కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుణ్ణి నమ్మడానికి సరైన కారణం

దేవుణ్ణి నమ్మడానికి సరైన కారణం

దేవుణ్ణి నమ్మడానికి సరైన కారణం

చాలామంది, తమ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించనందువల్లనే చర్చికి వెళ్ళడం మానేస్తున్నారని, యౌవనస్థులు చర్చిని విడిచి వెళ్ళిపోవడానికి 31 కారణాలు అనే కొరియా పుస్తకం చెబుతోంది. ఉదాహరణకు, ‘దేవుణ్ణి నమ్మే ప్రజలు బాధలకు ఎందుకు గురవుతున్నారు?’ ‘చర్చిల్లో బోధించబడే చాలా విషయాలు తికమకపెట్టేవిగా, ఒకదానికొకటి విరుద్ధమైనవిగా ఉన్నప్పటికీ వాటిని మనం ఎందుకు అంగీకరించాలి?’ అని వాళ్ళు ప్రశ్నిస్తారు.

తమ మతనాయకులిచ్చిన సమాధానాలవల్ల నిరుత్సాహపడి చాలామంది ఆ ప్రశ్నలకు అసలు బైబిల్లో సమాధానం లేదనే ముగింపుకు వస్తారు. ఒక మతనాయకుడు కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం ఆధారంగా వివరించినప్పుడు అది తరచూ అపార్థాలకు, దేవుడు మరియు బైబిలు తిరస్కరించబడడానికి దారి తీస్తుంది.

దక్షిణాఫ్రికాలో ఒక లూథరన్‌గా పెంచబడిన ఏబెల్‌ అనుభవం అదే. ఆయన ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “చనిపోయిన వాళ్ళందరిని దేవుడే ‘తీసుకువెళతాడు’ అని చర్చి బోధిస్తుంది. అయితే ప్రేమగల దేవుడు పిల్లల నుండి వారి తల్లిదండ్రులను వేరుచేసి ఎందుకు ‘తీసుకువెళతాడో’ నాకు అర్థమయ్యేది కాదు. నేను పెరిగిన ఆఫ్రికా గ్రామీణ ప్రాంతాల్లో కోడి పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు వాటి తల్లిని కోసేవాళ్ళం కాదు. ఒక ఆవు కడుపుతో ఉందని తెలిస్తే, దూడ పుట్టి అది పాలు మానేవరకూ ఆ ఆవును కోసేవాళ్ళం కాదు. ప్రేమగల దేవుడు మానవులపట్ల అలాంటి శ్రద్ధ ఎందుకు చూపించలేకపోతున్నాడో నాకు అర్థం కాలేదు.”

కెనడాకు చెందిన అరామ్‌కు అలాంటి సందేహాలే ఉండేవి. “నాకు 13 ఏళ్ళున్నప్పుడు మా నాన్న మరణించాడు” అని ఆయన చెబుతున్నాడు. “ఒక ప్రముఖ మతనాయకుడు అంత్యక్రియల ప్రసంగమిస్తూ, మా నాన్న పరలోకంలో దేవునికి సన్నిహితమయ్యేందుకు మరణించాలని దేవుడు కోరుకున్నాడని వివరించాడు. ‘దేవుడు నీతిమంతులను ప్రేమిస్తాడు కాబట్టి ఆయన మంచి ప్రజలను తీసుకువెళ్తాడు’ అని ఆయన చెప్పాడు. దేవుడు ఇంత స్వార్థపూరితంగా ఎలా ప్రవర్తించగలడో నాకు అర్థం కాలేదు.”

కొంతకాలానికి ఏబెల్‌, అరామ్‌ యెహోవాసాక్షులను కలుసుకున్నారు, వారితో బైబిలు అధ్యయనం చేసి చివరకు తమ ప్రశ్నలకు సమాధానాలు పొందారు. వారు దేవునిపట్ల ప్రేమను, ఆయనపై బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు. చివరకు వాళ్ళు తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకొని ఆయనకు విశ్వసనీయమైన సేవకులయ్యారు.

ఖచ్చితమైన జ్ఞానం​—⁠దేవుణ్ణి నమ్మడానికి కీలకం

ఈ అనుభవాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? దేవుణ్ణి నమ్మడానికి సంబంధించినంత వరకు, ఖచ్చితమైన బైబిలు జ్ఞానం ఎంతో అవసరమని అవి మనకు చెబుతున్నాయి. ప్రాచీన ఫిలిప్పీ నగరంలోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “మీ ప్రేమ తెలివితోను [“ఖచ్చితమైన జ్ఞానముతోను,” NW], సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెనని . . . ప్రార్థించుచున్నాను.” (ఫిలిప్పీయులు 1:⁠9) ఆ వచనంలో పౌలు, దేవునిపట్ల మరియు తోటి విశ్వాసులపట్ల ఉండే ప్రేమను, దేవుని గురించిన ఖచ్చితమైన జ్ఞానంతో మరియు ఆయన చిత్తమేమిటో గ్రహించడంతో జతచేసి మాట్లాడాడు.

పౌలు చెప్పింది సహేతుకమే ఎందుకంటే ఒక వ్యక్తిని నమ్మాలంటే మనకు మొదటిగా ఆ వ్యక్తి గురించి తెలిసివుండాలి​—⁠ఆయన గురించి ఎంత ఎక్కువగా ఎంత ఖచ్చితంగా తెలిసివుంటే అంత ఎక్కువగా నమ్మగలుగుతాము. అదేవిధంగా మీరు దేవుణ్ణి నమ్మడానికి ప్రేరేపించబడేందుకు ఖచ్చితమైన జ్ఞానం అవసరం. “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది” అని పౌలు చెప్పాడు. (హెబ్రీయులు 11:⁠1) ఖచ్చితమైన జ్ఞానం లేకుండా దేవుణ్ణి నమ్మడం, పేకముక్కలతో కట్టిన ఇల్లు వంటిది. కాస్త గాలి ఊదితే చాలు అది కూలిపోతుంది.

ప్రజలు ఎందుకు చనిపోతారు? అనే ప్రశ్న ఏబెల్‌ను, అరామ్‌ను ఎంతోకాలంగా కలతపెట్టింది, మీరు బైబిలును అధ్యయనం చేస్తే అలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి సహాయం లభిస్తుంది. “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను” అని బైబిలు వివరిస్తోంది. (రోమీయులు 5:​12) మానవులు వృద్ధులై చనిపోతున్నది, దేవుడు వారిని తనతోపాటు ఉండాలని తీసుకువెళుతున్నందుకు కాదు కాని ఆదాము పాపం చేసినందుకే. (ఆదికాండము 2:16, 17; 3:​6, 17-19) అంతేకాక యెహోవా దేవుడు అందిస్తున్న నిజమైన నిరీక్షణ గురించి కూడా బైబిలు వెల్లడిచేస్తోంది. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పాపభరిత మానవజాతికి పునరుత్థాన నిరీక్షణను ఇస్తున్నాడు.​—⁠యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:15.

పునరుత్థానానికి సంబంధించిన సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేసేందుకు, యేసు పునరుత్థానం చేసిన అనేక వ్యక్తుల ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. (లూకా 7:11-17; 8:40-56; యోహాను 11:​17-45) ఈ బైబిలు వృత్తాంతాలను మీరు చదివినప్పుడు, పునరుత్థానం చేయబడినవారి స్నేహితులూ కుటుంబ సభ్యులూ అనుభవించిన సంతోషాన్ని ఆనందాన్ని గమనించండి. వారు దేవుణ్ణి స్తుతించేందుకు, యేసుపై విశ్వాసముంచేందుకు ప్రేరేపించబడ్డారని కూడా గమనించండి.

దేవుని గురించిన, ఆయన సంకల్పాల గురించిన ఖచ్చితమైన జ్ఞానం నేడు ప్రజలపై అలాంటి ప్రభావమే చూపించగలదు. ఒకప్పుడు చాలామంది, ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించనందుకు తికమకపడి, బాధపడి, కలత చెందారు. కాని వారు బైబిలును అధ్యయనం చేసినప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు కనుగొన్నారు, అది వారి జీవితాలను పూర్తిగా మార్చివేసింది.

దేవునిపట్ల ప్రేమ​—⁠ఆయన సేవచేయడానికి ప్రధాన కారణం

దేవునిపై విశ్వాసముంచేందుకు ఖచ్చితమైన జ్ఞానం అవసరమే, అయితే ఒక వ్యక్తి ఆయనకు విధేయత చూపించి ఆయనకు సేవచేసేందుకు ప్రేరేపించబడడానికి దానికంటే ఎక్కువే అవసరం. దేవుడిచ్చిన ప్రధానమైన ఆజ్ఞ ఏమిటని అడిగినప్పుడు యేసు ఇలా చెప్పాడు: “నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.” (మార్కు 12:​30) ఒక వ్యక్తి యేసు సూచించిన ప్రకారం దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన దేవునికి విధేయత చూపించడానికి, దేవుని సేవచేయడానికి ఎంతో సుముఖంగా ఉంటాడు. మీ విషయంలో కూడా అది నిజమేనా?

ఎన్నో దశాబ్దాలుగా కొరియాలో మిషనరీగా సేవచేస్తున్న రేచల్‌ తన విశ్వాసానికి కారణమేమిటో ఇలా చెబుతోంది: “యెహోవా తన ప్రాణులపట్ల చూపించే ఉదారత గురించి, తన ప్రజలతో వ్యవహరించేటప్పుడు ఆయన చూపించే క్షమా గుణం గురించి, ఆయన మనందరి నుండి ఏమి కోరుతున్నాడో మనం తెలుసుకునేందుకు అనుమతించడం ద్వారా మనకు ప్రయోజనం చేకూర్చాలనే ఆయన కోరిక గురించి నేను ఆలోచిస్తాను. ఇలాంటి విషయాలన్ని దేవునిపట్ల నాకున్న ప్రేమ గాఢమయ్యేలా చేస్తాయి. ఆ ప్రేమ, నేను ఆయనకు సేవచేయాలని కోరుకునేలా చేస్తుంది.”

జర్మనీకి చెందిన మార్తా అనే విధవరాలు 48 సంవత్సరాలుగా యెహోవా సేవ చేస్తోంది. ఆమె ఇలా అంటోంది: “నేను ఎందుకు యెహోవా సేవ చేస్తున్నాను? ఎందుకంటే నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ప్రతి సాయంత్రం నేను యెహోవాకు ప్రార్థన చేసి, ఆయన నాకిచ్చిన ఆశీర్వాదాలన్నింటికి ప్రత్యేకించి విమోచన క్రయధనానికి నేనెంత కృతజ్ఞురాలినో ఆయనకు తెలియజేస్తాను.”

అవును, దేవునిపట్ల మనకున్న ప్రేమ, ఆయనకు హృదయపూర్వకంగా సేవ చేయాలని మనం కోరుకునేలా చేస్తుంది. కాని ఒక వ్యక్తి అలాంటి ప్రేమను ఎలా పెంపొందించుకోవచ్చు? దేవునిపట్ల ప్రేమను పెంపొందించుకోవడానికి ఒక బలమైన ప్రేరకమేమిటంటే, ఆయన మనపట్ల చూపించిన ప్రేమకు కృతజ్ఞత కలిగివుండడం. బైబిలులో ఇవ్వబడిన ఈ ప్రోత్సాహకరమైన జ్ఞాపికను చదవండి: “దేవుడు ప్రేమాస్వరూపి; ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.”​—⁠1 యోహాను 4:8-10.

ఈ ప్రేమ ఎంత గొప్పదో మీరు గ్రహించారా? వడిగా ప్రవహిస్తున్న వాగులో మీరు మునిగిపోతున్నట్లు ఊహించుకోండి. ఒక వ్యక్తి తన ప్రాణాలకు తెగించి మిమ్మల్ని రక్షించాడు. మీరు ఆయనను మరచిపోతారా, ఆయనకు ఎంతో కృతజ్ఞులై ఉండరా? ఆయన కోసం మీకు సాధ్యమైనదంతా చేయడానికి సుముఖంగా ఉండరా? దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును విమోచన క్రయధనంగా పంపించడంలో చూపించిన ప్రేమ దేనితోను పోల్చలేనంత గొప్పది. (యోహాను 3:16; రోమీయులు 8:​38, 39) దేవుని ప్రేమను బట్టి మీ హృదయం కదిలించబడినప్పుడు, ఆయనను ప్రేమించేందుకూ ఆయనకు హృదయపూర్వకంగా సేవ చేసేందుకూ మీరు ప్రేరేపించబడతారు.

ఇప్పుడూ భవిష్యత్తులోనూ ఆశీర్వాదాలు

దేవుని చిత్తం చేయడానికి ప్రధానమైన కారణం ఆయనపట్ల మనకున్న ప్రేమే అయినప్పటికీ, దేవుడు తన సేవచేసేవారిని ఆశీర్వదిస్తాడని తెలుసుకోవడం ప్రోత్సాహకరంగా ఉంటుంది. అపొస్తలుడైన పౌలు ఇలా సూచించాడు: “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.”​—⁠హెబ్రీయులు 11:⁠6.

దేవుడు తనను ప్రేమించేవారిని, తనకు విధేయత చూపించేవారిని నిజంగా ఆశీర్వదిస్తాడు. బైబిలు సూత్రాలను అనుసరించడంవల్ల ఎంతోమంది మంచి ఆరోగ్యంతో ఉన్నారు. (సామెతలు 23:20, 21; 2 కొరింథీయులు 7:⁠1) నిజాయితీకి, కష్టపడి పనిచేయడానికి సంబంధించిన బైబిలు సూత్రాలను అన్వయించుకునేవారు సాధారణంగా తమ యజమానుల నమ్మకాన్ని సంపాదించుకుంటారు కాబట్టి వారు మరింత ఆర్థిక భద్రతను అనుభవిస్తారు. (కొలొస్సయులు 3:​23) యెహోవా దేవుని సేవకులు ఆయనపై నమ్మకముంచడంవల్ల, కష్టమైన పరిస్థితుల్లో కూడా మనశ్శాంతిని అనుభవిస్తారు. (సామెతలు 28:25; ఫిలిప్పీయులు 4:​6, 7) అన్నింటికంటే ప్రాముఖ్యంగా, వాళ్ళు రానున్న భూపరదైసులో నిత్యం జీవించే ఆశీర్వాదం కోసం దృఢనమ్మకంతో ఎదురు చూస్తారు.​—⁠కీర్తన 37:11, 29.

యెహోవానుండి ఇలాంటి ఆశీర్వాదాలను పొందేవారు ఆయన గురించి ఏమని భావిస్తారు? కెనడాకు చెందిన జాకిలిన్‌ అనే క్రైస్తవురాలు దేవునిపట్ల తన కృతజ్ఞతను ఇలా వ్యక్తం చేస్తోంది: “ఆయన మనకు ఎల్లప్పుడూ ఎంతో అద్భుతమైన బహుమానాలు ఇస్తాడు, నిత్యం జీవించే ఖచ్చితమైన నిరీక్షణను మనకు ఇచ్చాడు.” ఈ ఆర్టికల్‌ ప్రారంభంలో తన భావాలను వ్యక్తం చేసిన ఏబెల్‌ ఈ విధంగా అంటున్నాడు: “భూపరదైసులో నిత్యం జీవించే నిరీక్షణ గురించి నేను ముందెప్పుడూ వినలేదు, దాని కోసం నేను ఎదురు చూస్తున్నాను. అయితే ఒకవేళ పరదైసు నిరీక్షణ లేకపోయినా కూడా నేను దేవునికి సేవచేయడం ద్వారా ఆయనపట్ల నాకున్న ప్రేమను చూపించేందుకు ఆనందిస్తాను.”

మీరు కూడా నిజమైన విశ్వాసాన్ని కలిగివుండవచ్చు

“నీతినిబట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించువాడు సైన్యములకధిపతియగు యెహోవాయే” అని బైబిలు చెబుతోంది. (యిర్మీయా 11:​20) అవును మనలో దాగివున్న అంతరంగ వ్యక్తిత్వాన్ని యెహోవా పరిశీలిస్తున్నాడు. మనలో ప్రతి ఒక్కరూ తాను దేవుణ్ణి నమ్మడానికిగల కారణమేమిటని పరిశీలించుకోవాలి. దేవుని గురించిన తప్పు నమ్మకాలు, సిద్ధాంతాల వల్ల గతంలో మనం తప్పు పనులు చేసివుండవచ్చు. కానీ బైబిలుకు సంబంధించిన ఖచ్చితమైన జ్ఞానం, మన సృష్టికర్త అయిన యెహోవా దేవునితో సరైన సంబంధాన్ని కలిగివుండేందుకు దారి తీయగలదు.​—⁠1 తిమోతి 2:3, 4.

యెహోవాసాక్షులు తమ ఉచిత గృహ బైబిలు అధ్యయన ఏర్పాటు ద్వారా దేవుని గురించిన ఖచ్చితమైన జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రజలకు సహాయం చేస్తున్నారు. (మత్తయి 28:​20) అలాంటి సహాయాన్ని స్వీకరించిన అనేకులు దేవునిపై ప్రేమను, ఆయనపై నిజమైన విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు. బైబిలు అధ్యయనం ద్వారా వారు “లెస్సయైన జ్ఞానమును వివేచనను” సంపాదించుకున్నారు, ఈ ప్రమాదకరమైన రోజుల్లో వారు ‘సురక్షితముగా నడిచేందుకు’ అవి వారికి సహాయం చేస్తాయి. (సామెతలు 3:​21-23) అత్యంత ప్రాముఖ్యంగా వారికిప్పుడు భవిష్యత్తుకు సంబంధించి ‘నిశ్చలమైన, స్థిరమైన’ నిరీక్షణ ఉంది. (హెబ్రీయులు 6:​19) మీరు కూడా నిజమైన విశ్వాసాన్ని కలిగివుండి ఈ ఆశీర్వాదాలను అనుభవించవచ్చు.

[6వ పేజీలోని బాక్సు]

సమాధానాలు అవసరమైన కలతపరిచే ప్రశ్నలు

“నేను వైద్య విద్యార్థిగా ఒక హాస్పిటల్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో, వ్యాధులవల్ల విపత్తులవల్ల మంచి ప్రజలు బాధతో మూలగడాన్ని చూశాను. ఒకవేళ దేవుడే ఉంటే, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మతం కేవలం మనశ్శాంతి పొందడానికి ఒక మాధ్యమమా?”​—⁠కొరియాకు చెందిన ఒకప్పటి ప్రెస్బిటేరియన్‌.

“తాగుబోతు అయిన మా నాన్న చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాడా నరకానికి వెళ్ళాడా అని నేను తరచూ ఆలోచించేదాన్ని. చనిపోయినవారంటే, నరకాగ్ని అంటే నేను చాలా భయపడేదాన్ని. ప్రేమగల దేవుడు, ప్రజలను నిత్యం నరకంలో బాధలనుభవించేందుకు ఎలా పంపించగలడో నాకు అర్థం కాలేదు.”​—⁠బ్రెజిల్‌కు చెందిన ఒకప్పటి క్యాథలిక్‌.

“భూమికి, మానవజాతికి భవిష్యత్తులో ఏమి జరుగుతుంది? మానవులు నిత్యం ఎలా జీవించగలుగుతారు? మానవులకు నిజమైన శాంతి ఎలా లభిస్తుంది?”​—⁠జర్మనీకి చెందిన ఒకప్పటి క్యాథలిక్‌.

“పునర్జన్మ బోధన నాకు అస్సలు అర్థమయ్యేది కాదు. జంతువులు దేవుణ్ణి ఆరాధించవు, కాబట్టి మీ పాపాలకు శిక్షగా మీరు ఒక జంతువుగా జన్మిస్తే మరి మీ తప్పును సరిదిద్దుకొని ఆ పరిస్థితి నుండి బయటపడేదెలా?”​—⁠దక్షిణాఫ్రికాకు చెందిన, ఒకప్పుడు హిందువుగా ఉన్న వ్యక్తి.

“నేను ఒక కన్‌ఫ్యూషియన్‌ కుటుంబంలో పెరిగాను, మా పితరుల శాంతి కోసం చేసే ఆచారంలో నేను భాగం వహించేవాడిని. అర్పణలు పెట్టే బల్లను ఏర్పాటు చేసేటప్పుడు, వంగి నమస్కరించేటప్పుడు, చనిపోయిన పితరులు ఆ ఆహారాన్ని తినడానికి వచ్చి మేము వంగి నమస్కరించడాన్ని చూస్తారా అని నేను ఆలోచించేవాడిని.”​—⁠కొరియాకు చెందిన ఒకప్పటి కన్‌ఫ్యూషియనిస్టు.

ఈ వ్యక్తులందరూ యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేసినప్పుడు తమ ప్రశ్నలకు సమాధానాలు కనుగొన్నారు.