కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

యేసు తాను నేర్పిన మాదిరి ప్రార్థనలో, పరలోకంలో నుండి దుష్ట దేవదూతలు ఇంకా పడద్రోయబడకముందే అక్కడ దేవుని చిత్తం నెరవేరుతోందని సూచించాడా?

మత్తయి 6:9,10 లో వ్రాయబడివున్నట్లుగా, యేసు ఇలా అన్నాడు: “నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” అనేక ఆధునిక అనువాదాలు చూపిస్తున్నట్లుగా మూలపాఠంలోని ఆ విన్నపాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటిగా, దేవుని చిత్తం అప్పటికే పరలోకంలో నెరవేరుతున్నట్లుగా భూమిమీద కూడా నెరవేరాలని విజ్ఞప్తి చేయడం లేదా రెండవదిగా, ఆయన చిత్తం పరలోకంలోనూ భూమిపైనా పూర్తిగా నెరవేరాలని విజ్ఞప్తి చేయడం. * “నీ రాజ్యము వచ్చుగాక” అని యేసు అంతకు కాస్త ముందు పలికిన మాటల అర్థం, ఈ రెండవ తలంపు లేఖనాలకు మరింత అనుగుణంగా ఉందని సూచిస్తోంది. అది యేసు భూమిపై ఉన్నప్పటి పరిస్థితిని, ఆ తర్వాత చాలాకాలంపాటు ఉన్న పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. ఎలా?

దేవుని రాజ్యం పరలోకంలో స్థాపించబడినప్పుడు కలిగే రెండు వేర్వేరు ఫలితాలను ప్రకటన గ్రంథం సూచిస్తోంది. మొదటిది పరలోకాన్ని, రెండవది భూమిని ప్రభావితం చేస్తుంది. ప్రకటన 12:​7-9, 12 ఇలా చెబుతోంది: “అంతట పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి. అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి! భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.”

1914 తర్వాత సాతాను అతని దయ్యాలు పరలోకం నుండి పడద్రోయబడడంతో తిరుగుబాటుదారులైన దూతలందరూ పరలోకంలో నుండి తొలగించబడ్డారు, దానితో యెహోవా యొక్క యథార్థపరులైన దేవదూతలకు ఎంతో ఆనందం కలిగింది, వీరు ఆయన ఆత్మ ప్రాణుల సృష్టిలో అధికశాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. (యోబు 1:6-12; 2:1-7; ప్రకటన 12:​10) కాబట్టి, యేసు మాదిరి ప్రార్థనలోని విజ్ఞప్తి, పరలోకానికి సంబంధించినంత వరకు నెరవేరింది. పరలోకంలో ఉండిపోయిన వారంతా యెహోవాపట్ల యథార్థంగా ఉండి, ఆయన సర్వోన్నతాధిపత్యానికి పూర్తిగా విధేయులయ్యారు.

అంతకంటే ముందే, అంటే దుష్ట దేవదూతలు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉన్న సమయంలో కూడా వారు దేవుని కుటుంబం నుండి బహిష్కరించబడి నిర్దిష్టమైన నిర్బంధాల క్రిందవున్నారని నొక్కిచెప్పాలి. ఉదాహరణకు, సా.శ. మొదటి శతాబ్దానికే వారు “మహాదినమున జరుగు తీర్పువరకు [ఆధ్యాత్మిక] కటికచీకటిలో నిత్యపాశములతో” బంధించబడివున్నారని యూదా 6వ వచనం తెలియజేస్తోంది. అలాగే 2 పేతురు 2:4 ఇలా చెబుతోంది: “దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి [పూర్తిగా అధఃస్థితిలోకి] కటిక [ఆధ్యాత్మిక] చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.” *

పరలోకంలో ఉండగానే బహిష్కరించబడిన స్థితిలో ఉన్నప్పటి దానికి పూర్తి భిన్నంగా, దుష్ట దేవదూతలు భూమి మీద ఎంతగానో అధికారం చెలాయించారు. వాస్తవానికి, దేవుని వాక్యం సాతానును “ఈ లోకాధికారి” అని, దయ్యాలను “ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులు” అని పిలుస్తోంది. (యోహాను 12:31; ఎఫెసీయులు 6:11, 12; 1 యోహాను 5:​19) అపవాది తనకున్న అధికారం మూలంగానే, తనకు ఒక్కసారి నమస్కరిస్తే “లోకరాజ్యములన్నిటిని, వాటి మహిమను” ఇస్తానని యేసుతో చెప్పగలిగాడు. (మత్తయి 4:​8, 9) కాబట్టి దేవుని రాజ్యం ‘వచ్చి’నప్పుడు, భూమికి సంబంధించినంత వరకు అది ఎంతో పెద్ద మార్పులను తీసుకువస్తుంది.

ఇక్కడ భూమిమీద, దేవుని రాజ్యం ‘వచ్చి’నప్పుడు పూర్తి కొత్త విధానం ఏర్పడుతుంది. ఆ రాజ్యం మానవ నిర్మిత పరిపాలనలన్నిటిని పగులగొట్టి, భూమిపై ఏకైక ప్రభుత్వంగా నిలుస్తుంది. అదే సమయంలో, దాని పౌరులైన దైవభయంగల మానవులు “క్రొత్త భూమి”గా రూపొందుతారు. (2 పేతురు 3:13; దానియేలు 2:​44) ఆ రాజ్యం విధేయులైన మానవజాతి నుండి పాపాన్ని నిర్మూలించి, కొంతకాలానికి భూమిని పరదైసుగా మార్చడం ద్వారా సాతాను పరిపాలనకు సంబంధించిన ప్రతి ఛాయను నిర్మూలిస్తుంది.​—⁠రోమీయులు 8:20, 21; ప్రకటన 19:​17-21.

వెయ్యిసంవత్సరాల ముగింపులో, మెస్సీయ రాజ్యం దానిపట్ల దేవునికి గల సంకల్పాన్ని నెరవేర్చినప్పుడు, “దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.” (1 కొరింథీయులు 15:​28) అప్పుడు అంతిమ పరీక్ష ఉంటుంది, దాని తర్వాత సాతాను, అతని దయ్యాలు, మోసగించబడిన తిరుగుబాటుదారులైన మానవులెవరైనా “రెండవ మరణము”లో శాశ్వతంగా నిర్మూలించబడతారు. (ప్రకటన 20:​7-15) ఆ తర్వాత, పరలోకంలోనూ భూమి మీదా ఉన్న తెలివిగల ప్రాణులంతా యెహోవా ప్రేమపూర్వక సర్వోన్నతాధిపత్యానికి నిరంతరం ఆనందంగా విధేయులై ఉంటారు. అన్ని విధాలుగా అది, యేసు మాదిరి ప్రార్థనలోని మాటల పూర్తి నెరవేర్పై ఉంటుంది.​—⁠1 యోహాను 4:⁠8.

[అధస్సూచీలు]

^ పేరా 3 యేసు నేర్పిన మాదిరి ప్రార్థనలోని ఈ భాగాన్ని ద బైబిల్‌​—⁠ఎన్‌ అమెరికన్‌ ట్రాన్స్‌లేషన్‌ ఇలా అనువదించింది: “నీ రాజ్యము వచ్చుగాక! నీ చిత్తం పరలోకంలో, అలాగే భూమిమీద నెరవేరును గాక!”​—⁠మత్తయి 6:​9-10.

^ పేరా 6 అపొస్తలుడైన పేతురు ఆధ్యాత్మికంగా బహిష్కరించబడిన ఈ స్థితిని “చెరలో” ఉండడంతో పోల్చాడు. అయితే అది, దయ్యాలు వెయ్యి సంవత్సరాలపాటు బంధించబడి ఉండే భవిష్యత్‌ “అగాధము” అని ఆయన ఉద్దేశం కాదు.​—⁠1 పేతురు 3:19, 20; లూకా 8:30, 31; ప్రకటన 20:​1-3.