‘యెహోవాకు నేనేమి చెల్లించుదును?’
జీవిత కథ
‘యెహోవాకు నేనేమి చెల్లించుదును?’
మరీయ కరాసీనీస్ చెప్పినది
18 ఏళ్ళ వయస్సులో నేను నా తల్లిదండ్రులకు అవమానం, నిరాశ కలగడానికి కారణమయ్యాను, నా కుటుంబ సభ్యులచే నిరాకరించబడ్డాను, మా ఊరిలో ఎగతాళికి కారణంగా తయారయ్యాను. దేవునిపట్ల నా యథార్థతను భంగపర్చడానికి విన్నపాలు, బలప్రయోగం, బెదిరింపులు అన్ని ఉపయోగించబడ్డాయి గానీ ఏవీ పని చేయలేదు. బైబిలు సత్యానికి నమ్మకంగా అంటిపెట్టుకొని ఉండడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేకూరుతాయన్న నమ్మకం నాకుండేది. యాభై ఏళ్ళకుపైగా యెహోవా సేవలో గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటే నేను కీర్తనకర్త పలికిన ఈ మాటలతో ఏకీభవిస్తాను: “యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?”—కీర్తన 116:12.
నే ను 1930లో ఆంగెలోకాస్ట్రోలో జన్మించాను. ఈ గ్రామం, మొదటి శతాబ్దంలో నిజక్రైస్తవుల ఒక సంఘం ఏర్పడిన కొరింథుకు చెందిన ఇస్తుమస్‌కు తూర్పువైపునున్న కెంక్రేయ తీరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.—అపొస్తలుల కార్యములు 18:18; రోమీయులు 16:1.
మా కుటుంబం చాలా ప్రశాంతమైన జీవితం గడిపేది. మా నాన్న గ్రామపెద్దగా ఉండి అందరి మన్ననలు అందుకునేవారు. నేను ఐదుగురు పిల్లల్లో మూడవదాన్ని. మా తల్లిదండ్రులు మమ్మల్ని గ్రీకు ఆర్థడాక్స్ చర్చి యొక్క నిష్ఠగల సభ్యులుగా పెంచారు. నేను ప్రతి ఆదివారం మాస్‌కు వెళ్ళేదాన్ని. నేను ప్రతిమల ఎదుట పాపాలు ఒప్పుకునేదాన్ని, గ్రామాల్లోని ప్రార్థనామందిరాల్లో కొవ్వొత్తులు వెలిగించేదాన్ని, అన్ని ఉపవాసాలు ఆచరించేదాన్ని. నేను నన్‌ను కావాలని తరచూ అనుకునేదాన్ని. కొంతకాలానికి, నేను మా కుటుంబంలో నా తల్లిదండ్రులను నిరాశపరచిన మొదటిదాన్నయ్యాను.
బైబిలు సత్యం తెలుసుకుని పులకరించిపోయాను
నాకు 18 ఏళ్ళున్నప్పుడు, మా బావల్లో ఒకరి చెల్లెలు కాటీనా పొరుగుగ్రామంలో నివసించేది, ఆమె యెహోవాసాక్షుల
ప్రచురణలు చదువుతూ చర్చికి వెళ్ళడం మానుకుందని నాకు తెలిసింది. దానికి నేను చాలా బాధపడి, నేను సరైనదని భావించిన మార్గంపైకి తిరిగి వచ్చేందుకు ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి ఆమె మమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి అలా వాహ్యాళికి వెళ్ళడానికి నేను ఏర్పాటు చేశాను, మధ్యలో ప్రీస్టు ఇంటి దగ్గర ఆగాలన్నది నా సంకల్పం. ప్రీస్టు, యెహోవాసాక్షులు కాటీనాను తప్పుదోవ పట్టించిన మతభ్రష్టులంటూ వాళ్ళను దుయ్యబట్టడంతో సంభాషణ ప్రారంభించాడు. ఆ చర్చ వరుసగా మూడు రాత్రులపాటు కొనసాగింది. కాటీనా చక్కగా సిద్ధపడిన బైబిలు ఆధారిత చర్చలతో, ఆయన చేసిన ఆరోపణలన్నీ తప్పని నిరూపించింది. చివరకు, ఆమె ఎంతో అందమైన తెలివైన అమ్మాయి కాబట్టి వయస్సులో ఉండగానే తన యౌవనాన్ని ఆనందించాలని, వయసుపైబడిన తర్వాత దేవుని గురించి ఆలోచించవచ్చునని ప్రీస్టు ఆమెకు చెప్పాడు.ఈ చర్చ గురించి నేను నా తల్లిదండ్రులకు ఏమి చెప్పలేదు గానీ ఆ తర్వాత ఆదివారం నేను చర్చికి వెళ్ళలేదు. ఆ మధ్యాహ్నం ప్రీస్టు నేరుగా మా దుకాణానికి వచ్చాడు. నాన్నకు దుకాణంలో సహాయం చేయడానికి ఉండిపోయానని నేను సాకు చెప్పాను.
“నిజంగా అదే కారణమా లేక ఆ పిల్ల నీ మీద ప్రభావం చూపిందా?” అని ప్రీస్టు అడిగాడు.
“వాళ్ళకు మనకంటే శ్రేష్ఠమైన నమ్మకాలున్నాయి” అని నేను సూటిగా సమాధానమిచ్చాను.
ప్రీస్టు మా నాన్నవైపు తిరిగి, “ఎకొనొమోస్‌గారు, మీ ఇంటికొచ్చిన ఆ బంధువులమ్మాయిని వెంటనే ఇంట్లో నుండి వెళ్ళగొట్టండి; ఆమె మీ ఇంటికి నిప్పంటించింది” అన్నాడు.
మా కుటుంబం నాకు వ్యతిరేకంగా తిరగడం
గ్రీసులో పౌరయుద్ధం మూలంగా హింస చెలరేగుతున్న 1940వ దశాబ్దాల చివరి కాలంలో ఇది జరిగింది. గెరిల్లాలు నన్ను పట్టుకుపోతారనే భయంతో, నేను మా గ్రామం వదిలి మా అక్క ఇంటికి వెళ్ళడానికి నాన్న ఏర్పాట్లు చేశారు, కాటీనా కూడా ఆ గ్రామంలోనే నివసిస్తోంది. నేనక్కడున్న రెండు నెలల్లో, అనేక విషయాల గురించి బైబిలు ఏమి చెబుతోందో తెలుసుకోవడానికి నాకు సహాయం లభించింది. ఆర్థడాక్స్ చర్చి సిద్ధాంతాలు అనేకం లేఖనవిరుద్ధమైనవని తెలుసుకుని నేను చాలా నిరాశ చెందాను. ప్రతిమల ద్వారా చేసే ఆరాధనను దేవుడు అంగీకరించడని, సిలువను పూజించడం వంటి వివిధ మతసంబంధమైన సాంప్రదాయాలు క్రైస్తవ మూలమైనవి కాదని, దేవుని అనుగ్రహం పొందాలంటే ఆయనను “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించాలని నేను గ్రహించాను. (యోహాను 4:23; నిర్గమకాండము 20:4, 5) అన్నిటికంటే ఎక్కువగా, భూమిపై నిరంతరం జీవించే ఉజ్వలమైన నిరీక్షణను బైబిలు ఇస్తోందని నేను తెలుసుకున్నాను. అలాంటి అమూల్యమైన బైబిలు సత్యాలు, నేను యెహోవానుండి పొందిన వ్యక్తిగత తొలి ప్రయోజనాల్లో కొన్ని.
ఈలోగా, భోజన సమయాల్లో నేను సిలువ గుర్తు వేసుకోవడం లేదనీ ప్రతిమల ఎదుట ప్రార్థించడంలేదనీ మా అక్క, బావ గమనించారు. ఒక రాత్రి వాళ్ళిద్దరూ నన్ను కొట్టారు. మరునాడు నేను వాళ్ళ ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుని, మా చిన్నమ్మ ఇంటికి వెళ్ళిపోయాను. మా బావ ఈ విషయాన్ని నాన్నకు తెలియజేశాడు. తర్వాత కొద్దికాలానికే నాన్న కన్నీళ్ళతో వచ్చి నా మనస్సు మార్చడానికి ప్రయత్నించారు. మా బావ నా ఎదుట మోకాళ్ళూని క్షమించమని కోరాడు, నేనలాగే క్షమించాను. ఇక సమస్యను పరిష్కరించడానికి, వాళ్ళు నన్ను చర్చికి రమ్మని అడిగారు, నేను స్థిరంగా నిలబడ్డాను.
నేను నాన్న ఉంటున్న గ్రామానికి తిరిగి వెళ్ళినప్పుడు ఒత్తిళ్ళు ఎక్కువయ్యాయి. నాకు కాటీనాను సంప్రదించే అవకాశమే లేకుండా పోయింది, నా దగ్గర ఏ విధమైన సాహిత్యమూ చివరికి బైబిలు కూడా లేదు. మా పెదనాన్న కూతురు నాకు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు నేనెంతో సంతోషించాను. ఆమె కొరింథుకు వెళ్ళినప్పుడు ఒక సాక్షిని కలిసి “దేవుడు సత్యవంతుడై ఉండునుగాక” (ఆంగ్లం) అనే పుస్తకాన్ని, క్రైస్తవ గ్రీకు లేఖనాల ప్రతిని తీసుకువచ్చింది, వాటిని నేను రహస్యంగా చదవడం మొదలుపెట్టాను.
జీవితం అనుకోని మలుపు తిరగడం
మూడు సంవత్సరాలపాటు తీవ్రమైన వ్యతిరేకత కొనసాగింది. నేను సాక్షులెవరినీ కలుసుకోలేకపోయాను, ఏ ప్రచురణలూ నాకు లభించలేదు. అయితే నాకు తెలియకుండా, నా జీవితంలో పెద్ద మార్పులు జరుగబోతున్నాయి.
నేను థెస్సలోనీకలో ఉన్న మా మామయ్య దగ్గరికి వెళ్ళాలని నాన్న నాకు చెప్పారు. థెస్సలోనీకకు వెళ్ళకముందు ఒక కోటు కుట్టించుకోవడానికి కొరింథులో నేనొక దర్జీ దగ్గరికి వెళ్ళాను. ఎంత ఆశ్చర్యం, కాటీనా అక్కడ పనిచేస్తోంది! చాలాకాలం తర్వాత ఒకరినొకరం కలుసుకున్నందుకు మేమిద్దరం ఎంతో సంతోషించాము. ఇద్దరం ఆ దుకాణంలో నుండి బయటకు వస్తుండగా, పని ముగించుకుని సైకిలు మీద ఇంటికి వెళ్తున్న ఒక చక్కని యౌవనస్థుడిని
మేము కలిశాము. ఆయన పేరు కారాలాంబూస్. మేమిద్దరం ఒకరినొకరం తెలుసుకున్న తర్వాత వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాము. దాదాపు ఈ సమయంలోనే, 1952 జనవరి 9న నేను బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యెహోవాకు నా సమర్పణను సూచించాను.కారాలాంబూస్ ముందే బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన కూడా కుటుంబం నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. కారాలాంబూస్ ఎంతో ఆసక్తిపరుడు. ఆయన సహాయక సంఘ సేవకుడిగా సేవచేస్తూ ఎన్నో బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నాడు. త్వరలోనే ఆయన అన్నలు సత్యాన్ని అంగీకరించారు, నేడు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో చాలామంది యెహోవా సేవ చేస్తున్నారు.
కారాలాంబూస్ మా నాన్నకు ఎంతో నచ్చాడు, కాబట్టి ఆయన మా వివాహానికి సమ్మతించాడు గానీ అమ్మ అంత సులభంగా ఒప్పుకోలేదు. అయినప్పటికీ 1952 మార్చి 29న కారాలాంబూస్ నేను వివాహం చేసుకున్నాము. మా పెద్దన్న, పెదనాన్న కుమారుడు మాత్రమే మా వివాహానికి వచ్చారు. కారాలాంబూస్ నాకు ఇంత నిరుపమానమైన ఆశీర్వాదంగా, యెహోవా నుండి లభించిన నిజమైన బహుమానంగా నిరూపించబడతాడని నాకప్పుడేమాత్రం తెలియదు! ఆయన సహచరిగా నేను యెహోవా సేవ చుట్టూ నా జీవితాన్ని నిర్మించుకోగలిగాను.
మన సహోదరులను బలపర్చడం
1953లో నేను, కారాలాంబూస్ ఏథెన్సుకు వెళ్ళడానికి నిర్ణయించున్నాము. ప్రకటనా పనిలో ఎక్కువగా పాల్గొనాలనే ఉద్దేశంతో కారాలాంబూస్ వాళ్ల కుటుంబ వ్యాపారం నుండి ప్రక్కకు తప్పుకుని పార్ట్‌టైమ్ పని వెతుక్కున్నాడు. మధ్యాహ్నాల్లో మేమిద్దరం కలిసి క్రైస్తవ పరిచర్యలో పాల్గొని, ఎన్నో బైబిలు అధ్యయనాలు నిర్వహించేవాళ్ళం.
మన పరిచర్యపై విధించబడిన అధికారిక ఆంక్షల కారణంగా మేమెంతో యుక్తిగా వ్యవహరించవలసి వచ్చేది. ఉదాహరణకు, నా భర్త పార్ట్‌టైమ్ పనిచేస్తున్న దుకాణం కిటికీలో కావలికోట ప్రతిని ఉంచాలని మేము నిర్ణయించుకున్నాము, ఆ దుకాణం ఏథెన్సు మధ్యలో ఉంది. ఆ పత్రిక నిషేధించబడిందని ఒక పోలిస్ ఉన్నతాధికారి మాకు చెప్పాడు. అయితే, దాని గురించి భద్రతా కార్యాలయంలో విచారణ చేయడానికి దాని ప్రతి ఒకటి ఇవ్వమని ఆయన కోరాడు. ఆ పత్రిక చట్టబద్ధమైనదే అని అధికారులు చెప్పినప్పుడు ఆ విషయం మాకు చెప్పడానికి ఆయన తిరిగివచ్చాడు. దుకాణాలున్న ఇతర సహోదరులు ఈ విషయం గురించి విన్న వెంటనే వాళ్ళు కూడా తమ దుకాణాల కిటికీల్లో కావలికోట ప్రతులు ఉంచడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి మా దుకాణం నుండి కావలికోట తీసుకుని, సాక్షిగా మారి ఇప్పుడు పెద్దగా సేవ చేస్తున్నాడు.
నా చిన్న తమ్ముడు సత్యం తెలుసుకోవడాన్ని చూసే ఆనందం కూడా మాకు దక్కింది. మర్చెంట్ మరైన్ కాలేజీలో చదువుకోవడానికి వాడు ఏథెన్సుకు వచ్చాడు, మేము వాడిని మాతోపాటు సమావేశానికి తీసుకువెళ్ళాము. మా సమావేశాలు రహస్యంగా అడవుల్లో జరిగేవి. వాడికి తాను విన్న విషయాలు నచ్చాయి, కానీ ఆ తర్వాత కొద్దికాలానికే వాడు ఒక వర్తకుడిగా ప్రయాణాలు చేయడం మొదలుపెట్టాడు. అలాంటి ఒక ప్రయాణంలో వాడొకసారి అర్జెంటీనాలో ఒక తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక మిషనరీ ప్రకటించడానికి ఓడలోకి ఎక్కడంతో మా తమ్ముడు మన పత్రికల కోసం అడిగాడు. “నేను సత్యం తెలుసుకున్నాను. నన్ను చందాదారుడ్ని చేయండి” అంటూ వాడు వ్రాసిన ఉత్తరం అందుకుని మేము సంతోషం పట్టలేకపోయాము. ఇప్పుడు వాడు, వాడి కుటుంబం నమ్మకంగా యెహోవా సేవ చేస్తున్నారు.
1958లో నా భర్త ప్రయాణ పైవిచారణకర్తగా సేవ చేయడానికి ఆహ్వానించబడ్డాడు. మన పని నిషేధించబడి కష్టతరమైన పరిస్థితులు ఉన్నందుకు ప్రయాణ పైవిచారణకర్తలు సాధారణంగా తమ భార్యలను తమ వెంట తీసుకువెళ్ళేవారు కాదు. నేను కూడా ఆయనతోపాటు వెళ్ళవచ్చా అని మేము 1959 అక్టోబరులో, బ్రాంచి కార్యాలయంలోని బాధ్యతాయుతులైన సహోదరులను అడిగాము. అలా వెళ్ళడానికి వాళ్ళు అంగీకరించారు. మేము మధ్య, ఉత్తర గ్రీసులలోని సంఘాలను బలపర్చడానికి వాటిని దర్శించాలి.
ఆ ప్రయాణాలు అంత సులభంగా ఉండేవి కాదు. చాలా కొన్ని మాత్రమే తారు రోడ్లు ఉండేవి. మాకు కారు లేదు కాబట్టి మేము సాధారణంగా బస్సుల్లో, కోళ్ళు ఇతర వస్తువులతోపాటు సామాన్లు తీసుకువెళ్ళే ట్రక్కుల్లో ప్రయాణించేవాళ్ళం. బురద దారులగుండా నడిచి వెళ్ళడానికి రబ్బరు బూట్లు వేసుకునేవాళ్ళం. ప్రతి గ్రామంలో పౌరసేన ఉండేది కాబట్టి వాళ్ళను తప్పించుకోవడానికి మేము రాత్రి సమయాల్లో గ్రామాల్లోకి ప్రవేశించేవాళ్ళం.
సహోదరులు మా సందర్శనాలను ఎంతో విలువైనవిగా ఎంచేవారు. వారిలో చాలామంది పొలాల్లో బాగా కష్టపడి పనిచేసినా, వివిధ గృహాల్లో చాలా పొద్దుపోయాక జరిగే కూటాలకు హాజరుకావడానికి వాళ్ళు ఎంతో కృషి చేసేవారు. సహోదరులు ఎంతో చక్కగా ఆతిథ్యమిచ్చేవారు, వారంత ధనవంతులు కాకపోయినా తమకున్న దానిలో శ్రేష్ఠమైనది మాకిచ్చేవారు. కొన్నిసార్లు మేము మొత్తం కుటుంబంతో కలిసి ఒకే గదిలో పడుకున్నాం. సహోదరుల విశ్వాసం, సహనం, ఆసక్తి మాకు లభించిన మరో విలువైన ప్రయోజనంగా నిరూపించబడ్డాయి.
మా సేవను విస్తృతపర్చుకోవడం
1961 ఫిబ్రవరిలో, ఏథెన్సులోని బ్రాంచి కార్యాలయాన్ని దర్శించినప్పుడు, బెతెల్‌లో సేవచేయడానికి ఇష్టపడతారా అని మమ్మల్ని అడగడం జరిగింది. “నేనున్నాను నన్ను పంపుము” అంటూ మేము యెషయా మాటల్లో సమాధానమిచ్చాము. (యెషయా 6:8) రెండు నెలల తర్వాత, వీలైనంత త్వరగా బెతెల్‌కు రండి అని ఆహ్వానిస్తున్న ఉత్తరం అందుకున్నాము. అలా మేము 1961, మే 27న బెతెల్‌లో సేవ చేయడం ప్రారంభించాము.
మాకు మా క్రొత్త నియామకం ఎంతో నచ్చింది, అనతికాలంలోనే మేము నిశ్చింతగా, సుఖంగా ఉన్నాము. నా భర్త సర్వీస్, సబ్‌స్క్రిప్షన్ విభాగాల్లో, ఆ తర్వాత కొంతకాలంపాటు బ్రాంచి కమిటీలో సేవచేశాడు. నాకు వివిధ నియామకాలు లభించాయి. అప్పట్లో బెతెల్ కుటుంబంలో 18 మంది సభ్యులున్నారు, కానీ దాదాపు ఐదు సంవత్సరాలపాటు ఇంచుమించు 40 మంది ఉండేవారు, ఎందుకంటే పెద్దల కోసం బెతెల్‌లో ఒక పాఠశాల నిర్వహించబడేది. ఉదయం నేను గిన్నెలు కడిగి, వంటలో సహాయం చేసి, 12 పరుపులు శుభ్రంగా పరిచిపెట్టి, మధ్యాహ్న భోజనానికి బల్లలు సిద్ధం చేసేదాన్ని. మధ్యాహ్నం బట్టలు ఇస్త్రీ చేసి, టాయిలెట్లు, గదులు శుభ్రం చేసేదాన్ని. వారానికి ఒకసారి నేను లాండ్రీలో కూడా పనిచేసేదాన్ని. చాలా పని ఉండేది, సహాయం చేయగలుగుతున్నందుకు నేను సంతోషించేదాన్ని.
మేము బెతెల్‌లోనూ క్షేత్ర పరిచర్యలోనూ పూర్తిగా నిమగ్నమైపోయి ఉండేవాళ్ళం. చాలాసార్లు మేము ఏడు బైబిలు అధ్యయనాల వరకు నిర్వహించేవాళ్ళం. వారాంతాల్లో, కారాలాంబూస్ వివిధ సంఘాల్లో ప్రసంగాలిస్తుంటే నేను ఆయనతోపాటు వెళ్ళేదాన్ని. దాదాపు మేమెప్పుడూ కలిసే ఉండేవాళ్ళం.
గ్రీక్ ఆర్థడాక్స్ చర్చితో సన్నిహిత సంబంధం ఉన్న ఒక జంటతో మేము బైబిలు అధ్యయనం నిర్వహించాము, వాళ్ళు మతభ్రష్టులను పట్టుకోవడానికి పాటుపడే చర్చికి సంబంధించిన సంస్థకు నాయకత్వం వహించే ఒక మతనాయకుడి సన్నిహిత స్నేహితులు. వాళ్ళ ఇంట్లో పూర్తిగా ప్రతిమలతో నిండివున్న ఒక గది ఉండేది, అక్కడ ఎప్పుడూ అగరు వత్తులు వెలిగించబడి, రోజంతా బైజాంటియమ్ కీర్తనలు మ్రోగుతుండేవి. కొంతకాలంపాటు మేము వారిని గురువారాల్లో సందర్శించి బైబిలు అధ్యయనం చేసేవాళ్ళం, మతనాయకుడైన వాళ్ళ స్నేహితుడు శుక్రవారాల్లో వాళ్ళ దగ్గరికి వచ్చేవాడు. ఒకరోజు, మాకోసం ఏదో ఆశ్చర్యకరమైనది వేచివుందని, మేము తప్పక రావాలని వాళ్ళు కోరారు. వాళ్ళు మాకు చూపించిన మొదటి విషయం ఆ గది. వాళ్ళు ఆ ప్రతిమలన్నీ తీసేసి దాన్ని క్రొత్తగా తయారు చేశారు. ఈ జంట మరింత అభివృద్ధి సాధించి బాప్తిస్మం తీసుకున్నారు. మేము బైబిలు అధ్యయనాలు నిర్వహించిన వారిలో మొత్తం 50 మంది యెహోవాకు తమ జీవితాలను సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడాన్ని చూసే ఆనందం మాకు దక్కింది.
అభిషిక్త సహోదరులతో సహవసించడం మేము ఆనందించిన మరో ప్రత్యేకమైన ప్రయోజనం. పరిపాలక సభ
సభ్యులైన నార్, ఫ్రాంజ్, హెన్షెల్ వంటి సహోదరుల సందర్శనాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండేవి. నలభై కంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత నేను ఇప్పటికీ బెతెల్‌లో సేవ చేయడం గొప్ప ఘనతగా, ఆధిక్యతగా భావిస్తున్నాను.అనారోగ్యాన్ని, నష్టాన్ని భరించడం
1982లో నా భర్తలో అల్జెమీర్ వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలయ్యింది. 1990కల్లా ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది, చివరికి ఆయన గురించి రాత్రింబగళ్ళు శ్రద్ధ తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన జీవితంలోని చివరి ఎనిమిది సంవత్సరాల్లో, మేము బెతెల్ విడిచి ఎక్కడికీ వెళ్ళలేకపోయాము. బెతెల్ కుటుంబంలోని ప్రియసహోదరులు అనేకమంది, అలాగే బాధ్యతాయుతులైన పైవిచారణకర్తలు మాకు సహాయం చేయడానికి ఏర్పాట్లు చేశారు. అయితే వారు దయాపూర్వకంగా సహాయం చేసినప్పటికీ నేను రాత్రింబగళ్ళు ఆయన గురించి ఎన్నో గంటలపాటు శ్రద్ధ తీసుకోవలసి వచ్చేది. కొన్నిసార్లు పరిస్థితులు మరీ కష్టంగా ఉండేవి, ఎన్నోసార్లు నిద్రలేని రాత్రులు గడిపేదాన్ని.
1998 జూలైలో నా ప్రియమైన భర్త మరణించాడు. ఆయన లేని లోటు ఎంతో ఉన్నా ఆయన సురక్షితంగా ఉన్నాడన్న వాస్తవం నాకు ఓదార్పునిస్తుంది, కోట్లాదిమంది ఇతరులతోపాటు యెహోవా ఆయనను గుర్తుంచుకుని పునరుత్థానం చేస్తాడని నాకు తెలుసు.—యోహాను 5:28, 29.
యెహోవా చేకూర్చిన ప్రయోజనాలకు కృతజ్ఞురాలిని
నేను నా భర్తను కోల్పోయినా ఒంటరిదాన్ని కాదు. నాకు ఇప్పటికీ బెతెల్‌లో సేవ చేసే ఆధిక్యత ఉంది, మొత్తం బెతెల్ కుటుంబం నాపై ప్రేమను, శ్రద్ధను కనబరుస్తారు. గ్రీసు అంతటా ఉన్న ఆధ్యాత్మిక సహోదర సహోదరీలు కూడా నా కుటుంబంలో ఒక భాగమే. నాకిప్పుడు 70 సంవత్సరాలు, అయినా నేను రోజంతా వంటగదిలో, భోజనశాలలో పనిచేయగలుగుతున్నాను.
1999లో, న్యూయార్క్‌లోవున్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించినప్పుడు నా కల నిజమైంది. నా భావాలను మాటల్లో వర్ణించలేను. అది ప్రోత్సాహకరమైన, మరువలేని అనుభవం.
నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, నా జీవితాన్ని ఇంతకన్నా శ్రేష్ఠమైన విధంగా గడపలేనని నాకు నిజంగా అనిపిస్తోంది. ఎవరైనా చేపట్టగల అత్యంత శ్రేష్ఠమైన పని పూర్తికాలం యెహోవా సేవ చేయడమే. నాకెప్పుడూ ఏదీ తక్కువకాలేదని నేను నమ్మకంగా చెప్పగలను. యెహోవా ఎంతో ప్రేమతో నా భర్త గురించి, నా గురించి ఆధ్యాత్మికంగానూ శారీరకంగానూ శ్రద్ధ తీసుకున్నాడు. నా వ్యక్తిగత అనుభవం నుండి, కీర్తనకర్త ఎందుకిలా అడిగాడో నేను అర్థం చేసుకోగలను: “యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?”—కీర్తన 116:12.
[26వ పేజీలోని చిత్రం]
కారాలాంబూస్ నేను ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం
[27వ పేజీలోని చిత్రం]
నా భర్త బ్రాంచి కార్యాలయంలోని తన ఆఫీసులో
[28వ పేజీలోని చిత్రం]
బెతెల్ సేవ గొప్ప ఘనత అని నేను భావిస్తున్నాను