కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విశ్వాసంతో బారాకు ఒక శక్తివంతమైన సైన్యాన్ని పారదోలాడు

విశ్వాసంతో బారాకు ఒక శక్తివంతమైన సైన్యాన్ని పారదోలాడు

విశ్వాసంతో బారాకు ఒక శక్తివంతమైన సైన్యాన్ని పారదోలాడు

మీరు శత్రువుల సైన్యం ఎదుట నిలబడివున్నట్లు ఊహించుకోండి. వాళ్ళ దగ్గర అత్యంత ఆధునిక ఆయుధాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఎదుట మీరూ మీ తోటి సైనికులూ దాదాపు నిస్సహాయులుగా ఉన్నారు.

ఇశ్రాయేలు న్యాయాధిపతుల కాలంలో బారాకు, దెబోరా, వారి తోటి ఇశ్రాయేలీయులు 10,000 మంది అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. వాళ్ళ శత్రు సైన్యం కనానీయులు, ఆ సైన్యానికి సేనాధిపతి సీసెరా నాయకత్వం వహించాడు. వారి యుద్ధసామాగ్రిలో, మరణకరమైన ఇనుప ఇరుసులు అమర్చబడిన రథాలు కూడా ఉన్నాయి. ఆ యుద్ధం తాబోరు కొండ, కీషోను వాగు దగ్గర జరిగింది. అక్కడ జరిగిన సంఘటనలు బారాకును విశేషమైన విశ్వాసం గల వ్యక్తిగా గుర్తిస్తున్నాయి. ఈ యుద్ధానికి దారితీసిన సంఘటనలను పరిశీలించండి.

ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టుకుంటారు

ఇశ్రాయేలీయులు పదేపదే స్వచ్ఛారాధనను విడిచిపెట్టిన వైనం గురించి, దానివల్ల వచ్చిన వినాశనకరమైన పర్యవసానాల గురించి న్యాయాధిపతుల పుస్తకం మనకు చెబుతోంది. ప్రతి సందర్భంలోను, ఇశ్రాయేలీయులు దేవుని దయ కోసం యథార్థంగా వేడుకోవడం, దేవుడు ఒక రక్షకుడిని నియమించడం, వాళ్ళు విడుదలవడం, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ తిరుగుబాటు చేయడం ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. అదే పద్ధతిని అనుసరిస్తూ ‘ఏహూదు [ఇశ్రాయేలీయులను మోయాబు అణచివేత నుండి రక్షించిన న్యాయాధిపతి] మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి.’ నిజానికి వారు ‘క్రొత్త దేవతలను కోరుకోవడం’ ప్రారంభించారు. దాని ఫలితం? “యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీనుచేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి . . . సీసెరా. అతనికి తొమ్మిదివందల ఇనుపరథములుండెను. అతడు ఇరువది సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధపెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి.”​—⁠న్యాయాధిపతులు 4:1-3; 5:⁠8.

ఇశ్రాయేలులో జీవితం గురించి లేఖనాలు ఇలా చెబుతున్నాయి: “[ఆ] దినములలో రాజమార్గములు ఎడారులాయెను ప్రయాణస్థులు చుట్టుత్రోవలలోనే నడిచిరి. . . . ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి.” (న్యాయాధిపతులు 5:​6, 7) ప్రజలకు రథాలపై వచ్చే దోపిడీదారుల భయం ఉండేది. “ఇశ్రాయేలులోని ప్రజల జీవితాలను భయం పరిపాలించేది, మొత్తం సమాజమంతా నిర్వీర్యమైపోయినట్లు, నిస్సహాయంగా ఉన్నట్లు అనిపించేది” అని ఒక విద్వాంసుడు చెబుతున్నాడు. కాబట్టి అధైర్యపడిన ఇశ్రాయేలీయులు పూర్వం ఎన్నోసార్లు చేసినట్లే ఈ సారి కూడా సహాయం కోసం యెహోవాకు మొఱ్ఱపెట్టుకున్నారు.

యెహోవా ఒక నాయకుడిని నియమిస్తాడు

కనానీయుల అణచివేత, ఇశ్రాయేలుకు ఒక జాతీయ విపత్తుగా పరిణమించింది. దేవుడు తన తీర్పులను, ఉపదేశమును తెలియజేయడానికి ప్రవక్త్రి అయిన దెబోరాను ఉపయోగించాడు. ఆ విధంగా ఇశ్రాయేలుకు ఆలంకారికమైన తల్లిగా వ్యవహరించే ఆధిక్యతను యెహోవా ఆమెకు ఇచ్చాడు.​—⁠న్యాయాధిపతులు 4:4; 5:⁠7.

దెబోరా బారాకును పిలిపించి ఆయనకు ఇలా చెప్పింది: “నీవు వెళ్లి నఫ్తాలీయులలోను జెబూలూనీయులలోను పదివేలమంది మనుష్యులను తాబోరు కొండయొద్దకు రప్పించుము; నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతియైన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటియొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించెదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియుండలేదా?” (న్యాయాధిపతులు 4:​6, 7) ‘యెహోవా సెలవివ్వలేదా?’ అని అడగడం ద్వారా దెబోరా బారాకుపై తనకు వ్యక్తిగత అధికారమేమీ లేదని స్పష్టం చేసింది. దైవిక ఆజ్ఞను తెలియజేయడానికి ఆమె కేవలం ఒక మాధ్యమంగా వ్యవహరించింది. బారాకు ఎలా ప్రతిస్పందించాడు.

“నీవు నాతోకూడ వచ్చినయెడల నేను వెళ్లెదను గాని నీవు నాతోకూడ రానియెడల నేను వెళ్లను” అని బారాకు అన్నాడు. (న్యాయాధిపతులు 4:⁠8) దేవుడిచ్చిన బాధ్యతను స్వీకరించడానికి బారాకు ఎందుకు సుముఖత చూపించలేదు? ఆయన పిరికితనంతో ప్రవర్తించాడా? దేవుని వాగ్దానాలపై ఆయనకు విశ్వాసం లేదా? అదేమీ కాదు. బారాకు ఆ నియామకాన్ని తిరస్కరించలేదు లేదా యెహోవాకు అవిధేయత చూపలేదు. వాస్తవానికి ఆయన ప్రతిస్పందన, దేవుడు ఆజ్ఞాపించిన పనిని తనంతట తానుగా చేయడానికి తాను అయోగ్యుడనని ఆయన భావించినట్లు సూచిస్తోంది. తనతోపాటు దేవుని ప్రతినిధి ఉంటే, తనకు దైవిక నడిపింపు నిశ్చయంగా లభిస్తుందని, తానూ తన మనుష్యులూ ధైర్యంతో నింపబడతారని ఆయన భావించాడు. కాబట్టి బారాకు పెట్టిన షరతు, ఆయన బలహీనతకు కాదుకాని ఆయనకున్న బలమైన విశ్వాసానికి చిహ్నంగా ఉంది.

బారాకు ప్రతిస్పందనను, మోషే గిద్యోను యిర్మీయాల ప్రతిస్పందనలతో పోల్చవచ్చు. వీరికి కూడా, దేవుడిచ్చిన విధులను నెరవేర్చడానికి తమకున్న సామర్థ్యంలో నమ్మకం లోపించింది. ఆ కారణంచేత వారు అంత విశ్వసనీయులు కాదన్నట్లు పరిగణించబడలేదు. (నిర్గమకాండము 3:11-4:17; 33:12-17; న్యాయాధిపతులు 6:11-22, 36-40; యిర్మీయా 1:​4-10) దెబోరా వైఖరి గురించి ఏమని చెప్పవచ్చు? ఆమె పరిస్థితిని అదుపు చేయాలని ప్రయత్నించలేదు. ఆమె యెహోవాకు నమ్రతగల సేవకురాలిగానే మిగిలిపోయింది. “నీతో నేను అగత్యముగా వచ్చెదను” అని ఆమె బారాకుతో చెప్పింది. (న్యాయాధిపతులు 4:⁠9) జరగనున్న యుద్ధంలో బారాకుతోపాటు ఉండేందుకు ఆమె తన ఇంటిని, అంటే మరింత భద్రతగల ప్రాంతాన్ని విడిచిపెట్టడానికి సుముఖత చూపించింది. దెబోరా కూడా విశ్వాసానికి, ధైర్యానికి మాదిరిగా ఉంది.

విశ్వాసంతో వారు బారాకును అనుసరిస్తారు

యుద్ధం కోసం ఇశ్రాయేలు సైన్యం గమనార్హమైన తాబోరు కొండ వద్దకు వెళ్ళాలి. ఆ ప్రాంతం సరిగ్గా ఎంపిక చేసుకోబడింది. అక్కడికి దగ్గర్లో నివసించే నఫ్తాలీ జెబూలూను తెగలు కూడుకునే సహజ ప్రాంతానికి అది ప్రాతినిధ్యం వహిస్తోంది. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పదివేలమంది, దెబోరా, బారాకును అనుసరించి ఈ కొండపైకి వెళ్ళారు.

బారాకుతోపాటు వెళ్ళిన వారందరికి విశ్వాసం అవసరమైంది. కనానీయులపై విజయం అనుగ్రహిస్తానని యెహోవా బారాకుకు వాగ్దానం చేశాడు, కానీ ఇశ్రాయేలీయుల వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి? న్యాయాధిపతులు 5:8 ఇలా చెబుతోంది: “ఇశ్రాయేలీయులలో నలువదివేలమందికి ఒక కేడెమేగాని యీటెయే గాని కనబడలేదు.” అంటే ఇశ్రాయేలీయుల వద్ద చాలా తక్కువ ఆయుధాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇనుప ఇరుసులుగల రథాలతో పోలిస్తే వారివద్ద ఉన్న కేడెములు, యిటెలు ఎందుకూ పనికిరావనడంలో సందేహం లేదు. బారాకు తాబోరు కొండపైకి వెళ్ళాడని తెలియగానే సీసెరా తన రథాలను, సైన్యాన్ని కీషోను వాగువద్దకు పిలిపించాడు. (న్యాయాధిపతులు 4:​12, 13) అయితే తాను సర్వశక్తిమంతుడైన దేవునితో యుద్ధం చేయబోతున్నానని సీసెరా గ్రహించలేకపోయాడు.

సీసెరా సైన్యాన్ని బారాకు పారదోలుతాడు

యుద్ధం చేయవలసిన సమయం వచ్చినప్పుడు దెబోరా బారాకుతో ఇలా చెప్పింది: “లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా?” యుద్ధం చేయడానికి బారాకు, ఆయన సైన్యం తాబోరు కొండ దిగి వాగు మైదానాలకు రావాలి, కాని మైదానాల్లో సీసెరా రథాలకు శత్రువులను నాశనం చేయడానికి కావలసిన అనుకూల పరిస్థితి ఉంటుంది. ఒకవేళ మీరు బారాకు సైన్యంలో ఉండివుంటే ఎలా భావించేవారు? ఆ నడిపింపు యెహోవా నుండి వచ్చిందని గుర్తుంచుకొని మీరు నిస్సంకోచంగా విధేయత చూపించివుండేవారా? బారాకు, ఆయనతోపాటు వెళ్ళిన పదివేల మంది విధేయత చూపించారు. “బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటిని అతని సర్వసేనను కలవరపరచె[ను].”​—⁠న్యాయాధిపతులు 4:14, 15.

యెహోవా సహాయంతో బారాకు సీసెరా సైన్యాన్ని పారదోలాడు. ఆ యుద్ధం గురించి తెలియజేసే వృత్తాంతం, అక్కడ జరిగిన సంఘటనలన్నింటిని తెలియజేయడం లేదు. అయితే బారాకు దెబోరాలు పాడిన విజయ గీతం “ఆకాశము నీళ్లను కురిపించెను మేఘములును వర్షించెను” అని చెబుతోంది. వరద కారణంగా సీసెరా రథాలు బురదలో కూరుకుపోయినప్పుడు బారాకుదే పైచెయ్యి అయ్యుండవచ్చు. అలా జరిగినందువల్ల కనానీయుల ముఖ్య ఆయుధాలు పనికిరాకుండా పోయాయి. సీసెరా సైనికుల మృతదేహాల గురించి ఆ గీతం ఇలా చెబుతోంది: “కీషోను వాగువెంబడి . . . వారు కొట్టుకొనిపోయిరి.”​—⁠న్యాయాధిపతులు 5:4, 21.

ఆ ఘటన నమ్మదగినదేనా? కీషోను వాగు ఒక కొండవాగు, దానిలో సాధారణంగా తక్కువ నీళ్ళు ప్రవహించేవి. తుఫానులు వచ్చినప్పుడు లేదా ఎక్కువసేపు వర్షాలు పడినప్పుడు ఇలాంటి వాగులు వెంటనే పెద్దవై వడిగా ప్రవహించే ప్రమాదకరమైన వాగులుగా మారే అవకాశం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో, అదే ప్రాంతంలోని రేగడిమన్ను నేలపై కేవలం 15 నిమిషాలు వర్షం పడడంతో ఆశ్వికదళం విజయవంతంగా ప్రయాణించడం కష్టమైపోయిందని చెప్పబడుతోంది. ఏప్రిల్‌ 16, 1799లో నెపోలియన్‌కు టర్కీవారికి మధ్య జరిగిన తాబోరు కొండ యుద్ధానికి సంబంధించిన వృత్తాంతాలు, “కీషోను వాగు ముంచివేసిన మైదానంలోని ఒక భాగం దాటి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ [టర్కీవారిలో] చాలామంది మునిగిపోయారు” అని నివేదిస్తున్నాయి.

సీసెరా సైన్యం, బారాకు సైన్యం యుద్ధం ప్రారంభించబోయే ముందు, “ఆకాశం నుండి గొప్ప తుఫాను వచ్చింది, పెద్ద వడగండ్ల వాన కురిసింది, గాలి ఆ వర్షాన్ని కనానీయుల మొహాల్లోకి కొట్టింది, తద్వారా వారి కళ్ళు మసకబారాయి, వారి బాణాలు వడిసెళ్ళు పనికిరాకుండా పోయాయి” అని యూదా చరిత్రకారుడైన ఫ్లేవియస్‌ జోసీఫస్‌ చెబుతున్నాడు.

“నక్షత్రములు ఆకాశమునుండి యుద్ధముచేసెను నక్షత్రములు తమ మార్గములలోనుండి సీసెరాతో యుద్ధముచేసెను” అని న్యాయాధిపతులు 5:⁠20 చెబుతోంది. నక్షత్రాలు సీసెరాతో ఎలా యుద్ధం చేశాయి? ఈ వ్యాఖ్యానం దైవిక మద్దతును సూచిస్తున్నట్లు కొందరు దృష్టిస్తారు. ఇది దేవదూతల సహాయాన్ని, విచ్ఛిన్నమైన ఉల్కలు కురవడాన్ని లేదా సీసెరా ఖగోళశాస్త్ర ప్రవచనాలపై ఆధారపడడంతో అవి తప్పని నిరూపించబడడాన్ని సూచిస్తోందని కొందరు భావిస్తారు. ఆ యుద్ధంలో నక్షత్రాలు ఎలా యుద్ధం చేశాయనే విషయానికి సంబంధించి బైబిలు ఎలాంటి వివరణా ఇవ్వడం లేదు కాబట్టి, ఆ వ్యాఖ్యానం ఇశ్రాయేలు సైన్యం తరఫున దేవుడు కలుగజేసుకోవడాన్ని సూచిస్తోందని మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఇశ్రాయేలీయులు పరిస్థితిని చక్కగా ఉపయోగించుకున్నారు. “బారాకు ఆ రథములను . . . తరుమగా సీసెరాయొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలియుండలేదు.” (న్యాయాధిపతులు 4:​16) సైన్యాధిపతి సీసెరా సంగతేమిటి?

అణగద్రొక్కేవాడు “ఒక స్త్రీచేతికి” చిక్కుతాడు

“హాసోరురాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగియుండెను గనుక సీసెరా [యుద్ధాన్ని వదిలి] కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్యయైన యాయేలు గుడారమునకు పారిపోయెను” అని బైబిలు చెబుతోంది. అలసిపోయివున్న సీసెరాను యాయేలు తన గుడారములోకి ఆహ్వానించి, త్రాగడానికి పాలు ఇచ్చి, గొంగళితో అతనిని కప్పడంతో అతను నిద్రపోయాడు. అప్పుడు యాయేలు “గుడారపు మేకు తీసికొని సుత్తె చేతపట్టుకొ[నెను],” గుడారాల్లో నివసించేవారు ఆ వస్తువులను తరచూ ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఆమె “అతనియొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసటచేత గాఢనిద్ర కలిగియుండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను.”​—⁠న్యాయాధిపతులు 4:17-22.

ఆ తర్వాత యాయేలు బయటకు వచ్చి బారాకును కలిసి ఆయనకు ఇలా చెప్పింది: “రమ్ము, నీవు వెదకుచున్న మనుష్యుని నీకు చూపించెదను.” ఆ వృత్తాంతం ఇంకా ఇలా చెబుతోంది: “అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చి పడియుండెను, ఆ మేకు అతని కణతలలో నుండెను.” ఆ సంఘటన బారాకు విశ్వాసాన్ని ఎంతగా బలపరిచివుంటుందో కదా! అంతకుముందే దెబోరా ప్రవక్త్రి ఆయనకు ఇలా చెప్పింది: “అయితే నీవు చేయు ప్రయాణమువలన నీకు ఘనతకలుగదు, యెహోవా ఒక స్త్రీచేతికి సీసెరాను అప్పగించును.”​—⁠న్యాయాధిపతులు 4:9, 22.

యాయేలు చేసిన పని మోసమని చెప్పవచ్చా? యెహోవా దానిని అలా దృష్టించలేదు. బారాకు దెబోరాలు పాడిన విజయ గీతం, “గుడారములలోనుండు స్త్రీలలో ఆమె దీవెన నొందును” అని చెబుతోంది. ఆ పాట సీసెరా మరణం గురించి సరైన దృక్కోణం కలిగివుండడానికి మనకు సహాయం చేస్తోంది. సీసెరా తల్లి అతని రాక కోసం ఆత్రంగా వేచివున్నట్లు వర్ణించబడింది. “అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేల?” అని ఆమె ప్రశ్నిస్తోంది. “ఆమెయొద్దనున్న వివేకముగల రాజకుమార్తెలు,” సీసెరా దోపుడుగా దొరికినవాటిని అంటే అందంగా రంగువేయబడిన వస్త్రాలను, పురుషుల కోసం స్త్రీలను పంచుతూవుంటాడు అని చెప్పి ఆమె భయాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు. ఆ రాజకుమార్తెలు ఇలా అంటారు: “దోపుడుసొమ్ము పంచుకొనుచున్నారు గదా? యోధులందరు తలాయొక స్త్రీని తీసికొందురు ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు సీసెరాకు రంగువేయబడిన వస్త్రమొకటి . . . రంగువేయబడిన విచిత్ర వస్త్రమొకటి దోపుడుగా దొరకును రెండువైపుల రంగువేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొనినవారి మెడలకు తగిన వస్త్రమొకటి దొరకును.”​—⁠న్యాయాధిపతులు 5:24, 28-30.

మనకు పాఠాలు

బారాకు వృత్తాంతం మనకు ప్రాముఖ్యమైన పాఠాలను నేర్పిస్తోంది. తమ జీవితాల నుండి యెహోవాను దూరం చేసుకొనే వారెవరికైనా కష్టాలు బాధలు తప్పకుండా వస్తాయి. పశ్చాత్తాపంతో దేవునివైపు తిరిగి, ఆయనపై విశ్వాసముంచేవారు వివిధ రకాలైన అణచివేతల నుండి స్వాతంత్ర్యం పొందుతారు. అలాంటప్పుడు మనం కూడా విధేయత చూపించే స్ఫూర్తిని పెంపొందించుకోవద్దంటారా? దేవుడు మననుండి కోరేవి, మానవ తర్కనకు విరుద్ధంగా ఉన్నట్లు అనిపించినప్పుడు కూడా ఆయన ఉపదేశాలు ఎప్పుడూ మన శాశ్వత మంచికేనని మనం దృఢంగా నమ్మవచ్చు. (యెషయా 48:​17, 18) యెహోవాపై విశ్వాసముంచి, దైవిక ఆజ్ఞలకు విధేయత చూపించడం ద్వారానే బారాకు ‘అన్యుల సేనలను పారదోలాడు.’​—⁠హెబ్రీయులు 11:32-34.

దెబోరా బారాకుల విజయ గీతం ఇలా ప్రేరణాత్మకంగా ముగిసింది: “యెహోవా నీ శత్రువులందరు ఆలాగుననే నశించెదరు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యునివలె నుందురు.” (న్యాయాధిపతులు 5:​31) యెహోవా, సాతాను దుష్ట లోకాన్ని నాశనం చేసినప్పుడు ఆ మాటలు నిజమని నిరూపించబడతాయి!

[29వ పేజీలోని చిత్రం]

బారాకును పిలిపించడానికి యెహోవా దెబోరాను ఉపయోగించుకున్నాడు

[31వ పేజీలోని చిత్రం]

కీషోను నది ఒడ్డు దాటి ప్రవహిస్తోంది

[చిత్రసౌజన్యం]

Pictorial Archive (Near Eastern History) Est.

[31వ పేజీలోని చిత్రం]

తాబోరు కొండ