కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక టీవీ కార్యక్రమం ఆమె దేవుణ్ణి మహిమపరిచేలా చేసింది

ఒక టీవీ కార్యక్రమం ఆమె దేవుణ్ణి మహిమపరిచేలా చేసింది

రాజ్య ప్రచారకుల నివేదిక

ఒక టీవీ కార్యక్రమం ఆమె దేవుణ్ణి మహిమపరిచేలా చేసింది

“కొ రదరు అసూయచేతను కలహబుద్ధిచేతను, మరికొందరు మంచిబుద్ధిచేతను క్రీస్తును ప్రకటించుచున్నారు” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (ఫిలిప్పీయులు 1:​15) కొన్నిసార్లు, యెహోవా ప్రజలను అపఖ్యాతి పాలుచేయాలని చూసేవారు కూడా తమకు తెలియకుండానే, యథార్థ హృదయులు సత్యంవైపు మళ్ళేందుకు సహాయపడ్డారు.

1998 నవంబరులో, ఫ్రాన్స్‌లోని లూవీయేలోవున్న యెహోవాసాక్షుల బెతెల్‌ అంటే బ్రాంచి భవనాల ఫోటోలతో కూడిన ఒక డ్యాకుమెంటరీ చిత్రం ఫ్రెంచ్‌ నేషనల్‌ టీవీలో ప్రసారం చేయబడింది. ఆ కార్యక్రమానికి విభిన్న ప్రతిస్పందనలు లభించినప్పటికీ, అది ఊహించని రీతుల్లో మంచి ఫలితాలను తెచ్చింది.

బెతెల్‌కు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న అన్నా పోలా కూడా ఆ కార్యక్రమాన్ని చూసింది. విడాకులు తీసుకొని ఒంటరిగా జీవిస్తున్న అన్నా పోలాకు ఇద్దరు పిల్లలు, ఆమె ఉద్యోగం కోసం వెదుకుతోంది. కాబట్టి ఆమె ఆ మరుసటి రోజు ఉదయం ఉద్యోగ అవకాశాల కోసం అడిగేందుకు బెతెల్‌కు ఫోన్‌ చేసింది. “అది చాలామంచి స్థలమని, అక్కడ చేయబడుతున్న పని ఉపయోగకరమైనదని నేను తలంచాను” అని ఆమె చెప్పింది. అయితే బెతెల్‌లో సేవచేసే వారందరూ తమ సమయాన్ని స్వచ్ఛందంగా ఇచ్చే పరిచారకులని తెలుసుకొని ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది! యెహోవాసాక్షుల కార్యకలాపాల గురించి క్లుప్తమైన చర్చ జరిగిన తర్వాత, సాక్షులు తనను సందర్శించడానికి ఆమె ఒప్పుకుంది.

స్థానిక సంఘంలో పూర్తికాల సేవకురాలైన లేనా ఆమెను సందర్శించినప్పుడు, వారిద్దరి మధ్య సుదీర్ఘమైన సంభాషణ జరిగింది, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము * అనే పుస్తకాన్ని ఆమె తీసుకుంది. లేనా ఆమెను తిరిగి సందర్శించేసరికి ఆమె పుస్తకాన్ని ఆసాంతం చదివేసి ఎన్నో ప్రశ్నలతో సిద్ధంగా ఉంది. ఆమె బైబిలు అధ్యయనానికి వెంటనే అంగీకరించింది. అన్నా పోలా ఇలా చెప్పింది: “దేవుని వాక్యం గురించి తెలుసుకోవడానికి నాకు అది ఒక అవకాశమని నేను భావించాను. నేను అంతకుముందెప్పుడూ నా చేతులతో బైబిలును పట్టుకోలేదు.”

జనవరిలో అన్నా పోలా బెతెల్‌ను సందర్శించింది, ఆ తర్వాతి వారం ఆమె మొదటిసారిగా క్రైస్తవ కూటానికి హాజరయ్యింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె తన పిల్లలతో బైబిలును అధ్యయనం చేయడం, తన స్నేహితులకు సాక్ష్యమివ్వడం ప్రారంభించింది. “నేను నేర్చుకుంటున్న విషయాలను ఇతరులతో పంచుకోకుండా ఉండలేకపోయాను. నేను బైబిలు సత్యాలను ప్రజలతో పంచుకొని వారిని ఓదార్చాలనుకున్నాను” అని ఆమె చెబుతోంది. అనేక వ్యక్తిగత సమస్యలను అధిగమించడానికి ఎంతో కష్టపడిన తర్వాత అన్నా పోలా క్రమంగా కూటాలకు హాజరవ్వడం ప్రారంభించింది. ఆమె ఎంతో వేగంగా అభివృద్ధి సాధించి 2002, మే 5వ తారీఖున బాప్తిస్మం తీసుకుంది.

అంతేకాకుండా అన్నా పోలా చక్కని మాదిరిని, అత్యంతాసక్తితో ఆమె చేస్తున్న ప్రకటనా పనిని చూసిన ఆమె తల్లి బైబిలును అధ్యయనం చేయడం ప్రారంభించి కొంతకాలానికి బాప్తిస్మం తీసుకుంది. “నేను అనుభవిస్తున్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. యెహోవా నా జీవితంలోకి ప్రవేశించినందుకు, నాకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నింటికి నేను ఆయనకు ప్రతిదినం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని అన్నా పోలా చెబుతోంది.

[అధస్సూచి]

^ పేరా 6 యెహోవాసాక్షులు ప్రచురించినది.

[8వ పేజీలోని చిత్రాలు]

పైన: అన్నా పోలా

క్రింద: ఫ్రాన్స్‌లోని బ్రాంచి కార్యాలయానికి ప్రవేశ మార్గం