఓ కుమారుడు ఏమిచెప్పాడు? (బి) ఆ తల్లి ఆధ్యాత్మిక దృక్కోణం తన పిల్లలపై ఎలా ప్రభావం చూపింది?

18. యెహోవా ఏర్పాటు చేసిన క్రైస్తవ సంఘాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని మనమెలా చూపవచ్చు?

19. భార్యచూపే విధేయతలో తక్కువచూపు అనే భావం ఎందుకు లేదు, ఏ బైబిలు ఉదాహరణ దీనిని బలపరుస్తోంది?

20. (ఎ) తన దైవానుగ్రహ సామర్థ్యాలను లేదా ఈవులను ఒక క్రైస్తవ స్త్రీ ఎలా దృష్టించాలి? (బి) ఎస్తేరు ఎలాంటి చక్కని లక్షణాలను ప్రదర్శించింది, ఫలితంగా యెహోవా ఆమెనెలా ఉపయోగించుకోగలిగాడు?

21. ఒక క్రైస్తవ స్త్రీ యెహోవాకు మరెంతో ప్రశస్తంగా ఎలా తయారుకాగలదు?

[17వ పేజీలోని బాక్సు]

ధ్యానించవలసిన మాదిరులు

బైబిల్లో ప్రస్తావించబడిన విశ్వసనీయులైన స్త్రీల మాదిరులను కొన్నింటిని మీరు అదనంగా పరిశీలించాలని ఇష్టపడుతున్నారా? అట్లయితే, క్రింద చూపబడిన లేఖనాలను దయచేసి చదవండి. ఇవ్వబడిన వివిధ వ్యక్తుల గురించి మీరు ధ్యానిస్తుండగా, మీ జీవితంలో మరింత విస్తృతంగా మీరు అన్వయించుకోగల సూత్రాలను గ్రహించడానికి ప్రయత్నించండి.​—⁠రోమీయులు 15:⁠4.

శారా: ఆదికాండము 12:1, 5; హెబ్రీయులు 11:9 ; 1 పేతురు 3:5, 6.

ఉదార స్వభావంగల ఇశ్రాయేలు స్త్రీలు: నిర్గమకాండము 35:5, 22, 25, 26; 36:3-7; లూకా 21:1-4.

దెబోరా: న్యాయాధిపతులు 4:1-5:31.

రూతు: రూతు 1:4, 5, 16, 17; 2:2, 3, 11-13; 4:15.

షూనేము స్త్రీ: 2 రాజులు 4:8-37.

కనాను స్త్రీ: మత్తయి 15:22-28.

మార్త, మరియ: మార్కు 14:​3-9; లూకా 10:38-42; యోహాను 11:17-29; 12:1-8.

తబితా: అపొస్తలుల కార్యములు 9:36-41.

ఫిలిప్పు నలుగురు కుమార్తెలు: అపొస్తలుల కార్యములు 21:⁠9.

ఫీబే: రోమీయులు 16:1, 2.

[15వ పేజీలోని చిత్రం]

విశ్వాస్యతకలిగి దేవుని నియమానికి లోబడే అవివాహిత సహోదరీలను మీరు మెచ్చుకుంటారా?

[16వ పేజీలోని చిత్రం]

పిల్లలు పాఠశాలకు వెళ్లడానికిముందు ప్రార్థనలో ప్రత్యేకంగా ఏ అంశాలను ప్రస్తావించవచ్చు?