కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం ఎవరినైనా నమ్మవచ్చా?

మనం ఎవరినైనా నమ్మవచ్చా?

మనం ఎవరినైనా నమ్మవచ్చా?

పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బెర్లిన్‌ గోడ కూలిన తర్వాత, అప్పటివరకూ ఎంతో రహస్యంగా ఉంచబడిన అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఉదాహరణకు, తూర్పు జర్మనీలో సామ్యవాద పరిపాలనా కాలంలో, స్టాజీ లేదా స్టేట్‌ సెక్యూరిటీ సర్వీసు, తన వ్యక్తిగత కార్యకలాపాలపై ఒక ఫైలు తయారు చేసిందని లిడియ * తెలుసుకుంది. ఆ ఫైలు గురించి విన్నప్పుడు లిడియ ఆశ్చర్యపోయింది, అయితే స్టాజీకి ఆ సమాచారం అందించినది తన భర్తేనని తెలుసుకుని ఆమె నిర్ఘాంతపోయింది. ఆమె పూర్తిగా నమ్మగలిగి ఉండవలసిన వ్యక్తే ఆమెను మోసం చేశాడు.

రాబర్ట్‌ అనే వృద్ధుడు తన డాక్టర్‌ను “అత్యంత గౌరవంతో, ప్రశంసతో, నమ్మకంతో” చూసేవాడని లండన్‌కు చెందిన ద టైమ్స్‌ నివేదిస్తోంది. ఆ డాక్టర్‌ “దయాపూర్వకమైన, సానుభూతిగల వైఖరితో” ఉంటాడని చెప్పబడేది. ఆ తర్వాత రాబర్ట్‌ అకస్మాత్తుగా మరణించాడు. ఆయన గుండె ఆగి చనిపోయాడా లేదా స్ట్రోక్‌వల్ల చనిపోయాడా? కాదు. ఆ డాక్టర్‌ రాబర్ట్‌ ఇంటికి వెళ్ళి, రాబర్ట్‌కి ఆయన కుటుంబానికి తెలియకుండా ఆయనకు మరణహేతువైన ఇంజెక్షన్‌ ఇచ్చాడని అధికారులు నిర్ధారించారు. రాబర్ట్‌ ఎవరినైతే పూర్తిగా నమ్మాడో ఆ వ్యక్తే ఆయనను హత్య చేశాడు.

లిడియ, రాబర్ట్‌ ఇద్దరూ ఎంతో గంభీరమైన పర్యవసానాలకు దారితీసిన ఘోరమైన నమ్మకద్రోహానికి గురయ్యారు. ఇతర కేసుల్లో పర్యవసానాలు ఇంత గంభీరంగా ఉండవు. అయినా మనం నమ్మిన వ్యక్తిచే మోసగించబడడం అనేది అసాధారణమైన అనుభవమేమీ కాదు. ప్రధాన జర్మన్‌ పోలింగ్‌ సంస్థ అయిన అలెన్స్‌బాకర్‌ యార్‌బూక్‌ డర్‌ డేమొస్కొపీ 1998-2002 ప్రచురించిన ఒక నివేదిక, ఒక సర్వేలో భాగంగా ప్రతిస్పందించిన వారిలో 86 శాతం మంది తాము నమ్మిన వారిచే మోసగించబడ్డారని వెల్లడి చేసింది. బహుశా మీకూ అలాంటి అనుభవమే ఎదురైవుండవచ్చు. కాబట్టి “పాశ్చాత్య పారిశ్రామిక దేశాల్లో, పరస్పర నమ్మకంపై ఆధారపడే సంబంధాలు అనేక దశాబ్దాలుగా క్షీణించిపోతున్నాయి” అని స్విస్‌ వార్తాపత్రిక నొయ ట్సూర్‌కర్‌ ట్సైటుంగ్‌ 2002లో నివేదించడాన్ని బట్టి మనం ఆశ్చర్యపోనవసరం లేదు.

నెమ్మదిగా పెంపొందించబడేది, క్షణంలో నాశనమయ్యేది

నమ్మకం అంటే ఏమిటి? ఒక నిఘంటువు ప్రకారం, ఇతరులను నమ్మడం అంటే వారు నిజాయితీగలవారని యథార్థమైనవారని, మీకు బాధ కలిగించేదేదీ ఉద్దేశపూర్వకంగా చేయరని నమ్మడం. నమ్మకాన్ని పెంపొందించుకోవడానికి సమయం పడుతుంది, కాని దాన్ని నాశనం చేయడానికి క్షణం కూడా పట్టదు. తమ నమ్మకం వమ్ము చేయబడిందని గ్రహించినవారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ప్రజలు ఇతరులను నమ్మడానికి సుముఖంగా ఉండకపోవడంలో ఆశ్చర్యమేమైనా ఉందా? జర్మనీలో 2002వ సంవత్సరంలో ప్రచురించబడిన ఒక సర్వే ప్రకారం “ప్రతి ముగ్గురు యౌవనస్థుల్లో ఒకరికంటే తక్కువమందికి మాత్రమే ఇతరులపై కాస్త నమ్మకం ఉంది.”

మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘మనం ఎవరినైనా నిజంగా నమ్మవచ్చా? మనం నమ్మకద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం ఎవరినైనా నమ్మడం యుక్తమేనా?

[అధస్సూచి]

^ పేరా 2 పేర్లు మార్చబడ్డాయి.

[3వ పేజీలోని బ్లర్బ్‌]

ప్రతిస్పందించినవారిలో 86 శాతం మంది తాము నమ్మిన వారిచే మోసగించబడ్డారని ఒక సర్వే వెల్లడి చేసింది