కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా హృదయాన్ని సంతోషపరచిన స్త్రీలు

యెహోవా హృదయాన్ని సంతోషపరచిన స్త్రీలు

యెహోవా హృదయాన్ని సంతోషపరచిన స్త్రీలు

“యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; . . . ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును.” ​—⁠రూతు 2:12.

ఫరో ఆజ్ఞను త్రోసిపుచ్చేందుకు దేవుని భయం ఇద్దరు స్త్రీలను ప్రేరేపించింది. ఇశ్రాయేలీయుల వేగులవారినిద్దరిని కాపాడేందుకు తన ప్రాణాన్నే పణంగా పెట్టేందుకు విశ్వాసం ఓ వేశ్యను కదిలించింది. సంక్షోభ సమయంలో చూపిన బుద్ధి, వినయం అనేకుల ప్రాణాలను కాపాడ్డంతోపాటు యెహోవా అభిషిక్తుడు రక్తాపరాధి కాకుండా నిలువరించడానికి ఓ స్త్రీకి సహాయం చేశాయి. యెహోవా దేవునిపై విశ్వాసంతోపాటు అతిథి సత్కారం చేసే స్వభావం విధవరాలైన ఓ తల్లి దేవుని ప్రవక్తకు తన దగ్గరున్న చివరిరొట్టె ఇచ్చేలా పురికొల్పింది. యెహోవా హృదయాన్ని సంతోషపరచిన అనేకమంది స్త్రీల లేఖన ఉదాహరణల్లో ఇవి కేవలం కొన్ని మాత్రమే.

2 ఈ స్త్రీలపట్ల యెహోవా దృక్పథం, వారిపై ఆయన కుమ్మరించిన ఆశీర్వాదాలు స్త్రీపురుషులనే భేదం కాదుగాని ఆధ్యాత్మిక లక్షణాలే అన్నింటికంటే ఎక్కువగా ఆయనకు సంతోషం కలిగిస్తాయని చూపిస్తున్నాయి. ఐహిక భోగేచ్ఛలు సర్వత్రా వ్యాపించిన నేటి లోకంలో ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇవ్వడం ఒక సవాలే. అయితే నేడు దేవుని ప్రజల్లో అధికభాగంగా ఉన్న లక్షలాదిమంది దైవభక్తిగల స్త్రీలు ప్రదర్శించినట్లు ఆ సవాలును ఎదుర్కోవడం సాధ్యమే. అలాంటి క్రైస్తవ స్త్రీలు బైబిల్లో పేర్కొనబడ్డ దైవభక్తిగల స్త్రీలు ప్రదర్శించిన విశ్వాసం, వివేచన, అతిథి సత్కారం అలాగే మరితర చక్కని లక్షణాలను అనుకరిస్తారు. ప్రాచీనకాలానికి చెందిన ఆదర్శప్రాయులైన అలాంటి స్త్రీలు చూపిన లక్షణాలను క్రైస్తవ పురుషులు కూడా తప్పకుండా అనుకరించాలని కోరుకుంటారు. పూర్తిస్థాయిలో వారిని మనమెలా అనుకరించవచ్చో చూసేందుకు, శీర్షికారంభంలో ప్రస్తావించబడిన స్త్రీల గురించిన బైబిలు వృత్తాంతాలను సవివరంగా పరిశీలిద్దాం.​—⁠రోమీయులు 15:4; యాకోబు 4:⁠8.

ఒక ఫరోనే ప్రతిఘటించిన స్త్రీలు

3 రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జర్మనీలో జరిగిన, న్యూరెమ్‌బర్గ్‌ న్యాయవిచారణల్లో సామూహిక హత్యలుచేసినట్లు నిరూపించబడిన అనేకులు తాము కేవలం తమకివ్వబడిన ఆజ్ఞలను శిరసావహించామని వాదించడం ద్వారా తమ నేరాలను సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. ఇప్పుడు వీరిని, పేరు తెలియని ఒక నిరంకుశ ఫరో ప్రాచీన ఐగుప్తును పరిపాలించిన కాలంలో నివసించిన షిఫ్రా, పూయా అనే ఇశ్రాయేలీయులైన ఇద్దరు మంత్రసానులతో పోల్చండి. పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న హెబ్రీయుల జనాభాకు భయపడి కొత్తగా పుట్టిన ప్రతి హెబ్రీ మగశిశువును వదలకుండా చంపాలని ఫరో ఈ ఇద్దరు మంత్రసానులకు ఆజ్ఞాపించాడు. ఆ క్రూరమైన ఆజ్ఞకు ఆ స్త్రీలు ఎలా స్పందించారు? ‘వారు ఐగుప్తురాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రదుకనిచ్చారు.’ ఈ స్త్రీలు మానవ భయానికి ఎందుకు లొంగిపోలేదు? ఎందుకంటే వారు ‘దేవునికి భయపడ్డారు.’​—⁠నిర్గమకాండము 1:15, 17; ఆదికాండము 9:⁠6.

4 అవును, ఆ మంత్రసానులు యెహోవాను ఆశ్రయించారు, బదులుగా ఆయన వారిని ఫరో కోపాగ్నినుండి కాపాడి, వారికి “కేడెము[గా]” నిరూపించుకున్నాడు. (2 సమూయేలు 22:31; నిర్గమకాండము 1:​18-20) అయితే యెహోవా ఆశీర్వాదాలు అంతటితో ఆగిపోలేదు. ఆయన షిఫ్రా పూయాలకు తమ సొంత కుటుంబాలు ఉండేలాచేస్తూ వారికి ప్రతిఫలం అనుగ్రహించాడు. భావి తరాలవారు చదివేలా ఆయన తన ప్రేరిత వాక్యంలో ఆ స్త్రీల పేర్లు, వారి క్రియలు గ్రంథస్థం చేయడం ద్వారా అయన వారిని సన్మానించాడు, అయితే ఫరో పేరు మాత్రం కాలక్రమంలో మట్టిలో కలిసిపోయింది.​—⁠నిర్గమకాండము 1:21; 1 సమూయేలు 2:30బి; సామెతలు 10:⁠7.

5 షిఫ్రా పూయాలవంటి స్త్రీలు నేడున్నారా? ఉన్నారు. ప్రాణ రక్షిత బైబిలు సందేశాన్ని “రాజాజ్ఞ” నిషేధించిన దేశాల్లో ప్రతి సంవత్సరం వేలాదిమంది స్త్రీలు నిర్భయంగా ప్రకటిస్తున్నారు, ఆ విధంగా వారు తమ స్వేచ్ఛను లేదా ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. (హెబ్రీయులు 11:23; అపొస్తలుల కార్యములు 5:​28, 29) దేవునిపట్ల, పొరుగువారిపట్ల తమకున్న ప్రేమనుబట్టి పురికొల్పబడిన ధైర్యవంతులైన అలాంటి స్త్రీలు ఇతరులతో దేవుని రాజ్య సువార్తను పంచుకోకుండా తమను ఆపుచేయడానికి ఎవరినీ అనుమతించరు. పర్యవసానంగా, అనేకమంది క్రైస్తవ స్త్రీలు వ్యతిరేకతను, హింసను ఎదుర్కొంటున్నారు. (మార్కు 12:30, 31; 13:​9-13) షిఫ్రా పూయాల విషయంలో వలెనే, అలాంటి అత్యుత్తమ, ధైర్యవంతులైన స్త్రీల క్రియలు యెహోవాకు పూర్తిగా తెలియడమే కాదు, వారు అంతం వరకు నమ్మకంగా ఉంటే వారి పేర్లను తన “జీవ గ్రంథమందు” భద్రపరచడం ద్వారా వారిపై తనకున్న ప్రేమను ఆయన ప్రదర్శిస్తాడు.​—⁠ఫిలిప్పీయులు 4:3; మత్తయి 24:⁠13.

పూర్వం వేశ్యగావున్న ఓ స్త్రీ యెహోవా హృదయాన్ని ఆనందపరచింది

6 సా.శ.పూ. 1473లో కనాను పట్టణమైన యెరికోలో రాహాబు అనే వేశ్య నివసించేది. రాహాబు చాలా విషయాలు తెలిసిన స్త్రీ. ఇశ్రాయేలీయుల వేగులవారు ఇద్దరు తన ఇంటిలో ఆశ్రయం కోరినప్పుడు, ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను అంటే ఐగుప్తునుండి ఇశ్రాయేలీయుల అద్భుత నిర్గమనాన్ని గురించిన ఖచ్చితమైన వివరాలు ఆమె వారికి చెప్పగలిగింది! అమోరీయుల రాజులైన సీహోను, ఓగులపై ఇశ్రాయేలీయులు ఆ మధ్యనే సాధించిన విజయ వార్తలు కూడా ఆమెకు తెలుసు. ఆ పరిజ్ఞానం ఆమెపై ఎలాంటి ప్రభావం చూపిందో గమనించండి. ఆ వేగులవారికి ఆమె ఇలా చెప్పింది: ‘యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడని మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే అని నాకు తెలుసు.’ (యెహోషువ 2:​1, 9-11) అవును, యెహోవా గురించి, ఇశ్రాయేలీయుల పక్షాన ఆయనచేసిన కార్యాలను గురించి రాహాబుకు తెలిసిన విషయాలు, ఆమె అనుకూలంగా ప్రతిస్పందించేలా ఆమె హృదయాన్ని తాకి, ఆయనమీద విశ్వాసముంచడానికి దారితీసాయి.​—⁠రోమీయులు 10:10.

7 రాహాబు చూపిన విశ్వాసం చర్యతీసుకునేలా ఆమెను పురికొల్పింది. ఆమె ఇశ్రాయేలీయుల వేగులవారిని “సమాధానముగా” చేర్చుకొని, ఇశ్రాయేలీయులు యెరికోను ముట్టడించినప్పుడు ప్రాణ రక్షణకు వారిచ్చిన ఆదేశాలకు లోబడింది. (హెబ్రీయులు 11:31; యెహోషువ 2:​18-21) రాహాబు విశ్వాస క్రియలు నిస్సందేహంగా యెహోవా హృదయాన్ని ఆనందపరిచాయి, అందుకే క్రైస్తవులు అనుకరించడానికి మాదిరిగా దేవుని స్నేహితుడైన అబ్రాహాముతోపాటు ఆమె పేరును కూడా రాసేందుకు ఆయన క్రైస్తవ శిష్యుడైన యాకోబును ప్రేరేపించాడు. యాకోబు ఇలా వ్రాశాడు: “అటువలెనే రాహాబను వేశ్యకూడ దూతలను చేర్చుకొని వేరొకమార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలమూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా?”​—⁠యాకోబు 2:25.

8 యెహోవా అనేక విధాలుగా రాహాబుకు ప్రతిఫలమిచ్చాడు. అందులో ఒకటి ఆయన అద్భుతరీతిలో ఆమెను ఆమె ఇంట శరణుజొచ్చిన వారందరిని అంటే “ఆమె తండ్రి యింటివారిని ఆమెకు కలిగినవారినందరిని బ్రదుకనిచ్చెను.” ఆ తర్వాత ఆయన వారు స్వజనులుగా పరిగణించబడేలా వారిని “ఇశ్రాయేలీయుల మధ్య” నివసించేందుకు అనుమతించాడు. (యెహోషువ 2:13; 6:22-25; లేవీయకాండము 19:​33, 34) అంతమాత్రమే కాదు, యేసుక్రీస్తుకు పూర్వికురాలయ్యే ఘనతను కూడా యెహోవా రాహాబుకు ఇచ్చాడు. ఒకప్పుడు విగ్రహారాధన చేసే కనాను స్త్రీపట్ల ప్రేమపూర్వక దయ ఎంతగొప్పగా చూపించబడిందో గదా! *​—⁠కీర్తన 130:3, 4.

9 రాహాబువలెనే మొదటి శతాబ్దం నుండి నేటివరకు క్రైస్తవ స్త్రీలు కొందరు దేవుని సంతోషపరిచేందుకు తమ దుర్నీతికర జీవితాన్ని త్యజించారు. (1 కొరింథీయులు 6:​9-11) లైంగిక దుర్నీతి విశృంఖలమై, సర్వసాధారణమైనదిగా దృష్టించబడిన ప్రాచీన కనానుకు పోల్చదగిన పర్యావరణంలో కొందరు పెరిగారనడంలో సందేహం లేదు. అయినా, వారు లేఖనాల ప్రామాణిక పరిజ్ఞానంపై ఆధారపడిన విశ్వాసంతో పురికొల్పబడి తమ నడవడి మార్చుకున్నారు. (రోమీయులు 10:​17) “అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడ[డని]” అలాంటి స్త్రీల గురించి కూడా చెప్పవచ్చు. (హెబ్రీయులు 11:​16) అది ఎంతటి ఘనతో గదా!

ఆమె తాను చూపిన బుద్ధినిబట్టి ఆశీర్వదించబడింది

10 ప్రాచీనకాలాలకు చెందిన విశ్వసనీయులైన స్త్రీలు చాలామంది బుద్ధిని అసాధారణమైన రీతిలో ప్రదర్శించారు, అది వారిని యెహోవా ప్రజలకు ఒక అమూల్య సంపదగా చేసింది. అలాంటి ఒక స్త్రీ, ఇశ్రాయేలీయుల్లో సంపన్న భూస్వామి నాబాలు భార్యయైన అబీగయీలు. అబీగయీలు చూపిన బుద్ధి ప్రాణాలు కాపాడ్డమే కాక ఇశ్రాయేలీయుల భావి రాజైన దావీదు రక్తాపరాధి కాకుండా నిలువరించింది. 1 సమూయేలు 25వ అధ్యాయంలో నమోదైన వృత్తాంతంలో అబీగయీలు గురించి మనం చదవవచ్చు.

11 ఆ కథారంభంలో దావీదు అతని అనుచరులు నాబాలు మందల సమీపంలో విడిదిచేసినప్పుడు, ఇశ్రాయేలీయుడైన తమ సోదరుడైన నాబాలుమీద దయతో రాత్రింబగళ్లు అతని మందను ఉచితంగా కాపాడారు. ఒకసారి దావీదు దగ్గర ఆహార పదార్థాలు తరిగిపోయినప్పుడు, వాటికోసం ఆయన పదిమంది యౌవనులను నాబాలువద్దకు పంపాడు. దావీదుపట్ల కృతజ్ఞత చూపడానికీ, యెహోవా అభిషక్తునిగా ఆయనను సన్మానించడానికీ నాబాలుకు ఇప్పుడు అవకాశం లభించింది. కానీ నాబాలు అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. అతడు క్రోధావేశంతో దావీదును అవమానించి ఆ యౌవనులను వట్టిచేతుల్తో తిరిగి పంపించాడు. ఇది విన్న దావీదు ప్రతీకారం తీర్చుకోవడానికి 400 మందితో బయలుదేరాడు. తన భర్త కఠినంగా మాట్లాడాడని తెలుసుకున్న అబీగయీలు వెంటనే విస్తారంగా ఆహారపదార్థాలు పంపించి దావీదును శాంతపరిచే చర్యతీసుకొని తెలివిగా వ్యవహరించింది. ఆ పిమ్మట ఆమె స్వయంగా వెళ్లి దావీదును కలిసింది.​—⁠2-20 వచనాలు.

12 అబీగయీలు దావీదును కలుసుకున్నప్పుడు, కనికరం చూపమని ఆమె వేడుకోవడంలో యెహోవా అభిషక్తునిపట్ల ఆమెకున్న ప్రగాఢమైన గౌరవం వెల్లడవుతోంది. దావీదును ఇశ్రాయేలుమీద నాయకునిగా ఉండమని యెహోవా ఆజ్ఞాపిస్తాడని చెబుతూ, “నా యేలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా యేలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతి నిచ్చును” అని ఆమె అన్నది. (28 నుండి 30 వచనాలు) అదే సమయంలో, దావీదు తన ప్రతీకార వాంఛను కట్టడిచేసుకోకపోతే అది రక్తాపరాధానికి దారితీస్తుందని చెప్పడంలో అబీగయీలు ఎంతో ధైర్యం ప్రదర్శించింది. (26, 31 వచనాలు) అబీగయీలు చూపిన వినయం, ప్రగాఢ గౌరవం, స్పష్టమైన ఆలోచన మూలంగా దావీదు విషయం గ్రహించాడు. ఆయనిలా ప్రతిస్పందించాడు: “నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక.”​—⁠32, 33 వచనాలు.

13 ఇంటికి తిరిగివచ్చిన తర్వాత, అబీగయీలు తాను దావీదుకు పంపిన బహుమానం గురించి ధైర్యంగా తన భర్తకు తెలియజేయడానికి ప్రయత్నించింది. అయితే ఆమె అతని దగ్గరకు వెళ్లినప్పుడు ‘అతడు త్రాగుతూ మత్తుగా ఉన్నాడు.’ అందువల్ల ఆమె అతని మత్తుదిగే వరకు వేచివుండి అప్పుడు విషయం తెలియజేసింది. నాబాలు ప్రతిస్పందన ఎలావుంది? విషయం తెలుసుకొని అతనెంత దిగ్భ్రాంతికి లోనయ్యాడంటే, ఆ వెంటనే అతడు ఒక విధమైన పక్షవాతానికి గురయ్యాడు. పదిరోజుల తర్వాత దేవుడు మొత్తినప్పుడు అతను చనిపోయాడు. నాబాలు చనిపోయాడని తెలుసుకొన్నప్పుడు, అబీగయీలు పట్ల నిజమైన మెప్పు, మంచి గౌరవం గల దావీదు ఆమెను పెళ్లిచేసుకోవడానికి ప్రతిపాదించాడు. దావీదు ప్రతిపాదనను అబీగయీలు అంగీకరించింది.​—⁠34 నుండి 42 వచనాలు.

మీరు అబీగయీలువలె ఉండగలరా?

14 మీరు స్త్రీయైనా లేదా పురుషుడైనా, అబీగయీలు లక్షణాలను కొన్నింటిని మరియెక్కువగా పెంపొందించుకోవడానికి ఇష్టపడుతున్నారా? కష్టాలొచ్చినప్పుడు మరింత వివేకంగా, బుద్ధితో మెలగాలని బహుశా మీరు కోరుకుంటుండవచ్చు. లేదా మీ చుట్టూవున్న వారు తీవ్రంగా ఉద్రేకపడుతూంటే మీరు ప్రశాంతంగా, సహేతుకంగా మాట్లాడాలని కోరుకుంటుండవచ్చు. అలాగైతే, ఆ విషయం గురించి యెహోవాకు ఎందుకు ప్రార్థించకూడదు? ‘విశ్వాసముతో అడిగే’ వారందరికి జ్ఞానం, వివేచన, ఆలోచనా సామర్థ్యం ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు.​—⁠యాకోబు 1:5, 6; సామెతలు 2:1-6, 10, 11.

15 బైబిలు సూత్రాలను లక్ష్యపెట్టని లేదా ఎంతమాత్రం పట్టించుకోని అవిశ్వాసియైన భర్తవున్న స్త్రీకి ప్రత్యేకంగా అలాంటి లక్షణాలు ప్రాముఖ్యం. బహుశా అతను అతిగా త్రాగేవాడైతే ఈ లక్షణాలు అవసరం. అలాంటి పురుషులు తమ మార్గాలు మార్చుకుంటారని ఆశిద్దాం. తమ భార్యల సాత్విక స్వభావం, ప్రగాఢ గౌరవం, పవిత్ర ప్రవర్తనకు ప్రతిస్పందనగా తరచూ అనేకులు అలా తమ మార్గాలు మార్చుకున్నారు.​—⁠1 పేతురు 3:1, 2, 4.

16 ఇంట్లో ఎలాంటి కష్టాలు భరించాల్సివచ్చినా, అన్ని సమయాల్లో యెహోవా మీకు అండగా ఉంటాడని గుర్తుంచుకోండి. (1 పేతురు 3:​12) కాబట్టి ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు బలపరచుకోవడానికి కృషిచేయండి. జ్ఞానం కొరకు, ప్రశాంత హృదయం కొరకు ప్రార్థించండి. అవును, క్రమం తప్పని బైబిలు అధ్యయనం, ప్రార్థన, ధ్యానం, తోటి క్రైస్తవుల సహవాసం ద్వారా యెహోవాకు సన్నిహితమవండి. దేవునిపట్ల అబీగయీలుకున్న ప్రేమ, ఆయన అభిషిక్త సేవకునిపట్ల ఆమెకున్న మనోవైఖరి ఆమె భర్త అనాధ్యాత్మిక దృక్కోణంవల్ల ప్రభావితం కాలేదు. ఆమె నీతి సూత్రాల ఆధారంగా ప్రవర్తించింది. భర్త ఆదర్శప్రాయ దేవుని సేవకునిగావున్న ఇంట్లో సహితం, తన సొంత ఆధ్యాత్మికతను వృద్ధిచేసుకొని, దానిని కాపాడుకొనేందుకు కృషి చేయవలసిన అవసరతను క్రైస్తవ భార్య అర్థంచేసుకొంటుంది. నిజమే, తన ఆధ్యాత్మిక, వస్తుదాయక అవసరాలు తీర్చవలసిన లేఖన బాధ్యత భర్తది, అయితే చివరికి ఆమె ‘భయముతోను వణకుతోను తన సొంతరక్షణను కొనసాగించుకోవాలి.’​—⁠ఫిలిప్పీయులు 2:12; 1 తిమోతి 5:⁠8.

ఆమె “ప్రవక్తఫలము” పొందింది

17 ఏలీయా ప్రవక్త కాలంలో ఒక విధవరాలిపట్ల యెహోవా చూపిన శ్రద్ధ, తమను అందుబాటులో ఉంచుకుంటూ, తమకు కలిగినది ఇస్తూ స్వచ్ఛారాధనకు మద్దతిచ్చేవారిని ఆయన అమూల్యంగా పరిగణిస్తాడని చూపిస్తోంది. ఏలీయా కాలంలో చాలాకాలంపాటు సాగిన అనావృష్టి కారణంగా, సారెపతులో నివసిస్తున్న విధవరాలు, ఆమె కుమారునితోపాటు అనేకులు కరవు కోరల్లో చిక్కుకున్నారు. కడసారిగా తమ దగ్గర మిగిలివున్నది తిందామని వారు అనుకుంటుండగా, వారిని సందర్శిస్తూ ఏలీయా ప్రవక్త వారి దగ్గరకు వచ్చాడు. ఆయన వారిని ఓ అసాధారణ కోరిక కోరాడు. ఆ స్త్రీ దుస్థితి తెలిసి కూడా, ఆమె దగ్గర మిగిలివున్న పిండి నూనెలతో తనకు “ఒక చిన్న అప్పము” చేసిమ్మని అడిగాడు. అయితే ఆయన ఇంకా ఇలా అన్నాడు: “భూమి మీద యెహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి యున్నాడు.”​—⁠1 రాజులు 17:8-15ఎ.

18 ఆ అసాధారణ కోరికకు మీరెలా ప్రతిస్పందించి ఉండేవారు? సారెపతులోని ఆ విధవరాలు ఏలీయా యెహోవా ప్రవక్తని గుర్తించి, “ఏలీయా చెప్పిన మాటచొప్పున” చేసింది. ఆమె ఇచ్చిన ఆతిథ్యానికి యెహోవా ఎలా ప్రతిస్పందించాడు? ఆ కరవుకాలంలో ఆయన అద్భుతరీతిలో ఆ స్త్రీకి, ఆమె కుమారునికి, ఏలీయాకు ఆహారమిచ్చాడు. (1 రాజులు 17:15బి, 16) అవును, సారెపతులోని ఆ విధవరాలు ఇశ్రాయేలీయురాలు కాకపోయినా యెహోవా ఆమెకు “ప్రవక్తఫలము” అనుగ్రహించాడు. (మత్తయి 10:​41) దేవుని కుమారుడు కూడా తన సొంత పట్టణమైన నజరేతులోని విశ్వాసరహిత ప్రజల మధ్య ఆ విధవరాలి మాదిరిని ప్రస్తావించి ఆమెను కొనియాడాడు.​—⁠లూకా 4:24-26.

19 నేడనేకమంది క్రైస్తవ స్త్రీలు సారెపతులోని విధవరాలి స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నారు. ఉదాహరణకు, నిస్వార్థ క్రైస్తవ సహోదరీలు​—⁠వీరిలో అనేకులు బీదవారు, పోషించాల్సిన కుటుంబాలున్నవారు​—⁠ప్రతివారం ప్రయాణ పైవిచారణకర్తలకు వారి భార్యలకు ఆతిథ్యమిస్తున్నారు. మరికొందరు స్థానిక పూర్తికాల పరిచారకులకు భోజనం పెడుతున్నారు, అవసరంలోవున్న వారికి సహాయపడుతున్నారు లేదా మరో రీతిలో రాజ్యపనికి మద్దతుగా తమను అందుబాటులో ఉంచుకొంటున్నారు, తమకు కలిగింది ఇస్తున్నారు. (లూకా 21:⁠4) అలాంటి త్యాగాలను యెహోవా గమనిస్తాడా? నిశ్చయంగా! “మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.”​—⁠హెబ్రీయులు 6:10.

20 మొదటి శతాబ్దంలో, యేసుకు, ఆయన అపొస్తలులకు పరిచారముచేసే ఆధిక్యత దేవుని భయంగల చాలామంది స్త్రీలకు లభించింది. తర్వాతి ఆర్టికల్‌లో, ఈ స్త్రీలు యెహోవా హృదయాన్ని ఎలా సంతోషపరిచారో చర్చించి, కష్టభరిత పరిస్థితుల్లో సహితం పూర్ణహృదయంతో యెహోవా సేవ చేస్తున్న ఆధునిక స్త్రీల మాదిరిని పరిశీలిస్తాం.

[అధస్సూచి]

^ పేరా 12 మత్తయి వ్రాసిన యేసు వంశావళి నలుగురు స్త్రీలను వాళ్ళ పేర్లతో ప్రస్తావిస్తోంది, వాళ్ళు తామారు, రాహాబు, రూతు, మరియ. వారందరికి దేవుని వాక్యంలో గొప్ప స్థానం ఇవ్వబడింది.​—⁠మత్తయి 1:3, 5, 16.

పునఃసమీక్ష

• ఈ స్త్రీలు యెహోవా హృదయాన్ని ఎలా సంతోషపరిచారు?

• షిఫ్రా, పూయా

• రాహాబు

• అబీగయీలు

• సారెపతులోని విధవరాలు

• ఈ స్త్రీలు ఉంచిన మాదిరులను ధ్యానించడం మనకు వ్యక్తిగతంగా ఎలా సహాయం చేయగలదు? ఉదహరించండి.

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. యెహోవా హృదయాన్ని సంతోషపరచిన స్త్రీల గురించిన బైబిలు ఉదాహరణలను ధ్యానించడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

3, 4. (ఎ) కొత్తగా జన్మించిన ఇశ్రాయేలీయుల ప్రతి మగ శిశువును చంపమని ఫరో ఇచ్చిన ఆజ్ఞకు విధేయత చూపించడానికి షిఫ్రా పూయాలు ఎందుకు నిరాకరించారు? (బి) ఇద్దరు మంత్రసానులు చూపిన ధైర్యానికి, దైవభయానికి యెహోవా వారికెలా ప్రతిఫలమిచ్చాడు?

5. షిఫ్రా పూయాలు చూపిన అదే మనోవైఖరిని నేడు కూడా అనేకమంది స్త్రీలు ఎలా చూపిస్తున్నారు, యెహోవా వారికెలా ప్రతిఫలమిస్తాడు?

6, 7. (ఎ) రాహాబుకు యెహోవా గురించి, ఆయన ప్రజల గురించి ఏమి తెలుసు, ఈ పరిజ్ఞానం ఆమెనెలా ప్రభావితం చేసింది? (బి) రాహాబును దేవుని వాక్యమెలా సన్మానిస్తోంది?

8. విశ్వాస విధేయతలు చూపినందుకు రాహాబును యెహోవా ఎలా ఆశీర్వదించాడు?

9. రాహాబుపట్ల మొదటి శతాబ్దంలోని కొంతమంది క్రైస్తవ స్త్రీలపట్ల యెహోవా చూపిన మనోవైఖరి కొంతమంది స్త్రీలకు నేడెలా ప్రోత్సాహకరంగా ఉండగలదు?

10, 11. నాబాలు, దావీదులు ఇమిడియున్న ఎలాంటి పరిస్థితులు అబీగయీలు చర్యతీసుకునేలా నడిపాయి?

12, 13. (ఎ) అబీగయీలు తాను బుద్ధిగలదాననని అలాగే యెహోవాపట్ల, ఆయన అభిషిక్తునిపట్ల తనకు నమ్మకం ఉందని ఎలా నిరూపించుకుంది? (బి) ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అబీగయీలు ఏమిచేసింది, ఆమె పరిస్థితులు ఎలా మార్పుచెందాయి?

14. అబీగయీలుకున్న ఎలాంటి లక్షణాలను మనం మరియెక్కువగా పెంపొందించుకోవాలని బహుశా కోరుకోవచ్చు?

15. క్రైస్తవ స్త్రీలు ప్రత్యేకంగా ఎలాంటి పరిస్థితుల్లో అబీగయీలు చూపిన లక్షణాలు ప్రదర్శించడం ప్రాముఖ్యం?

16. ఒక క్రైస్తవ సహోదరి ఇంట్లో తన పరిస్థితులెలావున్నా, యెహోవాతో తన సంబంధాన్ని అన్నింటికంటే మిక్కిలి విలువైనదిగా తాను పరిగణిస్తుందని ఎలా ప్రదర్శిస్తుంది?

17, 18. (ఎ) సారెపతులోని విధవరాలికి విశ్వాస సంబంధంగా ఎలాంటి అసాధారణ పరీక్ష పెట్టబడింది? (బి) ఏలీయా విన్నపానికి ఆ విధవరాలు ఎలా ప్రతిస్పందించింది, దీనికొరకు యెహోవా ఆమెకు ఎలాంటి ప్రతిఫలమిచ్చాడు?

19. నేడనేకమంది క్రైస్తవ స్త్రీలు ఏయే విధాలుగా సారెపతులోని విధవరాలి స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నారు, ఇలాంటి వారి గురించి యెహోవా ఎలా భావిస్తాడు?

20. తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలించబడుతుంది?

[9వ పేజీలోని చిత్రాలు]

“రాజాజ్ఞ” ఉన్నప్పటికీ నమ్మకస్థులైన అనేకమంది స్త్రీలు దేవుణ్ణి సేవించారు

[10వ పేజీలోని చిత్రం]

విశ్వాసంగల వారికి రాహాబు ఎందుకు ఒక చక్కని మాదిరి?

[10వ పేజీలోని చిత్రం]

అబీగయీలు ప్రదర్శించిన ఏ లక్షణాలను అనుకరించాలని మీరు ఇష్టపడుతున్నారు?

[12వ పేజీలోని చిత్రం]

సారెపతులోని విధవరాలి స్ఫూర్తిని నేడనేకమంది క్రైస్తవ స్త్రీలు ప్రతిబింబిస్తున్నారు