కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ఏలీయా ఆత్మలో “రెండుపాళ్లు” దయచేయమని ఎలీషా ఎందుకు అడిగాడు?

ఏలీయా ఇశ్రాయేలులో ప్రవక్తగా తన నియామకాన్ని ముగిస్తాడనగా, చిన్నవాడైన ఎలీషా ప్రవక్త ఆయననిలా అభ్యర్థించాడు: “నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చునట్లు దయచేయుము.” (2 రాజులు 2:⁠9) ఆధ్యాత్మిక భావంలో చూస్తే, జ్యేష్ఠపుత్రునికి ఇవ్వబడే విధంగా రెట్టింపు భాగం ఇవ్వమని ఎలీషా అడుగుతున్నాడని తెలుస్తోంది. (ద్వితీయోపదేశకాండము 21:​17) ఆ వృత్తాంతాన్ని క్లుప్తంగా పరిశీలిస్తే ఇదేమిటో స్పష్టంగా అర్థమై, జరిగిన సంఘటన నుండి పాఠాలు నేర్చుకోవడానికి మనకు సహాయం చేస్తుంది.

యెహోవా నిర్దేశానికి అనుగుణంగా, ఏలీయా ప్రవక్త తన వారసునిగా ఎలీషాను అభిషేకించాడు. (1 రాజులు 19:​19-21) ఎలీషా దాదాపు 6 సంవత్సరాలు ఏలీయావద్ద నమ్మకమైన సేవకునిగా పనిచేశాడు, చివరివరకు అలాగే చేయాలని ఆయన తీర్మానించుకున్నాడు. ఏలీయా ఇశ్రాయేలులో ప్రవక్తగా పనిచేసిన చివరిరోజున కూడా, ఎలీషా ఆయననే అంటిపెట్టుకొని ఉన్నాడు. తనను వెంబడించడం మానుకోమని ఎలీషాను ఏలీయా బలవంతపెట్టినా, ఆ యువ ప్రవక్త మూడుసార్లు, “నేను నిన్ను విడువనని” అన్నాడు. (2 రాజులు 2:2, 4, 6; 3:​11) నిజానికి, ఎలీషా ఆ వృద్ధ ప్రవక్తను తన ఆధ్యాత్మిక తండ్రిగానే దృష్టించాడు.​—⁠2 రాజులు 2:12.

అయితే, ఏలీయాకు ఎలీషా ఒక్కడే ఆధ్యాత్మిక కుమారుడు కాదు. “ప్రవక్తల శిష్యులు” అని పిలువబడిన చాలామందితో ఏలీయా, ఎలీషాలు సహవసించారు. (2 రాజులు 2:⁠3) ఈ ‘శిష్యులకు’ కూడా తమ ఆధ్యాత్మిక తండ్రియైన ఏలీయాతో సన్నిహిత బంధం ఉండేదని రెండవ రాజులలోని వృత్తాంతం సూచిస్తోంది. (2 రాజులు 2:3, 5, 7, 15-17) అయినప్పటికీ, అభిషిక్త వారసునిగా ఏలీయా ఆధ్యాత్మిక కుమారుల్లో ఎలీషా ప్రధాన వ్యక్తిగా అంటే జ్యేష్ఠపుత్రుడిగా ఉన్నాడు. ప్రాచీన ఇశ్రాయేలులో, అక్షరార్థ జ్యేష్ఠపుత్రుడికి తన తండ్రి స్వాస్థ్యంలో రెండు పాళ్లు దొరికితే, మిగతా కుమారులకు ప్రతీ ఒక్కరికీ ఒక్కొక్క పాలు లభించేది. అందుకే ఏలీయా ఆధ్యాత్మిక స్వాస్థ్యంలో ఎలీషా రెండు పాళ్లు అడిగాడు.

ఎలీషా ప్రత్యేకంగా ఆ సమయంలోనే ఎందుకు ఈ విన్నపం చేశాడు? ఎందుకంటే, ఏలీయా తర్వాత ఇశ్రాయేలులో ప్రవక్తగా ఆయనొక బరువైన బాధ్యత చేపట్టబోతున్నాడు. ఈ భీకర నియామక సంబంధిత బాధ్యతలు నిర్వర్తించడానికి, తన సొంత సామర్థ్యాలకు మించిన ఆధ్యాత్మిక శక్తి అంటే కేవలం యెహోవా మాత్రమే ఇవ్వగల శక్తి తనకు అవసరమని ఎలీషా గ్రహించాడు. ఆయన ఏలీయా ఉన్నంత నిర్భయంగా ఉండాలి. (2 రాజులు 1:3, 4, 15, 16) అందుకే, ఆయన ఏలీయా ఆత్మలో రెండుపాళ్లను అంటే ధైర్యవంతమైన ఆత్మను ‘యెహోవా కొరకు మహా రోషముగల’ ఆత్మను​—⁠దేవుని ఆత్మ ఫలింపజేసే కోరదగిన లక్షణాలను ఇవ్వమని అడిగాడు. (1 రాజులు 19:​10, 14) ఏలీయా ఎలా ప్రతిస్పందించాడు?

తాను ఇవ్వగలిగినది కాదుగాని కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగల దానిని ఎలీషా అడిగాడని ఏలీయాకు తెలుసు. కాబట్టి నమ్రతతో ఏలీయా ఇలా బదులిచ్చాడు: “నీవు అడిగినది కష్టతరముగా నున్నది; అయితే నీయొద్దనుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడినయెడల ఆ ప్రకారము నీకు లభించును.” (2 రాజులు 2:​10) ఏలీయా సుడిగాలిచేత ఆరోహణమైనప్పుడు ఎలీషా దానిని చూసేందుకు యెహోవా అనుమతించాడు. (2 రాజులు 2:​11, 12) ఎలీషా విన్నపం ప్రకారమే ఆయనకు అనుగ్రహించబడింది. తను చేపట్టిన కొత్త నియామకంలో రాబోయే పరీక్షలు ఎదుర్కోవడానికి అవసరమైన ఆత్మను యెహోవా ఆయనకు దయచేశాడు.

ఈ బైబిలు వృత్తాంతం నుండి (కొన్నిసార్లు ఎలీషా తరగతివారని పిలువబడిన) అభిషిక్త క్రైస్తవులు, దేవుని మిగతా సేవకులు నేడెంతో ప్రోత్సాహం పొందవచ్చు. మనకు ఓ కొత్త నియామకం ఇవ్వబడినప్పుడు స్థైర్యం కోల్పోయి అసమర్థులమనే భావాలు మనకు రావచ్చు, లేదా మనం మన క్షేత్రంలో అధికమవుతున్న ఉదాసీనతను, వ్యతిరేకతను ఎదుర్కొంటుండగా మన రాజ్య ప్రకటనా పనిలో కొనసాగే ధైర్యాన్ని మనం కొంతమేరకు కోల్పోతుండవచ్చు. అయినాసరే, తన మద్దతిమ్మని మనం యెహోవాను యాచిస్తే, ఎదురయ్యే సవాళ్లను, మారుతున్న పరిస్థితులను తట్టుకోవడానికి మనకు అవసరమయ్యే రీతిలో ఆయన తన పరిశుద్ధాత్మనిస్తాడు. (లూకా 11:13; 2 కొరింథీయులు 4:7; ఫిలిప్పీయులు 4:​13) అవును, యెహోవా ఎలీషాను ఆయన బరువైన బాధ్యతలకోసం బలపరచినట్లే, మన పరిచర్యను నెరవేర్చేందుకు మనం యౌవనులమైనా, వృద్ధులమైనా మనందరికీ సహాయం చేస్తాడు.​—⁠2 తిమోతి 4:⁠5.