కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ప్రతి సత్కార్యం చేయడానికి సిద్ధంగా’

‘ప్రతి సత్కార్యం చేయడానికి సిద్ధంగా’

‘ప్రతి సత్కార్యం చేయడానికి సిద్ధంగా’

“అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడియుండవలెననియు . . . వారికి జ్ఞాపకము చేయుము.” (తీతు 3:⁠1) అపొస్తలుడైన పౌలు తన తోటి విశ్వాసులకు ఆ మాటలు వ్రాసినప్పుడు ఆయన మనస్సులో ఏ సత్కార్యము ఉండింది? బైబిలు విద్వాంసుడైన ఇ. ఎఫ్‌. స్కాట్‌ ఒక విధమైన సత్కార్యమును సూచిస్తూ ఇలా చెప్పారు: “క్రైస్తవులు అధికారులకు విధేయత చూపడమే కాక ఎలాంటి సత్కార్యానికైనా సిద్ధంగా ఉండాలి. . . . అవసరమైనప్పుడు సమాజ స్ఫూర్తి చూపించడంలో క్రైస్తవులు ముందుండాలి. పదేపదే మహమ్మారులు వ్యాపిస్తుంటాయి, అగ్ని ప్రమాదాలు, వివిధ రకాలైన విపత్తులు సంభవిస్తూనే ఉంటాయి, ఆ సమయాల్లో మంచి పౌరులందరూ తమ పొరుగువారికి సహాయం చేయాలని కోరుకుంటారు.”

ప్రజల సంక్షేమం కోసం చేసే పనులు దేవుని నియమాలకు విరుద్ధంగా లేనంత వరకూ క్రైస్తవులు వాటిలో భాగం వహిస్తారు. (అపొస్తలుల కార్యములు 5:​29) ఉదాహరణకు, స్థానిక అగ్నిమాపక విభాగం నిర్దేశానుసారం జపానులోవున్న ఎబీనాలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం ప్రతి సంవత్సరం ఫైర్‌ డ్రిల్‌ను నిర్వహిస్తుంది. అలాంటి సందర్భాల్లో, స్థానిక అగ్నిమాపక విభాగం ప్రతినిధి ఇచ్చే ఉపదేశాలను వినడానికి బెతెల్‌ కుటుంబ సభ్యులందరూ సమకూడతారు.

అంతేకాకుండా, అగ్నిప్రమాదాల నివారణ పద్ధతులను ప్రజలకు తెలియజేయడానికి ఏర్పాటు చేయబడిన ప్రదర్శన సంబంధంగా బ్రాంచి కార్యాలయం ఒక దశాబ్దం కంటే ఎక్కువకాలం నుండి స్థానిక అధికారులతో సహకరిస్తోంది. ఆ ప్రదర్శనలో, నగరంలోని వివిధ కంపెనీలు మరియు వ్యాపార సంస్థలు, తమ అగ్నిమాపక పరికరాలను, అగ్నిని అదుపు చేయడానికి తాము ఉపయోగించే పద్ధతులను ప్రదర్శిస్తారు. ఈ విషయాలకు సంబంధించి బ్రాంచి కార్యాలయం నైపుణ్యానికి, దాని సభ్యుల సహకారానికి తరచూ గుర్తింపు లభించింది. 2001వ సంవత్సరంలో వారికి ఆ ప్రదర్శనలో మొదటి బహుమానం లభించింది. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలను కాపాడే సత్కార్యం చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు.

విలువైన సేవ

అయితే యెహోవాసాక్షులు, ప్రాణాలను కాపాడే అత్యంత ప్రాముఖ్యమైన మరో సత్కార్యం చేయడానికి ఆసక్తి చూపిస్తారు. దేవుని రాజ్య సువార్తను పంచుకోవడానికి వారు తమ పొరుగువారిని క్రమంగా సందర్శిస్తారు. (మత్తయి 24:​14) ప్రజలు తమ ప్రస్తుత జీవితపు నాణ్యతను పెంచుకొని, నిజమైన శాంతి భద్రతలు ప్రబలే లోకంలో నిత్యం జీవించే నిరీక్షణ కలిగివుండడానికి గాను బైబిలు సూత్రాలను నేర్చుకొని వాటిని తమ జీవితాల్లో అన్వయించుకొనేలా యెహోవాసాక్షులు వారిని ప్రోత్సహిస్తారు.

యెహోవాసాక్షులు చేసే సేవ విలువ గ్రహించకుండా కొందరు వారిని హానికరమైన ప్రజలుగా భావిస్తారు. అయితే కెనడాలోని క్యూబెక్‌ సుపీరియర్‌ కోర్టు జడ్జి, జాన్‌ క్రీపోకు భిన్నమైన అభిప్రాయం ఉంది. క్యూబెక్‌లోని బ్లేన్విల్‌ నగరం, యెహోవాసాక్షులు ఇంటింటికి వెళ్ళి పరిచర్య చేయాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని ఆజ్ఞ జారి చేసింది. అక్కడి యెహోవాసాక్షులు కోర్టులో అప్పీలు చేసుకున్నారు. కోర్టు నిర్ణయంలో జడ్జి క్రీపో ఇలా నివేదించారు: “యెహోవాసాక్షుల సందర్శనాలు క్రైస్తవ సమాజ సేవలో ఒక భాగం . . . ఆసక్తిగలవారికి సాక్షులు ఇచ్చే ప్రచురణలు, మతం, బైబిలు, మాదకద్రవ్యాలు, త్రాగుబోతుతనం, యౌవనుల విద్య, వైవాహిక సమస్యలు, విడాకులు వంటి విషయాలను చర్చించే ప్రాముఖ్యమైన ప్రచురణలు.” ఆ నిర్ణయంలో ఇంకా ఇలా ఉంది: “యెహోవాసాక్షులను వీధిలో చిల్లరవస్తువులు అమ్ముకునే వ్యక్తులతో పోల్చడం అవమానకరమైనది, నీచపరిచేది, బాధాకరమైనది, అపఖ్యాతి తెచ్చేది అని కోర్టు అభిప్రాయపడుతోంది.”

ప్రజలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకునేందుకు సహాయం చేయడం ద్వారా, భవిష్యత్తు కోసం నిరీక్షణను చూపించడం ద్వారా యెహోవాసాక్షులు తాము భాగమైయున్న సమాజ సంక్షేమానికి తోడ్పడుతున్నారు. ఆ పని సాధించడానికి బైబిలు వారిని సంసిద్ధులను చేస్తుంది. “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.”​—⁠2 తిమోతి 3:16, 17.

యెహోవాసాక్షులు ‘ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధముగా’ ఎలా ఉండగలరో తెలుసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? బైబిలు గురించి మరెక్కువగా తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు మీ ప్రాంతంలో మరియు ప్రపంచమంతటా చేస్తున్న ఆవశ్యకమైన సమాజ సేవను ఉపయోగించుకోవడానికి వారి సహాయాన్ని స్వీకరించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

[30వ పేజీలోని చిత్రాలు]

యెహోవాసాక్షులు లౌకిక అధికారులతో సహకరించడానికి కృషి చేస్తారు

[31వ పేజీలోని చిత్రం]

తమ పొరుగువారికి సహాయం చేసే విషయంలో సాక్షులు పేరుగాంచారు