పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
జన్మనక్షత్ర రాళ్లు ఉపయోగించడాన్ని క్రైస్తవులు ఎలా దృష్టించాలి?
కొన్ని సంస్కృతుల్లో, జన్మనక్షత్ర రాళ్లు ఒక వ్యక్తి జన్మించిన నెలకు సంబంధించి ఉంటాయి. ఫలాని మణివున్న ఉంగరం ఒక క్రైస్తవుడు పెట్టుకోవాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం. (గలతీయులు 6:5) కానీ ఆ నిర్ణయం తీసుకొనేటప్పుడు, ఆలోచించవలసిన ప్రధానాంశాలు కొన్ని ఉన్నాయి.
జన్మనక్షత్ర రాయి అంటే “ఒక వ్యక్తి పుట్టిన తేదీకి సంబంధించిన మణి అని, దానిని ధరించడంవల్ల అదృష్టం కలిసొస్తుందని లేదా ఆరోగ్యకరమని సాధారణంగా నమ్ముతారు” అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా తెలుపుతోంది. అది ఇంకా ఇలా చెబుతోంది: “కొన్నిరకాల మణులకు జ్యోతిష్కులు ఎంతోకాలంగా అతీతశక్తులు ఆపాదించారు.”
ప్రత్యేకంగా ప్రాచీన కాలాల్లో, జన్మనక్షత్ర రాయిని ధరించే వ్యక్తికి అదృష్టం కలిసొస్తుందని అనేకులు నమ్మారు. నిజ క్రైస్తవుడు దీనిని నమ్ముతాడా? నమ్మడు, ఎందుకంటే తనను విడిచిపెట్టినవారిని, ‘అదృష్టదేవిని’ నమ్మినవారిని యెహోవా ఖండించాడని అతనికి తెలుసు.—యెషయా 65:11.
మధ్యయుగాల్లో, జ్యోతిష్కులు ఏడాదిలోని ప్రతినెలకు ప్రత్యేకంగా ఒక్కొక్క మణిని ఎన్నుకొన్నారు. పుట్టిన నెలకు సంబంధించిన మణి హాని జరుగకుండా కాపాడుతుందని చెప్పి, దానిని ధరించమని ప్రజలను ప్రోత్సహించారు. అయితే వృత్తిపరమైన జ్యోతిష్కులను బైబిలు ఖండిస్తుంది కాబట్టి వారుచెప్పేది వినే క్రైస్తవులు లేఖనానుసారంగా దోషులౌతారు.—ద్వితీయోపదేశకాండము 18:9-12.
అలాగే ఉంగరంలో జన్మనక్షత్ర రాయి ఉన్నందుకు దానికి విశేష ప్రాధాన్యతను ఆపాదించడం కూడా క్రైస్తవులకు అనుచితం. యెహోవాసాక్షులు జన్మదిన వేడుకలు జరుపుకోరు. ఎందుకంటే అలాంటి వేడుకలు ఒక వ్యక్తిపై మరీ ఎక్కువగా అవధానం నిలుపుతాయి, పైగా బైబిల్లో కేవలం దేవుని సేవించని పరిపాలకుల జన్మదినాలు మాత్రమే నమోదు చేయబడ్డాయి.—ఆదికాండము 40:20; మత్తయి 14:6-10.
జన్మనక్షత్ర రాయి పొదిగిన ఉంగరం పెట్టుకున్న వారి వ్యక్తిత్వంపై అది మంచి ప్రభావం చూపుతుందని కొందరు అనుకొంటారు. అయితే, నిజ క్రైస్తవులు దీనిని నమ్మరు, కారణమేమిటంటే లేఖన సూత్రాలను అన్వయించుకొన్నప్పుడు, దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం వల్లే “నవీనస్వభావము” ధరించుకోగలమని వారు గ్రహిస్తారు.—ఎఫెసీయులు 4:22-24.
దాని వెనుకవున్న ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకోవడం ప్రాముఖ్యం. జన్మనక్షత్ర రాయి పొదిగిన ఉంగరం పెట్టుకోవాలా వద్దా అని నిర్ణయించుకొనేటప్పుడు, ఒక క్రైస్తవుడు ఇలా ప్రశ్నించుకోవచ్చు, ‘ఆ మణి జన్మనక్షత్ర రాయి అని పిలువబడుతున్నా, ఆ మణి నచ్చినందుకే నేను ఆ ఉంగరం పెట్టుకోవాలని కోరుకొంటున్నానా? లేక అలాంటి మణులకు కొందరు ఆపాదిస్తున్న మూఢనమ్మకాల ప్రభావానికి నేను కొంతమేరకైనా లోనయ్యానా?’
ఒక క్రైస్తవుడు తన ఉద్దేశమేమిటో తేల్చుకోవడానికి తన హృదయం పరిశీలించుకోవాలి. “నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము” అని లేఖనం చెబుతోంది. (సామెతలు 4:23) ప్రతి క్రైస్తవుడు, జన్మనక్షత్ర రాయికి సంబంధించి తాను నిర్ణయం తీసుకోవడంలో తన ఉద్దేశాన్ని గురించి అలాగే తన పద్ధతి తనపై, ఇతరులపై చూపించే ప్రభావాల గురించి ఆలోచించడం మంచిది.—రోమీయులు 14:13.