వాళ్ళు చర్చికి వెళ్ళడానికిగల కారణం
వాళ్ళు చర్చికి వెళ్ళడానికిగల కారణం
“ఇప్పుడు దక్షిణ కొరియాలో, అమెరికాలోవున్న ప్రెస్బిటేరియన్‌లకంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ప్రెస్బిటేరియన్‌లు ఉన్నారు.” న్యూస్‌వీక్ పత్రికలోని ఆ వ్యాఖ్యానం చాలామంది పాఠకులను ఆశ్చర్యపరచివుండవచ్చు ఎందుకంటే కొరియాలో కన్‌ఫ్యూషియన్లు, బౌద్ధులు ఎక్కువగా ఉంటారని చాలామంది అనుకుంటారు. నేడు, కొరియాను సందర్శించేవారికి అక్కడ చాలా “క్రైస్తవ” చర్చిలు కనిపిస్తాయి, సాధారణంగా ఎర్రని కాంతిలో వెలిగే సిలువలను చూసి ఆ చర్చిలను గుర్తుపట్టవచ్చు. ఆదివారాలు ఇద్దరిద్దరు లేదా ముగ్గురు ముగ్గురు కలిసి చిన్న గుంపులుగా బైబిళ్ళను చేతపట్టుకొని చర్చికి వెళుతూ కనిపించడం అక్కడ సర్వసాధారణం. 1998లో నిర్వహించబడిన ఒక సర్వే ప్రకారం, కొరియా దేశస్థుల్లో దాదాపు 30 శాతం మంది క్యాథలిక్ చర్చికి లేదా ప్రొటస్టెంట్ చర్చికి చెందినవారు, ఇలా చర్చికి వెళ్ళేవారి సంఖ్య తాము బౌద్ధులమని చెప్పుకునేవారి సంఖ్య కంటే ఎక్కువ.
ఈ రోజుల్లో ఇంత ఎక్కువశాతం ప్రజలు క్రమంగా చర్చికి వెళ్తూ కనిపించడం అసాధారణమైన విషయం. అయినప్పటికీ కొరియాలోనే కాక ఆసియాలోని ఇతర దేశాల్లో, ఆఫ్రికాలో, లాటిన్ అమెరికాలో కూడా చర్చికి వెళ్ళేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఉదాసీనత, మతంపట్ల నిర్లిప్తత ఎంతో ప్రబలంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఇంతమంది ప్రజలు తాము దేవుణ్ణి నమ్ముతున్నామని ఎందుకు చెప్పుకుంటున్నారు? వాళ్ళు చర్చికి వెళ్ళడానికిగల కారణమేమిటి?
కొరియాలో చర్చికి వెళ్ళే ప్రజల్లో సగం కంటే ఎక్కువమంది మనశ్శాంతి కోసం వెదుకుతున్నారు; దాదాపు మూడువంతుల మంది మరణం తర్వాత నిత్యజీవం లభిస్తుందని నిరీక్షిస్తున్నారు; పదిమందిలో ఒకరు ఆరోగ్యం, సంపద, లక్ష్యసిద్ధి కోసం ఆశిస్తున్నారు అని ఒక సర్వే వెల్లడి చేసింది.
కమ్యూనిస్ట్ సిద్ధాంతాల స్థానాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థపై ఆధారపడిన ఆశలు క్రమంగా ఆక్రమించుకోవడంవల్ల ఏర్పడిన ఆధ్యాత్మిక వెలితిని నింపుకోవాలనే ఆశతో చైనాలో చాలామంది చర్చిలకు వెళుతున్నారు. చైనాలో ప్రతి సంవత్సరం కోట్ల సంఖ్యలో బైబిళ్ళు ముద్రించబడి పంచి పెట్టబడుతున్నాయి, ప్రజలు మావో రచించిన లిటిల్ రెడ్ బుక్‌ను చదివినట్లు బైబిలును చదువుతున్నారనిపిస్తుంది.
బ్రెజిల్‌లోని కొంతమంది క్యాథలిక్కులు, ప్రత్యేకించి యౌవనస్థులు, భవిష్యత్ జీవితంలో సంతోషం లభిస్తుందనే వాగ్దానంతో తృప్తిపడటం లేదు, ఆ వాగ్దానం ఇప్పుడే నెరవేరాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ట్యూడూ అనే వార్తా పత్రిక ఇలా వ్యాఖ్యానిస్తోంది:
“1970లలో ప్రజల మనస్సులను హృదయాలను ప్రేరేపించినది విముక్తి సిద్ధాంతమైతే (లిబరేషన్ థియాలజీ) నేడు వారిని ప్రేరేపిస్తున్నది ధనసంపదల సిద్ధాంతం.” బ్రిటన్‌లోని ఒక సర్వే, చర్చికి వెళ్ళేవారిని తమ చర్చిలో తమకు నచ్చిన ఒక విషయమేమిటో చెప్పమని అడిగింది. చాలామంది సహవాసాన్ని ఒక కారణంగా పేర్కొన్నారు.పైన ప్రస్తావించబడిన విషయాలు సూచించేదేమిటంటే, ఎంతోమంది ఇప్పటికీ దేవుణ్ణి నమ్ముతున్నా అధికశాతం మందికి తమ భవిష్యత్తును గురించిన లేదా దేవుని గురించిన చింత కంటే ప్రస్తుత జీవితంలో తమకు ఏమి లభిస్తుందనేదాని గురించిన చింతే ఎక్కువగా ఉంది. దేవుణ్ణి నమ్మడానికి సరైన కారణమేమిటని మీరనుకుంటున్నారు? ఈ విషయంలో బైబిలు ఏమి చెబుతోంది? దీని తర్వాతి ఆర్టికల్‌లో మీకు సమాధానం లభిస్తుంది.