కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు ప్రతి విషయంలోను ఒక బైబిలు ఆజ్ఞ అవసరమా?

మీకు ప్రతి విషయంలోను ఒక బైబిలు ఆజ్ఞ అవసరమా?

మీకు ప్రతి విషయంలోను ఒక బైబిలు ఆజ్ఞ అవసరమా?

మీరు పిల్లలుగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఎన్నో నియమాలు పెట్టివుండవచ్చు. మీరు పెరుగుతున్న కొలది, మీ తల్లిదండ్రులు మీ సంక్షేమం గురించి ఎంతో చింతించడం వల్లనే ఆ నియమాలు పెట్టారని మీరు అర్థం చేసుకున్నారు. మీరు పెరిగి పెద్దవారైన తర్వాత ఇక మీరు వారి అధికారం క్రింద లేకపోయినా బహుశా మీరు ఇప్పటికీ మీ తల్లిదండ్రులు మీలో పెంపొందింపజేసిన సూత్రాలనుబట్టి జీవిస్తుండవచ్చు.

మన పరలోక తండ్రియైన యెహోవా తన వాక్యమైన బైబిలు ద్వారా మనకు ఎన్నో సూటియైన ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఉదాహరణకు ఆయన విగ్రహారాధనను, జారత్వమును, వ్యభిచారమును, దొంగతనాన్ని నిషేధించాడు. (నిర్గమకాండము 20:1-17; అపొస్తలుల కార్యములు 15:​28, 29) మనం ఆధ్యాత్మికంగా ‘అన్ని విషయములలో ఎదిగినప్పుడు,’ యెహోవా మన సంక్షేమం గురించి చింతిస్తున్నాడని, ఆయన ఆజ్ఞలు అనుచితంగా నిర్బంధించేవి కావని మనం అర్థం చేసుకుంటాము.​—⁠ఎఫెసీయులు 4:15; యెషయా 48:17, 18; 54:13.

అయితే ఒక సూటియైన ఆజ్ఞలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అందువల్ల, సూటియైన బైబిలు ఆజ్ఞ లేకపోతే, తమకు ఇష్టం వచ్చినట్లు చేయవచ్చని కొందరు భావిస్తారు. ఆ నియమం ఉండాలని దేవునికి అనిపిస్తే దేవుడు తన చిత్తాన్ని సూటియైన ఆజ్ఞ ద్వారా తెలియజేసివుండేవాడు కదా అని వారు వాదిస్తారు.

ఇలా ఆలోచించేవారు తరచూ తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలు తీసుకున్నందుకు వాళ్ళు తర్వాత చాలా బాధపడతారు. బైబిల్లో కేవలం ఆజ్ఞలే కాకుండా దేవుని ఆలోచనా విధానాన్ని సూచించే విషయాలు కూడా ఉన్నాయని వారు గ్రహించరు. మనం బైబిలును అధ్యయనం చేసి, విషయాలను యెహోవా ఎలా దృష్టిస్తాడో తెలుసుకున్నప్పుడు మనం బైబిలు శిక్షణ పొందిన మనస్సాక్షిని పెంపొందించుకుంటాము కాబట్టి ఆయన ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే ఎంపికలు చేసుకోవడానికి మనకు సహాయం లభిస్తుంది. మనం అలా చేసినప్పుడు ఆయన హృదయాన్ని సంతోషపరుస్తాము, జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడంవల్ల వచ్చే ప్రయోజనాలను అనుభవిస్తాము.​—⁠ఎఫెసీయులు 5:⁠1.

బైబిల్లోని విశిష్టమైన ఉదాహరణలు

ప్రాచీన కాలంలోని దేవుని సేవకులకు సంబంధించిన బైబిలు వృత్తాంతాలను మనం చదివినప్పుడు, సూటియైన ఆజ్ఞ ఇవ్వబడకపోయినప్పటికీ వారు యెహోవా ఆలోచనా విధానాన్ని పరిగణలోకి తీసుకొన్న పరిస్థితుల గురించి తెలుసుకుంటాము. యోసేపు ఉదాహరణను పరిశీలించండి. పోతీఫరు భార్య తనతో శయనించమని యోసేపును ఒత్తిడి చేసినప్పుడు, వ్యభిచారము చేయకూడదని చెప్పే లిఖితపూర్వకమైన దైవప్రేరేపిత నియమమేదీ లేదు. సూటియైన ఆజ్ఞ లేకపోయినప్పటికీ, వ్యభిచారం చేయడం తన స్వంత మనస్సాక్షికే కాక ‘దేవునికి కూడా విరోధమని’ యోసేపు గ్రహించాడు. (ఆదికాండము 39:⁠9) ఏదెను తోటలో వ్యక్తం చేయబడినట్లుగా, వ్యభిచారం చేయడం దేవుని ఆలోచనా విధానానికి ఆయన చిత్తానికి వ్యతిరేకమని యోసేపు గ్రహించాడని స్పష్టమవుతోంది.​—⁠ఆదికాండము 2:24.

మరో ఉదాహరణను పరిశీలించండి. పౌలు తిమోతిని తనతోపాటు క్రైస్తవ ప్రయాణాలకు తీసుకొని వెళ్ళేముందు ఆయనకు సున్నతి చేయించాడని మనం అపొస్తలుల కార్యములు 16:3వ వచనం నుండి తెలుసుకుంటాము. అయితే ఆ తర్వాత పౌలు తిమోతిలు ఆ యా పట్టణాల ద్వారా ప్రయాణిస్తూ “యెరూషలేములోనున్న అపొస్తలులును పెద్దలును నిర్ణయించిన విధులను” ప్రజలకు తెలియజేశారని 4వ వచనంలో మనం చదువుతాము. ఆ విధుల్లో, క్రైస్తవులు సున్నతి చేయించుకోవలసిన అవసరం లేదు అనే నిర్ణయం కూడా ఉంది! (అపొస్తలుల కార్యములు 15:5, 6, 28, 29) అలాంటప్పుడు తిమోతి సున్నతి చేయించుకోవడం అవసరమని పౌలు ఎందుకు భావించాడు? “అతని [తిమోతి] తండ్రి గ్రీసుదేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకందరికి తెలియును గనుక” పౌలు అలా చేశాడు. అనవసరంగా అభ్యంతరం కలిగించకూడదని పౌలు భావించాడు. క్రైస్తవులు ‘ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట తమను తాము దేవుని సముఖమందు మెప్పించుకుంటూ’ ఉండాలని ఆయన కోరుకున్నాడు.​—⁠2 కొరింథీయులు 4:2; 1 కొరింథీయులు 9:19-23.

పౌలు తిమోతీలు ఇలాంటి ఆలోచనా విధానానికి పేరుపొందారు. రోమీయులు 14:15, 20, 21; 1 కొరింథీయులు 8:​9-13; 10:23-33 వచనాల్లోని వృత్తాంతాలను చదివి, పౌలు ఇతరుల ఆధ్యాత్మిక సంక్షేమం గురించి, ప్రత్యేకంగా, వాస్తవానికి తప్పుకాని విషయాలనుబట్టి అభ్యంతరపడేవారి ఆధ్యాత్మిక సంక్షేమం గురించి ఎంతగా చింతించేవాడో చూడండి. పౌలు తిమోతి గురించి ఇలా వ్రాశాడు: “మీ క్షేమవిషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడెవడును నాయొద్ద లేడు. అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను.” (ఫిలిప్పీయులు 2:​20-22) ఈ క్రైస్తవ పురుషులిద్దరూ నేడు మన కోసం ఎంత చక్కని మాదిరిని ఉంచారో కదా! దేవుని నుండి నిర్దిష్టమైన ఆజ్ఞ లేనప్పుడు వ్యక్తిగత సౌకర్యాన్ని లేదా అభిరుచిని ఎంపిక చేసుకొనే బదులు వాళ్ళు తమ వ్యక్తిగత నిర్ణయాలు ఇతరులను ఆధ్యాత్మికంగా ఎలా ప్రభావితం చేయగలవనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా యెహోవా మరియు ఆయన కుమారుడు చూపిన ప్రేమను అనుకరించారు.

మన ప్రధాన మాదిరి అయిన యేసుక్రీస్తు గురించి ఆలోచించండి. ఆయన కొండమీద ఇచ్చిన ప్రసంగంలో, దేవుని నియమాల వెనుకవున్న స్ఫూర్తిని గ్రహించిన వ్యక్తి నిర్దిష్టంగా ఆజ్ఞాపించబడిన లేదా నిషేధించబడిన వాటికి విధేయత చూపించడం కంటే ఎక్కువే చేస్తాడని స్పష్టంగా వివరించాడు. (మత్తయి 5:21, 22, 27, 28) నిర్దిష్టమైన దైవిక ఆజ్ఞ లేనప్పుడు ఒక వ్యక్తి తన ఇష్టం వచ్చినట్లు చేయవచ్చుననే తర్కనను యేసు గాని, పౌలు గాని, తిమోతి గాని, లేదా యోసేపు గాని అనుసరించలేదు. దేవుని ఆలోచనా విధానానికి అనుగుణంగా ఉండేందుకు ఈ పురుషులు, యేసు రెండు అత్యంత గొప్ప ఆజ్ఞలుగా పేర్కొన్న ఆజ్ఞల ప్రకారం అంటే దేవుణ్ణి ప్రేమించడం మరియు పొరుగువానిని ప్రేమించడం అనే ఆజ్ఞల ప్రకారం జీవించారు.​—⁠మత్తయి 22:36-40.

నేటి క్రైస్తవుల సంగతేమిటి?

మనం బైబిలును ఒక న్యాయపరమైన దస్తావేజుగా అంటే ప్రతి విధి గురించి వివరంగా తెలియజేసే దస్తావేజుగా దృష్టించకూడదని స్పష్టమవుతోంది. మన చర్యలను నియంత్రించడానికి నిర్దిష్టమైన ఆజ్ఞ లేనప్పుడు కూడా మనం యెహోవా ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే పనులు చేయడానికి ఎంపిక చేసుకుంటే మనం ఆయన హృదయాన్ని ఎంతో సంతోషపరుస్తాము. మరోవిధంగా చెప్పాలంటే, ప్రతి విషయంలోను దేవుని నుండి సూటియైన ఆజ్ఞను ఆశించే బదులు మనం యెహోవా ‘చిత్తమేమిటో గ్రహించవచ్చు.’ (ఎఫెసీయులు 5:17; రోమీయులు 12:⁠2) అది యెహోవాను ఎందుకు సంతోషపరుస్తుంది? ఎందుకంటే మనం మన వ్యక్తిగత అభిరుచుల గురించి లేదా హక్కుల గురించి కాక ఆయనను సంతోషపరచడం గురించే ఎక్కువగా చింతిస్తున్నామని అది చూపిస్తుంది. అంతేగాక అది, మనం ఆయన చూపిన ప్రేమ మనలను ప్రేరేపించేందుకు అనుమతిస్తూ దాన్ని అనుకరించాలని కోరుకునేంతగా దానిపట్ల కృతజ్ఞత కలిగివున్నామని చూపిస్తుంది. (సామెతలు 23:15; 27:​11) అంతేకాక లేఖనాల్లో సూచించబడిన విషయాల ఆధారంగా చేసే పనులు ఆధ్యాత్మిక ఆరోగ్యానికే కాక తరచూ శారీరక ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి.

ఈ సూత్రాన్ని మన వ్యక్తిగత విషయాల్లో ఎలా అన్వయించుకోవచ్చో మనం చూద్దాము.

వినోదాన్ని ఎంపిక చేసుకోవడం

ఒక పాటల క్యాసెట్‌ను కొనాలనుకునే యువకుడి ఉదాహరణ తీసుకోండి. ఆ క్యాసెట్‌లోని పాటలను విన్నప్పుడు అవి ఆయనకు నచ్చాయి కాని ఆ పాటల్లోని మాటలు లైంగిక విచ్చలవిడితనంతో, అశ్లీలమైన పదాలతో ఉన్నాయని ఆ క్యాసెట్‌ కవరు వెనుక భాగం సూచిస్తుంది కాబట్టి ఆయన ఆలోచనలోపడ్డాడు. అంతేకాక ఆ గాయకుడు పాడిన పాటల్లో చాలాశాతం కోపోద్రేకంతో దాడిచేసే స్ఫూర్తిని ప్రోత్సహిస్తాయని కూడా ఆ యువకుడికి తెలుసు. యెహోవాను ప్రేమించే వ్యక్తిగా ఆ యువకుడికి ఆ క్యాసెట్‌ గురించి యెహోవా తలంపులు, భావాలు తెలుసుకోవాలని ఉంది. ఆ విషయంలో దేవుని చిత్తమేమిటో ఆయన ఎలా గ్రహించవచ్చు?

అపొస్తలుడైన పౌలు గలతీయులకు వ్రాసిన పత్రికలో శరీర కార్యములను మరియు దేవుని ఆత్మ ఫలమును పేర్కొన్నాడు. దేవుని ఆత్మ ఫలములో ఏమేమి ఇమిడివున్నాయో మీకు తెలిసే వుంటుంది: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. కానీ శరీర కార్యములు అంటే ఏమిటి? పౌలు ఇలా వ్రాశాడు: “శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.”​—⁠గలతీయులు 5:19-23.

ఆయన పేర్కొన్న విషయాల్లో చివరన ఉన్న ‘మొదలైనవి’ అనే పదబంధమును గమనించండి. శరీర కార్యముల్లో ఏమేమి ఉంటాయో తెలియజేస్తూ పౌలు ఒక పొడవాటి జాబితాను ఇవ్వలేదు. ‘శరీర కార్యములు అని పౌలు పేర్కొన్న కార్యకలాపాల జాబితాలో లేని దేనినైనా చేయడానికి నాకు లేఖనాధారంగా అనుమతి ఉంది’ అని ఒక వ్యక్తి తర్కించుకోవచ్చునని అది సూచించడం లేదు. దానికి బదులుగా పాఠకులు ఆ జాబితాలో లేకపోయినప్పటికీ ఆ ‘మొదలైనవి’ అనే వాటిలో చేరగలవి ఏవో గుర్తించడానికి తమ జ్ఞానేంద్రియములను ఉపయోగించాలి. అక్కడ పేర్కొనబడకపోయినప్పటికీ ఆ ‘మొదలైన’ వాటిలో భాగమైన పనులను పశ్చాత్తాపం లేకుండా పదేపదే చేసేవారు దేవుని రాజ్య ఆశీర్వాదాలను పొందరు.

కాబట్టి యెహోవా దృష్టిలో అప్రీతికరమైనవేవో మనం గ్రహించాలి లేదా వివేచించాలి. అది కష్టమా? మీరు పళ్ళూ కూరగాయలూ ఎక్కువగా తినాలి కానీ స్వీట్స్‌, ఐస్‌క్రీము మొదలైనవి తినకూడదు అని మీ డాక్టర్‌ చెప్పాడనుకోండి. కేక్‌ ఏ కోవకు చెందుతుందో గుర్తించడం కష్టమనిపిస్తుందా? ఇప్పుడు దేవుని ఆత్మ ఫలమును, శరీర కార్యములను మళ్ళీ పరిశీలించండి. పైన ప్రస్తావించబడిన పాటల క్యాసెట్‌ ఏ కోవకు చెందుతుంది? అది ప్రేమ, మంచితనం, ఆశానిగ్రహం లేదా దేవుని ఆత్మ ఫలములోని ఇతర లక్షణాలను ప్రతిబింబించడం లేదనడంలో సందేహం లేదు. ఇలాంటి సంగీతం దేవుని ఆలోచనా విధానానికి అనుగుణంగా లేదు అని గ్రహించడానికి ఒక వ్యక్తికి సూటియైన ఆజ్ఞ అవసరం లేదు. మనం చదివే పుస్తకాలు, చూసే సినిమాలు, టీవీ కార్యక్రమాలు, కంప్యూటర్‌ గేమ్స్‌, వెబ్‌ సైట్లు మొదలైనవాటన్నింటికి అవే సూత్రాలు అన్వయిస్తాయి.

అంగీకారయోగ్యమైన వ్యక్తిగత రూపం

వస్త్రధారణకు, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన విషయాలను ప్రభావితం చేసే సూత్రాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఒక క్రైస్తవుడు తగినవిధంగా చక్కని పైరూపం కలిగివుండే విషయంలో ఆ సూత్రాలు నడిపింపునిస్తాయి. అయితే యెహోవాను ప్రేమించే వ్యక్తి దీన్ని, తన ఇష్టం వచ్చినట్లు చేయడానికి లభించిన అవకాశంగా కాకుండా తన పరలోక తండ్రిని సంతోషపరిచేవాటిని చేయడానికిగల అవకాశంగా దృష్టిస్తాడు. మనం ఇప్పటికే పరిశీలించినట్లుగా, యెహోవా ఒక విషయంలో నిర్దిష్టమైన ఆజ్ఞ ఇవ్వలేదంటే దానర్థం తన ప్రజలేమి చేసినా తనకు అనవసరం అని కాదు. ఒక ప్రాంతంలోని అలంకరణా పద్ధతులకు మరో ప్రాంతంలోని అలంకరణా పద్ధతులకు తేడా ఉంటుంది, ఒకే ప్రాంతంలో కూడా అవి తరచూ మారుతుంటాయి. అయితే దేవుడు తన ప్రజలను అన్ని సమయాల్లోను, అన్ని ప్రాంతాల్లోను నిర్దేశించవలసిన ప్రాథమిక సూత్రాలను అందజేస్తున్నాడు.

ఉదాహరణకు 1 తిమోతి 2:​9, 10 వచనాలు ఇలా చెబుతున్నాయి: “స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.” అందువల్ల క్రైస్తవ స్త్రీపురుషులు తాము నివసించే ప్రాంతంలోని ప్రజలు “దైవభక్తిగలవారమని చెప్పుకొను”వారు ఎలా ఉండాలని ఆశిస్తారనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. తన వ్యక్తిగత రూపం, తాను ఇచ్చే బైబిలు సందేశం గురించి ప్రజలు ఎలా భావించేలా చేస్తుందని ఒక క్రైస్తవుడు ఆలోచించడం ప్రాముఖ్యంగా సముచితం. (2 కొరింథీయులు 6:⁠3) ఒక మాదిరికరమైన క్రైస్తవుడు తన స్వంత అభిరుచుల గురించి లేదా తాను పొందవలసినవని తాననుకుంటున్న హక్కుల గురించి అతిగా చింతించడు, దానికి బదులు తాను ఇతరులకు అవరోధం కలిగించే లేదా అభ్యంతరం కలిగించే వ్యక్తిగా ఉండకూడదని కోరుకుంటాడు.​—⁠మత్తయి 18:6; ఫిలిప్పీయులు 1:⁠9.

వ్యక్తిగత రూపానికి సంబంధించిన ఒక నిర్దిష్టమైన అలంకరణా పద్ధతి ఇతరులను చిరాకుపెట్టేదిగా లేదా అభ్యంతరపెట్టేదిగా ఉందని ఒక క్రైస్తవుడు గమనిస్తే, ఆయన తన స్వంత అభిరుచులకంటే ఇతరుల ఆధ్యాత్మిక సంక్షేమం గురించి ఎక్కువగా ఆలోచించడం ద్వారా అపొస్తలుడైన పౌలు మాదిరిని అనుకరించవచ్చు. పౌలు ఇలా చెప్పాడు: “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.” (1 కొరింథీయులు 11:⁠1) యేసు గురించి పౌలు ఇలా వ్రాశాడు: “క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు.” క్రైస్తవులందరికీ పౌలు ఇచ్చే ఉపదేశం స్పష్టంగా ఇలా ఉంది: “కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను.”​—⁠రోమీయులు 15:1-3.

మన జ్ఞానేంద్రియములకు పదును పెట్టుకోవడం

ఒకానొక విషయంలో యెహోవా నిర్దిష్టమైన నడిపింపును ఇవ్వకపోయినప్పటికీ ఆయనను సంతోషపరిచేదేమిటో తెలుసుకోవడానికి మనం మన జ్ఞానేంద్రియములను ఎలా పెంపొందించుకోవచ్చు? మనం ఆయన వాక్యాన్ని ప్రతీరోజు చదివితే, దానిని క్రమంగా అధ్యయనం చేస్తే, మనం చదివిన దానిని ధ్యానిస్తే, మన జ్ఞానేంద్రియములు అభివృద్ధి కావడం మనం చూస్తాము. అయితే ఇలాంటి అభివృద్ధి వేగంగా జరగదు. ఒక పిల్లవాని శారీరక పెరుగుదలవలే ఆధ్యాత్మిక పెరుగుదల క్రమంగా జరుగుతుంది, దానిని మనం వెంటనే గ్రహించలేము. కాబట్టి మనకు ఓపిక అవసరం, తక్షణ అభివృద్ధి కనిపించకపోతే మనం కలతచెందకూడదు. మరోవైపున, కాలం గడుస్తున్న కొద్దీ మన జ్ఞానేంద్రియములు వాటంతటవే అభివృద్ధి చెందవు. పైన పేర్కొనబడినట్లుగా దేవుని వాక్యాన్ని క్రమంగా అధ్యయనం చేస్తూ, ఆ వాక్యాన్ని మన శక్తిమేరకు మన జీవితంలో అన్వయించుకుంటే ఆ అభివృద్ధి జరుగుతుంది.​—⁠హెబ్రీయులు 5:14.

దేవుని నియమాలు మన విధేయతను పరీక్షిస్తే ఆయన సూత్రాలు మన ఆధ్యాత్మికత గాఢతను, ఆయనను సంతోషపరచాలనే మన కోరికను పరీక్షిస్తాయని చెప్పవచ్చు. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొలదీ యెహోవాను ఆయన కుమారుణ్ణి అనుకరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. లేఖనాలచే సూచించబడినట్లుగా దేవుని ఆలోచనా విధానం ఆధారంగా నిర్ణయాలు తీసుకొనేందుకు మనం ఆతృతను కనబరుస్తాము. మనం చేసే పనులన్నింటిలోను మన పరలోక తండ్రిని మనం సంతోషపరచినప్పుడు మన సంతోషం కూడా అధికమవుతున్నట్లు మనం గ్రహిస్తాము.

[23వ పేజీలోని చిత్రాలు]

వస్త్రధారణా పద్ధతులు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి, కానీ మనం బైబిలు సూత్రాల నిర్దేశానుసారంగా ఎంపికలు చేసుకోవాలి