“కృతజ్ఞులై యుండుడి”
“కృతజ్ఞులై యుండుడి”
“క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నియ్యుడి; . . . మరియు కృతజ్ఞులై యుండుడి.”—కొలొస్సయులు 3:15.
ప్రపంచవ్యాప్తంగా 94,600 యెహోవాసాక్షుల సంఘాల్లో, మనం కృతజ్ఞతా స్ఫూర్తిని చూస్తాము. ప్రతి కూటము యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ చేసే ప్రార్థనతో ప్రారంభమవుతుంది, ముగుస్తుంది. పిన్నలూ పెద్దలూ క్రొత్తవారూ ఎంతో కాలంగా ఉన్నవారూ అయిన సాక్షులందరూ ఆరాధన కోసం, సంతోషకరమైన సహవాసం కోసం కలిసి సమకూడినప్పుడు “ధన్యవాదాలు,” “ఫరవాలేదు” అనే మాటలు లేదా అలాంటివే ఇతర వ్యక్తీకరణలు మనకు తరచూ వినిపిస్తాయి. (కీర్తన 133:1) ‘యెహోవా నెరుగని, సువార్తకు లోబడని’ అనేకుల మధ్యనున్న స్వార్థపూరితమైన స్ఫూర్తికి ఇదెంత భిన్నమో కదా! (2 థెస్సలొనీకయులు 1:6) మనం కృతజ్ఞతలేని లోకంలో జీవిస్తున్నాము. ఈ లోక దేవత ఎవరో పరిశీలిస్తే దానిలో ఆశ్చర్యపోవలసినదేమీ ఉండదు, అతడు అపవాదియైన సాతాను, అతడు స్వార్థాన్ని ఎక్కువగా సమర్థిస్తాడు, అతడి గర్వం తిరుగుబాటు ధోరణి మానవ సమాజమంతటా వ్యాపించి ఉన్నాయి!—యోహాను 8:44; 2 కొరింథీయులు 4:4; 1 యోహాను 5:19.
2 సాతాను లోకం మనల్ని చుట్టుముట్టి ఉంది కాబట్టి దాని దృక్పథాలతో మనం కలుషితం కాకుండా ఉండడానికి జాగ్రత్త వహించాలి. మొదటి శతాబ్దంలో, అపొస్తలుడైన పౌలు ఎఫెసులోని క్రైస్తవులకు ఇలా గుర్తుచేశాడు: “మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమవారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైయుంటిమి.” (ఎఫెసీయులు 2:2, 3) అది నేడు అనేకుల విషయంలో కూడా నిజమే. అలాంటప్పుడు మనం కృతజ్ఞతా స్ఫూర్తిని ఎలా కాపాడుకోవచ్చు? యెహోవా ఏ సహాయాన్ని అందజేస్తున్నాడు? మనం నిజంగా కృతజ్ఞత కలిగివున్నామని ఆచరణాత్మకమైన ఏ మార్గాల్లో చూపించవచ్చు?
కృతజ్ఞత కలిగివుండడానికి కారణాలు
3 మనం మన సృష్టికర్త జీవదాత అయిన యెహోవా దేవునికి, ప్రాముఖ్యంగా ఆయన మనపై కురిపించిన పుష్కలమైన ఆశీర్వాదాలను కొన్నింటిని పరిశీలించినప్పుడు కృతజ్ఞత చూపించ బద్ధులమై ఉన్నాము. (యాకోబు 1:17) మనం సజీవంగా ఉన్నందుకు ప్రతిరోజు యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేస్తాము. (కీర్తన 36:9) మన చుట్టూ యెహోవా చేతికార్యాలకు నిదర్శనమైనవి అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వంటివి ఎన్నో ఉన్నాయి. మన గ్రహంలోవున్న జీవదాయకశక్తినిచ్చే ఖనిజాల మహత్తరమైన నిధి, వాతావరణంలోవున్న ఆవశ్యకమైన వాయువుల చక్కని సమతుల్య మిశ్రమం, ప్రకృతిలోని సంక్లిష్టమైన చక్రాలు, ఇవన్నీ మనం మన ప్రేమగల పరలోక తండ్రికి ఋణపడివున్నామనడానికి నిదర్శనాన్నిస్తాయి. దావీదు రాజు ఇలా పాడాడు: “యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటియైనవాడొకడును లేడు.”—కీర్తన 40:5.
4 యెహోవా సేవకులు భౌతిక పరదైసులో నివసించకపోయినప్పటికీ నేడు వారు ఆధ్యాత్మిక పరదైసులో నివసిస్తున్నారు. మన రాజ్యమందిరాల్లో, సమావేశ స్థలాల్లో మన తోటి విశ్వాసులలో దేవుని ఆత్మఫలం పనిచేస్తుండడాన్ని మనం చవిచూస్తాము. వాస్తవానికి, మతసంబంధ పూర్వరంగం అస్సలులేని లేదా అంతగాలేని ప్రజలకు ప్రకటించేటప్పుడు కొంతమంది సాక్షులు, పౌలు గలతీయులకు వ్రాసిన పత్రికలో వర్ణించినదాన్ని చూపిస్తారు. మొదట వారు “శరీరకార్యముల” వైపు అవధానం మళ్ళించి, తాము ఏమి గమనించారో చెప్పమని తమ శ్రోతలను కోరతారు. (గలతీయులు 5:19-23) ఇవి నేటి మానవ సమాజానికి ప్రతిరూపంగా ఉన్నాయని చాలామంది వెంటనే అంగీకరిస్తారు. దేవుని ఆత్మఫలాన్ని గురించిన వర్ణనను చూపించి, దీనికి నిదర్శనాన్ని స్వయంగా వచ్చి చూడమని స్థానిక రాజ్యమందిరానికి ఆహ్వానించినప్పుడు, వారిలో చాలామంది “దేవుడు నిజముగా మీలో ఉన్నాడని” అంగీకరిస్తారు. (1 కొరింథీయులు 14:25) ఇది స్థానిక రాజ్యమందిరానికి మాత్రమే పరిమితం కాదు. మీరు ఎక్కడికి వెళ్ళినా 60 లక్షలకంటే ఎక్కువమంది యెహోవాసాక్షులలో ఎవరినైనా కలిసినప్పుడు మీరు అదే సంతోషకరమైన ఆనందభరితమైన స్ఫూర్తిని చూస్తారు. నిజంగా, ఈ ప్రోత్సాహకరమైన సహవాసం, దీన్ని సాధ్యం చేయడానికి తన ఆత్మను అనుగ్రహించే యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఒక కారణం.—జెఫన్యా 3:9; ఎఫెసీయులు 3:20, 21.
5 యెహోవా మనకు అనుగ్రహించిన అత్యంత గొప్ప బహుమానం, అతి పరిపూర్ణమైన కానుక ఆయన కుమారుడైన యేసు, ఆయన ద్వారా విమోచన క్రయధన బలి అర్పించబడింది. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింపబద్ధులమై యున్నాము.” (1 యోహాను 4:11) అవును, యెహోవాపట్ల మనకున్న ప్రేమను కృతజ్ఞతను వ్యక్తపరచడం ద్వారానే గాక మనకు ఇతరులపట్ల ప్రేమ ఉందని స్పష్టమయ్యే విధంగా జీవించడం ద్వారా కూడా మనం విమోచన క్రయధనంపట్ల మనకున్న కృతజ్ఞతను తెలియజేస్తాము.—మత్తయి 22:37-39.
6 ప్రాచీన ఇశ్రాయేలుతో యెహోవా వ్యవహరించిన విధానాన్ని పరిశీలించడం ద్వారా, కృతజ్ఞత చూపించడాన్ని గురించి మనం మరింత తెలుసుకోవచ్చు. యెహోవా మోషే ద్వారా తాను ఆ జనాంగానికి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి వారికి ఎన్నో పాఠాలు నేర్పించాడు. “కృతజ్ఞులై యుండుడి” అని పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని అనుసరించడానికి సహాయం చేసే ఎన్నో విషయాలను మనం “జ్ఞానసత్యస్వరూపమైన ధర్మశాస్త్రము” ద్వారా తెలుసుకోవచ్చు.—రోమీయులు 2:19; కొలొస్సయులు 3:14-15.
ధర్మశాస్త్రం నుండి మూడు పాఠాలు
7 యెహోవా తాను చూపిన మంచితనంపట్ల ఇశ్రాయేలీయులు నిజమైన కృతజ్ఞతను చూపించడానికి మోషే ధర్మశాస్త్రంలో మూడు మార్గాలను సూచించాడు. మొదటిది దశమభాగం ఇవ్వడం. ‘గోవులలోని గొఱ్ఱెమేకలలోని’ వాటితో సహా భూధాన్యములోని దశమభాగము “యెహోవాకు ప్రతిష్ఠితము” కావాలి. (లేవీయకాండము 27:30-32) ఇశ్రాయేలీయులు విధేయత చూపించినప్పుడు యెహోవా వారిని మెండుగా ఆశీర్వదించాడు. “నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.”—మలాకీ 3:10.
8 రెండవదిగా, దశమభాగం ఇవ్వడంతోపాటు ఇశ్రాయేలీయులు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేందుకు కూడా యెహోవా ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పమని ఆయన మోషేకు ఉపదేశించాడు: “నేను మిమ్మును కొనిపోవుచున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను.” వారు తరతరాల వరకు తమ ‘మొదటి పిండిముద్ద రొట్టెలలో’ కొన్నింటిని యెహోవాకు ‘ప్రతిష్ఠార్పణముగా అర్పించాలి.’ సంఖ్యాకాండము 15:18-21) కానీ ఇశ్రాయేలీయులు ఏదైనా కృతజ్ఞతార్పణను అర్పించినప్పుడు వారికి యెహోవా నుండి ఆశీర్వాదం లభిస్తుందని హామీ ఇవ్వబడింది. యెహెజ్కేలు దర్శనంలోని ఆలయానికి సంబంధించి అలాంటి ఏర్పాటే ఉన్నట్లు కనిపిస్తుంది. మనమిలా చదువుతాము: “మీ ప్రతిష్ఠితార్పణములన్నిటిలోను తొలిచూలు వాటన్నిటిలోను మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివియు యాజకులవగును; మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండిముద్దను యాజకులకియ్యవలెను.”—యెహెజ్కేలు 44:30.
ఈ ప్రథమఫలాలను నిర్దిష్ట మోతాదులో అర్పించాలని చెప్పబడలేదని గమనించండి. (9 మూడవదిగా, యెహోవా పరిగె వదిలిపెట్టే ఏర్పాటు చేశాడు. దేవుడు ఇలా ఉపదేశించాడు: “మీరు మీ భూమి పంటను కోయునప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు; నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు; నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.” (లేవీయకాండము 19:9, 10) ఈసారి కూడా నిర్దిష్టమైన మోతాదు గురించి చెప్పబడలేదు. అవసరంలోవున్న వారి కోసం ఎంత విడిచిపెట్టాలా అన్నది ప్రతి ఇశ్రాయేలీయుడు తానుగా నిర్ణయించుకోవాలి. జ్ఞానవంతుడైన సొలొమోను రాజు సముచితంగానే ఇలా వివరించాడు: “బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.” (సామెతలు 19:17) అలా యెహోవా పేదలపట్ల దయ కనికరం చూపించడాన్ని బోధించాడు.
10 ఇశ్రాయేలీయులు విధేయతతో దశమభాగం తీసుకువచ్చి, స్వచ్ఛందంగా విరాళాలిచ్చి, పేదవారికి సహాయం చేసినప్పుడు యెహోవా వారిని ఆశీర్వదించాడు. కానీ ఇశ్రాయేలీయులు కృతజ్ఞత చూపించడంలో విఫలమైనప్పుడు, వారు యెహోవా అనుగ్రహాన్ని కోల్పోయారు. ఇది వినాశనానికి, చివరికి పరవాసానికి దారితీసింది. (2 దినవృత్తాంతములు 36:17-21) అయితే మనమే పాఠాలు నేర్చుకోవచ్చు?
మన కృతజ్ఞతా వ్యక్తీకరణలు
11 అదేవిధంగా, మనం యెహోవాను స్తుతిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసే ప్రధాన మార్గం “అర్పణ.” నిజమే క్రైస్తవులముగా మనం మోషే ధర్మశాస్త్రం క్రిందలేము, జంతువులను ధాన్యాన్ని అర్పణగా అర్పించవలసిన బాధ్యత మనకు లేదు. (కొలొస్సయులు 2:13, 14) అయినప్పటికీ అపొస్తలుడైన పౌలు హెబ్రీ క్రైస్తవులను ఇలా ఉద్బోధించాడు: “మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.” (హెబ్రీయులు 13:15) బహిరంగ పరిచర్యలో గానీ తోటి క్రైస్తవుల “సమాజములలో” గానీ యెహోవాకు స్తుతియాగము చేయడానికి మన సామర్థ్యాలను, వనరులను ఉపయోగించడం ద్వారా మనం మన ప్రేమగల పరలోక తండ్రియైన యెహోవా దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయవచ్చు. (కీర్తన 26:12) అలా చేయడంలో, ఇశ్రాయేలీయులు యెహోవాకు కృతజ్ఞతను వ్యక్తం చేసిన వివిధ మార్గాల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
12 మొట్టమొదటిగా, మనం చర్చించుకున్నట్లు, దశమభాగం ఇవ్వడం ఐచ్ఛికం కాదు; ఈ విషయంలో ప్రతి ఇశ్రాయేలీయునికీ బాధ్యత ఉంది. క్రైస్తవులముగా మనకు పరిచర్యలో పాల్గొనవలసిన, క్రైస్తవ కూటాలకు హాజరు కావలసిన బాధ్యత ఉంది. ఇవి ఐచ్ఛికం కాదు. అంత్యకాలాన్ని గురించిన తన గొప్ప ప్రవచనంలో యేసు స్పష్టంగా ఇలా చెప్పాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14; 28:19, 20) క్రైస్తవ కూటాల గురించి, అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడు: “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:24, 25) ప్రకటించమని బోధించమని క్రైస్తవ కూటాల్లో మన సహోదరులతో క్రమంగా సహవసించమని మనకు అప్పగించబడిన బాధ్యతను ఒక ఆధిక్యతగా, ఘనతగా ఎంచుతూ ఆ బాధ్యతను ఆనందంగా అంగీకరించినప్పుడు మనం యెహోవాకు మన కృతజ్ఞతను వ్యక్తం చేస్తాము.
13 అంతేకాక, ఇశ్రాయేలీయులు తమ కృతజ్ఞతను చూపించే ఇతర రెండు ఏర్పాట్లైన స్వచ్ఛంద విరాళాలు ఇవ్వడాన్ని, పరిగె వదిలిపెట్టడాన్ని పరిశీలించడం ద్వారా మనం ప్రయోజనం పొందవచ్చు. దశమభాగం ఇవ్వడంలో ఎంత ఇవ్వాలనేది స్పష్టంగా నిర్దేశించబడింది అంతేగాక అది ఐచ్ఛికం కాదుగానీ తప్పనిసరి, అయితే దానికి భిన్నంగా, స్వచ్ఛంద విరాళాలు ఇవ్వడంలో, పరిగె వదిలిపెట్టే ఏర్పాటులో ఇంత మొత్తం అని నిర్దేశించబడలేదు. బదులుగా అవి, యెహోవా సేవకుడైన ఒక వ్యక్తి తన హృదయంలో నిండివున్న ప్రశంస పురికొల్పినదానికి అనుగుణంగా చర్య తీసుకునేందుకు అనుమతిస్తాయి. పోల్చి చెప్పాలంటే, పరిచర్యలో పాల్గొనడం, క్రైస్తవ కూటాలకు హాజరుకావడం ప్రతి యెహోవా సేవకుని ప్రాథమిక బాధ్యత అన్న విషయాన్ని మనం గ్రహించినప్పటికీ మనం వాటిలో హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా పాల్గొంటామా? వాటిని మనం, యెహోవా మనకు చేసినదానంతటికి హృదయపూర్వక కృతజ్ఞతను వ్యక్తంచేయడానికి అవకాశంగా దృష్టిస్తామా? ఈ కార్యకలాపాల్లో మనం ఉదారంగా, మన వ్యక్తిగత పరిస్థితులు అనుమతించిన మేరకు పాల్గొంటామా? లేక ఇదంతా కేవలం మనం నెరవేర్చవలసిన తప్పనిసరి బాధ్యత అన్నట్లు మాత్రమే దృష్టిస్తామా? ఇవి మనం వ్యక్తిగతంగా జవాబిచ్చుకోవలసిన ప్రశ్నలు. అపొస్తలుడైన పౌలు దాన్నిలా చెప్పాడు: “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.”—గలతీయులు 6:4.
14 యెహోవా దేవునికి మన పరిస్థితులు బాగా తెలుసు. మనకున్న పరిమితుల గురించీ ఆయనకు తెలుసు. తన సేవకులు ఇష్టపూర్వకంగా చేసే త్యాగాలు చిన్నవైనా పెద్దవైనా ఆయన వాటిని విలువైనవిగా ఎంచుతాడు. మనమందరం ఒకే మొత్తంలో ఇస్తామని ఆయన ఆశించడు, మనమలా ఇవ్వలేము కూడా. వస్తుపరంగా ఇవ్వడాన్ని గురించి చర్చించేటప్పుడు అపొస్తలుడైన పౌలు కొరింథులోని క్రైస్తవులకు ఇలా చెప్పాడు: “మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి యుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును.” (2 కొరింథీయులు 8:12) ఈ సూత్రం దేవునికి మనం చేసే సేవకు కూడా సమానంగా వర్తిస్తుంది. మనం చేసే సేవ యెహోవాకు అంగీకారమవుతుందా లేదా అనేదాన్ని నిర్ణయించేది మనం ఎంత మొత్తం చేస్తామనేది కాదు గానీ దాన్ని ఎలా చేస్తామనేదే అంటే సంతోషంగా హృదయపూర్వకంగా చేస్తామా లేదా అనేదే.—కీర్తన 100:1-5; కొలొస్సయులు 3:23.
పయినీరు స్ఫూర్తిని పెంపొందింపజేసుకుని దాన్ని కాపాడుకోండి
15 మన కృతజ్ఞతాభావాన్ని యెహోవాకు చూపించడానికి ఒక ప్రతిఫలదాయకమైన మార్గం పూర్తికాల సేవను ప్రారంభించడం. యెహోవాపట్ల ప్రేమతో, ఆయన చూపిన అనర్హదయపట్ల కృతజ్ఞతతో పురికొల్పబడిన సమర్పిత సేవకులనేకులు యెహోవా సేవ చేయడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాలనే ఉద్దేశంతో తమ జీవితాల్లో గొప్ప మార్పులు చేసుకున్నారు. కొంతమంది రాజ్య సువార్త ప్రకటించడానికి ప్రజలకు సత్యం బోధించడానికి ప్రతి నెల సగటున 70 గంటలు వెచ్చిస్తూ క్రమపయినీర్లుగా సేవచేయగలుగుతున్నారు. వివిధ పరిస్థితుల మూలంగా పరిమితులుగల ఇతరులు ప్రకటించడానికి నెలకు 50 గంటలు వెచ్చిస్తూ అప్పుడప్పుడూ సహాయ పయినీర్లుగా సేవచేస్తున్నారు.
16 అయితే క్రమపయినీర్లుగా గానీ సహాయ పయినీర్లుగా గానీ సేవ చేయలేకపోతున్న అనేకమంది యెహోవా సేవకుల మాటేమిటి? వారు పయినీరు స్ఫూర్తిని పెంపొందింపజేసుకుని దాన్ని కాపాడుకోవడం ద్వారా తమ కృతజ్ఞతను తెలియజేయవచ్చు. అదెలా? పయినీరు సేవ చేయగలవారిని ప్రోత్సహించడం ద్వారా, పూర్తికాల సేవను చేపట్టాలనే కోరికను తమ పిల్లల్లో నాటడం ద్వారా, తమ పరిస్థితులకు అనుగుణంగా ప్రకటనా పనిలో శ్రద్ధగా పాల్గొనడం ద్వారా అలా చేయవచ్చు. పరిచర్యలో మనం ఇచ్చేది, యెహోవా మనకోసం ఇంతవరకు చేసినదాన్నిబట్టి, చేస్తున్నదాన్నిబట్టి, చేయబోయేదాన్నిబట్టి మన హృదయాల్లోవున్న ప్రశంస యొక్క లోతుపై ఆధారపడివుంటుంది.
మన “ఆస్తిలో భాగము”తో కృతజ్ఞతను వ్యక్తపర్చడం
17 “నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము” అని సామెతలు 3:9 తెలియజేస్తోంది. యెహోవా సేవకులు ఇక దశమభాగం ఇవ్వవలసిన అవసరం లేదు. బదులుగా, “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును” అని పౌలు కొరింథు సంఘానికి వ్రాశాడు. (2 కొరింథీయులు 9:7) ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి మద్దతుగా స్వచ్ఛంద విరాళాలివ్వడం కూడా మన కృతజ్ఞతను చూపిస్తుంది. హృదయపూర్వక కృతజ్ఞత, తొలి క్రైస్తవులు చేసినట్లుగా వారానికి ఇంతని ప్రక్కన పెట్టడం ద్వారా క్రమంగా అలా ఇవ్వడానికి మనల్ని పురికొల్పుతుంది.—1 కొరింథీయులు 16:1, 2.
18 యెహోవాపట్ల మనకున్న కృతజ్ఞతను చూపించేది మనం ఎంత మొత్తం ఇస్తామనేది కాదు. మనం ఏ స్ఫూర్తితో ఇస్తామనేదే ముఖ్యం. ఆలయంలోని కానుక పెట్టెలో కానుకలు వేస్తున్న ప్రజలను చూస్తున్నప్పుడు యేసు గమనించినది అదే. యేసు ఒక బీద విధవరాలు “రెండు కాసులు” వేయడం గమనించినప్పుడు ఇలా అన్నాడు: “ఈ బీద విధవరాలు అందరికంటె ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి కానుకలు వేసిరిగాని యీమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెను.”—లూకా 21:1-4.
19 మనమెలా కృతజ్ఞత చూపించవచ్చుననేదాన్ని గురించిన ఈ సమీక్ష మనం మన కృతజ్ఞతను చూపించే మార్గాలను పునఃపరిశీలించుకోవడానికి మనల్ని పురికొల్పును గాక. మనం యెహోవాకు చేసే స్తుతియాగమును, అలాగే ప్రపంచవ్యాప్త పనికి మద్దతుగా ఇచ్చే విరాళాలను అధికం చేసుకునే అవకాశం ఉందా? మనమలా చేసినంత మేరకు, ఉదారుడైన మన ప్రేమగల తండ్రియైన యెహోవా మనం కృతజ్ఞత చూపిస్తే ఎంతో సంతోషిస్తాడని మనం నమ్మకం కలిగివుండవచ్చు.
మీకు గుర్తున్నాయా?
• ఏ కారణాలనుబట్టి మనం యెహోవాపట్ల కృతజ్ఞతతో ఉండాలి?
• దశమభాగం ఇవ్వడం, స్వచ్ఛంద విరాళాలు ఇవ్వడం, పరిగె వదిలిపెట్టడం వంటివాటి నుండి మనం ఏ పాఠాలు నేర్చుకుంటాము?
• పయినీరు స్ఫూర్తిని మనమెలా పెంపొందింపజేసుకుంటాము?
• యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేయడానికి మనం మన “ఆస్తిలో భాగము”ను ఎలా ఉపయోగించవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
1. క్రైస్తవ సంఘానికి, సాతాను ఆధీనంలోవున్న లోకానికి మధ్య మనం ఏ భిన్నత్వాన్ని చూస్తాము?
2. మనం ఏ హెచ్చరికను లక్ష్యపెట్టాలి, మనం ఏ ప్రశ్నలను పరిశీలిస్తాము?
3. మనం యెహోవాకు దేనికి కృతజ్ఞులమై ఉన్నాము?
4. మనం మన సంఘాల్లో అనుభవించే సంతోషకరమైన సహవాసానికి యెహోవాకు ఎందుకు కృతజ్ఞతలు తెలియజేయాలి?
5, 6. దేవుడిచ్చిన అత్యంత గొప్ప బహుమానమైన విమోచన క్రయధనంపట్ల మనం కృతజ్ఞతను ఎలా వ్యక్తం చేయవచ్చు?
7. దశమభాగం ఇచ్చే ఏర్పాటు, ఇశ్రాయేలీయులు యెహోవాకు తమ కృతజ్ఞతను చూపించడానికి ఎలా ఒక అవకాశాన్నిచ్చింది?
8. స్వచ్ఛందంగా ఇచ్చే అర్పణలకు, దశమభాగం ఇవ్వడానికి ఉన్న తేడా ఏమిటి?
9. పరిగె వదిలిపెట్టే ఏర్పాటు ద్వారా యెహోవా ఏమి బోధించాడు?
10. ఇశ్రాయేలీయులు కృతజ్ఞత చూపించడంలో విఫలమైనప్పుడు వారికి కలిగిన పర్యవసానాలేమిటి?
11. మనం యెహోవాకు మన కృతజ్ఞతను చూపించడానికి ప్రధాన మార్గం ఏది?
12. మన క్రైస్తవ బాధ్యతకు సంబంధించి, దశమభాగం ఇవ్వవలసిన ఏర్పాటు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
13. స్వచ్ఛంద విరాళాలివ్వడం, పరిగె వదిలిపెట్టడం వంటి ఏర్పాట్ల నుండి ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?
14. మనం యెహోవాకు చేసే సేవ విషయంలో ఆయన మన నుండి ఏమి ఆశిస్తాడు?
15, 16. (ఎ) పయినీరు సేవకు, కృతజ్ఞతకు మధ్యవున్న సంబంధమేమిటి? (బి) పయినీరు సేవ చేయలేనివారు పయినీరు స్ఫూర్తిని ఎలా చూపించవచ్చు?
17, 18. (ఎ) మనం మన “ఆస్తిలో భాగము”తో మన కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు? (బి) విధవరాలు ఇచ్చిన కానుకను యేసు ఎలా మదింపుచేశాడు, ఎందుకు?
19. మనం మన కృతజ్ఞతను చూపించే మార్గాలను పునఃపరిశీలించుకోవడం ఎందుకు మంచిది?
[15వ పేజీలోని చిత్రాలు]
“శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనది”
[16వ పేజీలోని చిత్రాలు]
ధర్మశాస్త్రం నుండి ఏ మూడు పాఠాలు ఇక్కడ చూపించబడ్డాయి?
[18వ పేజీలోని చిత్రాలు]
మనం ఏ త్యాగాలు చేయవచ్చు?