కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

యెరూషలేము ముట్టడించబడి, నాశనం చేయబడినప్పుడు యెహెజ్కేలు ఏ భావంలో “మౌనముగా” ఉన్నాడు?

ప్రాథమికంగా, యెహెజ్కేలు అప్పటికే ప్రకటించిన యెహోవా ప్రవచనాత్మకమైన సందేశానికి ఆయన ఇంకేమీ జోడించనవసరం లేదు అని దాని భావం.

“యెహోయాకీను చెరపట్టబడిన అయిదవ సంవత్సరము”లో అంటే సా.శ.పూ. 613లో యెహెజ్కేలు బబులోనులో చెరపట్టబడివున్న ఇశ్రాయేలీయులకు విశ్వసనీయమైన కావలివాడిగా తన సేవను ప్రారంభించాడు. (యెహెజ్కేలు 1:​2, 3) సా.శ.పూ. 609వ సంవత్సరం, చాంద్రమాన క్యాలెండర్‌లోని పదవ నెల, పదవ దినమున, బబులోనీయులు యెరూషలేమును ముట్టడిస్తారనే విషయం దైవిక ప్రేరణ ద్వారా యెహెజ్కేలుకు తెలియజేయబడింది. (యెహెజ్కేలు 24:​1, 2) ఆ ముట్టడి ఫలితమేమై ఉంటుంది? యెరూషలేము, దానిలోని విశ్వాసరహిత నివాసులు తప్పించుకుంటారా? కావలివాడిగా యెహెజ్కేలు అప్పటికే యెహోవా వినాశన సందేశాన్ని స్పష్టంగా తెలియజేశాడు, ఆ సందేశాన్ని మరింత ఒప్పింపజేసేదిగా చేయడానికి యెహెజ్కేలు ఇంకేమీ చెప్పవలసిన అవసరం లేదు. యెరూషలేముపై జరిగే ముట్టడికి సంబంధించి మరింత సమాచారం తెలియజేసే విషయంలో యెహెజ్కేలు మౌనముగా ఉండిపోయాడు.​—⁠యెహెజ్కేలు 24:25-27.

సా.శ.పూ. 607వ సంవత్సరంలో యెరూషలేము నాశనమైన దాదాపు ఆరు నెలల తరువాత, తప్పించుకొనిన ఒక వ్యక్తి బబులోనులోవున్న యెహెజ్కేలుకు పరిశుద్ధ పట్టణపు వినాశన వార్తను తెలియజేశాడు. తప్పించుకొనిన వ్యక్తి రావడానికి ముందు రోజు సాయంత్రం యెహోవా “[యెహెజ్కేలు] నోరు తెరవగా” ‘అప్పటినుండి ఆయన మౌనిగా ఉండలేదు.’ (యెహెజ్కేలు 33:​22) అంతటితో యెహెజ్కేలు మౌనం సమాప్తమయ్యింది.

ఆ సమయంలో యెహెజ్కేలు ఒక్కమాట కూడా పలుకకుండా పూర్తిగా మౌనంగా ఉండిపోయాడా? కాదని స్పష్టమవుతోంది, ఎందుకంటే ఆయన పైవిధంగా ‘మౌనముగా ఉన్న’ సమయంలో కూడా యెరూషలేము నాశనాన్ని బట్టి సంతోషించిన చుట్టుప్రక్కల దేశాలకు సంబంధించిన ప్రవచనాలను పలికాడు. (యెహెజ్కేలు 25-32 అధ్యాయాలు) ఒక ప్రవక్తగా, కావలివాడిగా సేవచేస్తున్న యెహెజ్కేలుకు అంతకుముందు యెహోవా ఇలా చెప్పాడు: “వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపక యుండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన జేసెదను. అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరచెదను.” (యెహెజ్కేలు 3:​25-27) ఇశ్రాయేలు కోసం యెహోవా వద్ద ఎలాంటి సందేశమూ లేనప్పుడు యెహెజ్కేలు ఆ జనాంగానికి ఇంకేమీ చెప్పకుండా మౌనముగా ఉండాలి. కేవలం యెహోవా మాట్లాడమని చెప్పినప్పుడు మాత్రమే, యెహోవా నిర్దేశించిన సమయంలో మాత్రమే యెహెజ్కేలు మాట్లాడాలి. యెహెజ్కేలు మౌనంగా ఉండడం, ఇశ్రాయేలీయులకు ప్రవచనాత్మక ప్రాముఖ్యతగల విషయాలను చెప్పడానికి సంబంధించి ఆయన మాట్లాడకుండా ఉండడాన్ని సూచిస్తోంది.

ఆధునిక దిన కావలివాని తరగతికి చెందినవారు అంటే అభిషిక్త క్రైస్తవులు సూచనార్థక యెరూషలేము అయిన క్రైస్తవమత సామ్రాజ్యపు వినాశనం గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు. “మహా శ్రమ” వచ్చి ప్రపంచ అబద్ధ మత సామ్రాజ్యమైన “మహా బబులోను” నాశనమైనప్పుడు, ఆ సామ్రాజ్యంలో ప్రముఖ స్థానం ఆక్రమించుకున్న క్రైస్తవమత సామ్రాజ్యపు అంతం గురించి అభిషిక్త యెహెజ్కేలు తరగతికి చెందినవారు ఇంకేమీ చెప్పవలసిన అవసరం ఉండదు.​—⁠మత్తయి 24:​20, 21; ప్రకటన 17:1, 2, 5.

అవును, అభిషిక్త శేషము మరియు వారి సహవాసులు మౌనంగా ఉండే రోజు అంటే క్రైస్తవమత సామ్రాజ్యానికి ఇంకేమీ చెప్పకుండా ఉండే రోజు వస్తుంది. అప్పుడు “పది కొమ్ములు” మరియు “మృగము” మహా బబులోనును దిగంబరిగా చేసి దానిని నాశనం చేస్తాయి. (ప్రకటన 17:​16) అయితే దానర్థం క్రైస్తవులు అక్షరార్థంగా మౌనంగా ఉంటారని కాదు. వారు ఇప్పుడు చేస్తున్నట్లే యెహోవాను స్తుతిస్తూ ప్రతి దినము మరియు “తరములన్నిటను” ఆయన జ్ఞాపకం ఉండేలా చేస్తారు.​—⁠కీర్తన 45:17; 145:⁠2.