కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతోషకరమైన జీవితానికి నమ్మకం ఆవశ్యం

సంతోషకరమైన జీవితానికి నమ్మకం ఆవశ్యం

సంతోషకరమైన జీవితానికి నమ్మకం ఆవశ్యం

ఫుడ్‌ పాయిజనింగ్‌ (విషపూరిత ఆహారం తీసుకున్నందువల్ల కలిగే హాని) చాలా బాధ కలిగించే అనుభవం. పదేపదే దానికి గురయ్యే వ్యక్తి తన ఆహార అలవాట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కాని ఫుడ్‌ పాయిజనింగ్‌కి గురవ్వకుండా ఉండేందుకు అసలు ఆహారమే తినకుండా ఉండడమనేది వాస్తవికమైన పరిష్కారం కాదు. అలా చేయడంవల్ల సమస్యలు పరిష్కారమవ్వడం కాదు కదా మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. ఆహారం లేకుండా ఎవ్వరూ ఎక్కువకాలం జీవించలేరు.

అదే విధంగా, నమ్మకద్రోహానికి గురవ్వడం బాధాకరమైనది. పదేపదే నమ్మకద్రోహానికి గురవ్వడమనేది, మనం మన సహవాసులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఆలోచించేలా చేయవచ్చు. అయితే నమ్మకద్రోహానికి గురవ్వకుండా ఉండేందుకు ప్రజలకు పూర్తిగా దూరమైపోవడం ఆ సమస్యకు పరిష్కారం కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే ఇతరులను నమ్మలేకపోతే, అది మన సంతోషాన్ని హరించివేస్తుంది. తృప్తికరమైన జీవితం జీవించడానికి మనకు పరస్పర నమ్మకంపై ఆధారపడిన సంబంధాలు అవసరం.

“ఇతరులతో అనుదిన వ్యవహారాల్లో సత్సంబంధాలు కలిగివుండడానికి అవసరమైన ప్రాథమిక విషయాల్లో నమ్మకం ఒకటి” అని యూజెంట్‌ 2002 అనే పుస్తకం వ్యాఖ్యానిస్తోంది. “ప్రతి ఒక్కరూ నమ్మకం కోసం కాంక్షిస్తారు. నమ్మకం జీవితపు నాణ్యతను” ఎంతగా పెంచుతుందంటే “జీవించివుండడానికి అది ఆవశ్యం” అని నీయు జుర్‌చెర్‌ జైటుంగ్‌ వార్తాపత్రిక నివేదిస్తోంది. నిజానికి నమ్మకం లేకుండా “ఒక వ్యక్తి సరిగ్గా జీవించలేడు” అని ఆ వార్తాపత్రిక చెబుతోంది.

మనం ఎవరో ఒకరిపై నమ్మకం ఉంచడమనేది ఒక ప్రాథమిక అవసరం కాబట్టి, మోసం చేయబడే ప్రమాదం లేకుండా మనం ఎవరిపై నమ్మకముంచవచ్చు?

మీ పూర్ణహృదయముతో యెహోవాపై నమ్మకముంచండి

“నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము” అని బైబిలు మనకు చెబుతోంది. (సామెతలు 3:⁠5) నిజమే, మన సృష్టికర్త అయిన యెహోవా దేవునిపై నమ్మకముంచమని దేవుని వాక్యం మనలను పదేపదే ప్రోత్సహిస్తోంది.

మనం దేవుణ్ణి ఎందుకు నమ్మవచ్చు? మొదటి కారణమేమిటంటే యెహోవా దేవుడు పరిశుద్ధుడు. యెషయా ప్రవక్త ఇలా వ్రాశాడు: “యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు.” (యెషయా 6:⁠3) దేవుడు పరిశుద్ధుడు అనే విషయం మిమ్మల్ని ఆకర్షించడం లేదా? నిజానికి అది మిమ్మల్ని తప్పకుండా ఆకర్షించాలి ఎందుకంటే యెహోవా పరిశుద్ధుడు అంటే ఆయన సమస్త చెడుతనానికి దూరంగా ఉంటాడని, ఆయన సంపూర్ణంగా ఆధారపడదగిన వ్యక్తని భావం. ఆయన ఎన్నటికీ అవినీతిపరుడిగా లేదా మోసగించే వ్యక్తిగా మారలేడు, మన నమ్మకాన్ని వమ్ము చేయడం ఆయనకు అసంభవం.

అంతేకాక తన సేవచేసేవారికి మద్దతునిచ్చే సామర్థ్యం, అలా వారికి మద్దతునివ్వాలనే కోరిక దేవునికి ఉన్నాయి కాబట్టి మనం ఆయనపై నమ్మకం ఉంచవచ్చు. ఉదాహరణకు ఆయనకున్న అమితమైన శక్తి, చర్య తీసుకునేందుకు ఆయనకు సహాయం చేస్తుంది. ఆయన పరిపూర్ణ న్యాయము, జ్ఞానము ఆయన కార్యవిధానాన్ని నిర్దేశిస్తాయి. ఆయన సాటిలేని ప్రేమ, చర్య తీసుకొనేందుకు ఆయనను ప్రేరేపిస్తుంది. “దేవుడు ప్రేమాస్వరూపి” అని అపొస్తలుడైన యోహాను వ్రాశాడు. (1 యోహాను 4:⁠8) దేవుని ప్రేమ, ఆయన చేసే పనులన్నింటిని ప్రభావితం చేస్తుంది. యెహోవా పరిశుద్ధత, ఆయన ఇతర విశిష్టమైన లక్షణాలు ఆయనను ఆదర్శప్రాయమైన తండ్రిగా అంటే మనం ప్రగాఢ నమ్మకముంచగల వ్యక్తిగా చేస్తాయి. వేరేదేదీ, వేరెవ్వరూ ఎన్నడూ యెహోవాకంటే ఎక్కువ నమ్మదగినవారిగా ఉండలేరు.

యెహోవాపై నమ్మకముంచి, సంతోషంగా ఉండండి

యెహోవాపై నమ్మకముంచడానికి మరో బలమైన కారణం, ఆయన వేరెవ్వరికంటే ఎక్కువగా మనలను అర్థం చేసుకుంటాడు. ప్రతి మనిషికి సృష్టికర్తతో ఒక పటిష్ఠమైన, శాశ్వతమైన, నమ్మదగిన సంబంధం కలిగివుండాలనే ప్రాథమిక అవసరం ఉంటుందని ఆయనకు తెలుసు. అలాంటి సంబంధంగలవారు మరింత భద్రతను అనుభవిస్తారు. “యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు” అని దావీదు రాజు చెప్పాడు. (కీర్తన 40:⁠4) నేడు లక్షలాదిమంది దావీదు తలంపులను హృదయపూర్వకంగా ప్రతిధ్వనింపజేస్తున్నారు.

కొన్ని ఉదాహరణలను పరిశీలించండి. డొమినికన్‌ రిపబ్లిక్‌లో, జర్మనీలో, గ్రీస్‌లో, అమెరికాలో నివసించిన డోరిస్‌ ఇలా అంటోంది: “నేను యెహోవాపై నమ్మకముంచడానికి ఎంతో సంతోషిస్తున్నాను. శారీరకంగా, ఆధ్యాత్మికంగా, భావోద్రేకపరంగా నన్ను ఎలా చూసుకోవాలో ఆయనకు తెలుసు. ఒక వ్యక్తి కలిగివుండగల అత్యుత్తమమైన స్నేహితుడు ఆయనే.” న్యాయ సలహాదారుడైన వుల్ఫ్‌గాంగ్‌ అనే ఒక వ్యక్తి ఇలా వివరిస్తున్నాడు: “మీ సంక్షేమం గురించి చింతించే వ్యక్తిపై, మీకు అత్యుత్తమమైనదానిని చేయగల​—⁠నిజానికి అలా చేసే​—⁠వ్యక్తిపై ఆధారపడగలగడం అద్భుతమైనది!” ఆసియాలో జన్మించి, ఇప్పుడు యూరప్‌లో నివసిస్తున్న హామ్‌ ఇలా వ్యాఖ్యానించాడు: “యెహోవా అన్ని విషయాలను అదుపు చేయగలడని, ఆయన తప్పులు చేయడని నాకు దృఢ నమ్మకం ఉంది, కాబట్టి ఆయనపై నమ్మకముంచడానికి నేను సంతోషిస్తున్నాను.”

అయితే మనలో ప్రతి ఒక్కరం కేవలం సృష్టికర్తపైనే కాక ఇతరులపై కూడా నమ్మకముంచడం అవసరం. కాబట్టి యెహోవా ఒక జ్ఞానవంతమైన అనుభవంగల స్నేహితునిగా, మనం ఎలాంటి వ్యక్తులపై నమ్మకముంచాలనే విషయంలో సలహా ఇస్తున్నాడు. బైబిలును జాగ్రత్తగా చదవడం ద్వారా మనం ఈ విషయంలో ఆయనిచ్చే ఉపదేశాన్ని తెలుసుకోవచ్చు.

మనం నమ్మగల ప్రజలు

“రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి” అని కీర్తనకర్త వ్రాశాడు. (కీర్తన 146:⁠3) ఈ ప్రేరేపిత మాటలు, మానవుల్లోని అనేకులు మన నమ్మకానికి అర్హులు కారని ఒప్పుకోవడానికి మనకు సహాయం చేస్తాయి. జ్ఞానానికి లేదా కార్యకలాపాలకు సంబంధించిన ప్రత్యేక రంగాల్లోని నిపుణులు, ఈ లోకంలోని “రాజుల”వలె ఎంతో గౌరవించబడుతున్నంత మాత్రాన వారు మన నమ్మకానికి అర్హులు కారు. వారిచ్చే మార్గదర్శకం తరచూ తప్పుదోవ పట్టించేదిగా ఉంటుంది, అలాంటి “రాజుల”పై ఉంచబడిన నమ్మకం సులభంగా ఆశాభంగానికి దారితీయవచ్చు.

అయితే ఇది మనం ఎవ్వరినీ నమ్మకుండా ఉండేలా చేయకూడదు. మనం నమ్మకముంచబోయే ప్రజలను ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. వారిని ఎంపిక చేసుకోవడానికి మనం ఎలాంటి ప్రమాణాలను పాటించాలి? ప్రాచీన ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించిన ఒక ఉదాహరణ మనకు సహాయం చేయవచ్చు. ఇశ్రాయేలులో బరువైన బాధ్యతలను నిర్వహించడానికి వ్యక్తులను నియమించవలసి వచ్చినప్పుడు, ‘సామర్థ్యముగల, దైవభక్తిగల, సత్యాసక్తిగల [“నమ్మకస్థులైన,” NW], లంచగొండులుకాని మనుష్యులను ఏర్పరచుకోమని’ మోషేకు సలహా ఇవ్వబడింది. (నిర్గమకాండము 18:​21) దీని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

ఈ పురుషులు బాధ్యతాయుతమైన స్థానాల్లో నియమించబడకముందే నిర్దుష్టమైన దైవిక లక్షణాలను ప్రదర్శించారు. తాము దైవభక్తిగలవారమని వారు అప్పటికే నిరూపించుకున్నారు; సృష్టికర్తపట్ల వారికి ఆరోగ్యకరమైన భక్తిభావం ఉండేది, ఆయనను నొప్పించడానికి వారు భయపడేవారు. ఈ పురుషులు దేవుని ప్రమాణాలను సమర్థించడానికి తమకు సాధ్యమైనదంతా చేశారని అందరికి స్పష్టంగా తెలుసు. వారు అన్యాయంగా లభించే లాభాలను ద్వేషించారు, వారికి అధికారం ఇవ్వబడితే దానిని దుర్వినియోగపరచకుండా ఉండగల నైతిక బలం వారికి ఉందని అది సూచించింది. వారు తమ స్వలాభాల కోసం లేదా తమ బంధువుల స్నేహితుల ప్రయోజనార్థం తమపై ఉంచబడిన నమ్మకాన్ని దుర్వినియోగం చేయరు.

మనం నేడు ఎవరిపై నమ్మకముంచాలి అనేది నిర్ణయించుకునేటప్పుడు అలాంటి ప్రమాణాలనే పాటించడం జ్ఞానయుక్తం కాదంటారా? తమకు దైవభయం ఉందని తమ ప్రవర్తన ద్వారా ప్రదర్శించే వ్యక్తులు మనకు తెలుసా? ప్రవర్తనకు సంబంధించి దేవుని ప్రమాణాలను అనుసరించాలని వారు తీర్మానించుకున్నారా? సరికాని పనులు చేయకుండా ఉండేందుకు అవసరమైన యథార్థత వారికి ఉందా? తమ ప్రయోజనార్థం లేదా తమకు కావలసింది సంపాదించుకోవడం కోసం ఒక పరిస్థితిని తప్పుగా ఉపయోగించుకోకుండా ఉండే నిజాయితీ వారికి ఉందా? ఇలాంటి లక్షణాలను ప్రదర్శించే స్త్రీపురుషులు తప్పకుండా మన నమ్మకానికి యోగ్యులు.

అప్పుడప్పుడు కలిగే ఆశాభంగంవల్ల నిరుత్సాహపడకండి

ఎవరిని నమ్మవచ్చో నిర్ణయించుకునేటప్పుడు మనం ఓర్పుతో ఉండాలి ఎందుకంటే నమ్మకం అనేది కాలం గడిచేకొలది క్రమంగా వృద్ధి చెందుతుంది. ఒక వ్యక్తిపై మన నమ్మకాన్ని క్రమంగా పెంపొందించుకోవడమే జ్ఞానయుక్తమైన మార్గం. అదెలా చేయవచ్చు? ఒక వ్యక్తి నిర్దిష్టమైన పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తాడో గమనిస్తూ ఆయన ప్రవర్తనను మనం కొంతకాలంపాటు పరిశీలించవచ్చు. ఆ వ్యక్తి చిన్న విషయాల్లో కూడా నమ్మకస్థుడిగా ఉన్నాడా? ఉదాహరణకు ఆయన తాను తీసుకున్న వస్తువులను ఇస్తానన్న సమయానికి తిరిగి ఇస్తాడా, ఎవరినైనా కలుస్తానని చెప్పినప్పుడు సరైన సమయానికి వచ్చి కలుస్తాడా? అలాగైతే మనం మరింత గంభీరమైన విషయాల్లో కూడా ఆయనను నమ్మవచ్చని భావించవచ్చు. అది ఈ బైబిలు సూత్రానికి అనుగుణంగా ఉంటుంది: “మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును.” (లూకా 16:​10) ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండడం, ఓర్పు చూపించడం, మనం గంభీరమైన ఆశాభంగాలకు గురికాకుండా ఉండేందుకు సహాయం చేయవచ్చు.

అయితే ఎవరైనా మన నమ్మకాన్ని వమ్ము చేస్తే అప్పుడెలా? యేసుక్రీస్తు బంధించబడిన రాత్రి ఆయన అపొస్తలులు ఆయనను ఎంతో నిరాశకు గురిచేశారన్న విషయం బైబిలు విద్యార్థులకు గుర్తువస్తుంది. యూదా ఇస్కరియోతు ఆయనను మోసం చేశాడు, ఇతరులు భయంతో పారిపోయారు. యేసు ఎవరో తనకు తెలియదని పేతురు మూడుసార్లు అబద్ధం కూడా చెప్పాడు. అయితే కేవలం యూదా మాత్రమే ఉద్దేశపూర్వకంగా అలా ప్రవర్తించాడని యేసు గ్రహించాడు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఆశాభంగానికి గురవ్వడం, ఆ తర్వాత కొద్ది వారాల తర్వాతే తన మిగిలిన 11 మంది శిష్యులపై తనకున్న నమ్మకాన్ని మళ్ళీ ధ్రువీకరించకుండా యేసును ఆపలేదు. (మత్తయి 26:45-47, 56, 69-75; 28:​16-20) అలాగే మనలను ఎవరైనా మోసం చేశారని మనకు అనిపిస్తే, నమ్మకద్రోహంగా కనిపించే ఆ చర్య అవిశ్వాస స్ఫూర్తికి నిదర్శనమా లేక శరీర సంబంధమైన తాత్కాలిక బలహీనతకు నిదర్శనమా అని మనం పరిశీలించడం మంచిది.

నేను నమ్మదగిన వ్యక్తినేనా?

తాను నమ్మగల వ్యక్తులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకునే వ్యక్తి న్యాయంగా తనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నేను నమ్మదగిన వ్యక్తినేనా? నేను నా నుండి, ఇతరుల నుండి నమ్మకానికి సంబంధించి ఎలాంటి సహేతుకమైన ప్రమాణాలను ఆశించాలి?’

నమ్మదగిన వ్యక్తి ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడతాడు. (ఎఫెసీయులు 4:​25) తన స్వలాభం కోసం ఆయన, తాను ఎవరితో మాట్లాడుతున్నాడో వారికి అనుగుణంగా తన మాటలను సవరించుకోడు. నమ్మదగిన వ్యక్తి ఒక ఒప్పందం చేసుకుంటే, ఆయన తన మాట నిలబెట్టుకోవడానికి తన శక్తిమేరకు ప్రయత్నిస్తాడు. (మత్తయి 5:​37) నమ్మదగిన వ్యక్తికి ఎవరైనా తమ స్వంత విషయాలు చెప్పుకుంటే, ఆయన వాటిని రహస్యంగానే ఉంచి, వాటి గురించి ఇతరులకు చెప్పడు. నమ్మదగిన వ్యక్తి తన వివాహ భాగస్వామికి విశ్వసనీయంగా ఉంటాడు. ఆయన పోర్నోగ్రఫీని చూడడు, లైంగిక ఊహలపై అవధానం నిలుపడు, సరదా కోసం ఇతరులతో ప్రేమ వ్యవహారాలు నడపడు. (మత్తయి 5:​27, 28) మన నమ్మకానికి అర్హుడైన వ్యక్తి తనను, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడి పనిచేస్తాడు, ఇతరులను స్వలాభానికి వాడుకొని సులభంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నించడు. (1 తిమోతి 5:⁠8) ఇలాంటి సహేతుకమైన, లేఖనాధారమైన ప్రమాణాలను మనస్సులో ఉంచుకోవడమనేది మనం నమ్మగల ప్రజలను గుర్తించడానికి మనకు సహాయం చేస్తుంది. అంతేకాక మనం కూడా ఆ ప్రమాణాలనే పాటించడం, ఇతరులు మనల్ని నమ్మదగినవారిగా ఎంచేందుకు యోగ్యులుగా ఉండడానికి మనకు సహాయం చేస్తుంది.

ప్రజలందరూ నమ్మకస్థులుగా ఉండే, నమ్మకద్రోహం వల్ల కలిగే ఆశాభంగాలు గతించిపోయిన సంగతులుగా మారిపోయే లోకంలో జీవించడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది! అది కేవలం ఒక స్వప్నమేనా? బైబిలు వాగ్దానాలను గంభీరంగా తీసుకునే ప్రజలకు అది కేవలం ఒక స్వప్నం మాత్రమే కాదు ఎందుకంటే, మోసం, అబద్ధాలు, స్వలాభం కోసం దోచుకోవడం, దుఃఖం, అనారోగ్యం, మరణం కూడా లేకుండా పోయే ఒక అందమైన “క్రొత్త భూమి” రాక గురించి దేవుని వాక్యం ప్రవచిస్తోంది. (2 పేతురు 3:13; కీర్తన 37:11, 29; ప్రకటన 21:​3-5) ఈ నిరీక్షణ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం ప్రయోజనకరం కాదంటారా? ఈ విషయం గురించి, ఇతర ప్రాముఖ్యమైన విషయాల గురించి మీకు మరింత సమాచారం అందజేయడానికి యెహోవాసాక్షులు సంతోషిస్తారు.

[4వ పేజీలోని చిత్రం]

ఇతరులను నమ్మలేకపోవడం మన సంతోషాన్ని హరించివేస్తుంది

[5వ పేజీలోని చిత్రం]

మన నమ్మకం పొందడానికి యెహోవా అత్యంత యోగ్యుడు

[7వ పేజీలోని చిత్రం]

పరస్పర నమ్మకంపై అధారపడిన సంబంధాలు మనందరికీ అవసరం