కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బాల్యము నుండే యెహోవాచే బోధించబడ్డాను

బాల్యము నుండే యెహోవాచే బోధించబడ్డాను

జీవిత కథ

బాల్యము నుండే యెహోవాచే బోధించబడ్డాను

రిచర్డ్‌ ఆబ్రాహామ్‌సన్‌ చెప్పినది

“దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని.” కీర్తన 71:17లోని ఆ మాటలు నాకెందుకు ప్రత్యేక అర్థం కలిగివున్నాయో నన్ను వివరించనివ్వండి.

అప్పట్లో బైబిలు విద్యార్థులని పిలువబడిన యెహోవాసాక్షులు 1924లో మా అమ్మ ఫానీ ఆబ్రాహామ్‌సన్‌ను కలిశారు. నేనప్పుడు కేవలం ఏడాది పిల్లవాణ్ణి. అమ్మ బైబిలు సత్యాలు నేర్చుకుంటూనే పొరుగింటికెళ్లి తాను నేర్చుకున్నవి వెంటనే వారికి చెప్పడంతోపాటు నాకు, అన్నయ్యకు, అక్కకు కూడా నేర్పింది. నాకు చదువురాక ముందే దేవుని రాజ్యాశీర్వాదాలకు సంబంధించి చాలా లేఖనాలు బట్టీపట్టేలా నాకు సహాయం చేసింది.

నేను పుట్టి పెరిగిన, అమెరికాలోవున్న ఆరిగాన్‌ రాష్ట్రంలోని లాగ్రాండలో, 1920వ దశాబ్దపు మలి సంవత్సరాల్లో మా బైబిలు విద్యార్థుల గుంపులో కొంతమంది స్త్రీలు, పిల్లలు ఉండేవారు. మేము ఐసోలేటెడ్‌ గుంపుగా ఉన్నప్పటికీ, సంవత్సరానికి ఒకటి రెండుసార్లు పిల్‌గ్రిమ్స్‌ అని పిలువబడిన ప్రయాణ పరిచారకులు మమ్మల్ని సందర్శించేవారు. వాళ్లు ప్రోత్సాహకరమైన ప్రసంగాలిస్తూ, మాతోపాటు ఇంటింటి పరిచర్యలో పాల్గొనేవారు, అలాగే పిల్లలమీద వారు దయాపూర్వక శ్రద్ధచూపేవారు. ఆ ప్రియమైన వారిలో షీల్డ్‌ టూట్జీన్‌, జీన్‌ ఓరెల్‌, జాన్‌ బూత్‌ ఉన్నారు.

బైబిలు విద్యార్థులు యెహోవాసాక్షులు అనే పేరు స్వీకరించిన, ఒహాయోలోని కొలంబస్‌లో 1931లో జరిగిన సమావేశానికి మా గుంపు నుండి ఒక్కరు కూడా హాజరు కాలేకపోయారు. అయితే ఆ సమావేశంలో ప్రాతినిధ్యం వహించలేకపోయిన కంపెనీలని అప్పట్లో పిలువబడిన సంఘాలు, ఐసోలేటెడ్‌ గుంపులు అదే ఆగస్టులో స్థానికంగా కూడుకొని ఆ పేరు స్వీకరించే తీర్మానాన్ని ఆమోదించాయి. లాగ్రాండలోవున్న మా చిన్న గుంపూ అలాగే చేసింది. ఆ పిమ్మట, 1933లో సంక్షోభం (ఆంగ్లం) అనే చిన్నపుస్తకాన్ని ప్రత్యేకంగా పంచే కార్యక్రమంలో, నేనొక బైబిలు అందింపును కంఠస్థం చేసి మొదటిసారిగా ఒంటరిగా ఇంటింటా సాక్ష్యమిచ్చాను.

1930వ దశకంలో మన సేవకు వ్యతిరేకత పెరగడం ఆరంభించింది. దానిని ఎదుర్కొనేందుకు చిన్న కంపెనీలను విభాగాలని పిలువబడిన గుంపులుగా చేశారు, అవి చిన్న సమావేశాలు జరుపుకొని సంవత్సరానికి ఒకటి రెండుసార్లు విభాగ ఉద్యమాలనే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేవి. ఈ సమావేశాల్లో మాకు ప్రకటనా పద్దతుల ఉపదేశంతోపాటు, పోలీసులు జోక్యంచేసుకుంటే వారితో మర్యాదగా ఎలా వ్యవహరించాలో కూడా చూపబడేది. సాక్షులు తరచు ఒక పోలీసు జడ్జి దగ్గరకో లేదా సాధారణ కోర్టుకో తీసుకువెళ్లబడుతున్న కారణంగా విచారణా ఉత్తర్వు అని పిలువబడిన ఆదేశ పత్రంలోని విషయాలను మేము ముందుగా అభ్యాసం చేసేవాళ్లం. వ్యతిరేకతను ఎదుర్కోవడానికి ఇది మమ్మల్ని సంసిద్ధం చేసింది.

బైబిలు సత్యంలో తొలి ఎదుగుదల

బైబిలు సత్యాలపట్ల, దేవుని పరలోక రాజ్యాధికారం క్రింద భూమిపై నిత్యం నివసించే బైబిలు ఆధారిత నిరీక్షణపట్ల నాకున్న అవగాహనా, కృతజ్ఞతా భావాల్లో నేను ఎదుగుతూ ఉన్నాను. ఆ కాలంలో క్రీస్తుతోపాటు పరలోకంలో పరిపాలించే నిరీక్షణలేని వారు బాప్తిస్మం తీసుకోవాలని అంతగా నొక్కిచెప్పబడలేదు. (ప్రకటన 5:​9, 10; 14:​1, 3) అయినప్పటికీ, యెహోవా చిత్తం చేయడానికి నేను హృదయంలో తీర్మానించుకుంటే, బాప్తిస్మం పొందడం సముచితమని నాకు చెప్పారు. దానితో నేను 1933 ఆగస్టులో బాప్తిస్మం తీసుకున్నాను.

నాకు 12 సంవత్సరాల వయసప్పుడు మా ఉపాధ్యాయిని నేను బహిరంగంగా చక్కగా మాట్లాడుతున్నానని తలంచింది, అందుకే నాకు అదనంగా శిక్షణ ఏర్పాటు చేయమని మా అమ్మను బలవంతపెట్టింది. ఇది నేను యెహోవాకు మరింత చక్కగా సేవచేయడానికి సహాయం చేయవచ్చని అమ్మ తలంచింది. అందుకు మా అమ్మ, నాకు పాఠాలు నేర్పించిన ఉపాధ్యాయిని బట్టలు ఒక సంవత్సరంపాటు ఉతికిపెట్టింది. నా పరిచర్యకు ఆ శిక్షణ సహాయం చేసింది. నాకు 14వ యేట రుమాటిక్‌ జ్వరం సోకింది, దానితో ఏడాదికిపైగా ఎటూ కదల్లేకపోయాను.

1939లో వారెన్‌ హెన్షెల్‌ అనే పూర్తికాల పరిచారకుడు మా ప్రాంతానికి వచ్చాడు. * ఆధ్యాత్మిక భావంలో నాకాయన పెద్దన్నయ్యతో సమానం. ఆయన నన్ను క్షేత్ర పరిచర్య కోసం రోజులో ఎక్కువ భాగం బయటకు తీసుకెళ్లేవాడు. త్వరలోనే వెకేషన్‌ పయినీరు సేవ అంటే ఒకవిధమైన తాత్కాలిక పూర్తికాల పరిచర్య ఆరంభించేందుకు నాకు సహాయం చేశాడు. ఆ వేసవిలోనే మా గుంపు ఒక కంపెనీగా వ్యవస్థీకరించబడింది. దానితో వారెన్‌ కంపెనీ సేవకునిగా, నేనేమో కావలికోట పఠన నిర్వాహకునిగా నియమించబడ్డాము. ఆ తర్వాత, వారెన్‌ బెతెల్‌ సేవకోసమని న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోవున్న యెహోవాసాక్షుల అంతర్జాతీయ ప్రధాన కార్యాలయానికి వెళ్లిపోవడంతో నేను కంపెనీ సేవకుణ్ణయ్యాను.

ర్తికాల పరిచర్య మొదలుపెట్టడం

కంపెనీ సేవకునిగా పెరిగిన బాధ్యత క్రమమైన పూర్తికాల పరిచర్య చేపట్టాలనే నా కోరికను మరింతగా బలపరచింది, దానితో ఉన్నత పాఠశాలలో మూడవ సంవత్సరం విద్య ముగించి, నా 17వ యేట నేను ఆ సేవ చేపట్టాను. నాన్నగారు మా మత నమ్మకాలు పంచుకోకపోయినా, మంచి కుటుంబ పోషకునిగా, ఉన్నత సూత్రాలు పాటించేవానిగా ఉండేవాడు. నేను కళాశాలకు వెళ్లాలనేది ఆయన కోరిక. అయితే భోజనానికి, జీవనానికి నేను ఆయనమీద ఆధారపడనంతవరకు నేను కోరుకున్నది చేయవచ్చని చెప్పాడు. దానితో 1940 సెప్టెంబరులో నేను పయినీరు సేవ ఆరంభించాను.

ఇల్లు వదిలివెళ్లేటప్పుడు, అమ్మ నాచేత, “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” అని చెప్పిన సామెతలు 3:​5, 6 చదివించింది. అన్ని విషయాల్లో నా జీవితాన్ని యెహోవాకు విడిచిపెట్టడం నిజంగా నాకు చాలా సహాయం చేసింది.

త్వరలోనే నేను వాషింగ్టన్‌ రాష్ట్రంలో ఉత్తరమధ్య ప్రాంతంలో సేవచేస్తున్న జో, మార్గరేట్‌ హార్ట్‌లను కలిశాను. సేవా ప్రాంతం విభిన్న రీతుల్లో అంటే పశుపాలనా క్షేత్రాలుగా, గొర్రెలపాలనా క్షేత్రాలుగా, అమెరికన్‌ ఇండియన్‌ రక్షిత ప్రాంతాలుగా, అలాగే చిన్న చిన్న పట్టణాలుగా, గ్రామాలుగా ఉండేది. 1941 వసంత రుతువులో వాషింగ్టన్‌లోని వెనాచీ సంఘంలో నేను కంపెనీ సేవకునిగా నియమించబడ్డాను.

వాషింగ్టన్‌లోని వాలవాలలో జరిగిన సమావేశపు ఆడిటోరియంకు వచ్చేవారికి స్వాగతంపలికే అటెండెంట్‌గా పనిచేశాను. అక్కడ ఒక సహోదరుడు లౌడు స్పీకర్‌ బాగుచేయడానికి తంటాలుపడుతుండడం గమనించాను. నేనాపని చూస్తాను, నా పని చూడమని ఆయనకు సూచించాను. రీజనల్‌ సేవకుడైన ఆల్బర్ట్‌ హోఫ్‌మాన్‌ తిరిగి వచ్చి, నేను నా పని వదలిపెట్టి వెళ్లడం గమనించి, మరో పని చెప్పేదాక నా పనికే కట్టుబడి ఉండడంలోవున్న విలువేమిటో చిరునవ్వుతో నాకు వివరించాడు. అప్పటినుండి ఆయనిచ్చిన ఆ సలహాను నేను మరచిపోలేదు.

1941 ఆగస్టులో మిస్సౌరీలోవున్న సెయింట్‌ లూయిస్‌లో యెహోవాసాక్షులు ఓ పెద్ద సమావేశానికి ఆలోచన చేశారు. హార్ట్‌ దంపతులు వారి పికప్‌ ట్రక్కు వెనుకభాగానికి పైకప్పు వేసి అందులో బల్లలు బిగించారు. మేము తొమ్మిదిమంది పయినీర్లము ఆ ట్రక్కులోనే 2,400 కిలోమీటర్లు ప్రయాణించి సెయింట్‌ లూయిస్‌కు చేరుకున్నాం. ఒకవైపు ప్రయాణానికే మాకు దాదాపు వారం పట్టింది. ఆ సమావేశానికి శిఖరాగ్ర సంఖ్యలో 1,15,000 మంది హాజరయ్యారని పోలీసులు అంచనా వేశారు. హాజరైనవారు బహుశా అంతకు తక్కువగావున్నా, ఆ కాలంలో అమెరికాలోవున్న 65,000 మంది సాక్షులకంటే హాజరైనవారు నిశ్చయంగా ఎక్కువగా ఉన్నారు. ఆ సమావేశం నిజంగా ఆధ్యాత్మికంగా ఎంతో బలపరచింది.

బ్రూక్లిన్‌ బెతెల్‌లో సేవ

వెనాచీకి తిరిగివచ్చిన తర్వాత, నాకు బ్రూక్లిన్‌ బెతెల్‌కు రావల్సిందిగా ఉత్తరం అందింది. నేను 1941 అక్టోబరు 27న అక్కడికి చేరుకున్నప్పుడు ఫ్యాక్టరీ పైవిచారణకర్తగావున్న నాథన్‌ హెచ్‌. నార్‌ కార్యాలయానికి నన్ను తీసుకెళ్లారు. బెతెల్‌ ఎలావుంటుందో ఆయన నాకు దయాపూర్వకంగా వివరించి, అక్కడి జీవితంలో సఫలత సాధించాలంటే యెహోవాకు సన్నిహితంగా ఉండడం ఆవశ్యకమని నొక్కిచెప్పారు. ఆ తర్వాత నన్ను రవాణా విభాగానికి తీసుకెళ్లి, రవాణాచేసే సాహిత్యాల అట్టపెట్టెలు కట్టే పని అప్పగించారు.

ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల సేవకు సారథ్యం వహిస్తున్న జోసెఫ్‌ రూథర్‌ఫర్డ్‌ 1942 జనవరి 8న మరణించారు. ఐదు రోజుల తర్వాత సొసైటీ సంచాలకులు ఆయన వారసునిగా సహోదరుడు నార్‌ను ఎన్నుకున్నారు. ఎంతో కాలంగా సొసైటీ ట్రెజరీ కార్యదర్శిగా సేవచేస్తున్న డబ్ల్యు. ఇ. వాన్‌ ఆమ్‌బర్గ్‌ ఆ విషయం బెతెల్‌ కుటుంబానికి ప్రకటిస్తూ ఇలా అన్నారు: “సి. టి. రస్సెల్‌ [1916లో] మరణించినప్పుడు జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ ఆ స్థానానికి మారడం నాకు గుర్తుంది. ప్రభువు సేవను నిర్దేశిస్తూ, అది వర్ధిల్లేలా చూశాడు. ఇప్పుడు నాథన్‌ హెచ్‌. నార్‌ అధ్యక్షునిగా సేవ పురోగమిస్తుందని నేను పూర్తిగా ఆశిస్తున్నాను, ఎందుకంటే ఇది ప్రభువు కార్యమే గాని మనుష్యుని కార్యం కాదు.”

1942 ఫిబ్రవరిలో “దైవపరిపాలనా పరిచర్యలో ఉన్నతస్థాయి కోర్సు” ప్రారంభం కాబోతుందని ప్రకటించబడింది. బెతెల్‌ సిబ్బంది బైబిలు అంశాలపై పరిశోధన చేయడంలో, తాము అందజేయబోయే సమాచారాన్ని సరిగ్గా వ్యవస్థీకరించుకోవడంలో, దాన్ని ప్రసంగాల ద్వారా సమర్థవంతంగా అందజేయడంలో తమ సామర్థ్యాన్ని వృద్ధిచేసుకునేందుకు వారికి శిక్షణ ఇవ్వడానికి అది రూపొందించబడింది. బహిరంగముగా మాట్లాడేందుకు నేనుపొందిన నా తొలిప్రాయపు శిక్షణా సహాయంతో, ఆ కార్యక్రమంలో నేను వేగంగా అభివృద్ధి సాధించగలిగాను.

అనతికాలంలోనే, అమెరికాలోని సాక్షుల పరిచర్యను పర్యవేక్షించే సేవా విభాగానికి నేను నియమించబడ్డాను. అదే సంవత్సరంలో కొంతకాలం తర్వాత, సాక్షుల కంపెనీలను పరిచారకులు సందర్శించే కార్యక్రమం మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించబడింది. కొంతకాలానికి, సర్వెంట్స్‌ టు ద బ్రదరిన్‌ అని పిలువబడిన ఈ ప్రయాణ పరిచారకులు, ప్రాంతీయ ప్రయాణ పైవిచారణకర్తలని పిలువబడ్డారు. ఈ పరిచర్య కోసం సహోదరులకు శిక్షణ ఇవ్వడానికి 1942 వేసవిలో బెతెల్‌లో ఓ శిక్షణా ప్రణాళిక రూపొందించబడగా, ఆ శిక్షణ పొందేవారిలో ఉండే ఆధిక్యత నాకు లభించింది. ఉపదేశకుల్లో ఒకరైన సహోదరుడు నార్‌, “మనుషులను మెప్పించడానికి ప్రయత్నించకండి. అలాచేస్తే మీరెన్నటికీ ఏ ఒక్కరినీ మెప్పించలేరు. యెహోవాను మెప్పించండి, అప్పుడు యెహోవాను ప్రేమించేవారందరినీ మీరు మెప్పిస్తారు” అనే విషయం నొక్కిచెప్పడం నాకు ప్రత్యేకంగా గుర్తుంది.

1942 అక్టోబరులో ప్రయాణ సేవ అమల్లోకి వచ్చింది. న్యూయార్క్‌ నగరపు 400 కిలోమీటర్ల పరిధిలోని సంఘాలను సందర్శిస్తూ బెతెల్‌లోవున్న మాలో కొందరం ఆయా వారాంతాల్లో దానిలో భాగం వహించాము. మేము సంఘ ప్రచారపు కార్యక్రమంతోపాటు, కూటాల హాజరును సమీక్షించి, సంఘ బాధ్యతలు నిర్వహిస్తున్న వారితో మాట్లాడి ఆ తర్వాత ఒకటి రెండు ప్రసంగాలిచ్చి, స్థానిక సాక్షులతో పరిచర్యలో పాల్గొనేవాళ్లం.

1944లో డెలావేర్‌, మేరీల్యాండ్‌, పెన్సిల్వేనియా, వర్జీనియాల్లో ఆరునెలలపాటు ప్రయాణ సేవచేయడానికి సేవా విభాగంనుండి పంపించబడిన వారిలో నేనూ ఉన్నాను. ఆ తర్వాత, కొన్నినెలలపాటు నేను కనెక్టికట్‌, మాసాచూసెట్స్‌, రోడ్‌ ఐలాండ్‌ల్లోని సంఘాలు సందర్శించాను. బెతెల్‌కు తిరిగివచ్చిన తర్వాత సహోదరుడు నార్‌తో, ఆయన కార్యదర్శి మిల్టన్‌ హెన్షెల్‌తో ఆఫీస్‌లో పార్ట్‌ టైమ్‌ పనిచేశాను. అక్కడే నేను మన ప్రపంచవ్యాప్త సేవ గురించి తెలుసుకున్నాను. దానితోపాటు డబ్ల్యు. ఇ. వాన్‌ ఆమ్‌బర్గ్‌ ఆయన సహాయకుడైన, గ్రాంట్‌ సూటర్‌ పర్యవేక్షణ క్రింద ట్రెజరీ ఆఫీసులో కూడా పార్ట్‌ టైమ్‌ పనిచేశాను. ఆ తర్వాత, 1946లో బెతెల్‌లో చాలా ఆఫీసుల్లో పైవిచారణకర్తగా పనిచేశాను.

నా జీవితంలో పెద్ద మార్పులు

1945లో సంఘాలను సందర్శిస్తున్నప్పుడు రోడ్‌ ఐలాండ్‌లోవున్న ప్రావిడెన్స్‌ నగరంలో జూలియె చార్‌నాస్‌కాస్‌తో పరిచయమేర్పడింది. 1947 అర్థభాగానికల్లా మేము వివాహం గురించి ఆలోచిస్తున్నాము. నాకు బెతెల్‌ సేవంటే ప్రాణం, కానీ ఆ కాలంలో అక్కడ సేవచేయడానికి వివాహ జతను తీసుకువెళ్లే వెసులుబాటు లేదు. అందువల్ల, 1948 జనవరిలో, నేను బెతెల్‌ సేవ విడిచిపెట్టి జూలియె (జూలీ)ని పెళ్లిచేసుకున్నాను. ప్రావిడెన్స్‌ నగరంలోనే ఒక సూపర్‌ మార్కెట్‌లో నేను పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం సంపాదించుకున్నాను, మేమిద్దరం పయినీరు పరిచర్య ప్రారంభించాము.

1949 సెప్టెంబరులో, విస్కాన్‌సిన్‌ వాయవ్య ప్రాంతంలో ప్రాంతీయ సేవచేయడానికి నాకు ఆహ్వానం లభించింది. పాలకేంద్రాలు అధికంగావున్న ఆ ప్రాంతంలోని చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో ప్రకటించడం నాకు, జూలీకి ఓ పెద్ద మార్పు. ఆ ప్రాంతంలో అధిక నెలలు శీతాకాలం, చలితోపాటు అనేక వారాలపాటు శీతోష్ణస్థితి సున్న డిగ్రీలకంటే తక్కువకు పడిపోయేది, మంచు కూడా ఎక్కువగా కురిసేది. మాకు కారు లేదు. కానీ అన్ని సందర్భాల్లో ఎవరో ఒకరు మమ్మల్ని తర్వాతి సంఘానికి తీసుకెళ్లి దించేవారు.

నేను ప్రాంతీయ సేవ ఆరంభించిన కొద్దికాలానికే ప్రాంతీయ సమావేశం ఒకటి జరిగింది. పనులన్నీ సక్రమంగా జరగాలని నేను అతి జాగ్రత్తగా పరిశీలించడం నాకు గుర్తుంది, అలా చేయడం కొంతమందికి కాస్త ఇబ్బంది కలిగించింది. దానితో జిల్లా పైవిచారణకర్త నికొలస్‌ కొవలాక్‌, స్థానిక సహోదరులు తమ సొంత పద్ధతిలో పనిచేయడానికి అలవాటుపడ్డారని, అంత పట్టుబట్టి నేను పనులు చేయించడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదని నాకు దయాపూర్వకంగా వివరించారు. అప్పటినుండి చాలా నియామకాలతో వ్యవహరించడానికి ఆ సలహా నాకు సహాయపడింది.

1950లో, న్యూయార్క్‌ నగరంలోవున్న యాంకీ స్టేడియంలో జరిగిన చాలా పెద్ద సమావేశాల్లో మొదటి సమావేశానికివచ్చే ప్రతినిధులకు వసతి ఏర్పాటుచేసే పనిని పర్యవేక్షించే తాత్కాలిక నియామకం నాకు లభించింది. ఆ సమావేశానికి 67 దేశాలనుండి శిఖరాగ్ర సంఖ్యలో 1,23,707 మంది ప్రతినిధులు రావడంతో ఆద్యంతాలు ఉత్కంఠభరితంగా సాగాయి. సమావేశం ముగిసిన తర్వాత, జూలీ నేను తిరిగి మా ప్రయాణ పరిచర్య ప్రారంభించాము. ప్రాంతీయ సేవలో మేము చాలా సంతోషించాము. అయితే, ఏ విధమైన పూర్తికాల సేవ కోసమైనా మమ్మల్ని మేము అందుబాటులో ఉంచుకోవాలని మేము భావించాము. అందువల్ల మేము ప్రతి సంవత్సరం బెతెల్‌ సేవకూ, మిషనరీ సేవకూ దరఖాస్తు చేస్తూవచ్చాము. 1952లో వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ 20వ తరగతికి హాజరు కావాల్సిందిగా మాకు ఆహ్వానం అందినప్పుడు ఇక మా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. మిషనరీ సేవ కోసం మాకు అక్కడ శిక్షణ ఇవ్వబడింది.

విదేశాల్లో సేవ

1953లో గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత మేము బ్రిటన్‌కు నియమించబడ్డాము, అక్కడ నేను దక్షిణ ఇంగ్లాండులో జిల్లా సేవకునిగా సేవచేశాను. నేనూ జూలీ ఎంతో ముచ్చటపడ్డ ఆ సేవలో సంవత్సరంకూడా గడవకముందే, డెన్మార్క్‌కు వెళ్లాల్సిందిగా నియామకం రావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. డెన్మార్క్‌లో బ్రాంచి కార్యాలయానికి కొత్త పర్యవేక్షణ అవసరమయ్యింది. నేను దగ్గరలో ఉన్నందున, ఆ పనికోసం నాకు బ్రూక్లిన్‌లో శిక్షణయివ్వబడింది కాబట్టి సహాయం చేసేందుకు నన్ను అక్కడకు పంపించారు. మేము నెదర్లాండ్స్‌వెళ్లే నావయెక్కి అక్కడనుండి డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌కు వెళ్లే రైలు పట్టుకున్నాము. 1954 ఆగస్టు 9న మేము అక్కడకు చేరుకున్నాము.

పరిష్కరించవలసిన సమస్యల్లో ఒకటేమిటంటే, బ్రూక్లిన్‌లోవున్న ప్రధాన కార్యాలయంనుండి ఇవ్వబడిన నిర్దేశాన్ని అక్కడి బాధ్యతగల స్థానాల్లోవున్న కొందరు లక్ష్యపెట్టడం లేదు. దానికితోడు, డానిష్‌లోకి మన సాహిత్యాలు అనువదిస్తున్న నలుగురిలో ముగ్గురు బెతెల్‌ సేవను వదిలి వెళ్ళి, చివరకు యెహోవాసాక్షులతో సహవాసాన్ని మానుకున్నారు. కానీ యెహోవా మా ప్రార్థనలు ఆలకించాడు. కొంతకాలం పార్ట్‌ టైమ్‌ అనువాదపు పని చేసిన ఇద్దరు పయినీర్లు యోఎర్న్‌, ఆనా లార్సెన్‌లు పూర్తికాల పరిచర్యకు ముందుకొచ్చారు. అలా ఒక్క సంచిక కూడా తప్పిపోకుండా డానిష్‌లోకి మన పత్రికల అనువాదం కొనసాగింది. లార్సెన్‌ దంపతులు ఇప్పటికీ డెన్మార్క్‌ బెతెల్‌లో ఉన్నారు, యోఎర్న్‌ బ్రాంచి కమిటీ సమన్వయకర్తగా ఉన్నాడు.

ఆ తొలి సంవత్సరాల్లో సహోదరుడు నార్‌ క్రమంగా చేసిన సందర్శనాలు ప్రోత్సాహానికి మూలంగా ఉండేవి. సమస్యలతో ఎలా వ్యవహరించాలో అంతర్దృష్టినిచ్చిన అనుభవాలు చెబుతూ కూర్చొని మాట్లాడేందుకు ఆయన సమయం తీసుకొనేవాడు. అలా 1955లో ఆయన సందర్శించినప్పుడు డెన్మార్క్‌ కోసం పత్రికలు ఉత్పత్తి చేయగలిగేలా ముద్రణా సదుపాయాలతో ఓ కొత్త బ్రాంచి కట్టాలని నిర్ణయించబడింది. కోపెన్‌హాగన్‌ నగరపరిసరాల్లో ఉత్తరంవైపు స్థలం సేకరించగా, 1957 వేసవికల్లా కొత్తగా నిర్మించిన భవంతిలోకి మేము మారాము. గిలియడ్‌ 26వ తరగతి నుండి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకున్న హారీ జాన్సన్‌, ఆయన భార్య కారీన్‌ ఆ మధ్యే డెన్మార్క్‌కు వచ్చి ముద్రణా యంత్రాలు నెలకొల్పి, వాటిని నడిపించడంలో సహాయం చేశారు.

డెన్మార్క్‌లో పెద్ద సమావేశాలు నిర్వహించగల మా వ్యవస్థను మెరుగుపరచుకున్నాము. అమెరికా సమావేశాల్లో పనిచేస్తున్నప్పుడు గడించిన నా అనుభవం దానికి సహాయపడింది. కోపెన్‌హాగన్‌లో 1961లో జరిగిన పెద్ద అంతర్జాతీయ సమావేశానికి 30కి పైగా దేశాలనుండి ప్రతినిధులు హాజరయ్యారు. శిఖరాగ్ర హాజరు 33,513. స్కాండినేవియాలో జరిగిన సమావేశాలన్నింటిలోకి అత్యంత పెద్దది అని రుజువైన సమావేశాన్ని 1969లో మేము నిర్వహించాము. దానికి శిఖరాగ్ర సంఖ్యలో 42,073 మంది హాజరయ్యారు.

నేను 1963లో గిలియడ్‌ 38వ తరగతికి హాజరయ్యేందుకు ఆహ్వానించబడ్డాను, ఇది ప్రత్యేకంగా బ్రాంచి సిబ్బందికోసం రూపొందించబడిన, సవరించబడిన 10 నెలల కోర్సు. మళ్లీ బ్రూక్లిన్‌ బెతెల్‌ కుటుంబంతో కలిసివుండడం, అనేక సంవత్సరాలుగా ప్రధాన కార్యాలయ పనులు చూసుకుంటున్న వారి అనుభవాల నుండి ప్రయోజనం పొందడం మాకు చాలా సంతోషం కలిగించింది.

ఈ శిక్షణా కోర్సు తర్వాత, డెన్మార్క్‌లో బాధ్యతలు నిర్వహించేందుకు తిరిగి అక్కడికే వెళ్లాను. అదనంగా ఉత్తర, పశ్చిమ ఐరోపాల్లోని బ్రాంచి కార్యాలయాలకు వెళ్లి అక్కడి సిబ్బందిని ప్రోత్సహించడానికి, వారు తమ బాధ్యతలను నిర్వహించేందుకు వారికి సహాయం చేయడానికి జోన్‌ పైవిచారణకర్తగా సందర్శించే ఆధిక్యత నాకు లభించింది. ఇటీవలే పశ్చిమాఫ్రికా, కరీబియన్‌లను ఆ విధంగా సందర్శించాను.

అనువాదపు పనిని, ముద్రించే పనిని ఎక్కువచేయడానికి తగిన పెద్ద వసతి నిర్మించడానికి 1970వ దశాబ్దపు మలి సంవత్సరాల్లో డెన్మార్క్‌లోని సహోదరులు తగిన స్థలంకోసం అన్వేషించడం ఆరంభించారు. కోపెన్‌హాగన్‌కు పశ్చిమంగా దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఓ చక్కని స్థలం దొరికింది. ఈ కొత్త వసతి నిర్మాణ ప్రణాళిక రూపకల్పనకు నేను ఇతరులతోపాటు పనిచేశాను. ఈ కొత్త గృహంలో నేనూ, జూలీ బెతెల్‌ కుటుంబంతో కలిసి నివసించాలని ఎదురుచూశాము. అయితే మేము అనుకున్నట్టు జరుగలేదు.

మళ్లీ బ్రూక్లిన్‌కు

బ్రూక్లిన్‌ బెతెల్‌లో సేవచేయడానికి రావల్సిందిగా 1980 నవంబరులో నేను, జూలీ ఆహ్వానించబడ్డాము, దానితో 1981 జనవరి తొలిభాగంలో మేమక్కడకు చేరుకున్నాము. అప్పుడు మేము 50 యేండ్ల మలిదశలో ఉన్నాము. మా జీవితంలో సగం సంవత్సరాలు డెన్మార్క్‌లోని ప్రియ సహోదర సహోదరీలతో గడిపిన తర్వాత, అమెరికాకు తిరిగి రావడం మాకంత సులభం కాలేదు. అయినప్పటికీ, మేము కోరుకున్నదే కావాలని పట్టుపట్టడానికి బదులు, ప్రస్తుత నియామకాలపై, అవి తీసుకొచ్చే సవాళ్లపై దృష్టినిలపడానికి ప్రయత్నించాము.

మేము బ్రూక్లిన్‌కు వచ్చి స్థిరపడ్డాము. జూలీ డెన్మార్క్‌లో చేసినపనే అంటే అక్కౌంట్సు ఆఫీసులో నియమించబడింది. మన సాహిత్యాల కార్యాచరణ విధాన పట్టిక తయారుచేయడంలో సహాయపడేందుకు రైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో నేను నియమించబడ్డాను. బ్రూక్లిన్‌ పని విధానాల్లో 1980వ దశాబ్దపు తొలి సంవత్సరాల్లో మార్పువచ్చింది. టైపు రైటర్లు, వేడిసీసపు పలకలపై టైపుసెట్టింగ్‌ నుండి కంప్యూటర్‌ విధానానికి, ఆఫ్‌సెట్‌ ముద్రణకు మారాము. నాకు కంప్యూటర్ల గురించి బొత్తిగా తెలియదు అయితే వ్యవస్థీకరణ విధానాల గురించి, ప్రజలతో ఎలా కలిసిపనిచేయాలో తెలుసు.

ఆ తర్వాత కొద్దికాలానికే, పూర్తి రంగుల ఆఫ్‌సెట్‌ ముద్రణ, రంగుల బొమ్మలు, ఫోటోలు ఉపయోగించడం ఆరంభించేసరికి ఆర్ట్‌ విభాగంలోని వ్యవస్థను బలపరిచే అవసరం ఏర్పడింది. కళాకారునిగా నాకు అనుభవం లేకపోయినా, వ్యవస్థీకరణ పనిలో నేను సహాయం చేయగలిగాను. అందువల్ల ఆ విభాగంలో తొమ్మిది సంవత్సరాలు పర్యవేక్షించే ఆధిక్యత నాకు లభించింది.

నేను 1992లో పరిపాలక సభలో ప్రచురణ కమిటీకి సహాయం చేసేందుకు నియమించబడి ట్రెజరీ ఆఫీసుకు బదిలీ అయ్యాను. ఇక్కడ యెహోవాసాక్షుల ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన సేవలో కొనసాగుతున్నాను.

బాల్యము నుండే సేవచేయడం

నా బాల్యపు తొలినాళ్లు మొదలుకొని 70 సంవత్సరాల సమర్పిత సేవాకాలంలో యెహోవా తన వాక్యమైన బైబిలు ద్వారా, తన అద్భుత సంస్థలోని సహోదరుల సహాయం ద్వారా ఓపికగా నాకు నేర్పించాడు. నేను 63 కంటే ఎక్కువ సంవత్సరాల పూర్తికాల సేవను ఆనందించాను, అందులో నన్ను అంటిపెట్టుకునివున్న నా భార్య జూలీతో కలిసి 55 సంవత్సరాలు ఆనందంగా సేవచేశాను. నిజంగా, యెహోవా అత్యధికంగా నన్ను ఆశీర్వదించాడని నేను భావిస్తున్నాను.

ఆనాడు 1940లో పూర్తికాల పయినీరు సేవలో ప్రవేశించేందుకు ఇల్లు వదిలినప్పుడు, నా నిర్ణయాన్ని అపహసిస్తూ మా నాన్నగారు ఇలా అన్నారు: “చూడు నాయనా, ఈ పనికోసం నువ్వు ఇల్లు వదిలివెళ్లిన తర్వాత, సహాయం కోసం మళ్లీ నా దగ్గరికి పరుగెత్తుకు రావచ్చని మాత్రం అనుకోవద్దు.” గడచిన సంవత్సరాలన్నింటిలో ఎన్నడూ నేనలా చేసే అవసరం రాలేదు. తరచూ తోటి క్రైస్తవుల సహాయం ద్వారా నా అవసరాలన్నీ యెహోవా ఉదారంగా తీర్చాడు. ఆ తర్వాత, మా నాన్నగారు మన సేవను గౌరవించడం ఆరంభించి 1972లో చనిపోవడానికి ముందు బైబిలు సత్యం నేర్చుకోవడంలో కొంతమేరకు పురోగతి సాధించారు. పరలోక నిరీక్షణగల మా అమ్మ 1985లో తన 102వ యేట చనిపోయేంత వరకు నమ్మకంగా యెహోవాను సేవించడంలో కొనసాగింది.

పూర్తికాల సేవలో సమస్యలు తలెత్తినా, జూలీ నేను మా నియామకం వదిలి వెళదామని ఎన్నడూ ఆలోచించలేదు. ఈ తీర్మానాన్ని యెహోవా అన్ని సందర్భాల్లో చెక్కుచెదరకుండా చూశాడు. వృద్ధులైన మా తల్లిదండ్రులకు సహాయం అవసరమైనప్పుడు కూడా మా అక్క విక్టోరియా మార్లిన్‌ ముందుకొచ్చి వారిని శ్రద్ధగా చూసుకొంది. మేము పూర్తికాల సేవలో కొనసాగేందుకు సహాయం చేసిన ఆమె ప్రేమపూర్వక చేయూతకు మేమెంతో కృతజ్ఞులం.

యెహోవాకు తానుచేసుకున్న సమర్పణలో ఒక భాగమని భావిస్తూ, జూలీ నా నియామకాలన్నింటిలో నాకు యథార్థ మద్దతిచ్చింది. నాకిప్పుడు 80 సంవత్సరాల వయస్సుతోపాటు కొన్ని ఆరోగ్య సమస్యలున్నప్పటికీ మమ్మల్ని యెహోవా అధికంగా ఆశీర్వదించాడనే నేను భావిస్తున్నాను. తన బాల్యము నుండి దేవుడు తనకు బోధించాడని ప్రకటించిన తర్వాత, ఇలా వేడుకున్న కీర్తనకర్త నుండి నేనెంతో ప్రోత్సాహం పొందుతున్నాను: ‘దేవా, పుట్టబోవు వారికందరికి నీ శౌర్యమును గురించి నేను తెలియజెప్పునట్లు వృద్ధునైయుండువరకు నన్ను విడువకుము.’​—⁠కీర్తన 71:17, 18.

[అధస్సూచి]

^ పేరా 12 వారెన్‌, యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యునిగా అనేక సంవత్సరాలు సేవచేసిన మిల్టన్‌ హెన్షెల్‌కు అన్నయ్య.

[20వ పేజీలోని చిత్రం]

1940లో నేను పయినీరు సేవ ఆరంభించినప్పుడు మా అమ్మతో

[21వ పేజీలోని చిత్రం]

తోటి పయినీర్లయిన జో మరియు మార్గరెట్‌ హార్ట్‌

[23వ పేజీలోని చిత్రం]

1948 జనవరిలో మా వివాహ దినం

[23వ పేజీలోని చిత్రం]

1953లో తోటి గిలియడ్‌ విద్యార్థులతో, ఎడమ నుండి కుడికి: డాన్‌ మరియు వర్జీనియా వార్డ్‌, హేర్‌టుయెడా స్టెహెంగా, జూలీ, నేను

[23వ పేజీలోని చిత్రం]

1961లో డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో ఫ్రెడ్రిక్‌ డబ్ల్యు ఫ్రాంజ్‌, నాథన్‌ హెచ్‌. నార్‌తో

[25వ పేజీలోని చిత్రం]

జూలీతో నేడు